Pages

Tuesday, September 13, 2011

మేము మర్చిపోలేదు... క్షమించలేదు.. - 2

*** శ్రీ రామ *** 


చాప్టర్ -2 : ప్రతీకారం 


మొదటి భాగంలో బ్లాక్ సెప్టెంబర్ అనే టెర్రరిస్టు సంస్థ అమాయక ఇజ్రాయిలీ ఆటగాళ్ళ మీద చేసిన కిరాతకం గురించి తెలుసుకున్నాం. 

గోల్డా మెయర్
తమ దేశ ఆటగాళ్ళని నిరాయుధులని చేసి దారుణంగా హింసించి, అమానుషం గా చంపివేసిన సంఘటన ఇజ్రాయిల్ దేశ ప్రజలని తీవ్రంగా కలచివేసింది. బాధ్యులయిన వారిని కఠినం గా శిక్షించాలని ప్రభుత్వం మీద వివిధవర్గాల నుండి వత్తిడి పెరిగింది. అయితే జరిగిన సంఘటనను అంతే సీరియస్ గా తీసుకున్న ప్రధానమంత్రి గోల్డా మెయర్ తన సొంత నాయకత్వం లో , మోస్సాద్ డైరెక్టర్ Zvi Zamir, డిఫెన్స్ మినిస్టర్ మోషే దయాన్ మొదలగు ప్రభుత్వ ఉన్నతాధికారులతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి "Committee X" అనే ఒక కమిటీ  ఏర్పాటు చేసారు. 


ఇలాంటి దారుణమయిన సంఘటనలు ఇకపై ముందు ముందు జరగకుండా ఉండాలంటే ఈ మ్యూనిచ్ హత్యాకాండకు ప్రత్యక్షంగా బాధ్యులైన ఆ బ్రతికున్న ముగ్గురు టెర్రరిస్టులతో పాటు వీరికి కావాల్సిన ఫండ్స్, ప్లాన్స్ సమకూర్చిన తెరవెనుక వ్యక్తులను, సంస్థలను ఎవరినీ వదలకూడదని  ఈ కమిటి తీర్మానించింది. అంటే కసబ్ లా చావుకి తెగించి వచ్చిన ముష్కరులను మాత్రమే శిక్షించి సరిపెట్టేస్తే,  ఈరోజు కసబ్ ని పంపినవారు రేపు ఇంకొకడిని పంపిస్తారు కదా అన్నది వాళ్ళ ఉద్దేశ్యం. అయితే శత్రుదేశం అండదండలతో వారి దేశాల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని ఈ టెర్రరిస్టు కార్యకలాపాలు సాగిస్తున్న వారిని వెతికి పట్టుకుని ఇజ్రాయిల్ తీసుకొచ్చి శిక్షించడం జరిగే పని కాదు కనుక వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికే దొంగచాటుగా వెళ్లి చంపాలని ఈ కమిటీ సలహా ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదన ప్రధానమంత్రి గోల్డా మెయర్ కి అంత నచ్చలేదు. అయితే దేశ ప్రజల నుండి, ప్రభుత్వ ఉన్నతాధికారుల నుండి వస్తున్న ఒత్తిడికి తలవంచి అయిష్టంగానే ఈ ఆపరేషన్ కి సమ్మతించింది.


అదే సమయంలో ఈ బ్లాక్ సెప్టెంబర్ టెర్రరిస్టులు జర్మనీకి చెందిన లుఫ్తాన్సా విమానం LH615 ని హైజాక్ చేసి ఆ మ్యూనిచ్ హత్యాకాండలో పాల్గొన్న తమ సహచరులను వెంటనే వదిలేయాలని డిమాండ్  విధించారు. ఈ డిమాండ్లను జర్మనీ మొదట అంగీకరించలేదు. అయితే తమ సంస్థ సభ్యులను విడుదల చేసేవరకు  లుఫ్తాన్సా విమానాన్ని ల్యాండ్ అవనివ్వమని , తమ అనుమతి లేకుండా ల్యాండ్ చేస్తే విమానాన్ని పేల్చి వేస్తామని తేల్చి చెప్పడం తొ విధిలేని పరిస్తితులలొ ఆ ముగ్గుర్ బ్లాక్ సెప్టెంబర్ తీవ్రవాదులని జర్మని విడుదల చేసింది. తమ డిమాండ్లు నెరవేరాక ల్యాండ్ అవడానికి అనుమతించిన విమానం లొ అప్పటికి కేవలం ఒక్క నిముషం మాత్రమే ప్రయాణిచడానికి సరిపడా ఇంధనం మిగిలిందట.
అయితే ఈ తీవ్రవాదులను ఇజ్రాయిల్ తీసుకొచ్చి చట్టప్రకారం శిక్ష విధిద్దాం అని ఎదురు చూస్తున్న సమయంలో ఇలా వెస్ట్ జర్మనీ తీవ్రవాదులను వదిలి వెయ్యడంతో ప్రధానమంత్రి గోల్డా మెయర్ కి ఈ ఆపరేషన్ అమలు పరచడానికి తన మనసులో ఉన్న చిన్నపాటి సంశయం కూడా తొలగిపోయినట్టయింది.

Operation Wrath of God  అని నామకరణం చేసిన అపరేషన్ లొ మొదటి టాస్క్ ఏమిటంటే... అసలు ఈ హత్యాకాండ వెనుక ఎవరున్నారు, ఏ ఏ టెర్రరిస్టు ఆర్గనైజేషన్స్ లీడర్లు ఏ విధం గా సపోర్ట్ చేసారు, ప్లాన్ ఎవరు చేసారు, డబ్బు ఎవరు సమకూర్చారు ఇలా ఒక లిస్టు తయారు చెయ్యడం. తమ మోస్సాద్ గూఢచారులు మరియు ఇతర ఐరోపా మితృ దేశాల గూఢచారి సంస్థల సహాయంతో తయారు చేసిన ఆ లిస్టులో 20 నుంచి 35 మంది బ్లాక్ సెప్టెంబర్ మరియు పిఎల్‌వొ  సంస్థలకి చెందిన వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు ఉన్నారు. ఈ లిస్టు రెడీ అయ్యాక వీళ్ళు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు అన్నది కనిపెట్టడం రెండవ పని. అది ఇజ్రాయిల్ గూఢచారి సంస్థ అయిన మోస్సాద్ కి అప్పచెప్పారు. అమెరికాకి సిఐఏ, రష్యాకి కేజిబి లా మోస్సాద్ అనేది ఇజ్రాయిల్ యొక్క సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అన్నమాట. 

అయితే ఇక్కడ ఈ టెర్రరిస్టు నాయకులని శిక్షించేటప్పుడు మోస్సాద్ యొక్క లక్ష్యాలు ఏంటంటే...
  • ఎట్టి పరిస్థితులలోను ఆ టెర్రరిస్టు నాయకులని చంపడం వెనుక ఇజ్రాయిల్ హస్తం ఉందని సాక్ష్యాలు దొరకకూడదు...
  • చంపే విధానం టెర్రరిస్టులకు వణుకు పుట్టించే విధంగా ఉండాలి..
  • "తప్పు చేస్తే ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా మీరు మా నుండి తప్పించుకోలేరు.... మేము తలచుకుంటే ఎక్కడికి వచ్చి అయినా మిమ్మల్ని చంపగలం" అన్న మెసేజ్ బలంగా పంపడం...
వగైరా అన్నమాట... 

ఆ మొస్సాద్ టార్గెట్ లిస్టులొని వ్యక్తులు ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారో తెలిసాక వీళ్ళను చంపడానికి మోస్సాద్ ప్రత్యేకమయిన టీంలు తయారు చేసింది. పదిహేను మందితో కూడిన ఒక్కో టీంలో ఐదు విభాగాలు ఉండేవి..
  • పూర్తిగా శిక్షణ పొందిన ఇద్దరు మెయిన్ కిల్లర్స్, 
  • వీళ్ళను చూసుకుంటూ వీరి వెనుకే అనుసరించే ఇంకో ఇద్దరు బ్యాకప్ కిల్లర్లు, 
  • వీళ్ళు చంపడానికి వెళ్ళినప్పుడు ఆయా దేశాల్లో ఉండటానికి అవసరమయిన హోటల్స్, అపార్ట్మెంట్లు, అద్దె కార్లు వగైరా ఏర్పాట్లు చూడటానికి ఒక ఇద్దరు ఏజెంట్లు, 
  • అప్పట్లో సెల్ ఫోన్ లు లేవు కాబట్టి కమ్యూనికేషన్ కోసం ఇద్దరు స్పెషలిస్ట్లు, 
  • మిగతావారు చంపబోయే ఆ టెర్రరిస్టు నాయకుడి కదలికలు గమనించి ఫైనల్ ప్లాన్ తయారు చెయ్యడానికి మరియు తరువాత పారిపోవడానికి అవసరమయిన ఎస్కేప్ రూట్లు తయారు చేసే టీం అన్నమాట.

ప్రతీ ఆపరేషన్ ముందు ఈ టీం చంపడానికి కొన్ని గంటల ముందు
చంపబోయే ఆ టెర్రరిస్టు నాయకుడి ఇంటికి ఒక ఫ్లవర్ బొకే తో ఈ మెసేజ్ పంపేవారు...

"A reminder we do not forget or forgive"  ("మేము మరచిపోం.. క్షమించం..")



ఈ మ్యూనిచ్ హత్యాకాండ జరిగిన నలభై రోజుల తరువాత... ఇటలి లోని రోమ్ నగరంలొ పిఎల్‌వొ  (పాలస్తినా లిబెరేషన్ ఆర్గనైజేషన్) కి ఇటలీ రెప్రజెంటేటివ్ గా పనిచేస్తూ మ్యూనిచ్ ఒలంపిక్ హత్యాకాండకు అండదండలు అందించాడని అనుమానిస్తున్న Abdel Wael Zwaiter డిన్నర్ ముగించుకుని తిరిగి తన  నివాసానికి వస్తుండగా, రోడ్డుపక్కన నక్కిన ఇద్దరు ఏజెంట్ల చేతులలో హత్యకు గురయ్యాడు. హత్య చేసినవారు ఇతన్ని తుపాకితో పదకొండు సార్లు కాల్చారు... చనిపోయిన పదకొండు మంది ఇజ్రాయిలీ ఆటగాళ్లకి గుర్తుగా...  


రెండో ప్రతీకార హత్య ప్యారిస్ లో జరిగింది... పిఎల్‌వొ ఫ్రాన్స్ రెప్రజెంటేటివ్ గా ఉన్న మహ్మద్ హంషారి ని పత్రికా విలేఖరిగా తనను తాను పరిచయం చేసుకున్న ఒక ఏజంట్ మాయమాటలు చెప్పి ఇంటినుండి బయటకు తీసుకెళ్లగా... అదే టైంలో ఇంకో ఇద్దరు ఏజెంట్లు అతని ఇంట్లోకి ప్రవేశించి ఫోన్ లో బాంబ్ అమర్చారు. ఇతను తిరిగి ఇంటికి వచ్చాక అతనికి ఫోన్ చేసి... ఫోన్ ఎత్తింది హంషారినే అని ధృవీకరించుకున్నాక... రిమోట్ తో ఆ బాంబు పేల్చివేసారు. 

ఆ తరువాత బ్లాక్ సెప్టెంబర్ సైప్రస్స్ రెప్రజెంటేటివ్ ఆల్ బషీర్ తన మంచం కింద పెట్టిన బాంబు ప్రేలి మరణించగాబ్లాక్  సెప్టెంబర్ తీవ్రవాదులకి అయుధాలు అందచెయ్యడం లొ కీలక పాత్రధారి "లా ప్రొఫెసర్ అల్ కుబైసి" పారిస్ రోడ్డు మీద ఏజంట్ల తుపాకి బుల్లెట్ల నుండి తప్పించుకోలేక పోయాడు. 



తరువాతి టార్గెట్ లెబనాన్ లోని బీరుట్ నగరంలో అత్యంత కట్టుదిట్టమయిన భద్రత మధ్య ఉన్న పిఎల్‌వొ ఉన్నత అధికారులు... లెబనాన్ శత్రుదేశం కాబట్టి ఇంతకు ముందులా సులభంగా ఆ దేశం లోకి ప్రవేశించి వాళ్ళని చంపలేరు... అందుకే వీరి కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.  ఏప్రిల్ 13, 1973 అర్ధరాత్రి అకస్మాత్తుగా చేపట్టిన ఆపరేషన్లో బాంబులు వేసి కొందరు పిఎల్‌వొ కీలక నేతలు మకాం ఉంటున్న భవంతిని బాంబులతో పేల్చివేయడం ద్వారా పలు తీవ్రవాద నేతల్ని మట్టుపెట్టారు. అప్పుడు ఆ ఆపరేషన్ పాల్గొన్న కమెండోలలో ఆ తరువాత ఇజ్రాయిల్ కి ప్రధాన మంత్రిగా పనిచేసిన Ehud Barak కూడా ఉన్నారు.  

అలా కొన్ని ప్రతీకార హత్యలు జరిగాక... మోస్సాద్ మ్యూనిచ్ హత్యాకాండకి మాస్టర్ మైండ్ అని భావించే అలీ హసన్ సలేమా అనే బ్లాక్ సెప్టెంబర్ కీలక నేతపై దృష్టి సారించింది. ఒక సంవత్సరం ఇతని కోసం ప్రపంచం అంతా గాలించాక అతను నార్వేలో లిల్లి హామార్ అనే ఊళ్ళో హోటల్ వెయిటర్ గా పనిచేస్తున్నాడన్న సమాచారం అందింది. అక్కడకు చేరుకొని ఆపరేషన్ పూర్తి చేశాక మోస్సాద్ ఏజెంట్స్ కి ఆ వెయిటర్ తాము అనుకుంటున్న అలీ హసన్ కాదని, అతనొక అమాయక వ్యక్తి అని తెలుసుకున్నారు... అదే టైంలో ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఏజంట్లు అందరూ నార్వే పోలీసులకి నాటకీయ ఫక్కీలో దొరికిపోయారు... అయితే ఒక రెండు సంవత్సరాల తరువాత వాళ్ళు బయటకు వచ్చేసారు కానీ... నార్వే లో జరిగిన పొరబాటుకు ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన  నిరసనల  వల్ల ఇజ్రాయిల్ ఈ ప్రతీకార ఆపరేషన్ని రద్దు చెయ్యాల్సి వచ్చింది. అయితే... అసలు ఆ అలీ హసన్ పోలికలు ఉన్న అమాయక వ్యక్తిని అలీ హసనే అని తప్పుడు సమాచారం అందించి,  మోస్సాద్ ఏజెంట్లు ఆ అమాయకుడిని చంపాక వెంటనే నార్వే పొలీసులకి సమాచారం అందించి ఈ ఏజంట్లు దొరికిపోయేలా చెయ్యడం, అలాగే జరిగిన పొరబాటుని ప్రపంచం ముందు ఉంచడం ద్వారా... మిగతా దేశాల నుండి ఒత్తిడి తెప్పించి ఈ ఆపరేషన్ని రద్దు అయ్యేలా చెయ్యడం ఇదంతా స్వయంగా అలీ హసన్ పన్నిన కుట్రే!

1973 లో ఈ లిల్లి హెమర్ పొరబాటు వల్ల రద్దయిన మోస్సాద్ ఆపరేషన్ మళ్ళీ 1978 లో కొత్త ప్రధాని నాయకత్వంలో పునఃప్రారంభించబడింది... మళ్ళీ అలీ హసన్ గురించి ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ మొదలయ్యి మొత్తానికి అతను లెబనాన్ లో తలదాచుకుంటున్నట్టు గుర్తించారు. బ్రిటిష్ , కెనడా పాస్‌పొర్ట్ లతొ లెబనాన్ లొ ప్రవేశించిన మొస్సాద్ ఏజెంట్లు అలీ హసన్ ఎక్కువగా సంచరించే వీదిలొనే ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని రెండు నెలల పాటు అతని కదలికలని బాగా గమనిస్తూ, అనువైన సమయం కొసం ఎదురు చూసి అఖరికి 1979 జనవరి 22 మధ్యాహ్నం కార్ బాంబు పేల్చి అతన్ని అంతమొందించారు. అలా కొన్నాళ్ళ వరకూ ఈ ప్రతీకార హత్యలు కొనసాగాయి కానీ మ్యూనిచ్ హత్యాకాండలో ప్రత్యక్షంగా పాల్గొన్న టెర్రరిస్టులలో మిగిలి ఉన్న ముగ్గుర్ని మోస్సాద్ ఏజెంట్లు చంపగాలిగారా లేదా అన్నది ఇప్పటికి ప్రశ్నే! ఈ ప్రతీకార హత్యలే కాకుండా కొంచెం అనుమానం ఉన్న హైర్యాంక్ లో ఉన్న పిఎల్‌వొ నాయకుల్ని నియంత్రించడానికి అనేకమయిన సైకలాజికల్ యుద్ధాలు కూడా మోస్సాద్ చేపట్టింది. అందులో వాళ్ళ పర్సనల్ సీక్రెట్స్ (ముఖ్యంగా చీకటి కోణాలు) సంపాదించి... పిఎల్‌వొ కి దూరంగా ఉండకపోతే ఆ సీక్రెట్స్ పబ్లిక్ లో పెడతాం అని బెదిరించడం లాంటివి కొన్ని... 


అలా ఆ మ్యూనిచ్ హత్యాకాండకి బాధ్యులయిన వారిని వేటాడి చంపడం ఆ తరువాత ఇరవై సంవత్సరాల పాటు జరిగింది... అవును ఇరవై సంవత్సరాలే! ఎందుకంటే.... "they do not forget or forgive".

అయితే ఈ ప్రతీకారచర్యలు మధ్యప్రాచ్యంలో శాంతికి తోడ్పడ్డాయా? ఇలా దొంగతనంగా చంపడం సబబేనా.. నైతికంగా సరి అయినదేనా? ఇలా టెర్రరిస్టులను శిక్షించే క్రమంలో కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.. అది తప్పు కాదా? దీనివల్ల ఇజ్రాయిల్ సాధించింది ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి...  అవును ఇది మధ్య ప్రాచ్యంలో శాంతి పెంపొందించలేదు.. కానీ వాళ్ళు అనుకున్నది సాధించారు.. తమ దేశప్రజలపై,  అమాయక ఆటగాళ్ళపై భయానక దాడి చేసిన వారికి శిక్ష అమలు పరచడానికి ఎంతకయినా తెగిస్తాం అని నిరూపించారు.... పిరికిపందలుగా వచ్చి హత్యలు చేసి పరాయి దేశం చేరిపోతే చాలు అనుకునే వాళ్లకి మీరు ఎక్కడ ఉన్నా మేము మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు అన్న మెసేజ్ బలంగా పంపించారు. 

ఒక్కమాటలో చెప్పాలంటే టెర్రరిస్ట్లకే టెర్రర్ పుట్టించారు.

ఇక మన కమాండోలు పాకిస్తాన్ వెళ్లి మన దేశసమగ్రతను విచ్ఛిన్నం చెయ్యడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తున్న ప్రతీ ఒక్కడిని ఆ మాటకొస్తే  ఏ ఒక్కడినయినా ఇలా వేటాడి శిక్షించే రోజు వస్తుందంటారా? అమాయక ప్రజల్ని అత్యంత కిరాతకం గా చంపుతున్న వారిని పట్టుకొవడానికి ఇప్పటికిప్పుడు మనం అమెరికా వాడిలా కొట్లు కుమ్మరించి యుద్దానికి వెళ్లమని కొరడం లేదు.... అక్రమిత కాశ్మీర్ మీద దాడులు చేసి తీవ్రవాద ట్రైనింగ్ క్యాంపులు నాశనం చేస్తారన్న ఆశ అస్సలు లేదు. కఠినమైన కొత్త కొత్త చట్టాలు తెచ్చి తీవ్రవాదం అరికట్టడానికి ప్రయత్నించి మైనారిటీల మనొభావాలను కించపరచమని కొరడం లేదు. అడిగేదల్లా ఒక్కతే.. సాధారణ ప్రజల ప్రాణానికి కూడా కాస్త విలువ నివ్వమని. 

చేతికి దొరికినా, వాళ్ళ నేరం నిరుపించబడ్డా, అత్యున్నత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసాకా కూడా... స్వార్ధ ప్రయోజనాల కొసం వాళ్ళకా శిక్ష అమలుపరచలేని (అమలుపరచని) దొంగ వెధవలని మనం ఎన్నుకున్నంత కాలం అది అత్యాశేనంటారా? 

మనపై జరిగిన అమానుషదాడిని "  క్షమించడం ... మర్చిపొవడం.... "  అన్నది .....

మొదటిసారి మన విశాల హృదయాన్ని, మంచితనాన్ని సూచిస్తే... రెండొసారినుండి అది మన చేతకానితనానికి చిహ్నం 


జై హింద్ 

 - మంచు


------------------------------------------------------------------------
గొల్లపూడి మారుతిరావ్ గారి వ్యాసం కూడా ఇక్కడ చదవగలరు. 


అలాగే మ్యూనిచ్ మారణకాండ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నవారు... ఈ పుస్తకాలు, సినిమాలు చూడవచ్చు.
 పుస్తకాలు
1. Simon Reevs రాసిన One Day in September: the full story of the 1972 Munich Olympics massacre and the Israeli revenge operation 'Wrath of God',
2. George Jonas రాసిన  Vengeance: The True Story of an Israeli Counter-Terrorist Team
సినిమాలు
1. Sword of Gideon  (HBO మూవీ)  మరియు

2. స్టీవెన్ స్పెల్బెర్గ్  యొక్క Munich సినిమా




Monday, September 12, 2011

మేము మర్చిపోలేదు.. క్షమించలేదు!

 *** శ్రీ రామ ***






నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో బాంబు ప్రేలుడు... 11 మంది మృతి... క్షతగాత్రులు రెండు వందలు పైమాటే... ఇప్పటికే చాలామంది ఈ సంఘటన మర్చిపోయే ఉంటారు.. ఈ రోజుల్లో అత్యంత సర్వసాధారణమైన ఇలాంటివాటిని ఎవరయినా ఎక్కువ కాలం ఎందుకు గుర్తుంచుకుంటారు చెప్పండి...


టెర్రరిస్టు దాడి చిన్నదయితే అంటే ఒక్కచోట మాత్రమే ప్రేలుడు సంభవించి మృతులు పదుల సంఖ్యలో ఉంటే, ఆ సంఘటన తాలూకు వివరాలు వార్తాప్రసారాల నుండి, మన మనసు నుండి కూడా ఒకటి రెండు రోజులలోనే తొలగిపోతాయి. అదే ఆ  సంఘటన పెద్దదయితే అంటే ఏక కాలంలో అనేక చోట్ల ఈ ప్రేలుడు సంభవించి మృతుల సంఖ్య వందల సంఖ్యలో ఉన్నా, లేక ఆ పేలుళ్ళలో ఎవరైనా రాజకీయ ప్రముఖులు ఎఫెక్ట్ అయినా కొన్నాళ్లపాటు దేశమంతా హడావుడి ఉంటుంది.

ఇది పిరికిపందల చర్య  అని రాజమాత ఇటలీ గాంధీ సెలవిస్తే .. ప్రజలంతా సంయమనం పాటించాలని, మనం అందరం ఐకమత్యం చూపించాల్సిన సమయం వచ్చిందని ముఖంలో ఏ ఫీలింగ్ బయటపడకుండా గంభీరంగా మన ప్రధానమంత్రి గారు పత్రికాప్రకటనలు విడుదల చేస్తారు. గంటగంటకి వేసుకున్న సూటు మళ్ళీ వేసుకోకుండా, మేకప్ చెరిగిపోకుండా కెమెరా ముందు ప్రకటనలు గుప్పించే హోమ్ మినిస్టర్లూ, "ఓలమ్మో ఇంత పెద్ద దేశంలో ఏ పక్క నుండి ఎవడు వచ్చి బాంబు విసురుతాడో తెలీదు, ఈ టెర్రరిస్టులను అదుపులో పెట్టడం అంత ఈజీ కాదు" అని వాపోయే హోమ్ మినిస్టర్లూ.. మనకి ఆదర్శప్రాయులయిన రాజకీయ నాయకులే! ......   అసలు ప్రపంచంలో టెర్రరిజం ఎక్కడ లేదు, అభివృద్ధి చెందిన దేశాలే ఈ టెర్రరిస్టుల దెబ్బకి విలవిలలాడుతుంటే ఇక మనమెంత అని తను భారతీయుడని చెప్పుకోవడానికి సిగ్గుపడే మన యూత్ ఐకాను, ఇస్లామిక్ టెర్రరిజంలో 'ఇస్లామిక్' అన్న మతపరమయిన రిఫరెన్స్ తీసేయ్యమని ఒక పక్క ప్రపంచం అంతా కోరుతుంటే, అది సరిపోనట్టు టెర్రరిజంకి కొత్త మతరంగులు పులిమే దిగ్విజయ్ లాంటి దగుల్బాజీలు మన ముందు బోల్డు మంది. మేముంటే ఏదో పొడిచేస్తాం, పోటా లాంటి కొత్త కొత్త చట్టాలు తెచ్చి టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తాం అని చెప్పుకునే పార్టీలు కూడా గతంలో అదే తీవ్రవాదుల్ని దగ్గరుండి విమానంలో కాందహార్ లో దింపి వచ్చిన సిగ్గుమాలిన సంఘటన మర్చిపోయారేమో! ఏదయినా ఓటు బ్యాంక్ రాజకీయాలు, నిలువెల్లా స్వార్ధం, ఎంత జరిగినా రెండు రోజులకే మర్చిపోయి మాములైపోయే ఉదాసీనత, మనకీ మన కుటుంబానికి నష్టం కలగకపోతే చాలు ఎవరినయినా ఇట్టే క్షమించే అతి జాలిగుణం, ఒకటా రెండా...  మన పరిస్థితికి ఇలా ఎన్నో కారణాలు... అందులో చాలామటుకు సాధారణ పౌరులుగా మన బాధ్యత కూడా చాలా ఉందనుకోండి.


హా... మీదంతా ఉడుకు రక్తం.. ఆలోచన లేకుండా ఆవేశం ఒక్కటీ పనికి రాదు.. ఇప్పుడు ఏం చెయ్యాలంటారు... అమెరికాలా తన మీద దాడి చేసినవాడిని పట్టుకోవడానికి  వేల కోట్లు ఖర్చుపెట్టి సంవత్సరాల తరబడి యుద్ధం చేసేంత సామర్థ్యం మనకి ఉందా అని కొంతమంది అడుగుతారు.  నిజమే.. అసలు మనం అలా యుద్ధానికెళితే "నా నొప్పి నీ నొప్పి సమానం కాదు అందువల్ల నాకో రూలు, నీకో రూలు" అనే అమెరికానే ఊరుకోదు ముందు... మనం మనం యుద్ధం చేసుకుంటే వాడికి కలిసొచ్చేది ఏం లేకపోతే వాడు ఆంక్షలు విధించో, మిగతా యూరోప్ వాళ్లతో కలిసి ఒత్తిడి తెచ్చో మనల్ని ఆపడానికే ప్రయత్నిస్తాడు. మిగతా దేశాల నుండి వచ్చే ఒత్తిడి తట్టుకుని, వేల కోట్లు ఖర్చుపెట్టి , అన్నిటికన్నా మన అంతర్గత దేశ ద్రోహులయినటువంటి కుహనా లౌకిక వాదుల గోల తట్టుకుని యుద్ధం చేసేంత సీన్ నిజంగా మనకి ఉందంటారా!


సరే... ఇవి చర్చించడానికి ఈ పోస్ట్ కాదనుకోండి... అయితే చరిత్రలో జరిగిన ఒక (ఇన్)ఫేమస్ టెర్రరిస్టు సంఘటన, తదనంతర సంఘటనలు మాత్రం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది అని నా అభిప్రాయం.
  *        *       *

 చాప్టర్ -1 : టెర్రరిజం


అది 1972 సంవత్సరం సెప్టెంబర్ నెల.. వెస్ట్ జర్మనీ (ఇప్పుడు జర్మనీ) లోని మ్యూనిచ్ నగరంలో సమ్మర్ ఒలంపిక్స్ జరుగుతున్నాయి. జర్మనీలో అంతకుముందు జరిగిన ఒలంపిక్స్ హిట్లర్ హయాంలో అనేక ఆంక్షల మధ్య, భయాల మధ్య జరిగి ఉండటంతో, ఆ చెడ్డపేరు చెరిపెయ్యడానికి అన్నట్టు ఈ ఒలంపిక్స్ లో భద్రతా కట్టుబాట్లు కాస్త సడలించారు. ఆటగాళ్ళు ఒలంపిక్ విలేజ్ నుండి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్లి వచ్చే సౌకర్యం, గుర్తింపు కార్డుల కోసం పెద్ద చెకింగ్లు అవీ లేకపోవడం, ఒకవేళ కాని టైం లో బయటకు వెళ్లి రావాల్సి వస్తే గోడ దూకి వచ్చినా నిర్వాహకులు, భద్రతా సిబ్బంది చూసీ చూడనట్టు వదిలెయ్యడం... అలా అంత ఫ్రీ గా అన్నమాట.  అయితే ఆ రోజుల్లో పాలస్తీనా టెర్రరిస్టుల నుండి ఎక్కువ ముప్పు ఎదుర్కొంటున్న ఇజ్రాయిల్ ఆటగాళ్లకు మిగతా ఆటగాళ్ళు ఉండే భవంతులకు దూరంగా మరీ గోడ పక్కనే ఉన్న భవంతి విడిదిగా ఇవ్వడంతో, ఆ దేశ ఆటగాళ్ళు తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసినా జర్మన్ అధికారులు అంత పట్టించుకోలేదు. అప్పటికీ జర్మన్ నిపుణుడు ఒకరు ఈ ఒలంపిక్స్ లో మనకి (జర్మన్లకి) ఏ రకంగా ఇబ్బందులు ఎదురయే అవకాశం ఉంది అని ఒక 26 పాయింట్లు సూచించగా... అందులో ఇరవై ఒకటవ పాయింటు ఇలా టెర్రరిస్ట్ అటాక్ జరగవచ్చు అని ఉంది.


సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి ఇజ్రాయిల్ ఆటగాళ్లంతా ఒక మ్యూజికల్ చూసి, తమ ఫేవరేట్ నటుడితో డిన్నర్ ముగించి, పార్టీ అనంతరం అర్ధరాత్రి సమయాన బస్ లో ఒలంపిక్ విలేజ్ కి చేరుకున్నారు. ఒలంపిక్ విలేజ్ కి చేరుకున్న ఆటగాళ్ళందరూ మంచి గాఢనిద్ర లో ఉండగా సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం సుమారు 4:30 సమయం లో ఆటగాళ్ళలా ట్రాక్ సూట్స్ వేసుకున్న "బ్లాక్ సెప్టెంబర్" అన్న తీవ్రవాద సంస్థకి చెందిన ఎనిమిది మంది టెర్రరిస్టులు తుపాకులతో, పిస్టల్స్ తో, హ్యాండ్ గ్రెనేడ్లతో గోడ దూకి  ఒలంపిక్ విలేజ్ లోకి ప్రవేశించారు. సరాసరి ఇజ్రాయిలీ ఆటగాళ్ళు ఉన్న భవంతిలో ప్రవేశించి దొంగ తాళాలతో తలుపులు తియ్యడానికి ప్రయత్నిస్తున్నారు. అపార్ట్మెంట్ 1 లో నిద్రలో ఉన్న Yossef Gutfreund అనే రెజ్లింగ్ కోచ్ కి తలుపు దగ్గర ఏదో శబ్దం రావడంతో లేచి తలపు సందు నుండి చూడగా... బయట తుపాకులు పట్టుకున్న ముసుగు వ్యక్తులు కనిపించడంతో గట్టిగా కేకలు పెడుతూ మిగతావారిని లేపడానికి ప్రయత్నిస్తూ ఉండగా... ఇంతలో టెర్రరిస్టులు తలుపులు పగలకొట్టి లోపలకి రావడంతో వాళ్ళని తాత్కాలికంగా నిలువరించేందుకు 135 kg రెజ్లింగ్ బరువు కూడా వాళ్ళపై విసిరాడట. యూసఫ్ అరుపులు విన్న అతని సహచరుడు కిటికీ దూకి పారిపోగాలిగాడు కానీ.. యూసఫ్ మాత్రం తీవ్రవాదులకి దొరికి పోయాడు.
 
అక్కడ ఎదురు తిరిగిన మరో రెజ్లింగ్ కోచ్ మెషె వియంబెర్గ్ ని అతని దవడలో తుపాకితో కాల్చి తీవ్ర గాయం చేసి మిగతా ఆటగాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ కి తీసుకెళ్ళమని హింస పెట్టారు. అయితే అటువంటి  విపత్కర పరిస్థితిలో కూడా వియంబెర్గ్ సమయస్ఫూర్తితో ఆలోచించి అపార్ట్మెంట్ 2 లో ఉన్నవారు ఇజ్రాయిల్ ఆటగాళ్ళు కాదని అబద్ధం చెప్పి ఇజ్రాయిలీ రెజ్లర్స్ వున్న అపార్ట్మెంట్ 3 కి తీసుకెళ్లాడట. అపార్ట్మెంట్ 2 మరియు 3 లో ఉన్నది ఇజ్రాయిల్ ఆటగాళ్ళే అయినా.. ఒకవేళ తీవ్రవాదులను నేరుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితే వస్తే మిగతావారి కన్నారెజ్లర్లు బలవంతులు కాబట్టి కాస్తయినా నయమని అని అతని ఆలోచన. బిల్డింగ్ 3 లోకి వెళ్ళాక టెర్రరిస్టులని ప్రతిఘటించే ప్రయత్నం చేసాడని వియంబెర్గ్ నీ, ఎదురు తిరిగిన ఇంకో వెయిట్ లిఫ్టర్ యోసేఫ్ రొమనో ని కూడా తీవ్రవాదులు కాల్చి చంపి అక్కడ కనపడ్డ మిగతా తొమ్మిది మంది ఆటగాళ్ళను బందీలుగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలా బిల్డింగ్ 2 లో ఉన్న మిగతా ఆటగాళ్ళు, అధికారులు ఈ అటాక్ తప్పించుకోగలిగారు.


బందీలుగా పట్టుబడ్డ ఆటగాళ్ళని విడుదల చెయ్యడానికి  టెర్రరిస్టులు విధించిన ఆంక్షలలో ముఖ్యమయినది "వివిధ ఇజ్రాయిలీ జైళ్ళలో ఉన్న 234 పాలస్తీనా టెర్రరిస్టులను వదిలిపెట్టాలి".  అలాగే తీవ్రవాదులు తమ క్రూరత్వాన్ని, తలచుకుంటే ఏమయినా చెయ్యగలం అన్న తెగింపుని తెలియచెప్పడానికి అంతకు ముందు హింసించి చంపిన వియంబెర్గ్ శవాన్ని కిటికీలోనుండి బయటకు విసిరేశారు. అయితే.. వారి ఆంక్షలకూ, డిమాండ్లకూ ప్రతిగా ఇజ్రాయిల్ ఇచ్చిన సమాధానం..


"there would be no negotiation ..."


అప్పటికే జర్మనీ పై యూదుల పట్ల ఉన్న ద్వేషం తాలూకు మచ్చ ఉండటం, ఇప్పుడేమో బందీలుగా ఉన్నది యూదులు అవడంతో జర్మన్ అధికారులు తీవ్రవాదులతో చర్చలు జరిపి కావలసినంత డబ్బు ఇస్తాం అని చెప్పారట.. అక్కడ "కావలసినంత" అన్న పదం నిజంగా వాడినది.. అయితే ఆ ఆఫర్ ని టెర్రరిస్టులు తిరస్కరించారు. అయితే ఒక పక్క ఇంత జరుగుతున్నా ఇంకో పక్క యథావిధిగా కొనసాగుతున్న ఒలంపిక్ క్రీడల్ని ఈ తతంగం జరిగిన  పన్నెండు గంటల తరువాత తీవ్రవాదులు మూడో క్రీడాకారుడిని చంపడంతో అప్పటికి ఆటల్ని తాత్కాలికంగా ఆపేశారు. అప్పుడు ఇజ్రాయిలీ ఆటగాళ్ళని బందీలుగా ఉంచిన బ్లాక్ సెప్టెంబర్ తీవ్రవాదిని పక్కనున్న ఫోటోలో చూడవచ్చు.

బందీలుగా ఉన్న ఆటగాళ్ళ  పరిస్థితి ఆ పక్క బిల్డింగ్ నుండి ఈ తతంగం అంతా గమనిస్తున్న ఒక అమెరికన్ క్రీడాకారుడి మాటల్లో చెప్పాలంటే..


" Every five minutes a psycho with a machine gun says, 'Let's kill 'em now,' and someone else says, 'No, let's wait a while.' How long could you stand that? "


ఆటలు తాత్కాలికం గా రద్దు అవడం తో మొత్తం ఒలంపిక్స్ ని కవర్ చెయ్యడానికి ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన మీడియా అంతా ఇక్కడికే చేరింది. తీవ్రవాదులను అటాక్ చెయ్యడానికి మొదటి ప్రయత్నంగా జర్మన్ పోలీసులు క్రీడాకారుల వేషంలో ఆ బిల్డింగ్ ని చుట్టుముట్టారు. అయితే అప్పటికే అక్కడకు చేరిన టీవి మీడియా ఈ అటాక్ సన్నాహాలన్నీ పూసగుచ్చినట్టు టీవిలలో ప్రసారం చెయ్యడంతో, అది చూసిన టెర్రరిస్టులు పోలీసులు వెనక్కి వెళ్ళకపోతే ఇంకో ఇద్దరిని చంపుతాం అని బెదిరించడంతో పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే అసలు బందీలు ఇంకా బ్రతికే ఉన్నారు అని రుజువు చెయ్యడానికి, ఆటగాళ్ళలో జర్మన్ వచ్చిన వారిని కిటికీ దగ్గరకు తీసుకు వచ్చి మాట్లాడించమని కోరడంతో అంద్రే స్పెడ్జర్, కెహట్ షార్ అనే ఆటగాళ్ళతో మాట్లాడించారు. అప్పుడు కిటికీ నుండి టివి మీడియాతో మాట్లాడుతున్న స్పెడ్జర్, షార్ లను పక్క ఫోటోలో చూడవచ్చు. అయితే అలా మాట్లాడుతున్నప్పుడు టెర్రరిస్టులు చెప్పమన్నదానికన్నా ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించిన స్పెడ్జర్ ని టివి చానళ్ళు ప్రసారం చేస్తుండగా ప్రపంచం అంతా చూస్తుండగానే తుపాకి బట్ తో కొట్టుకుంటూ పక్కకి లాక్కెళ్ళడం వాళ్ళ క్రూరత్వానికి పరాకాష్ట.

ఈ లోగా ఆ బందీలను తీసుకుని ఈజిప్ట్ లోని కైరో వెళ్ళడానికి వాళ్ళ కోసం విమానం సిద్ధం చెయ్యాలనీ, ఒలంపిక్ విలేజ్ నుండి ఎయిర్ పోర్ట్  కి వెళ్ళడానికి మిలటరీ హెలికాప్టర్స్ కావాలని తీవ్రవాదులు కొత్త డిమాండ్స్ పెట్టారు. జర్మన్ అధికారులు ఈ డిమాండ్స్ కి పైకి అంగీకరిస్తూనే, విమానం ఎక్కేముందే ఆ చుట్టుపక్కల షార్ప్ షూటర్లను ఏర్పాటు చేసి టెర్రరిస్ట్లను మట్టుపెట్టాలని పథకం రచించారు. అది ఫెయిల్ అయితే విమానంలో పైలట్ల వేషంలో పోలీసు అధికారులు ఉండి అక్కడయినా టెర్రరిస్ట్లను అంతమొందించాలన్నది ప్లాన్. అయితే ఒక పక్కన హెలికాప్టర్స్ లాండ్ అవుతున్న టైం లో ఆఖరు నిముషం లో ఫ్లైట్ లో పోరాడాలన్న ఆలోచన విరమించుకుని పైలెట్ల వేషంలో ఉన్న పోలీసులు అందరూ వెళ్ళిపోయారు. హెలికాప్టర్స్ ల్యాండ్ అయ్యాక వారిలో టోనీ, ఇస్సా అనే టెర్రరిస్ట్లు విమానం చెక్ చెయ్యడానికి వచ్చి అక్కడ పైలెట్లు ఎవరూ లేకపోవడంతో ఏదో జరుగుతుంది అని గమనించి హెలికాప్టర్స్ లో ఉన్న మిగతా టెర్రరిస్ట్లను హెచ్చరించడానికి పరిగెడుతుండగా ఆ పక్క బిల్డింగ్ మీద నక్కి ఉన్న జర్మన్ షార్ప్ షూటర్లు వారిపై కాల్పులు జరిపారు. అయితే వెలుతురు సరిగ్గా లేకపోవడం, ఆ షార్ప్ షూటర్లు అంత నిపుణులు కాకపోవడంతో ఆ కాల్పులు టోనీని కేవలం గాయపరచగలిగాయి.


ఈ ఊహించని పరిణామానికి మిగతా టెర్రరిస్టులు బేజారెత్తిపోయి కాల్పులు మొదలు పెట్టగా జర్మన్ పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. తీవ్రవాదుల దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి ఖర్చయిపోతుండటంతో సెప్టెంబర్ 5 అర్ధరాత్రి 12 గంటల సమయంలో, టెర్రరిస్టులు తము చనిపోవాల్సిన పరిస్థితే కనుక వస్తే తమ కన్నా ముందు ఈ ఇజ్రాయిలీ ఆటగాళ్ళు చావాలని... నిరాయుధులై, చేతులు కాళ్ళు కట్టివెయ్యబడి, నిస్సహాయంగా చూస్తున్న అమాయక ఇజ్రాయిలీ ఆటగాళ్ళ మీద విచ్చలవిడిగా కాల్పులు జరిపి అందరినీ అతి దారుణంగా చంపివేసారు. అలా ఒలంపిక్ విలేజ్ లో ముగ్గురిని, ఎయిర్ పోర్ట్ లో ఎనిమిది మందితో కలపి మొత్తం పదకొండు మంది ఇజ్రాయిలీ ఆటగాళ్ళని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నారు. అదే కాల్పులలో ఒక జర్మన్ పోలీసు అధికారి కూడా టెర్రరిస్ట్ తూటాలకు నేలకొరిగాడు. జర్మన్ పోలీసుల ఎదురుకాల్పుల్లో ఐదుగురు టెర్రరిస్ట్లు మరణించగా మరో ఇద్దరు జర్మన్ అధికారులకి దొరికి పోయారు. ఒక టెర్రరిస్ట్ తప్పించుకుని పారిపోయాడు. అయితే ముగ్గురు టెర్రరిస్ట్లు దొరికిపోయారని కూడా కొంతమంది చెప్తారు.


ఫలితంగా ఆధునిక ఒలంపిక్ చరిత్రలో మొదటి సారిగా క్రీడలు కొన్ని రోజుల పాటు రద్దయ్యాయి. ఆ రోజు జరిగిన మెమోరియల్ సర్వీస్ లో మరణించిన ఆటగాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ మెమోరియల్ సర్వీస్ లోనే పాల్గొన్న మెషె వియంబెర్గ్ కజిన్ అక్కడే గుండెపోటుతో మరణించడం మరింత బాధాకరం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి జరిగింది. టెర్రరిస్టుల చేతిలో చనిపోయిన అమాయక ఇజ్రాయిలీ క్రీడాకారులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ స్టేడియంలో ఉన్న అన్ని దేశాల జాతీయ పతాకాలు అవగతం చేస్తుండగా.. ఈ యూదుల మరణాన్ని గౌరవిస్తూ తమ దేశ పతాకాలు అవతనం చెయ్యడం మాకు సమ్మతి కాదు అని పది అరబ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో ఆ పది దేశాల పతాకాలు మాత్రం మళ్ళీ ఎగురవేశారు. అలాగే సెప్టెంబర్ 5 న ఇజ్రాయిలీ క్రీడాకారులు ఇంకా బందీలుగా ఉన్నప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని గోల్డా మేయర్ జరిగిన దుశ్చర్యను ఖండించి తమ క్రీడాకారుల ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడినా ఒక్క జోర్డాన్ రాజు కింగ్ హుస్సేన్ తప్ప ఇంకే అరబ్ దేశం ఈ టెర్రరిస్టు చర్యను ఖండించలేదు.



ఇదే సంఘటన మనకి జరిగితే ఏం చేస్తాం? ఆ క్రీడాకార్లుల్లో క్రికెటర్స్ లేకపోతే అసలు మనమూ పట్టించుకోం... ఇంకో ఢిల్లీ అనుకుంటాం... అదే ప్రముఖ వ్యక్తులు ఉంటే ... యథావిధి మన నాయకుల నుండి ఈ పిరికిపంద చర్యను ఖండిస్తూ ప్రకటనలు వస్తాయి.. యథావిధిగా పాకిస్తాన్ కి ఉత్తుత్తి బెదిరింపులు... కొవ్వొత్తుల ప్రదర్శనలు... ఫేస్ బుక్ లో సంతాప సందేశాలు.. అంతే... కొన్నాళ్ళకి అన్నీ మర్చిపోయి క్షమించేస్తాం! కాదంటారా ?
 
అయితే ఈ మ్యూనిచ్ టెర్రరిస్ట్ దాడి తరువాత ఏం జరిగింది? ఇజ్రాయిల్ ఏం చేసింది? మంచి జేమ్స్ బాండ్ సినిమాకి ఏ మాత్రం తీసిపోని ఇజ్రాయిల్ యొక్క రియాక్షన్ కోసం ... ఈ టపాకి కొనసాగింపు రెండో భాగంలో రేపు చూడండి..

- మంచు   
 


Sunday, July 17, 2011

కృష్ణప్రియం

*** శ్రీ రామ ***


మీకు పారిస్ ట్రిప్ కి వెళ్ళాలనుందా.. అయితే టికెట్లు కొనుక్కుని, హొటెల్స్ బుక్ చేస్కుని, వస్తున్నాం అని లవంగం గారికి ఫొన్ చేసేసి.... బొల్డు డబ్బులు, సమయం ఖర్చు పెట్టి పారిస్ వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు దానికొ షార్ట్ కట్ ఉంది. కృష్ణప్రియ గారి 'పారిస్ వెళ్ళండి కానీ..' పోస్ట్ చదివితే మీకు నిజంగా పారిస్ వెళ్ళి తిరిగేసిన అనుభూతి గ్యారెంటీ :) 

ఇప్పుడు సడన్ గా కృష్ణప్రియ గారిని తలచుకుంటున్నానేంటా అని అనుకుంటున్నారా... అయితే మీకు తెలిసున్న విషయాలే అనిపించినా పొస్ట్ పూర్తిగా చదవాల్సిందే.


మన ఫ్రెండ్ ఎవరన్నా సెల్ ఫొన్ పొగొట్టుకుంటే అయ్యో అని బాధపడతాం. అదే ఈవిడ పొగొట్టుకున్నప్పుడు బొల్డు సంతొషించాం... ఎందుకంటే మరి ఆ ఫోనే పోకపోయుంటే 'చేజారిన మంత్రదండం' అనే ఒక మంచి పోస్ట్ మిస్సయ్యే వాళ్ళం కదా :D


'పెద్దయ్యాక నేను..' అంటూ మనల్ని చిటికెన వేలు పట్టుకుని ఉన్నపళంగా చిన్నప్పటి రోజుల్లోకి తీస్కెళ్ళిపోయినా, 'ఫోటోలు నిక్షిప్తపరచలేని అనుభూతి' అంటూ మన జీవితంలోని అమూల్యమైన అనుభూతుల్ని గుర్తుకొచ్చేలా చేసినా, 'పిన్ని పెళ్ళి, పిన్ని కొడుకు పెళ్ళి' అంటూ అప్పటికీ ఇప్పటికీ పెళ్ళి వేడుకలు మారిపోయిన వైనాన్ని గుర్తు చేసినా, స్కూటర్ సాహసాలైనా, 'హాయిగా హాల్లో సినిమా' చూడటం గురించి చెప్పినా, తనకి 'పాటలు రావని' చెప్పినా, 'బరువూ బాధ్యత'ని గుర్తు చేసినా... ఇలా ఏ కబుర్లైనా గానీ మనల్ని కూడా తన కూడా తిప్పుతూ చూపించినంత ఆసక్తికరంగా రాయడంలో మన కృష్ణప్రియ గారిది అందె వేసిన చేయి. :)


మీకు తెలుసో లేదో.. ఆవిడకి బోల్డు అదృష్టం కలిసొచ్చి ఒకసారి లక్కీ డ్రాలో అరకేజీ వెండి గెల్చుకున్నారు. అప్పుడు అందరికి ఇచ్చి మనకి మాత్రం పార్టీ ఇవ్వకుండా పెద్ద హ్యాండిచ్చారు. 

అసలు కృష్ణ ప్రియ గారి డైరీలో మిగతా పోస్టులన్నీ ఒక ఎత్తైతే 'గేటెడ్ కమ్యూనిటీ కథలు' మాత్రం మరొక ఎత్తు.. అవన్నీ చదువుతుంటే అర్జెంటుగా మనం కూడా ఏదో ఒక గేటెడ్ కమ్యూనిటీ చూసుకుని, అసలు వీలైతే 'పెసిడెంటు గారి పెళ్ళాం' గారి రికమండేషన్ తో వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ లోనే ఒక ఇల్లు వెతుక్కుని సెటిల్ అయిపోదాం అనుకుంటారు. అసలు వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో జరిగే దీపావళి, చబ్బీస్ జనవరి వేడుకల కోసమైనా వెంటనే వెళ్ళిపోవాల్సిందే అనిపిస్తుంది మనకి. అలాగే మనకెప్పుడైనా 'ఓ కప్పు చక్కర' అవసరమైతేనో, మనలో దాగున్న 'సామాజిక స్పృహ'ని మేల్కొల్పడానికైనా గానీ మన కృష్ణప్రియ గారు సదా మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి మనం వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో చేరిపోడానికి అట్టే అలొచించనక్కర్లేదు. అప్పుడు మనం కూడా ఎంచక్కా కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు పండగ చేస్కోవచ్చు. :)  ఇవన్నీ చదివాక మీరు క్రిష్ణప్రియ గారి పక్కిల్లే కావాలి అనుకునే ఉంటారు కానీ పాపం మీ బ్యాడ్‌లక్. కార్నర్ లొ ఉండే వాళ్ళ ఇంటికి పక్కనుండే ఇల్లు నేను అల్రేడీ రిజర్వ్ చేసేసుకున్నాను కాబట్టి.



'ఉప్మాయణం' గురించి గొప్పగా చేప్పేసి మనల్ని ఉప్మా ప్రియుల్ని చేసేయ్యడమే కాదు... తనే కనిపెట్టిన కొత్త రెసిపీ, మన బ్లాగ్లోకంలోనే అత్యంత రుచికరమైన పదార్ధం అయినటువంటి టల్లోస్ రుచి చూడకుండా ఆవిడ బ్లాగ్ గడప దాటి బయటికి రాలేమంటే నమ్మాలి మీరు :) మరి బ్లాగులొకం లొ  అత్యంత రుచికరమైన పదార్ధం నా చుంబరస్కా అని నాకు గట్టి నమ్మకం. మరేమో అక్కడే మాకు ఈగో క్లాషేస్ వచ్చాయన్నమాట. అప్పుడు చుంబరస్కా మీద పేటెంట్ హక్కుల గురించి ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుందాం అనుకున్నాం కానీ మా లాయర్ (ఇద్దరికి ఒక్కరే లాయర్) ఫీజు ఎక్కువ అడిగాడని అలిగి ఫైనల్ గా మేము ఒక అండర్స్టాండింగ్ కి వచ్చి చుంబరస్కాటల్లోస్ అనే కొత్త రెసిపి కనిపెట్టాం :-) ఈ పొస్ట్ ఆఖర్లొ  చూడండి.


ఇహ కృష్ణప్రియ గారు చెప్పే ఆఫీసు కబుర్లు భలే సరదాగా ఉంటాయి.. 'సింగం, మల్లెపూలూ బార్డర్ సమస్యా' అని చెప్పినా, 'బాసూ బీరకాయ పచ్చడి' గురించి చెప్పినా, అది కేవలం 'ఊర్వశి క్రిష్ణప్రియ'లా నటించగలిగే మన కృష్ణప్రియ గారికే సాధ్యం. 


ప్రతీ ఒక్కరం ఎంతో కొంత తీవ్రంగానే ఆలోచించే క్లిష్టమైన విషయాలని కృష్ణప్రియ గారు తేలికగా అర్థమయ్యేలా వివరంగా, విశ్లేషణాత్మకంగా చర్చిస్తారు.. ఉదాహరణకి 'ఇంకా సాఫ్ట్ వేర్ ఇంజనీరేనా? పాపం!!' అంటూ ఆడవాళ్ళు కెరీర్, పర్సనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్కోడం గురించి రాసిన పోస్ట్, 'NRI నుండి పక్కా ఇండియన్ గా మారడం..' అంటూ అమెరికా నుంచి ఇండియాకి వెనక్కి వెళ్ళి ఉండటంలో సాధక బాధకాల్ని చెప్పడంలో, 'ప్రియ కొడుకు IIT' అనే పోస్టులో తెలిసో తెలీకుండానో మనందరం చదువుల రూపంలో పిల్లలపై పెడుతున్న అధిక ఒత్తిడి గురించి, పిల్లలని దత్తత తీస్కునే సందర్భాల్లో ఆయా వ్యక్తుల వెనక దాగుండే రకరకాల పరిస్థితులూ, ఎమోషన్స్ గురించి 'మనసా వాచా కర్మణా దత్తతకి సిద్ధం?' అనే పోస్టులో చెప్పినా.. ప్రతీసారీ విషయం ఏదైనా గానీ మనల్ని కాసేపన్నా ఆలోచనలో పడేస్తాయి కృష్ణప్రియ గారి టపాలు.


అప్పుడప్పుడూ 'అంబిగేశ్వరి-శ్రీనివాసోపాఖ్యానం' అంటూ హృద్యమైన ప్రేమకథని చెప్పినా, 'నారాయణరెడ్డి' గారి గురించి స్పూర్తివంతమైన కబుర్లు చెప్పినా, 'జాతస్య మరణం ధృవం', 'గుండె ఊసులు' లాంటి జీవితానుభవాల పాఠాలు చెప్పినా,  'ఓ పనైపోయింది బాబూ', 'చదువుకుంటారా లేదా', 'మళ్ళీ మొదలు!', 'వింటే భారతమే వినాలంటూ' అమాయకత్వం, చిలిపితనం కలబోసిన పిల్లల సరదా కబుర్లని మన కళ్ళకి కట్టినట్టు చూపించినా మనం కృష్ణప్రియ గారి బ్లాగులోనే తిష్ట వేసుకు కూర్చుని అలా చదువుకుంటూ ఉండిపోవల్సిందే.

కృష్ణప్రియ గారి  డైరీలోకి ప్రయాణం చాలా (exciting) ఆసక్తికరంగా ఉంటుందని ఈ పాటికే మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అన్నట్టు, 'మీరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు...' అని ఆవిడ ఒక సరదా పోస్ట్ రాసారు. అలాగే, మన కృష్ణప్రియ గారి డైరీలోకి ఒకసారి తొంగి చూస్తే అప్పుడప్పుడూ తను ఒక రోజంతా ఎలా గడుపుతుంటారో కూడా తెల్సుకోవడం చాలా సరదాగా ఉంటుంది.


మొన్నామధ్య ఒకసారి  కృష్ణప్రియ గారి బ్లాగు పుట్టినరోజు సందర్భంగా నిర్వోష్ఠ్య బ్లాగాయణం.. అంటూ తన బ్లాగు ప్రస్థానాన్ని ఒక సంక్లిష్టమైన సాహితీ ప్రక్రియలో అలవోకగా రాసి ఆశ్చర్యపరిచారు. 

అర్జెంట్ గా అత్యుత్తమ సలహాలు కావాలా అయితే.. అత్యుత్తమమైన సలహాల కోసం సంప్రదించండి.. కృష్ణప్రియ గారి బ్లాగ్..

తను ఎంచుకునే అంశం ఏదైనా సరే చాలా సులువుగా, సరదాగా మనల్ని పక్కన కూర్చోబెట్టుకుని 'అనగనగా..' అంటూ కథలు చెప్పినంత ఆసక్తికరంగా చెప్పడం, ఎంత పెద్ద పోస్ట్ అయినా సరే ఆపకుండా చదివించి చివరికొచ్చేసరికి 'అరే.. అప్పుడే అయిపోయిందా!' అనిపించేలాగా రాయడం మన కృష్ణప్రియ గారికే సొంతం. అసలిక్కడ నేను రాసింది గోరంత... పూర్తిగా రాయాలంటే కొండంత.... కాదంటారా :)


ఇక అసలు విషయం ...కృష్ణప్రియ గారికి అసలింత టాలెంట్ ఎలా వచ్చిందో తెల్సా .. మా గోదావరి జిల్లాలో పుట్టడం వల్లే :) :) అవిడ ఖమ్మం బిడ్డ అని చెప్పుకుంటారు కానీ.. పుట్టింది తూగొ లొ కాబట్టి కచ్చితంగా గొదావరి బిడ్డే :-) :-)

ఇక ఆంద్రుల అభిమాన బ్లాగర్ అయిన కృష్ణప్రియ గారిని ఈ రోజు ప్రత్యేకంగా తలచుకొవడానికి ఒక కారణం ఉంది. ఈ రోజు (జూలై 17) ఆవిడ పుట్టిన రొజు. శతావధానం చేసినట్టు ఇన్నేసి రకరకాల టపాలు రాసి మనల్ని అలరిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి మన కృష్ణప్రియ గారు ఇంకా బొల్డు మంచి మంచి  పోస్టులు రాస్తూ మనల్ని ఇలాగే అలరిస్తారని ఆశిస్తూ.. 


కృష్ణప్రియ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 

కృష్ణప్రియ గారూ..

మీ పుట్టినరోజు సందర్భంగా మేం స్వయంగా దగ్గరుండి అత్యంత మధురమైన పదార్ధం చుంబరస్కా ఓ పది టన్నులు చేయించాం. అందరికీ పంచి పెట్టడంతో పాటు మీరూ తినండి వచ్చి.. :)

 - మంచు 

ఎంతొ విలువైన తన సమయం వెచ్చించి ఈ పొస్ట్ రాయడానికి సహకారం అందించిన మధురవాణి గారికి బొల్డు బొల్డు థాంక్స్ లు ....

Monday, July 4, 2011

నేను లెజెండ్ కాదా ?

*** శ్రీ  రామ ***



"అలా మంచు గారు బ్లాగుల్లో ఫేమస్ అయిపోయి అంతర్జాతీయ తెలుగు బ్లాగ్ legend అవార్డ్ తెచ్చేసుకుంటారు. ఇంకప్పుడు ఆయన బడాయి భరించలేక చావాలి అందరూ.. ఈ బ్లాగ్లోకం భవిష్యత్తు అంధకారం అయిపోతుంది " 

ఆ కామెంట్ ఇక్కడ వ్రాయబడింది ... ఈ కామెంట్ చూడగానే మీకో ప్రసంగం గుర్తొచ్చుండాలి. ఇంకా గుర్తురాకపోతే ఇవి చూడండి: పార్ట్ -1 ,  పార్ట్ -2 . అలాంటి చారిత్రాత్మక అవమానం ఇప్పుడు నాకూ జరిగింది.

అందుకే  నా ప్రసంగం వినండి. 
--------------------------------

మొన్న మధురవాణి గారు రాసిన బజ్ పోస్ట్ చదివి పప్పు శ్రీనివాసరావు గారడిగారు. నీ బ్లాగ్ వయసెంతా అని. ఇరవై నెలలు అన్నాను. ఆవేశం ....  బ్లాగర్లకి, బజ్జర్లకి నమస్కారం. నాలుగు సంవత్సరాల ఆన్లైన్ జీవితం. ఒక సంవత్సరంన్నర పాటు బ్లాగర్ గా, అర్ధసంవత్సరం పాటు బజ్జర్ గా.  అంటే ఎనిమిది సంవత్సరాల బ్లాగర్.కాం ప్రయాణం లో రెండు సంవత్సరాల బ్లాగు జీవితం నాది. అసలు నేను ఎవరూ, ఎక్కడ వాడిని, ఎలా వచ్చానో చెప్పాలి. ఎన్నో ఆటుపోట్లు.  బ్లాగు మూసుకునే దశ వరకూ వచ్చి వెళ్ళిన సంధర్భాలూ ఉన్నాయి. క్లుప్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే సాధ్యం కాదు ఎందుకంటే this is the stage to tell who I am, what am I. 

కూడలి మరియూ జల్లెడ అగ్రిగేటర్లలో ఒక చిన్న లింక్. అక్కడ క్లిక్ చేసి వెళితే  "నా ప్రపంచం" అన్న బ్లాగు, కామెంట్ల సెక్షన్ నిండా బోల్డు కామెంట్లు... మధ్యలో చిన్న కామెంట్ నాది.  అప్పటికే నా ఫ్రెండ్ ఒకడు కూడలిలో కొన్ని బ్లాగులు రాసుకుంటూ ఉండేవారు. నేను తెలుగు బ్లాగులు చదవడం మొదలెట్టిన రోజుల్లో మా ఫ్రెండన్నాడు... రేయ్ నువ్వు కూడా ఒక బ్లాగ్ పెట్టుకోరా ఇద్దరం కలిసి రాసుకోవచ్చని.... నేను వినలేదు. సరే మిగతా కొంత మంది స్నేహితుల  ప్రోద్బలంతో బ్లాగు పెట్టడం, కొన్ని కామెంట్లు రావడంతో కూడలిలొ, జల్లెడలో చేరటం జరిగింది. అక్కడే కార్తీక్ ఇంద్రకంటి గారు పరిచయం అవ్వడం.  నాగప్రసాద్ గారు పరిచయం అవ్వడం. మన కత పవన్ గారు పరిచయం అవ్వడం జరిగింది. అక్కడే నాకు బ్లాగర్ గా జన్మను ప్రసాదించిన నేస్తం గారు పరిచయం అయ్యారు. నేను రాస్తున్న బ్లాగ్ కి శ్రావ్య గారు రెగ్యులర్ విజిటర్. మనం అనుకుంటాం.... మన బ్లాగ్ టెంప్లేట్ కి ఏ HTML కోడూ అక్కరలేదూ అననుకుంటాం. కనీసం బ్లాగర్‌కి లేఖిని సహాయం అన్నాకావాలి తప్పుల్లేకుండా రాసుకోవడానికి. కామెంట్ బాక్స్ లో వర్డ్ వెరిఫికేషన్ తీసేయ్యమన్నా, డార్క్ బ్యాక్గ్రవుండ్ మీద లైట్ అక్షరాలూ కళ్ళనొప్పి తెప్పిస్తున్నాయ్ తీసెయ్ అన్నా, కామెంట్ మోడరేషన్ పెట్టుకోమన్నా... అంతా ఈ స్నేహితులే. 

ఆరు మాసాలు రాసాక చూసుకుంటే పది పోస్ట్లకి మొత్తం కామెంట్లు 30 ఉన్నాయి...  అదేంటి మరీ ఆరునెలలకి  30 కామెంట్లేనా అన్నా..... ఏం ? రోజూ డజన్ల కొద్ది పక్కోళ్ళ బ్లాగులు చదువుతావ్ ?  వాళ్ళ బ్లాగుల్లో నువ్వెన్ని సార్లు కామెంట్లు పెట్టావు. పక్కోళ్ళ బ్లాగులో కామెంట్లు పెట్టకపోతే స్టార్ బ్లాగర్ కి కూడా అన్ని కామెంట్లు రావు అన్నారు. నువ్వేమన్నా కెలుకుడు రాతలు రాస్తున్నావా? అని అడిగారు... నా బ్లాగులో రాయడం లేదు సార్ అన్నా... కనీసం అమ్మాయి పేరుతో రాస్తున్నావా....  లేదు సార్ అన్నా.. అందుకే ముప్పై కామెంట్లే వచ్చాయ్ అన్నారు. 

అలా ప్రారంభమైంది నా బ్లాగు జీవితం. బ్లాగు తెరిచానని తెలిసి మలక్పేట్ రౌడి గారు కలవమన్నారని కబురు చేశారు. సరే అని జిటాక్ లో పింగ్ చేసాను. ఆయిన ఆన్లైన్ లో లేరు. టెస్ట్ చేసారు.. పాసయ్యాను. అక్కడ శరత్ గారు ఆ కుర్రవాడెవడో మంచి కత్తి కెలుక్ లా ఉన్నాడు .. రాత కూడా పదునుగా ఉంది  .. కామెంట్లకి పనికొస్తాడేమో అని నన్ను రికమండ్ చెయ్యటం, నన్ను మలక్పేట్ గారు వాళ్ళ క్లేబాస లోకి తీసుకోవటం జరిగిపోయింది. ఆ శరత్ నాకు తెలియదు, నేనెవరో ఆ శరత్ కి తెలియదు. ఎన్ని కామెంట్లు రాసి  తీర్చుకోవాలి ఆ శరత్ రుణం. మొదట్లో నా పేరు అనామకుడు.... తెలుగు బ్లాగుల్లో మొదటి కామెంట్ అనానిమస్ గా పెట్టానని ఆ పేరు పెట్టారు. అంతే తిన్నగా బ్లాగర్. కాం కి వెళ్లాను. ఇక నుండి నాపేరు 'మంచు' అని చెప్పి ప్రొఫైల్ మార్చి నా బ్లాగ్ జీవితం మొదలు పెట్టాను.

ఆ రోజు నుండి ఒక కామెంటర్ గా, ఒక బ్లాగర్ గా, ఒక బజ్జర్ గా, ఒక అనానిమస్ గా, ఒక అగ్రిగేటర్ టీం మెంబర్ గా ... క్లేబాసలో కామెంట్లు ఎలా రాయాలో నన్నే కెలికి మరీ రాయించాడు నా గురువు మలక్పేట్ ....ఈ రోజు ద గ్రేట్ భాస్కర్ రామరాజు గారు తరువాత బజ్లో అన్ని పోస్ట్లు  రాయగలుగుతున్నానంటే that credit goes to the great man, the greatest man, the legend, legendary, greatest man in world , బ్లాగర్ అన్న పదానికే అర్ధం తీసుకొచ్చిన మనిషి ,  ప్రపంచ బ్లాగ్ చరిత్రలో గ్రేట్ మాన్ మలక్పేట్ చలవే.... నా మంచికీ  చెడ్డకూ..... 
 

చివరిగా, మొన్న ఆలమూరు సౌమ్య గారన్నారు. ఈ మద్య మీ పోస్ట్లో కామెంట్లు ఎందుకు రావడం లేదు అని.  ఎందుకంటే you are not a  బ్లాగ్ లెజెండ్,  నువ్వు బ్లాగుల్లో  లెజెండ్ వి కాదు. నువ్వో సెలెబ్రిటివీ అన్నారు.  ఈ బ్లాగు ముఖంగా నేను అందరినీ అడగాలనుకుంది ఏంటంటే .... అసలు బ్లాగు లెజెండ్ అంటే ఏంటి ? బ్లాగు సెలెబ్రిటి అంటే ఏంటి ? అని .... ఒక పోస్ట్ వేసి 'బ్లాగ్ లెజండరీ అంటే బ్లాగ్ మొదలెట్టిన ఇన్నాళ్ళకు మీకు ఇన్ని ఫిక్సెడ్ కామెంట్లోస్తాయని, బ్లాగ్ సెలెబ్రిటి అయితే ఇన్నోస్తాయి' అని రాయండి....

నేననుకున్నాను మన తెలుగు బ్లాగుల్లో ఆక్టివ్ గా రాసేవాళ్ళలో అనానిమస్ల నుండి కూడా అప్రిషియేషన్ కామెంట్స్ వచ్చేది నాకే,  అది లెజెండ్రికాదా ?
సరదాగా రాసిన పోస్ట్ కే యాబై కామెంట్స్ వచ్చాయి అది లెజెండ్రీ కాదా? 
ప్రాంతాలకతీతం గా, సబ్జెక్ట్ ఏదయినా రోజుకి కనీసం పది కామెంట్స్ పెడతా అది లెజెండ్రీ కాదా ? 
బజ్జులో పోస్ట్ వేస్తే మినిమం పది లైకులు వస్తాయి...  అది లెజెండ్రీ కాదా ? 
బ్లాగులో పాతిక మంది, బజ్జులో నూట పాతిక  ఫాలోవర్స్ సంపాదించా అది లెజెండ్రీ కాదా ? 
సంచిలో మంచు, మంచు చెప్తే వినాలి అంటూ బజ్జులో మంచు ని  తలచుకోని రోజు ఉన్నాదండీ ?.... అది లెజెండరీ కాదా?



వేణు శ్రీకాంత్ గారు, లెజెండ్రి కాదా ? చెప్పండీ ? వేణు శ్రీకాంత్  గారు లెజెండ్రి కాదా ? వేణు శ్రీకాంత్ గారి బ్లాగ్ విజిట్ చేసారు... ఓ నాలుగూ కామెంట్లు మాత్రమే రాసారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.  ఫేస్ బుక్ లో కొన్ని వందల కామెంట్లు వస్తాయి వేణు శ్రీకాంత్ గారికి. మరి ఇది న్యాయమా ? 
 

మరి కృష్ణ ప్రియ గారు....  మనందరి అభిమాన బ్లాగర్ ..... నా అక్క కృష్ణ ప్రియ గారు ... ఆవిడ బ్లాగ్ లో ఒక మంచి పోస్ట్ వేస్తే ... ఆ బ్లాగ్ పోస్ట్ కి లింక్ బజ్జ్ లో ఇవ్వడానికీ ఆలోచిస్తారటండీ ? ఆవిడ బజ్ పోస్ట్ రీషేర్ చేద్దామా వద్దా అని అలోచిస్తారటండీ....  Yes I will ask all these questions because blogger.com is not for one body. ఒక్కరిది కాదు ఈ గూగిల్ బజ్. ఎంతో మంది పోస్ట్లు వేస్తేనే మాలిక వృద్ది చెందుతుంది. 

మన ఒంగోల్ శీను గారు ఫేమస్ బ్రాహ్మీ ఫ్యాన్, బ్రాహ్మీ మీద ఒక పోస్ట్ వేస్తే మూడు వందల మంది రీషేర్ చేసారు ... ఆయనకిచ్చారండి లెజెండ్ స్టేటస్ ? మన ప్రవీణ్ శర్మ గారు... తెల్లవారుజామున మూడు గంటలకి లేచి పోస్ట్లు రాస్తారు...... తలతోక లేకుండా రోజుకి వంద కామెంట్లు రాస్తారు... ఆయనా లెజెండరీ కాదు... వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు రాజ్ కుమార్ గాడు.... వాడొక ఫోటోగ్రాఫ్ బ్లాగర్  గా హిట్టూ, పంచ్ బ్లాగర్ గా హిట్టూ,  కామెడి బజ్జర్  గా హిట్టూ వాడికీ ఇవ్వలేదు కనీసం సెలబ్రిటి స్టాటస్... 

ఇలా ఎంతో మందిని చూసి నా బ్లాగ్ లో కామెంట్లు రాలేదని అడుగుతామా ? రీడర్ల ఆశీస్సులుండాలి, బ్లాగ్ కి మంచి పేరు రావాలి, పదిమందికి ఉపయోగపడాలి..  ఈ కామెంట్లు నాకు అక్కరలేదూ అనుకున్నాను. బ్లాగామ తల్లి సేవే చాలనుకున్నా....

మై డియర్  ఫ్రండ్స్, భగవంతుడు ఉన్నాడు. మళ్ళీ మాలిక నెక్స్ట్ రిలీజ్ కి ఉంటామొ లేదో తెలియదు. నిత్యం సన్నిహితో బ్లాగ్ క్రాష్ కర్తవ్యో ధర్మ సంగ్రహ:  అన్నారు పెద్దలు.  ప్రతీ క్షణం గూగిల్ సర్వర్ ఓవర్ లోడ్ అవుతూ ఉంటుంది ..  ఎప్పుడు బ్లాగర్.కాం క్రాష్ అయ్యి మన పోస్ట్లన్నీ పోతాయో తెలీదు. 

బ్లాగర్స్ నా మనసులో ఉన్నది చెప్పాను...  ఏదేమైనా ఈ రోజు నా బ్లాగ్ కి , నా బజ్జ్ కి , నా చేతికి ఇలా ఏదో ఒకటి రాయాలన్న దురద పుట్టడానికి  కారణం అయిన ప్రతి ఒక్కరికీ నమస్కారాలు తెలియచేసుకుఉంటూ సెలవు తీసుకుంటాను.


నేను బ్లాగ్ లెజెండ్ ని కాదా ? మీరే చెప్పండి...

- మంచు


ఈ పోస్ట్ కేవలం సరదాగా రాసింది. ఈ పోస్ట్ లో ఉదహరించిన బ్లాగర్లు అందరూ నాకు మంచి స్నేహితులు కాబట్టి వాళ్ళ పేర్లు డైరెక్ట్ గా రాయడం జరిగింది.

Monday, May 23, 2011

సూపర్ ఆనంద్

*** శ్రీ రామ ***


ఫొటొలొ ఉన్న వ్యక్తిని చూసారు కదా. అతి సాధారణ దుస్తుల్లొ , ఇద్దరు ముగ్గురు బాడీగార్డ్ లతొ బీహార్ రాజధాని పాట్నాలొ నివసించే ఇతను మీలొ చాలా మందికి ఇప్పటికే తెలిసి ఉండొచ్చు అనుకోండి. 


1973 జనవరి ఒకటవ తారీఖున పాట్నా నగరం లొని ఒక సాధారణ కుటుంబం లొ జన్మించాడు అనంద్ కుమార్. అతని తండ్రి పొస్ట్ ఆఫీసులొ పనిచేసే ఒక క్లర్క్.  అతని కుటుంబానికి ప్రైవేట్ స్కూల్ లొ చదివించేటంత స్తొమత లేకపొవడం తొ అతని చదువు ప్రభుత్వ పాఠశాలలొ హింది మీడియం లొనే సాగింది. చిన్నప్పటినుండి మన ఆనంద్ కి గణిత శాస్త్రం అంటే అమితమయిన ఆసక్తి. డిగ్రీ చదువుతున్నప్పుడు "నెంబర్ థీయరి" మీద అతను రాసిన పేపర్లు ఇంగ్లాండు లోని Mathematical Spectrum and The Mathematical Gazette సంస్థల జర్నల్స్ లో ప్రచురితమయ్యేవి. గణిత శాస్త్రంలొ ఇతను చూపిస్తున్న ప్రతిభ కి మెచ్చిన ఎంతొమంది గణిత శాస్త్ర అధ్యాపకులు అతనికి ప్రొత్రాహం అందించేవారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే అతని గురువు దేవి ప్రసాద్ వర్మ సహకారం తొ పాట్నాలొ ఒక మేథమెటిక్స్ క్లబ్ ని నెలకొల్పాడు. గణితశాస్తం పై ఆసక్తి ఉన్నవారు ఎవరయినా అందులొ చేరవచ్చు అన్నమాట. అయితే అతని ప్రతిభకి తగ్గ అవకాశం 1994 లొ కేంబ్రిడ్జి యూనివర్సిటీ రూపం లొ వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలొ పై చదువులు చదివే అవకాశం దక్కినా , అదే సమయానికి అతని తండ్రి మరణించడం, కుటుంబం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలొ ఉండటం తొ అతను ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొలేకపొయాడు. అతని చదువుకి ఆర్ధిక సహాయం అందించే దాతకొసం ఇంచుమించు సంవత్సరం పాటు ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. ఆఖరికి ప్రముఖ దిన పత్రిక ద హిందు అతని ప్రతిభ గురించి, అతనికి కావాల్సిన ఆర్ధిక సహాయం గురించి ఒక ఆర్టికల్ రాసినా అతనికి సహాయం అందించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలా అతని పై చదువుల కల అక్కడితో ఆగిపొయింది. 

అతనికి గణిత శాస్త్రం మీద ఎంత మక్కువంటే అప్పట్లొ పాట్నా గ్రంధాలయం  లొ అంతర్జాతీయ జర్నల్స్ లభ్యమవకపొవడంతొ, అవి చదవడానికి వారాంతం లొ ఆరుగంటలు రైలు ప్రయాణం చేసి వారణాసి వెళ్ళేవాడు. అక్కడ అతని తమ్ముడి హాస్టల్ రూం లో ఉంటూ శని, ఆదివారాలు బెనారస్ హిందూ యూనివర్సిటి లొని సెంట్రల్ లైబ్రరి లొ గడిపి సొమవారం పాట్నా వచ్చేవాడు. మిగతా రోజుల్లొ ఉదయంపూట గణిత శాస్త్రం మీద పని చేస్తూనే కుటుంబాన్ని పొషించడానికి సాయింత్రం పూట తన తల్లి తొ కలసి రోడ్డు మీద అప్పడాలు అమ్మేవాడు.   

అలా కస్టపడి చదువుకుని, ఒక మంచి ఉద్యొగం సంపాదించి, జీవితంలొ బాగా స్థిరపడితే చాలు అనుకుని ఉంటే అతను చాలామందిలా ఒక సామాన్య ఉద్యోగస్తుడిగా మిగిలిపొయేవాడేమో. అయితే మన ఆనంద్ అలొచనలు అక్కడితో ఆగిపొలేదు. పేదరికం వల్ల చిన్నప్పటి నుండి తనకు అందకుండా పొయిన ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను తనకు వీలయినంతలో కొందరు పేదవారికయినా అందించాలని అనుకున్నాడు. అప్పుడు పుట్టిందే " రామనుజం స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్". ఇందులొ వివిధ కాంపిటిటివ్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న పేద విధ్యార్దులకి ఉచితం గా శిక్షణ ఇచ్చేవాడు. కొన్నాళ్ళకి ఇదే అలొచనను ఇంకా సీరియస్ గా తీసుకుని పాట్నా వచ్చి ఉండటానికి భోజనం , హాస్టల్ ఖర్చులు కూడా భరించలేని కఠినమయిన పేదరికం లొ ఉన్న వారిని ఆదుకొవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ముంబై లొ నివసిస్తున్న అతని బ్రదర్ ప్రవీణ్ కుమార్ ని పిలిపించి విన్నూతనమయిన అతని అలొచన వినిపించి అతనికి సహాయంగా పాట్నాలొనే ఉండమన్నాడు. అప్పుడు పుట్టిన ఐడియానే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన " సూపర్ 30 ". 

ఈ సూపర్ 30 ప్రొగ్రాంలొ అత్యంత కఠిన పేదరికం లొ మగ్గుతున్న కుటుంబాలలొనుండి 30 మంది అత్యంత ప్రతిభావంతులని ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసి వాళ్ళకి ఒక సంవత్సరం పాటు ఐఐటి ప్రవేశపరిక్షకి ఉన్నత ప్రమాణాలు కలిగిన శిక్షణ ఇస్తారు. అయితే ఆ ముప్పయ్ మందికి చదువు చెప్పడం తొనే ఆగిపొలేదు. వారి కుటుంబాలు కనీసం ఈ పిల్లలని పాట్నా పంపించి చదివించే స్తొమత లేని కుటుంబాల నుండి ఎంపిక చేసిన వారు కావడం తొ వాళ్ళు ఉండటానికి ఉచిత వసతి , భోజనం కూడా ఏర్పాటు చేయ్యాలి. ఈ ఏర్పాట్లు చెయ్యడం లొ అతనికి తన కుటుంబం అతనికి  ఎంతొ సహకారం అందిస్తుంది. ఈ సూపర్ 30 ప్రొగ్రాం కి కావలసిన ఫండ్స్ కొసం ఆనంద్ వేరే కాలేజీల్లొ కూడా పని చేస్తుంటే... అతని తల్లి ఈ ముప్పయ్ మందికి స్వయంగా వండి పెడుతుంది.

ఈ సూపర్30 లొ సీటు పొందిన విద్యార్దులకి ఉచిత వసతి, ఉచిత భొజనం అన్నీ ఆనంద్ కుటుంబం సమకూరుస్తుంటే ఇక వారికి మిగిలిన అలొచన ఒక్కటే ... చదువు... చదువు... చదువు... 2003 లొ స్తాపించిన ఈ సూపర్ 30 సంస్థ మొదటి సంవత్సరం లొనే 30 లో 18 మందికి  ఐఐటిల్లొ సీట్ సంపాదించిపెట్టడం అతనికి చాలా సంతృప్తి మిగల్చడం తొ పాటు మరింత అంకితభావంతో పనిచెయ్యడానికి మంచి ఉత్సాహాన్ని నింపింది.  అలాగే 2004 లొ 30 కి 22, 2005 లొ 30 కి 26, 2006 మరియూ 2007 లొ 30 కి 28 మంది సీట్లు సంపాదించగా... అతను ఎదురుచూస్తున్న మేజిక్ ఫిగర్ 2008 లొ వచ్చింది. అదే 30 కి 30. అతను కొచింగ్ ఇచ్చిన 30 మందికి ఐఐటి లొ ప్రవేశం దక్కింది. అదే మేజిక్ ఫిగర్ 2009 , 2010 లొ కూడా సాధించి హ్యాట్రిక్ సాధించారు ఆ సూపర్ 30 సంస్థ సూపర్ విద్యార్ధులు.


ఇతని అద్భుతమయిన వర్క్ కి 2009 సం || నుండి అంతర్జాతీయ గుర్తింపు రావడం మొదలయ్యింది. 2009 సం || లొ డిస్కవరి చానల్ లొ,  కెనడియన్ టీవి సీరీస్ విట్నెస్స్ లొ అతని సూపర్ గురించి ప్రొగ్రాం రావడం, 2010 సం|| లొ ప్రఖ్యాత టైం మేగజైన్ అతని స్కూల్ ని ఆసియాలొని బెస్ట్ స్కూల్స్ లొ ఒకటిగా గుర్తించడం, న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇతని గురించి అరపేజీ పైగా కేటాయించి రాయడం, బిబిసి లో ఇతని గురించి  వచ్చిన ప్రొగ్రాం, ఒక ప్రఖ్యాత జపాన్ చానల్ ఇతనిపై డాక్యూమెంటరి తియ్యడం.... ఇవన్నీఆనంద్ కుమార్ ప్రతిభని ప్రపంచ నలుమూలలా చాటాయి.. లేటెస్ట్ గా న్యూస్ వీక్ మేగజైన్ ఇతని స్కూల్ ని ప్రపంచంలొని నాలుగు మోస్ట్ ఇన్నొవేటివ్ స్కూల్స్ లొ ఒకటిగా పేర్కొంటే, ఫొకస్ అనే యూరొపియన్ పత్రిక ఇతని అకాశానికి ఎత్తేసింది. ఒబామా దూతగా ఇండియాలొ పర్యటించిన రషీద్ హుస్సేన్ సూపర్ 30 ని ఇండియాలొనే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ గా అభివర్ణించారు. బీహార్ ప్రభుత్వం మౌలానా అబుల్ కలాం అజాద్ పురస్కారం తొ గౌరవించింది.  మరికొన్ని ఇక్కడ చూడండి.

ఈ సూపర్ 30 సూపర్ సక్సస్ సాధించడం తొ ఎన్నారైలు మరియూ ప్రబుత్వం దగ్గరనుండి ఆర్ధిక సహకారం,  అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు వచ్చినా అతను వాటిని సున్నితంగా తిరస్కరించాడు. అయితే అది బీహార్...... అక్కడ ఆఫర్లు తిరస్కరిస్తే అంత సులభంగా వదిలెయ్యరు. మన అమీర్పేట్ లొ లాగ పాట్నా కూడా అనేక జాతీయ ప్రవేశ పరీక్షలకు ఇచ్చే కోచింగ్ సెంటర్లకి ప్రసిద్ది చెందింది. ఐఐటి కోచింగ్ నుండి ఐయేఎస్ వరకూ అన్ని కోచింగ్ సెంటర్లూ అక్కడ ఉంటాయి. అలానే కోచింగ్ సెంటర్ మాఫియా కూడా. ఇతన్ని వాళ్ళ కోచింగ్ సెంటర్స్ లొకి చేర్చుకొవడానికి అనేక వత్తిళ్ళు తీసుకొచ్చినా , ఆఖరికి అతని సూపర్ 30 ఉద్యోగి ఒకరు ఈ మాఫియా చేతిలొ హత్యకు గురైనా ఆనంద్ చలించలేదు. అఖరికి ముఖ్యమంత్రి నితీష్ కూమార్ కల్పించుకుని ప్రబుత్వం తరపున ఆనంద్ కుమార్ కి భద్రతగా బాడీ గార్డ్ లు నియమించిది. అయితే ఈ మాఫియా అక్కడి తొ ఆగలేదు. ప్లాన్ బి దిగి అనేక ఫేక్ సూపర్ సంస్థలు స్తాపించాయి. "రాజా సూపర్ 30″, “నకిలీ సూపర్ 30″, “ గయా సూపర్ 30″ ఆఖరికి  “ఒరిజినల్ సూపర్ 30″ అని కూడా. అయితే  ఈ ఒత్తిళ్లకు ఆనంద్ లొంగలేదు కానీ 2008 సం || లొ ఆనంద్ కుమార్ సూపర్ 30 లొ శిక్షణ పొంది ఐఐటి లొ సీట్లు సాధించిన ముగ్గురు విద్యార్ధులను ఈ మాఫియా డబ్బులు ఆశచూపి తమ సంస్థలలొ శిక్షణ పొందినట్టుగా ప్రచారం చెయ్యడం తో  తీవ్రం గా మనస్తాపం చెందిన ఆనద్ కుమార్ ఇక ఈ సూపర్ 30 సంస్తను పూర్తిగా మూసివెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ ముగ్గురు విద్యార్ధులు చివరకు ఆనంద్
కుమార్ కి క్షమాపణ చెప్పి నిజం బయట పెట్టడం తొ ఆ వివాదం సర్దుమణిగింది. అలాగే 2008 వరకూ అతని తొ పాటు నడిచిన అభయంకర్ అనే ఐపిఎస్ ఆఫీసర్ అనేక రాజకీయ వొత్తిళ్ళకి లొంగి ఆనంద్ నుండి విడిపోయి 30 మంది పేద ముస్లిం విధ్యార్ధులకి శిక్షణ ఇచ్చే వేరే సూపర్ 30 స్థాపించాడు .

ఇప్పుడు అతని ఆశయం సూపర్ 30 లాగానే పేదవారికి ఒక స్కూల్ ఏర్పాటు చెయ్యడం. అతని స్టుడెంట్లలో ఎవరయినా ఎప్పటికయినా నొబెల్ సాదిచాలని అతని ఆశ అట. 

మన ఆనంద్ కుమార్ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకొవాలని,  ఎంతొమందికి భవిష్యత్ ఆనంద్ కుమార్ లకి ఇన్స్పిరేషన్ గా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... 


- మంచు 
మరికొన్ని వివరాల కోసం సూపర్౩౦