Pages

Saturday, April 9, 2011

ఖండించేద్దాం .... పొయిందేముంది ........

*** శ్రీ రామ ***

                     'అప్పుడే తెల్లారిందా' అనుకుంటూ .... కళ్ళను బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తూ... మంచం మీద బద్దకంగా కదులుతున్నాను.... పక్కలో ఎక్కడో మూల పడి ఉన్న సెల్ ఫోన్ వెతికి పట్టుకుని ఆ సగం మూసిన కళ్ళతో టైం చూద్దును కదా.. తొమ్మిది చూపిస్తుంది. పదిగంటలకు మీటింగ్ ఉంది అన్న సంగతి గుర్తురాగానే నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది. ప్రతీరోజులాగానే నా మొద్దునిద్ర కు నన్ను నేనే తిట్టుకుంటూ ఉరుకులు పరుగుల మీద తయారయ్యి ఇంటినుండి బయట పడ్డా. బండి తీసి ఫుల్ స్పీడ్ లో నడుపుతున్నా కానీ "Murphy's Law" లాగ మనకి ఎప్పుడు అర్జెంట్ పనుంటే అప్పుడే  ట్రాఫిక్ సిగ్నల్స్ మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. అలానే సిగ్నల్ రెడ్ పడింది ... ఒక పక్క మీటింగ్ కి టైం అయిపోతుంది అన్న ఆదుర్దా ఇంకోపక్క సిగ్నల్ దగ్గర ఎవడో  సైడ్ ఇవ్వకపోవడం వల్ల అక్కడే ఆగిపోయి మోగిస్తున్న అంబులన్స్ సైరెన్ సౌండ్. ఇలా చిరాకులో ఉండగానే ఎవరో అరవడంతో ఆ అడ్డువున్నవాడు అంబులన్స్ కి దారి ఇవ్వడం, అదే సమయం లో నా బుర్రలో మంచి ఐడియా తట్టడం ఒకేసారి జరిగాయి. ఆ ఐడియా ప్రకారం ఆ అంబులెన్స్ వెనుకే నేనూ బండి పోనిచ్చా... కొంచెం దూరం వెళ్ళాక  పక్కనుండి రేయ్ మని పోనిచ్చి అంబులెన్స్ ఓవర్ టేక్ చేసి ముందుకు దూసుకొచ్చా.. నా ఖర్మగాలి మళ్ళీ ఇంకో సిగ్నల్ రెడ్ పడింది ..అయితే ఈ సారి ఆగదలచు కోలేదు.. పెద్ద ట్రాఫిక్ లేదులే అనుకుంటూ రెడ్ సిగ్నల్ దాటానో లేదో ...అప్పటివరకు ఏ  మూల దాక్కున్నాడో వేస్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే పట్టేస్కున్నాడు. నెలాఖరు కదా ఎక్కడపడితే అక్కడ ఉంటారు అని ట్రాఫిక్ పోలీసులను తిట్టుకుంటూనే బండి ఆపాను. సిగ్నల్ జంపింగ్ కింద 300 రూపాయలు ఫైన్ అంటాడు... అర్జెంట్ పనిమీద వెళ్తున్నా కాబట్టి దాటాల్సి వచ్చింది అని ఎంత బ్రతిమిలాడినా వదలడే.. వాడితో బేరాలాడితే నాకే టైం వేస్ట్ అని ఒక వంద వాడికి సమర్పించుకుని ఆఫీసుకి చేరాను. 

***
అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయ్యింది... లాస్ట్ సీట్లు అన్నీ ఆక్యూపై అయిపోయాయి... మీటింగ్ కి లేట్‌గా వస్తే ఇదే సమస్య.. ఫ్రంట్ కూర్చుని చెప్పేవాడి వంక చూస్తూ ఆ సొదంతా వినాలి. మెయిల్ చూడడం కుదరదు,sms లు చెయ్యడం కుదరదు. తిట్టుకుంటూ కూర్చున్నా... అప్పటికే పావుగంట లేట్ అయినా ప్రెజంటేషన్ ఇచ్చేవాడు ఇంకా ప్రొజెక్టర్ తో కష్టపడుతున్నాడు. ఈ లోపు పక్క సీటువాడు "ఏంటి బాబాయ్ ఇంత లేట్"  అని పలకరించాడు. 
"రాత్రి సినిమా చూసి పడుకున్నా లేట్ అయిపొయింది" అని సమాధానం చెప్పాను. 
"ఎం సినిమా" అని అడిగాడు.
" ఏదో ఇంగ్లీష్ సినిమారా...నెట్ దొబ్బేసింది ... అది డౌన్లోడ్ అయ్యేసరికే 12 అయ్యింది   ..చూసి పడుకునే సరికి 2 ..పొద్దున్న మెలుకువరాలేదు.. ఖర్మకాలి మధ్యలో ట్రాఫిక్ పోలీసు పట్టుకున్నాడు... వాడికో వంద కొట్టి వచ్చా... ఆ అంబులెన్స్ అడ్డంపెట్టుకుని చాల దూరం వచ్చా కానీ లేకపోతే చాలా కష్టం ఆ ట్రాఫిక్ లో  "
" పర్లేదు లే ... నువ్వోచ్చేసరికి ఇంకా స్టార్ట్ అవలేదు గా " అన్నాడు ...

*** 

ఆ మీటింగ్ ముగించి కాఫీకి వెళ్ళాం... అక్కడ  గ్యాంగ్ అంతా ఉంది...
"అరేయ్... ఇన్‌కంటాక్స్ సేవింగ్స్ కి ప్రూఫ్ లు సబ్మిట్ చెయ్యాలి కదా... ...నేను వెళ్లి మ్యూచువల్ ఫండ్ కట్టి వస్తారా " అన్నాడు మా ఫ్రెండ్ అక్కడనుండి లేస్తూ...
" ఎం టాక్సోరా... మనం సంపాదించినదంతా దోచేస్తున్నారు... " నిట్టూరిస్తూ అన్నా...
" ఎం రా... నీకు సేవింగ్స్ ఏమీ లేవా " అని అడిగాడు ఇంకొకడు...
" ఎన్ని అని చేస్తాం రా ..మనమా షేరింగ్ అపార్ట్మెంట్... మన వాటా అద్దె పెద్ద కాదు..ఇక షేరింగ్ కాబట్టి రెంట్ రిసీట్ మాలో ఒకడికే వస్తుంది....  అందువల్ల  హెచ్ ఆర్ ఏ మొత్తం అక్కడే పోతుంది " అన్నాను.
" అదేంటి రా..  ఒరిజినల్ బిల్లులు పెడతావా.. " అంటూ పెద్ద కొండ తింగరోడిని చూసినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అందరూ... 
నేను కొంచెం అయోమయంగా చూస్తుండగానే... 
"అరే..  నీకు ఎంత అద్దె కావాలంటే అంత రాస్కో ...నేను ఓనర్ సంతకం పెడతా" అని ఒకడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు... ఇంకొకడు మెడికల్ ఎలవేన్స్ కోసం దొంగ మెడికల్ బిల్లులు ఎక్కడ దొరుకుతాయో చెప్తుంటే , ఇంకొకడు  LTA కోసం తను ప్రింట్ చేయించిన దొంగ రిసీట్స్ బుక్  ఆఫర్ చేస్తుంటే... ఆహ స్నేహం అంటే ఇదే అని పొంగిపోయాను. మొత్తం వివరాలు అన్నీ సంపాదించి వచ్చి సీట్లో కూర్చున్నా.. ఈ రోజు ఎలా చూసినా ఒక 20 వేలు టాక్స్ సేవ్ చేసినట్టే..మాంచి ఆనందంగా ఉంది. అయినా మన లెగ్ ఎప్పుడూ గోల్డెన్ లెగ్... ఇంజనీరింగ్ లో అందరూ వేలకు వేలు ఫీజ్ కడితే.. మనం ఒక 500 రూపాయిలు కొట్టి ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ అని సర్టిఫికేట్ సంపాదించి వందల్లో ఫీజు కట్టి ఇంజనీరింగ్ చదివేసా... 

ఎంతమందికి ఇన్ని తెలివి తేటలు ఉంటాయ్...అని నాకు నేనే భుజాలు తడుముకున్న్నా :-) 

***

లంచ్ ముగించి సీట్లో కూర్చున్నానో లేదు నాన్నగారి దగ్గరనుండి ఫోన్...
" ఎరా... మన పక్క స్థలం అమ్మేస్తారని చెప్పాకదా దానిగురించి ఏమయినా ఆలోచించావా  " అంటూ
" బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో నాన్నా.. పది లక్షలు అంటున్నావ్.. ఇంకా రిజిస్ట్రేషన్  , బ్రోకేర్ ఫీజు ఇలా చాలా ఉంటాయ్ కదా  "
" పది లక్షలు చెప్తున్నారు రా.. రిజిస్ట్రేషన్  ఫీజు ఇంకో పది వేలు వేస్కో.. బ్రోకర్ ఫీజు....." అని చెప్తుండగా మద్యలో కట్ చేసి
" అదేంటి మొన్న నెట్ లో చూసా.. ఆ రేట్  ప్రకారం పదిలక్షలకి రిజిస్ట్రేషన్ ఫీజు ఇంకా చాలా ఎక్కువ వచ్చింది నాకు  " అని అడిగా
కొన్న రేట్ కి ఎవరన్నా రిజిస్ట్రేషన్ ఫీజు కడతారట్రా ...కొనేది పదిలక్షలు అయినా అక్కడ గవర్నమెంట్ రేటు లక్షే ఉంది .. అందువల్ల రిజిస్ట్రేషన్ ఫీజు ఆ లక్షకే కదా "
" ఓ కదా... పాయింట్ మిస్ అయ్యా... సరే నేను పర్సనల్ లోన్ కి అప్ప్లై  చేస్తా.....తీస్కుందాం...వాడికి అడ్వాన్స్ ఇచ్చి ఉంచు "
అని ఫోన్ పెట్టా... ఈ రోజు అన్ని పిచ్చపిచ్చగా కలసి వచ్చేస్తున్నాయ్....

*** 

బోల్డు మెయిల్స్ పెండింగ్ ఉండిపోయాయి అని చూస్తున్నా .. ఒక మెయిల్ లో కజిన్ కి mathlab సాఫ్ట్వేర్ కావాలట... ఎలాగయినా సంపాదించామని రాసాడు... వెంటనే IISC లో ప్రాజెక్ట్ చేస్తున్న మా ఫ్రెండ్ కి ఫోన్ చేశా... వాడిని రివిజన్ 14 అడిగితే ..."ఇంకా రివిజన్ 14 ఏంటి గురూ..15 వచ్చేసింది కదా" అన్నాడు. నాకు తెలుసు ఈ IISC వాళ్ళు తక్కువోళ్ళు కాదని... సాఫ్ట్వేర్ ఇలా రిలీజ్ అవ్వడం పాపం...అలా పాస్వర్డ్ బ్రేక్ చేసేస్తారు. వీళ్ళ తెలివితేటలే తెలివితేటలూ అనుకుంటూ ...."సరే వీకెండ్ కి వచ్చి కలెక్ట్ చేసుకుంటా...సి డి రాసి ఉంచు" అని చెప్పేసి ఫోన్ పెట్టా... 

***

3 అయింది అని కాఫీకి వెళ్లోచ్చి అ రోజు పనికి కూర్చున్నా...మా కంపెనీలో చాలామంది లాగానే...నా వర్కింగ్ హవర్స్ మద్యాహ్నం నాలుగు నుండి మొదలవుతాయి. అలా అని అసలు పనే చెయ్యం అని కాదు... ప్రైవేట్ కంపెనీ కాబట్టి పనిచెయ్యకపోతే వెంటనే ఉద్యోగం ఊడుతుంది అనుకోండి... నాలుగు నుండి సీరియస్ గా పని చేస్కుంటున్నా... ఆరు గంటలుకి  స్నాక్స్ తిని కూర్చున్నా ..ఈలోపు కార్తీక్ గాడు పింగ్ చేసాడు. వాడు ఆన్ సైట్  కని అమెరికా వెళ్ళాడు...
"హాయ్ ...రా " అన్నాడు వాడు ...
" ఏంట్రా అప్పుడే వచ్చావ్ ... ఆఫీస్ కి.."
" ఇక్కడ అమెరికాలో ఈ టైం మామూలే రా... అయినా ఇక్కడ పని వాచిపోతుంది రా బాబు.."
" ఎం అంతకంతా డాలర్లు వస్తున్నాయి కదా..." కొంచెం కుళ్ళు గా అన్నాను...
" ఎం డాలర్లు రా బాబు... చిరాకొస్తుంది... దీనికన్నా ఇండియా లో హాయిగా ఫ్రీగా ఉద్యోగం చేస్కుంటే ఎంత సుఖం గా ఉంటుందో..."
అక్కడున్న ప్రతీవాడు ఇలానే చెప్తాడు ...కానీ ఎవడూ రాడు అనుకుంటూ...
"మరి ఎప్పుడొస్తున్నావ్" అని అడిగాను 
" ఏమోరా... నీ ఆన్ సైట్ గురించి ఎమన్నా చెప్పాడా మానేజర్ " అని అడిగాడు వాడు
" ఇంకా ఏం చెప్పలేదు.. చెప్పడు రా వాడు.. వాడికి నేనంటే పడదు... కనీసం ఒక్క సంవత్సరం అయినా పంపొచ్చు కదా ... ఎప్పుడు చూసినా బడ్జెట్ బడ్జెట్ అంటాడు.. బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి పది లక్షలు, కానిస్టేబిల్ ఉద్యోగానికి 5 లక్షలు అని మార్కెట్లొ రేట్ ఉన్నట్టు ఈ ఆన్‌సైట్ కి కూడా ఏదన్నా రేట్ ఉంటే ఈపాటికి ఎప్పుడో వచ్చేవాడిరా..." అని చెబుతున్నా ... ఈ లోపు ...
" మళ్ళీ అడిగి చూడరా.... సరే నేను ఉంటాను" అని బై చెప్పేసాడు...

మళ్ళీ పనిలో మునిగిపోయా... రాత్రి 8 :30 కి అమెరికా కౌంటర్ పార్ట్ పింగ్ చేసాడు... " are you there " అంటూ ...
"యా" అన్నా... 
"ఇంకా పని చేస్తున్నావా" అని వాడి ఆశ్చర్యం...
" అవును... ఇండియా లో రాత్రి పదింటి వరకు పని చెయ్యడం కామనే... మీరు ఆరింటికే వెళ్ళిపొతారనుకుంటా కదా "అని అడిగాను ..
" అవును ... అయినా మీ ఇండియన్స్  బాగా కష్టపడతారు... సరే...ఇక వెళ్లి రెస్ట్ తీస్కో " అని చెప్పేసి వెళ్ళిపోయాడు..
వాడు అలా టైం గుర్తు చేసేసరికి నాకు వెంటనే అలసట వచ్చినట్టు అనిపించింది...వెంటనే బైక్ తీసుకుని ఇంటికి బయలుదేరబోతున్నా ...ఫ్రెండ్ కాల్ చేసాడు... అరేయ్ మన ప్రభాకర్ గాడు పార్టీ ఇస్తున్నాడు...ఇప్పుడే డిసైడ్ చేసాం...వెంటనే వచ్చేయ్ అని పిలుపు...

****

ఆహా అనుకుంటూ... వాడు చెప్పిన రెస్టారెంట్ వైపు బండిపోనిచ్చా...అప్పటికే అందరూ వచ్చేసారు. ఆర్డర్ ఇచ్చేసారు. హెల్మెట్, జర్కిన్ పక్కన పడేసి కూర్చున్నా... మా గ్యాంగ్ కలిసిందంటే క్రికెట్ నుండి  మొదలు పెట్టి, టాలీవుడ్, బాలివుడ్ అంటూ అన్ని వుడ్ లు టచ్ చేస్తూ, ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ రాజకీయాలు , సమస్యలు అన్నీ మాట్లాడేసుకుంటాం. టచ్ చెయ్యని టాపిక్కే ఉండదు. అలా మాట్లాడుకుంటుంటే మా మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయిన అవినీతి, బ్లాక్ మనీ మీదకి వెళ్ళింది. అందరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెబుతున్నారు .. హాట్ హాట్ డిస్కషన్ జరుగుతుంది. 

" అసలు ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల వల్లే మన దేశం ఇలా తగలడింది " అని ఒకడు....
" అసలు ఎవడబ్బ సొమ్మని బ్లాక్ మనీ రూపం లో అంతా విదేశాలకి తరలించారు... ఆ డబ్బు తో మన దేశం అప్పులన్నీ తీర్చేయోచ్చు కదా " అని ఇంకోడు.... 
వై ఎస్ ఎక్కువ అవినీతి చేసాడంటే, అదంతా వై ఎస్ చంద్రబాబు నుండి నేర్చుకున్నదే అని ఇంకోడు...లోక్ జన పాల్ బిల్లు గురించి ఒకడు చెప్తే ,  లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీ గురించి ఇన్స్పైరింగ్ కథలు ఇంకొకడు చెప్తున్నాడు. 

అయితే మాలో మురళి అని ఒకడున్నాడు. వాడు కొంచెం తేడా గాడు. ఊరంతా ఒక దారి అయితే వీడిది వేరే దారి. అప్పుడు వాడి డొక్కులో ప్రశ్న ఏంటంటే 
" అరేయ్ ... మీలో ఎంతమంది అదే రాజకీయ నాయకుడి ప్లేస్ లో ఉంటే  ఏ రకమయిన అవినీతి చెయ్యకుండా పెర్ఫెక్ట్ గా ఉంటారు" అని ....

వీడేప్పుడు తలతిక్క గాడే అనుకుంటూ "మేం ఎవరు అధికారం లో ఉన్నా పైసా లంచం తీస్కోం... తీసుకున్నా ఏదో తక్కువ అమౌంట్ లో తీస్కుంటాం కానీ ఇలా దేశాన్ని , ప్రజల్నిదోచేయ్యం" అని చెప్పాం...

అయితే వాడు వాడి పాయింట్ పూర్తిగా చెప్పేవరకు వదిలే రకం కాదు.... అయితే దురదృష్టవశాత్తు ఈసారి నన్ను ఉదాహరణ గా తీస్కున్నాడు. ఆ రోజు ఉదయం నుండీ నేనూ చేసిన అవినీతి , తప్పులు చెప్పమన్నాడు ..

"నేనేం చెయ్యలేదు .. ఉదయం నుండీ నిజాయితీగా ఉన్నాను... అయినా నేనేం అవినీతి చెయ్యగలను..నాకేం అధికారం ఉందని  " అని కాన్ఫిడెంట్ గా చెప్పాను..
" బాగా ఆలోచించు " అని రెట్టించాడు .. 

ఆలోచించడం మొదలు పెట్టాను.....అందరూ సైలెంట్ గా నావంకే చూస్తున్నారు

అంబులెన్స్ ని ఓవర్ టేక్ చెయ్యడం లాంటి చిన్న చిన్న రూల్స్ పాటించకపోవడం లాంటి  తప్పులు పక్కన పెట్టినా .... నిన్నరాత్రి చూసిన డౌన్లోడ్ పైరేటెడ్ సినిమా నుండి, ట్రాఫిక్ కానిస్టేబిల్ కి లంచం ఇచ్చి బయటపడటం, ఫేక్ బిల్లులు పెట్టి టాక్స్ సేవ్ చెయ్యడం (ఎగ్గొట్టడం), గవర్నమెంట్ రేట్ కి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి  మిగతాది బ్లాక్ మనీ తో కొనడం , దొంగ సర్టిఫికెట్స్ లో తక్కువ ఆదాయం చూపించి తెల్లకార్డులు , ఎకనిమికల్లీ బేక్వార్డ్ అని సర్టిఫికెట్స్ వాడుకోవడం..... పొద్దున్న లేస్తే చేసే ప్రతీ పని లోని అదే ఆలోచన. ప్రబుత్వానికి ఎలా టోపీ వెయ్యాలి , ఎలా డబ్బు మిగిల్చాలి అని.... " ఇలా సాగుతున్నాయి  నా ఆలోచనలు .....

నేను మౌనం గా ఉండటం చూసి మురళి గాడు కంటిన్యూ చేసాడు. 

" ఇప్పుడు మనకి వచ్చే జీతానికి , చేతిలో ఉన్న అవకాశానికి సరిపడా అవినీతి మనమూ చేస్తున్నాం. ఏ చాన్స్ వదలడం జరగదు. అలాంటిది ఇంకొంచెం అవకాశం వస్తే ఇంకొంచెం అవినీతి చెయ్యమా.... రాజకీయ నాయకులు , ప్రభుత్వ అధికారులు  అన్నవారు ఎక్కడో పైనుండి దిగిరాలేదు.. వాళ్ళు మన సమాజం లో ఒక భాగం...మన సమాజానికి ఒక చిన్న సాంపిల్... వాళ్లకి అవకాశం వచ్చింది కాబట్టి తింటున్నారు. అవకాశం లేని వాళ్ళు ఏదో నిజాయితీపరుల్లా నటిస్తున్నారు ...ఈ అవినీతి అన్నది మన రక్తం లో ఇంకిపోయింది"... అంటూ చెబుతున్నాడు... 

పెద్దగా ఎవరూ ఎదురు మాట్లాడకపోయే సరికి ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది కానీ ఆ ఆలోచనలు మాత్రం ఎవరి మనసుల్లోనుండి పోలేదు...

***

ఇంటికి వచ్చాక కూడా అవే ఆలోచనలు చుట్టుముట్టాయి....


నిజమేనా మనకి అవకాశం వస్తే మనమూ అంతే అవినీతికి పాల్పడతామా అని.... నాకు వెంటనే ఒక ఉదాహరణ గుర్తొచ్చింది... 
"కొన్నేళ్ళ క్రితం మా మావయ్య ఒకతను ఉద్యోగం సద్యోగం లేకుండా ఒక ఐదు వేలమంది ఉండే చిన్న ఊరికి సర్పంచ్ అవడానికి ప్రయత్నించేవాడు. మొత్తానికి పదేళ్ళు గడిచాక తన ప్రయత్నం ఫలించి సర్పంచ్ గా నెగ్గాడు. అతను సర్పంచ్ అయిన సమయానికి ఆ ఊళ్ళో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. అక్కడ ఎవరయినా పొలాన్ని ఇళ్ళ స్థలాలుగా విడదియ్యాలంటే సర్పంచ్ అనుమతి కావాలి. అయితే ఒక పది స్థలాలు విడదీస్తే ఒక స్థలం ప్రబుత్వ రేట్ కి తనకి అమ్మాలని సర్పంచ్ కండిషన్. అది చట్టపరం గా తప్పు అని ప్రూవ్ చెయ్యలేనిది.... ఎందుకంటే తను ఫ్రీగా తీసుకోవడం లేదు... డబ్బులిచ్చి కొంటున్నాడు. అది కూడా చట్టబద్దం గా ప్రబుత్వ రేట్ కి. అయితే అదే స్థలం మనం అందరం అమ్ముకుంటున్నట్టు తరువాత మార్కెట్ రేట్ కి (ప్రబుత్వరేట్ కి కొన్ని రెట్లు ఎక్కువ) అమ్ముకుంటాడు. ఈ పూర్తి కొనుగోలు అమ్మకం ఎపిసోడ్ లో ఆ సర్పంచ్ మనం అందరం చేసే అవినీతి కన్నా ఎక్కువ అవినీతికి పాల్పడినట్టు అనిపించలేదు. ఎక్కువమంది రాజకీయనాయకులు చేసేది ఇదే...."

చాలా సమయాల్లో కొన్ని ఆర్గ్యూమెంట్స్ వింటూ (చేస్తూ) ఉంటాం. సమాజంలొ ఒక అంతర్భాగం అయిపొయిన ఈ అవినీతికి నేను ఒక్కడిని ఏం చెయ్యగలను అని.... లంచం లేకుండా ఇప్పుడు ఏమి పనులు జరుగుతున్నాయ్ అని ... సరే ..మనం అందరం అన్నా హజారే లా నిరాహార దీక్షలు చెయ్యలేం... అపరిచితుడులో రామం లా అందరిలో ఆడ్ పర్సన్ లా బ్రతకలేం ...  అది  కరెక్టే  కానీ... మనకి కుదిరేవి, చేయ్యగాలిగినవి నిసవార్ధం గా నిజాయితీగా మనం ఎన్ని చెయ్యగలుగుతున్నాం.  ఒక షాప్  లో సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు బిల్ లేకుండా కొన్నవస్తువులకి 10% డిస్కౌంట్ ఇస్తానంటే ఎంతమంది బిల్ ఇవ్వమని 10 % డబ్బులేక్కువిచ్చి సరుకులు కొంటారు. 

ఇంకో చిన్న ఉదాహరణ 
పైరేటెడ్ సినిమాలు చూసేవారిది ఇంకొ రకమయిన వాదన... "వాళ్ళు చెత్తసినిమాలు తీస్తే మనం ఫుల్ డబ్బులిచ్చి కొట్టించుకొవాలా.. ఆ సినిమాల నాణ్యత కు పైరేటెడ్ కాపీనే ఎక్కువ" అని.  ఇంకొంతమంది " మేము ఎక్కడొ ఉన్నాం, మాకు ఇక్కడ పైరేటడ్ తప్ప వేరే మార్గం లేదు... ఏం చెస్తాం" అని. అదే మనకు ఒక స్వీట్ షాప్ లొ స్వీట్స్ కొన్నామనుకోండి  ... ఆ స్వీట్ల నాణ్యత మనకు నచ్చలేదు. అలా అని నెక్స్ట్ టైం నుండి ఆ షాప్ లొ దొంగతనం చెస్తామా.. రెండు మూడు సార్లు చూసి నచ్చకపొతే మానేస్తాం లేకపోతె వేరే చోట కొంటాం ఇంకా కాకపొతే తినడం మానేస్తాం అంతే కానీ స్వీట్లు అలవాటు అయిపోయి ఉన్నాం  అని దొంగతం చెయ్యం కదా... అలాగే విదేశాల్లొ లేక వేరే రాస్ట్రాల్లలొ ఉండేవాళ్ళు .. వాళ్ళకి దొరకని వస్తువులన్నీ అలానే దొంగిలించి తీసుకుంటామా... కొనగలిగితే డబ్బులు ఎక్కువిచ్చి కొనుక్కుంటాం ..లేక మళ్ళీ మన రాస్ట్రం వచ్చేవరకు ఎదురుచూసి ఇక్కడ  నుండి కొనుక్కెళతాం కదా ... మరి సినిమాలకి ఎందుకు ఇలా అంటే... ఇది దొంగిలించడం ఈజీ కాబట్టి .... రకరకాల వంకలు చెప్పి మరీ దొంగలిస్తాం. అలాగే మిగతావి దొరికితే ఇంతే ఈజీగా దొంగలిస్తాం. అందులో సందేహం లేదు.. అది మన నరనరాల్లో జీర్ణించుకుపొయిన  అవినీతి"

"యధారాజా తధాప్రజ" అన్నది రాచరికపు రొజుల నాటి నానుడి. "యధాప్రజ తధారాజా" అన్నది ఇప్పటి నిజం. మనమే ప్రతీ విషయం లో ఇంత స్వార్ధం తో నిజాయితీ లేకుండా అలొచిస్తుంటే ఇక మనల్ని రిప్రజెంట్ చేసే , మనం ఎన్నుకున్న నాయకులు ఇంకెంత స్వార్ధం  తొ ఆలోచిస్తారు.  డబ్బు, మద్యం, గిఫ్ట్లు లంచం తీసుకుని అవినీతి పరుల్ని ఎన్నుకునేది సామాన్య జనమే (మనమే). బోల్డు డబ్బులు ఖర్చుపెట్టి, లంచం ఇచ్చి ఓట్లు కొన్న నాయకులు నిజాయితీ గా పనిచెయ్యాలని కొరుకొవడం చాలా అత్యాశ , అన్యాయం కూడా. మరి ఆ లంచం తీసుకునేవాళ్ళకన్నా ఆ లంచం ఆశ చూపించేవారిదే తప్పు అనుకుంటే , మరి లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులకన్నా లంచం ఇచ్చే మనది తప్పు అన్నమాట. ఇదొక కరేప్షన్ సైకిల్ అన్నమాట... ఈరోజు లంచం ఇచ్చినవాడు రేపు వాళ్ళదగ్గరే తీసుకుంటాడు..ఆ మర్నాడు మళ్ళీ వాళ్ళకే లంచం ఇవ్వాల్సి రావచ్చు... ఆ సైకిల్ అలానే అనంతం గా సాగిపోతుంది.  ఒక రకంగా  ఈ సైకిల్ మన కల్చర్ లో భాగం అయిపొయింది. కొత్త సాఫ్ట్వేర్ మార్కెట్ లోకి రాగానే పాస్వర్డ్ బ్రేక్ చేసేవారిని మహా తెలివైన వాళ్ళగా పోగుడుతాం, డబ్బులిచ్చి ఒరిజినల్ డివిడి కొన్నవాడిని తింగరొడిని చూసినట్టు చూస్తాం. అది ఇప్పటి కల్చర్ ..

ఒక్కడు లక్ష రూపాయిలు ప్రబుత్వ సొమ్ము దోచేస్తే ఎంత నస్టమో, లక్ష మంది ఒక్కొకరు ఒక్కో రూపాయి చొప్పున దొచినా అంతే నస్టం. అయితే రూపాయి ఎవరికీ కనిపించదు.... అది తప్పు లా అనిపించదు....  


నేను మారను కానీ నా పక్క ఉన్నవాళ్ళు అందరు మారిపోవాలి అన్న ఆలోచనలో ఉన్నంతకాలం  ..ఎంతమంది అన్నా హాజారా లు వచ్చినా ఉపయోగం లేదు... ఏదో కొన్నాళ్ళు హడావుడి తప్పించి.... 

మనం చేసే అవినీతి గురించి ఆలోచన లేకుండా ,  సమాజం మాత్రం అవినీతి రహితం గా ఉండాలనుకోవడం , దానికి పాదయాత్రలు చెయ్యడం, నిరాహార దీక్షలు చెయ్యడం, లెక్చర్లు దంచడం కన్నా అత్మ వంచన ఇంకేమీ లేదు. అన్నా హాజారే కి లక్షకోట్లు తిన్న జగన్, రెండువేల ఎకరాలు ప్రబుత్వ రేట్ కి జాక్ పాట్ కొట్టిన రామోజీ రావు   మద్దతు ప్రకటిస్తుంటే ఎంత కామెడీ గా ఉందొ ... మనం మద్దతు ప్రకటించినా అలానే ఉంటుంది....

ఈ రొజు సమాజానికి కావాల్సింది మన నిరాహారదీక్షలు, ఊరేగింపులు కాదు.... ప్రతీ మనిషిలో ఒక చిన్న రిజల్యూషన్. ఈ రొజు నుండి ఈ పర్టిక్యులర్ అవినీతి నేను త్యజిస్తున్నా ... ఈ తప్పు నేను మళ్ళీ చెయ్యను అని.... సంఘానికి పూర్తి వ్యతిరేకంగా ఎదురీదుతూ అపర నిజాయితి పరుడిగా ఒక్కరొజే మారిపొనక్కర్లేదు....మారలేం కూడా...  అయితే మనకి చేతనయినంతలొ... మనం కొంచెం కస్టం తొ చెయ్యగలిగినవి చెయ్యగలిగితే చాలు.... మార్పు చాలా స్లొగా వస్తుంది. అయితే ఆ మార్పు ముందు ఎదుటివాడి నుండి ప్రారంభం అవ్వాలనుకోకుండా... మననుండి ప్రారంభం అవ్వాలని నిర్ణయించుకొవడమే నిజమయిన దేశభక్తి...

ఏ రకం గా చూసిన ముందు మారాల్సినది మనం. ఇది ఒక అవకాశం ... ఈ రోజే చిన్న నిర్ణయం తీసుకుందాం. వీలయినప్పుడల్లా ఒక్కో అవినీతి మార్గం వదిలేస్తూ పోదాం. కొన్నాళ్ళకి అంటే కనీసం ఒకటి రెండు తరాల తరువాతివారికయినా నిజాయితీ  విలువ పూర్తిగా అర్ధం అవుతుంది.

జై హింద్
మంచు 
----
అకుంఠిత దీక్షతొ , పట్టుదలతొ ఇన్ని కొట్లమంది సొదరసొదరీమణులకు ఈ విషయం పై అవగాహన కల్పించి అలొచింపచేస్తున్న అన్నా హజారే కు ధన్యవాదాలు తెలుపుతూ ...