Pages

Monday, April 2, 2012

తిండి గొడవలు (Part 4 of 4) - అసలు విషయం

*** శ్రీ రామ ***సాధారణంగా ప్రతీ మనిషికీ తను నమ్మిన సిద్ధాంతం, తనకు నచ్చిన విషయం, తను నడిచే దారి అందరికీ నచ్చాలన్న కోరిక బలంగా ఉంటుందనుకుంటా.... అందుకే నచ్చచెప్పో, బలవంతపెట్టో, ఆశపెట్టో, భయపెట్టో, ఎదుటి వాళ్ళ సిద్ధాంతంలో తప్పులు ఎత్తి చూపో, ఏదో ఒకటి చేసి తాము నడిచే దారిలో అందరూ నడిచేలా చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి బ్రెయిన్‌వాష్‌లు ప్రతీరోజూ అనేక సందర్భాలలో మనం వ్యక్తిగతంగా చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం కూడా. అయితే ఏకంగా సంస్థలు స్థాపించి  మరీ బ్రెయిన్‌వాష్‌ చేసే కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. అందులో రకరకాలయిన కారణాలు చూపిస్తూ జనాల మతం మార్చడానికి ప్రయత్నించే "మతమార్పిడి" మిషనరీల మాదిరిగానే, బలవంతంగా శాకాహారాన్ని ప్రమోట్ చెయ్యడానికి ప్రయత్నించే "శాకాహార" మిషనరీలు తక్కువైనవేం కాదనిపిస్తుంది. ఈ బ్రెయిన్‌వాష్ ప్రక్రియలో  కొందరేమో శాకాహార మాంసాహారాలను వాటి ప్రయోజనాలు, ప్రతికూలతలు అధారంగా బేరీజు వేస్తూ తమకు అనుకూలంగా చేసిన విశ్లేషణలు చూపిస్తుంటే మరికొందరు మాంసాహారులను, వారి ఆహారపు అలవాట్లను తక్కువ చేసి మాట్లాడుతూ, మాంసం తినడం లేక "కొన్ని" రకాల మాంసం తినడం అదోరకమయిన క్రూరమయిన అలవాటుగా, రాక్షసచర్యగా అభివర్ణిస్తూ ప్రచారం చేపట్టడం లాంటి చర్యలకు దిగుతారు.  

మాంసాహారం తినేవాళ్ళ వల్ల జంతువులు అనేక రకాలయిన హింసకి గురవుతున్నాయి కాబట్టి మాంసాహారం త్యజించాలన్నది ఒక ప్రధానమైన డిమాండ్. మాంసాహార ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో తీసిన ఫోటోలో, వీడియోలో అటాచ్ చేసిన కొన్ని మెయిల్స్ ఎప్పుడన్నా ఫార్వార్డ్ గా మీకు వచ్చే ఉంటాయి... ఒక పక్క అమాయకంగా జాలిగా చూస్తూ ఉండే కొన్ని జంతువుల ఫోటోలు, ఇంకో పక్క కొన్ని రక్తసిక్తమయిన డిస్టర్బడ్ ఫొటోస్ అవీ పెట్టి అత్యంత దయనీయంగా, జాలి గొలిపేలా ఉండేలా బాగా జాగ్రత్త తీసుకుంటారు. అలాంటివి చూసి చాలామంది ఒకటి రెండు రోజులు నాన్వెజ్ తినడం మానేస్తారు కూడా :-). అయితే జంతువుల్ని ఒకేసారి చంపడం కన్నా అవి బ్రతికున్నంత కాలం పెట్టే హింస పెద్ద హింస కాదనుకుంటే తప్ప ఇది లాక్టోవెజిటేరియన్స్ కి కూడా సమానంగా వర్తిస్తుంది. మరి ఎంతమంది లాక్టో వెజిటేరియన్స్ తాము ఇష్టంగా తినే పాలు, పెరుగు, వెన్న, తేనె లాంటివి తినడం మానెయ్యడానికి సిద్ధపడతారు? లాక్టో వెజిటేరియన్స్ ని  ప్రకృతిలో స్వేచ్ఛగా తిరగాల్సిన జంతువులను అలా బంధించి, వాటికీ వాటి పిల్లలకి దక్కాల్సిన సంపదను, వాటి శ్రమని దోచుకోవడం తప్పు కాదా అని అడిగితే "ఒక ప్రాణం తియ్యనంత వరకు ఏం చేసినా, ఎంత దోచుకున్నా పర్లేదు" అనీ,  ప్రకృతిలో ఒక ప్రాణి మరో ప్రాణి మీద ఆధారపడటం అత్యంత సహజమనీ, మనం వాటిని బానిసలుగా ఉంచుకున్నా అవి కష్టపడకుండా తిండి పెడుతున్నాం, జబ్బులొస్తే మందులేస్తున్నాం, అని తమకు అనుకూలంగా ఉండేలా వారి అవకాశవాదాన్ని అందంగా సమర్ధించుకుంటారు. అసలు ప్రకృతి సహజంగా కొన్ని జంతువులు ఎలాగైతే తమ ఆహారం కోసం మిగతా జంతువుల మీద ఆధారపడుతున్నాయో మనిషి కూడా తన ఆహారం కోసం కొన్ని జంతువుల మీద ఆధారపడటం కూడా ప్రకృతి సిద్ధం కాదా అనేది మరొక వాదన. 

అసలయితే చంపినప్పుడే జంతువులకి నొప్పి తక్కువ ఎందుకంటే వాటిని చంపేముందు (కనీసం కొన్ని దేశాల్లో అమలుపరిచే నిబంధనల ప్రకారం) వాటికి ఒక చిన్న ఎలెక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారానో లేక అధికశాతం కార్బన్ డైయాక్సైడ్ ఇవ్వడం ద్వారానో వాటికి బ్రెయిన్ తాత్కాలికంగా పని చెయ్యకుండా చేస్తారు (stunning). తరువాత ఏం జరిగేది వాటికి తెలీదు. అందువల్ల ప్రాణం ఉన్న మొక్కలను తెంపి తినడం ఎలానో ఈ స్పృహ లేని జంతువులని చంపినా అంతే. అయితే హలాల్ విధానం ఈ స్టన్నింగ్ ప్రక్రియకి విరుద్ధంగా ఉంటుంది. చనిపోయే జంతువుకి చివరిదాకా బాధ తెలుస్తూనే ఉంటుంది. అందువల్ల హలాల్ మీట్ కావాలని డిమాండ్ చేసేవారందరూ ఒకప్పుడెప్పుడో అప్పటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడ్డ ఒక నిబంధనని, కేవలం మతానికి అనుసంధానమై ఉందన్న కారణంతో ఇప్పుడూ అదే అనుసరిస్తాం అనకుండా, మానవీయకోణంలో ఆలోచించి జంతువులకి నొప్పి తెలీకుండా చంపడానికి వీలయేలా అభివృద్ధిపరిచిన స్టన్నింగ్ లాంటి టెక్నాలజీని ఆచరించవలసిన ఆవశ్యకతని గుర్తించాలని హలాల్ కి వ్యతిరేకంగా పోరాడేవారి ప్రతివాదన.

మాంసాహారంతో పోలిస్తే శాకాహారం వల్ల అనేక ఆరోగ్యపరమయిన ప్రయోజనాలు ఉన్నాయనేది ఎవరూ కాదనలేని నిజం. అయితే ఇది అవసరాన్ని బట్టి ఎవరికి వారు తీసుకునే నిర్ణయమే తప్ప ఇందులో ఇతరుల జోక్యం,  ప్రబోధనలు అనవసరమే.  

ప్రపంచంలో మొత్తం వాయుకాలుష్యంలో 18 - 20% వాటా జంతువులు, ముఖ్యంగా ఆవులు విడుదల చేసే మీథేన్ వాయువుల వల్లనట. అధిక జనాభా కలిగిన భారత్, చైనా లాంటి దేశాల్లోని ప్రజలు క్రమంగా మాంసాహారం వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న కారణంగా ఈ వాటా 2030 కల్లా 50 - 60% కి చేరుకుంటుందని ఒక అంచనా. ఎలెక్ట్రిక్ వాహనాలు, సోలార్ విద్యుత్తూ అంటూ ఒకవైపు కాలుష్య నివారణకి అనేక కార్యక్రమాలు చేపడుతుండగా ఈ మీథేన్ కాలుష్యకారకాల మీద  ప్రజలను చైతన్య పరచడానికి మాత్రం పెద్దగా ప్రయత్నాలు ఏం జరగడం లేదు. అయితే కాలుష్య కారకాలలో సింహభాగం అయిన  కార్లు, ఏసిలు మొదలయిన విలాస వస్తువులు వదులుకోవడానికి సిద్ధంగా లేని మనిషి తన ఆహారవిషయంలో మాత్రం రాజీ పడతాడా అన్నది ప్రశ్నార్ధకమే! 

రోజురోజుకీ పెరుగుతున్న అధిక జనాభాకి తగ్గట్టు ఆహారోత్పత్తి పెంచి భావితరాలవారికి ఆహారభద్రత కల్పించడానికి కృషి చెయ్యడం మనందిరి సమిష్టి బాధ్యత. అధిక దిగుబడి ఇచ్చే ఆహారధాన్యాల వంగడాలను రూపొందించడంతో పాటు ఎక్కువ ఫలోత్పాదకశక్తి (ఎఫీషియన్సీ) కలిగిన జంతువులను (అంటే అవి తక్కువ ఆహారం తిని ఎక్కువ మాంసం దిగుబడి వచ్చేలా) కూడా అభివృద్ధి పరచవలసి ఉంది. రెండిటిలో ఉపయోగించేది జన్యుమార్పిడి లాంటి ప్రకృతి విరుద్ధమయిన పద్ధతులే! కానీ ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించకుండా భవిష్యత్ ఆహార డిమాండ్ ని అందుకోగలమా అంటే ఖచ్చితంగా కాదనే ఒప్పుకోవాలి. అలాగే ఎకొలాజికల్ పిరమిడ్లో వీలయినంతమేరకు క్రింది పొరల్లో ఉండటం కూడా కలిసొచ్చే అంశమే.


ఏ మతం, కులం, జాతి, కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగినా, కనీసం ఒక వయస్సు వచ్చేసరికి ఆమె/అతను ... తను ఏం చెయ్యాలి, ఏం తినాలి, ఏ మతం, ఏ ఆచారాలు అనుసరించాలి, తన సంపాదన ఎలా ఖర్చుపెట్టాలి, ఎవర్ని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి అన్న విషయాల మీద కేవలం ఆ వ్యక్తికే పూర్తి స్వేచ్ఛ, అధికారం ఉండాలి అన్నది నా దృఢమయిన అభిప్రాయం. అందులో తినే ఆహారం మరీ సున్నితమయిన విషయం. మనం తినేవాటిలో తప్పు ఒప్పులు ఎత్తిచూపడం, కించపరచడం, అవమానపరచడం, మీరు తినేదాని బదులు ఫలానాది తింటేనే మంచిది అన్న బలవంతపు సూచనలు, మార్గనిర్దేశాలు ఒక్కోసారి విసుగు పుట్టిస్తాయి. కొండొకచో కొన్ని సందర్భాలలో బాధపెడతాయి కూడా. ప్రపంచంలో ఇది చెడు ఆహారం, ఇది మంచి ఆహారం అంటూ ఏమీ ఉండవు. కేవలం మనకి నచ్చేవి, నచ్చనివి ఉంటాయంతే! మనకి చిన్నప్పటినుండి అలవాటు అయినవి మనకి ఎక్కువ నచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక మహిళ నిజానికి ఎంత బ్యాడ్ కుక్ అయినా ఆవిడ పిల్లలకి మాత్రం ఆ అమ్మ వండిన ప్రతీది అమృతమే.. అందుకే ప్రపంచంలో ఎవరికయినా బెస్ట్ కుక్ అమ్మే.


మనకి నచ్చనిదో లేక 'మన' మతాచారాలకు అనుగుణంగా లేవనో కొన్ని అభిప్రాయాలను మిగతా వారి మీద రుద్దడం చాలా అసంబద్ధమయిన పని. సిగరెట్, డ్రగ్స్ లాంటివి మంచిది కాదు అని ప్రజలకి అడ్వొకేట్ చెయ్యడం తప్పు కానప్పుడు, ఈ శాకాహారంలో ఉండే ప్రయోజనాలను చెప్తూ మాంసాహారం వల్ల కలిగే వ్యక్తిగత మరియు సాంఘీకపరమయిన సమస్యలు ప్రజలకు వివరించి చెప్పడంలో మాత్రం తప్పేముంది అనిపించవచ్చు. అలాంటి విశ్లేషణలు చెప్పినంతవరకు పర్వాలేదు కానీ మాంసాహారులను, వారి ఆహారపు అలవాట్లను క్రూరమయిన అలవాట్లగా అభివర్ణించడం, లేక వారు కొన్ని జంతువులను తినడం వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ఆరోపించడం తగదు. ఎప్పుడయినా ఒక వ్యక్తి చేసే పనులని లేక అలవాట్లని అదే పనిగా హేళన చెయ్యడం మొదలుపెడితే అప్పుడు ఆ వ్యక్తులు డిఫెన్స్ లో పడతారు. ఒక్కసారి ఎవరన్నా డిఫెన్స్లో పడితే వారు ఎప్పుడూ వారి చర్యలను సమర్ధించుకోవాలని చూస్తారు తప్ప మార్పు గురించి ఆలోచించడం అన్నది సాధ్యం కానే కాదు. మన దేశంలో బీఫ్ తినడం విషయంలో జరిగే గందరగోళం, తినేవాళ్ళను వాళ్ళ అలవాట్లను విమర్శిస్తూ చేసే వ్యాఖ్యలు, దానికి డిఫెన్స్ లో తినేవారి ప్రతివ్యాఖ్యలు అన్నీ నివారించదగ్గవే. ఒకరి ఆహారపు అలవాట్లని నిర్దేశించే, విమర్శించే హక్కు ఎవరికీ లేదు. కానీ, ఇలాంటి వాటికి కొన్నిచోట్ల  ప్రభుత్వ ఆమోదం కూడా ఉండటం విచారించదగ్గ విషయం. కొన్ని కొన్ని సందర్భాలలో ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల వ్యకిగత ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా అయినా సరే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి షార్క్ ఫిన్ సూప్ ఎంతో రుచిగా ఉంటుంది అని జనాలంతా వాటిని వేటాడి తినడం మొదలుపెట్టారు కనుక ఈ రోజు వాటి సంఖ్య కనిష్ట స్థాయికి పడిపోయి అవి అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే వదిలేస్తే కొన్నాళ్ళకి ఆ రకం షార్క్ ఒకటి ఉన్నదనే భావితరాలకి తెలియకపోవచ్చు. ఈ పరిస్థితిలో షార్క్ ని చంపడం లేక తినడం మీద ప్రభుత్వ నిషేధాలు తప్పవు. మరి మన దేశంలో అలాంటి నిషేధాలు ఏవైనా విధించే ముందు అలాంటి అత్యవసర పరిస్థితి ఏమన్నా ఉందా లేదా అన్నది సరి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మన ఆహారపు అలవాట్లు, మతాచారాలు, నమ్మకాలు మొదలయినవి మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడే మన ప్రమేయం లేకుండానే నిర్ణయించబడతాయి. కొందరు ఈ విషయాల్లో పెద్దయిన తరువాత మార్చుకున్నా ఎక్కువ శాతం మంది అదే ఫాలో అవుతుంటారు. ఒకవేళ ఎవరయినా అలా మార్చుకున్నారు అంటే ఆ కొత్త అలవాట్లలో లేక ఆచారంలో వాళ్ళకి ఆకర్షణీయమయిన అంశం ఏదో కనిపించిందన్నమాట. అది కొత్త మతం అయినా, కొత్త ఆహారపు అలవాటు అయినా, కొత్త సెక్సువల్ ఓరియెంటేషన్ అయినా అయ్యుండొచ్చు. కేవలం మనకి నచ్చదన్న కారణంతో దాన్ని అవలంబించే వారిని నిరాకరించే హక్కు గానీ, అవమానించే హక్కు గానీ ఎవరికీ లేదు.

ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఎవరెవరికి అంగీకారయోగ్యమైన ఆహారపు అలవాట్లని వారు ఆచరిస్తూ, పర్యావరణ పరిరక్షణ, భావితరాల వారికి ఆహారభద్రత అనే అంశాల్ని మాత్రం కేవలం ఆహారపుటలవాట్ల దృష్టి నుంచే కాకుండా ఒక సమిష్టి బాధ్యతగా పరిగణించి సాధ్యమైనంత మేరకు మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ప్రకృతి సమతుల్యతని కాపాడుకోవాల్సిన  బాధ్యత ప్రతీ ఒక్కరి పైనా ఉంటుంది.

 

I believe in Vivre et laisser vivre

- means 

"accept other people as they are, although they may have a different way of life style; and not to interfere with other people's business or preferences"


- మంచు