Pages

Sunday, May 9, 2010

లెక్కలు మాస్టారు - మొదటి గర్ల్ ఫ్రెండ్ - 1

                                                                       
***  శ్రీ రామ *** 
“రాజాధి రాజ, రాజ మార్తాండ (ఛి ఛి  మార్తాండా  అని వెళ్లిపోవద్దు ప్లీజ్ ), శ్రీ శ్రీ శ్రీ చంద్ర చూడామణి వర్మ  మహారాజుగారు (పేరు మార్చడమైనది) వేంచేస్తున్నారహో ఆన్న పిలుపుతో ప్రజలందరూ లేచి నుంచుని జయజయద్వానాలు చేస్తుండగా, మహారాణి మరియూ యువరాణి సమేతం గా  వచ్చిన మహరాజు ఠీవిగా సింహాసనం మీద అసీనులైనారు. ఆరోజు యువరాణి మాలినీదేవి (పేరు బాలేదా ..అది అప్రస్తుతం) స్వయంవరం.. పోరుగుదేశపు యువరాజులు, ఎంతోమంది వీరులు, మహావీరులు తరలి వచ్చినా... యువరాణి తో సహా  అందరి చూపు ఒక వీరుని మీదే నిలచివుంది. అతను ఈ స్వయంవరం పోటీలో విజయం సాధిస్తాడా, యువరాణి అతన్నే వరిస్తుందా అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు .. పోటీ మొదలయ్యింది.. వీరులందరూ హోరాహోరీగా తలపడ్డారు. అందరూ అనుకున్నట్టే అతను విజయం సాధించాడు.. ప్రజలు అందరూ జయజయద్వానాలు చేస్తున్నారు.. యువరాణి సిగ్గులమోగ్గ అయ్యింది.. రాజు చిరుమందహాసం చేస్తూ ప్రజలందరి ముందు 'యువరాణిని అతనికిచ్చి వివాహం  చేయబోతున్నానంటూ' ప్రకటించడానికి సింహాసనం దిగి వచ్చి అతని బుజం తట్టి , యువరాణి చేతిని అతని చేతిలో పెడుతుండగా , అంతలో - - - -  (1)
*     *     *
స్వర్గ లోకం అనుకుంటా మాం...చి కలరింగ్ తో కళకళలాడుతుంది.. కాస్త లోపలి వెళ్లి చూడగానే సింహాసనం మీద అసీనమై వున్న ఇంద్రుడు .. తన ఎదురుగా నుంచున్న కుర్రోడితో ...
"నాయనా.. ఇంతకాలం నన్ను నిస్ఠగా  పూజించినందుకు (???) నీ భక్తికి మెచ్చితిని  .. నీకో వరం ఇద్దామని నిన్ను ఇక్కడకి పిలిపించాను.. లిమిటెడ్ రిసోర్సెస్ వల్ల మిగతా దేవుళ్ళలా నేను పేద్ద పేద్ద వరాలు ఇవ్వలేను కానీ.. చెప్పు ..నీకు రంభ కావాలా రమ్యకృష్ణ కావాలా.. కోరుకో నాయనా" 
" అంత సడన్ గా అడిగితే.... మరి అదేమో... రంభ అయితే.. రమ్యకృష్ణ ఆయినా పర్లేదు.. కానీ.. " 
" పర్లేదు నాయనా .. నీకెవరు బాగా సూట్ అవుతారు నాకు తెలుసు కదా.. సరే ఇదే నా వరం..విను  "
అంతలో  .... (2) 
 *      *       *
ఇండియా పాకిస్తాన్ మద్య షార్జాలో క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ జరుగుతుంది .. స్టేడియం లోనూ టివిల ముందర జనాలంతా మంచి టెన్షన్ తో ఆఖరు బాల్ చూస్తున్నారు. ఆ మ్యాచ్ లోనే డెబ్యు చేసిన ఒక కుర్రాడు 98 పరుగుల మీద ఆడుతున్నాడు. ఇండియా మ్యాచ్ నెగ్గాలంటే ఇంకో 2 పరుగులు చెయ్యాలి. ఆఖరుబాల్ వఖార్ యునిస్ వేసాడు. ఆ కుర్రాడు బలం గా కొట్టాడు.. రెండో పరుగు తీస్తుండగా ఫీల్డర్ విసిరిన బాల్ నేరుగా వికెట్లను తాకింది. మెయిన్ అంపైర్ కనీసం థర్డ్ అంపైర్ వైపు కూడా చూడకుండా అవుట్ ఇచ్చేసాడు.. అది నాటవుట్ అని అంత క్లియర్ గా తెలుస్తుంటే అవుట్ ఎలా ఇచ్చాడా అని  ఆ అంపైర్ వైపు చూస్తే  .... (3)

 *      *       *
(1) .....  " ఆగండి " ఆన్న కేక వినిపించగానే అందరి తలలు  అటువైపు తిరిగాయి . మహామంత్రి  శ్రీ శ్రీ శ్రీ దామోదర శర్మ గారు హడావుడిగా వస్తూ.. వస్తూనే ఆ కుర్రోడు వైపు కోరకోరా చూస్తూ, మహారాజువైపు తిరిగి " వీడికా యువరాణిని ఇచ్చి పెళ్లిచేసేది.. నేను ఒప్పుకోను " అన్నాడు.. 
" మరి అతను స్వయంవరం కి పెట్టిన పరీక్షలన్నిటిలోనూ విజయం సాధించాడు "  
" ఎడిచాడు ..నేను పెట్టిన అన్నీ వీక్లీ టెస్టులలోను ఫెయిల్ ..వాడికి తొమ్మిదవ తరగతి ఫైనల్ లెక్కల పరీక్షలో వందకి పదమూడు మార్కులు వచ్చాయి.. ఏదో రామారావుగారి హాజరు పాసు రూల్ లేకపోతే వాడు పడవ తరగతికే వచ్చేవాడుకాదు "
" అటులనా .. అయితే అటువంటి చదువురాని శుంఠకి యువరాణి ఇచ్చేది లేదు..."
" *@&;)(* " - ఆ యువకుడు .. శ్రీ శ్రీ శ్రీ దామోదర శర్మ ని చూస్తూ .....


* * *

(2) ... ఒక స్వర్గలోకపు భటుడు వచ్చి నారద మహర్షి విచ్చేస్తున్నారు ప్రభూ అని ఇంద్రుడితో చెప్పాడు.. ఆ నారద మహర్షి ని చూడగానే ఆ కుర్రాడికి ఈయన్ని ఎక్కడో చూసినట్టువుందే అనిపించింది..
 నారదుడు " ఏమిటి మీరు చేస్తున్నది .. ఈ అడ్డగాడిద కి ఏదో రంభా..ఇంకేదో వరం అంటున్నారు "
" అవును నారదా.. ఇతని తపస్సుకి, భక్తికి మెచ్చితిని.. అందుకే వరమిస్తున్నాడు.." అని ఇంద్రుడు ఏదో చెప్పబోతుండగా
" వాడి మొహం ..రెండు గంటల  ట్యూషన్ లో గంట ముప్పావు  నిద్రపోతూనే  ఉంటాడు వీడు తప్పస్సు చెయ్యడం ఏమిటి " అంటూ హుంకరించారు  నారదుల వారు 
" అటులనా ..అయితే నేనే ఏదో పోరపాటు పడినట్టు వున్నా ..వీడికి వరం కాన్సిల్ ..భటులారా వీడిని బయటకు పంపండి అని  ఇంద్రుడు ఆజ్ఞాపించాడు ....."పంపండి" అన్నది "గెంటండి" అన్నట్టు వినిపించిన భటులు మర్యాదగా ఆ కుర్రోడికి బయటకు దారి చూపిస్తుండగా ...  
 
" @*+)(*)+(@*@#(*@#(* " - నారదుల రూపంలో వున్న  శ్రీ శ్రీ శ్రీ దామోదర శర్మ గారిని తిట్టుకుంటూ బయటకు నడిచాడా యువకుడు ..
  *      *       *
(3)......" లెక్కల్లో ఎప్పుడూ హాఫ్ సెంచురీ కూడా చెయ్యని వీడా ఇక్కడ సెంచురీ చేసేది .. నేను చెయ్యనివ్వను కాక చెయ్యనివ్వను అని చిందులు తొక్కుతున్న అంపైర్ దామోదర శర్మ గారిని చూస్తూ, హెల్మెట్ తీసి అస్తమిస్తున్న సూర్యుడి వైపు (పడమర వైపున్న పెవిలియన్ వైపు) నడుచుకుంటూ వెళ్ళిపోయాడు...99 మీద రన్నవుట్ ఆయిన ఆ యువకుడు ....

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఇవి మూడు ఉదాహరణలు మాత్రమే కాదు .. ఇంకా ఇలాంటివెన్నో..ఎన్నెన్నో ... 

ఇలా నా జానపద , పౌరాణిక , సాంఘిక 'కల'లని, ఆ కలల్లో నాకు తేనెపట్టు పట్టినట్టు పట్టిన అదృష్టాన్ని నాక్కాకుండా  చేసిన ఆ  శ్రీ శ్రీ శ్రీ  దామోదర శర్మ గారు ఎవరో కాదు.. పదవతరగతిలో నాకు లెక్కలు కం ఇంగ్లిషు కం సైన్సు కి ట్యూషన్ మాస్టారు.. ఆయన సంగతి తెలిసి నేను మొదట్లో ఆయన వుండే వీదిలోకి పొరబాటున కూడా వెళ్ళలేదు...(ఆ  వీదిలో ఇద్దరు అమ్మాయులున్నా సరే).. నేనే కాదు మా బాచ్ ఎప్పుడూ ఆ చాయలక్కుడా వెళ్ళకుండా జాగ్రత్తపడే వాళ్ళం.. అప్పట్లో మా నాన్నగారుకి  వేరే  వూర్లో (మన ప్ర నా ఊరు)  ఉద్యోగం.. నేను పదవ తరగతికి  వచ్చిన రెండు నెలల తరువాత అనుకుంటా .. ఒకరోజు మా నాన్నగారికి మా ఖర్మగాలిన మేనమామ (వేలువిడిచిన మేనమామ టైప్) "వీడు చాలా ఎదిగిపోయాడు.. ఇలానే వదిలేస్తే వీడు పది పాసవడు..చేతులు కాలకుండానే ఆకులు పట్టుకోవాలి.." లాంటి అర్ధంపర్ధం లేని జ్ఞానోబోధ చేస్తే, నేనెంత హృదయవికారంగా ఏడుస్తున్నా లెక్కచేయకుండా ఒక రోజు మాంచి రాహుకాలం లో నన్ను తీసుకెళ్ళి ఆయన దగ్గర ట్యూషన్ చేర్పించేసారు.  అంతే కాకుండా .. ఉద్యోగానికి తిరిగి వెల్లిపొతున్నప్పుడు, మా ట్యూషన్ మాస్టారికి చెప్పారు " సార్ నేను ఈ వూళ్ళో ఉండను కాబట్టి వీడి బాద్యత  అంతా మీదే.. కాస్త జాగ్రత్తగా చూసుకుని ... వీడి తోలు తీసి ఆయినా సరే ..ఎలాగోలా వీడిని పది గట్టెక్కించగలిగితే చాలు అని"..అంతే ఆ  రోజూ  నుండి  నా బతుకు బందరు బస్టాండు అయిపొయింది.. కస్టాలు మొదలయ్యాయి.. 

మాములుగా అందరికి రోజు ఆరు నుండి ఎనిమిది  వరకూ ట్యూషన్..  కాకపొతే కొంతమందికి మాత్రం ఎక్సెప్షన్ వుండేది ..అదేంటంటే  నాలాంటి ఇంకొంత మంది మేధావులకి పొద్దున్న రెండు గంటలతో పాటు సాయింత్రం ఆరున్నర నుండి ఎనిమిది గంటలవరకు స్పెషల్ ట్యూషన్.. ఆదివారం కూడా వదిలేవాడుకాదాయన.. ఒక్కోసారి లేచేసరికే ఆరు అయ్యేది .. లేట్ గా వెళ్ళినప్పుడు ఆయన చేసే  వీరంగం తలుచుకొని ఒకటి రెండుసార్లు పళ్ళు కూడా తోముకోకుండా ట్యూషన్ కి వెళ్ళాను  :-)) . కొంతమంది అమ్మాయిలు అంత పొద్దున్నే పువ్వులు పెట్టుకుని మరీ నీట్ గా తయారయ్యి వచ్చేవారు.. అసలు వాళ్ళు అంత పొద్దున్నే ఎలా లేస్తారో అని కొంచెం ఆశ్చర్యం , బోల్డు జాలి కలేగేది .. 

మా నాన్నగారు చెప్పడం వల్లో, కాస్త కంటికి నదురుగా కనిపించానో తెలీదు కానీ.. ట్యూషన్ చెప్పినప్పుడు అన్ని ప్రశ్నలు నన్నే అడిగేవారు.. అయన అడిగిన ప్రశ్నలకి నాకు తెలుసుండి ఎప్పుడూ సమాధానం చెప్పలేదు.. ఆయినా ఆయన మానేవారు కాదు.. అన్నిటికన్నా అవమానం ఏమిటంటే నన్ను 'మేడి పండు' అని పిలిచేవారు.. నేను పైకి మంచి బ్రైట్ స్టూడెంట్ లా కనిపిస్తాను కానీ పోట్టకొస్తే అక్షరం ముక్క లేదు అనేవారు. నా ఫేస్ అలా వుందని.. దానికి తగ్గట్టు చదవమనడం ఎంత దారుణం.. ఆయన అలా నా పిల్లహక్కుల్ని కాలరాస్తూ వుంటే ఏ ఒక్క బాలహక్కుల సంఘాల వాళ్ళు పట్టించుకోలేదు.. గోడ కుర్చీ, ఎండలో నిలబెట్టడం, బెత్తం తో బడిత పూజ, క్లాస్ లో వెనక్కి వెళ్లి నిలబడటం (ఇది క్లాస్లో నిద్ర పోతున్నప్పుడు), పైకి చదమనడం ...ఇలా నన్ను శిక్షించడం లో ఆయన క్రియేటివిటి కి అంతే వుండేదు కాదు.. ఎన్నో సార్లు తిట్టుకున్నా.. ఆయన్ని .. జాయిన్ చేసిన మా నాన్నగారిని.. అన్నిటికన్నా ముఖ్యంగా మా మావయ్యని.. 

అప్పుడప్పుడు నన్ను పిలిచి స్పెషల్ క్లాసు పీకేవారు.. సబ్జెక్టు గురించి అయితే ఒక బాధ.. కానీ ఈ స్పెషల్ క్లాస్ ఒక విధ్యార్దిగా, కొడుకుగా నా బాధ్యతలు గుర్తు చేస్తూ.. ఆ సెషన్ ఇంకా చిరాగ్గా వుండేది... అలా చెబుతున్నప్పుడు ఇంకెవరయినా క్లాసు మేట్స్ అక్కడ వుంటే ఇంకా చిర్రెత్తుకువచ్చేది.. ఆదివారం ఆడుకుంటున్నప్పుడు చూసినా పిలిచి ఇంటికి పోయి చదువుకో అనేవారు..  

అలా కష్టాలు బాధలతో కాపురం చేస్తుండగా , ఒకరోజు ...........

( సశేషం)

మంచు ------------
Cartoon Courtesy : మల్లిక్ & unknown artist.
 

18 comments:

karthik said...

మాష్టారు ఈ పేరు మార్పు నాకు నచ్చలేదండి. మంచు.మోహన్ బాబు,మంచు.విష్ణువర్ధన్ బాబు, మంచు.మనోజ్ బాబు, తర్వాత మంచు.పల్లకిబాబు..


ఈ వారసత్వ రాజకీయాలను నేను ఖండిస్తున్నాను..

karthik said...

మేము ఇలాంటివి చాలానే అనుభవించామండి.. తర్వాత భాగం కోసం ఎదురుచూస్తున్నా..

అన్నట్టు మీ నాన్న గారు ప్రనా ఊర్లో ఉండే వారా? చెప్పనేలేదు..ఆ ఊర్లో ఎర్ర చొక్కా వేసుకుని కవితలు చెబుతూ ఒకడు కనిపించి ఉంటాడు.. ఆ దెబ్బకు మీ నాన్న గారు "నా కొడుకు ఇలా మాత్రం కాకూడదు" అని మిమ్మల్ని ట్యూషన్ లో చేర్పించి ఉంటారు.. మొత్తానికి మీకు ప్రనా తో అవినాభావ బంధం అంతరంగాలు టైపులో సాగుతోందన్న మాట..

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగుందండీ పాపం మీ కష్టాలు కాదు లెండి మీ నెరేషన్ ఈజ్ టూగుడ్ :-) బాధ పడకండి మంచు గారు కష్టాలు మనుషులకు కాకపోతే మానులకొస్తాయా.. అదీ పదో తరగతి అంటే ఎంతటి మహా మహులకైనా తప్పదు. తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ..

Anonymous said...

అవునన్దీ అంత ఉదయమే అమ్మాయిలు మేక్ అప్ అయ్యీ పువ్వులు పెట్టుకుని మరీ పేరంటాలకు వెళ్ళినట్టు తయారయ్యి వచ్చేవారు tution కు..మేమేమో నిక్కర్ నారాయణ గాళ్ళా నలిగిన పాంటూ జిడ్డు మొగాలతోనూ...బయటకంటే చాలు ఆడ పిల్లలు ఒక డబ్బా పొగడ్రీ పూసుకుని రెడీ అయిపోతారేమో..

నేస్తం said...

మా లెక్కల మాస్టర్ గారు అదేదో సినిమాలో ధర్మవరపు సుభ్రమణ్యంలా ఆడవాళ్ళను అసలేమనేవాడు కాదు .మగ వాళ్ళకు తిరగ మోతే..దాంతో వాళ్ళందరూ మా పై కక్ష పెట్టేసుకునేవాళ్ళు :)

శ్రీ said...

బాగు బాగు... కంటిన్యూ!

http://manogna-ssv.blogspot.com/

AMMA ODI said...

మీ టపాకు :))
మీ ట్యూషన్ కష్టాలకు :((

3g said...

యువ సినిమా చూపించారండి మొదట్లో. ఇంతకీ హీరోయిన్ ఎంట్రన్స్ తరువాతి పార్ట్ లో అనుకుంట.

venuram said...

screenplay chala complicated ga undi mastaru.. nijam ga YUVA cinema gurthochindi...
Nice post
తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ

Rajkumar

నాగప్రసాద్ said...

మంచు పక్కన సుక్క ఎప్పుడొచ్చి చేరింది? ఎందుకు చేరింది? అసలు ఆ చుక్క ఎందుకు పెట్టాల్సివచ్చింది? ఏదైనా టర్కీ జ్యోతిష శాస్త్రం ప్రకారం అలా పెడితే మంచిది అని ఎవరైనా చెప్పారా? వంటి అనేకానేక సందేహాలకు సమాధానాలు నాకు తెలియాలి! తెలియాలి!! తెలియాలి!!. లేదంటే కెబ్లాసలో సునామీ హెచ్చరికలు జారీ చెయ్యబడతాయి. :-))).

Sai Praveen said...

టైటిల్ లో గర్ల్ ఫ్రెండ్ అని పెట్టి మొదటి భాగం లో ఆ టాపిక్ తీసుకు రాకపోతే ఎలాగండి. మా లాంటి వాళ్ళు ఆ ట్రాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. :)
ఈ స్టొరీ కి ఆ కలల ఇంట్రడక్షన్ అదిరింది. ఆ స్క్రీన్ ప్లే ఇంకా అదిరింది. తొందరగా రెండో భాగం రాసెయ్యండి మరి.

Rajendra Prasad(రాజు) said...

మంచు గారు బాగా రాసారండి...కాని నేను ఇన్ని కష్టాలు పడలేదు.మా సారు మిగత వాళ్ళని కొట్టటం చూసే నేను భయపడి పోయి, ఆ పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోలేదు. అందులోనూ నాకు చిన్నప్పటి నుంచి లెక్కలు అంటే ఇష్టమైన సబ్జెక్ట్ అన్న మాట....:)

నాగప్రసాద్ said...

లెక్కల్లో టాపరైన మీ పరిస్థితే ఇలా ఉంటే, నా పరిస్థితిని ఏమని వర్ణించాలో మరి. నేనసలే లెక్కల్లో అధముణ్ణి. :-(((. ఇప్పటికీ కూడికలు, తీసివేతల దగ్గర తప్పులు చేస్తూ ఉంటా. హ్యాపీగా M.A చేసి, ఏ తెలుగు పంతులుగానో సెటిల్ కాకుండా, చేతకాకున్నా ఇంజినీరింగ్ ఎందుకు చేశానా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. :-(((.

పద్మ said...

I can relate myself to this post so much. :)

7th లో తక్కువ వచ్చాయి మార్క్స్ అని 8th, 9th, 10th వరసగా నాకు రోజూ ట్యూషన్. ఇంటికి వచ్చేవారు మా మాస్టారు. రోజూ నేను స్కూల్ నించి ఇంటికి రాగానే మొదలయ్యేది ప్రైవేటు. కష్టపడి చదువు చెప్తున్నాడు పాపం అని రోజూ టిఫిను, కాఫీ ఇచ్చేవాళ్ళు మా ఇంట్లో. అప్పటి దాకా ఆడుతూ పాడుతూ గడిపేసిన నాకు మటుకు ఆయన్ని చూస్తే మండిపోయేది. టిఫిన్ మెక్కటానికి వస్తున్నాడు రోజూ అని తెగ తిట్టుకునేదాన్ని. కానీ ఆ మాస్టారి మూలంగానే, 10th లో స్కూల్ టాపర్ అండ్ లెఖ్ఖల్లో సెంట్ పర్సెంట్ సాధించగలిగాను. :) గురుభ్యోనమ:

హరే కృష్ణ . said...

శ్రీ శ్రీ శ్రీ చంద్ర చూడామణి వర్మ అంటే ప్ర నా మట్టిలో మాణిక్యాలు కధలో హీరో పేరు
ఇలా కాపీ రైట్లు లేకుండా వాడుకోవడం మహాపాపం :) :)
మీ బ్లాగుని వెంటనే ఫాల్లో అవ్వాలి
మీ టపాలు సూపరో సూపరు

మీ లెక్కల మాస్టారుకి చెక్ చెప్పేయండి
హీరోయిన్.. హీరోయిన్ దగ్గరకి వచ్చేయండి
పాటలు కావాలంటే నేను రాసి ఇస్తా
కంటిన్యూ కంటిన్యూ

మంచు - పల్లకీ said...

@ కార్తీక్ : ఎం చెయ్యమంటావ్.. ఇంకేపేరు తట్టలేదు.. అదే పేరుతొ కొనసాగటానికి మసను ఒప్పడంలేదు... సౌమ్య బ్లాగులొ " మంచుతెఱి - హేమంత ఋతువు " చూసా.. ఇది నచ్చింది.. చూద్దాం.. :-))
అవినాభావ బంధం అంటావా . ఎమో .. చిన్నప్పుడు వాడునేను కలిసి తిరిగామెమో :-))
@ వేణు గారు: అంతే అంటారా .. ఎమో అప్పటి కస్టాలు ఇప్పుడు తీపి గుర్తులు..
@ కె వి ఎస్ వి : నిజమే కదా.. మగాళ్ళకి పొగడ్రిలు గట్రా అవసరం లేదండి.. :-)) ఒరిజినల్ ఫేస్ వల్యూ చాలు :-))

మంచు - పల్లకీ said...

@ నేస్తం : ఈయన అలాంటివారు కాదు కానీ.. అలాంటి సుబ్రహమణ్యాలు వున్నారండి.. దానికి తోడు ఆడళ్ళు ఎప్పుడూ పితూరిలు చెప్పేవారు.. మాకు వీపు విమానం మొతే.. బడి వదిలేసాకా వాళ్ళ జడలాగి పారిపొయె వరకూ ఆ ఉక్రొషం అలాగే వుండేది..
@ శ్రీ : ధన్యవాదాలు
@ అమ్మఒడి గారు: పునఃస్వాగతం.. నా బ్లాగులొ మొదటి కామెంట్ పెట్టారు ..మళ్ళి ఇన్నాళ్ళకి .. థాంక్యూ
@ 3జి : ముందు యువ అని ఎందుకు అన్నారొ అర్ధం కాలేదు .. కింద రాజకూమార్ కామెంట్ చూసాక స్క్రీన్‌ప్లే అని అర్ధం అయ్యింది .. నేనా సినిమా సెకండ్ హాఫ్ చూసా.. సరిగ్గా గుర్తులేదు..
@ రాజ్‌కుమార్ : అంత కాంప్లికేటెడ్ గా వుందా .. తిట్టారా..లేక పొగిడారా.. అర్ధం కాలేదు :(

మంచు - పల్లకీ said...

@ నాగా: టర్కి జ్యొతిష్యశాస్త్ర ప్రకారం .. చుక్క ఎందుకొచ్చిందొ చెబితే ఆ ఫలితం పొతుంది.. సొ సీక్రెట్... :-)) అప్పట్లొ టాపర్ కాదులే బాసు :-)) ఇప్పుడు ఎవరయినా నీలా చిన్న చిన్న తప్పులు చేస్తే విసుగు/కొపం వచ్చేస్తుంది :-))
@ సాయ్ ప్రవీణ్: వస్తున్నా.. వస్తున్నా అక్కడికే వస్తున్నా :-))
@ రాజు గారు: " మా సారు మిగత వాళ్ళని కొట్టటం చూసే నేను భయపడి పోయి, ఆ పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోలేదు ".. హు.. ఆ తన్నులు తిన్న మిగతా వాళ్ళలొనే నేను వున్నా.. నన్ను కొట్టడం వల్ల మీరు తప్పించుకున్నారు.. ఇంకొలా చెప్పలంటే మీకొసమే మేము తన్నులు తింటూ వుంటాం.. చూసారా మాది ఎంత త్యాగమో.. :-)) థాంక్యూ
@ పద్మ గారు : ధన్యవాదాలు , నన్ను ఆయన చావచితక్కొట్టి పదవ తరగతిలొ కాస్త మంచి మార్కులే వచ్చేలా చేసారు కానీ ఆ తరువాత మళ్ళి మాములే.. కుక్క తోక వంకరే.. :-))
@ హరే కృష్ణ : పేర్లకి కాపీ రైట్ ఎంటిబాసు.. మరీను.. హీరొయిన్ మేకప్ వేసుకుంటుంది.. వచ్చేస్తుంది.. .. కాస్త ఓపిక పట్టు :-))