Pages

Thursday, March 29, 2012

తిండి గొడవలు (Part 3 of 4) - ఏంటి నాన్ వెజిటేరియన్ తో సమస్య ?

*** శ్రీ రామ ***
ఈ సీరిస్ మొదటి భాగంలో పాల ఉత్పత్తి కోసం పెంచే జంతువుల మీద జరిగే హింస గురించి కొంచెం తెలుసుకున్నాం కదా. ఇంచుమించు లేక ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ హింస, క్రూరత్వం మాంసఉత్పత్తి కోసం జంతువుల్ని పెంచే పద్ధతుల్లో కూడా అనేకం ఉన్నాయి. అధిక ఉత్పత్తి కోసం అయితేనేమీ, ఎక్కువ రుచి కోసం అయితేనేమీ జంతువులను పెంచే క్రమంలో ఎన్నో అనైతికమైన, దారుణమైన విధానాలు అవలంబించడం చాలా చోట్ల జరుగుతున్నది. దురదృష్టవశాత్తూ ఈ పద్ధతులలో చాలామటుకు చట్టపరంగా అమోదయోగ్యమయినవే. ఇప్పుడు ఇలాంటి ఉదాహరణలు కొన్ని చూద్దాం.వీల్ (Veal) అని పాశ్చాత్యదేశాల్లో ముఖ్యంగా ఇటలీలో అమితంగా ఇష్టపడే ఖరీదయిన మాంసాహారం ఒకటి ఉంటుంది. వీల్ అంటే ఆవుమాంసం. అయితే మామూలు బీఫ్ లా కాకుండా కేవలం కొన్ని నెలల వయసున్న చిన్న చిన్న లేగదూడలను చంపుతారు. అలా చంపే లేగదూడలు పాల ఉత్పత్తికి పనికిరావు అని తీసేసిన మగవి. ఇలా చేయడం చాలా దేశాల్లో చట్టబద్ధం. ప్రాణం తియ్యడం అన్నాక వయసు ఎంత అయితే ఏంటి అన్నది ఒకవైపు వాదన. వాటి జనాభా లెక్కల ప్రకారం చూస్తే నిజమేనేమో కానీ చిన్న చిన్న ఆవు దూడలను చంపడం ఎందుకో మరింత అనాగరికంగా అనిపిస్తుంది. నేను మొదటి పోస్ట్ లో ప్రస్తావించినట్టు వీటి ప్రేవులనుండే చీజ్ తయారి లో ఉపయోగించే రేన్నేట్ ఎంజైమ్ సేకరిస్తారు.
ఫొ గ్రా (Foie Gras) అన్నది బాతు లివర్ తో చేసే ఒక రకమైన ఫ్రెంచ్ వంట. అయితే ఆ లివర్ ఎంత ఎక్కువ కొవ్వుపట్టి ఉంటే అంత రుచి (అంత ఖరీదు కూడా). అందువల్ల వాటి లివర్ కి బాగా కొవ్వు పట్టడానికి ఆ బాతులకి బాగా తిండి తినిపిస్తారు. బాతులు మాత్రం వాటి పొట్ట నిండాక ఇంక తినవు కదా.. అందుకని వాటిని పట్టుకుని బలవంతంగా నోరు తెరిచి ఒక పైపు దాని పొట్టలోకి పెట్టి మెషిన్ తో ఆ ఆహారాన్ని సరాసరి కడుపులోకి పంప్ చేస్తారు. ఈ పద్ధతి ఫ్రాన్స్ లో వందల సంవత్సరాల నుండి ఉన్నదే. అమెరికాలో ఫొ గ్రా (Foie Gras) తినడం, అమ్మడం బ్యాన్ చెయ్యమని అప్పుడప్పుడూ కొంతమంది జంతు ప్రేమికులు ధర్నాలు చెయ్యడం కనిపిస్తూ ఉంటుంది.
అలాగే చికెన్లో thigh meat తో పోల్చి చూస్తే breast meat కి అమెరికాలో డిమాండ్ ఎక్కువ. అందుకోసం ఇక్కడి వాళ్ళు ఏం చేస్తారంటే వాటి జీన్స్‌ని మార్పు చేసి, కోడిలో బ్రెస్ట్ పార్ట్ మాములుకన్నా ఎక్కువ పెరిగేలా చేస్తారు. అయితే పైన ఉన్న బ్రెస్ట్ పార్ట్ బరువుకీ, కింద కాళ్ళకి ఉన్న స్టామినాకీ మ్యాచ్ అవక.. అంటే ఆ అధిక బరువుని చిన్న కాళ్ళు మొయ్యలేక అవి లేచి రెండు మూడు అడుగులు కూడా వెయ్యలేవు. ఎప్పుడు కూర్చునే ఉంటాయి.


కోళ్లలో గుడ్ల ఉత్పత్తి పెంచడానికి "forced molting " అనే పద్ధతి ఒకటి ఉంటుంది. అదేంటంటే కోళ్ళు ఒకసారి గుడ్లు పెట్టే దశ దాటాక, వాటికి తిండి పెట్టకుండా ఒక రెండు వారాలు వాటి కడుపు పూర్తిగా మాడుస్తారు. అవి ఆకలితో ఒక రెండు వారాలు అలమటించాక తరువాత వాటికి మళ్ళీ ఫుల్ గా తిండి పెడతారు. ఇలా చెయ్యడం వల్ల అవి మళ్ళీ మరోసారి గుడ్లు పెట్టడమే కాకుండా గుడ్ల నాణ్యత కూడా పెరుగుతుందట.


ఇక ఇండియాలో పంది చంపడానికి మెడ లావుగా ఉండటం వల్ల కొయ్యడం కష్టమని దాన్ని చంపడానికి బ్రతికున్న పందిని డైరెక్ట్ గా మంటల్లో వేస్తే... అమెరికా లో lobster ని బ్రతికి ఉన్నదాన్ని డైరెక్ట్ గా మరుగుతున్న నీళ్ళలో వేస్తారు.   థాయిలాండ్ లో పబ్లిక్ గా బలుట్ (సగం ఎగ్ సగం ఎంబ్రియో) తింటే బెంగళూరులో ఇంతకన్నా ఘోరమయినది కాస్త సీక్రెట్ గా తింటారు. ఇలా చెప్పుకుంటూ పొతే పబ్లిక్ గా కొన్ని , సీక్రెట్ గా కొన్ని ఇలాంటివి ఎన్నెన్నో. 


ఇలా అధిక ఉత్పత్తి కోసం, రుచి కోసం అంటే సింపుల్ గా జంతువులని పెంచే యజమానుల లాభం కోసం అనేక క్రూరమయిన పద్ధతులు చాలా సాధారణంగా చలామణీ అయిపోతూ ఉంటాయి. అయితే వీటిల్లో కొన్ని ఎప్పటినుండో మన కల్చర్ లో ఇమిడిపోయి ఉన్నవి అయితే కొన్ని కార్పోరేట్ కంపెనీలు కొత్తగా కనిపెట్టినవి. అమెరికాలోని 80 % మీట్ ఇండస్ట్రి టైసన్ లాంటి మూడు నాలుగు కంపెనీల చేతుల్లో ఉందంటే మనం ఊహించవచ్చు ఆ మూడు కార్పొరేట్లు ఎంత పలుకుబడి కలిగి ఉంటాయో... వీళ్ళు అమెరికాలోని కొన్ని university లకు ఫండింగ్ ఇచ్చి.. అక్కడ జరిగే రిసెర్చ్ లో తమకు అనుగుణం గా రిజల్స్ వచ్చేలా ప్రభావితం చేస్తారని కొందరు చెవులు కోరుక్కుంటారు.

వాటిని పెంచే విధానాల్లో అనుసరించే అనైతిక పద్ధతులు పక్కన పెడితే మన భారతదేశం లాంటి అధిక జనసాంద్రత కలిగిన దేశాలు గమనించాల్సిన అంశం ఇంకోటి ఉంది.

ఎకోలజికల్ పిరమిడ్
అసలు ఏ ప్రాణి అయినా తిండి తినడానికి కారణం... తను జీవించడానికి కావాల్సిన శక్తి కోసం. అసలు ప్రపంచంలో జరిగే ప్రతి పనికి ఎంతో కొంత శక్తి అవసరం అవుతూ ఉంటుంది. శక్తి ఖర్చు పెట్టకుండా ఏ పని జరగదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తే, ప్రకృతిలోని శక్తి ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి ఎలా చేరవేయబడుతోందో చూడొచ్చు. 
ఉదాహరణకి పక్కనున్న పిరమిడ్ బొమ్మని చూడండి.
దాంట్లో కింద వరుసలో గడ్డి ఉంది. గడ్డి పెరగడానికి కావాల్సిన శక్తి ఎక్కడ నుండి వస్తుంది? సూర్యుడు నుండి. సూర్యరశ్మి ద్వారా లభించే శక్తిని గ్రహించి ఆహారం తయారు చేసుకోవడం ద్వారా గడ్డి పెరుగుతుంది. ఇప్పుడు రెండో వరుసలో ఉన్న గొల్లభామలను చూస్తే అవి బ్రతకడానికి కావాల్సిన శక్తి అవి ఆ గడ్డిని తినడం ద్వారా పొందుతాయి.  అలా మూడో మెట్టులో ఉన్న కప్పలు ఆ గొల్లభామలను తినడం ద్వారా శక్తిని పొందితే, నాలుగో మెట్టులో ఉన్న గ్రద్ద కప్పలను తినడం ద్వారా పొందుతాయి. ఆ తరువాత ఆ గ్రద్ద చనిపోయినప్పుడు భూమిలో కలిస్తే అక్కడుండే బ్యాక్టీరియా ఆ గ్రద్ద కళేబరం తిని బ్రతుకుతాయి అనుకోండి. ఇది ప్రకృతిలో సహజంగా అమలు జరుగుతుండే ఫుడ్ చైన్. ప్రకృతిలోని ప్రతీ జంతువూ ఖచ్చితం గా ఈ ఫుడ్ చైన్ లో ఏదో ఒక స్థాయిలో భాగమై ఉంటుంది. అయితే ఇలా ఒక ప్రాణి నుండి ఒక ప్రాణి కి శక్తి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కింద మెట్టులొ మొక్కల దగ్గర ఉత్పన్నమయిన శక్తి మొత్తం పై మెట్టు లొ ఉన్న గ్రద్దవరకూ చేరదు. ఈ ఫుడ్ చైన్ లొ ఉన్న ప్రాణులన్ని కొంత శక్తి ఖర్చుపెడతాయి  కాబట్టి కొంత శక్తి మద్య లొ నస్టం పొయి కొంతే పైకి చేరుతుంది. ఒక లేయర్ నుండి ఆ పై లేయర్ చేరేటపుడల్లా కొంచెం శక్తి నస్టపొతున్నాం అనుకుంటే శక్తిని తయారు చేస్తే మొక్కలు లేక జంతువు ఉన్న లేయర్ నుండి దానికి ఉపయోగించుకునే లేయర్ ఉన్న జంతువు వరకూ మద్యలొ ఎన్ని జంతువులు (లేయర్స్) ఉంటే అంత శక్తి నస్టపొతాం అన్నమాట. 
ఇప్పుడు కొన్ని సింపుల్ లెక్కల సహాయంతో మనుష్యుల ఉదాహరణ చూద్దాం.
మొదటి వరుసలో మొక్కజొన్న, రెండో వరుసలో కోళ్ళు, మూడో వరుసలో మనుషులు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే.. ఒక ఎకరం పొలంలో పండించిన మొక్కజొన్న డైరెక్ట్ గా మనుషులు తింటే అది ఒక 1000 మందికి సరిపోతుంది అనుకుంటే, అదే ఎకరం మొక్కజొన్న పంట ముందు రెండో వరుసలో ఉన్న కోళ్ళకు తినిపించి ఆ కోళ్ళను మనుషులు తింటే అది కేవలం 500 మందికి మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే మొక్కలు ఉన్న లేయర్ కి మనిషి ఉన్న లేయర్ కి మద్య లో కోడి ఉన్న లేయేర్ ఉంది కాబట్టి కొంత శక్తి అక్కడ నష్టపోతున్నాం. అంటే ఆహార ధాన్యాలు పండించే వనరులు పరిమితంగా ఉన్న మనలాంటి దేశంలో ఈ పాయింట్ చాలా ముఖ్యమయినది. ఉన్న పంటపొలంలో జంతువులు తినే పశుగ్రాసం పెంచి అవి తిని పెరిగిన జంతువులను మనం తినడం కన్నా ఉన్న ఆ పంటపొలంలో నేరుగా మనం తినే వాటినే పండించడం వల్ల మనకి ఆహార ధాన్యాల కొరత రాకుండా నివారించవచ్చు. అసలే మన దేశం లో జనాభా పెరిగినంత వేగం గా ఆహారధాన్యాల ఉత్పత్తి రేటు పెరగడం లేదు. ఈ కారణం వల్లనే అధిక జనాభా ఉన్న ఇండియా, చైనా లాంటి దేశాల ప్రజలు ఎక్కువ మాంసాహారం వైపు మళ్ళితే దాని ప్రభావం మిగతా ప్రపంచం మీద తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా శాకాహారానికి మాంసాహారంతో పోలిస్తే అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి.  కొలెస్టరాల్ వల్ల వచ్చే గుండె సంబంధిత సమస్యలు, కాన్సర్ లాంటి జబ్బులు రాకుండా నివారించడానికి మాంసాహారం కన్నా శాకాహారం తినడం మేలైనది అని అందరికీ తెల్సినదే. వేగన్స్ లా పూర్తిస్థాయి ప్లాంట్ బేస్డ్ ఆహారం తింటే కొన్ని రకాల డెఫిషియన్సీలు ఎదురయ్యే సమస్య ఉంది కానీ మన భారతీయుల శాకాహార నిర్వచనం ప్రకారం తింటే అంటే లాక్టోవెజిటేరియనిజం వల్ల ఒక గొప్ప అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే, మాంసాహారం తినకపోవడం వల్ల శాకాహారంలో లభ్యం కానీ కొన్ని పోషకాలు అంటే ప్రోటీన్లు, B12 లాంటి విటమిన్లు పాలు, పాల ఉత్పత్తుల నుండి పొందవచ్చు. అందువల్ల భారతీయ శాకాహారులగా ఉండటంవల్ల కోల్పోయే పోషకపదార్ధాలు అంటూ పెద్దగా ఏం ఉండవు.
మాంసాహార ఉత్పత్తి పరిశ్రమలు అవలంబిస్తున్న ఈ బ్యాడ్ ప్రాక్టీసస్ కి ఈ నాన్వెజిటేరియన్లు ఎంతవరకూ బాధ్యులు ? మాంసాహారం తినేవాళ్ళు ప్రత్యక్షంగా చేసే ఘోరాలు ఏం లేకపోయినా, ఆయా ఉత్పత్తులు తినడం ద్వారా పరోక్షంగా ఈ అనైతిక పద్ధతులను అవలంబించేవారిని ప్రోత్సహించినట్టే అవుతుందా ? ఎక్కువమంది మాంసాహారం వైపు మొగ్గుచూపడం వల్ల పైన ఎకొలాజికల్ పిరమిడ్ పేరాలో చెప్పినట్టు లిమిటెడ్ వనరులున్న మన లాంటి దేశంలో ఆహారకొరతకి పరోక్షంగా కారణం అవుతున్నారా?


 - మంచు

తిండి గొడవలు (Part 2 of 4) - మతం చెప్పిందే వేదమా ?

*** శ్రీ రామ ***
ఒకసారి నా కొలీగ్ ఒకడు భారతీయ హిందువుల్లో అధిక శాతం శాకాహారులే ఎందుకు ఉంటారు, మాంసాహారం తినే కొద్దిమంది హిందువులు కూడా బీఫ్ (ఆవు)ని ఎందుకు తినరు అని అడిగాడు. అతను అన్నట్టు హిందువుల్లో మెజారిటీ శాకాహారులు అన్నది తప్పేమో కానీ మాంసాహారం తినేవాళ్ళలో మాత్రం చాలామంది బీఫ్ తినడానికి ఇష్టపడరనేది నిజమే కదా.

అసలు ఒక మనిషి శాకాహారిగా లేక మాంసాహారిగా బ్రతకాలని ఎప్పుడు ఎవరు నిర్ణయిస్తారు అన్నది ఒకసారి చూస్తే, 99 శాతం కేసుల్లో అది వారు పుట్టిన కుటుంబ నేపథ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మనిషి శాకాహారుల ఇంట్లో పుడితే శాకాహారి, లేకపోతే మాంసాహారి అవుతాడు. అంతే కానీ తనకు తాను ఇష్టపడి కోరి తన ఆహారపు అలవాట్లు మార్చుకున్న సందర్భాలు తక్కువే ఉంటాయి. కొంతమంది మాంసాహారులు ఆరోగ్యపరమయిన కారణాల వల్ల అయితేనేమి, వేగన్స్ లా మిగతా జంతుజాలం పట్ల ఉన్న కన్సర్న్ వల్ల అయితేనేమి , లేక జీవిత భాగస్వామి వెజ్ అవడం వల్ల లేక సింపుల్ గా తినడం సహించక శాకాహారులుగా మారడం ఈ మధ్య కొంచెం తరచుగానే చూస్తున్నాం కానీ చిన్నప్పటినుండి శాకాహారుల ఇంట్లో పుట్టి పెరిగి కాలేజికి వెళ్ళాకో లేక పరాయి దేశం వెళ్ళాకో లేక నాన్ వెజ్ జీవిత భాగస్వామి వల్లొ మాంసాహారులగా మారడం మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవాలి.

మనిషి ఆహారపు అలవాట్ల మీద తను నమ్మే మతం యొక్క ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి హిందువుల్లో అధికశాతం శాకాహారులుగా జీవించడానికి మతం (కొన్ని కులాల వారికే అనుకోండి) ముఖ్య కారణం ఇంకా చెప్పాలంటే ఏకైక కారణం. అలాగే మాంసాహారం తినే హిందువుల్లో కూడా చాలామంది బీఫ్ తినకపోవడానికి కూడా "ఆవు మనకి చాలా పవిత్రమయిన జంతువు, గోహత్య మహాపాతకం " అన్న మతపరమయిన నమ్మకం కూడా ఒక కారణం. హిందువుల్లో కూడా ఒకానొక సమయంలో మాంసాహారం  (ఆవుమాంసంతో) సహా తినేవారు అని చాలా మంది వినేవుంటారు. అలాగే చాలా తెగలలో లానే జంతు బలులు కు  హిందూమతం వ్యతిరేకం కాదు. పూర్వాకాలంలో యజ్ఞయాగాదులు నిర్వహించినప్పుడు చివర్లో జంతువులని బలి ఇచ్చి ఆ మాంసాన్ని పంక్తి లో అందరితో కలసి భుజించేవారని కూడా వినే ఉంటారు. మరి అలాంటిది ఎప్పుడు కొంతమంది హిందువులు ఇలా పూర్తి స్థాయి శాకాహారానికి మారిపోయారు అన్న ప్రశ్న రావచ్చు. అలాగే సడన్ గా "గోహత్య మహాపాతకం" అన్న కాన్సెప్ట్ ఎందుకు పుట్టింది అని. 

ఆహారపుటలవాట్లకి సంబంధించిన విషయాల్లో ఉండే ప్రతీ మతపరమయిన ఆంక్షల వెనుక సమాజానికి మంచి చేసే (కనీసం అప్పటి పరిస్థితులకి సరి అయినది) అంశం ఉంటుంది అని నా నమ్మకం. అసలు ఆహారపు అలవాట్లనే కాదు మతపరమయిన ఏ నియమనిభందనల వెనుకయినా సాంఘీక సంక్షేమమో , ప్రకృతి రక్షణొ లేక బలమైన వర్గాలకి చెందినవారికి లాభం కలిగించే స్వార్ధపరమయిన కుట్రొ .... ఇలాంటి కారణం ఏదో ఒకటి ఖచ్చితం గా ఉంటుంది కానీ కేవలం దేవుడికి ఇది ఇష్టం ఉంటుంది అని ర్యాండం గా ఊహించి అయితే మాత్రం ఉండదు అని నా అభిప్రాయం.

ఇంకో రకంగా చెప్పాలంటే సమాజంలో ఎక్కువమంది దేవుడిని నమ్మేవారు ఉంటారు కాబట్టి ఏదయినా ఒక నియమం అందరూ పాటించేలా చెయ్యాలంటే దానికి మతపరమయిన లంకె ఒకటి అటాచ్ చేస్తే బాగా వర్కవుట్ అవుతుంది అన్నమాట. హిందూ మతమనే కాదు ప్రతీ మతంలో తాము తినే ఆహారానికి సంబంధించి కొన్ని నియమనిబంధనలు ఉంటాయి.

ఉదాహరణకి కొంతమంది క్రైస్తవులు శుక్రవారం కేవలం చేపలు మాత్రమే తింటారు. పూర్వాకాలంలో ఒకానొకప్పుడు ప్రజలందరూ రెడ్ మీట్ (బీఫ్ లాంటివి) తినడానికి బాగా అలవాటు పడి చేపలు తినడం బాగా తగ్గించేసారట. అదే జీవనాధారంగా బ్రతుకుతున్న మత్స్యకారుల సంపాదన తగ్గి జీవనం కష్టం అవడంతో వాళ్ళు వెళ్ళి అప్పటి మతాధికారులకి మొరపెట్టుకున్నారట. వీళ్ళను ఆదుకోవాలంటే ప్రజల చేత కనీసం అప్పుడప్పుడు అయినా చేపలు తినేలా చెయ్యాలి. మరి రుచికరమయిన రెడ్ మీట్ వదిలేసి చేపలు తినమని చెప్తే ఎవరు తింటారు. అప్పుడు పుట్టిందే ఈ శుక్రవారం చేపల రూల్ అన్నమాట. వారంలో మనం చేసే పాపాలు తొలగిపోయి పరిశుద్ధంగా ఉండాలి అంటే వారంలో ఒక రోజు ఉపవాసం చెయ్యాలని, జీసస్ చనిపోయింది శుక్రవారం కాబట్టి ఆ రోజు ఉపవాసం చెయ్యడానికి సరైన రోజు అని మతాధికారులు కొత్త సంగతి చెప్పారన్నమాట. వాళ్ళకి చేపలు మాంసాహారం క్రిందకి రాదు కాబట్టి చేపలు తినడం వారికి ఉపవాసం క్రిందే లెక్క.
పైన చెప్పుకున్నది సంఘంలో ఒక వర్గానికి చెందిన ప్రజలను ఆదుకోవడం కోసం పుట్టిన మతపరమయిన నిబంధన. అలాగే ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆహారపుటలవాట్లలో ఆంక్షలు విధిస్తూ పుట్టిన మతపరమయిన నియమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ముస్లింల హలాల్ పద్ధతి.
ముస్లింలలో వాళ్ళు తినబోయే జంతువులను ఎంచుకోవడానికి, వాటిని చంపే విధానానికి సంభందించి కొన్ని ఖచ్చితమయిన నిబంధనలున్నాయి. ఈ నిబంధల ప్రకారం చంపినవే తినడానికి అర్హత పొందుతాయి (హలాల్) లేకపోతే అవి తినడానికి అనర్హం (హరాం) అన్నమాట. ఈ నియమాలు కొన్ని విశ్లేషిస్తే మనకి వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి   • చంపబోయే జంతువుని (చేప తప్ప) జాగ్రత్తగా పట్టుకుని పక్కకు పడుకోబెట్టి పదునయిన చాకు తీసుకుని దాని jugular veins మాత్రం జాగ్రత్తగా కోసి రక్తం అంతా పోయేవరకు ఉంచి అప్పుడు మిగతా భాగాలు కొయ్యాలి. పైన "జాగ్రత్తగా" పట్టుకుని అని రాసింది వెటకారం కాదు. నిజంగానే చాలా సున్నితంగా హేండిల్ చేస్తారు. రక్తంలో యూరిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి రక్తం ఉన్నమాంసం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆ నిబంధ పెట్టి ఉంటారు అని కొంతమంది నమ్మకం.
  • అలాగే పంది మరియు మాంసాహారం తినే పక్షులు (గ్రద్ద) లాంటివి తినకూడదు అని ఇంకో నిబంధ ఉంది. దీనికి రెండు కారణాలు వాడుక లో ఉన్నాయి. ఒకటి... పైన చెప్పినట్టు ఆ jugular veins మాత్రమే కొయ్యడం పంది యొక్క శరీరాకృతితో కుదరదు (మెడ లావుగా ఉండటం వల్ల). అందువల్ల ముస్లింలలో కొందరు ఏమంటారంటే... "ఈ జంతువు తినొచ్చు అని దేవుడు అనుకుంటే దాని మెడ కూడా మేక, కోడిలా సన్నగా పెట్టకుండా ఇలా లావుగా పెట్టి jugular veins కొయ్యడం కుదరకుండా చెయ్యడు కదా... అందువల్ల మనం తినకూడదు" అని. రెండో కారణం అయితే పంది అపరిశుభ్రమయిన ప్రదేశాల్లో ఎక్కువ నివసిస్తుంది కాబట్టి, పంది మీద చాలా పేరాసైట్స్ నివాసం ఉంటాయి. అందువల్ల పందిని తింటే ఆ పేరాసైట్స్ మనుషులకి రోగకారణం అవుతాయి కాబట్టి పందిని తినకూడదు అని. నాకు కాస్త ప్రాక్టికల్ అనిపించేది రెండో కారణమే.
  • అలాగే ఆల్రెడీ చనిపోయిన జంతువులు తినకూడదు అన్న ఇంకో నియమం ఉంది.  దానికి    "ఆ చనిపోయిన జంతువు ఏ జబ్బుతో చనిపోయిందో తెలీదు కాబట్టి తెలీకుండా తింటే ఆ జబ్బు మనుషులకి అంటుకుంటుంది" అన్న లాజిక్ కనిపిస్తుంది.
  • వేరే జంతువులు వేటాడి కొంచెం తిని వదిలేసిన మాంసం మనం తినకూడదు అన్న ఇంకో నియమం "ఆ వేటాడి తిన్న జంతువుల నోటిలో రేబిస్ లాంటి వైరస్ ఉండి అది తరువాత ఆ మిగులు మాంసం తిన్నవారికి సోకవచ్చు" అన్న కారణంతోనూ, ఇలా హలాల్ లో ప్రతీ నిబంధనకి అనేక రకాల కారణాలు వెతకొచ్చు. 
వాటిలో కొన్ని ఇప్పటి పరిస్థితులకి వర్తించకపోవచ్చు, అసమంజసంగా అనిపించవచ్చు. అన్నీ ఆంక్షలకి సవరణలు ఉన్నట్టు హలాల్ కి కూడా ఒక మినహాయింపు ఉంటుంది. హలాల్ మీట్ దొరక్కపోతే నాన్ హలాల్ మీట్ తినొచ్చు అని ఖురాన్ లోనే రాసి ఉంది. ఇంచుమించు ఇవే కారణాలతో యూదులు పంది, షెల్ ఫిష్ (రొయ్యలు, lobster , పీతలు) లాంటివి తినరు. యూదుల కోషర్ ఫుడ్ మరిన్నిరూల్స్ తో నిండిఉంటుంది.
ఇవన్నీ చూసి నాకేమనిపిస్తుంది అంటే... మన హిందూమతం లో కూడా పూర్వకాలంలో బీఫ్ తిన్నా కూడా తరువాతి కాలంలో ఆవు యొక్క ఉపయోగాలు (పాలు మరియూ పాల ఉత్పత్తులు) దృష్టిలో పెట్టుకుని ఆవుల జాతి అంతరించిపోకుండా కాపాడటానికి, మాంసం కోసం ఆవుల్ని చంపడాన్ని అదుపులో ఉంచడం కోసం మతం పేరుతో ఒక నిభందన పెట్టి ఉంటారు. గోవుకి మన పురాణాల్లో కామధేనువనే స్థానం ఎలాగూ ఉంది కాబట్టి అది ఉపయోగించుకుని రెండూ కలసి వచ్చేలా పెట్టి ఉంటారు. గోహత్య మహాపాతకం, జంతుబలులు , చంపి దేవుడి కి ఆఫర్ చేస్తే తప్పులేదు, అహింస ఇవన్ని అసలు ఎందుకో అతికినట్టు అనిపించవు.పైన చెప్పుకున్న ఉదాహరణలు అన్నీ చూసాక ఏ మతం పెట్టిన నియమనిభందనలు అయినా అవి  అప్పటి ప్రజల ఆరోగ్యాన్ని, సాంఘీకసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టినట్టు అనిపిస్తుంది కాబట్టి ఆహారపు అలవాట్ల విషయంలో మతం చెప్పిందే వేదం అనుకోవచ్చు. కానీ వాటిలో చాలామటుకు అప్పటి అంటే ఆ రూల్స్ పెట్టే సమయానికి ఉన్న పరిస్తితులకి అనుగుణం గా ఏర్పడినవి. అయితే అవన్నీ ఇప్పుటి పరిస్తితులకి వర్తించాలని లేదు. కొన్ని ఆచార వ్యవహారాలు, నమ్మకాలు మారుతున్నకాలంతో పాటు అనేక సవరణలు దిద్దుబాట్ల తో మారుతూ వస్తున్నాయ్, కొన్ని కనుమరుగైపొయాయ్ కూడా . ఈ నమ్మకాలలో కొన్ని ఈనాటి పరిస్థితులకి వర్తించవు అనిపించినప్పుడు ఆయా నిబంధనలను సవరించడం కూడా తప్పు కాదు. ఎందుకంటే, మానవ మనుగడలో 'మార్పు' అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియే. అలా సవరణలు చెయ్యాల్సిన, చేసుకోవాల్సిన అవసరం బాధ్యత అందరిమీదా ఉంటుంది. మన మతంలో ప్రస్తావించారన్న ఏకైక కారణం తో ప్రతీవిషయంలో విచక్షణ లేకుండా గుడ్డిగా అనుసరించాలని లేదు. మతం లో ఉన్న ఏ నియమం అయినా ఒక్కసారి దాని వెనుకున్న లాజికల్ రీజన్ అర్ధం చేసుకుంటే , ఇప్పటి పరిస్తితులలో అది అనుసరించాలో అక్కరలేదో మన కామన్‌సెన్స్ చెప్తుంది. 

- మంచు

Tuesday, March 27, 2012

తిండి గొడవలు (Part 1 of 4) - వెజిటేరియన్స్ నిజంగా జంతు ప్రేమికులా?

*** శ్రీ రామ ***

లాస్ట్ సమ్మర్ లో ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరో పిలిస్తే ఒక బార్బెక్యూ పార్టీకి వెళ్ళాల్సొచ్చింది. అక్కడ కొందరు నేను నాన్‌వెజిటేరియన్ నా లేక ఉత్తి వెజిటేరియన్ నా అని అడగగానే యథావిధిగా కొంచెంసేపు అదోరకమయిన సందిగ్ధావస్థలో పడి తేరుకుని వెజిటేరియన్ అని చెప్పాను. ఇలా అబద్ధం చెప్పడం నాకు కొత్తేమీ కాదనుకోండి. ఓ నాలుగైదు రకాలు తినే కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగినా ఇప్పుడు క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, జల పుష్పాలు, ఉభయచరజీవులు ఇలా నడిచేవి, ఎగిరేవి, పాకేవి, ఈదేవి ఏదయినా పెద్ద అభ్యంతరం లేదు. ఇలా ఏది పడితే అది తినగలిగినా అసలు నేను నాన్‌వెజిటేరియన్ అని పైకి చెప్పడానికి ఎప్పుడూ ఎందుకు ఇలా మోహమాటపడతానో నాకు అర్థం కాదు. ఇలా అనవసరంగా కమిట్ అయిపోయి బోల్డు సార్లు మంచి మంచి డిషెస్ కూడా మిస్ అయిపోతుంటాను. ఒకప్పుడు ఏవో కొన్ని కారణాల వల్ల ఒక నాలుగు సంవత్సరాలు వెజిటేరియన్ గా ఉన్నా ఆ తరువాత నా వల్ల భూమి మీద జీవరాశుల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది అని మళ్ళీ నాన్‌వెజిటేరియన్ గా మారిపోయాను. :-) 

అసలయినా పులులు సింహాల్లా మనుషుల్లో అసలు సిసలు నాన్‌వెజిటేరియన్ అంటూ ఎవరూ ఉండరు. నాన్ వెజిటేరియన్ అని పిలిచేవారంతా Omnivores అన్నమాట. అంటే అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి శాకాహారం లేక మాంసాహారం ఏదయినా తిని బ్రతికే వాళ్ళు.

ఈ వెజిటేరియనిజం అన్నది భలే చిత్రమయిన కాన్సెప్ట్. అంటే వెజిటేరియన్స్ లోనే బోల్డు రకాల వెజిటేరియన్స్ ఉంటారన్నమాట. ఇందులో వేగన్స్ (vegans) అనేవారు నిక్కచ్చైన అసలు సిసలయిన శాకాహారులు. అంటే వీరు కేవలం జంతుమాంసం అనే కాకుండా అసలు జంతువులకి సంబంధించిన ఏ ఆహారాన్నీ తీసుకోరు. పాలు, గుడ్లు, తేనె లాంటి జంతు సంబంధిత ఉత్పత్తులు కూడా వీరికి నిషిద్ధం. అందువల్ల వీరికి వీరు తామే అసలు సిసలయిన వెజిటేరియన్ అని అభివర్ణించుకోవడం పెద్ద అతిశయోక్తి అనిపించదు. వీరి ఫిలాసఫీ ప్రకారం జంతువులకి సంబంధించినవి ఏదయినా కేవలం ఆ జంతువులకే చెందాలి, అవే ఉపయోగించుకోవాలి కానీ అది మనిషి బలవంతంగా తీసుకోవడం వాటి హక్కులని హరించడమే అని వీరి అభిప్రాయం. వీరి దృష్టిలో మన ఆహ్లాదం కోసం జంతువులను పెంచుకోవడం, మన పనులకి వాడుకోవడం ద్వారా వాటి శ్రమ దోపిడీ చెయ్యడం, వాటి చర్మం, ఉన్ని లాంటి వాటితో చేసిన వస్తువులు వాడటం, వైద్య సంబంధమయిన ప్రయోగాలకి వాడటం ఇవన్నీ తప్పే. ఒక్క మాటలో చెప్పాలంటే.. "జంతువుల జోలికి వెళ్ళకుండా వాటి మానాన వాటినలా బ్రతకనివ్వడం" అన్నది వాళ్ళ కాన్సెప్ట్.

ఇక వెజిటేరియన్స్ లో లాక్టో వెజిటేరియన్స్ అనే ఇంకో రకం ఉంటారు. వారు జంతువుల మాంసం అయితే తినరు కానీ పాలు మరియు పాల ఉత్పత్తులు అయిన పెరుగు, వెన్న, నెయ్యి లాంటివి తింటారు. వీరి అభిప్రాయంలో ఒక జంతువు ప్రాణం తియ్యనంత వరకు జంతువులకి సంబంధించినది ఏదయినా తినొచ్చు, వాడుకోవచ్చు. అలాగే ఓవోవెజిటేరియన్స్ అనబడే మరో రకం వెజిటేరియన్స్. వీరు జంతు మాంసం తినరు, పాల ఉత్పత్తులు కూడా తినరు కానీ గుడ్లు మాత్రం తింటారు. ఇంకా చాలా రకాల వెజిటేరియన్స్ ఉంటారు. మళ్ళీ వీటిల్లోనే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి కొందరు ఓవో-లాక్టో వెజిటేరియన్స్ ఉన్నట్టన్నమాట. మన దేశంలో ఉండే వెజిటేరియన్స్ లో మెజారిటీ లాక్టో వెజిటేరియన్స్ ఉంటారు. ఈ ప్రకారంగా మాంసం మాత్రం త్యజించి మిగతా జంతు ఉత్పత్తులను తినేవాళ్ళని మనం అసంపూర్ణ శాకాహారులు అనవచ్చేమో.

మనుషులందరినీ జంతువులను హింసించే స్థాయిని బట్టి వర్గాలుగా విడగొడితే అప్పుడు జంతువుల దృష్టిలో అత్యంత దుర్మార్గులుగా మొదట నాలాంటి నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. తరువాత పైన చెప్పుకున్న ఓవో-లాక్టో వెజిటేరియన్స్ ఉంటారు. ఇక జంతువుల దృష్టిలో మంచివాళ్ళు అంటే కేవలం వేగన్స్ మాత్రమే.


ఒక రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్న సామాజిక పరిస్థితులను ఒకసారి చూస్తే అప్పుడు కొన్ని జాతులకి చెందిన మనుషుల్ని బానిసలుగా ఉంచుకోవడం సాంఘికంగా ఆమోదయోగ్యంగా ఉండేది. అలాగే అప్పట్లో ఉన్నత వర్గాల్లో ఉన్న స్త్రీలకి పురుషులతో సమానంగా హక్కులు లేకపోవడం కూడా చాలా సామాన్యమైన విషయం. తరతరాలుగా అనుసరిస్తున్న కొన్ని ఆచారాలనీ, సాంప్రదాయాలనీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దాంట్లో ఏదన్నా తప్పుగా కనిపిస్తే అది మార్చుకుంటూ కాలంతో పాటు మారుతున్న సామాజిక పరిస్థితులకి అనుగుణంగా మార్పు చెందడం అన్నది నిరంతరంగా, ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియ. ఒకప్పుడు సంస్థాగతంగా అమోదం పొందిన "బానిసత్వం" ఇప్పుడు చట్టవిరుద్ధం అయింది. జాతి, రంగు, లింగ బేధం లేకుండా మనుషులందరికీ సమాన హక్కులు ఉండాలన్నది ఇప్పటి ప్రజల ఆకాంక్ష. ఇదే ప్రక్రియలో ఇంకొన్నాళ్ళకి ప్రాణకోటి అంతటికీ అంటే మిగతా జంతువులన్నిటినీ కూడా మనుషులతో సమానంగా చూసే పరిస్థితులు వస్తాయనీ, రావాలనీ వాటి హక్కుల కోసం పోరాడే వాళ్ళే వేగన్స్. ఇప్పుడు 'మనుషులతో జంతువులకి సమాన హక్కులా!' అని ఒకింత ఆశ్చర్యంతో చూసేవాళ్ళు చాలామందే ఉంటారు. ఒక రెండు వందల సంవత్సరాల క్రితం తెల్లవాళ్ళతో సమానంగా నల్లవాళ్ళకి హక్కులు లేక పురుషులతో సమానం గా స్త్రీలకి అవకాశాలు ఉండాలి అని మాట్లాడిన వాళ్ళని కూడా అప్పటి వాళ్ళు వీళ్ళకేమన్నా పిచ్చా అన్నట్టు చూసేవారు. నా అభిప్రాయంలో హక్కులు, సమానత్వం అన్నవి ఒకరు ఇంకొకరికి జాలిపడి ఇవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఆయా అణగారిన వర్గాలవారు సామాజికంగా బలపడే కొద్దీ పోరాడి సమానహక్కులు సాధించుకోవడం మాత్రమే జరుగుతుంది. అలా మనుషుల మాదిరి జంతువులు సమానత్వం సాధించుకోడం జరగని పని కాబట్టి వేగన్స్ ప్రస్తావించే ఈ సమానత్వం పాయింట్ తో నేను ఏకీభవించను. ఇక వేగన్స్ ని పక్కన పెడితే మిగతా వెజిటేరియన్స్ అంటే ముఖ్యంగా మన దేశంలో ఉండే లాక్టోవెజిటేరియన్స్ సంగతి చూద్దాం.

లాక్టో వెజిటేరియన్స్ మీట్ తినకపోవడం వల్ల కోల్పోతున్న ప్రొటీన్ మరియు మిగతా పోషక విలువల కొరత తీర్చుకోవడం కోసం మిగతావారితో పోల్చుకుంటే పాలు మరియు పాల ఉత్పత్తులు ఎక్కువే వాడుతూ ఉంటారు. అయితే ఈ పాల ఉత్పత్తిదారులు వారి లాభం కోసం, అధిక డిమాండ్ ని అందుకోవడం కోసం పాలు ఉత్పత్తి చేసే ఆవులు గేదెల లాంటి జంతువులను అవి బ్రతికినంత కాలం ఎప్పుడూ ప్రెగ్నెంట్ గా ఉండేలా చూస్తారు. అవి ప్రెగ్నెంట్ అవడం కోసం ఉపయోగించే పద్ధతులు కూడా దారుణంగా ఉంటాయి. వాటిని ఇంప్రెగ్నేట్ చెయ్యడానికి ఉంచే బ్రీడిండ్ స్టాండ్ లను వేగన్స్ రేప్ ర్యాక్ లు అని పిలుస్తారు. ఎందుకంటే వాటి ఇష్టాయిష్టాలకి వ్యతిరేకంగా మనుషుల ఆధ్వర్యంలో బలవంతంగా జరిగే ప్రక్రియ కాబట్టి. అలానే ప్రకృతిసిద్ధంగా పుట్టిన దూడకి దక్కాల్సిన పాలలో మనుషులు తీసుకునేవే ఎక్కువ. స్వేచ్ఛగా బయట తిరగాల్సిన జంతువులను రోజులో ఎక్కువ భాగం అపరిశుభ్రమయిన ప్రదేశాల్లో కట్టేసి బంధించి ఉంచడం, ఆ జంతువులు ఇక పాల ఉత్పత్తికి పనికిరావు అనుకున్న వెంటనే వాటిని మాంసం కోసం అమ్మేయ్యడం.. ఇవన్నీ జంతువులని హింసించడమే. అధిక పాల ఉత్పత్తి కోసం జన్యు మార్పిడి చెయ్యడం, కొంచెం పాల దిగుబడి తగ్గగానే హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం.. ఇవన్నీ అందరి ఆమోదం పొందిన ప్రకృతి విరుద్ధమయిన క్రూరమైన పద్ధతులు అన్నమాట. 

కొంతమంది "అవి కష్టపడకుండా మనమే బోల్డు ఆహారం పెడుతున్నాం, శుభ్రం చేస్తున్నాం, ఎంతో ప్రేమతో చూస్తున్నాం... ఇక సమస్య ఏమిటి" అని వాదిస్తూ ఉంటారు. సరే ఇప్పుడు "నేను ఆహారం పెడతాను, పరిశుభ్రంగా ఉంచుతాను, ప్రేమగా పెంచుతాను" అని ఒక మనిషిని బానిసగా ఉంచుకోవడానికి ఈ సమాజం ఒప్పుకుంటుందా? మనుషుల విషయంలో బానిసత్వం అనేది అంత ఘోరమయిన తప్పు అయినప్పుడు జంతువుల విషయంలో ఎందుకు సరైనది అవుతుంది అన్నది వేగన్స్ ప్రశ్న. ఇక సాధారణ ప్రోబబిలిటీ ప్రకారం చూసుకుంటే పాల ఉత్పత్తి కోసం పెంచే ఆవులు, గేదె దూడల్లో ఆడ మగ శాతం 50-50 ఉండాలి. మరి మనం రోజు చూసే వాటిలో పాడి ఇచ్చే ఆడ జంతువులే ఎక్కువుంటే మగవి ఏమవుతున్నాయ్ అన్నది ఇంకో ప్రశ్న.

ఇలా ప్రత్యక్షంగానే కాకుండా కూడా జంతువుల చావుకి పరోక్షంగా కారణం అయ్యే ఉత్పత్తులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి బజార్లో దొరికే అనేక రకాల చీజ్‌ల తయారికి  రెన్నేట్ అనే ఎంజైమ్ అవసరం. ఈ ఎంజైమ్ ని చిన్న వయస్సు ఉన్న ఆవుదూడలను చంపి వాటి పొట్టలోని కొన్ని పొరల్లో నుండి సేకరిస్తారు. మన ఇండియాలో ఉండే అమూల్ ఉత్పత్తుల్లో అయితే కొన్ని రకాల నాచు నుండి డెవెలప్ చేసిన Microbial rennet వాడతారు కానీ ప్రపంచ వ్యాప్తంగా అయితే చాలా వరకు ఆవు దూడల నుండి తీసిన రెన్నేట్ ఎక్కువ వాడతారు. మీరు స్ట్రిక్ట్ వెజ్ అనుకుంటే ఏ చీజ్ అయినా కొనే ముందు ఒకసారి చూసుకోవడం బెటర్. :-) అలాగే మన ఇండియన్ స్వీట్ల మీద వాడే వెండి పూతలు (వర్క్ అంటారు) ఉంటాయి కదా.. అవి కూడా అంత పలుచని పొరగా రావడానికి కొన్ని జంతువుల పొట్ట చర్మం మీద కొట్టి తయారు చేస్తారు. ఈ రెండు ఉదాహరణల్లో శాకాహారులు జంతు అనుబంధ ఉత్పత్తులను ప్రత్యక్షంగా తినకపోయినా, తినేవి ప్యూర్ వెజ్ అయినా... ఇవి కొనడం, తినడం వల్ల ఆ జంతువుల చావుకు పరోక్షంగా కారణం అవుతున్నవారే!

ఇలా జంతువులను, ప్రకృతిలో సహజసిద్ధంగా వాటికి చెందిన హక్కులను హరించడం, వాటిని పరోక్షంగా హింసించడంలో నాన్వెజిటేరియన్స్ తో పోలిస్తే ఈ లాక్టోవెజిటేరియన్స్ ఏమీ తీసిపోరు అన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. అహింస, తోటి ప్రాణుల మీద ప్రేమ ముఖ్యోద్దేశ్యాలుగా ఆవిర్భవించిన ఈ వెజిటేరియన్ మూవ్మెంట్ ఈ రోజుల్లో నిజంగా దానికే కట్టుబడి ఉందా? "Dairy industry is as nasty as meat industry" అని అందరూ అంగీకరించాల్సిన పరిస్తితి ఉన్నప్పుడు ఆ ఇండస్ట్రీని పెంచి పొషించే లాక్టోవెజిటేరియన్స్ నిజంగా జంతు ప్రేమికులేనా?


- మంచు