Pages

Monday, September 24, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 4/4): మహాప్రళయం సంభవిస్తే?

*** శ్రీ రామ ***


సరే కానీ నాకోసం ప్రత్యేకంగా ఈ ప్రశ్న. నాకు 2012 సినిమా చూసినప్పటి నుండి ఒక చిన్న భయం పట్టుకుంది. 2012 సంవత్సరంలో అనే కాదు కానీ ఎప్పటికైనా సరే అలా మొత్తం భూమ్మీదున్న మానవజాతినంతటినీ తుడిచిపెట్టగల భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడయినా సంభవిస్తాయంటావా? ఒకవేళ వస్తే ఎప్పుడు రావొచ్చు.. అలాంటివి వస్తే మన పరిస్థితి ఏంటి? ఇది మాత్రం చెప్పు ప్లీజ్.. :-) 

ఈ భూమి మీదున్న సమస్త జీవరాశిని సమూలంగా ఒక్క పెట్టున తుడిచి పెట్టగలిగినంత భీభత్సమైన ప్రకృతి వైపరీత్యం సంభవించాలంటే అది కేవలం భూమి మీద ఏర్పడే భూకంపాలో, సునామీల మూలంగానో జరిగే కన్నా అలాంటి ఉపద్రవాలు బయట నుండి, అంటే అంతరిక్షంలో జరిగే పెనుమార్పుల కారణంగానో, రోదసిలో జరిగే మరేదైనా పెద్ద ప్రమాదాల వల్లనో సంభవించే అవకాశాలు ఎక్కువని నా అభిప్రాయం.

అంటే అంతరిక్షం నుండి ఏ ఆస్టరాయిడో (గ్రహశకలం) లేక కోమేట్ (మంచుశకలం) లాంటిదో వచ్చి భూమిని ఢీకొంటుందనా నువ్వు చెప్పేది?


ఆస్టరాయిడ్ బెల్ట్ ఊహా చిత్రం
అవును. ఈ విశాల విశ్వంలో లెక్కలేనన్ని ఆస్టరాయిడ్లు వివిధ పరిమాణాలలో ఉన్నాయి. వాటిలో కొన్ని నిర్దిష్ట కక్ష్యల్లో తిరగకుండా యథేచ్చగా ఒక దిశానిర్దేశం అంటూ లేకుండా ఎటుపడితే అటు ప్రయాణిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఏదన్నా ఒకటి వచ్చి మన భూమిని ఢీకొంటే ఏమవుతుంది అన్నది ప్రశ్న. అప్పుడెప్పుడో పూర్వకాలంలో ఒకసారి ఇలాగే ఢీకొట్టిన ఒక ఆస్టరాయిడ్ భూమి మీద డైనోసార్ల శకానికి ముగింపు పలికినా మొత్తం జీవరాశినయితే నాశనం చెయ్యలేకపోయింది. కానీ ప్రతీసారి అంతే పరిమాణంలో ఉన్న ఆస్టరాయిడే మన వైపు రావాలని లేదుగా.. ఒకవేళ ఈసారి అంతకన్నా పెద్దది వచ్చి ఢీకొంటే మొత్తం భూమే నాశనం అవ్వొచ్చు లేక భూమ్మీద ఉన్న సమస్త జీవరాశి అంతరించొచ్చు. అలాంటి అవకాశాలైతే అసలే లేవని కొట్టిపారెయ్యలేం. అంతే కాకుండా దగ్గరలో ఉన్న ఏదయినా నక్షత్రం ప్రేలినప్పుడు విడుదల అయ్యే రేడియేషన్ కూడా  భూమి మీద జీవకోటిని నాశనం చేసే అవకాశం ఉంది.

వినడానికే భయంగా ఉంది.. అసలు అలాంటివి ఏమన్నా వస్తున్నాయా మరి మన భూమి వైపు? ముందు అది చెప్పు..

2029 లో "99942 Apophisఅనే ఆస్టరాయిడ్ ఒకటి మన భూమికి అతి దగ్గరగా వస్తుంది అని శాస్త్రజ్ఞులు లెక్కకట్టారు. అప్పుడు అది భూమి పక్కనుండి వెళ్తుందా లేక భూమిని ఢీకొడుతుందా అన్నది అంత ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ అది అప్పుడు భూమి పక్కనుండి వెళ్ళిపోయినా, భూమికి అతిసమీపంగా వస్తుంది గనుక మన భూమి గురుత్వాకర్షణశక్తి వల్ల అది దిశ మార్చుకుని మళ్ళీ 2036 లో తిరిగివచ్చి భూమిని ఢీకొనే ప్రమాదం కూడా ఉంది. 2036 లో భూమిని ఢీకొట్టే ఛాన్స్ 1 in 250000 అయినా.. కొడితే మాత్రం అప్పుడు విడుదల అయ్యే శక్తి ఒకప్పుడు డైనోసార్ల శకానికి తెరదించిన ఆస్టరాయిడ్ ప్రమాదంలో విడుదల అయిన శక్తికి కనీసం ఐదు రెట్లు ఎక్కువ ఉంటుందని ఒక అంచనా. ఆ శక్తి వల్ల నేరుగా భూకంపాల రూపంలో సంభవించే నష్టం ఒకవైపు, ఆ తరువాత దాని వల్ల ఉత్పన్నమయ్యే సునామీలు ఇంకోవైపు.. మొత్తం మీద 2012 సినిమాలో చూపించినట్టే మహాప్రళయం .. :-)


ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టిన తదనంతర పరిణామాలు - ఏనిమేషన్ చిత్రం


హ్మ్.. మొత్తం మీద మన భూమ్మీద ఇలాంటి ప్రళయమే గనుక వస్తే తప్పించుకునే అవకాశమే లేదన్నమాట. పోనీ, అప్పుడు మనం వేరే ఏదన్నా గ్రహం మీదకో, ఉపగ్రహం మీదకో వలస వెళ్తేనో? మన నివాసానికి అనువుగా ఏదన్నా గ్రహం ఉంటే చెప్పు ఇప్పుడే రిజర్వ్ చేసేసుకుందాం.. :-)

:-) జీవులు బ్రతకడానికి ఎనర్జీ కావాలి. అది తిండి నుండి వస్తుంది. తిండి పండించడానికి కావాల్సింది నీరు.  అది కూడా ద్రవరూపంలో ఉండే నీరు. ఇప్పుడు నీరు ద్రవరూపంలో ఉండాలంటే అక్కడి వాతావరణంలో ఉష్ణోగ్రత జీరో డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువుండాలి. అలాగని ఉష్ణోగ్రత మరీ ఎక్కువున్నా నీరు త్వరగా ఆవిరి అయిపోతుంది. మన సౌరమండలంలో నీరు ద్రవరూపంలో ఉండేలా అనువైన ఉష్ణోగ్రత ఉండే గ్రహాలు కేవలం రెండే. ఒకటి భూమి, రెండు మార్స్. అందుకే ఈ మార్స్ గ్రహం మీద మనకి అంత ఆసక్తి అన్నమాట.

కానీ ఇప్పుడు మార్స్ మీద నీటి ఆనవాలు ఏమీ కనపడలేదేమో కదా.. అయితే ఇక మన సౌరమండలంలో మరెక్కడా నీరు ఉండే అవకాశమే లేదంటావా?

మార్స్ మీద ఒకప్పుడు సరస్సులు, నదులు, సముద్రాలు ఉండి ఉండొచ్చు అని మార్స్ చుట్టూ తిరిగే ఉపగ్రహాలు తీసి పంపిన ఫోటోల ద్వారా అంచనా వేసారు. కానీ, ఇప్పటి వరకు వెళ్ళిన రోబోలు ఏవీ అక్కడ నీరు ఉంది అనో, ఉండొచ్చనో తేల్చి చెప్పలేకపోయాయి. మార్స్ అట్టడుగు పొరల్లో ఏమన్నా నీరు ఉందేమో అని ప్రస్తుతం పరిశోధిస్తున్నారు. ఇక ఇది కాక గురు (జూపిటర్) గ్రహానికి ఉన్న చందమామల్లో ఒకటైన యూరోపా మీద బోల్డంత నీరు ఉంటుంది అని ఒక అంచనా.

కానీ గురుగ్రహం సూర్యుడి నుండి చాలా దూరం కాబట్టి నీరు ఉన్నా అది ఘనీభవించిన మంచు రూపంలో ఉండొచ్చు కానీ ద్రవరూపంలో ఉండదేమో కదా..

అంటే.. ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. భూమి చుట్టూ మన చందమామ తిరుగుతున్నట్టే, ఈ యూరోపా గురుగ్రహం చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ యూరోపాతో పాటు   యూరోపాకి అతి దగ్గరలో ఉన్న ఇంకో రెండు చందమామలు కూడా గురుగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటి ప్రభావం వల్ల ఈ యూరోపా మీద గురుని గురుత్వాకర్షణ శక్తి నిలకడగా ఉండకుండా తరచూ మారుతూ ఉంటుంది. అంటే యూరోపా గురుడు చుట్టూ ఒక చుట్టు తిరిగేసరికి ఒక చోట గురుడు ఎక్కువ ఆకర్షిస్తే మరోచోట తక్కువ ఆకర్షణశక్తి ఉంటుంది. ఈ ఆకర్షణ బలం మారుతుండటం ఎలా ఉంటుందంటే, మనం చపాతీ పిండిముద్దని   నొక్కుతున్నట్టు అన్నమాట. ఇలా పిండిని పిసికినట్టు నిరంతరం మారుతుండే బలం ఈ యూరోపా కేంద్రంలో వేడి పుట్టిస్తుంది. అందువల్ల ఈ యూరోపా పైన కొన్ని కిలోమీటర్ల మందాన మంచు పొర ఉన్నా దాని కింద ద్రవరూపంలో ఉన్న నీరు ఉండవచ్చు అని ఒక అంచనా (ఈ ఫోటోలో చూపించినట్టు).

అయితే మన సముద్రాల అడుగున జీవించే ప్రాణుల వంటి జీవులు అక్కడ కూడా ఉండొచ్చంటావా?

ఊ.. ఉండొచ్చు.. చెప్పలేం.

అయినా యూరోపా మీద లోపలి పొరల్లో ద్రవరూపంలో నీరు ఉన్నా అక్కడి ఉపరితల ఉషోగ్రతల స్థాయి, నిరంతరం మారుతుండే గురుత్వాకర్షణ శక్తి తదితర అంశాల మూలంగా ఆ ప్రదేశం మనకి అంత నివాసయోగ్యం కాకపోవచ్చులే.ఆ యూరోపా తప్ప ఇంకెక్కడా ఇలా ద్రవరూపంలో ఉండే నీరు లేదా?

లేత నీలం రంగులొ ఉన్న ప్రదేశం జనావాసానికి అనువుగా ఉన్న జొన్ 
మన సౌరమండలంలో అయితే ఈ యూరోపా తప్ప ఇంకేమీ లేవు కానీ, గ్లీసి581 (Gliese 581) అనే నక్షత్రం చుట్టూ తిరిగే మూడవ, నాలుగవ గ్రహాలైన గ్లీసి581C, గ్లీసి581D లు ఉన్నాయి. ఇవి మన భూమి కన్నా పరిమాణంలో పెద్దవి. అవి పరిభ్రమించే నక్షత్ర పరిమాణం, ఈ గ్రహాల యొక్క పరిమాణం, అలాగే ఆ నక్షత్రానికీ ఈ గ్రహాలకి మధ్య ఉన్న దూరం, వీటన్నీటి నిష్పత్తులు సరిగ్గా సరిపోలడం వల్ల ఈ గ్రహాల మీద ఉష్ణోగ్రత మన భూమిని పోలి ఉండొచ్చు. అంటే అక్కడ నీరు అంటూ ఉంటే అది ఖచ్చితంగా ద్రవరూపంలోనే ఉంటుంది. అసలు భూమి తర్వాత ప్రాణుల ఆవాసానికి అత్యంత అనువైన గ్రహాలు ఇవేనని చాలామంది అంచనా.

వావ్.. అయితే అక్కడ గ్రహాంతరవాసులు ఉంటారా?

ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ, ఎప్పటికైనా మనం ఒకవేళ వలస వెళ్ళి ఉండాలి అనుకుంటే మాత్రం మనకి నివాసయోగ్యమైన గ్రహాల జాబితాలో ఇవి ఉంటాయి.

అయితే ఇంకేం మరి.. ఈ మార్స్, యూరోపా లాంటివి కాస్త పక్కన పెట్టి అక్కడికే పంపొచ్చు కదా ఈ రోబోలూ అవీ..

:-) పంపొచ్చు కానీ ముందు ఇది చెప్పు. నీకు ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన అత్యంత వేగవంతమయిన వాహనం ఏదో తెల్సా?

ఊ .. బుగట్టినో, ఫెరారీనో, లాంబోర్గినినో ఏదో అయి ఉంటుందిలే.. 

ప్చ్.. అవి కాదు.. అంతరిక్షంలో ప్రయాణించేవి.

ఉహూ.. అయితే తెలీదుగా.. :-)

వోయోజర్ -1 అని.. ముప్పై నాలుగేళ్ళ క్రితం నాసా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఈ అంతరిక్షనౌక సెకనుకి 17 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నీకు ఈ వేగం మీద ఒక అవగాహన కోసం చెప్తున్నా.. ఈ నౌకలో విజయవాడ నుండి హైదరాబాదు పది సెకన్లలో వెళ్ళొచ్చు .. ఇంత వేగవంతమయిన వాహనంలో వెళితే ఆ గ్లీసి 581D కి చేరడానికి ఇంచుమించు 350000 సంవత్సారాలు పడుతుంది.

వామ్మో.. మరీ అంత దగ్గరా.. అయితే నేను రానులే ఈసారికి.. :-) 

ఒకవేళ భవిష్యత్తులో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది ఇంకా సూపర్‌ఫాస్ట్‌గా వెళ్ళే అంతరిక్షనౌక తయారుచేసాం అనుకుందాం. అంటే ఇప్పుడున్న దానికి వేల రెట్ల వేగం.. అంటే ఇండియా నుండి అమెరికాకి కేవలం మిల్లీసెకన్లలో, అంటే కనురెప్పపాటులో వెళ్ళగలిగే లాంటి స్పీడ్.. అయినా సరే అక్కడికి వెళ్ళాలంటే ఒక వందో, రెండొందలో సంవత్సరాలు పడుతుంది కదా.. ఒకవేళ ఎవరినయినా పంపుదాం అనుకున్నా తమ జీవితం, తమ తరువాతి తరాల వాళ్ళ జీవితాలు కేవలం రాకెట్లలో గడపడానికి సిద్ధపడేవాళ్ళు ఎవరుంటారు?

అసలూ.. అంత వేగవంతమయిన వాహనాలు తయారు చేసే టెక్నాలజీ మీ ఇంజనీర్లు అభివృద్ధిపరిచేసరికి మా జెనెటిక్స్ ఇంజనీర్లు మనిషి ఆయువుని ఒక రెండుమూదొండలు సంవత్సరాలు పెంచేలా ఏదైనా కనిపెడతారులే.. :-) కాంతి కన్నా వేగంగా ఏదీ ప్రయాణించలేదు అన్నావు కదా.. మనిషి అందుకోగల గరిష్ఠ వేగం అదేనా?   అలా అయితే రెండు మూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ప్రదేశాలకి మనిషి వెళ్ళే అవకాశం ఇప్పట్లో లేనట్టే కదా..

కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంలో ప్రయాణించే 'వార్మ్ హోల్స్' అనే సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి కానీ దీనికి కావాల్సిన శక్తి దృష్ట్యా చూస్తే వీటిని ప్రాక్టికల్‌గా పని చేయించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదులే. ఒకవేళ అది మాత్రం సాధించగలిగితే హాయిగా అంతరిక్షంలో ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరమైనా సరే సులభంగా కొన్ని రోజుల వ్యవధిలోనే వెళ్ళి రావొచ్చు. 

ఆహా.. అలాగైతే నువ్వెళ్ళి కాస్త ఆ రీసెర్చ్ ఏదో చెయ్యొచ్చు కదా.. 2036లో మనకి ఉపయోగపడుతుందేమో.. :-) మరి ఇక టైం ట్రావెల్ కూడా సాధ్యమే అంటావా .. 

టైం ట్రావెల్ సిద్ధాంతపరంగా సాధ్యమే కానీ నా అభిప్రాయం ప్రకారం గ్రాండ్‌ఫాదర్ పారడాక్స్ గుట్టు విప్పేవరకూ అది మిస్టరీనే..

గ్రాండ్‌ఫాదర్ పారడాక్స్ అంటే.. 

అది చాలా సింపిల్ .. ఇప్పుడు ఒకడు టైం ట్రావెల్ ద్వారా గతంలోకి వెళ్లి వాడి తాతకి పెళ్ళికాక ముందే చంపేసాడు అనుకుందాం. అప్పుడు వీడు పుట్టడం అన్నదే జరగదు. అసలు వాడే పుట్టకపోతే వాళ్ళ తాతని ఎవరు చంపినట్టు? అందువల్ల ఈ పారడాక్స్ టైం ట్రావల్ అసాధ్యం అని సూచిస్తుంది. ఇలాంటివి ఇంకొన్ని పారడాక్స్‌లు ఉన్నాయి. ఇవి సాధించే వరకూ టైం ట్రావల్ గురించి మనం సాధ్యమా  అసాధ్యమా అని ఏది తేల్చి చెప్పలేం.

interesting ! .. మరి మన భూమి ఆయుష్షు ఎంత అని మనకేమన్నా తెలుసా.. కొంతకాలానికి భూమి కూడా అంతమైపోతుందా? అసలు ఈ విశ్వం పరిస్థితి ఏంటి.. ఎప్పటికీ శాశ్వతంగా ఇలాగే ఉంటుందా?

ఊ.. మళ్ళీ బోల్డు ప్రశ్నలు అడిగేసావ్.. :-) ఈ విశ్వం మనం ఊహించలేనంత పెద్దదే కాదు, అంతే ఎక్కువ వయస్సు గలది కూడా.. ఇంకోటి, వయస్సుతో పాటు దీని పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే... బిగ్ బ్యాంగ్ అనే ప్రక్రియతో ఏర్పడిన ఈ విశ్వం కాలంతో పాటు అన్ని దిక్కులలో విస్తరిస్తూ వస్తుంది.

బిగ్ బ్యాంగ్ వల్ల ఈ విశ్వం ఏర్పడింది అని తెలుసు కానీ... అంతకుముందు ఏముండేది అన్నది తెలీదు.

అంతకుముందు ఏముండేది అంటే చెప్పడం చాలా కష్టం. మొట్టమొదట అనంతమైన శక్తితో కూడిన ఒక చిన్న డాట్ (Singularity) ఉండేది. ఆ డాట్ లోపల ఉన్న ఉష్ణోగ్రత పెరిగి పెరిగీ సుమారు 1400 కోట్ల సంవత్సరాల క్రితం ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడు ఎంత పెద్దదో చెప్పడానికి మన ఊహకి కూడా అందదు. అయితే ఈ శక్తి నుండి మొదట పుట్టినవి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లాంటి పరమాణువులు. ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు కలసి మొదట హైడ్రోజన్ ఏర్పడింది. అంటే ఆ సమయానికి విశ్వవ్యాప్తంగా అసలు వేరే మూలకాలు ఏమీ లేవన్నమాట. అంటే భూమి లేదు, సూర్యుడు లేడు. ఉన్నదల్లా కేవలం శక్తి. 

అసలు కనీసం కాంతి కూడా లేకుండా కేవలం ఒక్క శక్తిని మాత్రమే ఊహించడం సాధ్యం కావడం లేదు.

ఊ..  అలాంటి స్థితే ఉండేది మొదట్లో. ఇక ఈ హైడ్రోజన్‌కి ఉన్న భౌతిక గుణం ప్రకారం ఒక కోటి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర రెండు హైడ్రోజన్ అణువులు కలసి ఒక హీలియం అణువుగా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో చాలా శక్తి విడుదల అవుతుంది.

అంటే న్యూక్లియార్ ఫ్యూజనా?

అవును. అణుబాంబు కన్నా ఎక్కువ శక్తివంతమైనది అని చెప్పే హైడ్రోజన్ బాంబ్‌లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ఇదే. సూర్యుడితో సహా అన్ని నక్షత్రాలలో శక్తి సృష్టించబడేది దీనివల్లే. ఒక్కో నక్షత్రం కొన్ని కోట్ల హైడ్రోజన్ బాంబులతో సమానం. ఇలా ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ తరువాత హీలియం, ఆ తరువాత కార్బన్, ఇలా మిగతా మూలకాలు అన్నీ ఏర్పడ్డాయన్నమాట. 

విశ్వమంతా అలా ఒక శక్తి నుంచి ఏర్పడింది సరే.. మరి మన భూమికి, ఇంకా ఈ విశ్వానికి ఆరంభం ఉన్నట్టే అంతం కూడా ఉంటుందా?

ఊ.. ఎప్పటికైనా అదే జరుగుతుంది. ఆ అంతమయ్యే వరసక్రమం ఇలా ఉంటుంది.  
  • భూమి అంతం అవ్వడానికి ఎన్నో మిలియన్ సంవత్సరాల ముందే  భూమి మీద ఉన్న అనంత జీవరాశి అంతరిస్తుందిఏ ఆస్టరాయిడో వచ్చి ఢీకొన్న కారణంగానో లేక మనమే తయారు చేసుకున్న అణుబాంబుల వల్లనో ఇది జరగవచ్చు.  
  • ఆ తర్వాత సూర్యుడి పరిమాణం కాలంతో పాటు పెరుగుతూ పెరుగుతూ భూమికి దగ్గరగా రావడంతో భూమి కూడా ఒక మండే అగ్నిగోళంలా మారుతుంది. అప్పటికే ఏవైనా ప్రాణులు మిగిలున్నా సరే ఈ స్థితిలో ఉత్పన్నమయ్యే అత్యధిక ఉష్ణోగ్రతలకి అవన్నీ సమూలంగా నశిస్తాయి. 
  • అలా వ్యాకోచిస్తున్న సూర్యుడు  క్రమంగా ఒక్కో గ్రహాన్నీ తనలో కలిపేసుకుంటూ కొన్నాళ్ళకి భూమిని కూడా తనలో ఐక్యం చేసుకుంటాడు. అది జరిగిన కొన్నాళ్ళకి క్రమంగా సూర్యుడి ఆయుష్షు కూడా తీరిపోయి పూర్తిగా పేలిపోతుంది. అదీ మన సౌరమండలం యొక్క భవిష్యత్తు. 
  • ఆపై కొన్ని బిలియన్ సంవత్సరాల తరువాత బిగ్ క్రంచ్ అన్న ప్రక్రియ ద్వారా మొత్తం అంతరిక్షమే అంతం అయిపోవచ్చు కూడా..

బిగ్ క్రంచ్ అంటే ? 

బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది కదా.. దానికి అపోజిట్ ప్రక్రియ అన్నమాట. బిగ్ బ్యాంగ్ థియరీలో ఒక చిన్న డాట్ పేలి ఇంత పెద్ద విశ్వం ఏర్పడింది అని చెప్తారు కదా.. అలా బిగ్ క్రంచ్ ద్వారా  మొత్తం విశ్వం మళ్ళీ ఆ చిన్నడాట్ లా మారిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ విశాల విశ్వం రోజు రోజుకి విస్తరిస్తుంది అని చెప్పాను కదా. దానికి కారణం ఒక శక్తి. దాన్ని డార్క్ ఎనర్జీ అంటారు. అలాగే విశ్వంలో ఉండే ఇంకో ముఖ్యమైన శక్తి  గురుత్వాకర్షణశక్తి. ఇవి రెండూ వ్యతిరేక దిశల్లో పని చేస్తాయి. అంటే, డార్క్ ఎనర్జీ ఏమో విస్తరిస్తూ దూరం జరుగుదాం అనేది అయితే గురుత్వాకర్షణ శక్తేమో అన్నిటినీ దగ్గరకి తీసుకొద్దాం అనేలాంటిది. ప్రస్తుతం గురుత్వాకర్షణశక్తి కన్నా డార్క్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి విశ్వం రోజు రోజుకీ విస్తరిస్తూ ఉంది. కానీ అది ఎప్పుడూ ఇలానే ఉంటుంది అన్న గ్యారంటీ లేదు. ఎప్పుడైనా గురుత్వాకర్షణ శక్తి ఈ డార్క్ఎనర్జీ కన్నా ఎక్కువైతే అప్పుడు అంతరిక్షంలో ఉన్న అన్నీ గేలక్సీలు అన్ని దగ్గరకు లాగబడతాయి. ఎలా అయితే ఒక చిన్న డాట్ నుండి ఇంత పెద్ద విశాల విశ్వం ఏర్పడిందో, అదే పెద్ద విశ్వం మళ్ళీ చిన్న డాట్ లోకి కుంచించుకుపోవడాన్ని బిగ్ క్రంచ్ అంటారు. అది ఎప్పుడు జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోయినా అలా జరగడానికి ఒక అవకాశం అయితే ఉంది.

ఏమిటో అసలు... ఇవన్నీ తెలీనప్పుడే హాయిగా ఉంది అనిపిస్తుంది. ఇన్ని గేలక్సీలు, వాటిలో ఉండే కోట్ల కోట్ల నక్షత్రాలు, వాటి గ్రహాలూ.. అసలు ఇవన్నీ ఆలోచిస్తే ఏంటో చాలా లోన్లీగా అనిపిస్తుంది. అసలు ఇంత విశాల విశ్వంలో మనం ఎంత చిన్న భాగం అనిపిస్తుంది. ఈ సూర్యుడు ఏర్పడటం, దానికి సరైన దూరంలో భూమి ఉండటం, దాని వల్ల భూమి మీద అనువైన ఉష్ణోగ్రత మరియు వాతావరణం ఏర్పడటం... సూర్యుడు కూడా ఒక సరైన పరిమాణంలో ఉండటం వల్ల దానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు జీవిత కాలం ఉండటం... లక్కీగా సరైన కాంబినేషన్లో న్యూక్లిక్ ఆసిడ్స్, అమీనో ఆసిడ్స్ అణువులు ఏర్పడి భూమి మీద జీవం ఉద్భవించడం... అలా పుట్టిన జీవం ఇన్ని కోట్ల సంవత్సరాల పాటు సర్వైవ్ అవుతూ రకరకాల జీవుల్లా రూపాంతరాలు చెందుతూ మనవరకూ రావడం.. భూమి మీద ఇవన్నీ జరగడానికి వీలయినంత సమయం మన సూర్యుడి జీవిత కాలం ఉండటం.. ఇదంతా చూస్తుంటే ఎవరో ఒక గ్రాండ్ డిజైనర్ మన కోసం ఇవన్నీ తీర్చిదిద్దినట్టు అనుకోవాలా!?

Grand Designer means GOD??? NOT NECESSARILY!!!

(అయిపోయింది)
- మంచు & మధుర

DISCLAIMER:
All content provided on this blog is for informational purposes only. The owner of this blog and authors of this post make no representations as to the accuracy or completeness of any information on this site or found by following any link on this site.  Photo courtesy by various websites on internet.

Friday, September 21, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 3/4): ఏలియన్స్ వస్తే?

*** శ్రీ రామ ***
ఈ ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) అనేవాళ్ళు నిజంగా ఉన్నారంటావా? ఉంటే ఎక్కడ ఉండి ఉండొచ్చు? వాళ్ళు చూడటానికి ఎలా ఉండొచ్చు? సినిమాల్లో చూపించినట్టు భయంకరంగా పిశాచాల్లా ఉంటారా? వాళ్ళ శరీరాలు దేనితో తయారై ఉండొచ్చు? మనలా రక్తమాంసాలతోనే ఉంటారా? ఉంటే గింటే వాళ్ళు ఈ ఏలియన్స్ సినిమాల్లో చూపించినట్టు అంత ఇంటెలిజెంట్సా.. మనకన్నా సాంకేతికపరంగా చాలా అడ్వాన్స్‌డా? ఒకవేళ ఏలియన్స్‌ని మనం కలిస్తే దానివల్ల మనకి లాభమా నష్టమా?

ఓ ఓ.. నువ్వు ఒక్క ప్రశ్న అన్నావ్.. ఒకేసారి బోల్డు అడిగేసావ్..

హిహిహీ.. అన్నీటికీ సమాధానాలు చెప్పేసెయ్ మరి.. :-)

ఈ విశ్వంలో మనం ఒంటరివాళ్ళం కాకపోవచ్చు అని నా అభిప్రాయం. ఎందుకో చెప్తా విను. ఈ విశ్వం విశాలమయినది. మన ఊహకి అందనంత పెద్దది. అనంతం (ఇన్‌ఫినిటి) అనడానికి సరైన ఉదాహరణ అనిపించేటంత పెద్దది. ఎంత పెద్దదో వివరంగా చూద్దాం. 

ఊ .. చెప్పు... 

కొత్తగా కనిపెట్టినవి, తీసేసిన మరుగుజ్జు గ్రహాలూ పక్కన పెట్టేసి చూసినా మన సౌరమండలంలో మొత్తం ఎనిమిది గ్రహాలు ఉన్నాయి. అవునా..

ఊ.. కానీ ఒక్క మన భూమ్మీద తప్ప వేరే గ్రహాల మీద ఎక్కడా జీవం అన్నది లేదేమో కదా..

ఉండు.. పూర్తిగా చెప్పనీ.. ఈ సౌరమండలంలో చివరన ఉన్న నెఫ్ట్యూన్ గ్రహానికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం సుమారు 450 కోట్ల కిలోమీటర్లు. దాన్నిబట్టి ఒక అవగాహన వచ్చింది కదా మన సౌరమండలం ఎంత పెద్దదో. అయితే ఇంత పెద్ద సౌరమండలం కూడా మన సోలార్ ఇంటర్స్టెల్లార్ నైబర్‌హుడ్‌లొ అతి చిన్న భాగం. ఇక ఆ సోలార్ ఇంటర్స్టెల్లార్ కూడా మన మిల్కీవే (పాలపుంత) గేలక్సీలో ఎంత చిన్నదో ఈ ఫోటోలో చూడు ఒకసారి.


.. అసలు ఈ గేలక్సీలో మొత్తం ఎన్ని నక్షత్రాలు, ఎన్ని గ్రహాలు ఉండొచ్చంటావ్? 

నక్షత్రాలు ఇంచుమించు 40,000 కోట్లు ఉండొచ్చు. గ్రహాలు ఎన్ని ఉన్నాయో చెప్పడం చాలా కష్టంలే. ఎందుకంటే నక్షత్రాలు అయితే వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశవంతంగా పెద్ద పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని టెలిస్కోపుల్లో చూడటం వీలవుతుంది. గ్రహాల దగ్గరికి వచ్చేసరికి అవి చిన్న పరిమాణంలో ఉంటాయి మరియు నక్షత్రాల్లాగా స్వయంప్రకాశితాలు కాదు. అందువల్ల వీటిని దూరం నుండి టెలిస్కొప్‌లతో వీక్షించడం చాలా కష్టం.

అమ్మో.. నలభై వేల కోట్లే... అంటే దాదాపు నలభై వేల కోట్ల సౌరమండలాలు లాంటివి ఉన్నట్టే కదా.. అస్సలు నా ఊహకి అందడం లేదు ఈ విశ్వం ఎంత పెద్దదో..

ఉండూ.. ఇంకా అవలేదు.. ఇక మనకి తెల్సున్న ఈ విశాల విశ్వంలో దాదాపుగా పది వేల కోట్ల గేలక్సీలు ఉన్నట్టు ఒక అంచనా.. చూడు మరి..

... పది వేల కోట్ల గేలక్సీలు ...
... ఒక్కో గేలక్సీలో నలభై వేల కోట్ల నక్షత్రాలు ...
... ఒక్కో నక్షత్రం చుట్టూ ఎన్ని గ్రహాలు ...

వీటిని బట్టి చూస్తే.. ఇన్ని కోట్ల కోట్ల నక్షత్రాలకున్న గ్రహాల్లో వేరే ఏ ఒక్క గ్రహం మీద అయినా జీవం ఉండే అవకాశం ఉండదా? సాధారణ సంభావ్యత(స్టాటస్టికల్ ప్రాబబిలిటి) లెక్కల ప్రకారం చూసుకున్నా మనం ఒంటరివాళ్ళం కాదనేది హేతుబద్ధమయిన వాదనే కదా...

ఊ.. ఈ ప్రకారంగా ఆలోచిస్తే నాకైతే ఉండొచ్చనే అనిపిస్తోంది.

ఇక ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) ఉంటే చూడటానికి ఎలా ఉండొచ్చన్న నీ రెండో ప్రశ్న గురించి మాట్లాడుకునే ముందు అసలు గ్రహాంతరవాసులు అంటే నీ నిర్వచనం ఏంటో చెప్పు.

అంటే మన భూగ్రహం మీద కాకుండా కాకుండా బయట వేరే ఏదో ఒక గ్రహం మీద నివసించే ప్రాణులు అని..

గ్రహాంతరజంతువుల ఊహాచిత్రం
కదా.. అంటే ఆ వేరే గ్రహం మీద నివసించే జీవులు అమీబా లాంటి ఏకకణ జీవులనుండి డైనోసార్ లాంటి మెగా సైజ్ జీవుల వరకు ఏదయినా అవ్వొచ్చు. వాటికి మనుషుల్లా తెలివితేటలు ఉండొచ్చు లేక భూమి మీద ఉండే మిగతా జంతువుల్లా మనిషి కన్నా బుద్ధిహీనులు అయ్యుండొచ్చు లేక మొక్కల్లాంటి ప్రాణులయినా అవ్వొచ్చు. అందువల్ల నేను చెప్పొచ్చేదేంటంటే బుద్ధిజీవులా లేదా అన్నదానితో పని లేకుండా వేరే చోట అసలు జీవులంటూ అంటూ ఉంటే వాళ్ళు గ్రహాంతరవాసులే..

అంటే ఇంగ్లీష్ సినిమాల్లో చూపించినట్టు ఉండరంటావా?

పైన చెప్పినట్టు ఇంత పెద్ద విశ్వంలో మనలాగానో, లేకపోతే మనకన్నా తెలివైన వాళ్ళో ఉండే అవకాశం లేదు అని ఎలా తీసిపారేయగలం చెప్పు. సాంకేతికపరంగా కూడా మన కన్నా చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటే ఉండొచ్చు. ఇక సినిమాల విషయానికొస్తే కమర్షియల్ అప్పీల్ కోసం అలా విచిత్రంగానో, భయంకరంగానో చూపిస్తారులే...

అంటే మార్లిన్ మన్రో లానో, ఆడ్రి హెప్బర్న్ లానో కూడా ఉండొచ్చంటావ్.. అంతేనా.. :-)

హిహిహి.. ఊ.. I wish :-) కానీ ఆ సైన్స్ ఫిక్షన్ సినిమాలని తక్కువ చెయ్యడానికి వీలు లేదు. కొన్ని సినిమాల్లో చూపించినట్టు ఏలియన్స్ స్పేస్‌షిప్‌లలో ఒక చోట నుండి ఇంకో చోటకి వలస పోతూ విశ్వమంతా తిరగడం అన్నది చాలామంది శాస్త్రజ్ఞులు అంగీకరించే సిధ్ధాంతమే. ఏలియన్స్ని మరీ విచిత్ర వేషధారణలో చూపించడం తప్ప ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలలో చూపించే విషయాలు చాలామటుకు శాస్త్రజ్ఞులు ఊహించేవే.. ఈ సబ్జెక్ట్‌లో సృజనాత్మకత మరియు కల్పనాశక్తి చాలా కీలకమైనవి. అందుకే కొత్త కొత్త సిద్దాంతాలు ప్రతిపాదించడంలో అంతరిక్ష పరిశోధకులతో ఈ సైన్స్ ఫిక్షన్ రచయితలు పోటీపడుతూ ఉంటారు. అసలు ఈ ఏలియన్స్‌కి సంభందించిన అంతరిక్ష పరిశోధనలో ఇమాజినేషన్‌కి అంతు అంటూ ఉండదు.

ఇంటర్ స్టెల్లార్ స్పేస్ షిప్ ఊహాచిత్రం 

ఏదీ.. ఈ సబ్జెక్ట్‌కి సంబంధించిన కొన్ని మంచి సైన్స్ ఫిక్షన్ సినిమాల పేర్లు చెప్పు. నేను చూస్తా..

స్టార్ వార్స్ , స్టార్ ట్రెక్, aliens, 2001 space odyssey, blade runner..

ఆగాగు... ఈ డివిడీలు కూడా నువ్వే పంపాలి, నెట్‌ఫ్లిక్స్ లాంటివి మాకు ఉండవు. :-)

:-) అయితే ఈ లిస్టు అయిపోయింది... సరే కాసేపు సినిమాల సంగతి పక్కనపెట్టి అసలు నీ ఉద్దేశ్యంలో గ్రహాంతరవాసులు ఉంటే ఎలా ఉండొచ్చు అనుకుంటున్నావో చెప్పు..

జీవపరిణామ నియమాలు అన్నవి భూమి మీద జీవకోటికి అయినా ఏలియన్స్‌కి అయినా ఒకేలా ఉండొచ్చేమో  అని నా అభిప్రాయం.

అంటే? ..

ఒక ఉదాహరణకి మన భూమి మీద ఉన్న జంతువులు చూడు. వేటాడే జంతువులకి కళ్ళు ముఖాన ముందరి భాగంలో ఉంటాయి. ఎందుకంటే వేటాడే సమయంలో వాటి లక్ష్యాన్ని గురి తప్పకుండా చూడటానికి సునిశిత దృష్టి ఉండాలి కాబట్టి. అలాగే వేటాడబడే జంతువులకి కళ్ళు పక్కకి ఉంటాయి. ఎందుకంటే అవి కేవలం ఎదుటి వైపు మాత్రమే కాకుండా చుట్టూ ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి ఎటువైపు నుండి ఏది దాడి చేస్తుందా అని.

ఊ.. అర్థమైంది.. అయితే?

అందువల్ల నేను ఏమనుకుంటున్నానంటే.. గ్రహాంతరవాసులకి కూడా ఇటువంటి జీవపరిణామ నియమాలు కొన్ని వర్తించవచ్చు. ఈ నియమాల ప్రకారం మనం కొన్ని ఆకారాలు ఊహించొచ్చేమో.. ఉదాహరణకి నేల మీద నివసించే వాటికి కాళ్ళు లాంటివి ఉండొచ్చని, ఆ గ్రహం మీద మంచి వెలుగుంటే వాటికి కళ్ళు ఉండొచ్చని, ప్రకృతి నుండి వెలుతురు లభించకపోతే మన భూమ్మీద ఉన్న కొన్ని సముద్రగర్భ జీవుల్లా వెలుగుని వాటి శరీర రసాయనాలతో అవే ఉత్పత్తి చేసుకోవచ్చని అలా అన్నమాట. అలాగే జీవపరిణామక్రమంలో పెద్దగా ఉపయోగం లేని అవయవాలు అంతరించిపోవచ్చు. ఉదాహరణకి కోతి నుండి పుట్టిన మనిషికి కొన్నాళ్ళకి తోక అంతరించిపోయినట్టు.

ఆ లెక్కన భూమి మీదకు వచ్చే ఎలియన్స్ ఈ సినిమాల్లో చూపించినట్టు పెద్ద తలకాయతో, సన్నటి కాళ్ళు, సన్నటి చేతులతో ఉండే ఆకారంలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగేకొద్ది చేతులు కాళ్ళు వాడటం తక్కువ అవుతుంది, బుర్ర వాడకం ఎక్కువ అవుతుంది కదా..

ఊ .. ఆ ఛాన్స్ అయితే ఉంది..

అయినా ఎక్కడో గురించి మాట్లాడుకునే ముందు మన భూమి మీద అసలు జీవం ఎలా పుట్టింది అనుకుంటున్నావ్?

అది ఇప్పటికీ పెద్ద మిస్టరీనే.. ఇప్పటివరకూ ఎన్నో రకాల సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి కానీ అందులో ఏ ఒక్కటీ ఇతమిద్దంగా ఇదీ జీవం ఉద్భవించిన ప్రక్రియ అని తేల్చి చెప్పలేకపోయాయి. అంతరిక్షంలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ విత్తనాలు పడి మొలకెత్తిన చందాన భూమ్మీద జీవులు పుట్టుకొచ్చాయి అని (అంటే ఎక్కడినుండో ఆస్టరాయిడ్ల ద్వారా ఘనీభవించిన జీవకణాల రూపంలో భూమి మీదకి వచ్చిపడి ఆ తరువాత ఇక్కడ అభివృద్ధి చెందాయని) కొందరంటే, జీవరహితమైన మట్టి, నీరు లాంటి వాటిలోంచే ఎలాగో మేజిక్ లాగా జీవం పుట్టేస్తుంది అని మరి కొందరు అన్నారు. అయితే వాటన్నిటికన్నా ప్రాచుర్యం పొందిన, శాస్త్రీయమైన ఆధారాలతో కొంతవరకూ నిరూపించబడి ఎక్కువ మంది ఆమోదం పొందిన సిద్ధాంతం అయితే... ఎన్నో బిలియన్ సంవత్సరాల క్రితం కొన్ని మడుగుల్లో, మట్టిగుంటల్లో (అంటే నీటి సమక్షంలో) కొన్ని రకాలైన మూలకాల అణువులు, పరమాణువుల మధ్యన జరిగిన రసాయన చర్యల ఫలితంగా ఒక పెర్ఫెక్ట్ కాంబినేషన్ గల రసాయనబంధంలో స్థిరమైన న్యూక్లిక్ ఆమ్లాల అణువులు ఏర్పడి, వాటికున్న self-replicating ability మూలంగా అవి జన్యుపదార్థంగా ఏర్పడి తద్వారా మొట్టమొదటి జీవకణం పుట్టి ఆ తరువాత జీవపరిణామచక్రంలో వివిధ రూపాలు సంతరించి ఉండొచ్చు అని. అలాగే భూమి మీద ముందు మొక్కలు పుట్టి పెరగడం మొదలయ్యాక భూమి మీద ఆక్సిజన్ శాతం బాగా పెరిగి క్రమేపీ మిగతా అన్నీ రకాల జీవులు అవతరించడానికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయని జీవపరిణామ శాస్త్రజ్ఞుల అంచనా. 

అయితే ... మొదటి జీవి ఈడెన్ గార్డెన్‌లొ కాకుండా బురదలో పుట్టింది అంటావ్.. :-) 

ఊ.. నన్నడిగితే అంతే అంటాను మరి.. :-) అయితే, పైన చెప్పిందంతా కూడా మన భూమి మీద జరిగిన జీవపరిణామక్రమం. అచ్చం ఇదే పద్ధతిలో మరో గ్రహం మీద కూడా జరిగే అవకాశం ఎంత ఉందో, ఇలా కాకుండా మరింకేదైనా కొత్త పద్ధతుల్లో అక్కడ జీవం లాంటి మరేదైనా పుట్టి ఉండొచ్చేమో అన్న అవకాశం కూడా అంతే ఉంది. 

అంటే.. కాస్త వివరంగా చెప్పు.

ఉదాహరణకి నీరు కాకుండా ద్రవరూపంలో ఉన్న అమ్మోనియా, మీథేన్ లేక నైట్రోజన్ ఆధారంగానో జీవం ఏర్పడి ఉండొచ్చు. నేల మీద కాకుండా గాలిలో మాత్రమే ఉంటూ తమకి కావాల్సిన శక్తిని నేరుగా నక్షత్రం నుండే తీసుకునే జీవులు ఉండొచ్చు. కేవలం కొన్ని మిల్లీ సెకన్ల కాలం పాటు మాత్రమే బ్రతికే ప్రాణులు ఉండొచ్చు. కొన్ని వేల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కూడా జీవించగలిగే ప్రాణులు ఉండొచ్చు. అసలు మన భూమ్మీదలా కర్బన ఆధారిత జీవం కాకుండా మనకి పూర్తి విభిన్నంగా సిలికాన్ ఆధారిత జీవం ఉండొచ్చు. ఆక్సిజన్ బదులుగా సల్ఫర్, ఫాస్ఫరస్ బదులు ఆర్సినిక్ లాంటి మూలకాలని ఉపయోగించుకుని బ్రతికే జీవులు ఉండొచ్చు. కేవలం మనలాంటి కర్బన ఆధారిత జీవమే కాకుండా ఇలాంటి రకరకాల కర్బన ఆధారిత జీవపరిణామ అవకాశాలు మరెన్నో కూడాఈ విశ్వంలో ఉండొచ్చని జీవరసాయన శాస్త్రజ్ఞుల అంచనా.

ఊ... ఈ అనంతమైన విశ్వంలో అనంతమైన అవకాశాలు. ఏదైనా సాధ్యమేనన్నమాట. అందుకే మరి.. ముందు చెప్పిన్నట్టు ఈ ఫీల్డ్ లో ఇమాజినేషన్ కి అంతు అంటూ ఉండదు.

అసలు ఈ ఏలియన్స్ అనేవాళ్ళు నిజంగా ఉంటే, వాళ్ళకి మనలా తెలివితేటలు ఉంటే, వాళ్ళు కూడా మనలా ఈ విశాల విశ్వంలో ఇంకా ఏ జీవులున్నాయో అన్న ఆసక్తి కొద్దీ రోదసిలో ప్రయాణిస్తూ మనని వెతుక్కుంటూ రారంటావా? మనకి ఇంతవరకూ అలాంటి సంకేతాలు ఎప్పుడూ అందలేదా?

ఉహూ.. మనకి స్పేస్ నుంచి అలాంటి సిగ్నల్స్ ఏవీ పెద్దగా తగల్లేదు కానీ, ఒకసారి మాత్రం 1977 లో... ఒహియో యూనివర్సిటీలో పెర్కిన్స్ అబ్సర్వేటరీలో డెబ్భై రెండు సెకన్లు ఉన్న మెసేజ్ ఒకటి రికార్డ్ అయ్యింది. దాన్నే WOW సిగ్నల్ అంటారు. ఈ సిగ్నల్ మొదటిసారి చూసిన సైంటిస్ట్ ఆ మెసేజ్ పక్కన WOW! అని రాసాడని అప్పటినుండి ఆ సిగ్నల్ పేరే WOW అయ్యింది.

Interesting! ఆ తరువాత ఏమైంది మరి.. మనవాళ్ళు రిప్లై సంకేతాలు ఏమయినా పంపారా?

ఆ తరువాత మళ్ళీ అటువంటి సంకేతాలేవీ రికార్డ్ అవలేదు. ఫైనల్‌గా ఆ సిగ్నల్ రెండు వందల కాంతి సంవత్సరాల దూరం నుండి వచ్చింది అని తేల్చారు. అంటే ఎంత వేగవంతమయినది అనుకున్నా అది కనీసం రెండు వందల సంవత్సరాల క్రితం పంపింది అయి ఉండాలి. ఎందుకంటే కాంతి కన్నా వేగంగా ఏదీ ప్రయాణించలేదు కదా మరి(?). ఒకవేళ మనం రిప్లై పంపినా అది అక్కడికి చేరేసరికి మినిమం ఇంకో రెండు వందల సంవత్సరాలు పడుతుంది. అంటే వాళ్ళు పంపిన నాలుగు వందల సంవత్సరాలకి వాళ్ళకి రిప్లై అందుతుంది.. అప్పటికి ఆ పంపిన వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు కూడా.. :-)

మరి మనం బోల్డు స్టోరీలు వింటూ ఉంటాం కదా.. కొంతమంది ఈ గ్రహాంతర వాసుల్ని, UFOలు, ఫ్లైయింగ్ సాసర్లని చూసామని ఫోటోలతో సహా చాలా సాక్ష్యాధారాలు చూపిస్తారు. వీళ్ళకి కొన్ని సంఘాలు కూడా ఉంటాయి కదా ..

ఊ.. వాటి గురించి చెప్పకు... వీళ్ళందరివి దాదాపుగా అన్నీ ఒకే రకమయిన కథలు ఉంటాయి. అదేంటో ఆల్మోస్ట్ అన్ని సంఘటనలు అమెరికాలోనే జరుగుతాయి. గ్రహాంతరవాసులకి అమెరికా అడ్రస్ ఒకటే తెల్సేమో అన్నట్టు. సాధారణంగా వాళ్ళు చెప్పే స్టోరీ ఇలా సాగుతుంది. "చీకటి పడి ఉంటుంది.. స్టోరీ చెప్పేవాడు ఒంటరిగా వెళుతూ ఉంటాడు. దూరంగా ఒక వెలుతురు చూస్తాడు. ఏంటో అని అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూస్తే అప్పటికే పని ముగించుకుని తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఒక గ్రహాంతర రోదసినౌక ఉంటుంది. వీడు ఫోటో తీసేలోపు అది వెళ్ళిపోతుంది. లేకపోతే ఆ అధిక వెలుగులో వీడు ఇంకేం చూడలేకపోతాడు" వగైరా వగైరా..

అంటే అవన్నీ అబద్ధాలనేనా.. అంతమంది చెప్పే దాంట్లో కొంచెం కూడా నిజం ఉండదంటావా? మనకి తెలీకుండా అలా ఎలా తీసిపారేయగలం..

చూడు... ఈ గ్రహాంతరవాసులు కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చేది మన భూమి మీద నైట్‌హాల్ట్‌కో, సైట్ సీయింగ్‌కో  కాదు కదా..

మనం వేరే గ్రహాల మీదకి పరిశోధనలకి వెళ్ళినట్టే వాళ్ళు కూడా మన భూమ్మీదకి వచ్చి ఉండొచ్చు కదా మరి..

ఇండిపెండెన్స్ డే సినిమాలొ చూపించిన న్యూయార్క్ నగరం మీద స్పేస్‌షిప్
ఉహూ.. చెప్తా విను... నువ్వు పైన అడిగావే.. మనం ఈ గ్రహాంతరవాసులని కలిసే పరిస్థితి అంటూ వస్తే దాని పర్యవసానాలు ఎలా ఉండొచ్చు అని.. అసలు ఈ గ్రహాంతరవాసులు వాళ్ళ గ్రహం వదిలి వేరే గ్రహాల మీద పడ్డారు అంటే ఏంటి అర్థం?
ఒకటి - ఇంత దూరం రాగలిగారు అంటే వాళ్ళు సాంకేతికపరంగా మనకన్నా చాలా అడ్వాన్స్డ్..
రెండు - వాళ్ళ గ్రహాల మీద ఉన్న ప్రకృతిసిద్ధమైన సంపద అంతా ఖాళీ చేసేసి, ఇంకా వేరే దగ్గరేమైనా దొరుకుతుందేమో దోచుకొద్దాం అనుకుని అప్పుడు ఇలా అంతరిక్షనౌకల మీద ప్రయాణం చేస్తూ వేరే గ్రహాల మీదకి వలస వస్తారు. అయితే వాళ్ళకి ఇలా కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాలంటే బోల్డు ఎనర్జీ కావాలి.. అది అంతరిక్షంలో ఉండే నక్షత్రాల నుండి తీసుకోవచ్చు. కానీ వారి తరువాత తరాల వారికి కావాల్సిన అంతరిక్షనౌకలు తయారు చెయ్యడానికి బోల్డంత ఖనిజసంపద కావాలి. అది మాత్రం అంతరిక్షంలో దొరకదు. ఏదైనా గ్రహాల మీదకే రావాలి. వచ్చి తీసుకుంటా అంటే ఎవరూ ఇవ్వరు కదా.. రావడం, వాళ్ళకి కావాల్సినది దోచుకోవడం, వెళ్ళడం... అంతేకానీ, అన్నేసి కోట్ల కిలోమీటర్ల దూరం అంత సంపద వెచ్చించి, శ్రమపడి వచ్చి ఓవర్నైట్ స్టేలు  సీక్రెట్ రీసెర్చ్‌లు చేసి వెళ్ళిపోవడం అనే విషయం అంత నమ్మశక్యం కాదు. నా ఉద్దేశ్యంలో ఒకవేళ గ్రహాంతరవాసులు అంటూ భూమి మీదకి వచ్చి మనల్ని కలిసారూ అంటే.. అది మానవ జాతికి, ఉహూ.. మొత్తం భూమ్మీద ఉన్న జీవరాశికే ప్రమాదం అయ్యే అవకాశమే చాలా ఎక్కువ.

ఓహో.. అందుకనే వాళ్ళ కన్నా ముందు మనమే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఇలాంటి అంతరిక్ష పరిశోధనలకి సంబంధించిన రహస్యవిషయాలు కొన్ని ప్రభుత్వాలకి తెల్సినా అవి పబ్లిక్ లోకి రాకుండా రహస్యంగా ఉంచుతారు అంటారు. అది నిజమేనా?

అందులో కొంచెం నిజం లేకపోలేదు. ఉదాహరణకి ఒకసారి ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ టోక్యో యూనివర్సిటీలో ఈ విశ్వరహస్యాల మీద ఒక లెక్చర్ ఇవ్వాల్సి ఉండగా, ఆ లెక్చర్‌లో యుగాంతం లాంటి టాపిక్స్ గురించి ఏవైనా ప్రస్తావిస్తే అది తమ దేశ స్టాక్ఎక్సేంజ్ మీద ప్రభావం చూపిస్తుందన్న కారణంతో అలాంటి అంశాల ప్రస్తావన తీసుకురావొద్దని జపాన్ ప్రభుత్వం ఆయన్ని ప్రత్యేకంగా కోరిందట. కొన్ని సందర్భాల్లో ఇలాంటి కొన్ని సున్నితమయిన విషయాలని ప్రభుత్వాలు రహస్యంగా ఉంచుతాయన్నది నిజమే కావొచ్చు. 

సరే కానీ నా కోసం ప్రత్యేకంగా ఈ ప్రశ్న. నాకు 2012 సినిమా చూసినప్పటి నుండి ఒక చిన్న భయం పట్టుకుంది. 2012 సంవత్సరంలో అనే కాదు కానీ అలా మొత్తం మానవజాతినే తుడిచిపెట్టగల భయంకర ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడయినా సంభవిస్తాయంటావా? ఒకవేళ వస్తే ఎప్పుడు రావొచ్చు.. అలాంటివి వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇదొక్కటి చెప్పు.. ప్లీజ్.. :-)(ఇంకా ఉంది)
- మంచు & మధుర 

DISCLAIMER:
All content provided on this blog is for informational purposes only. The owner of this blog and authors of this post make no representations as to the accuracy or completeness of any information on this site or found by following any link on this site.  Photo courtesy by various websites on internet.