Pages

Friday, September 21, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 3/4): ఏలియన్స్ వస్తే?

*** శ్రీ రామ ***




ఈ ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) అనేవాళ్ళు నిజంగా ఉన్నారంటావా? ఉంటే ఎక్కడ ఉండి ఉండొచ్చు? వాళ్ళు చూడటానికి ఎలా ఉండొచ్చు? సినిమాల్లో చూపించినట్టు భయంకరంగా పిశాచాల్లా ఉంటారా? వాళ్ళ శరీరాలు దేనితో తయారై ఉండొచ్చు? మనలా రక్తమాంసాలతోనే ఉంటారా? ఉంటే గింటే వాళ్ళు ఈ ఏలియన్స్ సినిమాల్లో చూపించినట్టు అంత ఇంటెలిజెంట్సా.. మనకన్నా సాంకేతికపరంగా చాలా అడ్వాన్స్‌డా? ఒకవేళ ఏలియన్స్‌ని మనం కలిస్తే దానివల్ల మనకి లాభమా నష్టమా?

ఓ ఓ.. నువ్వు ఒక్క ప్రశ్న అన్నావ్.. ఒకేసారి బోల్డు అడిగేసావ్..

హిహిహీ.. అన్నీటికీ సమాధానాలు చెప్పేసెయ్ మరి.. :-)

ఈ విశ్వంలో మనం ఒంటరివాళ్ళం కాకపోవచ్చు అని నా అభిప్రాయం. ఎందుకో చెప్తా విను. ఈ విశ్వం విశాలమయినది. మన ఊహకి అందనంత పెద్దది. అనంతం (ఇన్‌ఫినిటి) అనడానికి సరైన ఉదాహరణ అనిపించేటంత పెద్దది. ఎంత పెద్దదో వివరంగా చూద్దాం. 

ఊ .. చెప్పు... 

కొత్తగా కనిపెట్టినవి, తీసేసిన మరుగుజ్జు గ్రహాలూ పక్కన పెట్టేసి చూసినా మన సౌరమండలంలో మొత్తం ఎనిమిది గ్రహాలు ఉన్నాయి. అవునా..

ఊ.. కానీ ఒక్క మన భూమ్మీద తప్ప వేరే గ్రహాల మీద ఎక్కడా జీవం అన్నది లేదేమో కదా..

ఉండు.. పూర్తిగా చెప్పనీ.. ఈ సౌరమండలంలో చివరన ఉన్న నెఫ్ట్యూన్ గ్రహానికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం సుమారు 450 కోట్ల కిలోమీటర్లు. దాన్నిబట్టి ఒక అవగాహన వచ్చింది కదా మన సౌరమండలం ఎంత పెద్దదో. అయితే ఇంత పెద్ద సౌరమండలం కూడా మన సోలార్ ఇంటర్స్టెల్లార్ నైబర్‌హుడ్‌లొ అతి చిన్న భాగం. ఇక ఆ సోలార్ ఇంటర్స్టెల్లార్ కూడా మన మిల్కీవే (పాలపుంత) గేలక్సీలో ఎంత చిన్నదో ఈ ఫోటోలో చూడు ఒకసారి.


.. అసలు ఈ గేలక్సీలో మొత్తం ఎన్ని నక్షత్రాలు, ఎన్ని గ్రహాలు ఉండొచ్చంటావ్? 

నక్షత్రాలు ఇంచుమించు 40,000 కోట్లు ఉండొచ్చు. గ్రహాలు ఎన్ని ఉన్నాయో చెప్పడం చాలా కష్టంలే. ఎందుకంటే నక్షత్రాలు అయితే వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశవంతంగా పెద్ద పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని టెలిస్కోపుల్లో చూడటం వీలవుతుంది. గ్రహాల దగ్గరికి వచ్చేసరికి అవి చిన్న పరిమాణంలో ఉంటాయి మరియు నక్షత్రాల్లాగా స్వయంప్రకాశితాలు కాదు. అందువల్ల వీటిని దూరం నుండి టెలిస్కొప్‌లతో వీక్షించడం చాలా కష్టం.

అమ్మో.. నలభై వేల కోట్లే... అంటే దాదాపు నలభై వేల కోట్ల సౌరమండలాలు లాంటివి ఉన్నట్టే కదా.. అస్సలు నా ఊహకి అందడం లేదు ఈ విశ్వం ఎంత పెద్దదో..

ఉండూ.. ఇంకా అవలేదు.. ఇక మనకి తెల్సున్న ఈ విశాల విశ్వంలో దాదాపుగా పది వేల కోట్ల గేలక్సీలు ఉన్నట్టు ఒక అంచనా.. చూడు మరి..

... పది వేల కోట్ల గేలక్సీలు ...
... ఒక్కో గేలక్సీలో నలభై వేల కోట్ల నక్షత్రాలు ...
... ఒక్కో నక్షత్రం చుట్టూ ఎన్ని గ్రహాలు ...

వీటిని బట్టి చూస్తే.. ఇన్ని కోట్ల కోట్ల నక్షత్రాలకున్న గ్రహాల్లో వేరే ఏ ఒక్క గ్రహం మీద అయినా జీవం ఉండే అవకాశం ఉండదా? సాధారణ సంభావ్యత(స్టాటస్టికల్ ప్రాబబిలిటి) లెక్కల ప్రకారం చూసుకున్నా మనం ఒంటరివాళ్ళం కాదనేది హేతుబద్ధమయిన వాదనే కదా...

ఊ.. ఈ ప్రకారంగా ఆలోచిస్తే నాకైతే ఉండొచ్చనే అనిపిస్తోంది.

ఇక ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) ఉంటే చూడటానికి ఎలా ఉండొచ్చన్న నీ రెండో ప్రశ్న గురించి మాట్లాడుకునే ముందు అసలు గ్రహాంతరవాసులు అంటే నీ నిర్వచనం ఏంటో చెప్పు.

అంటే మన భూగ్రహం మీద కాకుండా కాకుండా బయట వేరే ఏదో ఒక గ్రహం మీద నివసించే ప్రాణులు అని..

గ్రహాంతరజంతువుల ఊహాచిత్రం
కదా.. అంటే ఆ వేరే గ్రహం మీద నివసించే జీవులు అమీబా లాంటి ఏకకణ జీవులనుండి డైనోసార్ లాంటి మెగా సైజ్ జీవుల వరకు ఏదయినా అవ్వొచ్చు. వాటికి మనుషుల్లా తెలివితేటలు ఉండొచ్చు లేక భూమి మీద ఉండే మిగతా జంతువుల్లా మనిషి కన్నా బుద్ధిహీనులు అయ్యుండొచ్చు లేక మొక్కల్లాంటి ప్రాణులయినా అవ్వొచ్చు. అందువల్ల నేను చెప్పొచ్చేదేంటంటే బుద్ధిజీవులా లేదా అన్నదానితో పని లేకుండా వేరే చోట అసలు జీవులంటూ అంటూ ఉంటే వాళ్ళు గ్రహాంతరవాసులే..

అంటే ఇంగ్లీష్ సినిమాల్లో చూపించినట్టు ఉండరంటావా?

పైన చెప్పినట్టు ఇంత పెద్ద విశ్వంలో మనలాగానో, లేకపోతే మనకన్నా తెలివైన వాళ్ళో ఉండే అవకాశం లేదు అని ఎలా తీసిపారేయగలం చెప్పు. సాంకేతికపరంగా కూడా మన కన్నా చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటే ఉండొచ్చు. ఇక సినిమాల విషయానికొస్తే కమర్షియల్ అప్పీల్ కోసం అలా విచిత్రంగానో, భయంకరంగానో చూపిస్తారులే...

అంటే మార్లిన్ మన్రో లానో, ఆడ్రి హెప్బర్న్ లానో కూడా ఉండొచ్చంటావ్.. అంతేనా.. :-)

హిహిహి.. ఊ.. I wish :-) కానీ ఆ సైన్స్ ఫిక్షన్ సినిమాలని తక్కువ చెయ్యడానికి వీలు లేదు. కొన్ని సినిమాల్లో చూపించినట్టు ఏలియన్స్ స్పేస్‌షిప్‌లలో ఒక చోట నుండి ఇంకో చోటకి వలస పోతూ విశ్వమంతా తిరగడం అన్నది చాలామంది శాస్త్రజ్ఞులు అంగీకరించే సిధ్ధాంతమే. ఏలియన్స్ని మరీ విచిత్ర వేషధారణలో చూపించడం తప్ప ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలలో చూపించే విషయాలు చాలామటుకు శాస్త్రజ్ఞులు ఊహించేవే.. ఈ సబ్జెక్ట్‌లో సృజనాత్మకత మరియు కల్పనాశక్తి చాలా కీలకమైనవి. అందుకే కొత్త కొత్త సిద్దాంతాలు ప్రతిపాదించడంలో అంతరిక్ష పరిశోధకులతో ఈ సైన్స్ ఫిక్షన్ రచయితలు పోటీపడుతూ ఉంటారు. అసలు ఈ ఏలియన్స్‌కి సంభందించిన అంతరిక్ష పరిశోధనలో ఇమాజినేషన్‌కి అంతు అంటూ ఉండదు.

ఇంటర్ స్టెల్లార్ స్పేస్ షిప్ ఊహాచిత్రం 

ఏదీ.. ఈ సబ్జెక్ట్‌కి సంబంధించిన కొన్ని మంచి సైన్స్ ఫిక్షన్ సినిమాల పేర్లు చెప్పు. నేను చూస్తా..

స్టార్ వార్స్ , స్టార్ ట్రెక్, aliens, 2001 space odyssey, blade runner..

ఆగాగు... ఈ డివిడీలు కూడా నువ్వే పంపాలి, నెట్‌ఫ్లిక్స్ లాంటివి మాకు ఉండవు. :-)

:-) అయితే ఈ లిస్టు అయిపోయింది... సరే కాసేపు సినిమాల సంగతి పక్కనపెట్టి అసలు నీ ఉద్దేశ్యంలో గ్రహాంతరవాసులు ఉంటే ఎలా ఉండొచ్చు అనుకుంటున్నావో చెప్పు..

జీవపరిణామ నియమాలు అన్నవి భూమి మీద జీవకోటికి అయినా ఏలియన్స్‌కి అయినా ఒకేలా ఉండొచ్చేమో  అని నా అభిప్రాయం.

అంటే? ..

ఒక ఉదాహరణకి మన భూమి మీద ఉన్న జంతువులు చూడు. వేటాడే జంతువులకి కళ్ళు ముఖాన ముందరి భాగంలో ఉంటాయి. ఎందుకంటే వేటాడే సమయంలో వాటి లక్ష్యాన్ని గురి తప్పకుండా చూడటానికి సునిశిత దృష్టి ఉండాలి కాబట్టి. అలాగే వేటాడబడే జంతువులకి కళ్ళు పక్కకి ఉంటాయి. ఎందుకంటే అవి కేవలం ఎదుటి వైపు మాత్రమే కాకుండా చుట్టూ ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి ఎటువైపు నుండి ఏది దాడి చేస్తుందా అని.

ఊ.. అర్థమైంది.. అయితే?

అందువల్ల నేను ఏమనుకుంటున్నానంటే.. గ్రహాంతరవాసులకి కూడా ఇటువంటి జీవపరిణామ నియమాలు కొన్ని వర్తించవచ్చు. ఈ నియమాల ప్రకారం మనం కొన్ని ఆకారాలు ఊహించొచ్చేమో.. ఉదాహరణకి నేల మీద నివసించే వాటికి కాళ్ళు లాంటివి ఉండొచ్చని, ఆ గ్రహం మీద మంచి వెలుగుంటే వాటికి కళ్ళు ఉండొచ్చని, ప్రకృతి నుండి వెలుతురు లభించకపోతే మన భూమ్మీద ఉన్న కొన్ని సముద్రగర్భ జీవుల్లా వెలుగుని వాటి శరీర రసాయనాలతో అవే ఉత్పత్తి చేసుకోవచ్చని అలా అన్నమాట. అలాగే జీవపరిణామక్రమంలో పెద్దగా ఉపయోగం లేని అవయవాలు అంతరించిపోవచ్చు. ఉదాహరణకి కోతి నుండి పుట్టిన మనిషికి కొన్నాళ్ళకి తోక అంతరించిపోయినట్టు.

ఆ లెక్కన భూమి మీదకు వచ్చే ఎలియన్స్ ఈ సినిమాల్లో చూపించినట్టు పెద్ద తలకాయతో, సన్నటి కాళ్ళు, సన్నటి చేతులతో ఉండే ఆకారంలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగేకొద్ది చేతులు కాళ్ళు వాడటం తక్కువ అవుతుంది, బుర్ర వాడకం ఎక్కువ అవుతుంది కదా..

ఊ .. ఆ ఛాన్స్ అయితే ఉంది..

అయినా ఎక్కడో గురించి మాట్లాడుకునే ముందు మన భూమి మీద అసలు జీవం ఎలా పుట్టింది అనుకుంటున్నావ్?

అది ఇప్పటికీ పెద్ద మిస్టరీనే.. ఇప్పటివరకూ ఎన్నో రకాల సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి కానీ అందులో ఏ ఒక్కటీ ఇతమిద్దంగా ఇదీ జీవం ఉద్భవించిన ప్రక్రియ అని తేల్చి చెప్పలేకపోయాయి. అంతరిక్షంలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ విత్తనాలు పడి మొలకెత్తిన చందాన భూమ్మీద జీవులు పుట్టుకొచ్చాయి అని (అంటే ఎక్కడినుండో ఆస్టరాయిడ్ల ద్వారా ఘనీభవించిన జీవకణాల రూపంలో భూమి మీదకి వచ్చిపడి ఆ తరువాత ఇక్కడ అభివృద్ధి చెందాయని) కొందరంటే, జీవరహితమైన మట్టి, నీరు లాంటి వాటిలోంచే ఎలాగో మేజిక్ లాగా జీవం పుట్టేస్తుంది అని మరి కొందరు అన్నారు. అయితే వాటన్నిటికన్నా ప్రాచుర్యం పొందిన, శాస్త్రీయమైన ఆధారాలతో కొంతవరకూ నిరూపించబడి ఎక్కువ మంది ఆమోదం పొందిన సిద్ధాంతం అయితే... ఎన్నో బిలియన్ సంవత్సరాల క్రితం కొన్ని మడుగుల్లో, మట్టిగుంటల్లో (అంటే నీటి సమక్షంలో) కొన్ని రకాలైన మూలకాల అణువులు, పరమాణువుల మధ్యన జరిగిన రసాయన చర్యల ఫలితంగా ఒక పెర్ఫెక్ట్ కాంబినేషన్ గల రసాయనబంధంలో స్థిరమైన న్యూక్లిక్ ఆమ్లాల అణువులు ఏర్పడి, వాటికున్న self-replicating ability మూలంగా అవి జన్యుపదార్థంగా ఏర్పడి తద్వారా మొట్టమొదటి జీవకణం పుట్టి ఆ తరువాత జీవపరిణామచక్రంలో వివిధ రూపాలు సంతరించి ఉండొచ్చు అని. అలాగే భూమి మీద ముందు మొక్కలు పుట్టి పెరగడం మొదలయ్యాక భూమి మీద ఆక్సిజన్ శాతం బాగా పెరిగి క్రమేపీ మిగతా అన్నీ రకాల జీవులు అవతరించడానికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయని జీవపరిణామ శాస్త్రజ్ఞుల అంచనా. 

అయితే ... మొదటి జీవి ఈడెన్ గార్డెన్‌లొ కాకుండా బురదలో పుట్టింది అంటావ్.. :-) 

ఊ.. నన్నడిగితే అంతే అంటాను మరి.. :-) అయితే, పైన చెప్పిందంతా కూడా మన భూమి మీద జరిగిన జీవపరిణామక్రమం. అచ్చం ఇదే పద్ధతిలో మరో గ్రహం మీద కూడా జరిగే అవకాశం ఎంత ఉందో, ఇలా కాకుండా మరింకేదైనా కొత్త పద్ధతుల్లో అక్కడ జీవం లాంటి మరేదైనా పుట్టి ఉండొచ్చేమో అన్న అవకాశం కూడా అంతే ఉంది. 

అంటే.. కాస్త వివరంగా చెప్పు.

ఉదాహరణకి నీరు కాకుండా ద్రవరూపంలో ఉన్న అమ్మోనియా, మీథేన్ లేక నైట్రోజన్ ఆధారంగానో జీవం ఏర్పడి ఉండొచ్చు. నేల మీద కాకుండా గాలిలో మాత్రమే ఉంటూ తమకి కావాల్సిన శక్తిని నేరుగా నక్షత్రం నుండే తీసుకునే జీవులు ఉండొచ్చు. కేవలం కొన్ని మిల్లీ సెకన్ల కాలం పాటు మాత్రమే బ్రతికే ప్రాణులు ఉండొచ్చు. కొన్ని వేల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కూడా జీవించగలిగే ప్రాణులు ఉండొచ్చు. అసలు మన భూమ్మీదలా కర్బన ఆధారిత జీవం కాకుండా మనకి పూర్తి విభిన్నంగా సిలికాన్ ఆధారిత జీవం ఉండొచ్చు. ఆక్సిజన్ బదులుగా సల్ఫర్, ఫాస్ఫరస్ బదులు ఆర్సినిక్ లాంటి మూలకాలని ఉపయోగించుకుని బ్రతికే జీవులు ఉండొచ్చు. కేవలం మనలాంటి కర్బన ఆధారిత జీవమే కాకుండా ఇలాంటి రకరకాల కర్బన ఆధారిత జీవపరిణామ అవకాశాలు మరెన్నో కూడాఈ విశ్వంలో ఉండొచ్చని జీవరసాయన శాస్త్రజ్ఞుల అంచనా.

ఊ... ఈ అనంతమైన విశ్వంలో అనంతమైన అవకాశాలు. ఏదైనా సాధ్యమేనన్నమాట. అందుకే మరి.. ముందు చెప్పిన్నట్టు ఈ ఫీల్డ్ లో ఇమాజినేషన్ కి అంతు అంటూ ఉండదు.

అసలు ఈ ఏలియన్స్ అనేవాళ్ళు నిజంగా ఉంటే, వాళ్ళకి మనలా తెలివితేటలు ఉంటే, వాళ్ళు కూడా మనలా ఈ విశాల విశ్వంలో ఇంకా ఏ జీవులున్నాయో అన్న ఆసక్తి కొద్దీ రోదసిలో ప్రయాణిస్తూ మనని వెతుక్కుంటూ రారంటావా? మనకి ఇంతవరకూ అలాంటి సంకేతాలు ఎప్పుడూ అందలేదా?

ఉహూ.. మనకి స్పేస్ నుంచి అలాంటి సిగ్నల్స్ ఏవీ పెద్దగా తగల్లేదు కానీ, ఒకసారి మాత్రం 1977 లో... ఒహియో యూనివర్సిటీలో పెర్కిన్స్ అబ్సర్వేటరీలో డెబ్భై రెండు సెకన్లు ఉన్న మెసేజ్ ఒకటి రికార్డ్ అయ్యింది. దాన్నే WOW సిగ్నల్ అంటారు. ఈ సిగ్నల్ మొదటిసారి చూసిన సైంటిస్ట్ ఆ మెసేజ్ పక్కన WOW! అని రాసాడని అప్పటినుండి ఆ సిగ్నల్ పేరే WOW అయ్యింది.

Interesting! ఆ తరువాత ఏమైంది మరి.. మనవాళ్ళు రిప్లై సంకేతాలు ఏమయినా పంపారా?

ఆ తరువాత మళ్ళీ అటువంటి సంకేతాలేవీ రికార్డ్ అవలేదు. ఫైనల్‌గా ఆ సిగ్నల్ రెండు వందల కాంతి సంవత్సరాల దూరం నుండి వచ్చింది అని తేల్చారు. అంటే ఎంత వేగవంతమయినది అనుకున్నా అది కనీసం రెండు వందల సంవత్సరాల క్రితం పంపింది అయి ఉండాలి. ఎందుకంటే కాంతి కన్నా వేగంగా ఏదీ ప్రయాణించలేదు కదా మరి(?). ఒకవేళ మనం రిప్లై పంపినా అది అక్కడికి చేరేసరికి మినిమం ఇంకో రెండు వందల సంవత్సరాలు పడుతుంది. అంటే వాళ్ళు పంపిన నాలుగు వందల సంవత్సరాలకి వాళ్ళకి రిప్లై అందుతుంది.. అప్పటికి ఆ పంపిన వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు కూడా.. :-)

మరి మనం బోల్డు స్టోరీలు వింటూ ఉంటాం కదా.. కొంతమంది ఈ గ్రహాంతర వాసుల్ని, UFOలు, ఫ్లైయింగ్ సాసర్లని చూసామని ఫోటోలతో సహా చాలా సాక్ష్యాధారాలు చూపిస్తారు. వీళ్ళకి కొన్ని సంఘాలు కూడా ఉంటాయి కదా ..

ఊ.. వాటి గురించి చెప్పకు... వీళ్ళందరివి దాదాపుగా అన్నీ ఒకే రకమయిన కథలు ఉంటాయి. అదేంటో ఆల్మోస్ట్ అన్ని సంఘటనలు అమెరికాలోనే జరుగుతాయి. గ్రహాంతరవాసులకి అమెరికా అడ్రస్ ఒకటే తెల్సేమో అన్నట్టు. సాధారణంగా వాళ్ళు చెప్పే స్టోరీ ఇలా సాగుతుంది. "చీకటి పడి ఉంటుంది.. స్టోరీ చెప్పేవాడు ఒంటరిగా వెళుతూ ఉంటాడు. దూరంగా ఒక వెలుతురు చూస్తాడు. ఏంటో అని అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూస్తే అప్పటికే పని ముగించుకుని తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఒక గ్రహాంతర రోదసినౌక ఉంటుంది. వీడు ఫోటో తీసేలోపు అది వెళ్ళిపోతుంది. లేకపోతే ఆ అధిక వెలుగులో వీడు ఇంకేం చూడలేకపోతాడు" వగైరా వగైరా..

అంటే అవన్నీ అబద్ధాలనేనా.. అంతమంది చెప్పే దాంట్లో కొంచెం కూడా నిజం ఉండదంటావా? మనకి తెలీకుండా అలా ఎలా తీసిపారేయగలం..

చూడు... ఈ గ్రహాంతరవాసులు కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చేది మన భూమి మీద నైట్‌హాల్ట్‌కో, సైట్ సీయింగ్‌కో  కాదు కదా..

మనం వేరే గ్రహాల మీదకి పరిశోధనలకి వెళ్ళినట్టే వాళ్ళు కూడా మన భూమ్మీదకి వచ్చి ఉండొచ్చు కదా మరి..

ఇండిపెండెన్స్ డే సినిమాలొ చూపించిన న్యూయార్క్ నగరం మీద స్పేస్‌షిప్
ఉహూ.. చెప్తా విను... నువ్వు పైన అడిగావే.. మనం ఈ గ్రహాంతరవాసులని కలిసే పరిస్థితి అంటూ వస్తే దాని పర్యవసానాలు ఎలా ఉండొచ్చు అని.. అసలు ఈ గ్రహాంతరవాసులు వాళ్ళ గ్రహం వదిలి వేరే గ్రహాల మీద పడ్డారు అంటే ఏంటి అర్థం?
ఒకటి - ఇంత దూరం రాగలిగారు అంటే వాళ్ళు సాంకేతికపరంగా మనకన్నా చాలా అడ్వాన్స్డ్..
రెండు - వాళ్ళ గ్రహాల మీద ఉన్న ప్రకృతిసిద్ధమైన సంపద అంతా ఖాళీ చేసేసి, ఇంకా వేరే దగ్గరేమైనా దొరుకుతుందేమో దోచుకొద్దాం అనుకుని అప్పుడు ఇలా అంతరిక్షనౌకల మీద ప్రయాణం చేస్తూ వేరే గ్రహాల మీదకి వలస వస్తారు. అయితే వాళ్ళకి ఇలా కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాలంటే బోల్డు ఎనర్జీ కావాలి.. అది అంతరిక్షంలో ఉండే నక్షత్రాల నుండి తీసుకోవచ్చు. కానీ వారి తరువాత తరాల వారికి కావాల్సిన అంతరిక్షనౌకలు తయారు చెయ్యడానికి బోల్డంత ఖనిజసంపద కావాలి. అది మాత్రం అంతరిక్షంలో దొరకదు. ఏదైనా గ్రహాల మీదకే రావాలి. వచ్చి తీసుకుంటా అంటే ఎవరూ ఇవ్వరు కదా.. రావడం, వాళ్ళకి కావాల్సినది దోచుకోవడం, వెళ్ళడం... అంతేకానీ, అన్నేసి కోట్ల కిలోమీటర్ల దూరం అంత సంపద వెచ్చించి, శ్రమపడి వచ్చి ఓవర్నైట్ స్టేలు  సీక్రెట్ రీసెర్చ్‌లు చేసి వెళ్ళిపోవడం అనే విషయం అంత నమ్మశక్యం కాదు. నా ఉద్దేశ్యంలో ఒకవేళ గ్రహాంతరవాసులు అంటూ భూమి మీదకి వచ్చి మనల్ని కలిసారూ అంటే.. అది మానవ జాతికి, ఉహూ.. మొత్తం భూమ్మీద ఉన్న జీవరాశికే ప్రమాదం అయ్యే అవకాశమే చాలా ఎక్కువ.

ఓహో.. అందుకనే వాళ్ళ కన్నా ముందు మనమే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఇలాంటి అంతరిక్ష పరిశోధనలకి సంబంధించిన రహస్యవిషయాలు కొన్ని ప్రభుత్వాలకి తెల్సినా అవి పబ్లిక్ లోకి రాకుండా రహస్యంగా ఉంచుతారు అంటారు. అది నిజమేనా?

అందులో కొంచెం నిజం లేకపోలేదు. ఉదాహరణకి ఒకసారి ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ టోక్యో యూనివర్సిటీలో ఈ విశ్వరహస్యాల మీద ఒక లెక్చర్ ఇవ్వాల్సి ఉండగా, ఆ లెక్చర్‌లో యుగాంతం లాంటి టాపిక్స్ గురించి ఏవైనా ప్రస్తావిస్తే అది తమ దేశ స్టాక్ఎక్సేంజ్ మీద ప్రభావం చూపిస్తుందన్న కారణంతో అలాంటి అంశాల ప్రస్తావన తీసుకురావొద్దని జపాన్ ప్రభుత్వం ఆయన్ని ప్రత్యేకంగా కోరిందట. కొన్ని సందర్భాల్లో ఇలాంటి కొన్ని సున్నితమయిన విషయాలని ప్రభుత్వాలు రహస్యంగా ఉంచుతాయన్నది నిజమే కావొచ్చు. 

సరే కానీ నా కోసం ప్రత్యేకంగా ఈ ప్రశ్న. నాకు 2012 సినిమా చూసినప్పటి నుండి ఒక చిన్న భయం పట్టుకుంది. 2012 సంవత్సరంలో అనే కాదు కానీ అలా మొత్తం మానవజాతినే తుడిచిపెట్టగల భయంకర ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడయినా సంభవిస్తాయంటావా? ఒకవేళ వస్తే ఎప్పుడు రావొచ్చు.. అలాంటివి వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇదొక్కటి చెప్పు.. ప్లీజ్.. :-)



(ఇంకా ఉంది)
- మంచు & మధుర 

DISCLAIMER:
All content provided on this blog is for informational purposes only. The owner of this blog and authors of this post make no representations as to the accuracy or completeness of any information on this site or found by following any link on this site.  Photo courtesy by various websites on internet.

10 comments:

Anonymous said...

seriously....I like this article...

Good job....

శశి కళ said...

చాలా చక్కగా హేతుబద్దంగా వివరించావు మధుర.
మిషన్ టు ది మార్స్ చూసావా?అది కూడా బాగుంటుంది.

భాస్కర్ కె said...

విశ్వం, టాపిక్ క్లాసులో పిల్లలకు అర్ధమైలా చెప్పలంటే చాలా కష్టంగా వుంటుంది, మంచి ప్రయత్నం చేస్తున్నారు, అభినందనలు. అసలు మనుషులే ఇక్కడికి వలస వచ్చిన జీవులు అయ్యే అవకాశం లేదంటారా...

ఇందు said...

ఈ పార్ట్ ఇంకా బాగుంది :) నా అభిప్రాయం కూడా మన ఒంటరి వాళ్ళం కాదనే! :) కానీ,ఇంతవరకు ఏ గ్రాహంతరవాసి భూమిమీదకి రాలెదంటే నమ్మశక్యంగా లేదు. అప్పుడెప్పుడో అమెరికాకి వచ్చిన గ్రహాంతరవాసుల విషయాలను అమెరికా ప్రభుత్వం గోప్యంగా ఉంచింది నాసాలో పనిచేసి రిటైర్ అయిన ఒక శాస్త్రవేత్త చెప్పిన విషయం కలకలం రేపింది కదా! ఇలా జరగకుండా ఉండటానికి అవకాశాలు లేకపోలేదు. అవి మనలాగే ప్రయోగాలనో/పరిశోధనలనో.... ఒక స్పేస్ షిప్ వేసుకుని వచ్చి ఉండొచ్చు. ఇక్కద వాటికి మన వల్ల ఎలాంటి అపాయం ఉంటుందో అని.... అసలు ఇక్కడ మన జీవన స్థితిగతులేంటి... అవి ఉండటానికి అనువేనా? ఈ గ్రహం అసలు వాటికి ఉపయోగకరమేనా అని పరిశీలించడానికైనా వచ్చి ఉండొచ్చు కదా! అలా వచ్చినవి ఎక్కడో ల్యాండ్ అయ్యుండొచ్చు లేదా ఆకాశంలో చక్కర్లు కొట్టి ల్యాండ్ అవకుండా వెనుదిరిగి పోయుండొచ్చు. పాసిబిలిటి ఉంది కదా! :)

ఇంకా కొంతమంది అభిప్రాయం ఏంటంటే.... మన ఏన్సిస్టర్స్... అంటే మన పూర్వికులు/మన డి.ఎన్.ఏ తో పొలికలున్నవారు..... ఇతరగ్రహాల్లో ఉండి ఉండవచ్చు అని అనుమానం. అక్కడనించి జీవం మీరు చెప్పినట్టు ఏస్ట్రాయిడ్స్ వల్ల వలస వచ్చి అది భూమిని ఢీకొన్నప్పుడు దాని చుట్టు ఉన్న మంచుపొరలు కరిగి శిలాజల్లల్లోనించి జీవం బైటపడి అది ఈ భూమి మీద ఉన్న వాతావరణానికి అలవాటు పడి ఎలాగోలా మనుగడ సాధించింది అన్నది ఒక కాన్సెప్ట్[ఇది ఎంతవరకు కచ్చితమో చెప్పలేం ] :)

ఆ ఆ యుగాతం గురించి చెప్పి పుణ్యం కట్టుకోండి మీరిద్దరూ :) అసలె నాకు డిసెంబరు నెల దగ్గర పడేకొద్దీ క్యురియాసిటి పెరిగిపోతోంది ;) :)))

kvsv said...

మంచి టాపిక్..ఇంట్రస్టింగ్ గా ఉంది!!!

Rao S Lakkaraju said...

ఏమిటో అంతా మాయ.

నిషిగంధ said...

pch, didn't expect this from you guys! How can you forget E.T!? :))))


Raj said...

ఇంతకీ ఒక వేళ aliens కనిపిస్తే ఏం చెయ్యాలి... :P

మంచు said...

అనానిమస్ గారు, శశికళ గారు, ఇందూ , the tree గారు, KVSV గారు, లక్కరాజు గారు, నిషిగారు, రాజేంద్ర : అందరికి ధన్యవాదాలు

నిషిగారు: :-) మర్చిపొయాము.. అయితే నేను ఇచ్చిన లిస్ట్ లొ ఉన్న సినిమాలకి ఈటి కి కొంచెం తేడా ఉంది.

రాజేంద్ర: :-) ఒకవేళ వాళ్ళుంట్టున్న ప్రదేశానికి మనం వెళ్ళి కలిస్తే తప్ప... వాళ్ళు వచ్చి మనల్ని కలిస్తే.. ఎదయినా చేసే చాన్స్ ఎక్కువ ఉంటుంది అనుకోను.

మంచు said...

ఇందూ: మేము పొస్ట్‌లో రాసినట్టు ... ఏలియన్స్ భూమి మీదకు వచ్చే చాన్స్ ఉంది అయితే వచ్చి వెంటనే వెళ్ళిపొవడం అన్నది మాత్రం అంత లాజికల్ గా అనిపించదు.

ఉదాహరణకి ఇంత టెక్నాలజి కలిగిన ఏలియన్స్ భూమి మీదకు రావాలి అంటే మన చుట్టుపక్కల ఉన్న నక్షత్ర మండలాల నుండి రావడం కొంచెం కస్టమే. ఏదో ఒక జీవం అయితే ఉండొచ్చేమో కానీ ఇంత తెలివయిన గ్రహాంతరవాసులు రావాలంటే కొంచెం దూరం నుండే రావాలి. ఇక బోల్డు దూరాల నుండి వాళ్ళు ప్రయాణించి రావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా కాంతి కన్నా వేగంగా ప్రయాణించే వాహనాలు కలిగి ఉండాలి. కాంతి కన్నా వేగంగా ప్రయాణించగలగాలంటే బొలెడంత శక్తి కవాలి. ఎంత శక్తి అంటే మన భూమి మీద ఉన్న మొత్తం శక్తి వనరులు అంటే పెట్రొల్, బొగ్గు, నాచురల్ గ్యాస్, హైడ్రోజన్, న్యూక్లియర్ ఇంధనం వగైరా వగైరా అన్నీ కలిపినా సరే సరిపడనంత. అంటే భూమిలాంటి ఒక గ్రహం మీద దొరకనంత. అందుకే మనం ఇప్పుడు కాంతి వేగాన్ని అధికమించగలిగిన వార్మ్ హొల్స్ మీద ప్రయోగాలు చెయ్యలేకపొతున్నాం. ఒకవేళ ఇప్పుడు అంత శక్తి దొరికిందే అనుకున్నా ఆ వనరులన్నీ ఉపయోగించి వేరే గ్రహం మీదని వెళ్ళాం అనుకొ.. జస్ట్ ఒకరోజు ఉండి వచ్చేస్తామా ? మార్స్ మీదకయినా సరే ఒక్కొ ప్రయాణానికి ఖర్చు ఇప్పుడు అవుతున్న ఖర్చుకి కొన్ని లక్షల రెట్లు అవుతుంది అనుకుంటే మార్స్ మీదకి కూడా మనం వెళ్ళం కదా... అంత ఖర్చు భరించి, శక్తి ఖర్చు చేసి అంతో కస్టపడి ఒకవేళ వెళ్ళాము అంటే ఏదో పెద్ద కారణంతొ వెళ్ళినట్టే కదా. అదే లాజిక్ తొ అలొచిస్తే వాళ్ళు రావడానికి అంతే.. అన్నీ కోట్ల కిలోమీటర్లు రావడం పొవడం అంత ఈజీ కాదు. అందువల్ల అంత ఖర్చు పెట్టుకు వస్తే అంత సింపిల్ గా ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళడం అన్నది జరగదేమో అని నా అభిప్రాయం..

అలా కాకుండా ఒక స్పేస్ షిప్ లో వచ్చి మన సూర్య మండలం లోనే ఒక పక్క స్టేషన్ ఏర్పాటు చేసుకుని అక్కడ నుండి భూమి మీదకు వచ్చి పోవడం అన్నది సాధ్యమయ్యేదే ! కానీ మనకి అంత దగ్గరలో ఉంటే మనం ఈజీగా కనిపెట్టగలం. అలా కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి అసలు టెక్నాలజీ కొంచెం కూడా తెలీనప్పుడు వాళ్ళు వచ్చి అలా వెళ్లి ఉంటారు అంటే.. దానికి కొంచెం చాన్స్ ఉంది. అంటే పిరమిడ్లు కట్టే కాలం అనుకుంటే.
కానీ స్టిల్.. నాకయితే ఇది నమ్మకం గా అనిపించదు...:-))