Pages

Friday, January 22, 2010

నా ఉద్యమం, కొన్ని సూచనలు - 1**   శ్రీరామ  **

మన భారతీయులం సాధారణంగా తమ స్వంత సుఖఃసంతోషాల కన్నా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అంటూ భావితరాల శ్రేయస్సు గురించే ఎక్కువ ఆలోచిస్తూవుంటాం. ఎంత సంపాదించినా మనకోసం ఎక్కువ ఖర్చుపెట్టుకోకుండా ముందుచూపుతో మన తరువాతి తరాలకోసం దాచి పెడుతూ వుంటాం. మన పిల్లల కోసం ఎలాంటి త్యాగనికయినా వెనుకాడం. భావితరాలగురించి అంత సెంటిమెంట్ గా ఎంతో ముందుచూపుతో ఆలోచించే మనం వాళ్ళకి ఎలాంటి పర్యావరణాన్ని ఇవ్వబోతున్నాం. ఎంత స్వచ్చయిన గాలిని, నీటిని అందివ్వాలని కోరుకుంటున్నాం. మన అవగాహనారాహిత్యంతో , నిరాసక్తితో , తెలిసినా ఒకింత స్వార్ధపూరిత లేక బద్ధకంతో కూడిన నిర్లక్ష్యంతో    మనం అనుభవించిన ఆహ్లాదకరమయిన వాతావరణాన్ని మన భావితరాలకి లేకుండా చేస్తున్నాం. మీకు జీవితానిచ్చిన ఈ ప్రకృతిమీద ప్రేమ వుందా ? లేక మీ తదుపరి తరాలకి మంచి వాతావరణాన్ని , పరిశుబ్రమయిన గాలి, నీరు , భూమి తద్వారా మంచి ఆరోగ్యాన్ని అందివ్వాలన్న తపన ఉందా ? అయితే ఈ టపా చదవండి. మీ పనుల్లో బిజీగా ఉండి అంత తీరిక లేకపోతె టపా ఆఖరులో ఇచ్చిన సూచనలు అన్నా కాస్తా మీ విలువయిన సమయం వెచ్చించి చదువుతారని ఆశిస్తున్నా. ఇది చదివి  ఒక్కరిద్దరయినా కన్విన్స్ అయ్యి నేను ఇక్కడ పొందుపరిచిన సూచనలలో  కొన్నయినా ఆచరిస్తే  నా ప్రయత్నం సఫలమయినట్టే . ఆ సూచనల్లో చాలామటుకు నేను ప్రస్తుతం ఆచరిస్తున్నవే.


కాలుష్యం , గ్రీన్ హౌస్ అఫ్ఫెక్టు దానివల్ల వచ్చే వాతావరణ అసమానతలు (అంటే అకాల వర్షాలు, అసాధారణ ఉష్ణోగ్రతలు లాంటివి) వీటిగురించి మనం ఈమధ్య తరుచుగా వింటున్నాం. ఆసియా దేశాలయిన భారత్ , చైనా లు పర్యావరణం విషయం లో బాధ్యతారహితం గా ప్రవర్తిస్తున్నాయని అమెరికా యూరోప్ లు, అమెరికానే ఎక్కువ కాలుష్యం విడుదల చేస్తుందని మనం ఏ వేదిక దొరికితే ఆ వేదిక మీద ఆరోపణలు చేసుకుంటున్నా , కనీసం ఇదొక సమస్య అని  ఇప్పటికయినా అందరూ గుర్తించినందుకు సంతోషం. అయితే ప్రభుత్వాలు, వాటి బాద్యతలు పక్కనే పెట్టి అసలు సామాన్య పౌరుడి గా మన బాద్యత ఏమిటి , ఆసలు ఈ కాలుష్యకారకాల మీద మనకెంత అవగాహన వుంది అని చర్చించాల్సిన అవసరం ఎంతయినా వుంది.

కాలుష్యం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది వాయుకాలుష్యం (Air Pollution). ఇది అన్ని కాలుష్యాలలో కెల్లా ప్రధానమైనది ఇదే కానీ దీనితోపాటు మనం తెలుసుకోవాల్సిన మిగతా కాలుష్యాలు నీటి/తాగునీటి  కాలుష్యం (Water Pollution) , భూమి కాలుష్యం/ భూమి విషతుల్యమవడం   (Soil Contamination) , ద్వని కాలుష్యం (Noise Pollution) మరియూ కాంతి  కాలుష్యం (Light Pollution) మొదలైనవి .

వాయుకాలుష్యం:  పేరుకి వాయుకలుష్యమయినా  ఇవి ద్రవ (Liquid Droplets) , వాయు, ఘనపదార్ధాల (Solid Particles) రూపం లో ఏరూపం లో అయినా ఉండొచ్చు. వాయురూపం లో వుండే సల్ఫర్ డై ఆక్సైడ్ (SOx) లు ,  నైట్రోజెన్ ఆక్సైడ్ లు (NOx ) ,  కార్బన్ మోనాక్సైడ్, కార్బన్  డై ఆక్సైడ్ లు , ఘనరూపం లో వుండే బూడిద , దుమ్ము,  ధూళి ఇవన్నీ వాయుకాలుష్యం కారకాలు . ఈ కాలుష్యానికి కారణాలు ఎక్కువశాతం మానవ తయారినే (man made) ఆయినా కొన్ని ప్రకృతి సిద్దమయిన కారణాలు కూడా వాయు కాలుష్యం కలగచేస్తాయి. మానవుడు సృష్టించిన పరిశ్రమలు , అసంఖ్యాకమయిన వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, ఓడలు  ఇలా ఇంధనం మండించడం  ద్వారా శక్తిని ని వేలికితేసే యంత్రాలన్నీ కాలుష్యకారకాలే (కొన్ని ఇంధనం నుండి శక్తి ని వెలికి తీసినా ఈ కోవలోకి రావు .. అవి వేరే టపాలో రాస్తాను) .  అలాగే కొన్ని కెమికల్స్ , ప్లాస్టిక్ వస్తువులు మండించినప్పుడు విడుదలయ్యే విషవాయువులు (Toxic gases ) కూడా చాలా ప్రమాదకరమయినవి. థర్మల్ విద్యుత్ కేంద్రాలనుండి మరియు బొగ్గుతో నడిచే ఓడలనుండి విడుదలయ్యే బూడిద గాలిలో కలవడం వల్ల కలిగే కాలుష్యం కూడా ఆందోళన కలిగించే స్తాయిలోనే వుంది (ఘనపదార్దల వల్ల  కలిగే వాయు కాలుష్యానికి ఇదే ఉదాహరణ ) . అలాగే ప్రకృతి సిద్దమయిన కారకాలు అంటే అగ్నిపర్వతాలు పేలినప్పుడు విడుదలయ్యే బూడిద, అడవులు తగలబడటం (wildfire) , పొడిబారిన మైదాన ప్రాంతాల్లో రేగే దుమ్ము, పశువులు విడుదల చేసే మీథేన్ ( జీర్ణక్రియ వల్ల ఉత్పత్తి అవుతుంది ) ఇవన్నీ.
ఈ వాయుకాలుష్యం జీవుల ఆరోగ్యం మీద ఎంతో దుష్ప్రభావాన్ని చూపుతుంది. WHO అంచనా ప్రకారం ప్రపంచంలో ఏటా కనీసం 25 లక్షలమంది ఈ వాయుకాలుష్యం వల్ల చనిపోతున్నారు. ఎన్నో కోట్లమంది ఆస్మా, bronchitis, రకరకాల ఊపిరితిత్తుల మరియు గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ఏ దేశం ఎంత కాలుష్యాన్ని విడుదలచేస్తుంది  అని లెక్కలు చూసుకునే ముందు మన జన సాంద్రత కూడా పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా అన్నిదేశాల కన్నా ఎక్కువ వాయుకాలుష్య కారక వాయువులు విడుదల చేసినా వారి దేశ విస్తీర్ణం , వున్న ఆటవీసంపద, చెట్లు ఆ కాలుష్య ప్రభావాన్ని చాలావరకు తగ్గిస్తాయి. మన భారతదేశం లాంటి తక్కువ విస్తీర్ణం  మరియు అధిక జనసాంద్రత కలిగిన దేశాలు కొద్ది కాలుష్యాన్ని విడుదల చేసినా అది మనమీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాగే వాయుకాలుష్యం వల్ల ఓజోన్ పొర మీద పడే దుష్ప్రభావం చాలా ఆందోళన కలిగించే స్తాయిలో వుంది.

ఈ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయ్. వాహనాలకు, పరిశ్రమలకు అవి విడుదల చేసే కాలుష్యకారక వాయువుల లెవెల్స్ కి లిమిట్స్ పెట్టడం (అంటే నిర్ధారించిన లెవెల్ కన్నా ఎక్కువ NOx, SOx వాయువుల విడుదల చేయకూదన్నమాట .. మన బండి పొల్యుషన్ సర్టిఫికేట్ అదే చెబుతుంది ) , తక్కువ కాలుష్యం విడుదల చేసే యంత్రాలకు , పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇవ్వడం , దానికి సంబందించిన పరిశోధనలు ప్రోత్సహించడం , అలాగే గాలిలో వున్న particles ని కలక్ట్ చెయ్యడానికి "Electrostatic precipitators మరియు dust collectors " లాంటివి ఏర్పాటు చెయ్యడం ఇవన్నీ కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నాల్లో బాగమే. (అమెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రం తక్కువ కాలుష్యకారక వాయువులు  విడుదల చేసే హైబ్రీడ్ కార్లకు పన్ను రాయితీ ఇస్తుంది. అలాగే రోడ్ల మీద ప్రత్యేకమయిన లేన్లను వాళ్లకు కేటాయిస్తుంది ).

(అమెరికా లో మీరు వుండే  ఏరియా లో గాలి ఎంత పరిశుబ్రం గా వుందో తెలుసోకోవాలంటే డైలీ పేపర్లోగానీ http://www.airnow.gov లో గాని Air Quality Index  అని వుంటుంది లో చూడండి)

నీటి కాలుష్యం : ప్రకృతి మనకు మంచినీటిని అందించే నదులు,  సరస్సులు,  భూగర్బ జలాలు ఒకటేమిటి అన్నింటిని మనం విషతుల్యం చేసిపారేస్తున్నాం . పరిశ్రమలు విడుదల చేసే విష రసాయినాలు, పురుగుమందులు, పెట్రోలు పదార్దాలు, తినిపారేసిన చెత్త, మంచినీటిని శుబ్రంచెయ్యడానికి ఉపయోగించే రసాయనం మోతాదు మించడం, మితిమీరిన డిటర్జెంట్ వాడకం ఇలా చాలా కారణాలు వున్నాయి నీటిని విషతుల్యం చెయ్యడానికి. అలాగే చెట్లనుండి రాలిన ఆకులు , పడిపోయిన చెట్లు నీళ్ళలో కుళ్లడం వల్లకూడా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. వినాయకచవితి అప్పుడు ఆ వినాయకుడి విగ్రహ తయారీ లో వాడే  కొన్ని   రసాయనాలు  వల్ల కూడా నీటి కాలుష్యం ఏర్పడవచ్చు (దీని గురించి వేరే టపా ). ఇలా రసాయనాలు , బ్యాక్టీరియా కలవడం వల్లే కాకుండా ఇంకో రకం నీటి కాలుష్యం కూడా వుంది అది థెర్మల్ కాలుష్యం. విద్యుత్ కేంద్రాలు మరియు ఐస్ ఫ్యాక్టరీ లాంటి పరిశ్రమలలోను యంత్రాలను చల్లబరచడానికి నీటిని ఉష్ణవాహకాలుగా ఉపయోగిస్తుంటారు. అంటే మనం నీటి ఉష్ణోగ్రత ను దానియొక్క సహజసిద్దమయిన ఉష్ణోగ్రత నుండి పెంచుతున్నాం అన్నమాట.. ఈ పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల నీటిలోని ఆక్సిజన్ శాతం తాత్కాలికం గా తగ్గి ఎన్నోచేపలు మిగతా జలచరాలు చనిపోవడానికి కారణమవుతుంది. ఈ నీటి కాలుష్యం వల్ల వెనుకబడిన దేశాల్లోనే కాకుండా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న చైనా , భారత్ లో కూడా పరిస్తితి చాలా ఆందోళనకరం గా వుంది. ఈ నీటి కాలుష్యం కారణం గా ఏటా ప్రపంచవ్యాప్తం గా కనీసం 50 లక్షల మంది చనిపోతున్నట్టు అంచనా.. ముఖ్యంగా మనదేశం లో రోజుకి వెయ్యికి పిల్లలు పైగా డైఏరియా బారిన పడుతున్నారు. మనం నదుల్లోకి, సముద్రాల్లోకి విడిచిపెడుతున్న విషతుల్యమయిన రసాయినాలు వల్ల ఎన్నో కోట్ల జీవరాసులు అంతరించిపోతున్నాయ్.

ఈ కాలుష్య నివారణకు కొన్ని ప్రబుత్వాలు ఎంతో శ్రద్ద చూపిస్తున్నాయ్. కొన్ని దేశాలు ఇంకా అశ్రద్ద తోనే వ్యవహరిస్తు సమస్య ని మరింత జటిలం చేస్తున్నాయ్. ఉదాహరణ కి జనరల్ ఎలెక్ట్రిక్ అనే  పేరు మోసిన బహుళజాతి సంస్థ Housatonic River ని పోల్యుట్ చేసినందుకు 250 million dollars కట్టాల్సి రావడం తో అక్కడ మిగాతా కంపెనీలు అన్నీ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రబుత్వం విదించిన కాలుష్య నివారణ సూచనలను, నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తున్నాయ్. మన దేశం లో ప్రభుత్వాలకి ప్రజల ఆరోగ్యం , పర్యావరణం కన్నా పెద్ద కంపెనీల శ్రేయస్సే ముఖ్యం కనుక ఇలాంటివి ఇక్కడ ఆశించడం అత్యాశే ..

ధ్వని  కాలుష్యం : పెద్దపెద్ద యంత్రాలు , వాహనాలు ముఖ్యం గా విమానాలు, ఎమర్జెన్సి సైరన్లు , construction work, లౌడ్ స్పీకర్లు, బాణాసంచా, ట్రాన్స్ఫొర్మెర్ లు వంటి యంత్రాలనుండి వచ్చే హమ్మింగ్ నాయిస్ (geeee అని వస్తుంది ) ఇవన్నీ ధ్వని కాలుష్యం లోకే వస్తాయి. ధ్వని కాలుష్యం వల్ల మనుషుల్లోనూ మరియూ జంతువుల్లోను శారీరక , మానసిక అనారోగ్యం కలగవచ్చు. వినికిడి శక్తి తగ్గడం, హై బిపి , నిద్రలేక పోవడం, హై స్త్రెస్స్ కి గురికావడం లాంటి అనారోగ్యాలు ద్వనికాలుష్యం వల్ల కలగుతాయి . ఈ శబ్ద తీవ్రతను డేసిబెల్స్ (db) లలో కొలుస్తారు. యంత్రాలు విడుదల చేసే శబ్ద తీవ్రతకు ప్రబుత్వాలు కూడా కొన్ని లిమిట్స్ పెట్టింది. ఉదాహరణకు ఇంట్లో వాడుకునే కంప్యుటర్, ట్యూబు లైటు లాంటి డెస్క్ టాప్ ఐటమ్స్  యొక్క శబ్దతీవ్రత  45db మించి వుండకూడదు. డెస్క్ సైడ్ ఐటమ్స్ అంటే మనకి కొంత దూరం లో ఉండేవి 50 db అని , ఆరుబయట ఉపయోగించే యంత్రాలకు 75-80 db అని, పరిశ్రమల్లో ఉపయోగించే యంత్రాలు ఫలానా db level దాటకూడదని , ఎక్కువ శబ్దాలు విడుదల చేసే యంత్రాల దగ్గర పని చేసే కార్మికులు తప్పనిసరిగా చెవులు కాపాడుకునే ear plugs ధరించాలని ఇలా చాలా మార్గదర్శకాలు ఏర్పాటు చేసింది.


భూమి విషతుల్యమవడం (Soil Contamination):
విపరీతంగా పెరిగిపోయిన ప్లాస్టిక్ వాడకం, అధిక పురుగుమందుల వాడకం, భూగర్భంలో వుండే స్టోరేజీ టాంకులు ప్రమాదవసాత్తు పగిలిపోవడం , పరిశ్రమల నుండి వచ్చే వేస్ట్ వాటర్ డైరెక్ట్ గా భూమిలోకే వదిలెయ్యడం ఇలాంటి కారణాలవల్ల మన నేల విషతుల్యమయిపోతుంది. ఇలా ఈ కాలుష్యం 'విషతుల్యమయిన మట్టిమీద' జీవించేవారి ఆరోగ్యం మీద తీవ్రప్రభావం చూపుతుంది. అలాగే ఈ ప్రమాదకరమయిన రసాయనాలు భూగర్భజలాల్లో కలసి ఆ నీటినికూడా వాడటానికి పనికిరాకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ లో వస్తాదనుకున్న ఫ్యాబ్ సిటీ రాకుండా పోయినప్పుడు ఎంతమంది నిరాశచెందారో తెలీదు కానీ నేను మాత్రం చాలా సంతోషించాను. ఫ్యాబ్ ప్రాసెస్ చాలా ప్రమాదకరమయినది. ఆ ఫ్యాబ్ ప్రాసెస్ లో సిలికాన్ వేఫర్లను  క్లీన్ చెయ్యడానికి పరిశుబ్రమయిన మంచినీరు అవసరం. ఆ క్లీన్ చెయ్యగా మిగిలిన నీరు అత్యంత విషపూరితం. తాగడానికి  నీళ్ళులేని,  'కాలుష్య ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనలని' అత్యంత సులువుగా గాలికొదిలేసే మనదేశం లో పరిశుబ్రమయిన మంచినీరు అ పరిశ్రమ కిచ్చి విషపునీరు మనం తీసుకోవడం ఎంతమాత్రం సరి కాదు. దానివల్లే వచ్చే ఉద్యోగాల సంగతి అటుంచి దానివల్ల  చుట్టుపక్కలవారికోచ్చే జబ్బులను పరిగణలోకి తీసుకుంటే మన దేశం లో అందులో నీళ్ళకి అల్లలాడే  హైదరాబాద్లో  ఫ్యాబ్ సిటీ కావాలని ఎవరు అనరు అని నా అభిప్రాయం.

ఇంక కాంతి కాలుష్యం అంటే అవసరం లేని చోట కూడా ఎక్కువ కాంతి వచ్చే బల్బులు పెట్టడం. అలాంటివి మనలాంటి పొదుపు దేశం లో తక్కువే. అందుకే దానిగురించి ఎక్కువ వివరించడం లేదు. ఇది కాక ఇంకో ముఖ్యమయిన కాలుష్యం " radioactive contamination "  అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో మరియు అణుబాంబు తయారి లో వాడే రేడియోఆక్టివ్ ఇంధనాల వల్ల కలిగే కాలుష్యం. ఇది కంట్రోల్ చెయ్యడానికి కూడా సామాన్యుడిగా మనం చేసేది ఏమి పెద్దగా ఏమి వుండదు కాబట్టి దీనిగురించి కూడా ఎక్కువ రాయడం లేదు.

పైన ఇచ్చిన పరిచయం తో బాద్యతకల పౌరుడిగా మనం ఏమి చెయ్యాలో చూద్దాం . వీటిలో చాలామటుకు నేను ఆచరణ లో పెట్టినవి .

1. మనం ముందుగా చేయాల్సింది కాలుష్య దుష్ప్రభావం గురించి , వాటి నివారణా చర్యల గురించి మనం అవగాహన పెంచుకోవడం తో పాటు మన పిల్లలకి కూడా అవగాహన కల్పించాలి . వాళ్ళలో మన ప్రకృతి గురించి ఒకరకమయిన సెంటిమెంట్ ఏర్పరచాలి. ఏదయినా మనం నిజాయితీగా చేస్తే మన పిల్లలు అదో బాధ్యత గా తీసుకుంటారు. ఈ విషయం లో ఎవరికయినా క్లాసు పీకల్సి వస్తే అస్సలు మొహమాటపడొద్దు.

2. నగరాల్లోనూ పట్టణాల్లో బయట రోడ్డుమీద తిరుగుతున్నప్పుడు వీలయినప్పుడల్లా ముక్కుకి చేతిరుమాలు కట్టుకోండి. ముఖ్యం గా ద్విచక్ర వాహన దారులు మరియు నాన్ AC వాహనాల్లో తిరిగేవారు. తడిపిన కర్చీఫ్  అయితే మరీ మంచిది. నేను బండి నడుపుతున్నప్పుడు కర్చీఫ్ తడిపి ముక్కుకు కట్టుకుని ఆ పై హెల్మెట్ పెట్టుకునే వాడిని.  ప్రస్తుత వాయుకాలుష్యానికి నివారణగా ఇది తప్పనిసరి. ప్రతీసారి ఇది కుదరకపోవచ్చు కానీ వీలయినంత సేపు వాడండి. చాలావరకు 'dust particles' ని , కొన్ని రసాయన వాయువుల్ల్ని ఈ తడి కర్చీఫ్ విజయవంతం గా వడబోస్తుంది.

3 . వీలయినంత వరకు విద్యుత్ వాడకాన్ని తగ్గించండి. అవసరం లేని చోట ఫ్యాన్లు , లైట్లు కట్టేయండి. (మీకు శ్రమ లేకుండా దానంతట అవే ఆఫ్ అయిపోయే స్విచ్లు వస్తున్నాయ్.. వాటిగురించి వేరే టపా లో రాస్తాను ) . ప్రస్తుతానికి ఆ పని మీరే చెయ్యండి. దీనివల్ల రెండు రకాల లాభాలు . i ) మీ కరెంట్ బిల్లు అదా చేస్తారు. ii) మీ  తక్కువ విద్యుత్ వాడకం వల్ల  తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తే చాలు..తక్కువ విద్యుత్ ఉత్పత్తి అంటే తక్కువ కాలుష్యం .. ఇది చాలా చిన్నది గా కనిపించినా దీనివల్ల కలిగే ఉపయోగం చాలా పెద్దది మరియు మనం చాలా సులభం గా చెయ్యగలిగినది. 

4 .  మనం నెలంతా కస్టపడి గుర్తుపెట్టుకుని లైట్ లు , ఫాన్స్ ఎప్పటికప్పడు కట్టేస్తూ చాలా అదా చేసేసి ఏదో ఒకరోజు ఏ వాటర్ హీటర్ లేక ఎలెక్ట్రిక్ పొయ్య లాంటివి ఆన్ చేసి మర్చిపోతూ వుంటాం. ఒక్క గంట వాటర్ హీటర్ అదనం గా ఉపయోగిస్తే (అంటే అవసరం లేనప్పుడు మర్చి పోయి వదిలెయ్యడం ) 16 గంటలు మనం లైట్ లు , ఫ్యాన్ల కట్టడం ద్వారా అదా చేసినా విద్యుత్ అంతా ఖర్చుపెట్టినట్టే.. అందువల్ల ఎక్కువ పవర్ తీసుకునే వస్తువుల మీద మీరు ముందు ద్రుస్తిపెట్టండి. (అంటే హీటర్ లు, AC లు , ఎలెక్ట్రిక్ పోయ్యలు, వెట్ గ్రైండర్ లు , మిక్సిలు, వాటర్ పంపులు లాంటివి. )

5 . వీలయినంత వరకు AC వాడకం తగ్గించండి. AC , refrigerator వాడకం వల్ల విద్యుత్ అధికం గా ఖర్చు అవడమే కాదు ఈ పరికరాల పనిచేస్తున్నప్పుడు విడుదలయ్యే కొన్ని రసాయన వాయువుల వల్ల పర్యావరణానికి (ముఖ్యం గా ఓజోన్ పొరకు) కూడా చాలా నష్టం . నేను వీటి వాడకం తగ్గించడమే కాదు , restaurent కి వెళ్ళినప్పుడు కూలింగ్ వాటర్ కూడా తీసుకొను. షాప్ లో కూల్డ్రింక్స్ కొనవలసి వస్తే room temperature దగ్గర ఉండేవే కొంటాను. అలా నా refrigerator వాడకమే కాకుండా ఆ షాప్/ రెస్టారెంట్  వాడి refrigerator వాడకం కూడా తగ్గించాలని నా తాపత్రయం. ఇండియాలో మరీ ఇలా కష్టం కానీ వీలయినంత ప్రయత్నించండి.

6. వీలయినంత  వరకు బట్టలకు వాడే డిటర్జెంట్ వాడకాన్ని తగ్గించండి. మీరు కొన్ని హోటల్స్ లో చూసే వుంటారు. ఈ   'డిటర్జెంట్ వాడకాన్ని తగ్గించడానికి' మీకు అవసరమయిన టవల్స్ మాత్రమె వుతకడానికి ఇవ్వండి అని. అది నిజం . అలాగే  వంట  పాత్రలు కడగటానికి వాడే  (dish washer)  సోప్ లిక్విడ్లు  కూడా .

7. మోటార్లతో వాటర్ టాంకులు నింపుతున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. టాంకు నిండాక కట్టడం మర్చిపోయిన  ప్రతిసారి మనం డబల్ తప్పు చేస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. ఒకటి మంచినీటిని వృదా చేస్తున్నాం. రెండు కరెంటుని వృదా చేస్తున్నాం.  ట్యాంక్ నిండిపోయినప్పుడు ఆటోమాటిక్ గా మోటార్ ఆగిపోయే పరికరాన్ని ఏర్పాటుచెయ్యండి. అవి ఇప్పడు చాలా చవకగానేదొరుకుతున్నాయి.

8 . వీలయినంత  వరకు ప్లాస్టిక్ బాగ్ ల వాడకం తగ్గించండి. నెలసరి సరుకులు కొనటానికి వెళ్ళినప్పుడు మీ సంచులు మీరే తీసుకెల్లండి. (ఒకప్పుడు మనం ఇలానే వుండే వాళ్ళం .. ఈ పశ్చిమ దేశాలోల్లు మనకీ ప్లాస్టిక్ అలవాటు చేసి పోయారు :-) ) . బెంగుళూరులో నేను ఇప్పుడు వున్న అపార్ట్మెంట్ లో చాలామంది ఇలాంటి సంచులు తీసుకుని సూపర్ మార్కెట్ కి వెళ్ళడం చూస్తుంటే చాలా సంతోషం గా వుంది .

9 . అలాగే మీరు ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్ లు ఎక్కడ పడితే అక్కడ పాడేయవద్దు  . దయచేసి మున్సిపాలిటి వాళ్ళు కలక్ట్ చేసే చెత్తబుట్టల్లోనే వెయ్యండి. ముఖ్యం గా మీరు ప్రయాణించేడప్పుడు , విహరయత్రాలకి, పిక్నిక్ లకి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్ లు ఎక్కడపడితే అక్కడ పడేయవద్దు. మైసూరు జూలో ప్లాస్టిక్ వాడకం నిషిద్దం .. అలా అన్నిచోట్ల రూల్స్ వస్తే బావుంటుంది. ఎన్ని రూల్స్ పెట్టిన ఫైనల్ గా  అది మన చిత్తశుద్ది మీదే ఆధారపడి వుంటుంది. అలాగే  పిల్లల  డైపర్స్  వాడకం కూడా  , వాటిని  dispose చెయ్యడం  కూడా  ప్లాస్టిక్  వస్తువులలానే  జాగ్రత్త తీసుకోవాలి . వీలయినప్పుడల్లా  (అంటే  ఇంట్లో  వున్నప్పుడు )  డైపర్  వాడకుండా  మన  పాత పద్దతిలో re -usable పాత  గుడ్డలు వాడటం  బెటర్ .

10.  మీరు కొనగలిగే ధరల్లో వున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్  ని కొనండి. అది మీ ఆరోగ్యానికి మంచిది మరియు మీరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని ఉత్పత్తిచేసేవారికి ప్రోత్సాహం ఇచ్చిన వారవుతారు.

11. మీరు  వ్యవసాయదారుల కుటుంబం  నుండి వచ్చిన వారయితే , మీ కుటుంబం లోని  వ్యవసాయం చేసివారికి అధిక ఎరువులు వాడకం వల్ల కలిగే నష్టాలు తెలియపరచండి. సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల పర్యావరణానికి ఎంత ఉపయోగమే తెలియచెయ్యండి. అవసరానికి మించి పురుగుమందులు (pesticides ) వాడొద్దని చెప్పండి. పర్యావరణానికి , పండే భూమికి చేటు తెచ్చే చేపల/రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించకండి. అవి తాత్కాలికం గా ఎక్కువ లాభాలోస్తాయి కానీ తరువాత పండించడానికి ఆ భూమిపనిచెయ్యదు ఆఖరుకి ఆ చేపలు పెంచడానికి కూడా

12. మనిషికో  మొక్కయినా  పెంచాలి. మొక్కలంటే  గులాబీ మొక్కలు కాదు. వేప చెట్టు ,మామిడి చెట్టి లాంటివి.  గులాబీ మొక్కలాంటివి  అయితే  కనీసం మనిషికి ఒక 20 -30 ఆయినా పెంచాలి.

13 . మీ వాహనానికి రెగ్యులర్ గా   పొల్యుషన్  చెక్  చేయిస్తూవుండండి . పాత  వాహనాలని  మనం  సెంటిమెంట్ తోనో లేక  పడివుంటుందిలే  అనో లేక నడిచేవరకు నడిపిద్దాం అనో  ఎన్నేళ్ళయినా  ఇంకా  వాడుతూ  వుంటాం . వాటిని అప్పుడెప్పుడో   తాయారు  చెయ్యడం  వల్ల  ,  అప్పట్లో   ఈ  వాహన   తయారీదారులకి  అంత  అవగాహన   లేకపోవడం  వల్ల  , ఆ  వాహనాలు  ఎక్కువ  కాలుష్యాన్ని  విడుదల  చేస్తాయి . అందువల్ల పాత వాహనాలు వాడటం తగ్గించండి. కావాలంటే షో పీస్ లా పెట్టుకోండి.


14. Reuse మరియూ  Recycle గురించి  పిల్లల్లో  అవగాహన  కల్పించాలి . reuse గురించి  మనకి  ఒకరు  చెప్పక్కర్లేదు. దాంట్లో మనం మాస్టర్స్ .. కానీ  recycle గురించి  మనకి  ఇంకా  అంత  అవగాహన  లేదు . అమెరికా  లో  వాడేసిన ప్లాస్టిక్  బాటిల్స్ , కూల్  డ్రింక్  కేన్స్  లాంటివి అవి  అమ్మిన  షాప్  వాళ్ళే  వెనక్కి  తీసుకుంటారు .  మనం  వెనక్కి  ఇచ్చిన  ప్రతి   బాటిల్ /కాన్  కి  ఇంతని  మనకి  తిరిగి  చెల్లిస్తారు  . వీలయినంతగా  డిస్పోసబెల్   వస్తువుల  వాడకం  తగ్గించండి . ఒకప్పుడు  మనం  పెళ్లి బోజనాలకి   చక్కగా  అరిటాకులు  వాడేవాళ్ళం ..ఇప్పడు  అందరూ  బుఫేలు.. డిస్పోసబెల్  ప్లేట్లు  అంటున్నారు ..:((

15. ఆఫీసుల్లో  కాఫీ  డిస్పోసబెల్  కప్పుల్లో  మానేసి  మీరే  మాంచి  కప్  కొనుక్కెళ్ళండి . అది  చూసినవారంతా  ఆ  కప్  గురించి  అడగకపోరు . అప్పుడు  మీరు  వాళ్ళకి  disposable కప్పుల వల్ల  నష్టాలు  వివరించవచ్చు .


16. మనం  వాడేసిన  ఎలక్ట్రానిక్  వస్తువులు  (సెల్  ఫోన్స్ , కంప్యూటర్స్ , లాప్టాప్స్) మరియు  దాంట్లో వాడే బాటరీలు చాలా  విషపూరితమయినవి . అందుచేత  మనం  వాటిని  ఎక్కడ  పడితే  అక్కడ  పడేయకూడదు. మునిసిపాలిటి  చెత్తబుట్టల్లో  కూడా  పడేయకూడదు . ప్రభుత్వ  నిబంధనల  ప్రకారం  మనం  వాడేసిన  బాటరీలు  తిరిగి  తీసుకుని   వాటిని  జాగ్రత్తగా  dispose చేసే బాద్యత  మనకి  అమ్మిన  షాప్ వాడిదే . అంటే  మీ  నోకియా  సెల్ ఫోన్  బాటరీ   మీరు  నోకియా  షాప్  లో  తిరిగి  ఇస్తే  వాడు  తీసుకోవాలి . ఆ  షాప్  వాడు  ఇలా కస్టమర్స్ ఇచ్చిన వాడేసిన  బాటరీలు  అన్ని  నోకియా  కంపనీ కు  పంపిస్తే  వాళ్ళు  ఆ  బాటరీలు నుండి విష  రసాయనాలు (లెడ్, కాడ్మియం లాంటివి )  అన్ని  వేరుచేసి   ఆ  తరువాత  వాటిని  జాగ్రత్తగా  ప్రబుత్వ నిబంధనల  ప్రకారం  dispose చేస్తారు . బాటరీల్లోను, ఎలక్ట్రానిక్  సర్క్యూట్ బోర్డుల్లోనూ  వుండే  రసాయినాలు  చాలా  చాలా  ప్రమాదకరమయినవి కనుక  వీటి  విషయం  లో  మనం  చాలా  శ్రద్ద  తీసుకోవాలి . (వీటి
 గురించి మరింత వివరాలు వేరే టపాలో రాస్తాను )

17. ఎలక్ట్రానిక్  వస్తువులు , ప్లాస్టిక్  వస్తువులు , కొన్ని  రకాల రబ్బర్లు   అవసరం  లేకుండా  కాల్చొద్దు . అవి  చాలా  toxic వాయువులు  విడుదల  చేస్తాయి .

18. కారు /బైక్  పూలింగ్  చేసుకోండి  (అంటే  మీ  కొలీగ్స్  ఎవరయినా  మీ  ఇంటి  దగ్గర  లో  నివసిస్తుంటే రెండు  వాహనాలకి  బదులు  ఒకటే  ఇద్దరు  షేర్  చేసుకోండి ). దానివల్ల  పెట్రోల్  ఖర్చు  తక్కువ , మీ  ఆఫీసు  లో  పార్కింగ్  ప్రాబ్లం  వుంటే  దానికి  ఇది  ఒక  పరిష్కారం  ..అన్నిటికన్నా  కాలుష్యం  తగ్గించినవారవుతారు .

19. వీలయినంత   దూరం  నడిచి  వెళ్ళడానికి  ప్రయత్నం  చెయ్యండి . " ఆరోగ్యానికి  ఆరోగ్యం  - అదాకి  అదా - ప్రకృతికి  మేలు " .. నడవలేక  పొతే  సైకిల్  ఆయినా  కొనుక్కోవచ్చు . నేను త్వరలో ఒక సైకిల్ కొనబోతున్నా

20. దూరమయితే  పబ్లిక్  ట్రాన్స్పొర్టెషన్ లొ వెళ్ళగలరెమో ప్రయత్నిచండి  (అటో  కాదు  .. బస్సు  /ట్రైన్  లాంటివి  ). అది  కుదరకపోతేనే  మీ  కారు  /బైక్  తియ్యండి . ఆటో  లో  వెళితే  మీ  వాహనం  కంటే  ఎక్కువ  కాలుష్యం  అది  విడుదల  చేస్తుంది .అందువల్ల ఆటో కన్నా మీ వాహనమే బెటర్.

21. ఎప్పుడయినా  బయట ఫుడ్  తిన్నాక  పేపర్  నాప్కిన్స్  మిగిలిపోతే  అవి  పడెయ్యకుండా  తీసి  దాచుకోండి . తరువాత  ఉపయోగించోచ్చు . నేనయితే  పేపర్  నాప్కిన్స్  వాడను . నా  హ్యాండ్  కర్చీఫ్  ఎప్పుడూ  నా  జేబులోనే  వుంటుంది .

22. షాపులో  ప్లాస్టిక్  సంచులు  బదులు  పేపర్  సంచులు  ఇస్తున్నారని  వాటిని  ప్రోత్సహించకండి . అవి  ప్లాస్టిక్ లా   విషపూరితం  కాదు  కానీ పేపర్  చెట్లనుండే  తయారవుతుందని  మర్చిపోకండి . రెస్ట్ రూముల్లో పేపర్ నాప్కిన్స్ బదులు మీ కర్చీఫ్ వాడండి. కొన్ని చోట్ల పేపర్ నాప్కిన్స్ బదులు హ్యాండ్ డ్రైయర్లు పెడతారు . అక్కడ పేపర్ సేవ్ చేస్తున్నాం కానీ బోల్డంత కరెంటు ఖర్చుపెడుతున్నాం . అందుకే అన్నిటికన్నా మన కర్చేఫ్ మేలు .

23. ఎక్కువ  బాటిల్  వాటర్  కొనకుండా  ఒక  మంచి  బాటిల్  కొని  అవసరమయినప్పుడు  రీఫిల్  చేసుకోండి .

24.  మీరు  షాపింగ్  చేసేటపుడు  లేక  ఏదయినా  హోటల్   కి  వెళ్ళినప్పుడు  environment friendly (or eco friendly) వస్తువులు  కొనడానికి  మక్కువ చూపండి.   వాటిపట్ల మీ ఇంట్రెస్ట్ వారికి  తెలియపరచండి .  అప్పుడు  వాళ్ళ  దగ్గర లేకపోయినా  మీ  కోరిక  వాళ్ళకి  తెలియపరిస్తే  నెక్స్ట్  టైం  మీకు  అవి  అందుబాటులో ఉంచడానికి  వాళ్ళు  ప్రయత్నిస్తారు  . ఏదయినా  వస్తువు లేక  పరికరం   తాయారు  చేసేముందు  ఆ  కంపెనీ  వాళ్ళు ' ఆ   వస్తువునుండి  కస్టమర్   ఏమి   ఆశిస్తున్నాడు'   అని  ఎంక్వయిరీ  చేస్తారు (దీన్నే వాళ్ళ పరిబాషలో 'వాయిస్ అఫ్ కస్టమర్' అంటారు ). అవి  ప్రతీసారి   కస్టమర్ ని అడిగి తెలుసుకోవడం కుదరక  ఆ  షాపులు లేక  డీలర్స్  ని  అడిగి  తెలుసుకుంటారు . ఆ షాపువాళ్ళు లేక డీలర్లు  గనుక "ఎక్కువ  కస్టమర్స్  గ్రీన్  వస్తువులు  (environmental friendly) వస్తువులు  కొనడానికి  ఇష్టపడుతున్నారు"  అని చెబితే  కంపెనీలు  కూడా  ఆ  వైపుగా  ఆలోచిస్తాయి.

నాకు  ఇప్పటికి  గుర్తొచ్చినవి  రాసాను. మీకు ఇంకా తెలిసే వుంటాయి. నాకు  గుర్తొచ్చినవి  ఇక్కడ  అప్డేట్   చేస్తూ  వుంటా .. మీకు  సమయం  చిక్కినప్పుడల్లా  ఒక   లుక్కేస్తూ  వుండండి . వీటిలో మీరు చాలా చేస్తూ ఉండొచ్చు. మీరు చేసేవి మీతోనే ఉంచుకోవద్దు. మిగతా వాళ్లకి చెప్పండి. వాళ్ళు చెయ్యగలిగే వాళ్ళని ఇంకొంతమందిని inspire చెయ్యమనండి . (pay it forward లా లేక మన తెలుగు స్టాలిన్ లా )


మనం ఒక్కటి  గుర్తుపెట్టుకోవాలి  ..  వృదాచెయ్యడం  తగ్గిస్తే  సగం  ప్రాబ్లం  తీరినట్టే .. ఆ  వృదాచెయ్యడం  విద్యుత్  అవ్వచ్చు   , పేపర్  అవ్వొచ్చు  , నీళ్ళు అవ్వచ్చు.    ఇంకేదయినా  కానీ  పొదుపు  గా  వాడదాం .. పర్యావరణాన్ని  కాపాడదాం .. ఇది  మనందరి  బాద్యత .. మన  కోసం  కాదు  ..మన  పిల్లల  కోసం .. వాళ్ళ  పిల్లల  కోసం .. మన  భావితరాల  కోసం ..- మంచుపల్లకీ 
(ఈ టపా రాయడానికి 'ప్రత్యక్షంగా సహాయం , పరోక్షంగా ప్రోత్సాహం' అందించిన ఫ్రెండ్ కి ధన్యవాదాలు తెలుపుతూ..)  

Saturday, January 9, 2010

నైజీరియా To శ్రీకాకుళం

నైజీరియా మాహారాజు లేక లాండ్ లార్డ్ కుటుంబ సభ్యుల దగ్గరనుండి మీకేప్పుడయినా ఈ-మెయిల్ వచ్చిందా .. అక్కడ బ్యాంకులలో వాళ్లకి కొన్ని కోట్ల ఆస్తి  వుందని , ఇప్పుడు అక్కడ ఏర్పడిన political unrest వల్ల ప్రస్తుతం అక్కడ ఎకౌంటు  access చెయ్యలేక పోతున్నామని  , ఆ ఫండ్స్ మీ దేశం లో వున్న బ్యాంకు కి మూవ్ చెయ్యడానికి హెల్ప్ చేస్తే మీకు కొంత (కొన్ని కోట్లే ) డబ్బు ఇస్తామని.. ఇలా వుంటుంది ఆ మెయిల్ సారాంశం ..

ఇదంతా నిజం కాదు అని అనిపించినా ఇది ఎవరు రాస్తున్నారో, ఎందుకు రాస్తున్నారో , దాని వెనకున్న మతలబు ఏమిటో నాకు అర్ధం అయ్యేది కాదు. కొన్ని సార్లు టెంప్ట్ అయ్యా కూడా. ఆ తరువాత ఓ రోజు దానిగురించి బా.......గా  అర్ధం అయింది..


2007 ఆఖరులో అనుకుంటా ..ఒకరోజు పొద్దున్నే టి వి లో టెస్ట్ క్రికెట్ చూస్తూ బిజీ బిజీ గా ల్యాబ్ లో వర్క్ చేసుకుంటున్నా (అప్పట్లో ఎకానమీ బావుండి .. కాస్త వాళ్ళు బలసి .. ల్యాబ్ లో రెండు టి వి పెట్టిన్చాం లెండి  .. క్రికెట్ కోసం ) ..  నా పక్క క్యూబికల్ లో కూర్చునే బెంగాలి రాజేష్ గాడు వచ్చాడు.. ఎందుకో కాస్తా కంగారు గా వున్నాడు మనిషి .. మళ్ళి మా తిక్క బాస్ ఏమయినా అన్నాడా అని  ఎంక్వయిరీ చేస్తున్నా.. ( అలాంటి న్యూస్ లు కాస్తా ఎక్కువ ఇంటెరెస్టింగ్ గా వుంటాయి కదా :-) )


వాడు ఏడుపు మొహం వేసుకుని  ...వాడి బ్యాంకు అక్కౌంట్ లోనుండి ఎవడో వీడికి తెలీకుండా డబ్బు transfer చేసేసుకున్నాడని చెప్పాడు.  నాకేమీ అర్ధం కాలేదు..

 " ఎంత ?" అని అడిగా
" 97,000"
" ఎప్పుడు ?"
" మూడువారాల క్రితం వెయ్యి, రెండువారాల క్రితం  48 వేలు , నిన్నో 48 వేలు " అని చెప్పాడు.

అప్పటికి వాడు మా కంపనీలో జాయిన్ అయ్యి రెండునెలలు అయ్యింది. వాడు నాకు 2002 నుండి తెలుసు .మేమిద్దరం అంతకు ముందు కంపెనీలో కొలీగ్స్.. నేను ఆ కంపనీ నుండి మారినప్పుడు , వాడు IISC లో PHD కి వెళ్ళాడు.. PHD అయ్యాక వాడిని పట్టుబట్టి మా కంపనీ కి లాక్కోచ్చా ..

ముందు బ్యాంకు కి ఫోన్ చేసి విషయం చెప్పి ఎకౌంటు బ్లాక్ చెయ్యమని చెప్పాం ...ఆ తరువాత ఈ ఇంసిడెంట్ గురించి మా మేనేజర్ కి, హెచ్ ఆర్ కి మెయిల్స్ ఫోన్ చేసి చెప్పాం.. తరువాత కంపెనీ మెయిన్ హెచ్ ఆర్ మేనేజర్ ద్వారా  బ్యాంకు కి ఫోన్ చేయించాం ..వాళ్ళు మొదట మమ్మల్ని బెంగళూరు - కమర్షియల్ స్ట్రీట్ లో వున్న సైబర్ క్రైం  పోలీసు స్టేషన్ లో కంప్లైంట్  ఇవ్వమన్నారు..( ఛ.. టి వి 9 కి ఫోన్ చెయ్యాలని అప్పుడు తట్టలేదు.. )... మిగతా కొలీగ్స్ అందరూ  దైర్యం చెబుతున్నారు..

మద్యాహ్నానికి  పోలీసులు మరియు బ్యాంకు వాళ్ళు ఆఫీసు కి వచ్చి రాజేష్ ని ఏవో అడుగుతున్నారు.. ఎకౌంటు ఎప్పుడు ఓపెన్ చేసారు, మీ బ్యాంకు ఇన్ఫర్మేషన్ ( లాగిన్ , పాస్ వర్డ్  గట్రా ) ఇంకా ఎవరితో షేర్ చేసారు, మీరు ఎక్కడెక్కడ  ఈ ఎకౌంటు ఓపెన్ చేస్తారు , నెట్ సెంటర్లో ఎప్పుడయినా బ్యాంకు ఆన్ లైన్ ఎకౌంటు వెబ్సైటు ఓపెన్ చేసి చూసారా అంటూ ప్రశ్న మీద ప్రశ్నలేస్తున్నారు.. వీడు ఎకౌంటు ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలిసే అవకాసం లేదని చెబుతున్నాడు.. వాళ్ళు ఆ తరువాత 'ఆన్ లైన్ ఎకౌంటు వెబ్సైటు ఓపెన్ చేస్తున్నప్పుడు ఎవరయినా తొంగి చూసే ఆవకాశం ఉందా' అని అడిగారు.. ఆ ఆవకాశం వున్నది పక్కసీట్లో కూర్చునే నాకొక్కడికే.. పాపం ఏం చెప్పాలా అని వాడు సంశైస్తుంటే వాళ్ళే అడిగారు ఆ సీట్లో ఎవరు కూర్చుంటారు అని.. అప్పటివరకు మంచి detective సినిమా లైవ్ లో చూస్తున్న నాకు కొద్ది కంగారు పుట్టింది.. ఆ తరువాత ప్రశ్నలు నాకు మొదలయ్యాయి.. నా బాక్గ్రౌండ్ గురించి .. ఈలోపు నా బుర్ర లో 1000 వాట్స్ ఫ్లడ్ లైట్  ఒకటి వెలిగి .. " ముందసలు  మీరు ఆ ఎకౌంటు నెంబర్ ని ట్రేస్ చేయ్యోచు కదా అని అడిగా " .. పక్కన వున్న కానిస్టేబుల్ అడిగినదానికి మాత్రం సమాదానం చెప్పమని మర్యాద గా చెప్పేసరికి :(((...
ఒక గంట నన్ను తిన్నాక ( ఆ గంట లో పదిహేను నిముషాలు నన్ను ప్రశ్నలు అడిగాడు.. నలబై ఐదు నిముషాలు అన్యాయం గా పక్కన నుంచో పెట్టి ఫోన్లో మాట్లాడుకున్నాడు .. ) మనకంత టాలెంట్ లేదని వదిలేసాడు..

ఈ లోపు బాంక్ వాళ్ళు ఆ ఎకౌంటు ట్రేస్ చేసి ..అది ఢిల్లీ లో వున్న ఒక stundent ది అని కనుక్కొన్నారు.. ఆ స్టూడెంట్ ని ఢిల్లీ బ్రాంచ్ కి పిలిచి ఆరాతీస్తే , వాడు తనకేమి తెలీదని.. ఎవరో తమ డబ్బులు వేరే దేశం నుండి ట్రన్స్ఫెర్ చేస్తాం.. నువ్వు ATM లో డ్రా చేసి కాష్ ఇస్తే 10 % ఇస్తామన్నారని.. అలాగే ట్రన్స్ఫెర్ చేసిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ATM  lo draw చేసి  ఇచ్చేసానని  చెప్పాడు .. అప్పుడు బాంక్ వాళ్ళకి విషయం అర్ధం అయ్యింది.. ఆ తరువాత రాజేష్ ని అడిగారు .. తనకి బ్యాంకు నుండి ఏమయినా మెయిల్ వచ్చిందా అని.. వాడు పాత మెయిల్స్ అన్ని వెతికితే వాడి ఎకౌంటు update చెయ్యమని బ్యాంకు మెయిల్ ఒకటి దొరికింది..ఆ తరువాత మొత్తం plot గురించి వివరించి చెప్పారు..

ఈ fraud అంతా చేస్తున్నది నైజీరియా దేశ్శస్తులే .. మొదటగా  పైన చెప్పినట్టు నైజీరియా మెయిల్ పంపిస్తారు.. ముఖ్యం గా అమాయకులయిన stundents ని టార్గెట్ చేస్తారు... ఎవరిదగ్గరనుంది ఆయినా రెస్పాన్స్ వస్తే .. వాళ్లతో తరువాత ఫోన్ లో మాట్లాడతారు.. "మేమే ట్రన్స్ఫెర్ చేసుకుంటాం.. అది కాష్ చేసి ఇవ్వు చాలు" అంటారు.. ఈ బ్యాంకు ఎకౌంటు వున్న వాళ్ళకి ..దాంట్లో తప్పేమీ కనిపించదు.. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తున్నాం కదా అని కన్విన్స్ అవుతారు.. అలా కొన్ని ఎకౌంటులు రెడీగా పెట్టుకుంటారు ..

మరో పక్క వివిధ బ్యాంకు లో ఎవరయితే కొత్తగా ఎకౌంటు ఓపెన్ చేసారో ఆరా తీసి , వాళ్ళ మెయిల్ ID లు సంపాదిస్తారు.. వాళ్ళ డేటా చూస్తే బ్యాంకు లో పనిచేసే కొంతమందికి  కూడా ఇందులో హ్యాండ్ ఉందేమో అని పిస్తుంది..ఆ తరువాత వాళ్ళు ఈ కొత్త ఎకౌంటు హోల్దేర్స్ కి ఒక మెయిల్ పంపిస్తారు.."ఫలానా తేదీన మీరు ఓపెన్ చేసిన ఆన్ లైన్  ఎకౌంటు లో ఏదో ప్రాబ్లం వుంది.. లాగిన్ అయ్యి కరెక్ట్ డేటా  update చెయ్యండి  అని  ఆ kinda ఒక లింక్ ఇస్తారు.. ఆ లింక్ లో కి వెళ్లి మీ డేట్ అఫ్ బర్త్( అలాంటివి ఏవో)  details మళ్ళి update చెయ్యమని  .. ఆ మెయిల్ బ్యాంకు నుండి వచ్చినట్టే వుంటుంది..( కరెక్ట్ బ్యాంకు xxx@icicibank .com  అనుకోండి వీళ్ళు xxx@icici .com నుండి పంపిస్తారన్నమాట )... ఆ  లింక్ క్లిక్ చేస్తే అచ్చు బ్యాంకు ఒరిజినల్ వెబ్సైటు లానే వుంటుంది కానీ అది వాళ్ళ ఫేక్  వెబ్సైటు.. మనం లాగిన్ ID , పాస్ వర్డ్ ఇచ్చాక ..వెబ్సైటు ప్రాబ్లం వుంది కాసేపాగి ట్రై చెయ్యమంటుంది.. ఇలాంటివే ఏవో కారణాలు చెబుతుంది   .. సో అలా  మనం ఆ ఫేక్ వెబ్సైటు లో ఎంటర్ చేసిన లాగిన్ పాస్ వర్డ్ వాళ్లకి తేలిపోతుంది.. దాంట్లోంచి ఆ పైన చెప్పిన స్టూడెంట్ ఎకౌంటు లోకి మొదట కొంత అమౌంట్ ట్రాన్స్ఫేర్ చేసి చూస్తారు.. మనం నోటీసు చెయ్యట్లేదు అని వాళ్ళు నమ్మాక  భారి మొత్తాలు ట్రన్స్ఫెర్ చేస్తూ వుంటారు.. అవి సాధారణం గా రౌండ్ ఫిగర్స్ కాకుండా  1000 డాలర్స్  , 2000 డాలర్స్ equivalent గా  వుంటాయి.. ఆ stundent కి ఆ డబ్బు వేరే దేశం నుండి వస్తుందని నమ్మించేందుకు.. ఇదన్న మాట వాళ్ళ   modus operandi ..

సో బ్యాంకు వాళ్ళు చల్లగా చెప్పారు.. ఆ డబ్బు స్టూడెంట్ నుండి ఆల్రెడీ నైజీరియా వాళ్ళు కల్లెక్ట్  చేసుకుని పట్టుకు పోయారు కాబట్టి ఇంకేమి చెయ్యలేము అని..  పాపం రాజేష్..

దీనికి 419 fraud అని వాడుకలో వున్న పేరు..

సో .. ఫ్రెండ్స్.. మీకు బ్యాంకు నుండి (బ్యాంకు లాంటి వాటినుండి ) ఇలా ఎకౌంటు update చెయ్యమని మెయిల్స్ ఏవయినా వస్తే జాగ్రత్త..  మీకు  genuine అనిపించినా దాంట్లో ఇచ్చిన లింక్ క్లిక్ చెయ్యొద్దు.. ఎప్పుడూ ఓపెన్ చేసే వెబ్సైటు ఓపెన్ చెయ్యండి.. మీరు లాగిన్ ఎంటర్ చేసే పేజి secure (https ) అని సరి చూసుకోండి.. బ్యాంకు నుండి ఆయినా  ఎవరయినా కాల్ చేసి ఎకౌంటు details అడిగితె చెప్పకండి..

ఈ మద్య ఇంకో fraud వచ్చిందట.. ఏవో చిన్న చిన్న క్విజ్ లు పెట్టి దానికి కరెక్ట్ సమాదానం చెబితే బోల్డు బహుమతుల్ని నమ్మబలికి ..ముందు వెబ్ లో రిజిస్ట్రేషన్ చెయ్యమంటారు.. దాంట్లో మాములుగా బ్యాంకు వాళ్ళు లేక మెయిల్ వాళ్ళు పాస్ వర్డ్ మర్చిపోతే reset చెయ్యడానికి అడిగే కామన్ ప్రశ్నలు వుంటాయి.. 'మీ మెయిల్ ఇద' 'మదర్ maiden name' 'date of బర్త్', 'place of బర్త్', 'first pet నేమ్', first teacher, spouce name, first lover name ,  మన్ను మశానం..వగయిరా డిటైల్స్ ' ఆ రిజిస్ట్రేషన్ అయ్యాక .. మీకో సింపుల్ సింపుల్ క్విజ్ ఇచ్చి.. గెలిచారని చెప్పి మీ బ్యాంకు ఎకౌంటు నెంబర్ చెప్పండి డబ్బులు ట్రన్స్ఫెర్ చేస్తామని చెబుతారు.. మీరు ఇచ్చిన బ్యాంకు మరియు పర్సనల్ డిటైల్స్ తో బ్యాంకు ఎకౌంటు పాస్ వర్డ్ reset చేసి.. మీ డబ్బు దోచుకుంటారు.. ఎవరో చెప్పినట్టు.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పెళ్ళాం అవుతుంది.. పెళ్లి చేసుకోలేక పొతే పాస్ వర్డ్ అవుతుందని.. నాకు తెలిసి చాలామందికి లవర్ పేరే పాస్ వర్డ్ గా వుంటుంది.. ఎవడయినా నెంబర్ వుండాలి అంతే ఆ పేరు కి పక్కన '1' లేక '123 ' ..ఇంకా కసి వుంటే '143 ' నో జత చేసి పాస్ వర్డ్ కింద పెట్టేస్తుంటారు.. సో పాస్ వర్డ్ లు జాగ్రత్త.. నా ఉచిత సలహా ...గర్ల్ ఫ్రెండ్స్ పేరు కాకుండా వాళ్లకి సిస్టర్స్ ఎవరయినా వుంటే వాళ్ళ పేర్లు పెట్టుకోండి..:-)

వాళ్లకి ఈ fraud ఐడియాలు ఎలా తడతాయి అని నాకు చాలా ఆశ్చర్యం.. ఇలాంటి  ఒక్క  ఐడియా నాకు తడితే బాగుండును.. లైఫ్ సెటిల్ అయిపోతుంది.. (నాది కాక ..నాకు తెలిసిన ఇంకో బ్యాంకు ఎకౌంటు నెంబర్ ఒకటే..సో నేను ముందు అదే  ట్రై చేస్తా.. మీకు ఆ నెంబర్ కావాలా ..అయితే ఇక్కడ వెతుక్కోండి.   )

- మంచుపల్లకీ