Pages

Monday, September 24, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 4/4): మహాప్రళయం సంభవిస్తే?

*** శ్రీ రామ ***


సరే కానీ నాకోసం ప్రత్యేకంగా ఈ ప్రశ్న. నాకు 2012 సినిమా చూసినప్పటి నుండి ఒక చిన్న భయం పట్టుకుంది. 2012 సంవత్సరంలో అనే కాదు కానీ ఎప్పటికైనా సరే అలా మొత్తం భూమ్మీదున్న మానవజాతినంతటినీ తుడిచిపెట్టగల భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడయినా సంభవిస్తాయంటావా? ఒకవేళ వస్తే ఎప్పుడు రావొచ్చు.. అలాంటివి వస్తే మన పరిస్థితి ఏంటి? ఇది మాత్రం చెప్పు ప్లీజ్.. :-) 

ఈ భూమి మీదున్న సమస్త జీవరాశిని సమూలంగా ఒక్క పెట్టున తుడిచి పెట్టగలిగినంత భీభత్సమైన ప్రకృతి వైపరీత్యం సంభవించాలంటే అది కేవలం భూమి మీద ఏర్పడే భూకంపాలో, సునామీల మూలంగానో జరిగే కన్నా అలాంటి ఉపద్రవాలు బయట నుండి, అంటే అంతరిక్షంలో జరిగే పెనుమార్పుల కారణంగానో, రోదసిలో జరిగే మరేదైనా పెద్ద ప్రమాదాల వల్లనో సంభవించే అవకాశాలు ఎక్కువని నా అభిప్రాయం.

అంటే అంతరిక్షం నుండి ఏ ఆస్టరాయిడో (గ్రహశకలం) లేక కోమేట్ (మంచుశకలం) లాంటిదో వచ్చి భూమిని ఢీకొంటుందనా నువ్వు చెప్పేది?


ఆస్టరాయిడ్ బెల్ట్ ఊహా చిత్రం
అవును. ఈ విశాల విశ్వంలో లెక్కలేనన్ని ఆస్టరాయిడ్లు వివిధ పరిమాణాలలో ఉన్నాయి. వాటిలో కొన్ని నిర్దిష్ట కక్ష్యల్లో తిరగకుండా యథేచ్చగా ఒక దిశానిర్దేశం అంటూ లేకుండా ఎటుపడితే అటు ప్రయాణిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఏదన్నా ఒకటి వచ్చి మన భూమిని ఢీకొంటే ఏమవుతుంది అన్నది ప్రశ్న. అప్పుడెప్పుడో పూర్వకాలంలో ఒకసారి ఇలాగే ఢీకొట్టిన ఒక ఆస్టరాయిడ్ భూమి మీద డైనోసార్ల శకానికి ముగింపు పలికినా మొత్తం జీవరాశినయితే నాశనం చెయ్యలేకపోయింది. కానీ ప్రతీసారి అంతే పరిమాణంలో ఉన్న ఆస్టరాయిడే మన వైపు రావాలని లేదుగా.. ఒకవేళ ఈసారి అంతకన్నా పెద్దది వచ్చి ఢీకొంటే మొత్తం భూమే నాశనం అవ్వొచ్చు లేక భూమ్మీద ఉన్న సమస్త జీవరాశి అంతరించొచ్చు. అలాంటి అవకాశాలైతే అసలే లేవని కొట్టిపారెయ్యలేం. అంతే కాకుండా దగ్గరలో ఉన్న ఏదయినా నక్షత్రం ప్రేలినప్పుడు విడుదల అయ్యే రేడియేషన్ కూడా  భూమి మీద జీవకోటిని నాశనం చేసే అవకాశం ఉంది.

వినడానికే భయంగా ఉంది.. అసలు అలాంటివి ఏమన్నా వస్తున్నాయా మరి మన భూమి వైపు? ముందు అది చెప్పు..

2029 లో "99942 Apophisఅనే ఆస్టరాయిడ్ ఒకటి మన భూమికి అతి దగ్గరగా వస్తుంది అని శాస్త్రజ్ఞులు లెక్కకట్టారు. అప్పుడు అది భూమి పక్కనుండి వెళ్తుందా లేక భూమిని ఢీకొడుతుందా అన్నది అంత ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ అది అప్పుడు భూమి పక్కనుండి వెళ్ళిపోయినా, భూమికి అతిసమీపంగా వస్తుంది గనుక మన భూమి గురుత్వాకర్షణశక్తి వల్ల అది దిశ మార్చుకుని మళ్ళీ 2036 లో తిరిగివచ్చి భూమిని ఢీకొనే ప్రమాదం కూడా ఉంది. 2036 లో భూమిని ఢీకొట్టే ఛాన్స్ 1 in 250000 అయినా.. కొడితే మాత్రం అప్పుడు విడుదల అయ్యే శక్తి ఒకప్పుడు డైనోసార్ల శకానికి తెరదించిన ఆస్టరాయిడ్ ప్రమాదంలో విడుదల అయిన శక్తికి కనీసం ఐదు రెట్లు ఎక్కువ ఉంటుందని ఒక అంచనా. ఆ శక్తి వల్ల నేరుగా భూకంపాల రూపంలో సంభవించే నష్టం ఒకవైపు, ఆ తరువాత దాని వల్ల ఉత్పన్నమయ్యే సునామీలు ఇంకోవైపు.. మొత్తం మీద 2012 సినిమాలో చూపించినట్టే మహాప్రళయం .. :-)


ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టిన తదనంతర పరిణామాలు - ఏనిమేషన్ చిత్రం


హ్మ్.. మొత్తం మీద మన భూమ్మీద ఇలాంటి ప్రళయమే గనుక వస్తే తప్పించుకునే అవకాశమే లేదన్నమాట. పోనీ, అప్పుడు మనం వేరే ఏదన్నా గ్రహం మీదకో, ఉపగ్రహం మీదకో వలస వెళ్తేనో? మన నివాసానికి అనువుగా ఏదన్నా గ్రహం ఉంటే చెప్పు ఇప్పుడే రిజర్వ్ చేసేసుకుందాం.. :-)

:-) జీవులు బ్రతకడానికి ఎనర్జీ కావాలి. అది తిండి నుండి వస్తుంది. తిండి పండించడానికి కావాల్సింది నీరు.  అది కూడా ద్రవరూపంలో ఉండే నీరు. ఇప్పుడు నీరు ద్రవరూపంలో ఉండాలంటే అక్కడి వాతావరణంలో ఉష్ణోగ్రత జీరో డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువుండాలి. అలాగని ఉష్ణోగ్రత మరీ ఎక్కువున్నా నీరు త్వరగా ఆవిరి అయిపోతుంది. మన సౌరమండలంలో నీరు ద్రవరూపంలో ఉండేలా అనువైన ఉష్ణోగ్రత ఉండే గ్రహాలు కేవలం రెండే. ఒకటి భూమి, రెండు మార్స్. అందుకే ఈ మార్స్ గ్రహం మీద మనకి అంత ఆసక్తి అన్నమాట.

కానీ ఇప్పుడు మార్స్ మీద నీటి ఆనవాలు ఏమీ కనపడలేదేమో కదా.. అయితే ఇక మన సౌరమండలంలో మరెక్కడా నీరు ఉండే అవకాశమే లేదంటావా?

మార్స్ మీద ఒకప్పుడు సరస్సులు, నదులు, సముద్రాలు ఉండి ఉండొచ్చు అని మార్స్ చుట్టూ తిరిగే ఉపగ్రహాలు తీసి పంపిన ఫోటోల ద్వారా అంచనా వేసారు. కానీ, ఇప్పటి వరకు వెళ్ళిన రోబోలు ఏవీ అక్కడ నీరు ఉంది అనో, ఉండొచ్చనో తేల్చి చెప్పలేకపోయాయి. మార్స్ అట్టడుగు పొరల్లో ఏమన్నా నీరు ఉందేమో అని ప్రస్తుతం పరిశోధిస్తున్నారు. ఇక ఇది కాక గురు (జూపిటర్) గ్రహానికి ఉన్న చందమామల్లో ఒకటైన యూరోపా మీద బోల్డంత నీరు ఉంటుంది అని ఒక అంచనా.

కానీ గురుగ్రహం సూర్యుడి నుండి చాలా దూరం కాబట్టి నీరు ఉన్నా అది ఘనీభవించిన మంచు రూపంలో ఉండొచ్చు కానీ ద్రవరూపంలో ఉండదేమో కదా..

అంటే.. ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. భూమి చుట్టూ మన చందమామ తిరుగుతున్నట్టే, ఈ యూరోపా గురుగ్రహం చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ యూరోపాతో పాటు   యూరోపాకి అతి దగ్గరలో ఉన్న ఇంకో రెండు చందమామలు కూడా గురుగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటి ప్రభావం వల్ల ఈ యూరోపా మీద గురుని గురుత్వాకర్షణ శక్తి నిలకడగా ఉండకుండా తరచూ మారుతూ ఉంటుంది. అంటే యూరోపా గురుడు చుట్టూ ఒక చుట్టు తిరిగేసరికి ఒక చోట గురుడు ఎక్కువ ఆకర్షిస్తే మరోచోట తక్కువ ఆకర్షణశక్తి ఉంటుంది. ఈ ఆకర్షణ బలం మారుతుండటం ఎలా ఉంటుందంటే, మనం చపాతీ పిండిముద్దని   నొక్కుతున్నట్టు అన్నమాట. ఇలా పిండిని పిసికినట్టు నిరంతరం మారుతుండే బలం ఈ యూరోపా కేంద్రంలో వేడి పుట్టిస్తుంది. అందువల్ల ఈ యూరోపా పైన కొన్ని కిలోమీటర్ల మందాన మంచు పొర ఉన్నా దాని కింద ద్రవరూపంలో ఉన్న నీరు ఉండవచ్చు అని ఒక అంచనా (ఈ ఫోటోలో చూపించినట్టు).

అయితే మన సముద్రాల అడుగున జీవించే ప్రాణుల వంటి జీవులు అక్కడ కూడా ఉండొచ్చంటావా?

ఊ.. ఉండొచ్చు.. చెప్పలేం.

అయినా యూరోపా మీద లోపలి పొరల్లో ద్రవరూపంలో నీరు ఉన్నా అక్కడి ఉపరితల ఉషోగ్రతల స్థాయి, నిరంతరం మారుతుండే గురుత్వాకర్షణ శక్తి తదితర అంశాల మూలంగా ఆ ప్రదేశం మనకి అంత నివాసయోగ్యం కాకపోవచ్చులే.ఆ యూరోపా తప్ప ఇంకెక్కడా ఇలా ద్రవరూపంలో ఉండే నీరు లేదా?

లేత నీలం రంగులొ ఉన్న ప్రదేశం జనావాసానికి అనువుగా ఉన్న జొన్ 
మన సౌరమండలంలో అయితే ఈ యూరోపా తప్ప ఇంకేమీ లేవు కానీ, గ్లీసి581 (Gliese 581) అనే నక్షత్రం చుట్టూ తిరిగే మూడవ, నాలుగవ గ్రహాలైన గ్లీసి581C, గ్లీసి581D లు ఉన్నాయి. ఇవి మన భూమి కన్నా పరిమాణంలో పెద్దవి. అవి పరిభ్రమించే నక్షత్ర పరిమాణం, ఈ గ్రహాల యొక్క పరిమాణం, అలాగే ఆ నక్షత్రానికీ ఈ గ్రహాలకి మధ్య ఉన్న దూరం, వీటన్నీటి నిష్పత్తులు సరిగ్గా సరిపోలడం వల్ల ఈ గ్రహాల మీద ఉష్ణోగ్రత మన భూమిని పోలి ఉండొచ్చు. అంటే అక్కడ నీరు అంటూ ఉంటే అది ఖచ్చితంగా ద్రవరూపంలోనే ఉంటుంది. అసలు భూమి తర్వాత ప్రాణుల ఆవాసానికి అత్యంత అనువైన గ్రహాలు ఇవేనని చాలామంది అంచనా.

వావ్.. అయితే అక్కడ గ్రహాంతరవాసులు ఉంటారా?

ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ, ఎప్పటికైనా మనం ఒకవేళ వలస వెళ్ళి ఉండాలి అనుకుంటే మాత్రం మనకి నివాసయోగ్యమైన గ్రహాల జాబితాలో ఇవి ఉంటాయి.

అయితే ఇంకేం మరి.. ఈ మార్స్, యూరోపా లాంటివి కాస్త పక్కన పెట్టి అక్కడికే పంపొచ్చు కదా ఈ రోబోలూ అవీ..

:-) పంపొచ్చు కానీ ముందు ఇది చెప్పు. నీకు ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన అత్యంత వేగవంతమయిన వాహనం ఏదో తెల్సా?

ఊ .. బుగట్టినో, ఫెరారీనో, లాంబోర్గినినో ఏదో అయి ఉంటుందిలే.. 

ప్చ్.. అవి కాదు.. అంతరిక్షంలో ప్రయాణించేవి.

ఉహూ.. అయితే తెలీదుగా.. :-)

వోయోజర్ -1 అని.. ముప్పై నాలుగేళ్ళ క్రితం నాసా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఈ అంతరిక్షనౌక సెకనుకి 17 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నీకు ఈ వేగం మీద ఒక అవగాహన కోసం చెప్తున్నా.. ఈ నౌకలో విజయవాడ నుండి హైదరాబాదు పది సెకన్లలో వెళ్ళొచ్చు .. ఇంత వేగవంతమయిన వాహనంలో వెళితే ఆ గ్లీసి 581D కి చేరడానికి ఇంచుమించు 350000 సంవత్సారాలు పడుతుంది.

వామ్మో.. మరీ అంత దగ్గరా.. అయితే నేను రానులే ఈసారికి.. :-) 

ఒకవేళ భవిష్యత్తులో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది ఇంకా సూపర్‌ఫాస్ట్‌గా వెళ్ళే అంతరిక్షనౌక తయారుచేసాం అనుకుందాం. అంటే ఇప్పుడున్న దానికి వేల రెట్ల వేగం.. అంటే ఇండియా నుండి అమెరికాకి కేవలం మిల్లీసెకన్లలో, అంటే కనురెప్పపాటులో వెళ్ళగలిగే లాంటి స్పీడ్.. అయినా సరే అక్కడికి వెళ్ళాలంటే ఒక వందో, రెండొందలో సంవత్సరాలు పడుతుంది కదా.. ఒకవేళ ఎవరినయినా పంపుదాం అనుకున్నా తమ జీవితం, తమ తరువాతి తరాల వాళ్ళ జీవితాలు కేవలం రాకెట్లలో గడపడానికి సిద్ధపడేవాళ్ళు ఎవరుంటారు?

అసలూ.. అంత వేగవంతమయిన వాహనాలు తయారు చేసే టెక్నాలజీ మీ ఇంజనీర్లు అభివృద్ధిపరిచేసరికి మా జెనెటిక్స్ ఇంజనీర్లు మనిషి ఆయువుని ఒక రెండుమూదొండలు సంవత్సరాలు పెంచేలా ఏదైనా కనిపెడతారులే.. :-) కాంతి కన్నా వేగంగా ఏదీ ప్రయాణించలేదు అన్నావు కదా.. మనిషి అందుకోగల గరిష్ఠ వేగం అదేనా?   అలా అయితే రెండు మూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ప్రదేశాలకి మనిషి వెళ్ళే అవకాశం ఇప్పట్లో లేనట్టే కదా..

కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంలో ప్రయాణించే 'వార్మ్ హోల్స్' అనే సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి కానీ దీనికి కావాల్సిన శక్తి దృష్ట్యా చూస్తే వీటిని ప్రాక్టికల్‌గా పని చేయించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదులే. ఒకవేళ అది మాత్రం సాధించగలిగితే హాయిగా అంతరిక్షంలో ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరమైనా సరే సులభంగా కొన్ని రోజుల వ్యవధిలోనే వెళ్ళి రావొచ్చు. 

ఆహా.. అలాగైతే నువ్వెళ్ళి కాస్త ఆ రీసెర్చ్ ఏదో చెయ్యొచ్చు కదా.. 2036లో మనకి ఉపయోగపడుతుందేమో.. :-) మరి ఇక టైం ట్రావెల్ కూడా సాధ్యమే అంటావా .. 

టైం ట్రావెల్ సిద్ధాంతపరంగా సాధ్యమే కానీ నా అభిప్రాయం ప్రకారం గ్రాండ్‌ఫాదర్ పారడాక్స్ గుట్టు విప్పేవరకూ అది మిస్టరీనే..

గ్రాండ్‌ఫాదర్ పారడాక్స్ అంటే.. 

అది చాలా సింపిల్ .. ఇప్పుడు ఒకడు టైం ట్రావెల్ ద్వారా గతంలోకి వెళ్లి వాడి తాతకి పెళ్ళికాక ముందే చంపేసాడు అనుకుందాం. అప్పుడు వీడు పుట్టడం అన్నదే జరగదు. అసలు వాడే పుట్టకపోతే వాళ్ళ తాతని ఎవరు చంపినట్టు? అందువల్ల ఈ పారడాక్స్ టైం ట్రావల్ అసాధ్యం అని సూచిస్తుంది. ఇలాంటివి ఇంకొన్ని పారడాక్స్‌లు ఉన్నాయి. ఇవి సాధించే వరకూ టైం ట్రావల్ గురించి మనం సాధ్యమా  అసాధ్యమా అని ఏది తేల్చి చెప్పలేం.

interesting ! .. మరి మన భూమి ఆయుష్షు ఎంత అని మనకేమన్నా తెలుసా.. కొంతకాలానికి భూమి కూడా అంతమైపోతుందా? అసలు ఈ విశ్వం పరిస్థితి ఏంటి.. ఎప్పటికీ శాశ్వతంగా ఇలాగే ఉంటుందా?

ఊ.. మళ్ళీ బోల్డు ప్రశ్నలు అడిగేసావ్.. :-) ఈ విశ్వం మనం ఊహించలేనంత పెద్దదే కాదు, అంతే ఎక్కువ వయస్సు గలది కూడా.. ఇంకోటి, వయస్సుతో పాటు దీని పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే... బిగ్ బ్యాంగ్ అనే ప్రక్రియతో ఏర్పడిన ఈ విశ్వం కాలంతో పాటు అన్ని దిక్కులలో విస్తరిస్తూ వస్తుంది.

బిగ్ బ్యాంగ్ వల్ల ఈ విశ్వం ఏర్పడింది అని తెలుసు కానీ... అంతకుముందు ఏముండేది అన్నది తెలీదు.

అంతకుముందు ఏముండేది అంటే చెప్పడం చాలా కష్టం. మొట్టమొదట అనంతమైన శక్తితో కూడిన ఒక చిన్న డాట్ (Singularity) ఉండేది. ఆ డాట్ లోపల ఉన్న ఉష్ణోగ్రత పెరిగి పెరిగీ సుమారు 1400 కోట్ల సంవత్సరాల క్రితం ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడు ఎంత పెద్దదో చెప్పడానికి మన ఊహకి కూడా అందదు. అయితే ఈ శక్తి నుండి మొదట పుట్టినవి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లాంటి పరమాణువులు. ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు కలసి మొదట హైడ్రోజన్ ఏర్పడింది. అంటే ఆ సమయానికి విశ్వవ్యాప్తంగా అసలు వేరే మూలకాలు ఏమీ లేవన్నమాట. అంటే భూమి లేదు, సూర్యుడు లేడు. ఉన్నదల్లా కేవలం శక్తి. 

అసలు కనీసం కాంతి కూడా లేకుండా కేవలం ఒక్క శక్తిని మాత్రమే ఊహించడం సాధ్యం కావడం లేదు.

ఊ..  అలాంటి స్థితే ఉండేది మొదట్లో. ఇక ఈ హైడ్రోజన్‌కి ఉన్న భౌతిక గుణం ప్రకారం ఒక కోటి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర రెండు హైడ్రోజన్ అణువులు కలసి ఒక హీలియం అణువుగా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో చాలా శక్తి విడుదల అవుతుంది.

అంటే న్యూక్లియార్ ఫ్యూజనా?

అవును. అణుబాంబు కన్నా ఎక్కువ శక్తివంతమైనది అని చెప్పే హైడ్రోజన్ బాంబ్‌లో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ఇదే. సూర్యుడితో సహా అన్ని నక్షత్రాలలో శక్తి సృష్టించబడేది దీనివల్లే. ఒక్కో నక్షత్రం కొన్ని కోట్ల హైడ్రోజన్ బాంబులతో సమానం. ఇలా ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ తరువాత హీలియం, ఆ తరువాత కార్బన్, ఇలా మిగతా మూలకాలు అన్నీ ఏర్పడ్డాయన్నమాట. 

విశ్వమంతా అలా ఒక శక్తి నుంచి ఏర్పడింది సరే.. మరి మన భూమికి, ఇంకా ఈ విశ్వానికి ఆరంభం ఉన్నట్టే అంతం కూడా ఉంటుందా?

ఊ.. ఎప్పటికైనా అదే జరుగుతుంది. ఆ అంతమయ్యే వరసక్రమం ఇలా ఉంటుంది.  
  • భూమి అంతం అవ్వడానికి ఎన్నో మిలియన్ సంవత్సరాల ముందే  భూమి మీద ఉన్న అనంత జీవరాశి అంతరిస్తుందిఏ ఆస్టరాయిడో వచ్చి ఢీకొన్న కారణంగానో లేక మనమే తయారు చేసుకున్న అణుబాంబుల వల్లనో ఇది జరగవచ్చు.  
  • ఆ తర్వాత సూర్యుడి పరిమాణం కాలంతో పాటు పెరుగుతూ పెరుగుతూ భూమికి దగ్గరగా రావడంతో భూమి కూడా ఒక మండే అగ్నిగోళంలా మారుతుంది. అప్పటికే ఏవైనా ప్రాణులు మిగిలున్నా సరే ఈ స్థితిలో ఉత్పన్నమయ్యే అత్యధిక ఉష్ణోగ్రతలకి అవన్నీ సమూలంగా నశిస్తాయి. 
  • అలా వ్యాకోచిస్తున్న సూర్యుడు  క్రమంగా ఒక్కో గ్రహాన్నీ తనలో కలిపేసుకుంటూ కొన్నాళ్ళకి భూమిని కూడా తనలో ఐక్యం చేసుకుంటాడు. అది జరిగిన కొన్నాళ్ళకి క్రమంగా సూర్యుడి ఆయుష్షు కూడా తీరిపోయి పూర్తిగా పేలిపోతుంది. అదీ మన సౌరమండలం యొక్క భవిష్యత్తు. 
  • ఆపై కొన్ని బిలియన్ సంవత్సరాల తరువాత బిగ్ క్రంచ్ అన్న ప్రక్రియ ద్వారా మొత్తం అంతరిక్షమే అంతం అయిపోవచ్చు కూడా..

బిగ్ క్రంచ్ అంటే ? 

బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది కదా.. దానికి అపోజిట్ ప్రక్రియ అన్నమాట. బిగ్ బ్యాంగ్ థియరీలో ఒక చిన్న డాట్ పేలి ఇంత పెద్ద విశ్వం ఏర్పడింది అని చెప్తారు కదా.. అలా బిగ్ క్రంచ్ ద్వారా  మొత్తం విశ్వం మళ్ళీ ఆ చిన్నడాట్ లా మారిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ విశాల విశ్వం రోజు రోజుకి విస్తరిస్తుంది అని చెప్పాను కదా. దానికి కారణం ఒక శక్తి. దాన్ని డార్క్ ఎనర్జీ అంటారు. అలాగే విశ్వంలో ఉండే ఇంకో ముఖ్యమైన శక్తి  గురుత్వాకర్షణశక్తి. ఇవి రెండూ వ్యతిరేక దిశల్లో పని చేస్తాయి. అంటే, డార్క్ ఎనర్జీ ఏమో విస్తరిస్తూ దూరం జరుగుదాం అనేది అయితే గురుత్వాకర్షణ శక్తేమో అన్నిటినీ దగ్గరకి తీసుకొద్దాం అనేలాంటిది. ప్రస్తుతం గురుత్వాకర్షణశక్తి కన్నా డార్క్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి విశ్వం రోజు రోజుకీ విస్తరిస్తూ ఉంది. కానీ అది ఎప్పుడూ ఇలానే ఉంటుంది అన్న గ్యారంటీ లేదు. ఎప్పుడైనా గురుత్వాకర్షణ శక్తి ఈ డార్క్ఎనర్జీ కన్నా ఎక్కువైతే అప్పుడు అంతరిక్షంలో ఉన్న అన్నీ గేలక్సీలు అన్ని దగ్గరకు లాగబడతాయి. ఎలా అయితే ఒక చిన్న డాట్ నుండి ఇంత పెద్ద విశాల విశ్వం ఏర్పడిందో, అదే పెద్ద విశ్వం మళ్ళీ చిన్న డాట్ లోకి కుంచించుకుపోవడాన్ని బిగ్ క్రంచ్ అంటారు. అది ఎప్పుడు జరుగుతుంది, అసలు జరుగుతుందా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోయినా అలా జరగడానికి ఒక అవకాశం అయితే ఉంది.

ఏమిటో అసలు... ఇవన్నీ తెలీనప్పుడే హాయిగా ఉంది అనిపిస్తుంది. ఇన్ని గేలక్సీలు, వాటిలో ఉండే కోట్ల కోట్ల నక్షత్రాలు, వాటి గ్రహాలూ.. అసలు ఇవన్నీ ఆలోచిస్తే ఏంటో చాలా లోన్లీగా అనిపిస్తుంది. అసలు ఇంత విశాల విశ్వంలో మనం ఎంత చిన్న భాగం అనిపిస్తుంది. ఈ సూర్యుడు ఏర్పడటం, దానికి సరైన దూరంలో భూమి ఉండటం, దాని వల్ల భూమి మీద అనువైన ఉష్ణోగ్రత మరియు వాతావరణం ఏర్పడటం... సూర్యుడు కూడా ఒక సరైన పరిమాణంలో ఉండటం వల్ల దానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు జీవిత కాలం ఉండటం... లక్కీగా సరైన కాంబినేషన్లో న్యూక్లిక్ ఆసిడ్స్, అమీనో ఆసిడ్స్ అణువులు ఏర్పడి భూమి మీద జీవం ఉద్భవించడం... అలా పుట్టిన జీవం ఇన్ని కోట్ల సంవత్సరాల పాటు సర్వైవ్ అవుతూ రకరకాల జీవుల్లా రూపాంతరాలు చెందుతూ మనవరకూ రావడం.. భూమి మీద ఇవన్నీ జరగడానికి వీలయినంత సమయం మన సూర్యుడి జీవిత కాలం ఉండటం.. ఇదంతా చూస్తుంటే ఎవరో ఒక గ్రాండ్ డిజైనర్ మన కోసం ఇవన్నీ తీర్చిదిద్దినట్టు అనుకోవాలా!?

Grand Designer means GOD??? NOT NECESSARILY!!!

(అయిపోయింది)
- మంచు & మధుర

DISCLAIMER:
All content provided on this blog is for informational purposes only. The owner of this blog and authors of this post make no representations as to the accuracy or completeness of any information on this site or found by following any link on this site.  Photo courtesy by various websites on internet.

27 comments:

అమృతం said...

మంచి సమాచారాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేసినందుకు మీకూ మధురగారికి అభినందనలు ధన్యవాదాలు.

Unknown said...

మంచుగారూ, అన్ని భాగాలూ ఐనతరువాత కామెంట్ రాద్దామని ఆగాను.ఓసారి చదివాను ఇంకో రెండు సార్లు చదివితే గాని అన్నిపాయింట్లూ ఎక్కవు.అప్పుడు పిల్లలకు చదివి చెబుతాను. ఇదంతా ఓపిగ్గా రాసిన మీ ఇద్దరికీ (మధుర)అభినందనలు....
అలబామ స్పేసు రిసర్చ్చ్ సెంటర్ (హంట్స్విల్) చూసాము.మరలా అదంతా ఓ సారి గుర్తొచ్చింది:))

Anonymous said...

సిరీస్ చాలా బాగుంది...
వివరణ నాకు నచ్చింది..!!
Siva Kumar.K

..nagarjuna.. said...

ఇంతకుముందు చెప్పినట్టుగానే, ఎక్కడా ఏకపక్షంగా వ్యాసంలా కాకుండా స్కూల్ పిల్లల సందేహాలను స్కూల్ టీచర్ విడమర్చ్ చెప్పినట్టు ఉంది మొత్తం సిరీస్. ఇంత బాగా రాసినందుకు మీ ఇద్దరికి అభినందనలు మంచు & మధురగారు :)

comet కు తెలుగులో తోకచుక్క అని అందమైన పేరుండగా 'మంచు శకలం' అని రాసారేంటి చెప్మా ! మంచు గారు ఏమైనా హైజాక్ చేసారా ఇక్కడ ;)

timepassguru said...

amazing article again...learnt so much knowledge...

Hats off...




భాస్కర్ కె said...

చాలా బాగా వివరిస్తున్నారు, మంచి టీచర్ లా,
ఆ యానిమేషన్ చిత్రాలు కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవడం వీలువుతుందా, మా స్కూలు పిల్లలకి చూపించడానికి........

Madhusudhan Raola said...

మంచి సమాచారాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేసినందుకు మీకూ మధురగారికి అభినందనలు ధన్యవాదాలు.

Madhusudhan Raola said...

మంచి సమాచారాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేసినందుకు మీకూ మధురగారికి అభినందనలు ధన్యవాదాలు.

HarshaBharatiya said...

Good information

Rao S Lakkaraju said...

ఏమిటో అసలు... ఇవన్నీ తెలీనప్పుడే హాయిగా ఉంది అనిపిస్తుంది.
-----------
True

Rao S Lakkaraju said...

కొంత రిఫరెన్సు సమాచారం పెట్టి పుస్తకంలా ప్రింట్ చేస్తే బాగుంటుందని అనుకుంటాను.

నిషిగంధ said...

యూనివర్స్ గురించి నాకు తెలిసిన విషయాలు బహు తక్కువ... అసలే మాత్రం అవగాహన లేని విషయాలు చాలా ఎక్కువ! అసలు అంతరిక్షం అంటే ఆకాశమేగా అనుకునే రోజుల్నించీ గేలక్సీల రూపురేఖలు, దూర భారాలు అన్నీ సమగ్రంగా చెప్పగల పరిణామాన్ని మీ ఇద్దరూ మా కళ్లముందుంచారండీ! పూర్తిగా విజ్ఞానదాయకంగా ఉంది.. కాకుంటే చివరికి వచ్చేసరికి, భూమి అంతం గురించి లెక్కలూ వివరాలూ చెప్పి కాస్త భయపెట్టారు.. ఆ ఎస్టిమేటెడ్ ఇయర్ మరీ 2036 కి కాకుండా 3036 కి జరిపే వీలుందంటారా? ;-)

Thank you both for such an informative series!

శ్రీ said...

chakkati vivarana...series antaa aashaktikaramgaa saagindi...
abhinandanalu meeku...
@sri

జయ said...

ఎంత మంచి సమాచారమండి. ఈ నాలుగు భాగాలు పూర్తయ్యే వరకు ఊపిరి బిగబట్టే ఉన్నాను. ఆ బిగ్ క్రంచే కొంచెం ఎక్కువగానే భయపెట్టేస్తుంది. మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.

రసజ్ఞ said...

అత్యద్భుతంగా, సాధారణంగా అందరికీ వచ్చే సందేహాల ప్రస్తావనతో, సరళముగా చాలా బాగా చెప్పారు. ఈ సీరిస్ కోసం ఎదురు చూసినంతగా నా పరీక్షా ఫలితాల కోసం కూడా చూడలేదు. ఇప్పటికి నాకున్న చాలా రకాల సందేహాలు నివృత్తి అయ్యాయి. ఈ ముగింపు వాక్యాలను తలుచుకుంటుంటే మాత్రం కాస్త భయం వేసింది. మీ ఇద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు

Unknown said...

నిజంగానే "మధుర మంచు" పల్లకీలో అంతరిక్షం అంతా తిప్పు చివరికి మమ్మల్ని మళ్ళీ భూమి మీదకు చేర్చారు. కాంతికన్నా వేగంగా మనిషి వెళ్ళగలిగే అంతరిక్ష నౌక కనిపెట్టగలడో లేదో ఎప్పటికైనా, కానీ ఇంత చక్కగా అంతరిక్షం అంతా తిప్పి చెప్తూ చూపెట్టే నౌకని మాత్రం ఎప్పటికీ కనిపెట్టలేడు. ఇలాంటివి ఆసక్తిగా చదివేలా రాసిన మీ ఇద్దరూ ఎంతో అభినందనీయులు!
అభినందనలు మంచు మరియు మధుర గార్లూ!

prasanna said...

Nice article..Very good information!!keep it up..congrats to both of u ...Manchu&Madhura :-)

మంచు said...

అమృతం గారు: ధన్యవాదాలు
సునీత గారు: ధన్యవాదాలు
శివకుమార్ గారు: ధన్యవాదాలు
నాగార్జున : ధన్యవాదాలు :-)) నేనేం హైజాక్ చెయ్యలేదు బాబు.. ఇద్దరం కలిపి రాసిందే:-)
timepassguru గారు: ధన్యవాదాలు
the tree గారు: ధన్యవాదాలు. జిఫ్ ఫార్మాట్ లొ ఉన్నవి వీలవుతాయండి. డౌన్లోడ్ చేసిన జిఫ్ ఫైల్స్ ఇంటర్నెట్ ఎక్ష్ప్లొరర్ లోనో లేక పవర్ పాయింట్ లోనే ఓపెన్ చేస్తే అనిమేషన్ వస్తుంది. వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి. www.nasa.gov లొ లభ్యమయ్యేవి అయితే కాపి రైట్ చట్టాలు మనకి అనుకూలం గా ఉంటాయి కనుక కొంచెం ఈజీ.

మంచు said...

మధుశూధన్ గారు: ధన్యవాదాలు
హర్ష భారతీయ గారు: ధన్యవాదాలు
లక్కరాజు గారు: ధన్యవాదాలు. పుస్తకం అంటారా.. అంత స్థాయికి చేరాలని నేను ఆశిస్తున్నాను.
నిషి గారు: 2036 నుండి ఇంకొ 20 సంవత్సరాలు జరిపితే చాలండి. మరీ 3036 వరకూ అక్కర్లేదు:-)
శ్రీ గారు: ధన్యవాదాలు
ప్రసన్న గారు: ధన్యవాదాలు

మంచు said...

మధుసూధన్ గారు: ధన్యవాదాలు
హర్ష భారతీయ గారు: ధన్యవాదాలు
లక్కరాజు గారు: ధన్యవాదాలు. పుస్తకం అంటారా.. అంత స్థాయికి చేరాలని నేను ఆశిస్తున్నాను.
నిషి గారు: 2036 నుండి ఇంకొ 20 సంవత్సరాలు జరిపితే చాలండి. మరీ 3036 వరకూ అక్కర్లేదు:-)
శ్రీ గారు: ధన్యవాదాలు.
ప్రసన్న గారు: ధన్యవాదాలు
జయగారు: ధన్యవాదాలు, బిగ్ క్రంచ్ ఇప్పుడు ఎక్కడండీ.. ఇంకా కొన్ని కొట్ల సంవత్సరాలు తరువాత కదా :-)

మంచు said...

రసజ్ఞ గారు, చిన్ని ఆశ గారు : మేము పడ్డ శ్రమకి ఫలితం దొరికింది అనిపిస్తుంది మీ ప్రొత్సాహం చూస్తుంటే. మీ ఇద్దరికి చాలా చాలా థాంక్స్ :-))

Sujata M said...

ఈ సిరీస్ మొత్తాన్నీ చాలా ఎంజాయ్ చేసాను. మంచు గారికీ, మధురవాణి గారికీ చాలా ధన్యవాదాలు. ఆద్యంతం ఆసక్తికరం గా రాశారు. బాగానే శ్రమపడినట్టున్నారు. మంచు గారి 'వెజిటేరియనిజం' వ్యాసాలు కూడా ఇలానే ఆసక్తి గా చదివాను. సైన్స్ కి మించిన ఫిక్షన్ ఏముంది ? దేవుడ్ని మించిన డైరెక్టర్ ఎవరున్నారు మన సినిమా (జీవితం) లో అనిపించింది.

మంచు said...

సుజాత గారు.. థాంక్స్ అండి.. హ్మ్మ్... మీరు అన్నది నిజమే.. కొంచెం ఎక్కువే కస్టపడ్డాం కానీ అవుట్‌పుట్ చూసాక పడిన కస్టం తెలీలేదు :-)

తృష్ణ said...

కొంచెం ఏమిటి చాలానే కష్టపడ్డట్టున్నారు! బావుందండి బాగా చెప్పారు. మధురా, నీక్కూడా అభినందనలు. మొదట్లోవి చదవలేదు..చదువుతా..

మంచు said...

తృష్ణ గారు.. థాంక్యూ ..
thanks for your support.

oddula ravisekhar said...

అద్భుతంగా వ్రాసారు.astronomy అంటే నాకు passion.మీరు వర్ణించిన తీరు ఇంకా బాగుంది.కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు వ్రాసిన విశ్వంతరాళం కూడా చదవండి.లేటెస్ట్ విషయాలు చాలా ఉన్నాయి.సుదూర నక్షత్ర పేలుళ్ళ అధ్యయనం ద్వారా ఈ విశ్వం అంత కంతకు విస్తరిస్తుందని గడ్డ కట్టే చలితో అంతమయి పోతుందని కనుగొన్నందుకు ఆడం రీస్,బ్రియాన్ P.SHIMIT,SAL PERL MUTTER లకు 2011 nobel prize వచ్చింది ఎలా ఎన్నో పరిశోధనల ద్వారా మరిన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి.అలాగే మీరు వ్రాసిన అంతరిక్ష వాసుల గురించి రోహిణీ ప్రసాద్ గారు చక్కగా వివరించారు.ఆయన పేరు టైపు చేస్తే ఆయన బ్లాగు వస్తుంది.ఆయన ఈ మధ్యే మరనించారు.అలాగే బోసాన్స్ గురించి పరిశోధన.ఇలా ఎన్నోమీకు అబినందనలు.

ఫోటాన్ said...

చాలా సరళం గా వివరించారు.
అన్ని భాగాలు చదివాను, బాగున్నాయి.
మంచు గారికి, మధురా గారికి ఇద్దరికీ అభినందనలు :)