Pages

Saturday, April 9, 2011

ఖండించేద్దాం .... పొయిందేముంది ........

*** శ్రీ రామ ***

                     'అప్పుడే తెల్లారిందా' అనుకుంటూ .... కళ్ళను బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తూ... మంచం మీద బద్దకంగా కదులుతున్నాను.... పక్కలో ఎక్కడో మూల పడి ఉన్న సెల్ ఫోన్ వెతికి పట్టుకుని ఆ సగం మూసిన కళ్ళతో టైం చూద్దును కదా.. తొమ్మిది చూపిస్తుంది. పదిగంటలకు మీటింగ్ ఉంది అన్న సంగతి గుర్తురాగానే నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది. ప్రతీరోజులాగానే నా మొద్దునిద్ర కు నన్ను నేనే తిట్టుకుంటూ ఉరుకులు పరుగుల మీద తయారయ్యి ఇంటినుండి బయట పడ్డా. బండి తీసి ఫుల్ స్పీడ్ లో నడుపుతున్నా కానీ "Murphy's Law" లాగ మనకి ఎప్పుడు అర్జెంట్ పనుంటే అప్పుడే  ట్రాఫిక్ సిగ్నల్స్ మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. అలానే సిగ్నల్ రెడ్ పడింది ... ఒక పక్క మీటింగ్ కి టైం అయిపోతుంది అన్న ఆదుర్దా ఇంకోపక్క సిగ్నల్ దగ్గర ఎవడో  సైడ్ ఇవ్వకపోవడం వల్ల అక్కడే ఆగిపోయి మోగిస్తున్న అంబులన్స్ సైరెన్ సౌండ్. ఇలా చిరాకులో ఉండగానే ఎవరో అరవడంతో ఆ అడ్డువున్నవాడు అంబులన్స్ కి దారి ఇవ్వడం, అదే సమయం లో నా బుర్రలో మంచి ఐడియా తట్టడం ఒకేసారి జరిగాయి. ఆ ఐడియా ప్రకారం ఆ అంబులెన్స్ వెనుకే నేనూ బండి పోనిచ్చా... కొంచెం దూరం వెళ్ళాక  పక్కనుండి రేయ్ మని పోనిచ్చి అంబులెన్స్ ఓవర్ టేక్ చేసి ముందుకు దూసుకొచ్చా.. నా ఖర్మగాలి మళ్ళీ ఇంకో సిగ్నల్ రెడ్ పడింది ..అయితే ఈ సారి ఆగదలచు కోలేదు.. పెద్ద ట్రాఫిక్ లేదులే అనుకుంటూ రెడ్ సిగ్నల్ దాటానో లేదో ...అప్పటివరకు ఏ  మూల దాక్కున్నాడో వేస్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే పట్టేస్కున్నాడు. నెలాఖరు కదా ఎక్కడపడితే అక్కడ ఉంటారు అని ట్రాఫిక్ పోలీసులను తిట్టుకుంటూనే బండి ఆపాను. సిగ్నల్ జంపింగ్ కింద 300 రూపాయలు ఫైన్ అంటాడు... అర్జెంట్ పనిమీద వెళ్తున్నా కాబట్టి దాటాల్సి వచ్చింది అని ఎంత బ్రతిమిలాడినా వదలడే.. వాడితో బేరాలాడితే నాకే టైం వేస్ట్ అని ఒక వంద వాడికి సమర్పించుకుని ఆఫీసుకి చేరాను. 

***
అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయ్యింది... లాస్ట్ సీట్లు అన్నీ ఆక్యూపై అయిపోయాయి... మీటింగ్ కి లేట్‌గా వస్తే ఇదే సమస్య.. ఫ్రంట్ కూర్చుని చెప్పేవాడి వంక చూస్తూ ఆ సొదంతా వినాలి. మెయిల్ చూడడం కుదరదు,sms లు చెయ్యడం కుదరదు. తిట్టుకుంటూ కూర్చున్నా... అప్పటికే పావుగంట లేట్ అయినా ప్రెజంటేషన్ ఇచ్చేవాడు ఇంకా ప్రొజెక్టర్ తో కష్టపడుతున్నాడు. ఈ లోపు పక్క సీటువాడు "ఏంటి బాబాయ్ ఇంత లేట్"  అని పలకరించాడు. 
"రాత్రి సినిమా చూసి పడుకున్నా లేట్ అయిపొయింది" అని సమాధానం చెప్పాను. 
"ఎం సినిమా" అని అడిగాడు.
" ఏదో ఇంగ్లీష్ సినిమారా...నెట్ దొబ్బేసింది ... అది డౌన్లోడ్ అయ్యేసరికే 12 అయ్యింది   ..చూసి పడుకునే సరికి 2 ..పొద్దున్న మెలుకువరాలేదు.. ఖర్మకాలి మధ్యలో ట్రాఫిక్ పోలీసు పట్టుకున్నాడు... వాడికో వంద కొట్టి వచ్చా... ఆ అంబులెన్స్ అడ్డంపెట్టుకుని చాల దూరం వచ్చా కానీ లేకపోతే చాలా కష్టం ఆ ట్రాఫిక్ లో  "
" పర్లేదు లే ... నువ్వోచ్చేసరికి ఇంకా స్టార్ట్ అవలేదు గా " అన్నాడు ...

*** 

ఆ మీటింగ్ ముగించి కాఫీకి వెళ్ళాం... అక్కడ  గ్యాంగ్ అంతా ఉంది...
"అరేయ్... ఇన్‌కంటాక్స్ సేవింగ్స్ కి ప్రూఫ్ లు సబ్మిట్ చెయ్యాలి కదా... ...నేను వెళ్లి మ్యూచువల్ ఫండ్ కట్టి వస్తారా " అన్నాడు మా ఫ్రెండ్ అక్కడనుండి లేస్తూ...
" ఎం టాక్సోరా... మనం సంపాదించినదంతా దోచేస్తున్నారు... " నిట్టూరిస్తూ అన్నా...
" ఎం రా... నీకు సేవింగ్స్ ఏమీ లేవా " అని అడిగాడు ఇంకొకడు...
" ఎన్ని అని చేస్తాం రా ..మనమా షేరింగ్ అపార్ట్మెంట్... మన వాటా అద్దె పెద్ద కాదు..ఇక షేరింగ్ కాబట్టి రెంట్ రిసీట్ మాలో ఒకడికే వస్తుంది....  అందువల్ల  హెచ్ ఆర్ ఏ మొత్తం అక్కడే పోతుంది " అన్నాను.
" అదేంటి రా..  ఒరిజినల్ బిల్లులు పెడతావా.. " అంటూ పెద్ద కొండ తింగరోడిని చూసినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అందరూ... 
నేను కొంచెం అయోమయంగా చూస్తుండగానే... 
"అరే..  నీకు ఎంత అద్దె కావాలంటే అంత రాస్కో ...నేను ఓనర్ సంతకం పెడతా" అని ఒకడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు... ఇంకొకడు మెడికల్ ఎలవేన్స్ కోసం దొంగ మెడికల్ బిల్లులు ఎక్కడ దొరుకుతాయో చెప్తుంటే , ఇంకొకడు  LTA కోసం తను ప్రింట్ చేయించిన దొంగ రిసీట్స్ బుక్  ఆఫర్ చేస్తుంటే... ఆహ స్నేహం అంటే ఇదే అని పొంగిపోయాను. మొత్తం వివరాలు అన్నీ సంపాదించి వచ్చి సీట్లో కూర్చున్నా.. ఈ రోజు ఎలా చూసినా ఒక 20 వేలు టాక్స్ సేవ్ చేసినట్టే..మాంచి ఆనందంగా ఉంది. అయినా మన లెగ్ ఎప్పుడూ గోల్డెన్ లెగ్... ఇంజనీరింగ్ లో అందరూ వేలకు వేలు ఫీజ్ కడితే.. మనం ఒక 500 రూపాయిలు కొట్టి ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ అని సర్టిఫికేట్ సంపాదించి వందల్లో ఫీజు కట్టి ఇంజనీరింగ్ చదివేసా... 

ఎంతమందికి ఇన్ని తెలివి తేటలు ఉంటాయ్...అని నాకు నేనే భుజాలు తడుముకున్న్నా :-) 

***

లంచ్ ముగించి సీట్లో కూర్చున్నానో లేదు నాన్నగారి దగ్గరనుండి ఫోన్...
" ఎరా... మన పక్క స్థలం అమ్మేస్తారని చెప్పాకదా దానిగురించి ఏమయినా ఆలోచించావా  " అంటూ
" బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో నాన్నా.. పది లక్షలు అంటున్నావ్.. ఇంకా రిజిస్ట్రేషన్  , బ్రోకేర్ ఫీజు ఇలా చాలా ఉంటాయ్ కదా  "
" పది లక్షలు చెప్తున్నారు రా.. రిజిస్ట్రేషన్  ఫీజు ఇంకో పది వేలు వేస్కో.. బ్రోకర్ ఫీజు....." అని చెప్తుండగా మద్యలో కట్ చేసి
" అదేంటి మొన్న నెట్ లో చూసా.. ఆ రేట్  ప్రకారం పదిలక్షలకి రిజిస్ట్రేషన్ ఫీజు ఇంకా చాలా ఎక్కువ వచ్చింది నాకు  " అని అడిగా
కొన్న రేట్ కి ఎవరన్నా రిజిస్ట్రేషన్ ఫీజు కడతారట్రా ...కొనేది పదిలక్షలు అయినా అక్కడ గవర్నమెంట్ రేటు లక్షే ఉంది .. అందువల్ల రిజిస్ట్రేషన్ ఫీజు ఆ లక్షకే కదా "
" ఓ కదా... పాయింట్ మిస్ అయ్యా... సరే నేను పర్సనల్ లోన్ కి అప్ప్లై  చేస్తా.....తీస్కుందాం...వాడికి అడ్వాన్స్ ఇచ్చి ఉంచు "
అని ఫోన్ పెట్టా... ఈ రోజు అన్ని పిచ్చపిచ్చగా కలసి వచ్చేస్తున్నాయ్....

*** 

బోల్డు మెయిల్స్ పెండింగ్ ఉండిపోయాయి అని చూస్తున్నా .. ఒక మెయిల్ లో కజిన్ కి mathlab సాఫ్ట్వేర్ కావాలట... ఎలాగయినా సంపాదించామని రాసాడు... వెంటనే IISC లో ప్రాజెక్ట్ చేస్తున్న మా ఫ్రెండ్ కి ఫోన్ చేశా... వాడిని రివిజన్ 14 అడిగితే ..."ఇంకా రివిజన్ 14 ఏంటి గురూ..15 వచ్చేసింది కదా" అన్నాడు. నాకు తెలుసు ఈ IISC వాళ్ళు తక్కువోళ్ళు కాదని... సాఫ్ట్వేర్ ఇలా రిలీజ్ అవ్వడం పాపం...అలా పాస్వర్డ్ బ్రేక్ చేసేస్తారు. వీళ్ళ తెలివితేటలే తెలివితేటలూ అనుకుంటూ ...."సరే వీకెండ్ కి వచ్చి కలెక్ట్ చేసుకుంటా...సి డి రాసి ఉంచు" అని చెప్పేసి ఫోన్ పెట్టా... 

***

3 అయింది అని కాఫీకి వెళ్లోచ్చి అ రోజు పనికి కూర్చున్నా...మా కంపెనీలో చాలామంది లాగానే...నా వర్కింగ్ హవర్స్ మద్యాహ్నం నాలుగు నుండి మొదలవుతాయి. అలా అని అసలు పనే చెయ్యం అని కాదు... ప్రైవేట్ కంపెనీ కాబట్టి పనిచెయ్యకపోతే వెంటనే ఉద్యోగం ఊడుతుంది అనుకోండి... నాలుగు నుండి సీరియస్ గా పని చేస్కుంటున్నా... ఆరు గంటలుకి  స్నాక్స్ తిని కూర్చున్నా ..ఈలోపు కార్తీక్ గాడు పింగ్ చేసాడు. వాడు ఆన్ సైట్  కని అమెరికా వెళ్ళాడు...
"హాయ్ ...రా " అన్నాడు వాడు ...
" ఏంట్రా అప్పుడే వచ్చావ్ ... ఆఫీస్ కి.."
" ఇక్కడ అమెరికాలో ఈ టైం మామూలే రా... అయినా ఇక్కడ పని వాచిపోతుంది రా బాబు.."
" ఎం అంతకంతా డాలర్లు వస్తున్నాయి కదా..." కొంచెం కుళ్ళు గా అన్నాను...
" ఎం డాలర్లు రా బాబు... చిరాకొస్తుంది... దీనికన్నా ఇండియా లో హాయిగా ఫ్రీగా ఉద్యోగం చేస్కుంటే ఎంత సుఖం గా ఉంటుందో..."
అక్కడున్న ప్రతీవాడు ఇలానే చెప్తాడు ...కానీ ఎవడూ రాడు అనుకుంటూ...
"మరి ఎప్పుడొస్తున్నావ్" అని అడిగాను 
" ఏమోరా... నీ ఆన్ సైట్ గురించి ఎమన్నా చెప్పాడా మానేజర్ " అని అడిగాడు వాడు
" ఇంకా ఏం చెప్పలేదు.. చెప్పడు రా వాడు.. వాడికి నేనంటే పడదు... కనీసం ఒక్క సంవత్సరం అయినా పంపొచ్చు కదా ... ఎప్పుడు చూసినా బడ్జెట్ బడ్జెట్ అంటాడు.. బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి పది లక్షలు, కానిస్టేబిల్ ఉద్యోగానికి 5 లక్షలు అని మార్కెట్లొ రేట్ ఉన్నట్టు ఈ ఆన్‌సైట్ కి కూడా ఏదన్నా రేట్ ఉంటే ఈపాటికి ఎప్పుడో వచ్చేవాడిరా..." అని చెబుతున్నా ... ఈ లోపు ...
" మళ్ళీ అడిగి చూడరా.... సరే నేను ఉంటాను" అని బై చెప్పేసాడు...

మళ్ళీ పనిలో మునిగిపోయా... రాత్రి 8 :30 కి అమెరికా కౌంటర్ పార్ట్ పింగ్ చేసాడు... " are you there " అంటూ ...
"యా" అన్నా... 
"ఇంకా పని చేస్తున్నావా" అని వాడి ఆశ్చర్యం...
" అవును... ఇండియా లో రాత్రి పదింటి వరకు పని చెయ్యడం కామనే... మీరు ఆరింటికే వెళ్ళిపొతారనుకుంటా కదా "అని అడిగాను ..
" అవును ... అయినా మీ ఇండియన్స్  బాగా కష్టపడతారు... సరే...ఇక వెళ్లి రెస్ట్ తీస్కో " అని చెప్పేసి వెళ్ళిపోయాడు..
వాడు అలా టైం గుర్తు చేసేసరికి నాకు వెంటనే అలసట వచ్చినట్టు అనిపించింది...వెంటనే బైక్ తీసుకుని ఇంటికి బయలుదేరబోతున్నా ...ఫ్రెండ్ కాల్ చేసాడు... అరేయ్ మన ప్రభాకర్ గాడు పార్టీ ఇస్తున్నాడు...ఇప్పుడే డిసైడ్ చేసాం...వెంటనే వచ్చేయ్ అని పిలుపు...

****

ఆహా అనుకుంటూ... వాడు చెప్పిన రెస్టారెంట్ వైపు బండిపోనిచ్చా...అప్పటికే అందరూ వచ్చేసారు. ఆర్డర్ ఇచ్చేసారు. హెల్మెట్, జర్కిన్ పక్కన పడేసి కూర్చున్నా... మా గ్యాంగ్ కలిసిందంటే క్రికెట్ నుండి  మొదలు పెట్టి, టాలీవుడ్, బాలివుడ్ అంటూ అన్ని వుడ్ లు టచ్ చేస్తూ, ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ రాజకీయాలు , సమస్యలు అన్నీ మాట్లాడేసుకుంటాం. టచ్ చెయ్యని టాపిక్కే ఉండదు. అలా మాట్లాడుకుంటుంటే మా మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయిన అవినీతి, బ్లాక్ మనీ మీదకి వెళ్ళింది. అందరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెబుతున్నారు .. హాట్ హాట్ డిస్కషన్ జరుగుతుంది. 

" అసలు ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల వల్లే మన దేశం ఇలా తగలడింది " అని ఒకడు....
" అసలు ఎవడబ్బ సొమ్మని బ్లాక్ మనీ రూపం లో అంతా విదేశాలకి తరలించారు... ఆ డబ్బు తో మన దేశం అప్పులన్నీ తీర్చేయోచ్చు కదా " అని ఇంకోడు.... 
వై ఎస్ ఎక్కువ అవినీతి చేసాడంటే, అదంతా వై ఎస్ చంద్రబాబు నుండి నేర్చుకున్నదే అని ఇంకోడు...లోక్ జన పాల్ బిల్లు గురించి ఒకడు చెప్తే ,  లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీ గురించి ఇన్స్పైరింగ్ కథలు ఇంకొకడు చెప్తున్నాడు. 

అయితే మాలో మురళి అని ఒకడున్నాడు. వాడు కొంచెం తేడా గాడు. ఊరంతా ఒక దారి అయితే వీడిది వేరే దారి. అప్పుడు వాడి డొక్కులో ప్రశ్న ఏంటంటే 
" అరేయ్ ... మీలో ఎంతమంది అదే రాజకీయ నాయకుడి ప్లేస్ లో ఉంటే  ఏ రకమయిన అవినీతి చెయ్యకుండా పెర్ఫెక్ట్ గా ఉంటారు" అని ....

వీడేప్పుడు తలతిక్క గాడే అనుకుంటూ "మేం ఎవరు అధికారం లో ఉన్నా పైసా లంచం తీస్కోం... తీసుకున్నా ఏదో తక్కువ అమౌంట్ లో తీస్కుంటాం కానీ ఇలా దేశాన్ని , ప్రజల్నిదోచేయ్యం" అని చెప్పాం...

అయితే వాడు వాడి పాయింట్ పూర్తిగా చెప్పేవరకు వదిలే రకం కాదు.... అయితే దురదృష్టవశాత్తు ఈసారి నన్ను ఉదాహరణ గా తీస్కున్నాడు. ఆ రోజు ఉదయం నుండీ నేనూ చేసిన అవినీతి , తప్పులు చెప్పమన్నాడు ..

"నేనేం చెయ్యలేదు .. ఉదయం నుండీ నిజాయితీగా ఉన్నాను... అయినా నేనేం అవినీతి చెయ్యగలను..నాకేం అధికారం ఉందని  " అని కాన్ఫిడెంట్ గా చెప్పాను..
" బాగా ఆలోచించు " అని రెట్టించాడు .. 

ఆలోచించడం మొదలు పెట్టాను.....అందరూ సైలెంట్ గా నావంకే చూస్తున్నారు

అంబులెన్స్ ని ఓవర్ టేక్ చెయ్యడం లాంటి చిన్న చిన్న రూల్స్ పాటించకపోవడం లాంటి  తప్పులు పక్కన పెట్టినా .... నిన్నరాత్రి చూసిన డౌన్లోడ్ పైరేటెడ్ సినిమా నుండి, ట్రాఫిక్ కానిస్టేబిల్ కి లంచం ఇచ్చి బయటపడటం, ఫేక్ బిల్లులు పెట్టి టాక్స్ సేవ్ చెయ్యడం (ఎగ్గొట్టడం), గవర్నమెంట్ రేట్ కి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి  మిగతాది బ్లాక్ మనీ తో కొనడం , దొంగ సర్టిఫికెట్స్ లో తక్కువ ఆదాయం చూపించి తెల్లకార్డులు , ఎకనిమికల్లీ బేక్వార్డ్ అని సర్టిఫికెట్స్ వాడుకోవడం..... పొద్దున్న లేస్తే చేసే ప్రతీ పని లోని అదే ఆలోచన. ప్రబుత్వానికి ఎలా టోపీ వెయ్యాలి , ఎలా డబ్బు మిగిల్చాలి అని.... " ఇలా సాగుతున్నాయి  నా ఆలోచనలు .....

నేను మౌనం గా ఉండటం చూసి మురళి గాడు కంటిన్యూ చేసాడు. 

" ఇప్పుడు మనకి వచ్చే జీతానికి , చేతిలో ఉన్న అవకాశానికి సరిపడా అవినీతి మనమూ చేస్తున్నాం. ఏ చాన్స్ వదలడం జరగదు. అలాంటిది ఇంకొంచెం అవకాశం వస్తే ఇంకొంచెం అవినీతి చెయ్యమా.... రాజకీయ నాయకులు , ప్రభుత్వ అధికారులు  అన్నవారు ఎక్కడో పైనుండి దిగిరాలేదు.. వాళ్ళు మన సమాజం లో ఒక భాగం...మన సమాజానికి ఒక చిన్న సాంపిల్... వాళ్లకి అవకాశం వచ్చింది కాబట్టి తింటున్నారు. అవకాశం లేని వాళ్ళు ఏదో నిజాయితీపరుల్లా నటిస్తున్నారు ...ఈ అవినీతి అన్నది మన రక్తం లో ఇంకిపోయింది"... అంటూ చెబుతున్నాడు... 

పెద్దగా ఎవరూ ఎదురు మాట్లాడకపోయే సరికి ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది కానీ ఆ ఆలోచనలు మాత్రం ఎవరి మనసుల్లోనుండి పోలేదు...

***

ఇంటికి వచ్చాక కూడా అవే ఆలోచనలు చుట్టుముట్టాయి....


నిజమేనా మనకి అవకాశం వస్తే మనమూ అంతే అవినీతికి పాల్పడతామా అని.... నాకు వెంటనే ఒక ఉదాహరణ గుర్తొచ్చింది... 
"కొన్నేళ్ళ క్రితం మా మావయ్య ఒకతను ఉద్యోగం సద్యోగం లేకుండా ఒక ఐదు వేలమంది ఉండే చిన్న ఊరికి సర్పంచ్ అవడానికి ప్రయత్నించేవాడు. మొత్తానికి పదేళ్ళు గడిచాక తన ప్రయత్నం ఫలించి సర్పంచ్ గా నెగ్గాడు. అతను సర్పంచ్ అయిన సమయానికి ఆ ఊళ్ళో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. అక్కడ ఎవరయినా పొలాన్ని ఇళ్ళ స్థలాలుగా విడదియ్యాలంటే సర్పంచ్ అనుమతి కావాలి. అయితే ఒక పది స్థలాలు విడదీస్తే ఒక స్థలం ప్రబుత్వ రేట్ కి తనకి అమ్మాలని సర్పంచ్ కండిషన్. అది చట్టపరం గా తప్పు అని ప్రూవ్ చెయ్యలేనిది.... ఎందుకంటే తను ఫ్రీగా తీసుకోవడం లేదు... డబ్బులిచ్చి కొంటున్నాడు. అది కూడా చట్టబద్దం గా ప్రబుత్వ రేట్ కి. అయితే అదే స్థలం మనం అందరం అమ్ముకుంటున్నట్టు తరువాత మార్కెట్ రేట్ కి (ప్రబుత్వరేట్ కి కొన్ని రెట్లు ఎక్కువ) అమ్ముకుంటాడు. ఈ పూర్తి కొనుగోలు అమ్మకం ఎపిసోడ్ లో ఆ సర్పంచ్ మనం అందరం చేసే అవినీతి కన్నా ఎక్కువ అవినీతికి పాల్పడినట్టు అనిపించలేదు. ఎక్కువమంది రాజకీయనాయకులు చేసేది ఇదే...."

చాలా సమయాల్లో కొన్ని ఆర్గ్యూమెంట్స్ వింటూ (చేస్తూ) ఉంటాం. సమాజంలొ ఒక అంతర్భాగం అయిపొయిన ఈ అవినీతికి నేను ఒక్కడిని ఏం చెయ్యగలను అని.... లంచం లేకుండా ఇప్పుడు ఏమి పనులు జరుగుతున్నాయ్ అని ... సరే ..మనం అందరం అన్నా హజారే లా నిరాహార దీక్షలు చెయ్యలేం... అపరిచితుడులో రామం లా అందరిలో ఆడ్ పర్సన్ లా బ్రతకలేం ...  అది  కరెక్టే  కానీ... మనకి కుదిరేవి, చేయ్యగాలిగినవి నిసవార్ధం గా నిజాయితీగా మనం ఎన్ని చెయ్యగలుగుతున్నాం.  ఒక షాప్  లో సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు బిల్ లేకుండా కొన్నవస్తువులకి 10% డిస్కౌంట్ ఇస్తానంటే ఎంతమంది బిల్ ఇవ్వమని 10 % డబ్బులేక్కువిచ్చి సరుకులు కొంటారు. 

ఇంకో చిన్న ఉదాహరణ 
పైరేటెడ్ సినిమాలు చూసేవారిది ఇంకొ రకమయిన వాదన... "వాళ్ళు చెత్తసినిమాలు తీస్తే మనం ఫుల్ డబ్బులిచ్చి కొట్టించుకొవాలా.. ఆ సినిమాల నాణ్యత కు పైరేటెడ్ కాపీనే ఎక్కువ" అని.  ఇంకొంతమంది " మేము ఎక్కడొ ఉన్నాం, మాకు ఇక్కడ పైరేటడ్ తప్ప వేరే మార్గం లేదు... ఏం చెస్తాం" అని. అదే మనకు ఒక స్వీట్ షాప్ లొ స్వీట్స్ కొన్నామనుకోండి  ... ఆ స్వీట్ల నాణ్యత మనకు నచ్చలేదు. అలా అని నెక్స్ట్ టైం నుండి ఆ షాప్ లొ దొంగతనం చెస్తామా.. రెండు మూడు సార్లు చూసి నచ్చకపొతే మానేస్తాం లేకపోతె వేరే చోట కొంటాం ఇంకా కాకపొతే తినడం మానేస్తాం అంతే కానీ స్వీట్లు అలవాటు అయిపోయి ఉన్నాం  అని దొంగతం చెయ్యం కదా... అలాగే విదేశాల్లొ లేక వేరే రాస్ట్రాల్లలొ ఉండేవాళ్ళు .. వాళ్ళకి దొరకని వస్తువులన్నీ అలానే దొంగిలించి తీసుకుంటామా... కొనగలిగితే డబ్బులు ఎక్కువిచ్చి కొనుక్కుంటాం ..లేక మళ్ళీ మన రాస్ట్రం వచ్చేవరకు ఎదురుచూసి ఇక్కడ  నుండి కొనుక్కెళతాం కదా ... మరి సినిమాలకి ఎందుకు ఇలా అంటే... ఇది దొంగిలించడం ఈజీ కాబట్టి .... రకరకాల వంకలు చెప్పి మరీ దొంగలిస్తాం. అలాగే మిగతావి దొరికితే ఇంతే ఈజీగా దొంగలిస్తాం. అందులో సందేహం లేదు.. అది మన నరనరాల్లో జీర్ణించుకుపొయిన  అవినీతి"

"యధారాజా తధాప్రజ" అన్నది రాచరికపు రొజుల నాటి నానుడి. "యధాప్రజ తధారాజా" అన్నది ఇప్పటి నిజం. మనమే ప్రతీ విషయం లో ఇంత స్వార్ధం తో నిజాయితీ లేకుండా అలొచిస్తుంటే ఇక మనల్ని రిప్రజెంట్ చేసే , మనం ఎన్నుకున్న నాయకులు ఇంకెంత స్వార్ధం  తొ ఆలోచిస్తారు.  డబ్బు, మద్యం, గిఫ్ట్లు లంచం తీసుకుని అవినీతి పరుల్ని ఎన్నుకునేది సామాన్య జనమే (మనమే). బోల్డు డబ్బులు ఖర్చుపెట్టి, లంచం ఇచ్చి ఓట్లు కొన్న నాయకులు నిజాయితీ గా పనిచెయ్యాలని కొరుకొవడం చాలా అత్యాశ , అన్యాయం కూడా. మరి ఆ లంచం తీసుకునేవాళ్ళకన్నా ఆ లంచం ఆశ చూపించేవారిదే తప్పు అనుకుంటే , మరి లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులకన్నా లంచం ఇచ్చే మనది తప్పు అన్నమాట. ఇదొక కరేప్షన్ సైకిల్ అన్నమాట... ఈరోజు లంచం ఇచ్చినవాడు రేపు వాళ్ళదగ్గరే తీసుకుంటాడు..ఆ మర్నాడు మళ్ళీ వాళ్ళకే లంచం ఇవ్వాల్సి రావచ్చు... ఆ సైకిల్ అలానే అనంతం గా సాగిపోతుంది.  ఒక రకంగా  ఈ సైకిల్ మన కల్చర్ లో భాగం అయిపొయింది. కొత్త సాఫ్ట్వేర్ మార్కెట్ లోకి రాగానే పాస్వర్డ్ బ్రేక్ చేసేవారిని మహా తెలివైన వాళ్ళగా పోగుడుతాం, డబ్బులిచ్చి ఒరిజినల్ డివిడి కొన్నవాడిని తింగరొడిని చూసినట్టు చూస్తాం. అది ఇప్పటి కల్చర్ ..

ఒక్కడు లక్ష రూపాయిలు ప్రబుత్వ సొమ్ము దోచేస్తే ఎంత నస్టమో, లక్ష మంది ఒక్కొకరు ఒక్కో రూపాయి చొప్పున దొచినా అంతే నస్టం. అయితే రూపాయి ఎవరికీ కనిపించదు.... అది తప్పు లా అనిపించదు....  


నేను మారను కానీ నా పక్క ఉన్నవాళ్ళు అందరు మారిపోవాలి అన్న ఆలోచనలో ఉన్నంతకాలం  ..ఎంతమంది అన్నా హాజారా లు వచ్చినా ఉపయోగం లేదు... ఏదో కొన్నాళ్ళు హడావుడి తప్పించి.... 

మనం చేసే అవినీతి గురించి ఆలోచన లేకుండా ,  సమాజం మాత్రం అవినీతి రహితం గా ఉండాలనుకోవడం , దానికి పాదయాత్రలు చెయ్యడం, నిరాహార దీక్షలు చెయ్యడం, లెక్చర్లు దంచడం కన్నా అత్మ వంచన ఇంకేమీ లేదు. అన్నా హాజారే కి లక్షకోట్లు తిన్న జగన్, రెండువేల ఎకరాలు ప్రబుత్వ రేట్ కి జాక్ పాట్ కొట్టిన రామోజీ రావు   మద్దతు ప్రకటిస్తుంటే ఎంత కామెడీ గా ఉందొ ... మనం మద్దతు ప్రకటించినా అలానే ఉంటుంది....

ఈ రొజు సమాజానికి కావాల్సింది మన నిరాహారదీక్షలు, ఊరేగింపులు కాదు.... ప్రతీ మనిషిలో ఒక చిన్న రిజల్యూషన్. ఈ రొజు నుండి ఈ పర్టిక్యులర్ అవినీతి నేను త్యజిస్తున్నా ... ఈ తప్పు నేను మళ్ళీ చెయ్యను అని.... సంఘానికి పూర్తి వ్యతిరేకంగా ఎదురీదుతూ అపర నిజాయితి పరుడిగా ఒక్కరొజే మారిపొనక్కర్లేదు....మారలేం కూడా...  అయితే మనకి చేతనయినంతలొ... మనం కొంచెం కస్టం తొ చెయ్యగలిగినవి చెయ్యగలిగితే చాలు.... మార్పు చాలా స్లొగా వస్తుంది. అయితే ఆ మార్పు ముందు ఎదుటివాడి నుండి ప్రారంభం అవ్వాలనుకోకుండా... మననుండి ప్రారంభం అవ్వాలని నిర్ణయించుకొవడమే నిజమయిన దేశభక్తి...

ఏ రకం గా చూసిన ముందు మారాల్సినది మనం. ఇది ఒక అవకాశం ... ఈ రోజే చిన్న నిర్ణయం తీసుకుందాం. వీలయినప్పుడల్లా ఒక్కో అవినీతి మార్గం వదిలేస్తూ పోదాం. కొన్నాళ్ళకి అంటే కనీసం ఒకటి రెండు తరాల తరువాతివారికయినా నిజాయితీ  విలువ పూర్తిగా అర్ధం అవుతుంది.

జై హింద్
మంచు 
----
అకుంఠిత దీక్షతొ , పట్టుదలతొ ఇన్ని కొట్లమంది సొదరసొదరీమణులకు ఈ విషయం పై అవగాహన కల్పించి అలొచింపచేస్తున్న అన్నా హజారే కు ధన్యవాదాలు తెలుపుతూ ...

49 comments:

శ్రీనివాస్ said...

పచ్చి నిజాలు , అక్షరసత్యాలు. నిజమే! కావాల్సింది ప్రతీ మనిషిలో ఒక చిన్న రిజల్యూషన్ .

అందరూ మంచిని చూడాలి అనుకుంటున్నారు కానీ మంచిగా ఉండాలనుకోవడం లేదు. కానీ అందరూ కాకపోయినా కొందరైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

సిరిసిరిమువ్వ said...

Excellent post. అందరిలో రావల్సింది ఈ ఆలోచనే! మనకి తెలియకుండానే అవినీతి మన నరనరాన పాతుకుపోయింది...మనం అవినీతికి దూరంగా ఉందామన్నా ఉండలేని పరిస్థితి..ఎవరు దీనికి కారణం అంటే తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు అందరం బాధ్యులమే.

ఇది ఎలా మొదలయ్యింది్ అన్నది సమాధానం లేని ప్రశ్నే! ప్రతి వాళ్లం రాజకీయనాయకుల్ని ఆడిపోసుకునేవాళ్ళమే! మీరన్నట్టు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు అన్నవారు ఎక్కడో పైనుండి దిగిరాలేదు..వాళ్లంతా మనమే..మనలో ఓ భాగమే!

ఈ పరిస్థితిలో మార్పు రావాలి. మన పరిధిలో మనం వీలయినంతవరకు నిజాయితీగా ఉందాం.

నిన్న ఇందిరా పార్కు దగ్గర కొంతమంది యువకుల ఉపన్యాసాలు విన్నాక పర్లేదు జనాల్లో మార్పు వస్తుంది అన్న నమ్మకం కలిగింది. చిన్న చిన్న పిల్లలు బాధ్యతాయుతంగా..ప్రస్తుత పరిస్థితులపై మంచి అవగాహనతో మాట్లాడుతుంటే ఎక్కడో అశ..వాళ్ళ ఆలోచనలు...భావాలు వింటుంటే పరిస్థితులు తప్పక మారతాయి అని ఓ నమ్మకం..ఈ చైతన్యం కలిగించిన అన్నా హజారేకి నిజంగా మనందరం ఋణపడి ఉండాలి.

ఈ చైతన్యం ఇంతటితో ఆగకూడదు..ఓ నిరంతర స్రవంతి కావాలి.

శివరంజని said...

పోస్ట్ అంతా కాపీ పేస్ట్ చెయ్యలేక చివరి పేరా మాత్రమే పేస్ట్ చేస్తున్నా

<<<<<<<<<< ఏ రకం గా చూసిన ముందు మారాల్సినది మనం. ఇది ఒక అవకాశం ... ఈ రోజే చిన్న నిర్ణయం తీసుకుందాం. వీలయినప్పుడల్లా ఒక్కో అవినీతి మార్గం వదిలేస్తూ పోదాం. కొన్నాళ్ళకి అంటే కనీసం ఒకటి రెండు తరాల తరువాతివారికయినా నిజాయితీ విలువ పూర్తిగా అర్ధం అవుతుంది >>>>>>>>


...చాలా చక్కగా చెప్పారు........మార్పు అనేది ముందు మనతోటే మొదలవ్వాలని

Anonymous said...

Yes, we are all corrupt sometime or other just because we are born and brought up in such society. But, nothing wrong in our intention to have a clean society. What I mean to say is, our right intentions shouldn't be discouraged or snubbed by throwing cold water on our enthu.
Better late than never. I strogly feel it is only because of politicians we are in such sorry state.

Once I was travelling in AP Exp and saw two PCs with a hand-cuffed prisoner travelling with me to somewhere in Adilabad from Hyd. In conversation I came to know that the allowance of the PCs is not sufficient to buy a railway meal for a day! How can we stop those PCs from not using their uniform to beg/rob hawkers for their food? It disturbed my thoughts till I reached Delhi.

Good article.

Anonymous said...

Can I get a copy of Mathlab too? Can you upload that to rapidshare or torrent or can I pick that from you?

స్నేహ said...

చాలా బాగా చెప్పారు. అన్నా హజారే గారు నిరాహారదీక్ష చేస్తున్నారు అన్న విషయం తెలిసినప్పటి నుండి ఇవే ఆలోచనలు. మన పని అయితే చాలు అని డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటాం మన స్థాయికి తగ్గ అవినీతి మన చేస్తున్నాం. మనమే రాజకీయ నాయకులు మారాలి అంటాం. ఎలాంటి మార్పు అయినా మనతోనే మొదలు కావాలి. మనం కోరుకున్న మార్పు రావాలంటే ఆ మార్పు ముందు మనలో రావాలి. ఎవరికి వాళ్ళం అవినీతి చిన్నదైనా పెద్దదైనా అందులో మనం భాగం కాకూడదు అని నిర్ణయించుకోవాలి.

ఈరోజు ఈనాడు లో సందీప్ పాండే గారి వ్యాసం చదివారా?

Anonymous said...

మనం మారాలి. నిజమే, కానీ వ్యవస్థలో అన్ని లోపాలు పెట్టుకుని మనం మారలేం.

అలాగే రాజకీయనాయకుల అవినీతిని కూడా ప్రజలు ఒక లిమిట్ వరకు చూసీ చూడనట్లే వదిలేస్తారు. ఇంతకాలం జరిగింది అదే. కాని ఇప్పుడు వాళ్ళు బరి తెగించి అన్ని సంపదలూ దోచుకుంటుంటే ప్రజలు విసిగిపోయారు.

జన లోక్ పాల్ వల్ల మేలు జరుగుతుందో లేదో కాని ఈ ఉద్యమం వల్ల మన భారతీయులు మేలుకునే ఉన్నారని, స్పందించే అవకాశం కోసం వేచి చూస్తున్నారని అర్థమయ్యింది.

గీతిక said...

చాలా పెద్ద పోస్ట్ అయినా చదివించగలిగింది.

మీ మాటల్తో నేను నూరుశాతం ఏకీభవిస్తాను. దీనికి కారణం... ఒక్కటే అని చెప్పలేం.. ఎన్నో. ముఖ్యంగా మనిషిలోని వద్దన్నదే చెయ్యాలన్న మనస్తత్వం, తప్పు అన్నది చేసిన తర్వాత పొందే థ్రిల్.

వీటికి అలవాటు పడ్డవాళ్ళని మనమే కాదు... వాళ్ళకు వాళ్ళనే మార్చుకోలేరు.. అనుకుంటున్నాను.

కానీ_ ఒకళ్ళతో పెట్టుకోకుండా, ఎదుటివారితో పోల్చుకోకుండా మంచీ చెడూ అని ఆలోచించేవాళ్ళు మనలో ఎంతమంది..?

ఇన్నాళ్ళూ.. లోలోపలి వ్యక్తిత్వం వ్యతిరేకిస్తున్నా తప్పదు కాబట్టి ఇలాగే బ్రతుకుతున్న కొందరితో పాటూ... కనీసం ఇకనుంచైనా మారదామనుకునే వారు పెరుగుతారని ఆశిద్దాం.

గీతిక బి

Anonymous said...

నాదీ సేం ఫీలింగ్.

Anonymous said...

అన్నా హజారే గారు ఎండమావులనుండి నీటిని తేవడానికి పూనుకున్నారా??
=======================================================
అంతర్ముఖం అనే సీరియల్ ప్రతీ ఆదివారం వస్తోంది. అందులో యండామూరి అవినీతిని నిర్మూలిస్తాను అన్న వ్యక్తిని ఇలా అడిగాడు...

యండమూరి: మీరు ఎప్పుడైనా రైలు ప్రయానం చేశారా?
అతను: చేశాను.

యండమూరి: మీరెప్పుడూ సీటు కంఫర్మ్ చేసుకోవడానికి T.C డబ్బులివ్వలేదా?
అతను: ఇచ్చాను.

మరి, మీరు అవినీతిపై ఎలా పోరాడతారు. లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడకూడా నేరమే.
=====================================================

అవినీతిలో రాజకీయ నాయకులే కాదు.. ప్రజలు కూడా భాగస్వాములే.
ఇదీ నా బజ్జులో నేను రాసిన పోస్టు.
https://profiles.google.com/ulikipitta#ulikipitta/buzz

Anonymous said...

"యధారాజా తధాప్రజ" అన్నది రాచరికపు రొజుల నాటి నానుడి. "యధాప్రజ తధారాజా" అన్నది ఇప్పటి నిజం.

నాదీ సేం ఫీలింగు.. :)

నాగప్రసాద్ said...

మీరు చెప్పినదానితో నేను పూర్తిగా అంగీకరించలేను మంచుగారు....

యథా ప్రజ తథా రాజా అన్నా, యథా రాజ తథా ప్రజా అన్నా ఇద్దరూ కూడా మనుషుల్లోంచే, చుట్టూ ఉన్న సమాజం నుంచే వస్తారు. అది రాజైనా సరే, రాజకీయనాయకుడైనా సరే...

మనందరమూ నీతి, నిజాయితీగా ఉంటున్నప్పుడు మనకు నాయకుడనేవాడు ఎందుకు? మనల్ని మనం పరిపాలించుకోవడానికి మనం ఇన్ని రూల్స్ ఎందుకు పెట్టుకోవాలి అన్న కొత్త ప్రశ్న వస్తుంది...

ఏ సమజాంలోంచి వచ్చినా, నాయకుడనేవాడు ప్రత్యేకంగా ఉండాలనే కదా అందరూ కోరుకునేది... చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేసి, దారిలోపెట్టగల్గిన వాడే నాయకుడు...అటువంటి నాయకుణ్ణి ఎంచుకోలేకపోవడం మన చేతగానితనం...


నిజానికి మన సమాజంలో అవినీతిపరుల కన్నా నిజాయితీపరుల శాతమే ఎక్కువ... కానీ, వారికి రక్షణే కరువు అంతే...


ఒక పదిమంది రౌడీలు వచ్చి, మీ పీక మీద కత్తి పెట్టి...లంచం తీసుకుంటావా, చస్తావా అంటే మీరేమీ చేస్తారు? పోరాడతారా? లేక వాళ్ళ చేతిలో ప్రాణాలు వదిలేసుకుంటారా? లేక ఈ మాత్రం దానికి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు అని ఫైల్ మీద సంతకం పెట్టేస్తారా? చెప్పండి...ఇవన్నీ సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో జరిగే సంఘటనలు...

మీరు ఏదైనా గవర్నమెంట్ సంస్థలో కొద్ది రోజులు పని చేసి చూడండి...మీకు లంచం తీసుకోవడం ఇష్టం లేకపోయినా, బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఎంతవద్దనుకున్నా ఆ లంచాలకు సంబంధించిన ఫైల్స్ మీ చేతులమీదుగానే నడుస్తుంటాయి. మీరు తీసుకోనంటే ఎవ్వరూ ఒప్పుకోరు...అలాగని లంచం తీసుకోకుండా మీరు ఆ పనులు అడ్దుకుందామనుకుంటే, తర్వాతి రోజు మీరు భూమ్మీద ఉండరు...నాది గ్యారెంటీ.

అసలు మీరు నేను పనులు అడ్దుకోను, లంచం తీసుకోను అన్నా ఒప్పుకోరు. చచ్చినట్లు తీసుకోవాల్సిందే...లేకపోతే టార్చర్ అనుభవిస్తారు.

సో, అది అసలు విషయం అక్కడ మొదలవుతుంది. అది మిగతా అన్ని చోట్లా కంటిన్యూ అయిపోతుంది.


మీకు ప్రభుత్వం ద్వారా చదువు, ఆరోగ్యం, తిండి సబ్సిడీ ధరకో లేదా పూర్తిగా ఉచితంగా అందుతుంటే మీరు ట్యాక్స్ సేవింగ్స్ కోసం కక్కుర్తి పడతారా చెప్పండి. ఇప్పుడూ అందుతున్నాయి, కానీ నాణ్యత లోపించింది. కానీ ఆ నాణ్యత ఎందుకు లోపించింది? అని ప్రశ్నవేస్తే పైన నేను చెప్పిన "లంచం తీసుకుంటావా-పీక కొయ్యమంటావా" అనే ఎపిసోడ్ సమాధానంగా కనిపిస్తుంది.

Anonymous said...

అయ్యబాబోయ్ ఏంటండీ ఇలా వాయించేసారు ( లెంపలేసుకుంటూ )

Anonymous said...

అయ్యబాబోయ్ ఏంటండీ ఇలా వాయించేసారు ( లెంపలేసుకుంటూ )

Padmarpita said...

ఉపయోగవంతమైన సమరానికి...
ఉత్తేజవంతమైన పోస్ట్...ఎంతమందిని
ఊపేస్తుందో మరి?????

కొండముది సాయికిరణ్ కుమార్ said...

ఈ రొజు సమాజానికి కావాల్సింది మన నిరాహారదీక్షలు, ఊరేగింపులు కాదు.... ప్రతీ మనిషిలో ఒక చిన్న రిజల్యూషన్.
===
Well said.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

Wonderful introspection! Every one must do this.
Excellent write-up.
W/Regards - Saikiran

Sravya V said...

బావుంది ! బాగా రాసారు infact మీ "కొంచెం గౌరవం " పోస్టు కన్నా ఇది వాస్తవానికి దగ్గరా ఉంది ! ఇక "యధాప్రజ తధారాజా" దీనితో 100 % ఏకీభవిస్తాను .
కానైతే ఇంత ఈజీ గా మన దేశం లో రూల్స్ అతిక్రమించే మనం పొరుగు దేశం వెళ్ళగానే పిల్లుల మారి , వాళ్ళ కన్నా ఎక్కువ గా రూల్స్ ఎందుకు పాటిస్తాం అంటారు :) అతి చట్టాలని అతిక్రమిస్తే ఏమి జరుతుందో మనకి బాగా తెలుసు కాబట్టి , అందుకే చట్టం సక్రమం గా ఉండాలి అన్న పోరాటానికి మద్దతు పలకాలి అంటాను .ఇక పైన మీరు చెప్పినట్లు మనలో మార్పు రావాలి , ఈ మార్పు మన దేశంలో లేట్ గా రావటానికి కారణాలు కోకొల్లలు . మన జీవన విధానం కూడా ఒక కారణం . మనం ఎవడి కడుపు కొట్టి అయినా సరే మన పిల్లల భవిష్యత్తు , లేదా మన వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అన్న దుగ్ద దీని మూలం గా వచ్చిందే . ఇక అధిక జనాబా వల్ల ఉన్న వనరుల కోసం పోటీ , భవిష్యత్తులో కనీస అవసరాలు అన్నా తీర్చుకోగాలమో లేమో అన్న అభద్రత తో ఎలాగన్న సంపాదించుకోవాలి అని ఆలోచించటం ఇలాంటి సామాజిక కారణాలు అనేకం .
నా వంతు గా నేను మాత్రం ఈ పోస్టు చదివిన కొన్నిసార్లు కకుర్తి పడి చూసే పైరసీ సినిమాలు ఇక మానెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నా :)

నాగప్రసాద్ గారు మీ కామెంట్ తో నేను కొంచెం వరకు ఏకీభవిస్తాను , కాకపొతే ఈ అవినీతి , లంచగొండి తనం ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాత్రమే అంటగట్టడం కొంచెం అన్యాయం :)
ఎవరూ తక్కువ కాదు , ఇప్పుడు ఎలా ఉందొ నాకు అంతగా తెలియదు గాని , ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం మీకొక IT కంపని లో ఉద్యోగం రావాలంటే HR కి ఒక లక్ష నుంచి 2 లక్షల దాకా ఇస్తే చాలు ఉద్యోగం వచ్చే కంపనీలు బోలెడు , వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు , నిన్న గాక మొన్న జరిగిన 2G స్పెక్ట్రం కుంభకోణం లో లబ్దిదారులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కారు . ఇక కనీస నాణ్యత లేని ఉత్పతులు మార్కెట్టు విచ్చల విడి గా దొరకటం లో , ప్రవేట్ మెడికల్ కాలేజీ లు , హాస్పిటల్ల లో జరిగే మోసాలు ఇవి :)
కాబట్టి ఆవకాశం ఉన్నవాళ్ళు ఎవరు ఆ మార్గం లో పోవటానికి పెద్ద గా భయపడటం లేదు :)

మురళి said...

నేను మారను కానీ నా పక్క ఉన్నవాళ్ళు అందరు మారిపోవాలి అన్న ఆలోచనలో ఉన్నంతకాలం ..ఎంతమంది అన్నా హాజారా లు వచ్చినా ఉపయోగం లేదు... Agreed

కొత్త పాళీ said...

Absolutely friggin brilliant.
We need to distill this - whatever emotion that is causing ordinary citizens to wake up and take notice this very moment - we need to distill this into identifiable and achievable goals. Otherwise, the enthu will dissipate in few days/weeks and all that remains is political thamasha

Anonymous said...

మొత్తం ఏకీభవించలేను. చట్టంలో లోపాలు. ప్రజలు చాలా మంచివాళ్ళేమో అనిపిస్తుంది. వాళ్ళకు అవసరం అయినంతవరకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఉదాహరణకి ఒక హత్య చేసినాకూడా మనదేశంలో తప్పించుకోవడం చాలా సులువుగా ఉంది. ఇంత సులువుగా వేరే దేశాల్లో ఉంటే ఒక్కరోజులో సగమ్మంది చస్తారు.

కొత్త పాళీ said...

శ్రావ్య గారు, ఈ సమస్యలో This or that అనే ఛాయిస్ లేదనుకుంటాను. రెండూ ఉండాలి - కఠినమైన చట్టమూ ఉండాలి, అలాగే వ్యక్తిగత మూలాల్లోనించీ మార్పు రావాలి. అమెరికా సమాజాన్ని కొంత స్టడీ చేశాక నేను అనుకుంటూ ఉండేవాణ్ణి - కనీసం ఓ లక్షో పదిలక్షలో డాలర్ల లాభం ఉంటుందనుకుంటే తప్ప, ఇక్కడ ఎవడూ పదికీ వందకీ కక్కుర్తి పడ్డు అని.

cheekati said...

Excellent post. Completly agree with you.

Anonymous said...

ఇప్పటివరకు ఈ తప్పులు నేను చేసాను. ఇక నుండి ఇండియా వెళ్ళినప్పుడు నీతిగా ఉండటానికి ప్రయత్నిస్తాను.గుడ్ రైటింగ్ సర్. కీప్ ఇట్ అప్.

Anonymous said...

:)) Anon 8:13PM.

మంచు said...

శ్రీనివాస్ : ధన్యవాదాలు. మనమందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ టపా ద్వారా నేను చెప్పాలనుకున్న పాయింట్ అదే ...

సిరిసిరిమువ్వ : >>>> మన పరిధిలో మనం వీలయినంతవరకు నిజాయితీగా ఉందాం >>>

Exactly... రాత్రికి రాత్రి 100% నిజాయితీపరులం అయిపొలేము. ఈ జాడ్యానికి ఇంతగా అలవాటుపడిపొయిన ఈ రొజుల్లొ అంత సులభం కాదు. అయితే ముందు "మనం చెయ్యగలిగినవి" చేస్తూ నిజాయితిగా ఉండటం లో ఉన్న సంతృప్తి అలావాటు చేసుకుంటే.. తరువాత ఆ సంతృప్తి మన చేత ఇంకొంచెం నిస్వార్ధమయిన పనులు చేయించడానికి తోడ్పడుతుంది.

రంజని: థాంక్యూ... ఇవి అందరికి తెలిసిన చిన్న చిన్న విషయాలే అనుకొ...

మంచు said...

snkr :
అవును మీరు చెప్పింది కరెక్టే... నా టపా ద్వారా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏమిటంటే... అవినీతి మీద పోరాటం సాగిద్దాం. అయితే ముందు ఆ పోరాటం మనతో మొదలు పెడదాం. తరువాత మన కుటుంభాన్ని సంస్కరిద్దాం. ఇంట్లో అవేర్నేస్స్ తెప్పించాక అప్పుడు సంఘం సంగతి చూద్దాం. తప్పనిసరి పరిస్థితులలొ లంచగొండులుగా మారడం మొదలయినవి చాలా కొన్ని సందర్భాలలో మాత్రమే జరిగే ఆవకాశం వుంది. అయితే అవి డీల్ చెయ్యడానికి చాలా సమయం ఉంది ... కానీ దాని కన్నా ముందు మనలో మనం చెయ్యాల్సిన చిన్న చిన్న సంస్కరణలు చాలా ఉన్నాయి అని నా అభిప్రాయం ...


anon@April 9, 2011 6:27 AM :

:-)) Sure. I can help you. Matlab 2007 version is installed on my laptop. You can come over to my house and work on my system as long as you wish. Please be my guest. :-))

స్నేహ గారు :
ధన్యవాదాలు
>>>ఎవరికి వాళ్ళం అవినీతి చిన్నదైనా పెద్దదైనా అందులో మనం భాగం కాకూడదు అని నిర్ణయించుకోవాలి... >>>
అవును... ముందు చిన్న చిన్న వాటితో ప్రయత్నిద్దాం.

మంచు said...

బోనగిరి గారు: ధన్యవాదాలు.
మీ కామెంట్ >>>నిజమే, కానీ వ్యవస్థలో అన్ని లోపాలు పెట్టుకుని మనం మారలేం >>> ఇదే మనం మార్చుకోవాల్సినది అని నా అభిప్రాయం.
వ్యవస్థ వేరు మనం వేరు కాదు. మనం మారితే వ్యవస్థ మారుతుంది కానీ వ్యవస్థ మారితే మనం మారడం కాదు. లోపాలు మనలో ఉన్నాయి.... అనుకున్న వెంటనే మనం బారతీయుడులా మారిపోనవసరం లేదు.. చిన్న చిన్న వాటితో మొదలు పెట్టొచ్చు...

అవినీతికి లిమిట్ లేదండి... ఈ లిమిట్ లోపు అవినీతి ఎక్సప్టబిల్ అని చెప్పడానికి. నేను ఒక వ్యాక్యం రాసాను చూడండి...

" ఒక్కడు లక్ష రూపాయిలు ప్రబుత్వ సొమ్ము దోచేస్తే ఎంత నస్టమో, లక్ష మంది ఒక్కొకరు ఒక్కో రూపాయి చొప్పున దొచినా అంతే నస్టం. అయితే రూపాయి ఎవరికీ కనిపించదు.... అది తప్పు లా అనిపించదు.... "

ఈ చైతన్యం ముందు మనలో నింపుకుందాం అన్నదే ఈ టపా ముఖ్య ఉద్దేశ్యం...


anon @April 9, 2011 8:42 AM :
థాంక్యూ...:-)

గీతిక గారు :
ధన్యవాదాలు.

"ఒకళ్ళతో పెట్టుకోకుండా, ఎదుటివారితో పోల్చుకోకుండా మంచీ చెడూ అని ఆలోచించేవాళ్ళు మనలో ఎంతమంది..?"

ఇది చాలా ముఖ్యమయిన పాయింట్.

మంచు said...

ఉలికిపిట్ట గారు:
ధన్యవాదాలు.... మీరు మంచి ఉదాహరణ ఇచ్చారు. ఇది మిగతా కొన్ని కామెంట్స్ కి వివరణ ఇవ్వడానికి తోడ్పడుతుంది

రైళ్ళలో ఫ్రీక్వెంట్ జర్నీ చేసేవాళ్ళలొ చాలామంది ఎప్పుడో ఒకప్పుడు టి సి డబ్బులు ఇచ్చి సీట్ సంపాదించిన వాళ్ళే. అయితే దీంట్లో రెండు రకాలు.

1) సీట్ / బర్త్ ఖాళీ ఉన్నా లంచం ఆశించి పీడించే టి సి లతో మనం ఏం చెయ్యలేదు... ప్రస్తుతానికి... ఈ రోజుల్లో అక్కడ లంచం ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు..

2) అప్పుడప్పుడు షార్ట్ డిస్టెన్స్ ప్రయాణిస్తున్నప్పుడు ... స్లీపర్ బోగీలలో ఎక్కి ...మనం వెళ్ళాల్సిన ఊరు కోటా సీట్లలో ప్రయాణిస్తూ ఉంటాం... అప్పుడు టిసి తో ఆ స్టేషన్ వరకూ రిజర్వేషన్ రుసుం చెల్లించి స్లీపర్ టికెట్ రాయించుకొవచ్చు .... లేకపోతే... ఎంతోకంత చేతిలో పెడితే వాడే చూసి చూడనట్టు వదిలేస్తాడు....అప్పుడు జనరల్ టికెట్ తోనే ప్రయాణించవచ్చు.... అది మన చేతుల్లో పని. కేవలం మనలో నిజాయితీ మీద డిపెండ్ అయి ఉన్న పని. ఇక్కడ ఎవరూ మన మెడ మీద కత్తి పెట్టరు.

నేను ఈ టపా ద్వారా చెప్పాలను కున్నది. ముందు పైన చెప్పిన రెండో పాయింట్ లో ఉన్నది నివారిద్దాం.... ఆ తరువాత కొన్నాళ్ళకి మొదటి పాయింట్ ని ఎదుర్కుందాం. ఇక్కడ కామెంట్ చేసిన కొంతమంది ఫ్రెండ్స్ కి ఈ తేడా అర్ధం కాలేదు.... అందుకే అందరికీ ఈ ఉదాహరణ ఇచ్చింది.

మంచు said...

నాగ : ఏకీభవించను అంటూ ఎకీభావించావ్ :-) అయితే నేను రాసిన టపా లో మెయిన్ పాయింట్ మాత్రం అర్ధం చేసుకోలేదు. ఈ పేరా ఒకసారి చదువు

>>>>>
సమాజంలొ ఒక అంతర్భాగం అయిపొయిన ఈ అవినీతికి నేను ఒక్కడిని ఏం చెయ్యగలను అని.... లంచం లేకుండా ఇప్పుడు ఏమి పనులు జరుగుతున్నాయ్ అని ... సరే ..మనం అందరం అన్నా హజారే లా నిరాహార దీక్షలు చెయ్యలేం... అపరిచితుడులో రామం లా అందరిలో ఆడ్ పర్సన్ లా బ్రతకలేం ... అది కరెక్టే కానీ... మనకి కుదిరేవి, చేయ్యగాలిగినవి నిసవార్ధం గా నిజాయితీగా మనం ఎన్ని చెయ్యగలుగుతున్నాం.
>>>>>

నువ్వు చెప్పిన ప్రభుత్వ అధికారుల ఉదాహరణ మన రోజువారి జీవితం లో మనం పాల్పడే అవినీతిలో చాలా తక్కువ శాతం. రేషన్ కార్డులకి , డ్రైవింగ్ లైసేన్సులకి, రుణాల మంజూరికి ... ఇలాంటి ఎన్నో ప్రభుత్వ ఆఫీసులో పనులకు మన చేతుల్లో ఏం లేదు. వాటికోసం జీవితాంతం సింగిల్ గా పోరాడుతూ కూర్చోలేం ... అందుచేత ప్రస్తుతానికి అది పక్కన పెడదాం... ముంచు చిన్న చిన్నవి చూద్దాం. పైరేటెడ్ సినిమాలు చూడటానికి ఎంతమంది మన కంఠం మీద కత్తి పెడుతున్నారు. పూర్తిగా న్యాయబద్ధం గా టాక్స్ కట్టడానికి ఏమి అడ్డంకులున్నాయి మన స్వార్ధం తప్ప... పైన ఉలికిపిట్ట గారికి ఇచ్చిన ఉదాహరణ చూడూ ... అక్కడ నువ్వు చెప్పింది మొదటి పాయింట్ లోని ఉదాహరణ... నేను చెప్పేది రెండో పాయింట్ లోని ఉదాహరణ... చాలా తేడా ఉంది. మనం చెయ్యగలిగినవి ముందు చేద్దాం. తరువాత అదే అలవాటు అవుతుంది. మార్పు నెమ్మదిగా మొదలవుతుంది.

ఇక యథా ప్రజ తథా రాజా గురించి... ఒకప్పుడు రాజులు రాజ కుటుంభాల నుండి వచ్చిన వారు. ప్రజలకు ఇష్టమున్నా లేకున్నా మార్చలేరు. వాళ్ళని ప్లీజ్ చెయ్యడమే అప్పటి ప్రజలకి బ్రతుకు తెరువు... రాజు చెడ్డవాడు అయితే... ఆ చెడ్డ రాజును ప్లీజ్ చేసుకోవాలంటే ప్రజలి చెడ్డ చెయ్యాలి. ఇప్పుడు ఆ పరిస్తితి లేదు... ఎన్నుకోవడం దింపడం మన చేతుల్లో ఉంది. ఈ రోజు ఈ రాజకీయ నాయకులు ఆన్న హజారే విషయం లో ఎందుకు దొంగ నాటకాలు ఆడుతున్నారు. ప్రజల దృష్టిలో చెడ్డ కాకూడదు అని. ఇక సమాజం లో అందరూ నిజాయితే పరులే ఉండటం అన్నది జరగని పని. అయితే మంచినీళ్ళు తాగినంత ఈజీగా ఈ జంకు గొంకు లేకుండా అవినీతికి పాల్పడటం ... ఆ అవినీతి చెయ్యని వాడిని తింగొరిడిగా చూడటం మన కల్చర్ లో బాగం అయిపొయింది. అది మార్చాలి.... ప్రస్తుతం అవినీతి మన కల్చర్ లో బాగం అయిపొయింది.

టాక్స్ సేవింగ్స్ అన్నది ప్రబుత్వమే కల్పించిన సౌకర్యం... అయితే అది దొంగ మార్గం లో సేవ్ చెయ్యాలను కోవడం (ఎగ్గోట్టాలనుకోవడం) దిగజారుడుతనం ...

మంచు said...

లలిత గారు :
నచ్చలేదా .. వాయించేసా అంటున్నారు :( టపా పెద్దది అయిపొయింది అని మద్య మద్య లో కొన్ని పాయింట్స్ తీసేసా.... సో కొంచెం కంటిన్యుటి మిస్ అయినట్టు ఉంది.

పద్మార్పిత గారు :
ధన్యవాదాలు. :-))

కొండముది సాయి కిరణ్ కుమార్ :
ధన్యవాదాలు బ్రదర్ ... మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను.

శ్రావ్య :
ధన్యవాదాలు . మీతో ఏకీభవిస్తాను ... మీ కామెంట్ కి కింద కొత్తపాళీ గారు ఇచ్చిన రెప్లై నాది కూడా ..

ఇక పాత పోస్ట్ లతో దీనికి కంపేరిజన్ ? ...ఆయా పరిస్తితుల మీద, సమస్యల మీద సమగ్ర అవగాహన ఉంటే తప్ప ఏది వాస్తవికతకు దగ్గరగా ఉంది అన్నది చెప్పలేం. ఆ టపా కి ఓవరాల్ గా (మెజారిటీ గా) వచ్చిన వాఖ్యలనుని బట్టి నా ఆలోచనలు సరిగ్గానే వెళ్తున్నాయి ఆన్న నమ్మకం కలిగింది. అయినా పాత పోస్ట్లగురించి డిస్కషన్ వద్దు ఇక :-))))))

మురళి గారు : ధన్యవాదాలండీ :-)))

కొత్తపాళీ గారు : చాలా రోజుల తరువాత విచ్చేశారు :-)) ధన్యవాదాలు సార్ . ఇక మీరు వెళ్ళబుచ్చిన అభిప్రాయాల గురించి ......completely agree with you. నేను చెప్పాలనుకున్నది మీరే చెప్పేశారు

anon @ April 9, 2011 2:14 PM : ప్రజలు మంచివాళ్ళేనండి :-) అసలు మనం రోజువారి చేస్తున్నా పనుల్లో ఎంత అవినీతి ఉన్నదో తెలుసుకోలేనంత అమాయకులు. ఇక మన చట్టాలగురించి, మిగతా దేశాల ప్రజల గురించి మీరు అనుకుంటున్నది చాలా తప్పు... అది మాత్రం ఖచ్చితం గా చెప్పగలను :-)

చీకటి గారు : ధన్యవాదాలు ..

anon @ April 9, 2011 8:13 PM : ధన్యవాదాలు ... మీలో కొంచెం ఆలోచన కలిగించినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది.

snkr: :-))))

Anonymous said...

/ముందు పైన చెప్పిన రెండో పాయింట్ లో ఉన్నది నివారిద్దాం.... ఆ తరువాత కొన్నాళ్ళకి మొదటి పాయింట్ ని ఎదుర్కుందాం. ఇక్కడ కామెంట్ చేసిన కొంతమంది ఫ్రెండ్స్ కి ఈ తేడా అర్ధం కాలేదు..../
అవి రెండు వేరు వేరు అంశాలు. మొదటిది అవినీతిని ప్రోత్సహించడం, రెండోది సరైన టికెట్ లేకుండా ప్రయాణించడం, అంటే షాప్ లిఫ్టింగ్ లాంటిదన్నమాట. దేనికదే...
రెండోది ఒకలాంటి దొంగతనము, అవినీతి కాదు. అందులోనూ అవినీతి సొమ్మును బట్టి గ్రేడింగు, శిక్ష వుండాలి. థ్రిల్/కక్కుర్తితో టికెట్లేకుండా వెళ్ళిన వాళ్ళకు, ఫ్రాడ్‌తో టికెట్లు అమ్ముకునేవాడికి ఒకే శిక్ష అంటే కుదరదు.
అవినీతి అంటే అన్నీ కలిపేసుకుని పీటముడి వేసుకోవాల్సి మనచేత కాదు, అని వదిలేసుకోవడం కన్నా విడిగా చేసి పరిష్కరించుకుంటే సులభంగా వుంటుంది.

ఇగపోతే... 8:13పి.ఎమ్. అజ్ఞాత లోని నిజాయతి నాకు ముచ్చటేసింది. ఆ అజ్ఞాత కామెంటుకు 'అజ్ఞాత మేన్ ఆఫ్ ది పోస్ట్' అవార్డ్ మీ చేతుల మీదుగా ప్రదానం చేయాల్సిందే, లేదంటే నేనొప్పుకోను... అంతే! :)) ఒకర్నైనా(కాకుంటే కొంతమందిని) ఆలోచించేలా చేశారు, మీకు నెనర్లు.

మంచు said...

SNKR:
రెండొది దొంగతం లాంటిదే అండి... అయితే సరి అయిన టికెట్ లేకుండా ప్రయాణించడం ఒక తప్పు అనుకుంటే ... అది ప్రశ్నించకుండా ఉండటానికి టి సి కి ఇచ్చే లంచం పెద్ద తప్పు. అసలు అక్కడ లంచం ఇచ్చే ఫెసిలిటీ లేకపొతే నిజంగా దొంగతనం గా ప్రయాణించేవారి సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ మనకి డబ్బు మిగులుతుంది అని తప్ప ప్రబుత్వానికి ఎంత ఎగ్గొడుతున్నామో అలొచన రాదు. టిసి కి డబ్బులిచ్చాం.... వాడు కూర్చొమన్నాడు... అంటే మనం ఎమీ తప్పు చెయ్యలేదనే వరకే మన అలొచన ఉంటుంది కానీ ..అసలు ఇలా ప్రయాణించడం దొంగతనం అని ఎంతమంది కి అనిపిస్తుంది చెప్పండి....
అక్కడే మనం టిసి కి పూర్తి డబ్బు చెల్లించి టికెట్ రాయించుకొకుండా లంచం ఇచ్చి కూర్చొవడం లంచాన్ని ప్రొత్సహించడం కాదంటారా...
విశాఖపట్నం విజయవాడ మీదుగా వెళ్ళే రైళ్ళలొ ఇది చాలా కామన్... :-) 70-80 శాతం మంది చేసేది ఇదే

మంచు said...

8:13పి.ఎమ్. అజ్ఞాత విషయం లొ నేనూ కొంచెం సంశయించా :-) అయితే ఐపి చూసాక అది నన్ను ఆట పట్టించడానికి రాసింది కాదు అన్న నమ్మకం కలిగాకే ప్రచురించాను. :-))

Anonymous said...

Fine, give me your address.

మంచు said...

ఇదే అంశం మీద " సాహిత్య అభిమాని బ్లాగ్ శివ గారు " రాసిన టపా

ఇక్కడ

Saahitya Abhimaani said...

@MAMCHU

Excellent piece of writing. Well Written with apt examples. The kind utterances made before the TV Cameras during the last week are mind boggling and I am just flabbergasted. Are we all so honest and only Politicians are corrupt and they only need to be controlled and punished?! Nay! all of us in one way or other corrupt in many ways. Politicians are nothing but a reflection of majority of us. After all we are in democracy. Thanks for giving link for what I wrote in my blog.

Saahitya Abhimaani said...

ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ కొలను వెంకట దుర్గా ప్రసాద్ (బాబు) గారు తన స్వంత బ్లాగ్ "బాబు కార్టూన్స్" లో తాను 1987 లో వ్రాసిన కథ పున:ప్రచురించారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి అదే. అవినీతి ఎక్కడో ఉన్నదని అందరి ఊహ. కాని నిజానికి అవినీతి ఎక్కడ లేదు? ఈ కింది లింకుతో ఆ కథ చదవగలరు.

http://babucartoon.blogspot.com/2011/04/blog-post_5596.html

ఆ.సౌమ్య said...

చాలా బావుంది, బాగా రాసారు. మొన్న మా స్నేహితులతో కుడా ఇదే రకమైన చర్చ జరిగింది. సమాజంలో అడుగడుగునా అవినీతి పాతుకుపోయింది. ఈ మధ్యనే జరిగిన ఒక చిన్న సంఘటన ...మేమేదో ఇంటికి ఫర్నీచర్ కొనాలని దుకాణం కి వెళ్ళాం. నచ్చినది తీసుకుని డబ్బు చెల్లిస్తూ బిల్లు కావాలని అడిగాం. వాడు బిల్లు ఇవ్వను అన్నాడు. మేము కావాలని పట్టుబట్టాం. బిల్లు ఇవ్వాలంటే మీరు 12% సర్వీసు టేక్స్ ఇవ్వల్సి ఉంటుంది ఎందుకండీ మీకు డబ్బులు దండగ....బిల్లు పెట్టుకుని ఏం చేస్తారు. వదిలేయండి అన్నాడు. మేము ఒప్పుకోలేదు. ఎక్కువ డబ్బులైనా పరవాలేదు. మేము టేక్సు కడతాం అని చెప్పి బిల్లు తీసుకున్నాం. వాడు మాకు బిల్లు ఇస్తే వాడు అవి అన్నీ టేక్సు కట్టినప్పుడు చూపించాల్సి వస్తుంది. అందుకే ఎగ్గొట్టాలని చూసాడు.

మొన్నటికి మొన్న మా ఫ్రెండు అద్దె ఇంటి కోసం ఏజెంటు ని కలిసాడు. ఇల్లు దొరికింది, ఏజెంటు కి ఇవ్వల్సిన డబ్బులు చెక్ ఇస్తానంటే వాడు వద్దన్నాడు. చెక్ వద్దు సార్, కేష్ ఇచ్చేయండి....రేపు నేను టేక్సు ఫైల్ చెయ్యలి. ఇప్పుడు మళ్ళీ చెక్ అంటే అనుద్లో కలుపుకోవాలి అన్నాడు. ఇలాంటివి అడుగడుగున బోలెడు కనిపిస్తాయి. గవర్నమెంటు ఆఫీసుల వరకూ ఎందుకు, స్కూళ్లలోలేదా ఆస్పత్రులలో లేదా అవినీతి? మన కాలు పెట్టే ప్రతీ చోటా ఉంది.

నా వంతుగా పైరసీ సినిమాలు చూడడం తగ్గిస్తాను, పూర్తిగా మానడానికి ప్రయత్నిస్తాను (ప్రస్థుతానికి ఇదొక్కటే నాకు గుర్తొస్తున్న అవినీతి). కాకపోతే ఇక్కడో చిన్న విషయం. ఆ సినిమాలు అందరం డౌన్ లోడ్ చేసుకుని మాత్రమే చూస్తున్నాం కానీ అప్ లోడ్ చెయ్యట్లేదు కదా. అంటే సగం మంచివాళ్లమేనేమో కదా :D. అప్ లోడ్ చెయ్యకపోతే చూడము కదా. ఈ మధ్య తెలుగు సినిమాల పైరసీలు దొరకడం లేదు. కాబట్టి చూడట్లేదు కూడా. :P దొరికినా చూడకుండకుండా ఉండే ప్రయత్నం చేస్తాను.

ఈ రకమైన అలజడి ప్రతీవారిలో కలగడం గొప్పవిషయం. ఇదే అన్నా హజారే సాధించిన విజయం. మార్పు అన్నది ప్రతీవారిలోనూ రావాలి. కానీ మీరు ఏమైనా అనండి ఆ చంద్రబాబు, జగన్ ఇంకా మిగతా నాయకులు అన్నా హజారేకి సంఘీభావం పలుకుతున్నారంటే మాత్రం ఒళ్ళు మండిపోతున్నాది.

Anonymous said...

మంచు గారు,
మీలాంటి వారు ఇలా అవినీతి మీద గోడవ చేస్తారనే సిటిలలో దానిని పేరుని రూపుమాపి ఇప్పుడు కొత్త పేరు "పేకేజ్" అని పెట్టారు. పేకేజ్ అంటె ఒక పని కి అయ్యే ఖర్ర్చుని మీరు మొత్తంగా ఇచ్చేస్తే మీకు కష్ట్టం లేకుండా, ఎక్కడికి వేళ్ళకుండా, ఒక వేళ వెళ్ళినా మీకు మొదటి ప్రిఫెరెన్స్ ఇచ్చి, అపాయింట్మెంట్ సమయానికి ప్రభుత్వ ఆఫీసుకు పోతే మీచేత ఒక సంతకం పెట్టించుకొని మీ పనిని చేసేస్తారు. మనకు ఒక పని ఉందనుకోండి మనం మిత్రులను, బంధువులను అడిగితే వారు మొదట చెప్పేది ఇటువంటి వారి గురించే. కొత్త ఇంటిని కొన్నా బిల్డరే చెప్పేస్తాడు ఈ పేకేజ్ మొత్తం గురించి.
-----------------------------------------------
ఇది ఎంత గా ముదిరి పోయిందంటే మా బంధువుల ఒకరు చనిపోతే అంత్యక్రియలకు సిటిలో బరియల్ గ్రౌండ్ వాడి దగ్గర ఆపాయింట్మెంట్ తీసుకోవాలి దానిని అంత్యక్రియలకు చేయించే వారికి పేకేజ్ రూపంలో మొత్తం ఇస్తే ఇచ్చేస్తే వారే బరియల్ గ్రౌండ్ ని మైంటైన్ చేసే ఆఫిసువారికి ఇచ్చేస్తారు. అది ఇవ్వకపోతే ఆ రోజుకి పని జరగదు. అలా అవినీతి పేరు మార్చుకొని "పేకేజ్ "గా తయారైంది. మనం ఈ పేకేజ్ వద్దనుకొంటే రూల్స్ రామానుజం లాగా , Indian సినెమా లో ముసలి కమల్ లాగా అందరితో తగవులు పేట్టుకోవాలి. మేట్రో సిటిలు మన స్వంత ఊరు కాదు కనుక "పేకేజ్" లకు ఒప్పుకొని పనులు జరిపించుకోవటానికి ప్రాధాన్యతనిస్తాను.

Anonymous said...

ఒక ఘరాణా దాదా మాములు వసులు జనాల దగ్గర చెస్తు ఇవ్వని వారిని ఇబ్బంది పెడుతు ఆ డబ్బుని తన అనుచరులకి పంచి పెడుతున్నాడు అనుకొండి ఆ దాదా ని మాయ చెసి డబ్బులు యగ్గొట్టతం నేరం అవుతుంద

ఆ దాదా చెసే పనే ప్రబుత్వం చెస్తుంతె వాల్లకి పన్నులు యగ్గొట్టతం నేరం ఎలా అవుతుంది.

ఆ.సౌమ్య said...

ఇదో రకమైన అవినీతి

http://trishnaventa.blogspot.com/2011/04/blog-post_11.html

మంచు said...

శివ గారు: ధన్యవాదాలు మీ సపొర్ట్ కి

సౌమ్య గారు: మీరు బిల్లు గురించి రాసిన పేరా లొ వాటివే ముఖ్యం. ఇలాంటి ఉదాహరణలు ఒక్కొకరికి ఒక్కొలా ఉంటాయి కాబట్టి అవి ఉదాహరణగా ఇవ్వకుండా అందరికీ తెలిసిన ఈ పైరేటెడ్ సినిమాల గురించి కొద్ది ఎక్కువ రాసాను అంతే :-)

మంచు said...

శ్రీకర్ గారు: అవును మీరు చెప్పింది నిజమే... ఇంచుమించు ఇలాంటి విషయం మీదే గతం లొ ఒక బజ్ రాసాను . ఈ కింద లింక్ లొ చూడండి.
బజ్ లింక్

మంచు said...

అనానిమస్ గారు... మీరు ఎం చెప్పాలను కున్నారొ నాకు సరిగ్గా అర్ధం కాలేదు. ప్రబుత్వానికి పన్నులు కట్టొద్దు అని పిలుపునిస్తున్నారా :-)

సౌమ్య గారు: తృష్ణ గారి టపా చూసాను :-)) బజ్ లొ దీనిమీద పెద్ద చర్చే నడిచిందనుకుంటా కదా..:-)

ప్రకృతి కాంత said...

honest, sincere and realistic. proud of you annaa :)

మంచు said...

థాంక్యూ రా ...:-))

Vamsi Maddipati said...

మంచు గారు

మీ పోస్ట్ చాలా బాగుంది, కాని ఎంతవరకు ఆచరణీయం....?, మనం మారము...ఎన్నటికీ...ఎప్పటికీ...........

ఒక చిన్న ఉదాహరణ..... నాకు బాగా తెలిసిన ఒక సమాజ ప్రేమికుడు, సామాజిక కార్యకర్త అవినీతిపై పోరాడటానికి ఒక యువజన స్వచ్చంద సంస్థను ప్రారంబించాడు, ఆ స్వచ్చంద సంస్థ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసాము, ఆయన సమర్పించిన కొన్ని పత్రాలు సరిగా లేవని సంబందిత అధికారి మా దరఖాస్తు తిరస్కరించాడు... చివరికి ఒక మంత్రిగారి అబ్బాయి రికమెండేషన్ తో ఒక ఐదు వేల ఖర్చుతో మా సంస్థ రిజిస్ట్రేషన్ పూర్తైంది......

అంటే అవినీతిపై పోరాడటానికి అవినీతితో మొదలైన సంస్థకి అర్హత ఉందా.....? లేక ఆయన చేసిన పని రాబిన్ హుడ్ లా మంచి చేయటానికి తప్పు చేసినట్టు సమర్థించుకోవాలా...?

మయూఖ said...

అవినీతి అనేది ముందు అతి వినయం లో నుండి ,తర్వాత కాకా పట్టడం లో నుండి పుడుతుంది.ఒక ఆఫీసులో కానీ లేక ఎక్కడైనా గానీ ఒక సబార్డినేట్ ఒక ఆఫీసర్ ను కాకా పడుతున్నాడంటే, ఆ సబార్డినేట్ ఆ ఆఫీసర్ నుండి తనకు అధికారికంగా అర్హమైనవి కాకుండా అనర్హమైనవి పొందడం కోసం అని అర్థం.ఉదా:-ఆఫీసుకు లేటుగా రావడం ,పనిని తగిన సమయములో పూర్తి చేయకపోవడం ఇలా మెల్లగా మొదలవుతుంది.అదే ఆఫీసులో చాలా కరెక్ట్ గా పని చేసే ఇంకొక సబార్డినేట్ ఆఫీసర్ ను కాకా పట్టడు.ఇది ఆఫీసర్ కు నచ్చదు.అప్పుడు ఆఫీసర్ ఇతన్ని సతాయించడం మొదలవుతుంది.ఆ ఆఫీసర్ నిజాయితీ పరుడైతే అతను మొదటి వాణ్ణి ఎంకరేజ్ చేయడు.పనిని గుర్తిస్తాడు.కానీ చాలా సందర్భాలలో ఇది జరగదు.తప్పులను ఎత్తి చూపితే చాలా సందర్భాలలో అవినీతిని కొంత వరకైనా కంట్రోల్ చేయవచ్చు.

చాలా సందర్భాలలో ఒక వ్యక్తి లంచం అడిగితే తన కంటే పెద్ద ఆఫీసర్ దగ్గరికి పోతే సమస్య పరిష్కారం కావచ్చు.మేము ఈ మధ్య పొలం కొంటే ఆ పాస్ బుక్ పొందడం కోసం వి.ఆర్.ఒ దగ్గరికి వెల్తే ఆయన లంచం డిమాండ్ చేసారు.లంచం ఇచ్చేంత వరకూ పాస్ బుక్ ఇచ్చేది లేదన్నాడు.చివరికి నేను జిల్లాధికారిని టెలిఫోను లో సంప్రదించి విషయం చెప్తే ఆయన వెంటనే స్పందించి,సంబందిత ఎం.ఆర్.ఓ కు వెంటనే ఫోను చేసి సమస్యను పరిష్కరించారు.నేను ఒక్క రూపాయ ఇవ్వకుండా పాస్ బుక్ పొందగలిగాను.ఇప్పటికీ నిజాయితీ పరులైన అధికారులున్నారు.కానీ మన సమయం కొంచం వృధా కావచ్చు.ప్రజలు తమ పనులకోసం షార్ట్ కట్స్ ను విడిచి పెట్టి ,తమ హక్కులను భాధ్యతలను గుర్తిస్తే అవినీతిని పారదోలవచ్చు.ముందు తమ పనిని తాము సక్రమంగా చేయనోల్లు ప్రతి ఒక్కరూ అన్నా హజారే కి మద్దత్తు ప్రకటించేసారు.