Pages

Saturday, July 10, 2010

నా అభిమాన శాస్త్రజ్ఞులు - 1

*** శ్రీరామ  ***


జూలై 10, ఈరోజు ప్రత్యేకత పెద్దగా ఎక్కువమందికి తెలిసుండకపోవచ్చు. మన టివి మీడియాకి కూడా సినిమారంగానికి చెందిన ఏ వ్యక్తి పుట్టినరోజు కాదు కాబట్టి ఈరోజు అంత ముఖ్యమయిన రోజు అనిపించదు.  మన పేపర్ మీడియా అంతర్జాతీయ వార్తలు ఎంత వీలయితే అంత తక్కువ ప్రచురిస్తాయి. కాబట్టి మీకు తెలిసే అవకాశం లేదు .

సరే ... కరెంట్ లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. లైట్ బల్బులు , ఫ్యాక్టరీలు, లిఫ్ట్లు, క్రేన్లు, సినిమాలు, గృహవిద్యుత్ ఉపకరణాలయిన ఫ్రిజ్, టివి, మిక్సి, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వగైరాలు ఏవీ లేని ప్రపంచం అన్నమాట. అసలు ఆ ఊహే భయంకరంగా వుంది కదా. ఈరోజు మనకి ఆ సౌకర్యాలన్నీ అందుతున్నాయంటే దానికి కారణం కొంతమంది శాస్త్రజ్ఞుల మేధస్సు, వారి కష్టం. అందులో కొంతమంది వాళ్ళ జీవితం మొత్తం శాస్త్రపరిశోధనకే వెచ్చించారు. అందులో ఒక మహానుబావుడి పుట్టినరోజు ఈరోజు. 

అతనే నికోలా టెస్లా (Nikola Tesla)


అతని మీద నాకున్న ప్రత్యేక అభిమానానికి కారణం అతను ఒక గొప్ప సైంటిస్ట్ అని మాత్రమే కాదు ...అతను అత్యంత ప్రతిభావంతుడు, అపర మేధావి ... Extraordinarily genius  అని చెప్పగలిగే అతికొద్దిమంది వ్యక్తుల్లో ఒకడు.  అతని ఊహశక్తి (imagination), జ్ఞాపకశక్తి (memory power) ఎంత గొప్పవంటే ... ఎన్నో పేటెంట్లను పెన్ను పేపర్ లేకుండా, అన్ని గణిత సమీకరణాలను తన ఊహలలోనే సాధించి, దానికి సంబంధించిన సాంకేతిక రేఖా చిత్రాలను తన ఊహలలోనే రూపొందించి, సరాసరి ఫైనల్ డిజైన్ ను రూపకల్పన చెయ్యగలిగిన అపర మేధావి. వ్యక్తిగత విషయాలకొస్తే అతని వయస్సు 30 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలు వచ్చేవరకూ అతని బరువు ఒక్క పౌండ్ కూడా పెరగకుండా తగ్గకుండా ఖచ్చితంగా మైంటైన్ చెయ్యగలిగిన పట్టుదల గల వ్యక్తి. అయితే కొన్ని కారణాల వల్ల అతని మేధస్సుకి రావాల్సిన గుర్తింపు అంత త్వరగా రాలేదు.  

అలాగే అతని గురించి చెప్పుకునేటప్పుడు ఇంకో గొప్ప శాస్త్రజ్ఞుడి ప్రస్తావన తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. 

అతనే థామస్ ఆల్వా ఎడిసన్ ( Thomas Alva Edison )

లైట్ బల్బు కనిపెట్టిన సైంటిస్ట్‌గా మనందరికీ సుపరిచితుడయిన ఇతని గురించి తెలుస్కోవాల్సింది చాలానే వుంది. తన జీవితంలో 1093 పేటెంట్లను పొందిన ఈ మహాశాస్త్రజ్ఞుడు కేవలం 3 నెలలు మాత్రమే బడికి వెళ్ళగలిగాడు.  జీవితంలో ఎదురయిన ఎన్నో ఆటుపోట్లుని తట్టుకొని నిలబడి తను అనుకున్నది సాధించే వరకూ శ్రమించి ఎంతో మందికి ఆదర్శప్రాయమయినాడు. మధ్యతరగతి నుండి వచ్చి, చిన్నతనంలో కుటుంబాన్ని పోషించడానికి ట్రైన్ లో పేపర్లు అమ్మిన ఈ వ్యక్తి స్తాపించిన కంపెనీ "జనరల్ ఎలెక్ట్రిక్ (GE)"  ఈ రోజు ప్రపంచంలోని అత్యంత పెద్ద MNC లలో ఒకటి. (రోజు అతను పనిచేసిన టేబుల్, కుర్చీ, ఇతర పరికరాలు చూస్తూ కొన్నాళ్ళు ఆ కంపెనీ గ్లోబల్ రీసెర్చ్ సెంటర్ లో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం) .. 

వీరిద్దరిలో ఎవరూ గొప్ప ఆంటే చెప్పలేం. ఇద్దరులో ఎవరూ విద్యుత్ కనిపెట్టలేదు కానీ ఆ విద్యుత్ ని మానవాళికి ఉపయోగపడేలా చెయ్యాలని తపించారు. విద్యుత్ ని సామాన్య మానవుడి దగ్గరకు చేర్చారు. వీళ్ళిద్దరి జీవితాలగురించి, వాళ్ళ మద్య జరిగిన సైద్ధాంతిక వైరం (దీన్నే "war of currents" అంటారు) గురించి చదువుతుంటే చాలా ఆసక్తికరంగా వుంటుంది. (ఒక సినిమా స్టొరీ రాసేయోచ్చు). వీటన్నిటి గురించి తరువాతి టపాల్లో వివరంగా చెప్తాను..... అప్పటివరకూ


Happy Birthday, Nikola Tesla!


ఇంతకీ పైన వున్న వాళ్ళలో ఎడిసన్ ఎవరో , టెస్లా ఎవరో గూగుల్ సెర్చ్ చెయ్యకుండా ఊహించండి ....


(సశేషం)
-మంచు

Sunday, July 4, 2010

నాజూకైన నడుము ... ఓ ఉద్యోగార్హత

*** శ్రీరామ ***

సన్నబడతావా .. లేక ఉద్యోగం పీకమంటావా  అని బాసులు హుంకరించే రోజు...
నాజూకైన నడుము వున్నవారే ఈ కంపెనీలో ఉద్యోగానికి అర్హులు అని బోర్డులు  పెట్టేరోజు...
ఆఫీసులో ఒక గంట పర్మిషన్ తీసుకుని మరీ జిం కెళ్ళి కష్టపడే  రోజు ...
డి.ఏ, ఎల్ .టి.ఏ లాగ తక్కువ బరువుకి కూడా ఒక అలవెన్స్ పెట్టే రోజు...


ఇలాంటి రోజులు వస్తాయంటారా ??? ... జపాన్లో అయితే కొన్ని రోజులు త్వరలోనే వచ్చే అవకాశం వున్నట్టు కనిపిస్తుంది .. కొన్ని ఇప్పటికే వచ్చేసాయ్....

ఊబకాయం (ఒబేసిటీ ) ఉన్నవారిలో మధుమేహం, బిపి, గుండెజబ్బులు తదితర జబ్బులు వచ్చే ఆవకాశం ఎక్కువ ఉంటుంది అని మనకి తెలిసిన విషయమే కదా.. హై కేలోరీ తిండి, పెద్దగా శారీరక శ్రమ లేకపోవడం, వగైరా కారణాల వల్ల  ప్రపంచవ్యాప్తంగా ఈ మద్య ఊబకాయుల సంఖ్య పెరుగుతూవస్తుంది ...ఊబకాయుల సమస్య మిగతా దేశాలతో పోల్చుకుంటే జపాన్ అంత ప్రమాదకరమయిన స్థాయిలో ఏమీ లేదు ( సుమో వీరులని పక్కన పెట్టండి .. అది వేరు :-) )..

జపాన్లో ఎక్కువ శాతం ప్రజలు 'పబ్లిక్ హెల్త్ కేర్' కింద బెనిఫిట్ పొందుతారు . అందువల్ల ప్రజల ఆరోగ్యావసరాలకి అక్కడ ప్రబుత్వమే ఖర్చుపెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రస్తుత ఒబెసిటి ట్రెండ్ జపాన్ కి పాకి వాళ్ళు బరువు పెంచితే, దానివల్లే ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలకి మళ్లీ ప్రబుత్వమే ఖర్చుపెట్టాలనో లేక ప్రజల మీద నిజమయిన ప్రేమతోనో కానీ మొత్తంమీద 2008 లో అక్కడి ప్రబుత్వం " 2012 కల్లా ఆ దేశం లో వున్న ఊబకాయుల సంఖ్య 10 % వరకూ తగ్గించాలని, 2020 కల్లా 25 % వరకూ తగ్గించాలని ఒక నిర్ణయం తీసుకుంది".

ఈ కొత్త ప్రబుత్వ రూలు ప్రకారం మగవాళ్ళ నడుము చుట్టుకొలత 33.5 అంగుళాలు, ఆడవాళ్ళ నడుము చుట్టుకొలత 35.4 అంగుళాలు కన్నా మించకూడదు.. అసలు ఈ అన్యాయం చూసారా... మగాళ్ళకన్నా ఆడాళ్ళు లావుగా ఉండోచ్చట.. ఎందుకంత వివక్ష... మగవాళ్ళ మీద కక్ష.. (సవరణ ఆఖరున ఇచ్చాను చూడండి) :-)) ... సరే.. ఈ రూల్ ప్రకారం 40 నుండి 74  సంవత్సరాల మద్య వయస్సు వున్నవారు ప్రతి సంవత్సరం నడుము చుట్టుకొలత పరీక్ష చేయించుకోవాలి. ఈ వెయిట్ (అదే నడుము చుట్టుకొలత) కంట్రోల్ చేసే బాద్యత ఆ ప్రజలు పనిచేసే కంపెనీది అన్నమాట... ఆంటే ప్రతి కంపెనీ తమ ఉద్యోగుల నడుము మైంటైన్ చేసే బాద్యత తీసుకోవాలి.. ఎవరయినా ఈ నడుము చుట్టుకొలత టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించలేకపొతే ఆ సదరు వ్యక్తి పని చేసే కంపెనీకి జరిమానా విధిస్తారు. ఉదాహరణకి NEC అనే ప్రముఖ జపాన్ సంస్థ లో పనిచేసే ఉద్యోగస్తుల్లో ఎవరయినా ఈ నడుము చుట్టుకొలత టేస్ట్ లో ఫెయిల్ అయితే ఆ కంపెనీ వాళ్ళు ఇంచుమించు 90 కోట్ల రూపాయలు జరిమానా కట్టాలి.

ఈ నిభందన 40 సంవత్సరాల పైబడిన వయస్సుగల ఉద్యోగులకే వర్తించినా, ఈ ఫైన్లు గట్రా 2012 నుండే అమలు అవుతున్నా, ఈ  కంపెనీలు అప్పటివరకూ వదిలేసి అప్పటికప్పుడు సడన్ గా తమ ఉద్యోగుల బరువు, నడుము తగ్గించాలంటే అవ్వదు కాబట్టి కంపెనీలో జాయిన్ అయినప్పటినుండే "వెయిట్ వాచింగ్" మొదలు పెట్టేస్తున్నారు.

సరే ఈ రూలు నచ్చని వాళ్ళు... ప్రజల ఆరోగ్యం మీద అంత ప్రేమే వుంటే ముందు సిగరెట్ట్  నిషేదించండి అని వాదించే వాళ్ళు ఉన్నారు.. కానీ బలమయిన సిగరెట్ కంపెనీల లాబీ వున్న జపాన్ లో అది అంత ఈజీ ఏమీ కాదనుకోండి...

సరే ఇది మన దేశం లో కూడా పెట్టారు అనుకోండి .. తమ ఉద్యోగుల/సభ్యుల నడుముల వల్ల ఎక్కువ ఫైన్ కట్టే సంస్థలు ఏవో చెప్పుకోండి :-))... చట్టసభలు (పార్లమెంట్ సభలు, అసెంబ్లీలు) మరియూ పోలీసు డిపార్టుమెంటులు.

మనలో మన మాట .. మన ఆడలేడీసుని ఎవరయినా muffin top అని పిలిస్తే ఆహా muffin లా స్వీట్ గా ఉంటానేమో అని మురిసిపోకండి..  నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్నవారిని పిలిచే స్లాంగ్ అది :-)) . జపాన్ అమ్మాయిలను చేసుకుంటే వారికి వడ్డాణం ఈజీగా కొనేయోచ్చు అన్నమాట :-))
సరే .. ఈ నడుము చుట్టుకొలత పెళ్ళికి ముందే కాదు.. తరువాత కూడా ఎంత ఇంపార్టెంటో చూసారు కదా.. ఇక పదండి జిం కి... 


-మంచు 

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
** 33 .5 /35 .4 కొలతలు ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడెరేషన్  జపాన్ కి అప్పట్లో సూచించిన కొలతలు.. అవి జెండర్ ని బట్టి, రేస్ ని బట్టి మారుతుంటాయి.. మనకు ప్రస్తుతం మగవాళ్ళకి 35.4, ఆడవాళ్ళకి 33.5 అంగుళాలు... నడుము చుట్టుకొలత వివరాలు ఈ కింద టేబుల్ లో వున్నాయి .