Pages

Wednesday, May 5, 2010

చెరువుగట్టు - ఉయ్యాల స్తంబాలు

***  శ్రీ రామ *** 


చాలా రోజుల తరువాత ఆంటే ఇంచుమించు పుష్కరకాలం తరువాత ఇటీవల మా సొంతూరు వెళ్ళడం జరిగింది. సొంతూరు ఆంటే తాత గారు ఊరు అన్నమాట. నేను అక్కడ పుట్టలేదు, పెరగలేదు కానీ మా ఊరంటే చాలా చాలా ఇష్టం (మీ అందరి లాగే). 

మా వూరు పశ్చిమ గోదావరి జిల్లా లోని ఒక "అందమయిన" చిన్న పల్లెటూరు. నిజంగా అందమయినదే.. పక్క ఫోటో చూడండి :-) . మా తాత ముత్తాతలు అందరూ ఆ ఊళ్లోనే గానీ , మా చదువుల మూలం గా మా  కుటుంబం ఆ ఊరు వదలి బయటకు వచ్చాం.  సాధారణంగా "మీ తాత గారి ఊరంటే ఎందుకు ఇష్టం" అని అడగగానే మనకి ముందు గుర్తొచ్చేది తాతయ్య నానమ్మల ప్రేమే  కదా.. అది మాకు డబుల్ అన్నమాట.. ఎందుకంటే.. మా నాన్నమ్మకి , మా చిన్న నాన్నమ్మ(నానమ్మ చెల్లెలు)కి కలిపి  మా నాన్నగారు ఒక్కరే... ఏక నిరంజన్ :-)  మా చిన్న నాన్నమ్మ వాళ్లకి పిల్లలు లేనందువల్ల మా నాన్న గారు రెండు కుటుంబాలకి ఒకడే కొడుకు... అందువల్ల మాకు ఇద్దరు నానమ్మలు ..ఇద్దరు తాతయ్యలు.. 

చిన్నప్పుడు వేసవి సెలవలకి , అప్పుడప్పుడు సంక్రాంతి సెలవలకి మా వూరు వెళ్ళే వాళ్ళం.. సంక్రాంతి సెలవలకు వెళ్ళినప్పుడు అమ్మ , నాన్నగారు  సెలవలు అన్నిరోజులు మాతో ఉండేవారు... వేసవి సెలవలకయితే మమ్మల్ని (పిల్లల్ని ) దింపేసి వెళ్లి పోయి .. మళ్లీ సెలవలు అయ్యే టైంలో తీసుకెళ్ళడానికి వచ్చేవారు.. అందువల్ల మాకు సంక్రాంతి సెలవల కన్నా వేసవి సెలవలు అంటేనే ఎక్కువ ఇష్టం :-) ఇక మమ్మల్ని ఆపేవారు ఎవరూ వుండరు కదా..
ఇద్దరు నాన్నమ్మల ఇల్లు వేరే వేరే వీదుల్లో ఉండేవి (ఆ ఊరుకున్నవి మూడే వీధులు అనుకోండి:-) ). చిన్న నానమ్మ దగ్గర వుంటే పెద్ద నాన్నమ్మ ఇంటిని " ఆ వీధి" అనే వారు..  పెద్ద నాన్నమ్మ దగ్గర ఉంటె చిన్న నానమ్మ ఇంటిని " ఆ వీధి " అనే వారు.. ఆంటే వాడుకలో "ఆ ఈది లో అన్నం తినని వచ్చావా " ఆంటే " ఆ నానమ్మ దగ్గర తిన్నావా " అని అర్ధం. ఇంతకూ "ఆ వీధి " ఆంటే పెద్ద నానమ్మ ఇల్లా.. చిన్న నానమ్మ ఇల్లా అని నాకు చిన్నపుడు అర్ధం అయ్యేది కాదు.. అది జంబలకిడిపంబ సినిమాలో 'ఇదారాయియే' లాంటిది అని పెద్దయ్యాక అర్ధం అయ్యింది. 

మా వూళ్ళో బస్సు దిగగానే ఉయ్యాల స్తంబాల మీద గోల గోల చేస్తూ రామ చిలుకలు స్వాగతం పలికేవి.. పైన స్తంబాలమీద చిన్న చిన్న ఇల్లుల వున్నాయి కదా.. అవి రామచిలకల కోసం కట్టిన గూళ్ళు .. మొదట్లో అవి తాటి చెట్లతో చేసిన స్తంబాలు (తాటి పట్టీలు).. ఆ తరువాత సిమెంట్  స్తంభాలు వచ్చాయ్.. ఆ రామచిలుకల అల్లరి వింటూ బస్సు దిగి మా ఊళ్ళో కాలు పెట్టగానే "ఆది " లో జూ ఎన్ టి ఆర్ కి పొంగినట్టు నరాలు ఉప్పొంగేవి.. పౌరుషం తో కాదు.. ఆనందం తో :-) . దిగగానే ముందు మా పెద్ద నానమ్మ ఇంటికి వెళ్ళాలి.. అది రూలు .. ఆ తరువాత మా ఇష్టం.. చిన్న నానమ్మ ఇల్లు చెరువు  గట్టు మీద వుండేది అందువల్ల మేము అక్కడే ఎక్కువ గడిపేవాళ్ళం..  

పొద్దున్నే లేచి వేడి వేడి ఇడ్లీ తిని .. ఆటలకు బయలు దేరేవాళ్ళం.. చెరువు లో నీళ్ళు ఉన్నంత కాలం చెరువు గట్టు మీద ఆటలు, వేసవి లో చెరువు ఎండిపోయాక ఆ చెరువులో ఆటలు..  అసలు టైం తెలేసేది కాదు.. ముఖ్యం గా కొబ్బరి ఈనే తో 'తొండలు' పట్టి వాటికి పోటీలు (కోడి పందాలు లాగ ) పెట్టడం అప్పట్లో మా ఫెవోరేట్ ఆట..పక్క పోటో లో చూపించినట్టు పచ్చి కొబ్బరు ఆకునుండి ఈనే తీసి .. ఆ ఈనే లో ఎక్కువ ఫ్లేక్సిబిల్ గా వుండే చివర అలా చుట్టి జారుముడి వేసి ..దాన్ని తొండ తల దాంట్లో వెళ్ళేలా చేసి అప్పుడు ఆ కొబ్బరి ఈనే లాగడమే.. అప్పుడు ఆ ముడి దాని పీకకి బిగుసుకొని అది మన చేతికి చిక్కుతుంది.. అయ్యో పాపం అనుకుంటున్నారా.. చిన్నప్పుడు అలానే ఆడేవాళ్ళం మరి :-(.   


మద్యాహ్నం ముంజికాయలు , మామిడి కాయలు కోసం పొలం మీద పడేవాళ్ళం..  ముంజి కాయలు తిన్నాక వాటితో ముంజికాయబండి చేసుకుని అది తోసుకుంటా ఆడుకునే వాళ్ళం.  ముంజికాయలు లేకపోతె కనీసం కొబ్బరి పుచ్చుల (రాలిపోయిన కొబ్బరి పిందెలు)  తో ఆయినా బండి చెయ్యాల్సిందే.. పొలం లో వున్న చెరువు దగ్గర మా మద్యాహ్నం ఆట. అది మా సొంత చెరువు కాబట్టి ఆ చెరువులో అప్పుడప్పుడు చేపలు పట్టేవాళ్ళం..  నీళ్ళు ఎండిపోతున్న టైం లో  మట్టగిడసల కోసం ఆ బురద లోనే తెగ కేలికేవాళ్ళం. సాయంత్రం ఇంటికి చేరుకొగానే స్నానం.  మేమెంత తాడిలా ఎదిగినా నానమ్మే స్నానం చేయించేది .. లైఫ్బాయ్ తో శుబ్రంగా  తోమేసేది  ..:-)  మాకు లైఫ్బాయ్ కానీ మా చిన్న నానమ్మ మాత్రం లక్స్ వాడేది (ఒకప్పుడు మా వూళ్ళో లక్స్ సబ్బు ఒక్క మా చిన్న నానమ్మ మాత్రమే వాడేదట.. అప్పట్లో ఒకసారి వాళ్ళింట్లో దొంగోడు వచ్చి అన్నీ వదిలేసి లక్స్ సబ్బులు పట్టుకుపోయాడట.. :-) ). అక్కడుంటే సాయింత్రం వెలుగు వుండగానే  డిన్నర్ అయిపోయేది ... 7 అయ్యేసరికి ఆరుబయట పక్కలు.. ఒక్కోసారి ఎప్పుడూ చీకటి పడుతుందా..ఎప్పుడూ మంచాలు వెద్దామా అని ఎదురు చూసే వాళ్ళం.. దానికి కారణం చిన్న నానమ్మ చెప్పే కాశి మజిలి కధలు.. మా నానమ్మకి రెండు మూడు సిగ్నేచర్ కథలు ఉండేవి ..అవే ఒక్కోటి సీరియల్ లా వారం చెప్పేది.. ఒక్కోసారి కధ వింటూనే నిద్రలోకి జారుకునే వాళ్ళం.. పొద్దునే పక్షులు కువకువలతో నిద్ర లేపేవి.. లేచి పందిపుల్ల (అదే వేపుల్ల) నములుతూనే ఆటలు మొదలు పెట్టేవాళ్ళం..  శుక్రవారం వచ్చిందంటే పక్కూరు సంత నుండి మా ఇద్దరు తాతలు తెచ్చే పొట్లాల కోసం ఎదురు చూపులు..  పొట్లం ఆంటే ఎక్కువగా పంచదార కొమ్ములు , వెన్నముద్దలు (స్వీట్) , కారబూంది,  మెత్తని పకోడీ,  లాంటివి తెచ్చేవారు. నాకు ప్రత్యేకంగా "బెల్లం జిలేబి"... ఇంకా స్పెషల్ ఆంటే మామిడి తాండ్ర. అక్కడుండగా ఎక్లాసాయిన మాంచి బూతులు కూడా నేర్చుకునే వాడినని మా అమ్మగారు అంటుంటారు కానీ నాకు పెద్దగా గుర్తులేదు  :-)

వేసవిలోనే ఆ వూరు అమ్మవారి జాతర, హనుమాన్ జయంతి  వచ్చేవి .. చుట్టాలందరూ వచ్చేవారు.. ఇక ఆ మూడురోజులు అసలు ఖాళీ వుండేది కాదు మాకు.. ఇక్కడ హనుమాన్ గుడి గురించి చిన్న స్టొరీ వుంది.. 1950 -60 లో మా వూళ్ళో ఒక వృద్ద వానరం ఉండేదట.. బాగా ముసలిదయిపోయి ఒక రోజు మా చినతాత గారి పొలం గట్టుమీద కాలం చేసిందట. మా చినతాత గారు దాన్ని ఊరంతా ఊరేగించి ఆ తరువాత అంత్యక్రియలు జరిపించారట. తరువాత కొన్నాళ్ళకి ఆంజనేయస్వామి మా చిన తాత కలలో కనిపించి దానికి మనిషి జరిపిన్నట్టే మిగతా శ్రాద్దకర్మలు చేయించమని చెప్పాడట.. అప్పుడు మా చినతాత ఊళ్ళో ఈ విషయం చెబితే ఊళ్ళో అందరూ పెద్ద ఎత్తున చందాలు వేసుకుని ఘనంగా మిగతా కార్యక్రమాలు చేసారట.. ఆ తరువాత కొన్నాళ్ళకి ఆ వానరాన్ని పూడ్చిపెట్టిన స్తలం లోనే ఈ హనుమంతుడి గుడి కట్టారట..  (వానరాన్ని పూడ్చిపెట్టిన స్తలం లోనే హనుమంతుడి విగ్రహం దొరికిందని అందుకే అక్కడ గుడి కట్టారు అని కొందరు అంటారు) . అది చాలా మహిమ గల గుడి అని చాలామంది నమ్మకం .. ఆఫ్కోర్స్ నాక్కూడా ...


ఎక్కువ చిన్న నానమ్మ ఇంటిదగ్గ గడిపినా.. నేను అలిగినప్పుడు మాత్రం పెద్ద నానమ్మ దగ్గరే ఉండేవాడిని.  మా ఇంట్లో మిగతా పిల్లలు ఎవరూ పెద్దగా అలిగే వారు కాదు కానీ నేను కాస్త ఎక్కువే. అయితే ఆ అలకలు కులుకులు అన్నీ ఆ ఊళ్లోనే ..మా అమ్మగారి దగ్గర వున్నప్పుడు అలకలు కుదిరేవి కావు ... మా వూళ్ళో మాత్రం ప్రతి చిన్న విషయానికి కూడా అలిగే వాడినట..అలిగినప్పుడు మా పెద్ద నానమ్మ మంచం కింద దూరి ఎంత బ్రతిమిలాడినా బయటకు వచ్చేవాడిని కాదంట.. అందరూ (తాతలు , నానమ్మలు, మిగతా చుట్టాలు ) బ్రతిమిలాడి విసుగొచ్చి వెళ్లి పోయాక అప్పుడు మా పెద్దనానమ్మ తన బ్రహ్మాస్తం తీసేదట.. అదే నాటు కోడి గుడ్డు (country hen egg ) :-) అది తినిపిస్తానంటే వెంటనే వచ్చే వాడినట..  (పూర్వ జన్మలో ఈ పామునో అయి ఉంటా :-))  * ఈ పేరాకి ఇన్స్పిరేషన్ ఈ పోస్ట్

నాకు కొద్ది కొద్ది గా గుర్తు ఉన్నప్పుడే మా పెద్దనానమ్మ గారు కాలం చేసారు.. ఆ తరువాతనుండి వెళ్ళినప్పుడల్లా పూర్తిగా మా చిన్న నానమ్మ ఇంటి దగ్గరే వుండేవాళ్ళం.. కొన్నాళ్ళకి మేము పెద్దవాళ్ళం అవ్వడం తో వేసవి సెలవలకు వెళ్ళడం తగ్గిపోయింది.. అప్పుడప్పుడు వెళ్లి చూసేవాళ్ళం.. జాతరకి అలా.. మా చిన్న నానమ్మ గారు కూడా కాలం చేసాక కొన్ని సంవత్సరాలు ఆ ఊరు వెళ్ళబుద్ది కాలేదు.. ఆ తరువాత కుదరలేదు.. మొత్తానికి మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అనుకోకుండా వెళ్ళవలసిన అవసరం వచ్చింది.. 


ఈ సారి ఊళ్ళో అడుగుపెట్టాక అప్పట్లోలా నరాలు ఉప్పొంగలేదు.. వెళ్ళే ముందు వరకూ వున్న ఉత్సాహం .. తరువాత లేదు.. ఉయ్యాల స్తంబాలు వున్నాయి కానీ రామ చిలుకలు లేవు.. చెరువుగట్టు వుంది కానీ మా చిన్న నానమ్మ  లేదు.. చిన్నప్పుడు నేను వెళ్ళగానే నా చుట్టూ మూగే నా స్నేహితులు లేరు .. అందరూ వివిధ కారణాల వల్ల పక్కనున్న పట్టణానికి తరలి పోయారు.. ఇల్లు వుంది కానీ ఇంటి ముందు పిచ్చుకలకు కట్టే పాలకంకులు లేవు... పిచ్చుకలు లేవు.. అప్యాయంగా పలకరించే చుట్టాలు లేరు.. ఎవరో కొద్ది మంది తప్ప అందరూ మాలాగే పట్టణానికే వెళ్ళిపోయారు. ఊరు మొత్తం మారిపోయింది.. చాలా మటుకు పాకలు "వై ఎస్ డాబాలు", పెంకుటిల్లులు "సొంత డాబాలు" అయిపోయాయి. రెండు పంటలు పండే పొలాలు నీళ్ళు లేక ఒక పంటే కనా కష్టం గా పండుతున్నాయ్... ఆ ఆంజనేయస్వామి గుడి డెవెలప్మెంట్ లేకుండా అలానే వుంది కానీ ఊళ్లోకి ఫస్ట్ క్లాసు చర్చి మాత్రం వచ్చింది..  వీదుల్లో కూర్చొని ఏదో పని చేసుకుంటూ,  కబుర్లు చెప్పుకుంటూ , వచ్చి వెళ్ళేవారిని పలకరించే ఆడాళ్ళు అందరూ ఇప్పుడు టి వి లో సీరియల్స్ చూస్తూ గడిపేస్తున్నారు..  ఇవే డెవెలప్మెంట్ కి చిహ్నాలు ఏమో .. 


ఇంతకు ముందు నా కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే చిన్నప్పటి కలర్ఫుల్ జ్ఞాపకాలు ఇప్పుడు కొద్దిగా మసకబారాయి. అప్పుడు కనిపించినంత అందంగా  అమాయకంగా మా వూరు ఇప్పుడు కనిపించడం లేదు.. :-(  ఒకవైపు మళ్లీ ఊరు చూసానన్న ఆనందం .. ఇంకోవైపు ఎందుకో కొద్ది డిసప్పాయింట్మెంట్ .. ఈ సంవత్సరం చూసిన మా ఊరు జ్ఞాపకాలు త్వరగా మరచిపోవాలని,  ఆ పొర తొలగి పోయి ఇంతకూ ముందు జ్ఞాపకాలే మిగలాలని కోరుకుంటున్నాను... 


మంచు

19 comments:

నేను said...

అందమైన జ్ఞాపకాలు గుర్తు చేశారు :) మాకు నాన్నమ్మ ఇళ్లంటే అంతా కట్టడే, నుంచోకూడదు, నవ్వకూడదు. మేం చేసిన అల్లరంతా అమ్మమ్మ ఇంట్లోనే, ఉసిరి కాయలు కొట్టడం, కొబ్బరాకుతో బూరలు, బొమ్మలు, అన్నయ్యలు బండి చేస్తే మేము తొయ్యడానికి వీలుగా ఉన Y కర్రని వెతుక్కుని పోటీలు పడేవాళ్ళం. చింత గిజలతో ఆటలు, సాయంత్రం కొంగలని చూస్తూ డాబాపై తిరగడం....ఇప్పుడు అదే వీధిలో చుట్టూ apartments వచేసాయ్, ఏదో అమ్మమ్మ ఇంట్లో ఇంకా వేప చెట్టు పిచుకలు ఉన్నాయ్ అంతే

సిరిసిరిమువ్వ said...

"వీదుల్లో కూర్చొని ఏదో పని చేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ , వచ్చి వెళ్ళేవారిని పలకరించే ఆడాళ్ళు అందరూ ఇప్పుడు టి వి లో సీరియల్స్ చూస్తూ గడిపేస్తున్నారు.. ఇవే డెవెలప్మెంట్ కి చిహ్నాలు ఏమో" ..

"అప్పుడు కనిపించినంత అందంగా అమాయకంగా మా వూరు ఇప్పుడు కనిపించడం లేదు..."

ఒక్కసారి మా ఊరు వెళ్ళొచ్చాను :) ఏ ఊరు చూసినా ఇంతే అన్నమాట..కానీ అది మన ఊరు కదా ఎలా ఉన్నా ఎలా మారినా మనకు గొప్పగానే ఉంటుంది.
http://vareesh.blogspot.com/2008/07/blog-post.html

Rajendra Prasad(రాజు) said...

మాకు పల్లెటూళ్ళలో చుట్టాలు ఎవరూ లేరు,నేను ఇంత వరకు పల్లెకే వెళ్ళలేదు...ఏదో బస్ లో ఊరికి ఊరికి మధ్య వచ్చేవి చూడటమే.. :-( చాలా బాగా రాశారు.నెరేషన్ బాగుంది...:)

Ravi said...

తాటి కాయల బండితో రేసులు కూడా పెట్టుకునే వాళ్ళం మేము.

మాలా కుమార్ said...

మీ వూరు , మీ వూరి కబుర్లు బాగున్నాయండి . మీ తాతగారిల్లైతే అచ్చం మా తాతగారిన్ల్లు లాగానే వుంది .

వాత్సల్య said...

జస్ట్ అలా ఒక లుక్ వేసా మీ టపా మీద.హాయిగా కూర్చుని చదవాలి అనిపించి మొత్తం చదవలేదు. ఇంతకీ మీ ఊరి పేరు?
ఆచంటా,చాగల్లా,గణపవరమా,నిడమర్రా,దువ్వా,పెంటపాడా,కొండ్రుప్రోలా?

ఏదో నాకు తెలిసిన పేర్లు చెప్పేసా,మీ ఊరి పేరు చెప్పండి మరి.

మీ టెంప్లెట్ బాగాలేదనిపించ్బిందండీ నాకు.కాస్త నలుపు ఎక్కువ అవ్వలేదూ?

3g said...

పోస్ట్ చాలా బాగుంది. పైన ఫొటోలో ఉయ్యాల స్థంభాలు ఎక్కడో............................ చూసినట్టుందండి.

భావన said...

ఒక్కసారి మళ్ళీ చిన్నతనానికి వెళ్ళి వచ్చినట్లుంది మీ పోస్ట్ చదివేక. బాగుంది. కొబ్బరి పిందెల తో చేసిన బండి చిన్నది చిన్న పుల్లలే సరి పోతాయి కదా, తాటి ముంజెల బండి అంత గట్టి గా వుండదు కదా. పంది పుల్ల కాదు మాస్టారు పందు పుల్ల అనో, పొదుం పుల్ల అనో అంటారనుకుంటా. తామర కాయలు తెచ్చే వారు కాదా చెరువు నుంచి? మీ వసారా ఇల్లు చూస్తే ఒక సారి వూరెళ్లి వచ్చినట్లు అనిపించింది. :-)

రాధిక said...

:) నా ఇరవయ్యేళ్ళవరకు నేను ఊరిలోనే వున్నాను.అంటే ఎంతదృష్టమో చూసుకోండి నాది..తొండలతో పాటూ పీతలు కూడ పట్టేవాళ్ళం రేసులకి.దీపావళికి మందులు తయారు చేసుకోవడం.గాలిపటాలు తయారు చేసి ఎగరెయ్యడం...... అబ్బో....అన్నీ గుర్తుచేసారు మీ టపాతో.
నా ఆవేదన ఇలా రాసుకున్నాను.

నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది

తన అవసరం లేదనుకుందేమో
రచ్చబండ బీటలేసింది

గుడి మెట్టు,చెరువు గట్టు
నాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయి

జామచెట్టుకేసిన ఊయల
కిర్రు చప్పుళ్ళ ఊసేలేదు

ఇక రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు

ఇపుడా ఊరు
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది

తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు

నేస్తం said...

ఙ్ఞాపకాలేప్పుడూ అందంగానే ఉంటాయి కాని వాటిని మనసుకు హత్తుకునేలా వ్రాయడం కొందరికే కుదురుతుంది :) చాలా బాగా రాసారు ..అన్నట్లు మంచు పల్లకి విడిపోయాయేం :(

Manasa Chamarthi said...

nice one..:)

వేణూశ్రీకాంత్ said...

వావ్ వావ్ వావ్ !!! టపా చాలా బాగుంది :-) మధురమైన ఙ్ఞాపకాలను గుర్తుచేశారు :-) అమ్మమ్మ తాతయ్య ల ఇంటిలో మధురమైన ఙ్ఞాపకాలు లేని వాళ్ళు అతి తక్కువేమో కదా... ఇదివరకూ ఎంతమంది పంచుకున్నా మీరు మరింతగా మనసుకు హత్తుకునేలా రాశారు...

కానీ టపా చివరికి వచ్చే సరికి హృదయం భారమైంది... నిజమే అభివృద్ధి అంటే అదేనేమో... కానీ ఎవరినీ అనడానికి లేదు బ్రతుకుతెరువు వెతుక్కుంటూ దూర దూరాలకు పయనమయ్యే మన అందరికీ అందులో బాగం ఉంది.

నాకు కూడా మీ టపా అంతా చదివే సరికి రాధిక గారి కవితే గుర్తొచ్చింది తను ఇక్కడ కాపీ చేసారు కదా అదే కవిత.

శ్రీవాసుకి said...

మీ జ్ఞాపకాలు బాగున్నాయి. వ్రాసిన తీరు కూడా బాగుంది. అవి చదువుతుంటే ఒకసారి నా బాల్యంలోకి వెళ్ళిపోయాను. మా అమ్మమ్మ ఊర్లో కాలువ ఉంది. అందులో ఈతలు కొట్టేవాళ్ళం. అట్లతద్ది రోజు తెల్లవారుజామున రెండు గంటలకు లేచి ఉదయం దాకా రకరకాల ఆటలాడేవాళ్ళం. ఏమైనా గతించిన ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ రావు. ఇప్పటి పిల్లలకి అంత ఆనందాలు లేవనుకుంటా.

శ్రీవాసుకి

హరే కృష్ణ said...

అద్భుతంగా రాసారు
Excellent

మంచు said...

@ నేను : -))
@ సిరిసిరిమువ్వ : అవును.. " మావూరు" అన్న ఫీలింగే చాలా బావుంటుంది..
@ రాజు గారు : ధన్యవాదాలు. పల్లెటూరు మిస్స్ అవకూడదండి.. ఆ అప్యాయత, స్వచ్చమయిన మనస్సులు, ఆహ్లాదకరమయిన ప్రకృతి, నూరూరించే చిరుతిళ్ళు ... చాల మిస్స్ అయిపొతున్నారు.. ఇప్పటికింకా బాచెలర్ అయితే మీకొ మాంచి పల్లెటూరి సంబందం చూడమనండి.. ఇప్పటికే పెళ్ళి అయిపొతే మీ పిల్లల తరం వరకూ ఆగాలి :-)
@ రవిచంద్ర : అవును మేమూ రేసులు పెట్టుకునే వాళ్ళం.. ఆ రేసులయ్యె సరికి మా బట్టలు ఎర్రగా తయరయ్యెవి .. దుమ్ము తొ ...:-)

మంచు said...

@ మాలా కుమార్ గారు : ధన్యవాదాలు ..
@ రిషి : మా ఊరు మీ లిస్ట్ లొ వున్నటువంటి ఊర్లంత పెద్ద ఊరు కాదు.. ఇంకా చిన్నది.. మీరు చెప్పిన లిస్ట్లొ ఒక పల్లెకి దగ్గర.. నాకు నలుపు నచ్చదు కానీ.. ఈ బ్లొగ్ లొ ఎక్కువ ఫొటొస్ పెడదామని ఈ టెంప్లెట్ పెట్టా.. ఫొటొస్ కి నలుపు బేక్‌గ్రౌండ్ అయితే బావుంటుంది అని
@ 3జి : చూసే వుంటారు.. మా వూళ్ళొనే :-))

మంచు said...

@ భావన గారు : చాల సంతొషం.. వాడుక బాషలొ పంది పుల్ల అనేవాళ్ళం .. అందుకే మార్చలేదు.. కొబ్బరి పుచ్చులతొ చెసినప్పుదు ఇంత్లొ చీపురు ఈనిపుల్లలె వాడెవాళ్ళం.. పొలం వెళ్ళడం కుదరకపొతే ఇంట్లొ ఈ చిన్ని బండి.. రాలిన కొబ్బరి పువ్వు తినడం నాకు ఇస్టం ... తామర పువ్వులు అక్కడకన్న మా అమ్మమ్మ గారి ఊళ్ళొ ఎక్కువ.. ఆ బండి లేకుండా వుంటే వసరా ఇల్లు ఇంకా బావుండేది .. కుదరలేదు..
@ రాధిక గారు : ఒకసరి పీత నన్ను కరిచింది.. అప్పటినుండి అవంటే భయం నాకు .. మీ కవిత మాగా పాపులర్ అనుకుంటా చాలా లేట్ గా చూసా.. చాలా బావుంది

మంచు said...

@ నేస్తం : మీకన్న బాగా రాయలేం కదండి.. :-)) దీనికి ముందు పొస్ట్ చదవండి.. మంచు పల్లకీ ఎందుకు విడిపొయాయొ తెలుస్తుంది :-))
@ మానస : ధన్యవాదాలు
@ వేణు గారు : ఎదొ మీ ఇన్స్పిరెషన్ తొ అలా :-))
@ శ్రీవాసుకి : " ఇప్పటి పిల్లలకి అంత ఆనందాలు లేవనుకుంటా "... వాళ్ళకి ఈ ఆనందాలు తెలీవు కనుక వాళ్ళు పెద్ద పట్టించుకోరు :-)) వాళ్ళ సంతొషాలు రేపు వాళ్ళ తరువాతి తరం కి చెబుతూ ఇలానే అంటారేమొ.. :-)) ..థాంక్స్ అండి..
@ హరే కృష్ణ : ధన్యవాదాలు .. :-))

Krishna K said...

"ఊరు మొత్తం మారిపోయింది.. రెండు పంటలు పండే పొలాలు నీళ్ళు లేక ఒక పంటే కనా కష్టం గా పండుతున్నాయ్... ఆ ఆంజనేయస్వామి గుడి డెవెలప్మెంట్ లేకుండా అలానే వుంది కానీ ఊళ్లోకి ఫస్ట్ క్లాసు చర్చి మాత్రం వచ్చింది.."

ఎంతటి నిజం చెప్పారండి. కోస్తా ప్రాంతంలో చాలా పల్లెటూళ్లలో పరిస్థితి అదే. కోస్తా అంతా అభివృద్ది చెందింది అనేవాళ్లను ఓ సారి తీసుకెళ్లి దీపాలు పెట్టె దిక్కులేక, వట్టి పోయిన ఇళ్లను, కమ్మని పంటలు రెండు పండిన పొలాలు ఒక్క పంటే దిక్కులేక, వేరే ఏ పంటా పండని పరిస్థితులను చూపించాలని నాకు ఓ పెద్ద కోరిక. నా మిత్రుడు ఓ తాలిబాన్, కోస్తా వాళ్లందరూ ఎందుకు హైదరా"బ్యాడ్" చేరుతుంటారు అంటే "ఎరే దిక్కు లేక" అని చెబితే పొరబాటున కూడా నమ్మల, మీ టపాను నా పాయుంట్ కు వత్తాసుగా తనకు చూపాలి, అప్పుడయినా నమ్ముతాడేమో :(