Pages

Tuesday, September 13, 2011

మేము మర్చిపోలేదు... క్షమించలేదు.. - 2

*** శ్రీ రామ *** 


చాప్టర్ -2 : ప్రతీకారం 


మొదటి భాగంలో బ్లాక్ సెప్టెంబర్ అనే టెర్రరిస్టు సంస్థ అమాయక ఇజ్రాయిలీ ఆటగాళ్ళ మీద చేసిన కిరాతకం గురించి తెలుసుకున్నాం. 

గోల్డా మెయర్
తమ దేశ ఆటగాళ్ళని నిరాయుధులని చేసి దారుణంగా హింసించి, అమానుషం గా చంపివేసిన సంఘటన ఇజ్రాయిల్ దేశ ప్రజలని తీవ్రంగా కలచివేసింది. బాధ్యులయిన వారిని కఠినం గా శిక్షించాలని ప్రభుత్వం మీద వివిధవర్గాల నుండి వత్తిడి పెరిగింది. అయితే జరిగిన సంఘటనను అంతే సీరియస్ గా తీసుకున్న ప్రధానమంత్రి గోల్డా మెయర్ తన సొంత నాయకత్వం లో , మోస్సాద్ డైరెక్టర్ Zvi Zamir, డిఫెన్స్ మినిస్టర్ మోషే దయాన్ మొదలగు ప్రభుత్వ ఉన్నతాధికారులతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి "Committee X" అనే ఒక కమిటీ  ఏర్పాటు చేసారు. 


ఇలాంటి దారుణమయిన సంఘటనలు ఇకపై ముందు ముందు జరగకుండా ఉండాలంటే ఈ మ్యూనిచ్ హత్యాకాండకు ప్రత్యక్షంగా బాధ్యులైన ఆ బ్రతికున్న ముగ్గురు టెర్రరిస్టులతో పాటు వీరికి కావాల్సిన ఫండ్స్, ప్లాన్స్ సమకూర్చిన తెరవెనుక వ్యక్తులను, సంస్థలను ఎవరినీ వదలకూడదని  ఈ కమిటి తీర్మానించింది. అంటే కసబ్ లా చావుకి తెగించి వచ్చిన ముష్కరులను మాత్రమే శిక్షించి సరిపెట్టేస్తే,  ఈరోజు కసబ్ ని పంపినవారు రేపు ఇంకొకడిని పంపిస్తారు కదా అన్నది వాళ్ళ ఉద్దేశ్యం. అయితే శత్రుదేశం అండదండలతో వారి దేశాల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని ఈ టెర్రరిస్టు కార్యకలాపాలు సాగిస్తున్న వారిని వెతికి పట్టుకుని ఇజ్రాయిల్ తీసుకొచ్చి శిక్షించడం జరిగే పని కాదు కనుక వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికే దొంగచాటుగా వెళ్లి చంపాలని ఈ కమిటీ సలహా ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదన ప్రధానమంత్రి గోల్డా మెయర్ కి అంత నచ్చలేదు. అయితే దేశ ప్రజల నుండి, ప్రభుత్వ ఉన్నతాధికారుల నుండి వస్తున్న ఒత్తిడికి తలవంచి అయిష్టంగానే ఈ ఆపరేషన్ కి సమ్మతించింది.


అదే సమయంలో ఈ బ్లాక్ సెప్టెంబర్ టెర్రరిస్టులు జర్మనీకి చెందిన లుఫ్తాన్సా విమానం LH615 ని హైజాక్ చేసి ఆ మ్యూనిచ్ హత్యాకాండలో పాల్గొన్న తమ సహచరులను వెంటనే వదిలేయాలని డిమాండ్  విధించారు. ఈ డిమాండ్లను జర్మనీ మొదట అంగీకరించలేదు. అయితే తమ సంస్థ సభ్యులను విడుదల చేసేవరకు  లుఫ్తాన్సా విమానాన్ని ల్యాండ్ అవనివ్వమని , తమ అనుమతి లేకుండా ల్యాండ్ చేస్తే విమానాన్ని పేల్చి వేస్తామని తేల్చి చెప్పడం తొ విధిలేని పరిస్తితులలొ ఆ ముగ్గుర్ బ్లాక్ సెప్టెంబర్ తీవ్రవాదులని జర్మని విడుదల చేసింది. తమ డిమాండ్లు నెరవేరాక ల్యాండ్ అవడానికి అనుమతించిన విమానం లొ అప్పటికి కేవలం ఒక్క నిముషం మాత్రమే ప్రయాణిచడానికి సరిపడా ఇంధనం మిగిలిందట.
అయితే ఈ తీవ్రవాదులను ఇజ్రాయిల్ తీసుకొచ్చి చట్టప్రకారం శిక్ష విధిద్దాం అని ఎదురు చూస్తున్న సమయంలో ఇలా వెస్ట్ జర్మనీ తీవ్రవాదులను వదిలి వెయ్యడంతో ప్రధానమంత్రి గోల్డా మెయర్ కి ఈ ఆపరేషన్ అమలు పరచడానికి తన మనసులో ఉన్న చిన్నపాటి సంశయం కూడా తొలగిపోయినట్టయింది.

Operation Wrath of God  అని నామకరణం చేసిన అపరేషన్ లొ మొదటి టాస్క్ ఏమిటంటే... అసలు ఈ హత్యాకాండ వెనుక ఎవరున్నారు, ఏ ఏ టెర్రరిస్టు ఆర్గనైజేషన్స్ లీడర్లు ఏ విధం గా సపోర్ట్ చేసారు, ప్లాన్ ఎవరు చేసారు, డబ్బు ఎవరు సమకూర్చారు ఇలా ఒక లిస్టు తయారు చెయ్యడం. తమ మోస్సాద్ గూఢచారులు మరియు ఇతర ఐరోపా మితృ దేశాల గూఢచారి సంస్థల సహాయంతో తయారు చేసిన ఆ లిస్టులో 20 నుంచి 35 మంది బ్లాక్ సెప్టెంబర్ మరియు పిఎల్‌వొ  సంస్థలకి చెందిన వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు ఉన్నారు. ఈ లిస్టు రెడీ అయ్యాక వీళ్ళు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు అన్నది కనిపెట్టడం రెండవ పని. అది ఇజ్రాయిల్ గూఢచారి సంస్థ అయిన మోస్సాద్ కి అప్పచెప్పారు. అమెరికాకి సిఐఏ, రష్యాకి కేజిబి లా మోస్సాద్ అనేది ఇజ్రాయిల్ యొక్క సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అన్నమాట. 

అయితే ఇక్కడ ఈ టెర్రరిస్టు నాయకులని శిక్షించేటప్పుడు మోస్సాద్ యొక్క లక్ష్యాలు ఏంటంటే...
  • ఎట్టి పరిస్థితులలోను ఆ టెర్రరిస్టు నాయకులని చంపడం వెనుక ఇజ్రాయిల్ హస్తం ఉందని సాక్ష్యాలు దొరకకూడదు...
  • చంపే విధానం టెర్రరిస్టులకు వణుకు పుట్టించే విధంగా ఉండాలి..
  • "తప్పు చేస్తే ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా మీరు మా నుండి తప్పించుకోలేరు.... మేము తలచుకుంటే ఎక్కడికి వచ్చి అయినా మిమ్మల్ని చంపగలం" అన్న మెసేజ్ బలంగా పంపడం...
వగైరా అన్నమాట... 

ఆ మొస్సాద్ టార్గెట్ లిస్టులొని వ్యక్తులు ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారో తెలిసాక వీళ్ళను చంపడానికి మోస్సాద్ ప్రత్యేకమయిన టీంలు తయారు చేసింది. పదిహేను మందితో కూడిన ఒక్కో టీంలో ఐదు విభాగాలు ఉండేవి..
  • పూర్తిగా శిక్షణ పొందిన ఇద్దరు మెయిన్ కిల్లర్స్, 
  • వీళ్ళను చూసుకుంటూ వీరి వెనుకే అనుసరించే ఇంకో ఇద్దరు బ్యాకప్ కిల్లర్లు, 
  • వీళ్ళు చంపడానికి వెళ్ళినప్పుడు ఆయా దేశాల్లో ఉండటానికి అవసరమయిన హోటల్స్, అపార్ట్మెంట్లు, అద్దె కార్లు వగైరా ఏర్పాట్లు చూడటానికి ఒక ఇద్దరు ఏజెంట్లు, 
  • అప్పట్లో సెల్ ఫోన్ లు లేవు కాబట్టి కమ్యూనికేషన్ కోసం ఇద్దరు స్పెషలిస్ట్లు, 
  • మిగతావారు చంపబోయే ఆ టెర్రరిస్టు నాయకుడి కదలికలు గమనించి ఫైనల్ ప్లాన్ తయారు చెయ్యడానికి మరియు తరువాత పారిపోవడానికి అవసరమయిన ఎస్కేప్ రూట్లు తయారు చేసే టీం అన్నమాట.

ప్రతీ ఆపరేషన్ ముందు ఈ టీం చంపడానికి కొన్ని గంటల ముందు
చంపబోయే ఆ టెర్రరిస్టు నాయకుడి ఇంటికి ఒక ఫ్లవర్ బొకే తో ఈ మెసేజ్ పంపేవారు...

"A reminder we do not forget or forgive"  ("మేము మరచిపోం.. క్షమించం..")



ఈ మ్యూనిచ్ హత్యాకాండ జరిగిన నలభై రోజుల తరువాత... ఇటలి లోని రోమ్ నగరంలొ పిఎల్‌వొ  (పాలస్తినా లిబెరేషన్ ఆర్గనైజేషన్) కి ఇటలీ రెప్రజెంటేటివ్ గా పనిచేస్తూ మ్యూనిచ్ ఒలంపిక్ హత్యాకాండకు అండదండలు అందించాడని అనుమానిస్తున్న Abdel Wael Zwaiter డిన్నర్ ముగించుకుని తిరిగి తన  నివాసానికి వస్తుండగా, రోడ్డుపక్కన నక్కిన ఇద్దరు ఏజెంట్ల చేతులలో హత్యకు గురయ్యాడు. హత్య చేసినవారు ఇతన్ని తుపాకితో పదకొండు సార్లు కాల్చారు... చనిపోయిన పదకొండు మంది ఇజ్రాయిలీ ఆటగాళ్లకి గుర్తుగా...  


రెండో ప్రతీకార హత్య ప్యారిస్ లో జరిగింది... పిఎల్‌వొ ఫ్రాన్స్ రెప్రజెంటేటివ్ గా ఉన్న మహ్మద్ హంషారి ని పత్రికా విలేఖరిగా తనను తాను పరిచయం చేసుకున్న ఒక ఏజంట్ మాయమాటలు చెప్పి ఇంటినుండి బయటకు తీసుకెళ్లగా... అదే టైంలో ఇంకో ఇద్దరు ఏజెంట్లు అతని ఇంట్లోకి ప్రవేశించి ఫోన్ లో బాంబ్ అమర్చారు. ఇతను తిరిగి ఇంటికి వచ్చాక అతనికి ఫోన్ చేసి... ఫోన్ ఎత్తింది హంషారినే అని ధృవీకరించుకున్నాక... రిమోట్ తో ఆ బాంబు పేల్చివేసారు. 

ఆ తరువాత బ్లాక్ సెప్టెంబర్ సైప్రస్స్ రెప్రజెంటేటివ్ ఆల్ బషీర్ తన మంచం కింద పెట్టిన బాంబు ప్రేలి మరణించగాబ్లాక్  సెప్టెంబర్ తీవ్రవాదులకి అయుధాలు అందచెయ్యడం లొ కీలక పాత్రధారి "లా ప్రొఫెసర్ అల్ కుబైసి" పారిస్ రోడ్డు మీద ఏజంట్ల తుపాకి బుల్లెట్ల నుండి తప్పించుకోలేక పోయాడు. 



తరువాతి టార్గెట్ లెబనాన్ లోని బీరుట్ నగరంలో అత్యంత కట్టుదిట్టమయిన భద్రత మధ్య ఉన్న పిఎల్‌వొ ఉన్నత అధికారులు... లెబనాన్ శత్రుదేశం కాబట్టి ఇంతకు ముందులా సులభంగా ఆ దేశం లోకి ప్రవేశించి వాళ్ళని చంపలేరు... అందుకే వీరి కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.  ఏప్రిల్ 13, 1973 అర్ధరాత్రి అకస్మాత్తుగా చేపట్టిన ఆపరేషన్లో బాంబులు వేసి కొందరు పిఎల్‌వొ కీలక నేతలు మకాం ఉంటున్న భవంతిని బాంబులతో పేల్చివేయడం ద్వారా పలు తీవ్రవాద నేతల్ని మట్టుపెట్టారు. అప్పుడు ఆ ఆపరేషన్ పాల్గొన్న కమెండోలలో ఆ తరువాత ఇజ్రాయిల్ కి ప్రధాన మంత్రిగా పనిచేసిన Ehud Barak కూడా ఉన్నారు.  

అలా కొన్ని ప్రతీకార హత్యలు జరిగాక... మోస్సాద్ మ్యూనిచ్ హత్యాకాండకి మాస్టర్ మైండ్ అని భావించే అలీ హసన్ సలేమా అనే బ్లాక్ సెప్టెంబర్ కీలక నేతపై దృష్టి సారించింది. ఒక సంవత్సరం ఇతని కోసం ప్రపంచం అంతా గాలించాక అతను నార్వేలో లిల్లి హామార్ అనే ఊళ్ళో హోటల్ వెయిటర్ గా పనిచేస్తున్నాడన్న సమాచారం అందింది. అక్కడకు చేరుకొని ఆపరేషన్ పూర్తి చేశాక మోస్సాద్ ఏజెంట్స్ కి ఆ వెయిటర్ తాము అనుకుంటున్న అలీ హసన్ కాదని, అతనొక అమాయక వ్యక్తి అని తెలుసుకున్నారు... అదే టైంలో ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఏజంట్లు అందరూ నార్వే పోలీసులకి నాటకీయ ఫక్కీలో దొరికిపోయారు... అయితే ఒక రెండు సంవత్సరాల తరువాత వాళ్ళు బయటకు వచ్చేసారు కానీ... నార్వే లో జరిగిన పొరబాటుకు ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన  నిరసనల  వల్ల ఇజ్రాయిల్ ఈ ప్రతీకార ఆపరేషన్ని రద్దు చెయ్యాల్సి వచ్చింది. అయితే... అసలు ఆ అలీ హసన్ పోలికలు ఉన్న అమాయక వ్యక్తిని అలీ హసనే అని తప్పుడు సమాచారం అందించి,  మోస్సాద్ ఏజెంట్లు ఆ అమాయకుడిని చంపాక వెంటనే నార్వే పొలీసులకి సమాచారం అందించి ఈ ఏజంట్లు దొరికిపోయేలా చెయ్యడం, అలాగే జరిగిన పొరబాటుని ప్రపంచం ముందు ఉంచడం ద్వారా... మిగతా దేశాల నుండి ఒత్తిడి తెప్పించి ఈ ఆపరేషన్ని రద్దు అయ్యేలా చెయ్యడం ఇదంతా స్వయంగా అలీ హసన్ పన్నిన కుట్రే!

1973 లో ఈ లిల్లి హెమర్ పొరబాటు వల్ల రద్దయిన మోస్సాద్ ఆపరేషన్ మళ్ళీ 1978 లో కొత్త ప్రధాని నాయకత్వంలో పునఃప్రారంభించబడింది... మళ్ళీ అలీ హసన్ గురించి ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ మొదలయ్యి మొత్తానికి అతను లెబనాన్ లో తలదాచుకుంటున్నట్టు గుర్తించారు. బ్రిటిష్ , కెనడా పాస్‌పొర్ట్ లతొ లెబనాన్ లొ ప్రవేశించిన మొస్సాద్ ఏజెంట్లు అలీ హసన్ ఎక్కువగా సంచరించే వీదిలొనే ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని రెండు నెలల పాటు అతని కదలికలని బాగా గమనిస్తూ, అనువైన సమయం కొసం ఎదురు చూసి అఖరికి 1979 జనవరి 22 మధ్యాహ్నం కార్ బాంబు పేల్చి అతన్ని అంతమొందించారు. అలా కొన్నాళ్ళ వరకూ ఈ ప్రతీకార హత్యలు కొనసాగాయి కానీ మ్యూనిచ్ హత్యాకాండలో ప్రత్యక్షంగా పాల్గొన్న టెర్రరిస్టులలో మిగిలి ఉన్న ముగ్గుర్ని మోస్సాద్ ఏజెంట్లు చంపగాలిగారా లేదా అన్నది ఇప్పటికి ప్రశ్నే! ఈ ప్రతీకార హత్యలే కాకుండా కొంచెం అనుమానం ఉన్న హైర్యాంక్ లో ఉన్న పిఎల్‌వొ నాయకుల్ని నియంత్రించడానికి అనేకమయిన సైకలాజికల్ యుద్ధాలు కూడా మోస్సాద్ చేపట్టింది. అందులో వాళ్ళ పర్సనల్ సీక్రెట్స్ (ముఖ్యంగా చీకటి కోణాలు) సంపాదించి... పిఎల్‌వొ కి దూరంగా ఉండకపోతే ఆ సీక్రెట్స్ పబ్లిక్ లో పెడతాం అని బెదిరించడం లాంటివి కొన్ని... 


అలా ఆ మ్యూనిచ్ హత్యాకాండకి బాధ్యులయిన వారిని వేటాడి చంపడం ఆ తరువాత ఇరవై సంవత్సరాల పాటు జరిగింది... అవును ఇరవై సంవత్సరాలే! ఎందుకంటే.... "they do not forget or forgive".

అయితే ఈ ప్రతీకారచర్యలు మధ్యప్రాచ్యంలో శాంతికి తోడ్పడ్డాయా? ఇలా దొంగతనంగా చంపడం సబబేనా.. నైతికంగా సరి అయినదేనా? ఇలా టెర్రరిస్టులను శిక్షించే క్రమంలో కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.. అది తప్పు కాదా? దీనివల్ల ఇజ్రాయిల్ సాధించింది ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి...  అవును ఇది మధ్య ప్రాచ్యంలో శాంతి పెంపొందించలేదు.. కానీ వాళ్ళు అనుకున్నది సాధించారు.. తమ దేశప్రజలపై,  అమాయక ఆటగాళ్ళపై భయానక దాడి చేసిన వారికి శిక్ష అమలు పరచడానికి ఎంతకయినా తెగిస్తాం అని నిరూపించారు.... పిరికిపందలుగా వచ్చి హత్యలు చేసి పరాయి దేశం చేరిపోతే చాలు అనుకునే వాళ్లకి మీరు ఎక్కడ ఉన్నా మేము మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు అన్న మెసేజ్ బలంగా పంపించారు. 

ఒక్కమాటలో చెప్పాలంటే టెర్రరిస్ట్లకే టెర్రర్ పుట్టించారు.

ఇక మన కమాండోలు పాకిస్తాన్ వెళ్లి మన దేశసమగ్రతను విచ్ఛిన్నం చెయ్యడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తున్న ప్రతీ ఒక్కడిని ఆ మాటకొస్తే  ఏ ఒక్కడినయినా ఇలా వేటాడి శిక్షించే రోజు వస్తుందంటారా? అమాయక ప్రజల్ని అత్యంత కిరాతకం గా చంపుతున్న వారిని పట్టుకొవడానికి ఇప్పటికిప్పుడు మనం అమెరికా వాడిలా కొట్లు కుమ్మరించి యుద్దానికి వెళ్లమని కొరడం లేదు.... అక్రమిత కాశ్మీర్ మీద దాడులు చేసి తీవ్రవాద ట్రైనింగ్ క్యాంపులు నాశనం చేస్తారన్న ఆశ అస్సలు లేదు. కఠినమైన కొత్త కొత్త చట్టాలు తెచ్చి తీవ్రవాదం అరికట్టడానికి ప్రయత్నించి మైనారిటీల మనొభావాలను కించపరచమని కొరడం లేదు. అడిగేదల్లా ఒక్కతే.. సాధారణ ప్రజల ప్రాణానికి కూడా కాస్త విలువ నివ్వమని. 

చేతికి దొరికినా, వాళ్ళ నేరం నిరుపించబడ్డా, అత్యున్నత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసాకా కూడా... స్వార్ధ ప్రయోజనాల కొసం వాళ్ళకా శిక్ష అమలుపరచలేని (అమలుపరచని) దొంగ వెధవలని మనం ఎన్నుకున్నంత కాలం అది అత్యాశేనంటారా? 

మనపై జరిగిన అమానుషదాడిని "  క్షమించడం ... మర్చిపొవడం.... "  అన్నది .....

మొదటిసారి మన విశాల హృదయాన్ని, మంచితనాన్ని సూచిస్తే... రెండొసారినుండి అది మన చేతకానితనానికి చిహ్నం 


జై హింద్ 

 - మంచు


------------------------------------------------------------------------
గొల్లపూడి మారుతిరావ్ గారి వ్యాసం కూడా ఇక్కడ చదవగలరు. 


అలాగే మ్యూనిచ్ మారణకాండ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నవారు... ఈ పుస్తకాలు, సినిమాలు చూడవచ్చు.
 పుస్తకాలు
1. Simon Reevs రాసిన One Day in September: the full story of the 1972 Munich Olympics massacre and the Israeli revenge operation 'Wrath of God',
2. George Jonas రాసిన  Vengeance: The True Story of an Israeli Counter-Terrorist Team
సినిమాలు
1. Sword of Gideon  (HBO మూవీ)  మరియు

2. స్టీవెన్ స్పెల్బెర్గ్  యొక్క Munich సినిమా




26 comments:

Sujata M said...

చాలా బాగా రాసారు. ఉత్కంఠ ని ఎక్కడా మిస్ కానీయకుండా. ఇజ్రాయిలీల ఉక్కు పాదం ప్రపంచ ప్రసిద్ధి చెందినదే గానీ, భారతీయుల శాంతి కాముకత కూడా 'చేత కాని తన'మేమీ కాదని నా ఉద్దేశ్యం. తీవ్ర ప్రతీకార వాంచ - ప్రపంచాన్ని ఉడికిస్తుంది. ఇండియా 'ఇలా' లేదు - 'అలా' లేదు అని బాధపడడం దండగ. కసబ్ ని, సరబ్జిత్ ని చంపేయడం పెద్ద సమస్య కాదు. వాళ్ళని విదేశాంగ్ శాఖ దౌత్య ప్రయోజనాల కోసం బ్రతికి ఉంచడం లో లౌక్యం కూడా ఉందేమొ ! పాప్యులర్ ప్రజావేశానికి లొంగిపోయి - విధాన నిర్ణయాలు తీసుకోవడం మన దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలని దెబ్బతీస్తాయేమో !

Sujata M said...

Sorry . Not Sarabhjit. Its Afzal.

సిరిసిరిమువ్వ said...

మీ నెరేషన్ బాగుంది.

మనపై జరిగిన అమానుషదాడిని " క్షమించడం ... మర్చిపొవడం.... " అన్నది .....

మొదటిసారి మన విశాల హృదయాన్ని, మంచితనాన్ని సూచిస్తే... రెండొసారినుండి అది మన చేతకానితనానికి చిహ్నం..

బాగా చెప్పారు.

అన్ని సాక్ష్యాలు ఉన్నా ఉరి తీయటానికి జంకుతూ..వాళ్ళు బ్రతికి ఉండటానికి ఒక్కొక్కడి మీదా కోట్లాది రూపాయల ప్రజల డబ్బు ఖర్చు పెట్టటం ఒక్క మన దేశంలోనే చూస్తాం ఏమో!

ప్రతీకారం కాదు కనీస స్పందన కూడా మర్చిపోతున్నాం మనం

Chandu S said...

very good and purposeful article. Trying to imagine the effort you had put to write this.
Thanks

Rao S Lakkaraju said...

దీనివల్ల ఇజ్రాయిల్ సాధించింది ఏమిటి?
---------
మళ్ళా అటువంటి దాడి ఇజ్రాయిల్ వాళ్ళ మీద జరగలేదు కదా. అటువంటివి మనవాళ్ళు చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సోస్తుంది.
థాంక్స్ ఫర్ ది పోస్ట్. పాత సంగతులు గుర్తు చేసినందుకు.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

Wonderfully written. Keep writing more.
W/R-Saikiran

Anonymous said...

పక్కదేశాలకు పోయి చంపడమెందుకండీ .. దేశములోనే చాలా మంది వెధవలున్నారు (తీవ్రవాదులకు సాయం చేసిన వాల్లు) వారినేసెయ్యమనండి ముందు, మనవాల్లకు అంత చిత్తశుద్ది ఉంటే.

శివరంజని said...

నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇందులో మీ ఆలోచనా బాగా అర్ధమవుతుంది

..నాకు కూడా ఏమి తెలియదు చెప్పడానికి ......... కాని ఒక్క విషయం తెలుసు......... అన్యాయం చేయడం ఎంత తప్పో అన్యాయాన్ని సహించడం కూడా అంతే తప్పంట

అందుకే మీ ఆలోచనలతో ఏకి భవిస్తున్నాను ... ఈ పోస్ట్ ఇంకోక్కసారి చదవాలి ...ఈ పార్ట్ లో నాకు తెలిసిన విషయం ఒక్కటీ లేదు

Sravya V said...

Nice write up !
ఇజ్రాయిల్ లో అధికం గా ఇజ్రాయిలీలు ఉంటారు , జర్మనీ లో జర్మన్ లు ఉంటారు , అలాగే మిలిగిన దేశాలలో .

కానీ భారతదేశం లో దొరికినకాడికి దోచుకునే అన్ని రంగాల ప్రముఖులు ఉంటారు , ఊరికే ఊరికే మనోభావాలు దెబ్బతినే మైనారిటీలు ఉంటారు , మానవహక్కుల పోరాటవాదులు ఉంటారు , ఈ దేశం నుంచి పక్క ఎర్ర కారిడారు అని ముద్దు గా పిలుచుకునే మావొఇస్టులు ఉంటారు , కనపడినవాడికల్ల క్షమాబిక్ష పెట్టమని కోరే మానవతావాదులు ఉంటారు , వీళ్ళందరూ దేశాన్ని ఆక్రమించుకుంటే భారతీయులు ఎక్కడో ఒక మూలనున్నారు , వాళ్ళ సంఖ్య కంటి కి ఆనడం లేదు . వాళ్ళ బాధ , గోడు పాలకులకి చేరటం లేదు .

అంతే కాని భారతీయుల్లో కూడా నిఖార్సైన పోరాట యోధులు ఉన్నారండోయ్ , ఒంటి చేత్తో ఇండో-పాక్ వార్ (1971 ) గెలిపించటానికి ప్రాణాలని సైతం లెక్కచేయని నిరాజ్ కుక్రేజలు (Niraj Kukreja ) నుంచి నిన్న మొన్నటి హేమంత్ కర్కరే , సందీప్ ఉన్ని కృష్ణన్ ల దాకా . కాకపొతే వీళ్ళందరి త్యాగాలు ప్రస్తుతపు యూత్ ఐకాన్ గా చాలామణి అవుతున్న సినిమా యాక్టర్లు , మనీ మేకర్ల్స్ ఇమేజ్ అంత త్వరగా మామూలు భారతీయులకి ఎక్కటం లేదు . రేపోప్పుడో వాళ్ళ త్యాగాలకి విలువ కట్టే రోజు వస్తుంది అన్న ఆశతో , అందాకా ఇదుగో ఇలా క్షమభిక్షల మోజులో , అలాగే చేతగాని తనానికి మంచితనపు ముసుగోలో ఇలా గోర్రేల్లగా బతికేద్దాం .

మధురవాణి said...

సీక్వెల్ నిజంగానే జేమ్స్ బాండ్ సినిమాని తలపించిందండీ.. ఎక్కడా పట్టు సడలకుండా చివరికంటా ఉత్కంఠ కొనసాగేలా రాసారు. ఇలాంటి వైవిధ్యమైన, క్లిష్టమైన అంశాలని అందరికీ అర్తంయీలా భలే సులువుగా ఆసక్తికరంగా చెప్పే నేర్పు మీలో ఉందండీ.. అభినందనలు. :)

మీరప్పుడప్పుడూ ఇలాంటి చరిత్ర పాఠాలు చెప్తే బావుంటుందేమో.. మాలాంటి వారి కోసం కాస్త వీలు చేసుకోకూడదూ! నిజానికి కాస్త వీలు చేసుకుంటే సరిపోదేమో.. ఈ పోస్ట్ చదువుతుంటే మీరు చాలా శ్రమ తీసుకుని రాసి ఉంటారని అర్థమౌతోంది. Once again I really appreciate your time and efforts spent on this post!

నిజమే.. మంచితనం, జాలిగుణం కూడా ఒక మోతాదు మించితే అనర్ధదాయకమే.. అది ఒక మనిషికైనా, దేశానికైనా సరే!

హుమ్మ్.. మీరన్నట్టు మంచితనానికీ, చేతకానితనానికి మధ్యన ఉన్న తేడాని మనం గుర్తించే రోజు, గుర్తించినా దేనికీ లొంగకుండా ధైర్యంగా అమలు పరచగలిగే రోజు ఏనాటికైనా వస్తుందా అని సందేహంగానే ఉంది నాకైతే! :(
But still.. as they always say.. Let's hope for the best! :)

Keep writing మంచు గారూ!

..nagarjuna.. said...

>>మనపై జరిగిన అమానుషదాడిని " క్షమించడం ... మర్చిపొవడం.... " అన్నది .....

మొదటిసారి మన విశాల హృదయాన్ని, మంచితనాన్ని సూచిస్తే... రెండొసారినుండి అది మన చేతకానితనానికి చిహ్నం <<

very true.

sooraj said...

దేశంలో ఉండేవాల్ల లిస్ట్ లో,మనోల్లు వెల్తున్న రైలుని కాల్చేశారని, దానితో ఏమాత్రం సంబంధం లేని వాల్లని(కేవలం మన మతమోల్లు కాదు అనే ఒక్క రీజన్ తప్ప) చివరికి గర్భవతుల్ని,ముసలోల్లని,పిల్లల్ని కూడా వదలకుండా నరికి, కాల్చి చంపిన వారిని చేర్చలేదేం..? ఓ.. వీరందరూ మీ దృష్టిలో నిఖార్సైన భారతీయులుకదా.. బాగుంది.. కానివ్వండి..

Sravya V said...

@Mr. Sooraj

Re you referring my comment ? If yes it is my response.

*Yes I am suffering with selective blindness, it is so true . But you know onething ? I got infected by this stupid virus from my fellow countrymates, those who are feeling the pain of that so called "ఏమాత్రం సంబంధం లేని " !*

@Manchu gaaru sorry for using space!

KumarN said...

Sraavya,
చప్పట్లు:-)
"I got infected by this stupid virus from my fellow countrymates.."

Nicely delivered..

KumarN

Malakpet Rowdy said...

LOL Sravya ..

కుక్క కాటుకు చెప్పు దెబ్బ

Rao S Lakkaraju said...

@sooraj ఉత్తిపుణ్యానికి రైలుపెట్టేల్లో జనాన్ని తగలపెడితే ఏమి చెయ్యొచ్చో కొంచెం చెప్పండి సార్.

మంచు said...

సూరజ్ భాయ్.. మా చేత మిమ్మల్ని అలా పిలిపించుకొవడానికి మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను.

రెండు మెట్లు ఉంటే మొదటి మెట్టు కళ్ళు మూసుకుని దిగేసి రెండొ మెట్టులొ నిలబడి ఎదొ జరిగిపొతుంది అని గగ్గొలు పెట్టడం ఎమిటి భాయ్... ఒక్క నిముషం మొదటి మెట్టులొ ఉండి అలొచిద్దాం...

*** మనోల్లు వెల్తున్న రైలుని కాల్చేశారని *** అని అన్నారు... ఏమిటేమిటి ఒక్కసారి మళ్ళీ అలొచించి చెప్పండి.

>>>>> రైలుని కాల్చారా ? మనుషుల్ని కాల్చారా ????

>>>>> పాత పగలతొ కాల్చారా ? లేక మీరు సెలవిచ్చినట్టు " కేవలం మన మతమోల్లు కాదు అనే ఒక్క రీజన్ " తొ కాల్చారా ?

>>>>> ఈ ముష్కరుల చర్య మీకు ఎప్పుడు తప్పు అనిపించలేదా ? ఈ కిరాతక చర్యలొ కాలి బూడిద అయిపొయిన వారి గురించి మీకు ఒక్క కన్నీటి చుక్క రాలదా? వీరు మీ సహొదరులు లాంటి వారు కాదా ? లేకా మీకు ఒక మతం వారే సొదరులా ?

>>>>> క్షమించడమే జీవిత పరమావధిగా భావించే మానవతావాదులు , రెండొ మెట్టుకొచ్చెసరికి ఇలా ఊసర వెల్లి లా రంగులు మార్చేస్తున్నారే ... ఎందుకలాగా... క్షమించడం అనే పెద్దమనసు మనొళ్ళ వరకే వర్తిస్తుందా.. ?

>>>>> మీకు , నాకు మనొళ్ళు , పగొళ్ళు అన్న ఫీలింగ్లు ఉన్నయేమో.. అదృస్టవశాత్తు మన అత్యున్నత న్యాయవ్యవస్తకు ఇంకా జబ్బు అంటుకొలేదు. ఎం గుజరాత్ ప్రబుత్వానికి బద్దవ్యతిరేఖి అయిన కాంగ్రెస్స్ పార్టీనే కదా కేంద్రం లొ ఉంది... గత ఏడేళ్ళగా వాళ్లకి అనుకూలమయిన కమిటీలు వేస్తునే ఉన్నారు కదా.. నేరం రుజువయ్యి శిక్ష విదిస్తే వద్దనేవాడు ఎవడు.. నేరం చేసినవాళ్ళని , శిక్ష పడిన వాళ్ళని నెత్తిన పెట్టుకొవడానికి మేమేమి పైన శ్రావ్య గారు రాసిన లిస్ట్లొ లేమే.. నేరం చేస్తే ఏ మతం వాడయినా... కులం వాడయినా శిక్ష అనుభవించాల్సిందే.. అది మా అభిప్రాయం.. ఈ పోస్ట్ ఉద్దేశ్యం ..

>>>>> ఎంటి భాయ్.. మీకు కావాల్సింది సౌకర్యం గా మర్చిపొయి భలే మాట్లాడుతున్నరే...

మంచు said...

సుజాత గారు.. మీ కామంట్ నాకు బాగా నచ్చింది. అలొచింప చేసేలా ఉంది. అయితే నావి కొన్ని పాయింట్లు...

1. ఇండియా ఇలా లేదు అలా లేదు అని కాదండి.. ఇండియా అంటే ఎవరు.. మనమే కదా.. మనం కొరుకున్నట్టే మన దేశం ఉండాలి అనే కదా మనది ప్రజాస్వామ్య ప్రబుత్వం అనేది.

2. పాప్యులర్ ప్రజావేశానికి లొంగిపోయి - విధాన నిర్ణయాలు తీసుకోవడం మన దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలని దెబ్బతీస్తాయేమో>>>>>

పాపులర్ ప్రజావేశం బట్టి కొర్టు తీర్పులు ఇవ్వదు కదండి.. మన ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం, పీనల్ కొడ్ బట్టి నే కదా శిక్ష విదించేది. మనం కొరుకునేది ఫలానా వాడిని పట్టుకుని శిక్షించండి అని కాదు కదా... అత్యున్నత న్యాయస్తానం లొ నేరం రుజువయ్యి అల్రెడీ శిక్ష పడిన వారికి మనం కస్టపడిన డబ్బుతొ మేపడం ఏ రకం గా న్యాయం ? అసలు దౌత్యపరమయిన కారణాలు ఉండటానికి శిక్ష విధించడం ఎందుకు చెప్పండి.. మనం అడిగేది చట్టపరం గా, న్యాయపరం గా , నైతికపరం గా సరి అయినదేకదా ..

ఇప్పుడు రాజీవ్ గాంధి హత్య కేసులొ శిక్షపడిన వారినే తీసుకొండి.. శిక్ష అమలు పరచడం ఇన్నాళ్ళు ఆలస్యం చేసారు.. ఇప్పుడు చిన్నమ్మ గారు క్షమించేసారట... వీళ్ళని వదిలెయ్యాలట.. ఇక రాజివ్ గాంధి తొ పాటు చనిపొయిన మిగతా పంతొమ్మిది మందికి న్యాయం జరగక్కర్లేదా... ఇలాగే ఇంకొ పది సంవత్సరాల తరువాత ఈ అఫ్జల్ గురుని, కసబ్ ఇలాగే క్షమించి వదిలెయ్యరని ఎముంది...

మంచు said...

మువ్వ గారు: " ప్రతీకారం కాదు కనీస స్పందన కూడా మర్చిపోతున్నాం మనం" కరెక్ట్ గా చెప్పారు... ఇదేనండి నేను చెప్పాలనుకున్నది.
చందు గారు: థాంక్యూ... :-) నేను రాసే కొన్ని పొస్ట్లకి కొంత కస్టపడటం నిజమే... :-)
లక్కరాజు గారు: అన్నీ అందరికి సూట్ అవ్వవేమోనండి.. టెర్రరిస్ట్ల డిమాండ్లు అంగీకరించడం విషయం లొ ఇజ్రాయిల్ వాళ్ళు, రష్యా వాళ్ళు చాలా కటినం గా ఉంటారు. అది మనవల్ల అవ్వదు..
కొండముది సాయికిరణ్ కుమార్: అన్నగారు.. థాంక్యూ.. మీ ప్రొత్సాహం ఎప్పుడూ నాకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది.
అనానిమస్ గారు: :-) మీరు చెప్పింది నిజం ...
శివ రంజని : థాంక్యూ.. కొన్ని విషయాలు అందరికీ చేరాలనే కొంచెం కస్టపడుతున్నాను.. మీరు చేరగలిగితే సంతొషం... రేపు ఒటు హక్కు వినియోగించుకునే టపుడు ఈ విషయాలు గుర్తుంచుకుని ఎవరికి వొట్ వేస్తున్నారు అలొచించండి.
నాగార్జున: థాంక్యూ..
శ్రావ్య గారు: మీరు రెండు కామెంట్లు .. ఇక చెప్పక్కర్లేదు.. ఇప్పటికే కుమార్ గారు, మలక్ చెప్పేసారు.
మధుర గారు: థాంక్యూ.. ఈ రెండు పొస్టుల రూప కల్పనలొ మీ సహాయం మర్చిపొలేను. మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

నేస్తం said...

పోస్ట్ చదువుతున్నంత సేపూ సినిమా చూసినట్లే..20 యేళ్ళు పట్టిందా ఈ ఆపరేషన్ కి.. ఇక్కడ ఇంకొక ప్రశ్న.. ఇన్నేళ్ళల్లో ఇజ్రాయిల్ లో మరి ఇక ఏ టెర్రరిస్ట్ దాడి జరగలేదా? సుజాత గారు, శ్రావ్యా కామెంట్స్ బాగున్నాయి..కర్ణుడి చావుకి సవాలక్షా కారణాలని మనదేశంలో టెర్రరిజం పెరిగిపోవడానికి మిగతా దేశాలతోపోలిస్తే చాలానే అవకాశాలు ఉన్నాయండి..బిన్ లాడెన్ ని చంపెస్తే కిక్కురుమనలేదు..అదే కసబ్ ని చంపేసి ఉంటే ఎంత గొడవ జరుగుతుందో మన ప్రభుత్వానికి తెలియందికాదు..కాని ఇలా జాప్యం చేస్తే ప్రజలకే కాదు టెర్రరిష్టులకు లోకువ అయిపోతుంది..

prabandhchowdary.pudota said...

రెండు భాగాలు చాలా బాగా రాసారండి.మీ పొస్ట్ చదివిన తరువాత మునిచ్ సినిమా ని వెతికి, సగం చూసాను....ఇక మిగతా సగం ఈ రొజు చూసెస్తాను..

''అడిగేదల్లా ఒక్కతే.. సాధారణ ప్రజల ప్రాణానికి కూడా కాస్త విలువ నివ్వమని''
ఇది నిజం గా మన బారత దేశం లొ ఎప్పటికైనా జరుగుతుందా... అని..

prabandhchowdary.pudota said...

చిన్న సందేహం మంచు గారు,
''we do not forget or forgive'' అంటె 'మేము మర్చిపొము..క్షమించము అని కదా..'

John said...

అన్నీ అలవాటు ఐపోయాయండీ మనకు. కీబోర్డ్ సింపతీ కంటే ఎక్కవగా ఏమీ అశించడం అత్యాశకిందే లెక్క.

మంచు said...

నేస్తం గారు: థాంక్యూ
ప్రభంద్ గారు: థాంక్యూ ... నేను పొస్ట్లొ మార్చాను
జాన్ గారు: అవునండి అలాగే అనిపిస్తుంది ఈ రొజుల్లొ... థాంక్స్ ఫర్ యువర్ కామెంట్

Anonymous said...

ఈ ఆపరేషన్ గురించి కొంచం తెలుసుగాని, మీరు చాలా బాగ వివరించి చెప్పారు.
మన రా.కీ.నా.లు మాత్రం మారరు. వారికి కావలసింది పదవేగాని దేశం కాదు.

కాముధ

Vasu said...

చాలా బాగా రాశారు.
"ప్రతీకారం అంటే ఏంటో తెలియని బ్లడ్ రా నాది" ఇది మనకి సరిగ్గా సరిపోతుంది.
ఇజ్రాయిల్ లో ప్రభుత్వం పూనుకోకపోతే జనాలే రంగం లోకి దిగి పోయే వారేమో. ఆ కసి ఉంది. తప్పు చేసినవాడు తప్పించుకోకూడదు అనే కసి ఉంది.