*** శ్రీ రామ***
ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి ఈ అంతరిక్ష పరిశోధనల వల్ల మనం సాధించేది ఏమిటి? వేరే గ్రహాల మీద ఏమి ఉంటే మనకేంటి, లేకపోతే మనకేంటి.. అదే డబ్బుతో బోలెడన్ని మంచి అభివృద్ధి పనులు ఇక్కడే చెయ్యవచ్చు కదా.. ఆ రీసెర్చ్ ఏదో భూమి మీద చేస్తే దాని ఫలితాలు ప్రజలకు వెంటనే అందుతాయి కదా.. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.
హ్మం... ప్రపంచవ్యాప్తంగా చాలామంది అడిగే ప్రశ్న ఇది.. నేను అనుకోవడం సహజంగా మనిషికున్న తెలివితేటలూ, ఆలోచనా పరిజ్ఞానం, మేధస్సు అతనిలో ఎప్పటికప్పుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని, విశ్వాన్ని శోధించాలనే ఆసక్తిని రగిలిస్తూ ఉంటుంది. ఆ లక్షణమే మనిషిని మిగతా జీవులన్నీటి కంటే ఉన్నతంగా నిలబెట్టింది. దాని వల్లే మానవ నాగరికత, సాంకేతికత మొదలైనవన్నీ మరింతగా అభివృద్ధి చెందుతూ మానవ మనుగడ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఆ సముద్రానికి ఆవల ఏముందో తెలుసుకోవడానికి కొలంబస్ లాంటి వాళ్ళు ప్రయత్నించినట్టే ఇప్పుడు ఇంకొంచెం పరిధి పెరిగి భూమికి ఆవల ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు మనిషి.
అది నిజమే కానీ.. నేననేదేంటంటే భూమి మీద ఏ మూల ఏముందో తెల్సుకుంటే మనకి ఏదో ఒక రకంగా ఉపయోగం ఉండొచ్చు. ఆఖరికి సముద్రగర్భంలో అయినా సరే ఫలానా చోట చమురు నిల్వలు ఉన్నాయంటే వెలికి తీసి ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏ మార్స్ మీదో, చంద్రుడి మీదో లేక ఇంకేదో గ్రహం మీదో నీరో, బోల్డంత ఇంధననిల్వలో లేక అంతులేని ఖనిజసంపదో ఉన్నాయని కనిపెట్టాం అనుకుందాం.. దాని వల్ల మనకేంటి ఉపయోగం?
అక్కడ ఏదయినా విలువైన ఖనిజసంపదో, ఇంధనంగా ఉపయోగించదగిన రసాయన మూలకాలో ఉన్నాయని తెలుసుకుంటే, తరువాతి దశలో అవతార్ సినిమాలో చూపించినట్టు మనం వెళ్ళి అవన్నీ తెచ్చుకోవడమే...
అంత దూరం నుండి మనం తెచ్చుకోవడం వీలవుతుందా.. అసలు అది సాధ్యమయ్యే పనేనంటావా?
![]() |
| టైటాన్ మీద మీథేన్ సరస్సుల ఊహచిత్రం |
ఒక శతాబ్దం క్రితం ఇలా 5 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిది నెలల్లో ప్రయాణించగలమని ఎవరైనా ఊహించారా? మనిషి నిరంతర కృషి, పట్టుదలతోనే కదా ఈ రోజు అది సాధ్యమయింది. అలా ఈ గత యాభై సంవత్సరాలలో టెక్నాలజీ అభివృద్ధి చెందిన క్రమాన్ని బట్టి చూస్తే అది అసాధ్యమేం కాకపోవచ్చు కదా.. అసలు అక్కడ దొరికే ప్రకృతి వనరులను భూమి మీదకు తెచ్చుకోవడమే కాదు, ఇక్కడ మనం రోజూ ఉత్పత్తి చేస్తున్న హానికరమైన చెత్తని ఇక్కడే పడేసి భూమిని విషతుల్యం చేసేకన్నా అక్కడకి తీసుకెళ్ళి పారేయొచ్చు కూడా..
హ్మ్.. అయితే ఇంకేం మరి.. మనకి దగ్గరలో ఉన్న చంద్రుడి మీద ఉన్న హీలియం-3 దగ్గర నుండి అక్కడెక్కడో శని గ్రహానికి ఉపగ్రహం అయిన టైటాన్ మీద కురిసే మీథేన్ వర్షాల వరకు అన్నీ మనం తెచ్చేసుకుంటే మనకి ఇక ఇంధనకొరత అన్నదే ఉండదేమో.. చంద్రుడి మీద ఉన్న హీలియం-3 కాలుష్యం విడుదల చెయ్యని క్లీన్ ఎనర్జీ ఇంధనమట కూడా. అయినా అలా దోచుకొచ్చేవన్నీ ఒక్క అమెరికాకేనా.. మిగతా వారికి ఏం లేవా పాపం.. :-)
ఎవరు ముందు వెళ్ళి తెచ్చుకుంటే వారిదే .. ఎందుకంటే మరి ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టేది, రిస్క్ తీసుకునేది వారే కాబట్టి.. ఉదాహరణకి మన దృవప్రాంతాలే తీసుకో. నార్త్‌పోల్‌లొ ఇంధన మరియు కొన్ని అరుదైన ఖనిజవనరులు దొరుకుతాయి అని తెలీగానే ఆ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం అమెరికా, రష్యా, కెనడా, నార్వే వగైరా దేశాలు ఎంత ప్రయత్నిస్తున్నాయో చూస్తున్నాం కదా. అయినా ఈ స్పేస్‌రేస్‌లొ ఇండియా, చైనా, రష్యాలు కూడా ఏమీ తీసిపోలేదు. మన ఇండియా సంగతే చూడూ... ఇప్పటికిప్పుడు మార్స్ మీదకి రాకెట్ పంపుతాం అని ఎందుకు ప్రకటించింది అనుకుంటున్నావ్.. అధిక జనాభా, పేదరికం లాంటి అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఎందుకు అంత ఖర్చుపెడుతున్నారు అనుకున్నావ్.. ఇవన్నీ కూడా ఇంకో ముప్పై నలభై సంవత్సరాల తరువాత, అంటే ఇప్పుడున్న ప్రకృతి వనరులన్నీ అడుగంటిపోయాక భవిష్యత్తులో ఇంధనం కోసం జరగబోయే యుధ్ధాల్లో పైచేయి సాధించడానికి అన్నమాట..
ఇంతకీ ఈ రేస్‌లొ మనవాళ్ళ పొజిషన్ ఏంటో కాస్త వివరంగా చెప్పు.
ఈ
అంతరిక్ష పరిశోధనల రేసులో మన ఇండియా మంచి పొజిషన్ లోనే ఉందని
చెప్పుకోవచ్చు. అయితే మిగతా దేశాలతో పోల్చి చూస్తే మనవాళ్ళు సాధించిన
విజయాలను కొంచెం స్పెషల్ గా మెచ్చుకోవాలి.
ఎందుకలా?
ఎందుకంటే.. సైన్సు, మ్యాథ్స్ విషయంలో మన వాళ్ళకి స్వతహాగా ఉన్న
టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పరిమిత బడ్జెట్,
అణుబాంబు బూచి చూపి కొన్ని సాంకేతిక పరికరాల మీద అమెరికా వాళ్ళు విధించే ఆంక్షలు, అంతర్గతంగా కొన్ని రాజకీయపరమైన ఇబ్బందులు ఇలా ఇంకా ఎన్నెన్నో అడ్డంకులు, అవరోధాలు దాటుకుని మన శాస్త్రజ్ఞులు సాధించే విజయాల యొక్క పరిధి కొంచెం ఎక్కువే అని చెప్పుకోవాలి. అంతెందుకు
మొన్న ఆగస్ట్ పదిహేనున మనవాళ్ళు మార్స్ మీదకు రాకెట్ పంపుతాం అని
ప్రకటించగానే కొన్ని పశ్చిమ దేశాల్లో నిరసన వ్యక్తమైంది. కొంతమంది బ్రిటన్
ఎంపిలు అయితే మార్స్ మీదకి రాకెట్ పంపే స్థోమత ఉన్న భారతదేశానికి పేదరిక
నిర్మూలన ఫండ్ పేరుతో బ్రిటన్ ఇచ్చే ధనసహాయాన్ని నిలిపివేయాల్సిం
పరిమిత బడ్జెట్ అంటే ఎంత ఉంటుందేంటి? అమెరికా లాంటి దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువే ఉంటుందేమో కదా..
నువ్వు ఊహించినట్టుగానే ఈ
స్పేస్ రీసెర్చ్‌కి ఎక్కువ ఖర్చు పెట్టేది అమెరికానే. ఆ దేశం ఇంచుమించు
సంవత్సరానికి 90 వేల కోట్లు ఖర్చు పెడుతుంది. ఇక స్పేస్ రీసెర్చ్‌కి
ఇండియా, చైనా వార్షిక బడ్జెట్ దాదాపు ఆరువేల కోట్లు ఉంటుంది. కొన్ని యూరోప్
దేశాలు మన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినా సరే భవిష్యత్తులో అమెరికాకి సరైన
పోటీ ఇండియా, చైనా, రష్యాల నుండే..
ఏంటీ.. నమ్మలేకుండా ఉన్నా... మన దేశం ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం స్పేస్ రీసెర్చ్ మీద ఖర్చు పెడుతుందా? చాలా ఎక్కువ కదా..
కమాన్..
మన దేశంలో జనాలు మందు మీద ఖర్చు పెట్టే మొత్తం సంవత్సరానికి సుమారు 35 వేల
కోట్లు. కేవలం ఈ మద్యం మీద ఒక 20 శాతం పన్ను వేసినా చాలు ఈ ఆరు వేలు కోట్లు
రాబట్టడానికి. అందులోనూ ఈమధ్య ఇస్రో వేరే దేశాల శాటిలైట్లని మన రాకెట్ల సహాయంతో కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా బాగానే సంపాదిస్తున్నారులే..
హహహా.. అంతేనంటావా.. :-) అయినా మన దేశం డబ్బు పరంగా పేద దేశం అయ్యిండొచ్చేమో కానీ మేధస్సుపరంగా కాదు అని నా నమ్మకం. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి మర్చిపోయాం.నాకయితే అసలు అదొక్కటే చాలు అనిపిస్తుంది. అదేంటంటే.. ఈ రోదసి యాత్రలు, అంతరిక్షపరిశోధనలు, స్పేస్ స్టేషన్లు వీటన్నిటితో మనం అంతరిక్షంలో సాధించే విజయాల సంగతెలా ఉన్నా ఆ పరిశోధనలలో భాగంగా కనిపెట్టే వివిధ రకాల టెక్నాలజీలు బయట వేరే వాటిల్లో ఎంత ఉపయోగపడుతున్నాయో కదా..
నిజమే.. చాలా ముఖ్యమైన కోణం ఇది.. అసలు పర్యావరణం మీద జరిగే పరిశోధనలు, వాతావరణం మీద అధ్యయనం చేసి భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించి మనకి అందించే ముందస్తు హెచ్చరికలు, శాటిలైట్ టీవీలు, GPS లు, సెల్ ఫోన్లు, తేలికైన మరియు ధృఢమైన కార్బన్ ఫైబర్ లాంటి లోహమిశ్రమాలు, రకరకాల ప్లాస్టిక్‌లు, ఎక్కువ కాలం నిలువ ఉండే ఆహార పదార్థాలు, విమానయాన పరిశ్రమలో ఉపయోగించే టెక్నాలజీలు, క్రీడాపరికరాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకి అసలు అంతే లేదు.
స్పేస్ మెడిసిన్ రీసెర్చ్‌లో కూడా ఇలాంటివి చాలానే ఉన్నాయి. క్లిష్టమయిన శస్త్రచికిత్సలలో ఉపయోగించే ఎన్నో వైవిధ్యమైన మరియు అత్యాధునిక టూల్స్ మొదట ఈ రోదసియాత్రల కోసం అభివృద్ధి పరిచినవే ఆ తరువాత అవి మనకి బయట కూడా ఉపయోగపడుతున్నాయి. ఇంకా చంద్రుడి మీద మొక్కలు పెంచే ఉద్దేశ్యంలో రూపొందించబడ్డ కృతిమమట్టి అక్కడ ఉపయోగించకపోయినా ఆ తరువాత భూమి మీద ఎరువులరంగంలొ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అసలు నాసా లెక్క ప్రకారం వాళ్ళు మిగతా ఇండస్ట్రీలతో పాలుపంచుకున్న దాదాపు రెండు వేల టెక్నాలజీలు ఇప్పుడు ఇంచుమించు ముప్పై వేల సెకండరీ అప్లికేషన్స్‌లలో వాడుతున్నారట. అలా ఈ అంతరిక్ష పరిశోధనల వల్ల ఉత్పన్నమైన ఉపఉత్పత్తులు మనకి ఇప్పుడు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఏదేమైనా మానవ మేధస్సుతో ఇలాంటి విజయాలు సాధించినప్పుడు చాలా గర్వంగానూ, వాళ్ళు రూపొందించిన అత్యంత క్లిష్టమయిన టెక్నాలజీలను చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గానూ ఉంటుంది కదా..
అవును.. నేను చెప్పాలనుకున్న ఇంకో పాయింట్ అదే.. మన ఇండియాలో ఏ కారణాల వల్ల అయితేనేమీ టెన్త్ స్టాండర్డ్ అవగానే ఇంజనీరింగ్ లేక మెడిసిన్ అంటూ ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సుల్లోనో, లేక ఇతరత్రా సైన్స్‌కి సంబంధించిన కోర్సుల్లోనో చేరడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. అదే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో ఇలాంటి జాబ్ గ్యారంటీ కోర్సులకన్నా, వాళ్ళకి నచ్చింది, సులభంగా అనిపించిందే చదవడానికి స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి సైన్స్, మ్యాథ్స్‌కి సంబంధించిన కోర్సులు చదివేవాళ్ళు తక్కువైపోతున్నారట. ఇలాంటి పరిశోధనలు, అంతరిక్షంలో నాసా సాధించే విజయాలు అక్కడి యువతలో సాంకేతిక కోర్సుల వైపు మొగ్గు చూపడానికి ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది అని ఒక అంచనా.
అవున్లే పాపం.. భవిష్యత్తులో అమెరికా వాళ్ళు టెక్నాలజీ డెవెలప్మెంట్ విషయంలో చైనా, ఇండియా, కొరియాలతో పోటీ పడాలంటే చాలా కష్టం. ఇప్పటికే పశ్చిమ దేశాలు చాలా వెనుకపడ్డట్టు కనిపిస్తున్నారు.
:-) ఇక ఈ పరిశోధనల్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూసే ఇంకో ప్రధానమైన అంశం అక్కడ నీరు లేక జీవం జాడేమైనా ఉందా అని.. దాని గురించి నీకే బాగా తెల్సు...
ఊ.. నీరు ఉందా లేదా అన్నది ముఖ్యంగా అక్కడ జీవం ఉందా లేదా అని తెలుసుకోవడానికే. అంటే నీరు ఉన్నంత మాత్రాన జీవం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ... అసలు భూమి మీద మొదట జీవం ఉద్భవించింది నీటిలోనే, నీరు ఏర్పడ్డాకే జీవం ఏర్పడటానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని జీవపరిణామ శాస్త్రజ్ఞులు చెప్తారు కదా.. కాబట్టి, ఎక్కడైనా నీరు అంటూ ఉంటే జీవం ఏర్పడి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జీవం అంటే గుర్తొచ్చింది.. ఎప్పటినుండో నన్ను వేధిస్తున్న ఒక ఇంటెరెస్టింగ్ ప్రశ్న అడగనా..
ఏంటది ?
ఇంగ్లీష్ సినిమాల్లో చూపించినట్టు ఈ ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) అనేవాళ్ళు నిజంగా ఉన్నారంటావా? ఉంటే ఎక్కడ ఉండి ఉండొచ్చు? వాళ్ళు చూడటానికి ఎలా ఉండొచ్చు? సినిమాల్లో చూపించినట్టు భయంకరంగా పిశాచాల్లా ఉంటారా? వాళ్ళ శరీరాలు దేనితో తయారై ఉండొచ్చు? మనలా రక్తమాంసాలతోనే ఉంటారా? ఉంటే గింటే వాళ్ళు ఈ ఏలియన్స్ సినిమాల్లో చూపించినట్టు అంత ఇంటెలిజెంట్సా.. మనకన్నా సాంకేతికపరంగా అడ్వాన్స్‌డా? ఒకవేళ ఏలియన్స్‌ని మనం కలిస్తే దానివల్ల మనకి లాభమా నష్టమా?
(ఇంకా ఉంది)
- మంచు & మధుర
DISCLAIMER:
All content
provided on this blog is for informational purposes only. The owner of this
blog and authors of this post make no representations as to the accuracy or
completeness of any information on this site or found by following any link on
this site. Photo courtesy by various websites on internet. 










