Pages

Saturday, November 20, 2010

చుంబరస్కా అను ఒక మధురమయిన పదార్దం, patent pending

*** శ్రీ రామ ***

ఇది కేవలం సరదాగా రాసింది.... ఎవర్నయినా నొప్పించి ఉంటే వారికి ముందస్తు క్షమాపణలు... మీ ప్రస్తావన తీసేయ్యమంటే తీసేస్తాను.ఫ్రెండ్స్ (బ్లాగ్బ్రదర్స్ & ఇన్లాస్) ....... 

మొన్న జ్యోతిగారి పోస్టు, బజ్‌లొ చాలెంజ్‌లు, ఆ పైన మధురవాణి గారి పోస్ట్, దాంట్లో మన కేడీస్ సారీ అదే మన లేడీస్ కామెంట్లు... చూసాక నాలోని వంటరాత్మ (వంటొచ్చిన అంతరాత్మ)కి పంతం వచ్చింది. ఎలాగయినా వీళ్ళకు మన మగజెంట్స్ టాలెంట్ చూపించాలని మరియూ మన సీనియర్ చెఫ్స్ నల,భీముల పరువు నిలబెట్టాలని సమయానికి కంకణం అందుబాటులో లేకపోవడంతో ఫ్రెండ్షిప్ బాండ్ ఒకటి కట్టుకుని రంగంలోకి దిగాను. ఈ మ్యాటర్ కొంచం కాట్రవల్లి అని అర్ధం అయింది. అందరూ చేసేది మనం చేస్తే సరిపోదు...ఏదయినా కొత్తది చేసి వీళ్ళ చేతులు కట్టించాలని ("నోళ్ళు మూయించాలని" అనే దానికి ఆన్లైన్ ఈక్వలెంట్) అనుకుని ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా ఒక ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది. అదే చుంబరస్కా... ఇదయితే ఇప్పటివరకు ఎవరూ చెయ్యనిది(చెయ్యలేనిది) మరియు కృష్ణప్రియ గారి కన్నా ముందుగా దీనికి పేటెంట్ హక్కులు సంపాదించ్చొచ్చు. (అసలే ఈమద్య ఎడిసన్ టెస్లా పేటెంట్లు అంటూ ఎక్కువ ఆలోచించా కదా.. పక్కొళ్ళకన్నా ముందు పేటెంట్ ఎలా సంపాదించాలి అన్నదాని మీద బాగా ఐడియా వచ్చిందన్నమాట). 

అనుకున్నదే తడవు వెంటనే నిన్న రాత్రి రంగం లోకి దిగాను. ఈ చుంబరస్కా అనేది స్వీట్ గా చేద్దామని నా ప్రయత్నం . 

ఇది చెయ్యడానికి ముందు కావలసినవి జీడిపప్పు కిస్మిస్ .....................................................


ఆహా...జీడిపప్పు ...ఆ పేరు వింటేనే నా గుండెలో కోటి సితార్లు మొగుతాయ్. జీడిపప్పే కాదు , బాదం , పిస్తా,  వాల్నట్, వేరుశనగ గుళ్ళు వీటి పేర్లు వింటేనే నాలో నరాలు జివ్వుమంటాయి.....కొలెస్టరాల్ కెవ్వుమంటుంది. ఏంటి అలా చూస్తున్నారు .... కావాలంటే ఈ ఫోటో చూడండి ... ఇంట్లో ఎప్పుడూ ఇలా డబ్బాల నిండుగా పప్పులుండాలి. ఇక కిస్‌మిస్ గురించి చెప్పేదేముంది ...మిస్‌కిస్ లా తియ్యగా  ఉంటుంది అని మనకి తెలుసుకదా ...
సరే విషయం లోకి వస్తే ముందు రెండు గుప్పుళ్ళు జీడి పప్పు (ఒక గుప్పెడు చుంబరస్కాకి ... ఇంకో గుప్పెడు వంట అయ్యేలోపు నేను తినడానికి) , కొన్ని కిసమిస్ లు నేతిలో వేపించి పక్కన పెట్టా. ఇది గార్నిషింగ్ కోసమన్నమాట... అదేంటి ముందు గార్నిషింగ్ తయారు చెయ్యడమేంటి అని మన కేడీస్ లా ఆలోచించొద్దు...చెప్పాను కదా...దాంట్లో ఒక గుప్పెడు నేను వంట చేస్తున్నప్పుడు తినడానికి . ఆ తరువాత నెక్స్ట్ స్టెప్ .... కావలసినవి తీసుకు పెట్టుకోవాలి.

ఇప్పుడు ఏం చెయ్యాలి... బియ్యం కావాలి... హమ్మయ్య ...బియ్యం డబ్బా వెంటనే దొరికింది.... పెసరపప్పు (మూంగ్ దాల్) ..ఇది పక్కనే దొరికింది... పాలు కావాలి... ఓకే పాలంటే ఫ్రిజ్ లో...ఫ్రిజ్ తలుపు తెరిచి వెతుకుతున్నా...హమ్మ్ ...ఇది చికెన్ ....ఇది మటన్...ఉహు ఇది రొయ్యలు...అబ్బే ఇది ఫిష్....ఇదేంటి ..కాదు ఇది  క్రాబ్ మీట్ , మరి ఇది...ఓకే ఇది హాట్డాగ్ ... పాలేక్కడా అని వెతుక్కుంటుండగా ఈలొపు  "పాలు డీఫ్రిజ్ లో ఎందుకుంటాయి ...కింద వెతుకు అని" ఒక వాయిస్ వినిపించింది.... వెంటనే కంగారోచ్చింది....నిన్న హోల్ చికెన్ (whole chicken) ఇమ్మంటే ఆ చైనీస్ షాపోడికి అర్ధంకాక బతికున్న కోడిచ్చేసాడా..నేను చూసుకోకుండా ఫ్రిజ్ లో పెట్టేసానా అని.... చూసాను... అదికాదు...మరి ఆ గొంతెవరిది అని తిరిగి చూస్తే పక్కనే నా వంటరాత్మ కోపంగా చూస్తూ...ఒకే ఒకే అని కింద అర నుండి పాలు తీశాను ...ఒక గిన్నెలో ఒక కప్పు కడిగిన బియ్యం , అరకప్పు కడిగిన పెసరపప్పు, ఒక కప్పు చిక్కటి పాలు , మూడుకప్పులు నీళ్ళు వేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకూ కుక్కర్ లో మెత్తగా ఉడికించా....

ఈలోపు పక్కనుండి సెల్ మోగింది .... ఆర్యా -2 సాంగ్ రింగ్ టోన్... " హే... టిప్పుటాపు దొర కదిలిండొ ..ఎవడికి వీడు దొరకడులెండొ...ముదురండొ...గడుసండొ... తొడిగను ముసుగండొ... ఉప్పుకప్పురంబు నొక్కలుక్కునుండొ....వీడి రూపుచూసి మొసపొకండొ............ కమాన్ కమాన్ మొస్ట్ కన్నింగు" ... అంటూ  
ఒహొ నాగా ఫొన్ ... ఫోన్ తీశాను.... ఆ పక్క నాగా

*   *   *


" అన్నాయ్ కుక్కర్ తో చపాతీలు ఎలా వండాలి"
" కుక్కర్ తో చపాతీలేంటి .. బాలయ్య బాబు సినిమా ఎమన్నా చూసావా.. "
" నాదగ్గర కుక్కర్ ఒకటే ఉందన్నాయ్... నాకర్ధం కాకే నీకు ఫోన్ చేసాను"
" మరి ఎలాగా.... అస్సలు ఇంకేం పాత్రలు లేవా ..చుట్టూ చూడు ఒకసారి "
" ఉహు ఏం లేవన్నాయ్.... ఎవరో తాగి పాడేసిన కింగ్ ఫిషర్ బాటిల్ తప్ప ఇంకేం లేవు "
" నీ రూం లో నువ్వు తప్ప ఇంకేరెవరు ఉంటారు?"
"ఇంకెవరు ఉండరాన్నాయ్... నేనొక్కడినే ...ఏం ఎందుకు ?"
" ఏం లేదులే...ఎవరు తాగి పారేసారో అని .... సరే చెప్తా వినుకో... ముందు కుక్కర్ గిన్నెలో గోధుమపిండి వేసి నీళ్ళు పోసి బాగా కలుపు... ఆ తరువాత ఆ పిండి చిన్న చిన్న ముద్దలు గా చేసి... ... ఆ కుక్కర్ వెనక్కి తిప్పి దానిమీద ఈ ముద్ద పెట్టి ఆ కింగ్ ఫిషేర్ బాటిల్ తో గుండ్రంగా వత్తు...ఆ వత్తినవి ఒక న్యూస్ పేపర్ లో పెట్టుకుని  ...." 
" అన్నాయ్ న్యూస్ పేపర్ మీద ఆంటే... ఇలియానా బొమ్మ ఉన్న పేపర్ లో పెట్టాలా...కత్రినా కైఫ్ ఫోటో ఉన్న పేపర్ మీద పెట్టాలా ?"
" @()$*(@* "
" సారీ ...నువ్వు చెప్పన్నాయ్ "
"ఇప్పుడు కుక్కర్ మళ్ళీ మాములుగా వెనక్కి తిప్పి  ....స్టవ్ మీద పెట్టి ..చేపాతీలు వేయించు...అంతే "
" నువ్వు కేకన్నాయ్....నాకు తెలుసు కుక్కర్ ఉంటే ఏదయినా వండేయొచ్చు అని .. రేపు ఫోన్ చేస్తా...కుక్కర్ తో ఐస్క్రీం ఎలా వండాలో చెప్పన్నాయ్ " 
" సర్లే బై "  .... అని ఫోన్ పెట్టేసా ...చెప్పడం మరిచా....మన బ్లాగర్లందరికీ ఒక్కో సాంగ్ రింగ్ టోన్ గా పెట్టా...ఈజీ గా గుర్తుపట్టడానికి....
ఫోన్ పెట్టాక ...  స్టవ్ లోహీట్ లో పెట్టి ..దాని మీద ఒక గిన్నె పెట్టి...ఉడికించిన అన్నం పెసరపప్పు మిశ్రమం దాంట్లో వేసా....
పై ఫోటో చూసి ఇదేంటి బియ్యం పెసరపప్పు ఉడికించి తీస్తే నేస్తంగారి ఉలవచారులా వచ్చింది అనుకోకండి ... అప్పుడు కరెంట్ పోయింది ...వచ్చేవరకూ వెయిట్ చెయ్యాలి ...నాది కరెంట్ స్టవ్ మరి...

.
.

.
హమ్మయ్య కరెంటు వచ్చింది అనుకుని .. 
*   *   *
ఈ లోపు మళ్ళీ సెల్ మోగింది.... ఈ సారి రింగ్ టోన్ " ఐయాం వెరి సారీ...అన్నాగా వందొసారి..." 

*   *   *

" చెప్పు రంజని ..."
" ఐయాం సారీ అండీ..."
" ఎందుకు ????"
" అంటేనండి ...మరేమోనండి ... మా అమ్మ గారు ఉన్నారు కదండీ.... మరి పొద్దున్న ఊరెళ్ళారండీ.. మరి మా అమ్మగారు వెళితే మా నాన్నగారికి భోజనం నేనే వండాలి కదండీ... అందుకని వంట చేద్దామని పొయ్యిమీద పప్పు పెట్టానండి... అది ఉడికేలొపు ఒకసారి మాలిక చూసొద్దామని ఇలా వచ్చానండీ.... అంతేనండీ అసలు టైమే తెలీలేదండి .... ఈలొపు ఎదొ మాడు వాసనొస్తుంటే చూసాను కదండీ.... పప్పు మాడి పొయిందండి ... సమయానికి సారీ చెప్పడానికి ఇంట్లొ ఎవరూ లేరండీ... మా పక్కింట్లోవాళ్ళు కూడా ఊరెళ్ళారండి....అందుకే "
" సరే....అయినా ఈసారి నుండి నాకు సారీ చెప్పాలంటే...ఫోన్ చేసి అక్కర్లేదు .. మిస్సిడ్ కాల్ ఇచ్చినా చాలు..."
" ఆయ్‌బాబొయ్...అదేటండీ...."
" నీ ఫోన్ హలో ట్యూన్ ... నా ఫోన్ లో నీ నెంబర్కి పెట్టినా రింగ్ టోన్ ఒకటే ....ఒకే మరి ...బై...ఉంటాను "

*   *   *

అబ్బ ఈ ఫోన్స్ తో డిస్టర్బ్ అయిపోతుంది... ఇలా ఫోన్లు మాట్లాడుతూ కూర్చుంటే ఈలోపు ఆ పేటెంట్ ఆవిడ పట్టుకుపోతుంది... అని ఫోన్ ఆఫ్ చేసి....


ఇప్పుడు ఆ అన్నం, పెసరపప్పు మిశ్రమం లో పంచదార వేసా... ఎంతవేయ్యాలి అన్నదానికి పెద్ద కొలత ఉండదు... కొద్దిగా వేస్తూ రుచి చూస్తూ ...మనకి ఎంత తీపి నచ్చితే అంతవరకు వేసేయ్యడమే... నేనయితే చిన్న బెల్లం ముక్క కూడా వేసా... ఆ తరువాత దాంట్లో ....నెయ్యి వేసా ... దీనికి పెద్ద కొలత ఏమీ ఉండదు... ఎంత ఎక్కువ వేస్తే అంత  టేస్ట్ ...
పొయ్యిమీద ఉన్న మిశ్రమంలో పంచదార పూర్తిగా కరిగే వరకూ కలియపెట్టి...దాంట్లో కొంచెం యాలికుల పొడి ... అప్పటివరకూ తినగా మిగిలున్న వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి ...దింపి చల్లారే వరకూ ఉంచా.... అసలయితే దీంట్లో వేయించిన చిన్న చిన్న కొబ్బరి ముక్కలు వేద్దామనుకున్నా కానీ సమయానికి ఇంట్లో కొబ్బరికాయ లేదు ...


చల్లారాక ఒక గిన్నెలోకి తీసి మద్యలో ఒక చిన్న గుంట తీసి దాంట్లో కాస్త నెయ్య...కొంచెం బాదం పలుకులు వేస్తే ..ఇలా వచ్చింది...అలవాటు ప్రకారం ఇంట్లోవండిన పిండివంట ముందు ఇక్కడ పెట్టి ...


ఆ తరువాత వెంటనే ఒక బాక్స్‌లొ ఈ చుంబరస్కా పెట్టుకుని మా పక్క సందులో ఉన్న పేటెంట్ ఆఫీసు కి వెళ్లాను...నన్ను చూడగానే నైట్ డ్యూటీలో బయట నుంచుని ఉన్న ఇద్దరు ఆఫీసర్లు ఎదురొచ్చి నన్ను సాదరం గా లోపలి తీసుకెళ్ళారు. సోఫాలో కూర్చోపెట్టి... డ్రింక్ ఎమన్నా తీసుకుంటారా అని అడిగారు... అబ్బే అలవాటు లేదు అని అబద్దం చెప్పా... ఓకే.. తర్వాత తాగాలనిపిస్తే అక్కడ ఉంది అని కోక్ వెండింగ్ మెషిన్ చూపించి లోపలకి వెళ్ళిపోయారు... ఓహో కొద్ది ఎక్కువ ఊహించుకున్నా అని అనుకుంటుండగా...లోపలనుండి పేటెంట్ ఆఫీసరు వచ్చి రండి రండి అని లోపలకి తీసుకెళ్ళాడు...

" చెప్పండి... దేనికి పేటెంట్ ... ఏదయినా పర్లేదు...మా దగ్గర చాలా ప్యాకేజీలు ఉన్నాయి "
ఓహ్... వీళ్ళకీ రిసెషన్ ఎఫ్ఫెక్ట్ బాగానే పడింది అనుకుంటూ ....
" దీని పేరు చుంబరస్కా .. ఈరోజే కనిపెట్టా... దీనికి పేటెంట్ కావాలి..."
" ఏది చూడనివ్వండి... " అని తీసుకుని ఒక స్పూన్ తిన్నాక....
" ఏంటి ఇది చుంబరస్కా నా...ఈరోజే కనిపెట్టారా...ఏం నాటకాలుగా ఉందా "
" నిజం ... ఒట్టు....కావాలంటే ఆ బాక్స్ మీద లేబిల్ అంటించా చూడండి... ఇదిగో సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం కూడా "


" ఎరా నీకు... నేను మరీ మాలిక టీం లా కనిపిస్తున్నానా.... బాక్స్ లో చక్రపొంగలి వేసి పైన చుంబరస్కా అని రాసేస్తే  నేను ఒప్పుకోవాలా .. సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం అంట...డిక్లరేషన్ అఫ్ ఇండిపెండెన్స్ అంత బిల్డప్ ఒకటి  " అని మర్యాదగా చివాట్లు పెడుతుంటే ....

" అయ్యో ...ఇది ఆల్రేడి కనిపెట్టాసారా ..." అనుకుంటూ నిరాశ గా నేను వెనక్కి తిరిగా...

వెనకనుండి... ఇప్పటివరకూ నా టైం వెస్ట్ చేసినందుకు ఆ బాక్స్ వదిలేసి వెళ్ళు అంటున్నాడు ... ఏం చేస్తాం.. అక్కడే వదిలేసి వచ్చా....వాడు దాన్ని చక్రపొంగలి అన్నా ఇంకేమన్నా...నాకు మాత్రం ఇది చుంబరస్కానే .. కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ పేటెంట్ కోసం ప్రయత్నిస్తా.... అప్పటివరకూ... patent pending

---------------------------------------------------------------------------------------------------------------
ఆ. సౌమ్య గారి సౌజన్యంతో మీకో బోనస్ రెసిపీ : చుంబరస్కా టల్లోస్
ఒక రెండు కప్పులు చుంబరస్కా , రెండు కప్పులు టల్లోస్ , ఒక లీటర్ నీళ్ళు కలిపి ఒక 2 నిముషాలు మిక్సీ పట్టి తీస్తే అదే చుంబరిస్కా టల్లోస్.... టల్లోస్ రెసిపీ ఇక్కడ

- మంచు Wednesday, November 3, 2010

న్యూ ఇంగ్లాండ్ ..*** శ్రీ రామ ***

2009 ఫాల్ ....  న్యూహంప్షైర్ రాష్ట్రం 

పెద్దగా చూడటానికి ఫొటొమీద క్లిక్ చెయ్యండి

  

 
 

 
  

-మంచు