Pages

Monday, January 24, 2011

కొంచెం గౌరవం ?

*** శ్రీ  రామ  ***


****************
మా ఊళ్ళో  ఎకరం పొలం ఖరీదు పది లక్షలు.

దానిమీద బ్యాంక్ వడ్డీ  చూసుకుంటే కనిష్టంగా ఏడాదికి డబ్బై వేలు  నుండి ఎనైబై వేలు మధ్యలో వస్తుంది. తుఫాన్ లొచ్చినా, భూకంపాలు వచ్చినా మనకి ఢొకా లేని ఆదాయం...ఇంట్లో కూర్చుని ఏం చెయ్యకుండా వచ్చే ఆదాయం కదా...

అదే పొలం సాగుచేస్తే.... కష్టం అంతా పోను రైతుకి ఎకరాకి సంవత్సరానికి మిగిలేది ఇరవై ఐదు నుండి ముప్పై వేలు. ఇది కూడా ఆ పంట వరదలు, తుఫాన్లు, పురుగు, చీడ, వర్షాభావం, గిట్టుబాటు ధర ఇవన్నీ దాటుకుని వస్తే మిగిలేది.

ఇక రైతు ఉద్యోగం లో ఎన్ని రిస్కులు ....

ముసురు పడితే పకోడీలు  తిందామా , బిరియాని చేసుకుందామా అని మిగతా ప్రపంచం అంతా ఆలోచిస్తున్న  టైం లో పంట ఏమైపోతుందా  అన్న టెన్షన్...  
ఎప్పుడు ప్రభుత్వం  సెజ్ పేరుతో  పచ్చని పొలం లాక్కుని ప్రభుత్వ కనీస ధర చేతిలో  పెడుతుందా అన్న టెన్షన్...
"ఏరా  మీ చేలో  ఆ సూరిగాడి ఆవుపడి మేస్తుంటే నువ్వేంటి ఇక్కడ తాపీగా కూర్చున్నావ్ " అని పక్కింటి రైతు హెచ్చరిస్తే  పరిగెట్టే టెన్షన్...
"ఈ ఏడాదికి ఇక వర్షాలు లేనట్టేనట్రా...ఇక పొలానికి నీళ్ళు వదలరు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు" అంటుంటే అప్పటివరకూ చేసిన కష్టం  అంతా మట్టిపాలు అయిపోయినందుకు అటు ప్రకృతిని నిందించలేక  ఇటు తర్వాత పంటకి పెట్టుబడి ఎలా తేవాలా అనే టెన్షన్ ..

" అన్నీ సమకూరి పండించినా .... ఆఖర్లో సరి ఆయిన మద్దతు ధర లేక ..పంట పారబొసుకొవాల్సిన పరిస్తితి వచ్చే టెన్షన్"... 


పైన రెండు ఆప్షన్స్ ఇస్తే మనలాంటి తెలివయిన వాళ్ళు ఏం ఆలోచిస్తాం?...... హాయిగా పొలం అమ్మేసి దర్జాగ చీకు చింతా లేకుండా వడ్డీ తింటూ బ్రతక్క.... ఈ కష్టాలు  పడుతూ ...ఆ వచ్చీరాని ఆదాయం కోసం  ఎందుకు తాపత్రయం అని డిసైడ్ అయిపోతాం  కదా... ఇదే సలహా మన రైతన్నలకి ఇచ్చినప్పుడూ మనం వినే టిపికల్ సమాధానాలు   ఇలా ఉంటాయి  .....

  • నాకు ఈ పని తప్ప ఇంకేం  తెలవదు రా... మా నాన్న ఇదే నేర్పించాడు... తరతరాలుగా ఇదే  భూమితల్లిని నమ్ముకున్నాం...అంత త్వరగా ఎలా  వదిలేసుకుంటాం...

  • అందరూ అలానే మానుకుంటే... ఇక ప్రజలకి తిండి ఎట్టాగరా... ఎవరో  ఒకరు చెయ్యాలి కదా ఈ పని...

  • అరేయ్..మీరు కంప్యూటర్ ముందు కూర్చుని ఏవేవో  కనిపెడుతూ ఉంటారటకదా...అలాగే కాస్త ఈ చీడ పీడలకు తట్టుకునే మంచి వంగడాలు పుట్టించడమో , కాస్త తక్కువ ధరకే కరెంట్ వచ్చేలా ఎదయినా ప్రత్యామ్నాయం కనిపెట్టడం చేస్తే మాకీ కష్టాలు  ఉండవు కదా (కాస్త లోక  జ్ఞానం తెలిసున్న మా మేనమామ రైతు చెప్పేది..)
ఇవి...వాళ్ళ రెస్పాన్స్...

రైతులందరి జీవితాల్లో కొన్ని సినిమాల్లో చూపించినట్టు .... పల్లెటూళ్ళో లంకంత కొంప... చుట్టూ పెద్ద తోట...పాడి .. ఎప్పుడూ కళకళలాడుతూ ఇల్లాలు, పిల్లలు ఇవేం రియల్ లైఫ్ లో ఉండవు. ఎక్కడో పది ఊళ్ళకి కూడా అలాంటి ఆసామి ఉండడు...ఒకప్పుడు బాగా బతికిన రైతు కూడా ఈ రోజుల్లో రైతు కూలీగా మారాల్సోచ్చిన పరిస్థితి  ...

మనం మన ఉద్యోగంలో  రాణించాలన్నా లేక వ్యాపారం బాగా అభివృద్ధి చెయ్యాలన్నా, సంపాదించాలన్నా... బాగా కష్ట పడతాం....కానీ మనం ఎంత కష్టపడినా...మనకి ప్రతిఫలం దక్కకుండా మన కంట్రోల్ లో లేని ఏదన్నా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అడ్డుపడుతుంటే ఎంత బాధ గా ఉంటుంది మనకు... అదే ఫ్యాక్టర్ అలానే కొనసాగుతుంటే వెంటనే ఉద్యోగం మార్చేస్తాం ... అదే ఇక్కడ రైతు తన కష్టం తో పాటు...మానవుడి ఏ మాత్రం కంట్రోల్ లేని ప్రకృతి అనే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ని కూడా నమ్ముకోవాలి.



**************** 
కొన్నేళ్ళ క్రితం బెంగళూరులో ఉండే రోజుల్లో ఒకసారి రిజర్వేషన్ చేయించుకోవడానికి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ కి వెళ్లాను. అయిదో ఆరో కౌంటర్స్ ఉన్నాయి...దాంట్లో తక్కువ మంది క్యూ ఉన్న కౌంటర్ చూసుకుని నుంచున్నా... టైం కిల్ చెయ్యడానికి మొబైల్ తీసి ఆడుకుంటున్నాను... ఎప్పట్లాగే నేను నుంచున్న లైన్ తప్ప మిగతా లైన్లన్నీ స్పీడ్ గా కదులుతున్నాయి... కాసేపున్నాక .....క్యూ అసలు కదలడం లేదేమిటా అని అని చూస్తే కౌంటర్ దగ్గర ఒక ఆర్మీ జవాను ఒక చేత్తో రిజర్వేషన్ ఫార్మ్స్ కట్ట  రెండో చేత్తో వాళ్ళకొచ్చే కన్సెషన్ ఫార్మ్స్ కట్ట పట్టుకుని ఒకదాని తరువాత ఒకటి ఇస్తున్నాడు. ఈ కన్సెషన్ ఫార్మ్స్ వల్ల మామూలు టికెట్ రిజర్వేషన్ చెయ్యడానికి కన్నా ఎక్కువ టైం పడుతుంది అనుకుంటా... క్యూ జనం లో కొద్ది అసహనం...ఈ లోపు ఒక టికెట్ రిజర్వేషన్ అయిపోగానే... అతను వేరే టికెట్ కి ఫారం ఇచ్చాడు. అప్పటివరకూ ఓపిగ్గా నించున్న జనం లో ఇద్దరు... "ఏం నువ్వొక్కడివే ఇంత టైం తీసుకుంటే మేం ఆఫీసుల్లో పర్మిషన్ తీసుకు వచ్చాం... మేం వెళ్ళొద్దా...ఎంత సేపు నుంచోవాలి  అని"  అని అరడవడం మొదలు పెట్టారు. అయితే అతను ఆల్రేడి ఒకసారి కొన్ని టికెట్స్ చేయించుకుని మళ్ళీ లైన్ లో వెనుక నుంచుని క్యూ లో వచ్చి మిగతావి చేయించుకుంటున్నాడు అని రిజర్వేషన్ ఆఫీసరు చెప్తున్నాడు కానీ నా వెనుక నుంచున్న ఈ ఇద్దరు వినిపించుకునే స్టేజ్ లో లేరు. వాళ్ళ హిందీ , కన్నడ డైలాగుల్లో కొన్ని అర్ధమయినవి ఏమిటంటే... ఫ్రీ గా టికెట్ వస్తున్నప్పుడు అందరికన్నా వెనక్కి నుంచోవాలి... ఫుల్ డబ్బులిచ్చి కొనుక్కునే వాళ్లకి ప్రిఫెరేన్స్ ఇవ్వాలి అని... ఈ గొడవ జరుగుతుండగా... కొంచెం తటపటాయిస్తూనే ఆ జవాను లాస్ట్ టికెట్ కి రిజర్వేషన్ ఫారం ఇచ్చాడు. అంతే నా వెనుకున్న వాళ్ళు ఇక రెచ్చిపోయి తిట్టడం మొదలు పెట్టారు... దానితో అతను...కొంచెం ఫీల్ అయ్యి...ఇచ్చిన ఫారం మళ్ళీ తీసేసుకుని...వెనక్కి వెళ్లి నుంచున్నాడు...అలా వెనక్కి వెళ్తున్నప్పుడు అతని మొఖం లో ఫీలింగ్స్ చూసి...ఎందుకో నాకు కొంచెం బాధ కలిగింది ...వెంటనే నేను లైన్ నుండి తప్పుకుని... అతని వెనుక నుంచున్నా.. నన్ను చూసి ఇంకో ఇద్దరు నా వెనక్కి వచ్చారు. ఆ తరువాత  ఆరిచిన వాళ్ళలో ఒకడు కూడా వచ్చి మా వెనుక నుంచున్నాడు ...మిగిలిన వాడు మాత్రం ఇవేమీ పట్టనట్టు రిజర్వేషన్ చేయించుకు వెళ్ళిపోయాడు... వాడు వెళ్ళిపోతూ నన్ను కొంచెం చిరాగ్గా చూసి పోయాడనుకోండి...

నా  రిజర్వేషన్ అయిపోయాక వెనక్కి వస్తుంటే ... నాకు థాంక్స్ చెప్పడానికి ఆ జవాన్ అక్కడే నుంచున్నాడు... చాయ్ తాగుదామా అన్నాడు... నాకు కొంచెం మొహమాటం అడ్డొచ్చినా...సర్లే అని ఓకే అన్నా... అతనికి హిందీ తప్ప ఇంకేం రాదు...నాకు హిందీ అంతంత మాత్రం... ఫ్లాట్ఫాం మీద కాంటీన్ లో టీ తాగుతూ ఉంటే అతను చెప్తున్నాడు... అతనిది ఉత్తరప్రదేశ్ లో ఏదో మారు మూల పల్లె... ట్రైన్ లో డిల్లీ వెళ్లి అక్కడనుండి మళ్ళీ పదహారు గంటలు దూరం వాళ్ళ ఊరు ... ఇతని కుటుంబానికి  సైనిక నేపథ్యం లేకపోయినా ఆ ఊళ్ళో ఎక్కువ మంది సైన్యం లో పనిచేసేవారేనట.... భార్య , పిల్లలు , తల్లితండ్రులు అక్కడే ఉన్నారు... వాళ్ళని చూసి సంవత్సరం అయిందట... అతనికి అతని కొలీగ్స్ కి కలిపి రిజర్వేషన్ చేయించడానికి వాళ్ళ ఆఫీసరు ఒకరికే పర్మిషన్ ఇస్తాడట అందుకే ఆ పెద్ద కట్ట.... పెద్ద ర్యాంక్ కాకపోవడం తో జీతం అంత ఏమీ ఉండదు అనిపించింది. అలా కాసేపు మాట్లాడాక...వెళ్ళే ముందు టీ కి డబ్బులిస్తుంటే...లేదు లేదు నేను పిలిచాను కాబట్టి నేను ఇవ్వాలి అని పట్టుపట్టి అతనే ఇచ్చి వెళ్ళిపోయాడు...

నేను తిరిగి ఆఫీసుకి వచ్చాక ....జరిగిన సంఘటన మళ్ళీ నెమరు వేసుకున్నా....

అలా నలబై గంటల దూరం లో ... అందరిని వదిలేసి...సంవత్సరానికి ఒకసారే మాత్రమే ఇంటికివెళ్ళేలా ఉండే  ఊరిలో అప్పుడు నాకు వచ్చే జీతానికి రెట్టింపు జీతం వచ్చే ఒక ఉద్యోగం ఇస్తే నేను వెళ్తానా ?? అని.... ఆ తరువాత...అదే ఉద్యోగం లో ప్రాణాపాయం కూడా ఉంటే...అసలు ఎంత జీతమొస్తే వెళ్ళగలను అని ఆలోచించాను...అప్పుడు అనిపించింది....ఎంత ఇచ్చినా వెళ్ళలేను అని....కావాలంటే మా ఊరు వెళ్ళిపోయి ఆటో నడుపుకుంటూ అయినా బ్రతుకుతాను కానీ... ఆ ఉద్యోగం మాత్రం చెయ్యలేనోమో అనిపించంది....మరి అందరూ నాలానే అనుకుంటే ఇక మన సరిహద్దుని కాపాడేది ఎవరూ?

అప్పుడు అనిపించింది....కొన్ని ఉద్యోగాలు చెయ్యడానికి అర్హత,  నైపుణ్యం, ఆకర్షణీయమయిన జీతం ఇవేం సరిపోవు.... ఇంకా ఏదో కావాలి... దాని పేరు ఏమిటో నిర్వచించలేను కానీ... అది ఉన్నది మాత్రం ఈ రైతు కి , జవాను కి మాత్రమే....

మనం రెండుపూట్లా కడుపునిండా తిని కంటినిండా నిశ్చింతగా నిద్రపొవడానికి కారణమయిన  వీళ్లకి ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం.... కనీసం కొంచెం గౌరవం ? 

ఈ రెండు ముక్కలు రాయడానికి ఇన్స్పిరేషన్ కలిగించే బజ్ రాసిన లలిత డి. గారికి ప్రత్యేక కృతజ్ఞతలు  ...
 
- మంచు

Thursday, January 13, 2011

కొన్నాళ్ళ తరువాత....

*** శ్రీ రామ *** 

పక్కనున్న ఫోటో చూసారు కదా... కొన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడున్న పెట్రోల్ బంకుల స్థానంలో ఉండే కార్ చార్జింగ్ స్టేషన్ అది. ఇంత హైఫై గా ఉంది ఈ చార్జింగ్ స్టేషన్ దాని కధా కమామిషు గురించి తెలుసుకోవాలంటే ఒక ఇరవై సంవత్సరాలు రింగులు తిప్పుకుంటూ ఫ్యూచర్ లోకి వెళ్ళాల్సిందే. కొన్నాళ్ళకి ఇప్పుడున్న పెట్రోల్ , డీజిల్ వాహనాల సంఖ్య క్రమంగా తగ్గిపోయి ఆ ప్లేస్ లో బ్యాటరీ తో నడిచే విద్యుత్ కార్లు వచ్చేస్తాయి. ఈ చార్జింగ్ స్టేషన్స్ ఆ కార్లలో ఉన్న బ్యాటరీలను చార్జ్ చెయ్యడానికి అన్నమాట.

ఈ ఎలక్ట్రిక్ కార్ల యొక్క ఆవశ్యకత ఏమిటి , వాటి మీద ప్రపంచవ్యాప్తం గా ఇంత సీరియస్ గా ఎందుకు పరిశోధన జరుగుతుంది అని అర్ధం చేసుకోవడానికి , ప్రపంచం లో ఎక్కువ కార్ మార్కెట్ కలిగిన దేశం అమెరికాని విశ్లేషిద్దాం.
  • ప్రపంచంలో ఎక్కువ కాలుష్యం విడుదల చేసే దేశాల్లో అమెరికా కూడా అగ్రస్తానం లో ఉంది. ఎక్కువ వైశాల్యం గల దేశం కావడం వల్ల అమెరికాలో ఉన్న వాళ్లకి పెద్ద కాలుష్యం అనిపించక పోవచ్చు కానీ వాతావరణం లోకి విడుదల చేసే కాలుష్యం మొత్తంలో అమెరికా వాటా చాలా ఎక్కువ. అమెరికన్ మార్కెట్ లో లభ్యమయ్యే వాహనాలకి అవి విడుదల చేసే కాలష్య పరిమాణం మీద కఠినమయిన నిబంధనలు ఉన్నా, ఎక్కువ వాహనాలు ఉండటం వల్ల ఆ కొంచెం కొంచెమే కలసి ఎక్కువ అవుతుంది. అందువల్ల ఈ అధిక కాలుష్యం తగ్గించమని యూరోపియన్ దేశాల నుండి అమెరికా ఎక్కువ వత్తిడి ఎదుర్కుంటుంది. వాహన సంఖ్య ఎలాగూ తగ్గించలేరు కాబట్టి అవి విడుదల చేసే కాలుష్యం మరింత తగ్గించడానికి ఒక మార్గం వాహనాలకి ఎక్కువ మైలేజ్ వచ్చేలా రూపొందించడం.
  • ఇప్పుడున్న సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలకి ఆయిల్ కావాలి కదా. అది కావాలంటే అరబ్ దేశాల మీద ఆధారపడాలి. మరి రేపు ఎప్పుడయినావాళ్ళు ఆయిల్ అమ్మను అని బెదిరిస్తే అంటే వీళ్ళ కార్లు ఎలా నడవాలి (అమెరికాకి కూడా బోల్డంత ఆయిల్ ఉందనుకోండి అది వాళ్ళ మిలటరీకే సరిపోదు.)
ఈ రెండు ముఖ్య కారణాల వల్ల అమెరికాలో ఈ ఎలక్ట్రిక్ కార్ల మీద రిసెర్చ్ బాగా జరుగుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో మూడు రకాల కార్లు ఉన్నాయి అని మనకి తెలుసు కదా. 
1 . సాంప్రదాయ ఇంధనాలు అంటే పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ లాంటి ఇంధనాలు (Fossil fuels) ఉపయోగించుకుని నడిచే కార్లు: వీటి ఇంజన్లలో ఈ ఇంధనం మండించడం ద్వారా శక్తి ఉత్పత్తి చేసి అది వాహనం కదలడానికి వాడతాం అన్నమాట. అయితే ఈ ఇంధనం మండిస్తే పొగ వస్తుంది ఆంటే తద్వారా కాలుష్యం....ఎంత ఎక్కువ ఇంధనం మండిస్తే అంత కాలుష్యం. మరి ఈ కాలుష్యం తగ్గించాలి ఆంటే ఏం చెయ్యాలి.. తక్కువ ఇంధనం తో ఎక్కువ  దూరం ప్రయాణించగలిగేలా వాహనం మైలేజ్ పెంచాలి.  
2 . పెట్రోల్ / డీజిల్ / గ్యాస్ ఇలా ఏ ఇంధనంతో నడిచే ఇంజిన్ అయినా తక్కువ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు (ఆంటే స్టారింగ్ లో (ఎక్సిలరేషన్ లో ), బ్రేక్ వేసినప్పుడు , తక్కువ గేర్ లో వెళ్తున్నప్పుడు ఆంటే ఎత్తులు ఎక్కుతున్నప్పుడు ) తక్కువ ఎఫిషియన్సి కలిగిఉండటం వల్ల ఎక్కువ ఇంధనం వృదా అవుతుంది. అదే వాహనం ఎక్కువ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు (హై గేర్ లో వెళ్తున్నప్పుడు) ఎఫిషియన్సి ఎక్కువ ఉండటం వల్ల ఇంధనం అంత ఎక్కువ వృదా కాదు.





అందువల్ల ఇప్పుడు ఆ వాహనంలో సంప్రదాయ ఇంధనంతో నడిచే ఇంజిన్ తో పాటు, ఒక విద్యుత్ జనరేటర్, బ్యాటరి, ఒక ఎలక్ట్రిక్ మోటార్ కూడా పెట్టి , వాహనం  ఏక్సిలరేషన్ లొ విద్యుత్ మోటారుతో నడిచేలా , వాహనం ఒక వేగం చేరుకున్నాక ఇంజిన్ తో నడిచేలా ఏర్పాటు చేస్తే.. ఎక్కువ ఇంధనం వృధా కాకుండా ఉంటుంది. వాహనం ఇంజిన్ మీద నడుస్తున్నప్పుడు, అదే ఇంజిన్ తో  జనరేటర్ తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి అది బ్యాటరీ లో నిలువ చేసి, ఆ విద్యుత్ మోటార్ నడపడానికి వాడబడుతుంది. ఆంటే ఈ సాంప్రదాయ ఇందానాలతో నడిచే ఇంజన్ ని ఎప్పుడూ మనం లోగేర్ లో ఉపయోగించం కాబట్టి తక్కువ ఇంధనం వృధా అవుతుంది. అందువల్ల తక్కువ ఇంధనం తో ఎక్కువ దూరం ప్రయాణించ వచ్చు ... ఆంటే తక్కువ కాలుష్యం... ఈ తరహ టెక్నాలజీ గల కార్లని హైబ్రీడ్ కార్లు అంటారు.

3. ఎలెక్ట్రిక్ వాహనాలు : వీటినే ఎలెక్ట్రిక్ ప్లగ్-ఇన్ మోడల్స్ అని కూడా అంటారు. వీటిలో ఇక ఇంధనంతో నడిచే ఇంజిన్ లాంటివి ఉండవు. బ్యాటరి, విద్యుత్ జనరేటర్ , విద్యుత్ మోటర్ ఉంటాయన్నమాట. బ్యాటరీలో నిలువ చేసిన విద్యుత్తో మోటార్ ని తిప్పితే ఆ మోటర్ వాహనాన్ని నడిపిస్తుంది. అయితే దీంట్లో హైబ్రిడ్ వాహనం లో ఉన్నట్టు డీజిల్ లేక  పెట్రోల్ ఇంజిన్ లాంటివి ఉండవ్ కాబట్టి ఆ బ్యాటరీలను మనం సెల్ ఫోన్ బ్యాటరీలను చార్జ్ చేసినట్టు బయట నుండి చార్జ్ చెయ్యాలి. ఇలా చార్జ్ చెయ్యడానికి ఒక ఎలెక్ట్రిక్ ప్లగ్ ఉంటుంది కాబట్టి ప్లగ్-ఇన్ మోడల్స్ అంటారు. ఇక పెట్రోల్ , డీజిల్ లాంటి ఇంధనాలు మండించడం  ఉండదు కాబట్టి కాలుష్యం సమస్య లేదు. మరి ఇంజన్ లేనప్పుడు ఇక జనరేటర్ ఎందుకు ఆన్న ప్రశ్న వస్తుంది కదా...వాటివల్ల ఈ హైబ్రిడ్ , ఎలెక్ట్రిక్ కార్ల లో ఒక పెద్ద ఉపయోగం ఉంది. అదేమిటో చూద్దాం...

వేగంగా వెళ్తున్న ఒక వాహనానికి ఇంధనసరఫరా నిలిపివేసినా కొంత దూరం ప్రయాణించి మరీ ఆగుతుంది కదా ...ఆంటే కదిలే వాహనంలో కొంత శక్తి నిల్వ ఉంటుంది మరియు ఆ శక్తి ఆ వాహనం ప్రయాణించే వేగం మీద ఆధారపడి ఉంటుంది. మరి అదే వాహనం బ్రేక్ వేసినప్పుడు వెంటనే ఆగిపోతుంది కదా....అప్పుడు  ఆ నిల్వ ఉన్న శక్తి ఏమవుతుంది ఆంటే.... ఆ బ్రేక్ కి కారు చక్రానికి మద్య జరిగిన రాపిడి వల్ల పుట్టిన ఉష్ణ శక్తిగా మారుతుంది అన్నమాట. ఆంటే ఆ శక్తి  వేస్ట్ అయిపోతుంది. ఎంత ఎక్కువ సార్లు బ్రేక్ వేస్తే అంత ఎక్కువ శక్తి (ఇంధనం) వృదా అవుతుంది.... అదే ఈ హైబ్రిడ్ మరియు ఎలెక్ట్రిక్ కార్లలో అయితే , బ్రేక్ వేసినప్పుడు  ఆ  నిల్వ ఉన్న శక్తిని బ్రేక్ ద్వారా ఉష్ణ శక్తిగా మార్చి వృధా చెయ్యకుండా , జనరేటర్ సహాయంతో విద్యుత్చక్తిగా మార్చి బ్యాటరీకి పంపిస్తాం. మనం స్పీడ్  పెంచవలసి వచ్చినప్పుడు  తిరిగి అదే శక్తి బ్యాటరీల నుండి  తీసుకుని మోటార్ ని నడిపిస్తాం కాబట్టి ఎన్నిసార్లు బ్రేక్ వేసిన ఎక్కువ శక్తి నష్ట పోము.

హైబ్రిడ్ వాహనాలు (ముఖ్యంగా కార్లు) అమెరికా, యూరోప్, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి కానీ ఎలక్ట్రిక్ ప్లగ్-ఇన్ కార్లు ఇప్పుడుప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. 2015 కల్లా 10 లక్షల కార్లు, 2020 కల్లా 50 లక్షల ఎలక్ట్రిక్ ప్లగ్-ఇన్ కార్లు కార్లు అమెరికన్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయ్ అని ఒక అంచనా.... మరి ఇన్ని కార్లు ఉన్నప్పుడు ఎలక్ట్రిక్  కార్లని ఎక్కడ చార్జ్ చెయ్యాలి, ఏలా చార్జ్ చెయ్యాలి? ప్రస్తుతం  అయితే ఈ ఎలక్ట్రిక్  కార్లన్నీ ఇంట్లోనో ఆఫీసులోనో ఎలెక్ట్రిక్ ప్లగ్ లో పెట్టి  చార్జ్  చేసుకుని వెళ్లిరావడమే. మరి బయటకు వెళ్ళినపుడు మద్యలో చార్జ్ అయిపోతే ఎలా.. సరే అయితే ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు ( యూరోప్ లో ఉన్నవాళ్ళు ఐదు సంవత్సరాలు, అమెరికా లో ఉన్నవాళ్ళు ఒక పది సంవత్సరాలు ) ముందుకెళ్ళి అప్పటి పరిస్తితి ఎలా ఉంటాయో చూద్దాం. 

  • క్రింద ఫోటో చూపించినట్టు ఒక్కొ పార్కింగ్ స్పేస్ లో ఒక్కో చార్జర్  ఉంటుంది. మనకెప్పుడు అవసరం అయితే అప్పుడు అక్కడ పార్క్ చేసి చార్జ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు చార్జింగ్ కి పెట్టి వెళ్తే అది చార్జ్ అవుతూ ఉంటుంది.

  • అలాగే ఈ  పక్క ఫోటో చూపించినట్టు రాత్రి ఇంటికి రాగానే చార్జింగ్ పెట్టుకుంటే , పొద్దున్న వర్క్ కి వెళ్ళే సమయానికి చార్జ్ అయివుంటుంది. 
  • అలాగే షాపింగ్ మాల్స్ లో, రెస్టారెంట్లలో, ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ లలో, పబ్లిక్ పార్కింగ్ ప్లేసులు, అఫీసులులలో ఇలా ఎక్కడపడితే అక్కడ చార్జర్స్ ఉంటాయి. 
  • ఇక బిజినెస్ విషయానికి వస్తే , ఇంట్లో చార్జ్ చేసుకుంటే అ విద్యుత్ వినియోగం మన కరెంట్ బిల్ లోకి వెళ్తుంది. మరి బయట పబ్లిక్ ప్లేస్ లో అయితే ఆ చార్జింగ్ కావాల్సిన  విద్యుత్ కొనుక్కోవాలి కదా.... ఈ కార్ బ్యాటరి  చార్జ్ చేసుకోవడం మన సెల్ ఫోన్ బాలన్సు చార్జింగ్ తో పోల్చుకోవచ్చు. సెల్ ఫోన్ లానే వీటిలో ప్రీపైడ్, పోస్ట్‌పైడ్  కార్డులు ఉంటాయి. ఫోటో లో చూపించినట్టు ఆ కార్డ్ స్వైప్ చేస్తే , మనం ఎంత విద్యుత్ వినియోగించామో చూసి దానికి చార్జి చేస్తుంది. సెల్ ఫొన్ లా ప్రీపైడ్ అయితే మన కార్డ్ లొ డబ్బులు అయిపొయినప్పుడు రీచార్జ్ చేయించినట్టు ఈ కార్డ్ కూడా రీచార్జ్ చేయించుకొవాలి. 
  •  
  • ఇక రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లాంటి వాళ్ళు కస్టమర్స్ ని ఆకర్షించడానికి వాళ్ళ పార్కింగ్ ప్లేస్ లలొ ఫ్రీ చార్జింగ్ ఆఫర్ చేస్తారు. కార్ పార్క్ చేసి, ప్లగ్ తగిలించి , రెస్టారెంట్ లొ తిని వచ్చేసరికి కార్ మళ్ళీ ఫుల్ చార్జ్ అయిపొయిఉంటుంది అన్నమాట.
  • మరి మనం చార్జింగ్ స్టేషన్ లో కార్ చార్జింగ్ పెట్టి ,  షాపింగ్ కి వెళ్లి వచ్చేలోపు వేరే ఎవరన్నా ప్లగ్ మన కార్ నుండి తీసి వాళ్ళ కార్ కి పెట్టుకుంటే (చార్జింగ్ దొంగతనం చేస్తే) ఆన్న అనుమానం రావచ్చు. ఇది నివారించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మన కార్ కి తగిలించిన చార్జెర్ ప్లగ్ తొలగించగానే మన సెల్ ఫోన్ కి ఒక SMS  మరియు మన మెయిల్ అడ్రస్ కి ఒక మెయిల్ వస్తాయి అందువల్ల ఆ చార్జర్ మనకి మనం తీసామా లేక ఎవరన్నా తీశారా అన్నది తెలుస్తుంది. ఒకవేళ దొంగతనం అనుకుంటే, మనం వెంటనే ఆ చార్జింగ్ కంపెనీకి  ఫోన్ చేసి ఆన్లైన్ లోనే చార్జింగ్ ఆపించవచ్చు. రెండోది ప్రతీ కార్ కి చార్జింగ్ ప్లగ్ దగ్గర ఒక కోడ్ వుంటుంది. అదే కోడ్ ఈ చార్జింగ్ స్మార్ట్ కార్డ్ మీద కూడా ఉంటుంది. ఆంటే ఒక చార్జింగ్ కార్డు తో దానిమీద కోడ్ ఉన్న కార్ మాత్రమే చార్జ్ చెయ్యొచ్చు. మరి పక్కోళ్ళకు కార్డు అప్పు ఇవ్వాలంటే మనం పాస్వర్డ్    ఇవ్వాలి.
  • అయితే ప్రస్తుతం ఈ చార్జింగ్ చెయ్యడానికి చాలా సమయం పడుతుంది. ఈ పక్కనున్న బొమ్మలో చూపించినట్టు ప్రస్తుతానికి లబ్యమయ్యే మూడు చార్జింగ్ లెవెల్స్ లో.... DC (level 3) చార్జింగ్ వేగవంతమయిన చార్జింగ్ అన్నమాట. అయితే ఎప్పుడూ బ్యాటరీ ఎంత స్లో గా చార్జ్ చేస్తే అంత ఎక్కువ కాలం  మన్నుతుంది. అందువల్ల మనకి ఫాస్ట్ చార్జింగ్ కావాలా, లేక బ్యాటరి మన్నిక కాలం కావాలా అన్నది చూసుకుని కొనుక్కోవాలి. నాకు తెలిసి ఇంట్లో వాడకానికి  level2 , బయట చార్జింగ్ బిజినెస్ కి level3 (DC ) బెస్టు. 5 నిముషాల్లో పెట్రోల్ నింపుకుని మైళ్ళ మైళ్ళ దూరం ప్రయాణించడం అలవాటు అయ్యాక, ఈ చార్జింగ్ కోసం ఇంత సేపు సమయం వెచ్చించడం   కొంచెం చికాకు అనిపించినా క్రమేణా మన జీవన విధానం కూడా అనుగుణంగా మారిపోతుంది. మరియు కొన్నాళ్ళకి అత్యంత వేగవంతమయిన  చార్జర్స్ అందుబాటులోకి వస్తాయి.
  • ఈ చార్జింగ్ టైం తో పనిలేకుండా, ఈ మద్య యూరోప్ లో డైరెక్ట్ గా చార్జ్ ఆయిన బ్యాటరీలు అద్దెకిచ్చే షాపులు వెలుస్తున్నాయి. మనం డిస్చార్జ్ అయిన బ్యాటరీలు ఇచ్చేసి , ఫుల్ చార్జ్ బ్యాటరీలు పెట్టుకుని వచ్చేయడమే. మరి ఈ బిజినెస్ మోడల్ ఎంతవరకు సక్సస్ అవుతుందో తెలీదు.
  • ఇక ఈ చార్జింగ్ స్తేషన్స్  స్టేషన్స్ సొలార్ తొ పనిచెయ్యడం వచ్చాక..ఒక్కసారి పెట్టుబడి పెడితే ఇక ఇక ఇంచుమించు కార్ ఫ్రీగా నడిపినట్టే...
  • ఇంకా ముందు కెళ్తే , కింద ఫోటో లో చూపినట్టు కారు రోడ్డు మీద నడుస్తున్నప్పుడే చార్జ్ అయ్యే టెక్నాలజీ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ మధ్యే జర్మన్ ఇంజనీర్ ఒకడు దీనికి పేటెంట్ తీసుకున్నాడట.




అది ఫ్యూచర్ లో ఎలెక్ట్రిక్ కార్లు, వాటి చార్జింగ్ కథ కమామిషు. ఈసారి మరొక టెక్నాలజీ గురించి చెప్పుకుందాం ..... 



- మంచు 

గమనిక: ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు రెండు సార్లు మొత్తం పోస్ట్ ఎగిరిపోయింది. మూడోసారి రాసినప్పుడు కాస్త శ్రద్ద మిస్ అయింది అనుకుంటున్నా...కొంచెం కంటిన్యుటి మిస్ అయినట్టు ఉంది. క్షమించాలి