Pages

Wednesday, October 27, 2010

నా అభిమాన శాస్త్రజ్ఞులు -4/4 : War of Currents


***  శ్రీ  రామ *** 



PART -4 




అయితే అప్పటికే టెస్లా చేస్తున్న పరిశొధనలకి ముగ్దుడైన జార్జి వెస్టింగ్‌హవుస్ (George Westinghouse) వెంటనే టెస్లా దగ్గర ఏ.సి. విద్యుత్ కి సంభందించిన కొన్ని పేటెంట్లు కొనుక్కుని,  తన Westinghouse Corporation లో టెస్లాకి ఉద్యోగం ఇచ్చాడు.  ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పుకోవాలి ....
ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం టెస్లా పేటెంట్లు వాడుకుంటున్నందుకు Westinghouse Corporation 60,000 డాలర్లు  ఫిక్సెడ్ డబ్బు మరియు ఆ పేటెంట్లను ఉపయోగించుకుని ఉత్పత్తి చేసిన ప్రతి హార్స్ పవర్ విద్యుత్ కి రెండున్నర డాలర్లు టెస్లా కి చెల్లించాలి. అయితే కొన్నాళ్ళకి వెస్టింగ్‌హవుస్ కంపెనీ ఆర్ధికంగా కస్టాల్లొ పడటంతో , ఆ కంపెనీ ఆడిటర్లు " ఇలా టెస్లాకి హార్స్‌పవర్ కి రెండున్నర డాలర్ల చొప్పున డబ్బు చెల్లిస్తూ పొతే చాలా నష్టం వస్తుంది..కొన్నాళ్ళకి కంపెనీ మూసుకొవడమో లేక టెస్లాకి అమ్మేయడమో చెయ్యాలి అందుచేత వెంటనే ఎంతోకొంత సొమ్ము ముట్టచెప్పి ఆ  హార్స్ పవర్ కి  రెండున్నర డాలర్ల  ఒప్పందం రద్దుచేసుకోమని " జార్జి వెస్టింగ్‌హవుస్ కి సలహా ఇచ్చారట.. అప్పుడు  వెస్టింగ్‌హవుస్ అయిష్టంగానే టెస్లాని పిలిచి విషయం చెప్పి , ఆ రెండున్నర డాలర్ల ఒప్పందం రద్దుచెయ్యడానికి ఎంత కావాలో చెప్పు అని అడుగగా, దానికి టెస్లా "నువ్వు నన్ను కష్టకాలం లో ఆదుకున్నావు, నా ప్రతిభని గుర్తించి నాకు ప్రోత్సాహం అందించావు, ఈరోజు నీ కంపెనీ కష్టకాలంలో వుందంటే నేను చెయ్యగలిగినది చెయ్యకుండా ఉంటానా"   అని ఒక్క డాలరు తీసుకోకుండానే ఆ రెండున్నర డాలర్ల రాయల్టీ పత్రం చించేసాడట .

టెస్లా, ఎడిసన్ మద్య ఉన్న వ్యత్యాసాలలో ఇది ఒకటి .. "ఎడిసన్ అన్ని వ్యాపారపరంగా ఆలోచిస్తే ... టెస్లాకి  డబ్బు కన్నా  పేరు, గుర్తింపు కోసం ఎక్కువ తాపత్రయం పడేవాడట"...



ఎడిసన్ ప్రతిపాదించిన డి.సి. విద్యుత్ అప్పుడప్పుడే ప్రాచుర్యం పొందుతుంది కానీ డి.సి. విద్యుత్ వ్యవస్థలో ట్రాన్స్ఫార్మర్(Transformer) ఉపయోగించి వోల్టజ్ లెవెల్ పెంచడం తగ్గించడం కుదరదు కాబట్టి ఆ డి.సి. విద్యుత్ రవాణా చేసే ప్రక్రియలో చాలా శక్తి కోల్పోవాల్సి వచ్చేది మరియు జనేరేటర్ నుండి దూరం పెరిగే కొద్ది వోల్టేజ్ తగ్గిపోతూ వుండేది. దానివల్ల జనరేటర్ నుండి రెండు మైళ్ళు కన్నా ఎక్కువ దూరం రవాణా చెయ్యడానికి వీలుపడకపోవడంతో ఎడిసన్ ప్రతీ రెండుమైళ్ళకి ఒక్కో డి.సి. విద్యుత్ జెనరేటింగ్ స్టేషన్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు విద్యుత్ సరఫరా చేసేవాడు. టెస్లా రూపొందించిన ఎ.సి. విద్యుత్ వ్యవస్థ లో ట్రాన్స్ఫార్మర్ వాడే వీలు వుండటం వల్ల, సరఫరాలో వోల్టేజ్ తగ్గినా మళ్లీ ఎక్కడికక్కడ వోల్టేజ్ లెవెల్ పెంచుకునే వీలు వుంటుంది. అంతే కాకుండా విద్యుత్ ఎంత ఎక్కువ వోల్టేజ్ తొ సరఫరా చేస్తే అంత తక్కువ విద్యుత్చక్తి రవాణాలో నష్టపోతాం కాబట్టి జెనరేటింగ్ స్టేషన్ దగ్గర విద్యుత్  వోల్టేజ్ లెవెల్ ట్రాన్స్ఫార్మర్ సహాయం తో పెంచి..ఆ ఎక్కువ వోల్టేజ్ లెవెల్ తో విద్యుత్ రవాణా చేసి , మళ్ళీ మనం వాడుకునే చోట మనకి కావాల్సిన లెవెల్ కి అదే ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి తగ్గించుకుని వాడుకోవచ్చు. ఈ ఉపయోగాలతో టెస్లా , వెస్టింగ్‌హవుస్ ఎ.సి. విద్యుత్‌కి ప్రచారం కల్పిస్తుంటే , ఎడిసన్ తన డి.సి. విద్యుత్ లో అలాంటి ఉపయొగాలు లేకపోవడంతో మార్కెట్ కోల్పోతానన్న భయం తో డి.సి. కరెంట్ తో పోలిస్తే  ఎ.సి. కరెంట్  చాలా ప్రమాదకరమయినది అని దుష్ప్రచారం చెయ్యడం మొదలు పెట్టాడు.


ఈ దుష్ప్రచారం లొ భాగం గా ఎ.సి. విద్యుత్ ప్రమాదరకమయినది అని రుజువు చెయ్యడానికి ఎడిసన్ అనుచరులు వీది కుక్కలను, పిల్లులను, వయస్సు మళ్ళిన ఆవులు , గుర్రాలను ఎ.సి. కరెంట్ ఇచ్చి పబ్లిక్ గా చంపడం లాంటి పనులు చెసేవారు. ప్రాణాలు తియ్యడానికి ఉపయొగించాలంటే ఎ.సి. అయినా డి.సి. అయినా పెద్దగా తేడాలేకపొయినా... అప్పట్లొ ప్రజలకి ఈ విద్యుత్చ్చక్తి మీద పెద్దగా అవగాహన లేకపొవడంతొ ఇలాంటి పబ్లిక్ డిమాన్‌స్ట్రేషన్స్ ఎక్కువ ప్రభావం చూపేవి. ఇందులో 'టాప్సి' అనే మరణశిక్ష పడిన ఏనుగుకి పబ్లిక్ గా  ఎ.సి. విద్యుత్ ఇవ్వడం ద్వారా శిక్ష అమలుచేయ్యడం ,  దానిని ఎడిసన్  చిత్రీకరించి దేశవ్యాప్తం గా ప్రచారానికి ఉపయోగించుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదే కాకుండా ఎడిసన్  ఇంకోపక్క ఎ.సి. వాడకాన్ని నిషేదించాల్సినదిగా తనకున్న పలుకుబడితో ప్రబుత్వం మీద ఒత్తిడి తెచ్చేవాడు.


ఎడిసన్ వ్యక్తిగతంగా మరణ శిక్షను వ్యతిరేఖించేవాడు. 1890 లో మొదటి ఎలెక్ట్రిక్ చైర్ (వ్యక్తి శరీరం లోకి కరెంట్ పాస్ చెయ్యడం ద్వారా మరణ శిక్ష అమలుపరచడం) కనిపెట్టినప్పుడు , ఆ ఎలెక్ట్రిక్ చైర్ కనిపెట్టిన హరొల్డ్ బ్రౌన్ కి రహస్యంగా డబ్బులిచ్చి ఆ చైర్ ఎ.సి. కరెంట్  ద్వారా పనిచేసేలా డిజైన్ చేయించాడు. ఈ చైర్ మొదట సారి ఉపయోగించినప్పుడు,  ప్రాణం పూర్తిగా పోవడానికి సరిపడా వోల్టేజ్ ఇవ్వకపోవడం తో ఆ శిక్ష పడ్డ ఖైది అతి దారుణమయిన గాయాలతో బతికాడు. అది కూడా ఎ.సి. కరెంట్ ప్రమాదకరమయినదే అని చెప్పడానికి ఎడిసన్ క్యాంప్ వాడుకున్నారు. అంతే కాకుండా ఈ ఎలెక్ట్రిక్ చైర్ ని ఉదహరిస్తూ  "being electrocuted"  అనే పదాన్ని  "being Westinghoused " అనే వాడుకపదం లా ప్రచారం చేయించాడు. ఎడిసన్ వైపు నుండి ఇలా ఎన్ని దుస్ప్రచారాలు కొనసాగుతున్నా టెస్లా , వెస్టింగ్‌హవుస్ తన పని తను చేసుకుపోసాగారు.



టెస్లా ప్రతిపాదించిన ఎ.సి. కరెంట్ కి  తొలి పెద్ద విజయం నయాగరా పవర్ కంపెనీ రూపం లో దక్కింది. నయగారా జలపాతం నుండి విద్యుత్చక్తి ని ఉత్పత్తి  చెయ్యడానికి "నయాగరా ఫాల్స్ పవర్ కంపనీ(NFPC)" వివిధ పవర్ కంపెనీల  నుండి ప్రపోజల్స్ ని ఆహ్వానించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 19 కంపెనీలనుంది ప్రతిపాదనలు వచ్చినా డి.సి.  విద్యుత్ ని ప్రతిపాదించే ఎడిసన్ యొక్క GE , ఎ.సి. కరెంట్ ప్రతిపాదిస్తున్న టెస్లా యొక్క వెస్టింగ్‌హవుస్ కార్పోరేషన్ ల మధ్యే ప్రధానమయిన పోటీ... మొత్తానికి 1893 లో  NFPC టెస్లా  ప్రతిపాదనలకే  మొగ్గుచూపి  వెస్టింగ్‌హవుస్ కి  ఆ ప్రాజెక్ట్  అప్పగించింది (నయాగరా  ఫాల్స్ కి వెళ్ళిన వారు ఫాల్స్ దగ్గర టెస్లా కాంస్య విగ్రహం చూసేవుంటారు ).

ఆ తరువాతి పెద్ద విజయం The Chicago World's Fair లో దక్కింది. 1893 లో కొలంబస్ అమెరికా కనిపెట్టిన 400 వ సంవత్సర వేడుకలు చికాగో లో 600 ఎకరాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. ఆ వేడుకకి విద్యుత్ సరఫరా చెయ్యడానికి టెండర్లు పేలిస్తే "ఎడిసన్ , జే. పి. మోర్గాన్ (JP Morgan)" ల అద్వర్యం లో GE కంపెనీ  1.8 మిలియన్ డాలర్లకు మొదటి బిడ్ వేసినా....టెస్లా , వెస్టింగ్‌హవుస్ లను ఎదుర్కోవాలనే ఉద్దేశ్యంతో ఆ తరువాత ఆ బిడ్ ను 0.55 మిలియన్ డాలర్లకు తగ్గించింది. అయినా వెస్టింగ్‌హవుస్ కంపెని 0.4 మిలియన్ డాలర్లకే బిడ్ చెయ్యడం తో ఆ ప్రాజెక్ట్  కూడా వెస్టింగ్‌హవుస్ కే దక్కింది. అయితే ఆ ఓటమికి ప్రతీకారంగా వెస్టింగ్‌హవుస్ కంపెనీని ఎలాగయినా దెబ్బ కొట్టాలని GE కంపెనీ ఈ వరల్డ్ ఫెయిర్ కి తమ బల్బులు అమ్మబోవడం లేదని ప్రకటించింది. ఆఖరు నిముషంలో GE ఇలా దెబ్బతీయడంతో , చాలెంజ్ గా తీసుకున్న టెస్లా నేతృత్వం లోని వెస్టింగ్‌హవుస్ ఇంజనీర్లు అప్పటికప్పుడు ఎడిసన్ పేటెంట్ లు అవసరం లేనటువంటి కొత్త బల్బును కనిపెట్టి ఆ ఫెయిర్ లో ఉపయోగించారు. అదే ఫెయిర్ లో టెస్లా మొదటి సారిగా phosphorescent lamps ( అవే ఇప్పటి ట్యూబ్ లైట్ గా  రూపాంతరం చెందాయి ) , మొదటి నియాన్ లాంప్ (ఇప్పుడు షాప్స్ మీద రంగురంగుల తో వివిధ ఆకారాలలో  కనిపించే లైట్లు) ప్రదర్శించాడు. (ఈ బల్బులకి టెస్లా పేటెంట్లు  తీసుకోవడం మర్చిపోయాడట :-) )

అలా ఈ రెండు పెద్ద సంఘటనలతో ఎడిసన్ నేతృత్వం లోని GE కంపెనీ యొక్క డి.సి. విద్యుత్ వ్యవస్థ టెస్లా ఎ.సి.  విద్యుత్  వ్యవస్థ చేతిలో పరాజయం పొందింది. ఆ తరువాత కొన్నాళ్ళకి GE కూడా టెస్లా యొక్క ఎ.సి. మోటార్లు తయారి మొదలు పెట్టింది. ఎడిసన్ మొదట రూపొందించినట్టు ప్రతీ రెండు మైళ్ళకి ఒక చిన్న జేనేరటింగ్ స్టేషన్ కాకుండా , ఒక చోటే పెద్ద మొత్తం లో విద్యుత్ ఉత్పత్తి చేసి దూర ప్రాంతాలకి రవాణా చెయ్యడం మొదలయ్యింది. ఈ రోజు ప్రపంచం మొత్తం ఎ.సి. పవర్ మీదే నడుస్తుంది.  ఎడిసన్ కొన్నాళ్ళ తరువాత ఎ.సి. విద్యుత్ విషయం లో టెస్లా మాట విననందుకు పశ్చాత్తాప పడ్డాడని చెబుతారు.


ఎడిసన్, టెస్లా ఇద్దరూ స్నేహానికి ప్రాణమిచ్చినవారే. ఎడిసన్ కి హెన్రీ ఫోర్డ్ (ఫోర్డ్ కార్ల సంస్థ అధిపతి) , అమెరికన్ ప్రెసిడెంట్ హోవర్ లు మంచి స్నేహితులయితే , టెస్లా కి అమెరికన్ రచయత మార్క్ ట్వైన్ మంచి స్నేహితుడు. టెస్లా తన చివరి రోజులలో స్వామి వివేకానంద బోధనలకి బాగా ఆకర్షితుడై  ఒక్కసారి అయినా వివేకానందను కలిసే ఆవకాశం రావాలని కోరుకున్నాడట ...


ఎడిసన్ మంచి శాస్త్రజ్ఞుడు మరియు వ్యాపార వేత్త. జే పి మోర్గాన్ యొక్క సహకారం తో GE అభివృద్ధి  పరిచి ఈ రోజు ప్రపంచం లో అత్యంత శక్తివంతమయిన సంస్థగా ఎదగడానికి తోడ్పడ్డాడు. ధనవంతుడిగా జీవించాడు, ధనవంతుడిగా మరణించాడు. అతని కీర్తి ప్రతిష్టలు ఎనలేనివి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తం గా (ముఖ్యం గా అమెరికాలో ) ఎడిసన్ ని విద్యుత్ శాస్త్రం కి ఆద్యుడిగా కీర్తిస్తారు , పిల్లలకి బోధిస్తారు. చాలామందికి అసలు టెస్లా గురించి తెలీనే తెలీదు. ఎడిసన్ , ఫోర్డ్, బిల్ గేట్స్ లాంటి వారు మల్టీ టాలెంటెడ్ .. వారికి సైన్సు తో పాటు వాటితో వ్యాపారం ఎలా చెయ్యాలో బాగా తెలుసు.. అందుకే వారు అత్యంత ప్రజాదారణ పొందారు , వ్యాపారపరంగా మంచి విజయాలు సాధించారు. టెస్లా వీరికన్నా జీనియస్ ... కానీ తను రూపొందించిన సైన్సు ని వ్యాపారపరం గా మలచడం లో విఫలమయ్యాడు. అందుకే అన్ని పేటెంట్లు సాధించినా తన జీవితం చరమాంకం లో డబ్బు కి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇన్ని విజయాలు సాధించినా చివరకి ఒక హోటల్ గది లో అనాధగా మరణించాడు.


టెస్లా కనిపెట్టిన వాటిలో ముఖ్యమైనవి ౩-ఫేసు AC విద్యుత్తు, ఇండక్షన్ మోటార్ , ఫ్లోరోసెంట్ బల్బ్ (ట్యూబ్ లైటు) , రేడియో (మొదట్లో ఈ పేటెంట్ మార్కొని పేరు మీద వున్నా ఆ తరువాత కోర్టు టెస్లా కి చెందుతుందని తీర్పు చెప్పింది) , వైర్లెస్ పవర్ రవాణా. 1900వ సంవత్సరం లోనే టెస్లా తన కొలరాడో స్ప్రింగ్స్ ల్యాబ్ దగ్గర వైర్లు లేకుండా  విద్యుత్ రవాణా విజయవంతంగా ప్రదర్శించాడు. అయితే ఆ విదానం తో వినియోగదారులకి బిల్లింగ్ కష్టం అవుతుంది అని  అప్పటి వరకూ అతనికి కూడా ఫండింగ్ అందిస్తున్న జే పి మోర్గాన్ అతనికి  నిధులు ఆపేసాడు . ఆ విధంగా వైర్లేస్స్ విద్యుత్ రవాణా మీద టెస్లా తన పరిశోధనలు ఆపేయాల్సి వచ్చింది. అది జరిగి 110 సంవత్సరాల అయినా  ఇప్పటికీ  ఈ వైర్లేస్స్ విద్యుత్ రవాణా మిస్టరీనే.  అప్పుడు అతనికి నిధులు ఆపేయకుండా వుంటే ఇప్పటికే మనం వైర్లెస్ ద్వారా విద్యుత్ అందుకునే వాళ్ళం అనడం అతిశయోక్తి కాదు.

టెస్లా కి జరిగిన మరో పెద్ద అవమానం నోబెల్ ప్రైజ్. టెస్లాకి ఇస్తే ఎడిసన్ నోచ్చుకుంటాడు ఆన్న ఒకే ఒక కారణం తో టెస్లా కి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదట. ఒక సంవత్సరం లో ఎడిసన్ , టెస్లా ఇద్దరికీ ఇచ్చే ప్రతిపాదన వచ్చినా, అలా కలిపి ఇస్తే తీసుకోవడానికి ఇద్దరికీ ఇష్టం లేకపోవడంతో ఇద్దరికీ ఇవ్వలేదు.  మార్కోనీ కన్నా ముందు రేడియో కనిపెట్టినట్టు రుజువైయినా రేడియో పేటెంట్ టెస్లాకి బదలీ చేసారు కానీ రేడియో కనిపెట్టినందుకు ఇచ్చిన నోబెల్ ప్రైజు మాత్రం మార్కొని దగ్గరే ఉండిపోయింది.  తన జీవిత కాలం లో టెస్లా 300 పేటెంట్లు తీసుకుంటే ఎడిసన్ 1083 పేటెంట్లు తీసుకున్నాడు. టెస్లా కి కూడా ఎడిసన్ కి వచ్చినన్ని నిధులు వచ్చివుంటే, ఎడిసన్ లాంటి బిజినస్ మైండ్ వుండి వుంటే , పేటెంట్ల సంఖ్య లో ఎడిసన్ ని దాటేసేవాడే..


తన జీవితం లో ఆఖరు పది సంవత్సరాలు హోటల్ న్యూ యార్కర్ లోని రూం. 3327 లో గడిపిన టెస్లా 1943 లో గుండెపోటుతో కన్నుమూసాడు. అతను చనిపోయే టైములో టెలిఫోర్స్ అనే అయుదాన్ని డెవెలప్ చేస్తున్నాడు. అది అమెరికన్ మిలటరీ కొనడానికి నిరాకరించినా, అతను చనిపోయాక టెస్లా రిసెర్చ్ పత్రాలు శత్రువుల చేతిలో పడతాయేమో ఆన్న అనుమానం తో అమెరికన్ ప్రబుత్వం అతని ప్రయోగాలకి సంబందించిన అన్ని పత్రాలు స్వాదీనపరచుకొని టాప్ సీక్రెట్ అని ముద్ర వేసింది. ఆ విధం గా టెస్లా తన జీవితం చివరికాలంలో చేసిన అనేక ప్రయోగాల తాలూకు వివరాలు FBI లాకర్లలో మగ్గిపోయి ప్రపంచానికి తెలీకుండా (పనికిరాకుండా) పోయాయి .  

అలాగే అప్పట్లో ఎడిసన్ GE కంపెనీకి గట్టి పోటీ ఇచ్చిన వేస్టింగ్హవుస్ కంపెనీ ఆ తరువాత వాళ్ళ బిజినెస్లు అన్ని అమ్మేసుకుని ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు.

అది నాకిష్టమయిన  ఈ ఇద్దరూ మహా శాస్త్రజ్ఞుల జీవిత చరిత్ర . మనలో చాలా మందికి ఎడిసన్ గురించి తెలుసు... అతని పట్టుదల  గురించి ఎన్నో ఇన్స్పైరింగ్ కథలు విన్నాం. ప్రపంచానికి వెలుగు అందించిన వ్యక్తిగా , విద్యుత్ శాస్త్రానికి ఆద్యుడిగా కొలవబడుతున్న ఎడిసన్ గురించి ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు. అయితే ఏ కారణాల వల్ల అయితే ఏమి అతని కన్నా తెలివయిన టెస్లా కి మాత్రం తగినంత గుర్తింపు రాలేదు. అందువల్ల అతని గురించి నాకు తెలిసినది, నేను విన్నది  మీతో పంచుకునే ప్రయత్నం ఇది.....

(సమాప్తం)

- మంచు







Special thanks to my sister without whom this series would not have been at all possible. 


Disclaimer: All the information provided on this blog is for informational purposes only. Author makes no representations as to accuracy or validity of any information on this blog and will not be liable for any errors in this information. This post is written based on information available on worldwide web for public reading.

Monday, October 25, 2010

నా అభిమాన శాస్త్రజ్ఞులు -3/4

*** శ్రీ  రామ *** 

PART-3

ఎడిసన్:


          అప్పుడు నేర్చుకున్న మోర్స్ కోడ్  ఆ తరువాత ఎడిసన్‌కి  టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా పనిచెయ్యడానికి బాగా ఉపయోగపడింది. అప్పట్లో ఒక ఉద్యోగి అమెరికన్ సివిల్‌వార్‌ లొ పాల్గొనడానికి వెళ్ళడంతో , అతని స్తానంలో పనిచెయ్యడానికి తన పదిహేనో ఏట టెలిగ్రాఫ్ ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ కొన్నాళ్ళు పని చేసాక,  సివిల్ వార్ అయిపోయి ఆ ఉద్యోగస్తుడు తిరిగి రావడటంతో అతను మళ్లీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇల్లువిడిచి వెళ్లి కొన్నాళ్ళు అమెరికా మధ్య రాష్ట్రాల్లో చిన్నచితక ఉద్యోగాలు చేసి 1868 లో తిరిగి తల్లితండ్రులదగ్గరకి వచ్చాడు. పెద్ద చెప్పుకోదగ్గ ఉద్యోగాలు చెయ్యకపోవడం వల్ల చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండానే తిరిగివచ్చిన ఎడిసన్, అతని కుటుంబం పేదరికం వల్ల తన తల్లి మానసికంగా క్రుంగిపోవడం చూసి ఇక ఎలాగయినా సీరియస్‌గా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయం లో అతని స్నేహితుడు బిల్లీ ఆడమ్స్  అమెరికా లో ఈస్ట్ కోస్ట్  కి వచ్చి టెలిగ్రాఫ్ ఆపరేటర్‌గా పెర్మినేంట్ ఉద్యోగం చూసుకోమని ఎడిసన్‌కి సలహా ఇచ్చాడు.  ఇప్పటి "సిలికాన్ వ్యాలీ"లా అప్పట్లో బోస్టన్ నగరం సైన్సు పరిశొధనలకి , ఉన్నత చదువులకి హబ్‌గా పేరుపొందడం వల్ల,  తన స్నేహితుని సలహా మరియూ తను చేసిన చిన్న చిన్న రిపైర్లకి రైల్వే కంపనీ ఇచ్చిన ఉచిత టికెట్ తో బోస్టన్ బయలుదేరాడు.


బోస్టన్లో ప్రఖ్యాతి గాంచిన వెస్ట్రన్ యూనియన్ కంపెనిలో టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా ఉద్యోగంలో చేరాడు. ఒకవైపు ఉద్యోగ భాద్యతలు , ఇంకోవైపు అతని సొంత పరిశోధనలు తో అతని దినచర్య ఊపిరిసలపనంత పని ఒత్తిడితో వుండేది. ఉద్యోగంలో చేరిన ఆరునెలల తరువాత అతను రూపొందించిన "ఎలెక్ట్రిక్ వోటింగ్ మెషిన్" అతనికి మొదటి పేటెంట్ ను సంపాదించి పెట్టింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అలాంటి ఆటోమాటిక్ వోటింగ్ మెషిన్ని వాడటానికి అప్పటి మసాచ్యుసేట్స్ రాష్ట్ర ప్రబుత్వం నిరాకరించింది. మొదటి పేటెంట్ అమ్ముడుపడక పోవడం , తన పరిశోధనలకి బాగా డబ్బు అవసరపడటం తో ఇక నుండి జనాలు కొనడానికి ఇష్టపడని వస్తువులు కనిపెడుతూ తన సమయం వృధా చేసుకోకూడని ఒక గట్టి నిర్ణయానికి వచ్చాడు. అయితే అదే సమయంలో .. తన పరిశోధనలకే ఎక్కువ సమయం కేటాయిస్తూ తన ఉద్యోగబాధ్యతలు మీద అశ్రద్ద చూపుతున్నాడన్న కారణంతో వెస్టర్న్ యూనియన్ కంపెని ఎడిసన్‌ని ఉద్యోగం నుండి తొలగించింది. ఇక చేసేది లేక , తన స్నేహితుడు మరియూ మంచి శాస్త్రవేత్త ఆయిన బెంజిమన్ బ్రేడ్డింగ్ దగ్గర కొంత సొమ్ము అప్పు తీసుకుని న్యూయార్క్ బయలు దేరాడు.

న్యూయార్క్ లోని ఒక బ్రోకరేజ్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అసలు ఆ ఉద్యోగం కూడా చాలా విచిత్రంగా వచ్చింది. ఒకరోజు ఉద్యోగం కోసం రోడ్లమ్మట తిరుగుతుండగా... ఆ బ్రోకరేజ్ కంపెని మేనేజర్ తన కంపెనీలో కరెక్ట్‌గా అవసరమయ్యే సమయానికి "స్టాక్ టిక్కెర్ " యంత్రం పాడయిపోయిందని ఆందోళన చెందుతుండగా , దారిన పోతున్న ఎడిసన్  అది చూసి దాన్ని నిముషాల మీద బాగుచేసాడట... దానికి ముగ్దుడయిన ఆ మేనేజెర్ వెంటనే ఎడిసన్ని చీఫ్ ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగంలోకి తీసుకున్నాడు. ఆ క్షణాలే తన జీవితంలో అత్యంత మధురమయిన క్షణాలని ఎడిసన్ చేబుతువుండేవాడు... అలా ఒకవైపు ఉద్యోగం .. ఇంకోవైపు సమయం చిక్కినప్పుడు తన పరిశోదనల తో  తీరికలేకుండా వున్నాడు.  ఆ తరువాత మూడు సంవత్సరాలు ఎడిసన్ కి బాగా కలసి వచ్చాయి. 1874 లో కొన్ని పేటెంట్స్ హక్కులు అమ్మగా వచ్చిన డబ్బుతో న్యూ జెర్సీ లో ఒక టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ లాబ్ ని నెలకొల్పాడు.


ఎలెక్ట్రిక్ బల్బ్ :
ఎడిసన్ మరియు అలగ్జాండర్ గ్రహంబెల్  ఇద్దరూ సమాంతరంగా టెలిఫోన్ కోసం పరిశోధనలు కొనసాగించినా, ఆఖరికి మొట్టమొదటి ప్రాక్టికల్ టెలిఫోన్ రూపొందించిన ఘనత మరియు పేటెంట్ మాత్రం గ్రాహంబెల్ కి దక్కాయి. ఈ టెలిఫోన్ లో గ్రాహంబెల్ చేతిలో ఓటమికి బాగా నిరాశ చెందిన ఎడిసన్ అంతకన్నా విలువైనది కనిపెట్టాలని నిశ్చయించుకుని, అప్పటికే ఎందరో  ప్రయత్నించి విఫలమయిన లైట్ బల్బ్ ని ఎంచుకున్నాడు. అయితే చాలామంది అనుకుంటున్నట్టు లైట్ బల్బ్  కాన్సెప్ట్‌ని  ఎడిసన్ మొదటిసారి కనిపెట్టలేదు. విద్యుత్ నుండి కాంతి ఉత్పత్తి చేయవచ్చని 1800వ సంవత్సరంలో "Humphry Davy " అనే ఇంగ్లిష్ శాస్త్రవేత్త కనుగొన్నప్పటికీ, ప్రాక్టికల్‌గా ఎక్కువసేపు పనిచేసే బల్బ్‌ని తయారుచెయ్యడానికి ఇంకొక 60 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. 1860 లలో జోసెఫ్ స్వాన్ అనే ఇంగ్లిష్ శాస్త్రవేత్త తయారుచేసిన బల్బ్, అతనికి పేటెంట్ తెచ్చిపెట్టినప్పటికి , అతను డెవెలప్ చేసిన బల్బ్ జీవితకాలం చాలా తక్కువ. 1878 లో ఎడిసన్ మరియూ అతని టీం (అతను ఒంటరిగా ఈ ప్రయోగాలు చెయ్యలేదు) ఎక్కువ కాలం పనిచేసే బల్బ్ (ముఖ్యంగా దానిలోని ఫిలమింట్) కోసం తీవ్రంగా కృషి చేసి మొత్తానికి 1880 చివరలో 1500 గంటలపాటు పనిచేసి బల్బ్‌ని డెవెలప్ చేసారు. అయితే తన పేటెంట్ ని కాపీ కొట్టి , దాని ఇంప్రూవ్ చెయ్యడం వల్లే ఈ బల్బ్ తయారయ్యిందని జోసెఫ్ స్వాన్ కోర్టుకు వెళ్ళడంతో ఆ కేసులో ఓడిన ఎడిసన్ అతన్ని తన బిజినస్ పార్టనర్ గా తీసుకోవాల్సి వచ్చింది. ఎడిసన్ కనిపెట్టిన కాన్సెప్ట్ తీసుకుని దాన్ని డెవెలప్ చేసి గ్రాహంబెల్  టెలిఫోన్ కనిపెడితే.. జోసెఫ్ స్వాన్ బల్బ్ కాన్సెప్ట్ ని బాగా అభివృద్ధి చేసి ఎడిసన్ ఎలెక్ట్రిక్ బల్బ్‌ని కనిపెట్టాడు.

1887 లో  పూర్తిస్తాయి రిసెర్చ్&డెవెలప్మెంట్ లాబ్‌ని న్యూ జెర్సీ లోని వెస్ట్ఆరెంజ్ లో నెలకొల్పడం ద్వారా ఎడిసన్‌కి   ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. 1892వ సంవత్సరంలో ఎడిసన్  యొక్క "ఎడిసన్ ఎలెక్ట్రిక్ కంపెనీ", "థామస్ - హుస్టన్ కంపెనీ"తో పూర్తిగా విలీనమయ్యి "జనరల్ ఎలెక్ట్రిక్ (GE)" కంపెనీగా అవతరించింది. "Dow Jones Industrial Index" 1896 ఒరిజినల్ ఇండెక్స్‌లొ మరియూ ఈనాటి ఇండెక్స్‌లొ లిస్టు అయివున్న ఏకైక కంపెనీ ఇదే...ఇలా ఎడిసన్ పరిశోదనలు, వ్యాపారాలు.. మూడు పేటెంట్లు ఆరు ప్రయోగాలుగా సాగుతుండగా...


టెస్లా:



1891 వ సంవత్సరం బుడాపేస్ట్ నగరం :  
                                   ఆ నగరం లో ఎలెక్ట్రికల్ ఇంజనీరుగా పనిచేస్తున్నటెస్లా తన స్నేహితుడితో కలసి సాయంకాల వ్యాహ్యాళికి సెంట్రల్ పార్క్ కి వచ్చాడు. ఇద్దరూ కలసి కబుర్లు చెప్పుకుంటూ, ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో జరుగుతున్న పరిశోధనల గురించి చర్చించుకుంటూ నడుస్తున్నారు. ఇంతలో ఏదో చెబుతూ నడుస్తున్న టెస్లా అఖస్మాత్తుగా ఆగిపోయాడు. ఏమయిందా కంగారుపడ్డ అతని స్నేహితుడు టెస్లాని పార్క్ బెంచ్ మీద కూర్చోపెడుతుండగా ... టెస్లా పక్కన పడివున్న పుల్ల ఒకటి తీసుకుని ..కింద వున్న ఇసుకలో ఒక బొమ్మ గీస్తూ ...స్నేహితుడికి ఆ గీసిన బొమ్మ వున్న మోడల్ ఏలా పనిచేస్తుందో వివరించాడు. అదే బొమ్మ ఆరేళ్ళ తరువాత అమెరికన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ సమావేశంలో టెస్లా చూపించిన విప్లవాత్మక ఇండక్షన్ మోటార్ (induction motor) యొక్క డిజైన్. 


1882 లో బుడాపెస్ట్ నుండి ప్యారిస్ కి చేరిన టెస్లా అక్కడ ఎడిసన్ యొక్క యూరోప్ బ్రాంచ్ "Continental Edison Company " లో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ అతని పని ఏమిటంటే ... ఎడిసన్ యొక్క ఐడియాలు తీసుకుని, అతను అమెరికాలో రూపొందించిన విద్యుత్ ఉపకరణాలు యూరోప్ విపణికి అనుగుణంగా మార్చడం. అక్కడ పనిచేసే సమయంలోనే తన ఇండక్షన్ మోటార్‌ని బౌతికంగా నిర్మించి విజయవంతంగా పరీక్షించి చూసాడు. అయితే తను రూపొందించిన ఈ ఉపకరణం గురించి యూరొప్‌లొ ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో అమెరికాకి వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. జేబులో కొన్ని చిల్లర నాణాలు మరియు అతని యజమాని ఇచ్చిన సిఫార్సు పత్రం తో 1884వ సంవత్సరంలో అమెరికాలో అడుగుపెట్టాడు. అతని యజమాని మరియు ఎడిసన్ యొక్క యూరోప్ వ్యాపార భాగస్వామి ఆయిన చార్లెస్ బాచిలర్,  టెస్లాని ఉద్యోగం లోకి తీసుకోమని ఎడిసన్ కి సిఫార్స్ చేస్తూ ఇలా రాసాడు ...

 "I know two great men and you are one of them; the other is this young man"

ఎడిసన్ వెంటనే టెస్లాని తన "Edison Machine Works " శాఖలో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా ఉద్యోగం లోకి తీసుకున్నాడు. అలా ఒక సాధారణ ఇంజనీర్‌గా ఎడిసన్ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించిన టెస్లా ఆనతి కాలం లోనే ఆ కంపెనీలో ఎప్పటినుండో వున్న కొన్ని సంక్లిస్టమయిన డిజైన్ సమస్యలను కూడా పరిష్కరించాడు.

అలా ఎక్కడో అమెరికాలోని మిడ్ వెస్ట్ లో పుట్టిన ఎడిసన్ మరియు యూరొప్ లొని మారుమూల గ్రామం లొ పుట్టిన టెస్లా న్యూయార్క్ లో కలసి పని చెయ్యడం మొదలు పెట్టారు. 

AC vs DC : Struggle starts . . .

అలా కలసి పనిచేస్తున్న వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు రావడానికి మొదటి కారణం...  ఎడిసన్ తన వినియోగదారులకి సరఫరా  చేస్తున్న డి.సి. (Direct Current) విద్యుత్ వ్యవస్థ కన్నా తను అభివృద్ధి పరిచిన ఎ.సి. (Alternating Current) విద్యుత్ వ్యవస్థ మెరుగైనది అని టెస్లా వాదించడం. ఎడిసన్ దగ్గర ఉద్యోగంలో చేరిన కొత్తలో ఒకసారి టెస్లా ఎ.సి. విద్యుత్ పని చేసే విధానం, దాని యొక్క అదనపు ప్రయోజనాలు గురించి ఏకదాటిగా వివరించాక, ఎడిసన్ "ఇదంతా వినడానికి బాగానే వుంటుంది కానీ ఆచరణయోగ్యం కాదు" అని తీసిపారేసాడట. 
ఎడిసన్‌ ఎ.సి. విద్యుత్‌ని వ్యతిరేకించడానికి ముఖ్యకారణాలు చెప్పుకోవాలంటే ...
  • తను ఎంతో కస్టపడి సంపాదించిన డి.సి. విద్యుత్‌కి సంబందించిన పేటెంట్లు ఇక పనిరాకుండా పోయే ఆవకాశం వుండటం వల్ల...
  • అప్పటికే డి.సి. విద్యుత్ సరఫరాకి సంభందించి తను సమకూర్చుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృదా అవుతుంది అని..
  • అప్పటికే టెస్లా ఎ.సి. విద్యుత్ వ్యవస్థ రంగంలో పరిశోధనలు చేసి పేటెంట్లు కలిగివున్నాడు కాబట్టి ఎ.సి. విద్యుత్ వాడాలంటే  అతనికి రాయల్టీ చెల్లించాల్సివస్తుంది అని.. 
  • అన్నిటికన్నా ముఖ్యమయినది.... డి.సి. విద్యుత్‌తొ  పోలిస్తే  ఎ.సి. విద్యుత్‌ని అర్ధం చేసుకోవడానికి మరియు విశ్లేషించడానికి చాలా గణిత పరిజ్ఞానం కావాలి. ఉదాహరణకి ఈ కింద ఫోటోలు చూద్దాం. 
 
DC Equations AC Equations 1 AC Equations 2

మొదటి ఫోటోలో డి.సి. విద్యుత్‌కి సంబందించిన నాలుగు ప్రాధమిక విద్యుత్  సమీకరణాలు వున్నాయి (కూడికలు, గుణింతాలు లాంటివి). అవే నాలుగు ప్రాధమిక విద్యుత్  సమీకరణాలు ఎ.సి. విద్యుత్ వ్యవస్థలో ఎలా ఉంటాయో రెండు మరియు మూడవ ఫోటోలలో చూడండి. ఈ సమీకరణాలను బట్టి  డి.సి. తో పోల్చిచూస్తే ఎ.సి. ని విశ్లేషించడానికి ఎంత గణిత పరిజ్ఞానం కావాలో మనకో  ఐడియా వచ్చింది కదా. అలాగే  ఈ ప్రాధమిక సమీకరణాలే ఇలా ఉంటే ఇక అడ్వాన్స్డ్ సమీకరణాలు ఇంకెంత పెద్దగా, క్లిష్టంగా ఉంటాయో కూడా అంచనా వేయొచ్చు. అసలే గణితంలో తక్కువ పరిజ్ఞానం వున్న ఎడిసన్‌ సహజంగానే ఈ పెద్ద పెద్ద సమీకరణాలు చూసి ఎ.సి. విద్యుత్ మీద పరిశోధన చెయ్యడానికి అంత ఇష్టపడలేదు మరియు టెస్లా ఎన్నోసార్లు ఎ.సి. విద్యుత్  గురించి  చెప్పాలని ప్రయత్నించినా ఎడిసన్ పట్టించుకోలేదు. 

అయితే వారిద్దరూ విడిపోవడానికి ఇంకో బలమయిన కారణం వుంది...ఒకసారి ఎడిసన్ తన డైనమో (డి.సి. జనరేటర్)  డిజైన్ని మెరుగుపరిస్తే 50000 డాలర్లు బహుమతి ఇస్తానని టెస్లా కి ఒక ఆఫర్ ఇచ్చాడు. అప్పటి టెస్లా జీతం ప్రకారం లెక్క కడితే  ఆ మొత్తం టెస్లాకి 53 సంవత్సరాల జీతంతో సమానం. ఒక సంవత్సర కాలం పాటు కస్టపడి ఆ డిజైన్ని ఎడిసన్ చెప్పినదానికన్నా ఎక్కువ అభివృద్ధి పరిచినా, టెస్లాకి ఇస్తానన్నబహుమతి డబ్బుఇవ్వలేదు... కొన్నాళ్ళు ఎదురు చూసాక , ఇక లాభం లేదని ఒకరోజు వెళ్లి తనకిస్తానన్న డబ్బు గురించి అడిగాడట... అప్పుడు ఎడిసన్
"టెస్లా ... నీకు అమెరికన్ హాస్యం అర్ధం కాదనుకుంటా.. డబ్బులిస్తాని సరదాగా ఆంటే అదే నిజం అనుకున్నావా" అని జోకులేసి పంపెసాడట... అలా మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన ఎడిసన్ మీద టెస్లాకి కోపం వచ్చి , ఎడిసన్ దగ్గర ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేసెసాడు...

అలా ఎడిసన్ నుండి విడిపోయి బయటకు వచ్చిన టెస్లా తరువాత ఏమి చేసాడు... ఎడిసన్ -టెస్లా మద్య జరిగిన కరెంటు యుద్దాలు... వాటిలో చివరకి  ఎవరు విజయం సాధించారు ......అన్నీ ఆఖరుబాగం లో ....
                                                                                                                                  (సశేషం)



- మంచు 


Thursday, October 21, 2010

నా అభిమాన శాస్త్రజ్ఞులు - 2/4


 *** శ్రీ  రామ ***

చాన్నాళ్ళకి మళ్ళీ ....  పార్ట్ -1కి పార్ట్-2 కి చాలా గ్యాప్ వచ్చింది. సారీ.. వీలుంటే పార్ట్-1 ఒకసారి చదువుతే కంటిన్యుషన్ బావుంటుంది :-))


PART-2

టెస్లా, ఎడిసన్.... ఈ మహాశాస్త్రజ్ఞులు ఇద్దరూ పరిశోధనలు చేసింది ఇంచుమించు ఒకే రంగం లో అయినా, వారు అవలంబించిన మార్గాలలో మాత్రం ఇద్దరికీ చాలా  వ్యత్యాసం వుంది.  టెస్లా ఏ సమస్యకయినా మొదట గణితసంబంధమయిన విశ్లేషణలు చెయ్యడానికే ఎక్కువ మొగ్గు చూపితే , ఎడిసన్ మాత్రం తను చేసిన ప్రయోగాల తాలూకు పరీక్షాఫలితాలమీదే ఎక్కువ ఆధారపడేవాడు. పరిశోధనా పద్దతులగురించి వారి అభిప్రాయాలు వాళ్ళ మాటల్లోనే ....

ఎడిసన్ తరచూ చెప్పేది  "I accept almost nothing dealing with electricity without thoroughly testing it first "

టెస్లా అభిప్రాయం ...." I do not rush into actual work. When I get an idea, I start at once building it up in my imagination. I change the construction, make improvements and operate the device in my mind. It is absolutely immaterial to me whether I run my turbine in thought or test it in my shop. The carrying out into practice of a crude idea as is nothing but a waste of energy, money, and time."


అసలు వారిద్దరూ ఆయా మార్గాలు ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకునేందుకు వాళ్ళ కుటుంబనేపధ్యం , బాల్యం ఒకసారి పరిశీలిద్దాం. 

పార్ట్ -1: బాల్యం

ఎడిసన్ 

1847 ఫిబ్రవరి 11న , అమెరికా లోని ఒహాయో  రాష్ట్రం లో వున్న మిలన్ అనే గ్రామంలో 'శామ్యూల్ ఒగ్డెన్ ఎడిసన్' మరియూ 'నాన్సీ మేథ్యుస్ ఇలియట్' అనే మధ్యతరగతి దంపతులకు ఏడవ సంతానంగా జన్మించాడు 'థామస్ ఆల్వా ఎడిసన్'. 1854లో అతని కుటుంబం మిలన్ నుండి మిషిగన్ లోని  పోర్ట్ హ్యురోన్ అనే పట్టణానికి మకాం మార్చారు.  అతనికి ఏడేళ్ళ వయసొచ్చేసరికి స్కూల్లో చేరాడు. తోటి పిల్లలతో పోల్చి చూస్తే అతని నుదురు అసాధారణంమైన వెడల్పుతో  ఉన్నట్టే  లోపలున్న బుర్ర కూడా చాలా పెద్దదే. బళ్ళో చేరిన మూడు నెలల్లోనే ఈ బుల్లి ఎడిసన్ సందేహాలకి, నిరంతరంగా అడిగే ప్రశ్నలకి విసుగొచ్చిన వాళ్ళ టీచర్ ఎడిసన్ ని  "తలతిక్క పిల్లోడు" అని పిలవడం మొదలు పెట్టింది. స్కూల్లో ఎడిసన్ ప్రవర్తన , అతని టీచర్ సహనం కోల్పోయి ఎదోవోకటి అనడం చూసి ఇక ఈ చదువు సాగేట్టులేదని తల్లి నాన్సీ ఎడిసన్ ని స్కూల్ మాన్పించేయ్యాల్సి వచ్చింది. అయితే ఏ విషయాన్నయినా ఎడిసన్ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించే తెలివితేటలు, ప్రశ్నించే తీరు చూసి తన కొడుకు మంచిమేధావి అవుతాడనే బాగా నమ్మకం ఉండేదట ఆ తల్లికి . ఎడిసన్ స్కూల్ చదువు అధికారికంగా అక్కడితో ఆగిపోవడంతో నాన్సీ చదువుచెప్పే బాధ్యత తీసుకుని కొడుకుకి ఇంట్లోనే చదువు చెప్పడం ఆరంభించిది . ఎడిసన్ పెద్దయ్యాక ఒక సందర్భం లో తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పాడట...

"My mother was the making of me.  She was so true, so sure of me; and I felt I had something to live for, someone I must not disappoint ."

చిన్నప్పుడు అతనికి ప్రపంచచరిత్ర , ఇంగ్లిష్ సాహిత్యం సబ్జేక్ట్లంటే మక్కువ. ఒకానొక సమయంలో షేక్స్పియర్ నాటకాలు/రూపకాలుచే విశేషంగా ఆకర్షింపబడి నటుడవ్వాలని నిశ్చయించుకున్నాడట. కానీ అతనికి జనాలముందు మాట్లాడటానికి చాలా మొహమాటం అవడం వల్ల నటుడవ్వాలన్న కోరిక అక్కడే ఆగిపోయింది. అతనికి పదకొండు సంవత్సరాలు వయస్సు వచ్చేసరికి అతనిలోని జ్ఞానపిపాసని సంతృప్తి పరచడానికి అతని తల్లితండ్రులు స్థానిక గ్రంధాలయంలో వున్న వనరుల్ని ఏలా ఉపయోగించుకోవాలో ఎడిసన్ కి నేర్పించారు. అంతే గ్రంధాలయం లో కనిపించిన ప్రతిపుస్తకం చదవడం మొదలు పెట్టాడుట .. అందులో ఎక్కువగా సైన్సు పుస్తకాలు. అతను ఎక్కువ చదివే కొద్ది అతని సందేహాలు తీర్చడం అతని  తల్లితండ్రులకి మరింత కష్టంగా మారింది. ఆ  సైన్సు పుస్తకాలలో వున్న క్లిష్టమయిన బాష, గణితసమీకరణాలు అర్ధం కాక....ఎందుకిలా  సామాన్యమానవుడికి అర్ధంకాని బాషలో ఈ పుస్తకాలు రాసారని ఎడిసన్ ఎప్పుడూ అనుకునేవాడట.. క్రమంగా అతనికి ఈ క్లిష్టమయిన సాంకేతిక బాష అన్నా, సమీకరణాలు అన్నా అయిష్టం కలగసాగింది. అలా అని కాన్సెప్ట్ ని వదిలెయ్యలేదు. అవే విషయాలు తనదైన శైలిలో  విశ్లేషించుకుంటూ , అర్ధం చేసుకోవడానికి రకరకాల సొంత ప్రయోగాలు చెయ్యడం మొదలు పెట్టాడు. అతను అనాలసిస్ కన్నా ప్రయోగాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అప్పటినుండి మొదలయ్యింది. ఎడిసన్ కి వున్న ఇంకో సమస్య  ఏమిటంటే ..అతని వినికిడి సమస్య. ఈ వినికిడి సమస్య , మూడునెలల అతి తక్కువ స్కూలింగ్ అతనికి పై చదువులు చదవడానికి అడ్డంకిగా మారినా, ఎడిసన్ మాత్రం సొంతంగా చదవడం కొనసాగించాడు. ఎవరూ వివరంగా చెప్పేవారు లేకపోవడం తో అన్ని తనకు తానుగా నేర్చుకుంటూ, అర్ధం చేసుకోవడానికి అవసరమయిన ప్రయోగాలు చేస్తూ వుండటం వల్ల క్రమంగా అతనికి ఎంతో ఓర్పు సహనం, శ్రమించేతత్త్వం బాగా అలవాటు అయ్యింది.  అతని ఏకాగ్రత, తెలివితేటలు, ఆలోచించే విధానంలో వైవిధ్యత , నైపుణ్యం , అద్భుతమయిన జ్ఞాపకశక్తి, అంతులేని సహనం ఇవన్నీ అతను ఒక  గొప్ప సైంటిస్ట్ గా రూపొందడం లో తోడ్పడ్డాయి. 

అతనికి పన్నెండు సంవత్సరాల వయస్సు వచ్చేసరికే కుటుంబాన్ని పోషించడానికి ట్రైన్ లో న్యూస్ పేపర్లు, తినుబండారాలు అమ్ముతూ సంపాదించడం మొదలుపెట్టాడు. అతనికి పద్నాలుగో ఏడు వచ్చేసరికి ౩౦౦ మంది సర్క్యులేషన్ గల ఒక చిన్న పత్రికను ప్రచురించే స్థాయికి చేరుకున్నాడు.  అతని పత్రిక వల్ల కొంత ఆదాయం మిగులుతుండడంతో ఎడిసన్ మనసు మళ్లీ సైన్సు మీదకి మళ్ళింది... ఆ మిగులు ఆదాయంతో కొన్ని పరికరాలు కొని ఒక చిన్న రసాయన ప్రయోగశాల ఆరంభించాడు. మొదట్లో ఈ ప్రయోగశాల ఇంట్లోనే మొదలు పెట్టినా తరువాత తను పేపర్లు అమ్మే రైలు లో తనకున్న చిన్న లాకర్ రూం కి మార్చాడు. అయితే కొన్నాళ్ళకి ఆ రైలు లో అగ్ని ప్రమాదం జరగడం తో , ఈ రసాయనాల వల్లే ఆ అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానించిన ఆ ట్రైన్ కండక్టర్ ఎడిసన్ ని చాచి పెట్టి గూబ మీద కొట్టాడుట. అంతకు ముందు తనకు చెవిటితనం లేదని .. అప్పుడు కండక్టర్ కొట్టడం ... తక్కువ ఎత్తులోఉండే ప్లాట్ఫాం నుండి ట్రైన్ లోకి చెవులు పట్టుకు లాగడం వల్లే తనకి వినికిడి సమస్య వచ్చింది అని ఆ తరువాత ఎడిసన్ ఒక సమయం లో చెప్పారట.  తనకు వినికిడి శక్తి కోల్పోయినందుకు ఎడిసన్ ఎప్పుడూ అంత ఫీల్ అవ్వలేదు కానీ ఒకానొక సమయం లో పక్షుల పాటలు వినడం మిస్ అవుతున్నా అనుకునేవారట. (పక్షులంటే ఎడిసన్ కి చాలా ఇష్టం) .  మొత్తం మీద ఆ అగ్నిప్రమాదం వల్ల ఎడిసన్ ని మళ్లీ ట్రైన్ ఎక్కనివ్వలేదట ... 


అలా వుండగా ఒక రోజు... ఆ  స్టేషన్ మాస్టర్ కొడుకు ఎదురుగా వస్తున్న రైలుని గమనించకుండా రైలుపట్టాలమీద ఆడుకుంటూ ఉండగా ఎడిసన్ చూసి వెంటనే హీరోలా రంగం లోకి దిగి ఆ కుర్రాడిని కాపాడాడు. దానికి ఎంతో సంతోషపడిన ఆ స్టేషన్ మాస్టారు ... తన కొడుకుని కాపాడినందుకు బహుమతిగా ఏమి కావాలో కోరుకోమంటే , అప్పుడు ఎడిసన్ అప్పట్లో  రైల్వే కమ్యూనికేషన్ లో వాడే "మోర్స్ కోడ్ "ని నేర్పమని అడిగాడట.  అతని కోరికను మన్నించి ఆ స్టేషన్ మాస్టారు పద్నాలుగేళ్ళ ఎడిసన్ కి ఆ "మోర్స్ కోడ్" నేర్పడమే అతని జీవితం లో పెద్ద మలుపు.

టెస్లా 

1856, జూలై 10న, ఇప్పటి క్రొయేషియా లోని Smiljan అనే గ్రామం లో సెర్బియన్ మతగురువు ఆయిన Milutin Tesla మరియు Djuka Mandic దంపతులకు  నాలుగవ సంతానంగా జన్మించాడు టెస్లా. టెస్లా కి ముగ్గురు అక్క చెల్లెళ్ళు , ఒక ఆన్న ... కానీ  టెస్లా చిన్నతనంలోనే అతని  ఆన్న ఒక ప్రమాదంలో మరణించాడు (తన అన్న కూడా తనలాగే చాలా తెలివైనవాడు అని టెస్లా చెప్పేవాడట.. అదే నిజమయితే మనం ఒక గొప్ప శాస్త్రజ్నుడిని కోల్పోయినట్టే) .   ఎడిసన్ లానే టెస్లా మీద తన తల్లి ప్రభావం చాలా ఎక్కువ. అతని తల్లి కూడా ఒక చిన్నపాటి  శాస్త్రవేత్తే. ఆవిడ గృహ, వ్యవసాయ సంబంధమయిన అవసరాలకి  కావలసిన కొత్త కొత్త పనిముట్లు కనిపెట్టేదట . ఆవిడ టెస్లా యొక్క అసాధారణ తెలివితేటలు గ్రహించి , అతన్ని శాస్త్రవేత్తగా తీర్చిదిద్దడానికి చిన్నప్పటినుండే శిక్షణ ఇవ్వడం ప్రారంభించినది. ఆ శిక్షణలో ఎక్కువగా లెక్కలను , పజిల్స్ లను మనస్సులోనే సాధించి సమాధానం చెప్పడం, పెద్ద పెద్ద వ్యాక్యాలను గుర్తువుంచుకొని మళ్లీ అప్పచెప్పడం, ఎదుటివాళ్ళ ఆలోచనలను గెస్ చెయ్యడం లాంటివి ఉండేవి. అలాంటి మహాతల్లి శిక్షణ లో రాటుదేలినందువల్లే , తన కెరీర్ లో ఎన్నో క్లిష్టమయిన సాంకేతిక సమస్యలను తన ఊహలలోనే సాధించగలిగే సామర్ధ్యం తనకు వచ్చిందని టెస్లా బలంగా నమ్మేవాడు. దానికి తోడూ అతనిది అద్భుతమయిన జ్ఞాపకశక్తి. అయితే అతనికి చిన్నప్పుడు కళ్ళుమూసుకుంటే ఎక్కువ కాంతి మెరుపులు (ఫ్లాష్ ) తో కూడిన కొన్ని వస్తువుల ఆకారాలు కనిపించి నిద్రలేకుండా చేసేవట. వాటిని తప్పించుకోవడానికి అతను తనకు తెలిసిన, చూసిన వస్తువులు ఊహించుకోవడం మొదలుపెట్టగానే ఆ కాంతి.. మెరుపులు మాయం అయ్యేవి. ప్రతిరోజూ రాత్రి ఈ మెరుపులు తప్పించుకోవడానికి, తనకు తెలిసిన విషయాలు , వస్తువులు ఊహించుకుంటూ, వాటిగురించి ఆలోచిస్తూ గడపడం కూడా అతని విశేషమయిన ఊహా శక్తి కి కారణమయింది. 

టెస్లా ఇష్టాఇష్టాలు కొంచం బిన్నంగా ఉండేవి. ఎడిసన్ కి పక్షులంటే ఇష్టం వున్నట్టు టెస్లా కి మౌంటైన్స్, అక్కడ వీచే స్వచ్చమయిన గాలి ఆంటే ఇష్టం. ( కొలరాడో స్ప్రింగ్స్ లో తన ల్యాబ్ పెట్టుకోవడానికి అది కూడా ఒక కారణం అయ్యి వుండొచ్చు). ముత్యాల ఆభరణాలు చూసినా,  ఆడవాళ్ళ చెవిరింగులు చూసినా విపరీతమయిన అయిష్టం. పీచ్ పండుని చూస్తే అలర్జీ. ఎవరిదయినా జుట్టు ముట్టుకోవాలంటే అసలు ఇష్టం వుండేది కాదు. అలాగే ఒకానొక టైం లో విపరీతంగా సిగేరెట్లు తాగడం వల్ల  అతని ఆరోగ్యం దెబ్బతినడం తో ఇక మళ్లీ ఎప్పుడూ సిగరెట్ తాగకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు .దానితోపాటు కాఫీ , టీ లాంటివి కూడా మానేసి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్దగా ఉండేవాడు.  ఇలాంటి చెడు అలవాట్లు (??) మానేసినందు వల్లే వృద్దాప్యం లో కూడా తన బ్రెయిన్ చాలా చురుకుగా పనిచేసేదని చెప్పేవాడట. ముందు టపాలో చెప్పినట్టు అతను 30 సంవత్సరాలు పాటు అతని బరువు ఖచ్చితంగా 69 కేజీలు వుండేలా మైంటైన్ చేసాడట.  (ఒకసారి టెస్లా, ఎడిసన్,  మిగతా ఫ్రెండ్స్ తో వుండగా... బరువు విషయమై ఏదో డిస్కషన్ వచ్చి , ఎడిసన్ టెస్లా బరువు 69 కేజీలు ఉండొచ్చని ఊహించి చెప్పాడట... ఎడిసన్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడో టెస్లా కి చాలా ఆశ్చర్యం వేసిందట).

1862 టెస్లా కుటుంబం గాస్పిక్ కి మకాం మారాక అక్కడే హైస్కూల్ చదువు ముగించాడు. ఆ తరువాత 1875 లో Graz లోని ఎలెక్త్రికల్ ఇంజినీరింగ్ చదివాడు. ఆ తరువాత 1878 లో తన కుటుంబాన్ని వదిలేసి చిన్న చితక ఉద్యోగాలు చేసి 1880 నాటికి బుడాపెస్ట్ చేరుకొని అక్కడి నేషనల్ టెలిగ్రాఫ్ కంపెనీలో ఎలెక్త్రికల్ ఇంజినీర్ గా చేరాడు.
.............
అలా అందరిలా పాఠశాలకెళ్ళి చదువు కోలేకపోయినా, వినికిడి శక్తి కోల్పోవడం వల్ల ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నా, తను చదివే సైన్సు విషయాలు అర్ధం అయ్యేలా చెప్పేవారు ఎవరూ లేకపోయినా.... కన్నతల్లి ప్రోత్సాహం, అంతులేని జ్ఞాన పిపాస, ఎంతో ఓర్పు సహనం వల్ల ఎడిసన్ మహా శాస్త్రజ్ఞుడి గా ఎదిగితే ...

దేవుడిచ్చిన అపారమయిన జ్ఞాపకశక్తి మరియు తెలివితేటలకు ... అమ్మ ఇచ్చిన కఠొరశిక్షణ కూడా తోడవడం తో టెస్లా మహామేధావి గా రూపుదిద్దుకున్నాడు ...

ఇక వాళ్ల ఉద్యోగాలు తరువాతి టపాలోను  , దాంట్లో ఇద్దరి మధ్య గొడవలు, కరెంటు యుద్దాలు గురించి ఆ పై టపాలో  .....

-మంచు