Pages

Monday, May 17, 2010

సూరిబాబు కరెంటు...ఇంకేంటి లేటు

*** శ్రీ రామ ***


అదేనండి.. సూరిబాబు ఆంటే మన సూర్యభగవానుడు.. రోజూ చూస్తాం కదా అని కాస్త చనువు కొద్ది ఆ పేరు అన్నమాట.. 'ఆ ఒక్కటి అడక్కు'లో రాజేంద్రప్రసాద్ "సూర్యారావు గారు" అన్నట్టు..

సూర్యుడు లేకపోతే భూమిమీద జీవరాశికి అసలు మనుగడే లేదన్న విషయం మనకు అందరికి తెలిసిందే కదా.. అందుకే ఆయన్ని దేవుణ్ణి  కూడా చేసేసాం .. సూర్యరశ్మి వల్ల కిరణజన్య సంయోగక్రియ జరిగి, మొక్కలలో పిండిపదార్దం తయారవుతుందని.. అదే మనకి ఆహారం తయారు చేస్తుందని అని.. గట్రా గట్రా చిన్నప్పుడు చదువుకున్నాం. అయితే ఆయన మనకి అందిస్తున్న వనరులన్నీ మనం పూర్తిగా ఉపయొగించుకుంటున్నామా ఆంటే లేదనే చెప్పాలి. సూర్యుడు అందించే అపారమయిన శక్తి లో ఈరోజు మనం చాలా కొద్దిశాతంమే మనం ఉపయోగించకోగలుగుతున్నాం. ఉచితంగా వచ్చే ఈ శక్తిని వాడుకోవడానికి ఏంటి సమస్య అన్నది చాలామంది కొచ్చే ప్రశ్న.. సో నాకు తెలుసున్నది వీలయినంత సరళం గా చెప్పడానికి ప్రయత్నిస్తా..

సూర్యుడి నుండి భూమికే చేరే శక్తి ముఖ్యంగా రెండు రూపాల్లో వుంటుంది..

1 . కాంతి
2 . ఉష్ణం

మన ఇండియా లాంటి భూమద్య రేఖకి దగ్గరగా వుండే ఉష్ణప్రదేశాల్లో సూర్యుడి శక్తి ఉష్ణం మరియూ కాంతి రూపం లో లభ్యం అవుతుంది .. అంటార్కిటికా లాంటి ద్రువాల దగ్గర వుండే ప్రదేశాల్లో మరియూ అంతరిక్షంలోనూ  సూర్యుడి శక్తి ఎక్కువ శాతం కాంతి రూపం లో వుంటుంది..

ఉష్ణం: సూర్యుడు ద్వారా వచ్చే ఉష్ణశక్తిని గ్రహించి, మన వాడకానికి అనువుగా మార్చడానికి మనం సోలార్ వాటర్ హీటర్ ని ఉపయోగిస్తాం.. బెంగళూరులో ఎక్కువ ఇళ్ళలో ఈ వాటర్ హీటర్లు మనకి దర్శనమిస్తూ వుంటాయ్.. టూకీగా చెప్పాలంటే.. ఎండ వేడితో నీళ్ళు కాచి అది ఫ్లాస్కు లో దాచి , మనకి కావలసినప్పుడు వాడుకోవడం అంతే. ఇళ్లలోనే కాకుండా, హోటల్స్ లో, లాండ్రిలలో, ఎయిర్ పోర్ట్ లలో వేడి నీరు కావాల్సిన ప్రతిచోట ఇవి ఉపయోగించవచ్చు.. అయితే మబ్బు పట్టినప్పుడు, వర్షం పడుతున్నప్పుడు వాతావరణంలో ఎక్కువ వేడి వుండదు కనుక అప్పుడు ఇవి ఎక్కువ వేడి నీటిని ఇవ్వలేవు.. అందుకే కమర్షియల్ ప్రొడక్ట్స్ లో సోలార్ హీటర్ లో కరెంట్ హీటర్ కూడా అమరుస్తారు.. ఒకవేళ సూర్యుడి వేడి లభించనప్పుడు కరెంట్ తో నీటిని వేడి చేసుకోవచ్చు.. టాటా బి పి సోలార్  మరియూ వోల్టాస్ కంపెనీలు ఇండియాలో తయారు చేస్తున్నాయని నాకు తెలుసు.. ఇంకా చాలా కంపెనీలు ఉండివుంటాయ్ .. వీటి ధర తక్కువే , నిర్వహణ ఖర్చు కూడా తక్కువే.. ఇక్కడ గమనించల్సినది ఏమిటంటే ఇవి హీటర్లు మాత్రమే.. దీనితో కరెంట్ ఉత్పత్తి చెయ్యలేం.. మీకు వేడినీళ్ళు ఎక్కువ అవసరం అనిపిస్తే కళ్ళుమూసుకుని కోనేయచ్చు :-)

కాంతి: సూర్యుడి అందించే ఇంకో శక్తి కాంతి రూపం లో వుంటుంది. సూర్యరశ్మి లోని ఈ శక్తిని వెలికి తీసి మనకి వాడకానికి అనువయిన రూపం లోకి మార్చడానికి మనం సోలార్ పేనల్స్ వాడతాం. ఒక్కో సోలార్ పేనల్ లో కొన్ని పదుల లేక వందల ఫోటోవోల్టాయిక్ సెల్ల్స్ వుంటాయి. మనకి కావాల్సిన పవర్ ని బట్టి సోలార్ పెనల్స్ వుండే ఫోటోవోల్టాయిక్ సెల్ల్స్ సంఖ్య  ఆధారపడి వుంటుంది. టూకీగా చెప్పాలంటే సూర్యరశ్మిలో వుండే ఫోటాన్లు ఈ ఫోటోవోల్టాయిక్ సెల్ లో వుండే electrons ని ఉత్తేజపరచడం ద్వారా కరెంట్ పుట్టిస్తుంది... DC రూపం లోవున్న ఈ కరెంట్ ని AC లోకి మార్చి మనం వాడుకుంటాం అన్నమాట.. అంతే కాకుండా దీంట్లో కొన్ని బాటరీలు అమర్చుకుంటే ..పగలు ఉత్పత్తి చేసిన విద్యుత్ దాంట్లో నిలువ ఉంచుకొని ..రాత్రి వాడుకోవచ్చు..
మనింటికి ఎవరయినా సేల్స్మెన్ వస్తే ..వాడు చెప్పిందంతా విని/వింటూనే ..మనం అడిగే మొదటి ప్రశ్న .. " అది సరే గాని ..దీని ఖరీదు ఎంత అని" .. అక్కడికే వస్తున్నా..

పైన బొమ్మలో చూపించినట్టు , సోలార్ పేనల్ 'సూర్యరశ్మి లోని శక్తి ని గ్రహించి  DC విద్యుత్చక్తి గా మార్చి' ఇన్వెర్టర్ కి అందిస్తుంది. అలాగే దానికి పక్కన తగిలించివున్న బాటరీ ని కూడా ఛార్జ్ చేస్తుంది.. ఆ ఇన్వెర్టర్ ఆ DC రూపం లో వున్న విద్యుత్ ని మనం వాడుకునే  AC విద్యుత్తు లోకి మారుస్తుంది. అలాగే సూర్యుడు నుండి శక్తి లభించనప్పుడు , ఈ ఇన్వెర్టర్ బ్యాటరి లో నిల్వ చేసి వున్న విద్యుత్చక్తిని మనకి అందిస్తుంది. ఆ బొమ్మలో చూపించిన వాటిలో సోలార్ పానెల్ తప్ప మిగతావన్నీ మనకి అందుబాటులో వున్న ధరలలోనే వుంటాయ్.. ఆ సోలార్ పేనల్ ఒక్కటే ధర తప్ప .. నిర్వహణ ఖర్చు ఇంచుమించు సున్నా ఆయినా ఆ సోలార్ పేనల్ కి మొదట్లో పెట్టాల్సిన పెట్టుబడి ఎక్కువ కాబట్టి ఇవి కొనడానికి ప్రజలు అంత ఉత్సాహం చూపించడం లేదు. అందులోనూ వడ్డీ రెట్లు ఎక్కువగా వుండే మన దేశం లో దానిమీద వచ్చే వడ్డీతో పోలిస్తే ఈ సోలార్ పేనల్స్ మీద పెట్టుబడి అంత ఆకర్షణీయం గా కనిపించదు. (మన దేశం లో బాంక్ వడ్డీ కన్నా తక్కువ  ఆదాయం వస్తూన్నా ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నది వ్యవసాయం మాత్రమే ).. 

ప్రపంచంలో ఎక్కువ సోలార్ పెనల్స్ కలిగివున్న దేశం జర్మని.. ఆ పవర్ అంతా ఇక్కడ ప్రభుత్వమో లేక పవర్ కంపెనీలో  ఉత్పత్తి చేసేది కాదు... అవన్నీ సామాన్యప్రజలు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోనో , పోలాల్లోనో  పెట్టుకున్నవే.. అంత ఖరీదయివుండి అంత మంది ఎలా సోలార్ పెనల్స్ అమర్చుకున్నారు ఆంటే ..  దానికి కారణం అక్కడి ప్రబుత్వ ప్రోత్సాహం.


ఇప్పుడో చిన్న లెక్క చూద్దాం.. 

జర్మనీ లో వినియోగదారుడు తను వాడుకున్న యూనిట్ కి చెల్లించే రేటు ఇంచుమించు 13 రూపాయలు.. అదే వినియోగదారుడు ఉత్పత్తి చేసి గ్రిడ్ కి సప్ప్లై  చేసే యూనిట్ కి ప్రబుత్వం ఇంచుమించు 26 రూపాయలు చెల్లిస్తుంది ..  జర్మనీలో ... మనకి నెలకి 300 యూనిట్ల విద్యుత్ వాడకం ఉందనుకోండి .. అప్పుడు మీరు నెలకి 600 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ పేనల్ కోంటే దాంట్లో 300 వాడుకుని మిగతా 300 యూనిట్లు ప్రబుత్వానికి అమ్మితే మనకి నెలకి 7,800 ప్రబుత్వం దగ్గర నుండి ఆదాయం వస్తుంది.. 3900 కరెంట్ ఖర్చు మిగులుతుంది.. ఇలాంటి సైజ్ వున్న సోలార్ యూనిట్ కొనటానికి ఇంచుమించు 15 లక్షలు అవుతుంది ..  ఈ లెక్కన మన పెట్టుబడి, వడ్డీ కలుపుకున్నా ఇంచుమించు పదమూడు, పద్నాలుగు సంవత్సరాలలో అంతా తిరిగి వచ్చేస్తుంది..  ఆకర్షణీయమయిన  ఇంకో విషయం ఎమిటంటే.. ఈ సొలార్ పవర్ పొడక్త్స్ కి 15 నుండి 20 సంవత్సరాల వారెంటీ వుంటుంది..


మన దేశం లో ఈ సోలార్ పానెల్ అదే ధర వుంటుంది.. మనం ఉత్పత్తి చేసి  తిరిగి గ్రిడ్ కి సప్లై చేసినా ప్రబుత్వం పైసా తిరిగి ఇవ్వదు. పోనీ మనకి కావాల్సింది మనం ఉత్పత్తి చేసుకుందామనుకున్నా.. ఇండియాలో కరెంట్ యూనిట్ ధర తక్కువ కాబట్టి ఇంత పెట్టుబడి గిట్టుబడి కాదు..


దీనికోసం కరెంట్ రెట్లు పెంచమని అడగలేం కదా :-) సరే చెయ్యాల్సింది.. సోలార్ పేనల్ ఖర్చు తగ్గించాలి..  మిగతా electronics (ఆంటే ఇన్వేర్టర్, బాటరీ, బాటరీ చార్జర్ .. గట్రా )  మన ఇండియా చైనాల్లో చాలా చీప్.. (కానీ మీకు 15 - 20 సంవత్సరాలు వారెంటీ కావాలంటే మాత్రం ఈ అమెరికన్ కంపనీదో జపాన్ కంపనీదో ఎంచుకోవాలి.. :-))..  సోలార్ పానెల్ ధర తగ్గించాలంటే దానిలో వాడే మెటీరియల్ ధర  తగ్గాలి, లేక అదే సోలార్ పేనల్ నుండి ఎక్కువ  పవర్ రాబట్టగలగాలి.. ప్రస్తుతం ఈ రెండు విషయాల మీద ప్రపంచవ్యాప్తం గా పరిశోధన జరుగుతుంది.. ఈ రిసెర్చ్ లో .. యూరోప్ , చైనాలు మాత్రం దూసుకుపోతున్నాయ్. అమెరికా కాస్త లేట్ గా కళ్ళు తెరిచి వెనుక పరిగెడుతుంది.. మన దేశం ఎక్కడుందో తెలీదు మరి..


మన దేశం లో ప్రబుత్వమే విద్యుత్ ఉత్పత్తి చేయిచ్చు కదా అనుకుంటే.. సోలార్ తో పోల్చిచూస్తే మిగతా మార్గాల్లో అత్యంత తక్కువ  ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేయగలిగినప్పుడు .. సోలార్ కి ప్రబుత్వం మాత్రం ఎలా ఖర్చుపెడుతుంది .. 

నాకయితే ఏదో అద్బుతం జరిగితే తప్ప వచ్చే 5 సంవత్సరాలలో మన దేశం లో  ప్రతి ఇంట్లో పెట్టుకోగల సోలార్ పేనల్స్ వచ్చే సూచనలు కనిపించడం లేదు.... ఏ  చైనా వాడో మాంచి చీప్ గా డెవలప్ చెయ్యగలిగితే తప్ప.. సో అదీ లేటు..


మంచు

గమనిక : ఎక్కువమంది కి అర్ధం కావడం కోసం , టెక్నికల్ కంటెంట్ వీలయినంత తగ్గించాను.. ఎవరికయినా ఆసక్తి వుంటే (నూతక్కి గారు లాంటి వారు ) నన్ను మెయిల్ ద్వారా  సంప్రదించగలరు.Thursday, May 13, 2010

లెక్కలు మాస్టారు - మొదటి గర్ల్ ఫ్రెండ్ - 2

***  శ్రీ రామ ***

అలా ఉండగా ఒక రోజు ... 

ట్యూషన్ లో కునికిపాట్లు పడుతూ మా  శర్మగారు చెప్పేది వింటూనట్టు ఏక్షన్ చేస్తూ చాలా బిజీగా వున్నా .. ఎప్పుడయినా నేను ట్యూషన్ లో కునికిపాట్లు పడుతూవుంటే నన్ను గాఠిగా గిల్లరా మా బాచిగాడికి చెప్పా. ఆరోజు  వాడూ  నిద్రపోతున్నాడు. ఇంతలో ముందు బెంచినుండి " నీ విభాగిని ఒకసారి ఇస్తావా.. లెక్క చేసి మళ్ళి ఇచ్చేస్తాను " అని ఒక కోకిల గొంతు వినిపించింది.. తల పైకెత్తి చూసా ... నిద్ర పూర్తిగా ఎగిరిపోయింది.. రెండు ముళ్ళు వున్నదాన్ని 'విభాగిని' అంటారని , అసలు దాన్ని ప్రజలు వాడతారని అప్పటివరకు నాకు తెలీదు.. అవి తెలీకపోయినా పర్లేదు.. అంత అందమయిన అమ్మాయి మా ట్యూషన్ లో వుందని , స్కూల్లో తను మా సేక్షనే అని కూడా తెలీని దద్దమ్మని నేను.. నా దగ్గర కాంపస్ బాక్స్ లేదని సిగ్గుపడుతూ తనకి చెప్పి పక్కకి తిరిగి ...

" ఆ అమ్మాయి ఎవర్రా " మా బాచిగాడిని కుదుపుతూ అడిగా...
" ఆ అమ్మాయి నాగలక్ష్మి రా .. మీ సేక్షనే కదా నీకు తేలీదా"..  "కరెంట్ అఫైర్స్ " మీద నాకున్న పరిజ్ఞానానికి జాలిగా చూస్తూ చెప్పాడు వాడు ..
" )(@$_)*;!^@ "

నాగలక్ష్మి మొదటి చూపులోనే నాకు తెగ నచ్చేసింది ..  అసలు అమ్మాయిలు అంత అందంగా వుంటారా అన్నంత.. ఆ.. ఆ ఏజ్ లో.. అందులోనూ మొదటి లవ్ ఎవరికయినా అలాగే వుంటుంది బాబూ అని దీర్ఘాలు తీస్తున్నారా ..:-)) .  ఏంటో ఆరోజు మా దామోదరశర్మ గారు కూడా పాఠాలు బాగా చెబుతున్నారనిపించింది (నాకేమి అర్ధం కాకపోయినా).. నా డొక్కు సైకిల్ మీద వెళ్తుంటే గాలిలో తేలుతున్నట్టుంది... జుట్టు దువ్వుకోవడానికి ఇంకో  గంట ముందు లేపలేదని మా అక్క మీద కోపమొచ్చింది. (నా జుట్టు సరిగ్గా  దువ్వాలంటే మినిమం గంట పడుతుంది.. ఏదో స్టాటిక్ ఎలక్ట్రిక్  షాక్ కొట్టినట్టు ఎప్పుడూ పైకి నుంచునే వుంటుంది.. మరీ ముళ్ళపందిలా కాదులెండి )  ...

మొత్తం మీద నాగలక్ష్మి ఇల్లు కనుక్కున్నా(ము). తను వుండేది మాకు నాలుగు వీదులవతల.. వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మా వూరు కొత్తగా వచ్చారన్నమాట..తను నాతో తెగ మాట్లాడేసినట్టు, మేమిద్దరం ఏవో పుస్తకాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు ఏవో ఊహలు.. కలలు.. (అప్పటికింకా చిన్నపిల్లాడిని కదా. అందుకే  పుస్తకాల వరకే ఆలోచించగలిగా :-)).. ఏంటో ప్రపంచం అంతా కలర్ ఫుల్ గా వుండేది.. అంతకుముందు ఎవరయినా తిక్క పని చేస్తే మాంచి కోపం వచ్చేది .. కానీ అప్పుడు కోపం స్తానే జాలి కలగడం మొదలయ్యింది.. ముఖానికి  పౌడర్  రాసుకోవడం లాంటి విపరీత చర్యలు , పొద్దున్నే ఐదుగంటలకి లేవడం లాంటి వైపరిత్యాలు .. ఒకటేమిటి .. శంకర్ దాదా లో చిరు లైలా సాంగ్ లో  చెప్పినట్టు అలవాటు లేని  మంచి పనులు అన్నీ ఒకేసారి సడన్ గా మొదలు పెట్టాను.. కానీ ఒక్కసారి కూడా మాట్లాడటానికి దైర్యం సరిపోలా.. (నా రీఫిల్ అయిపొయింది నీ దగ్గర ఇంకో పెన్ను వుందా అని ఒకసారి అడిగా లెండి) ..
 *      *       *
 
" ఒరేయ్ .. తాడిలా వున్నావ్ ఆ గేటు ఎక్కి ఊగకపోతే..దాన్నలా తిన్నగా ఉంచొచ్చు కదా .."  అమ్మ ఎవర్నో తిడుతుంది....


ఏంటో అమ్మకీమద్య కోపం బాగా ఎక్కువయింది అని నవ్వుకున్నా ..మా గేటు మీద ఊగుతూ.. (నేను ఇంజినీరింగ్ మూడో సం|| వచ్చేవరకు మా గేటు మీద ఎక్కి అటూ ఇటూ  వుగేవాడిని.. అదో హాబి చిన్నప్పుడు..) ..  
 
ఇంతలో మా ఇంటి ఎదురు కిరాణా సత్యనారాయణ కొట్లో ఏవో కొనడానికి సైకిలు వేసుకుని వచ్చింది తను .. నాకు ఆశ్చర్యం వల్ల కలిగిన సిగ్గుతో కూడిన సంతోషం తన్నుకొచ్చింది.. ఆ సంతోషం లో గేటు మీద నుండి తూలి కింద డ్రైన్ లో పడబోయి ..పక్కనున్న పిట్టగోడని పట్టుకుని ఎలాగోలా ఆపుకుని మొత్తం మీద గేటు మీంచి కిందకి దిగా.. మనం చేసిన ఫీట్లు చూసి ఒక చిరునవ్వు విసిరి కొట్లోకి వెళ్ళింది.. ఆ నవ్వుకి  ఫ్లాట్ అయిపోయి బయటకు ఎప్పుడొస్తుందా అని  కాలు కాలిన పిల్లిలా అటూ ఇటు  తిరుగుతున్నా..
 Click to get cool Animations for your MySpace profile


ఈ లోపు ఇంట్లోంచి మా అక్క బయటకు వచ్చి అక్కడే నిలబడి చూస్తోంది.. బట్టలు పిండటంలో సహాయం చెయ్యకుండా  వీదిలో ఎంచేస్తున్నావ్ అని ఆ టైంకి ఎప్పుడూ మా అక్కని తిట్టే మా అమ్మ ...ఈ రోజేందుకు ఇంకా  అక్కని పిలవడం లేదని కోపం వచ్చింది.. ఆఖరుకి మా అక్క ఉండగానే తను బయటకి వచ్చింది.. రాగానే మా అక్కని చూసి నవ్వుతూ పలకరించింది .. ఆ తరువాత  మీ ఇల్లు ఇదేనా అని నన్ను అడిగింది.. అవును అన్నట్టు తలకాయ్ ఊపా (సాధారణంగా నేను తలకాయ్ ఊపితే అది 'అవునో' 'కాదో' ఎవరికీ ఒక పట్టాన అర్ధం కాదు.. ఒకసారి మా యూ ఎస్ మేనేజర్ అడిగాడు .. "నిలువుగా ఊపితే 'అవునని'... అడ్డంగా ఊపితే 'కాదని'.. నాకు తెలుసు.. కానీ నువ్వేంటి గుండ్రంగా ఊపుతావ్.. దాని అర్ధం ఏమిటి అని ). ఆ తరువాత మా అక్క ఏదో అది ఇది  సోది మాట్లాడి , మొత్తానికి ఇంట్లోకి పిలిచింది.. మొదటిసారి సోదరి ప్రేమ ఆంటే ఏమిటో నాకు తెలిసొచ్చింది.. అలా మా అక్క దయవల్ల మొదలైన మా పరిచయం .. అవసరం వున్నా లేకపోయినా ఒకరి నోట్సులు  ఒకరు తీసుకోవడం (నా నోట్సు తీసుకుందంటేనే చెప్పొచ్చు..ఎంత కామేడినో :-) ) , హ్యాపీ న్యూ ఇయర్ శుబాకాంక్షలు కాస్ట్లీ గా మారడం.. ఎప్పడూ వాళ్ళ వీదిలో సైకులేసుకుని రౌండ్లు కొట్టడం.. నేను కొట్టిన బెల్ కి తను బయటకు రావడం..  (అదే కోడ్ మాకు)..
ఒకసారి బెల్ కొడితే వాళ్ళ పోర్షన్ కుక్క బయటకు వచ్చింది.

"లవ్ అట్ ఫస్ట్ బైట్ " అంటూ నా వెంటపడిన ఆ వెధవ కుక్కని తప్పించుకోవడానికి ఎంత స్పీడ్ గా సైకిల్ తొక్కానో.. అదే స్పీడ్ ఇంకొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసివుంటే "Tour de France" కి సెలెక్ట్ అయిపోదును...  మా బాచిగాడికి , నాకు ఒకటే సైకిల్.. ఎప్పుడూ నువ్వు తొక్కు ఆంటే నువ్వు తొక్కు అని ఆఖరికి ఇద్దరం సైకిల్ కిందపాడేసి  దాన్ని తోక్కేవాళ్ళం.. అలాంటిది.. నాగలక్ష్మి వాళ్ళ వీదిలోకి వెళ్ళడానికి.. 'తోడురారా బావా' అని నేనే తొక్కుతూ తీసుకెళ్ళి.. వాళ్ళ వీది చివర్లో సీట్లు మారి.. నేను వెనుక కూర్చుని , మళ్లీ వీదిలోనుండి బయటకు రాగానే మళ్లీ నేను తోక్కేవాడిని.. తనముందు నేను తోక్కికే నామోషి కదా.. :-))  పది లొనే ఇంత ముదిరిపొతే ఆ తరువాత ఇంకెంత  వెలగబెట్టా అనుకుంటున్నరా.. తర్వాత చెప్తాలే...


ఏదో అలా బిజీ బిజీ గా గడిచిపోతున్న టైం లో ఒక రోజు మా బాచిగాడు వచ్చి .. ఒరేయ్  మా చేల్లి అంత అందంగా వుంటుంది కదా (చెల్లెలో, అక్కో అనాలని మా ఇద్దరిమద్య ఒప్పందం) ... మన స్కూల్ లో ఇంకెంత మంది ట్రై చేస్తున్నారో అని, నా గుండెలో పెద్ద బండరాయ్ పడేసి, వాడు తాపీగా చేరుగ్గడ తింటున్నాడు.. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే వాడే ఒక  ఐడియా (జీవితాన్నే మార్చేసే) చెప్పాడు..  ఇలా ఎన్నాళ్ళెహే.. ఒక లవ్ లెటర్ రాసెయ్ అని ..
 
ఇదేదో బాగానే వుంది ..సరే అలాగే రాసెద్దాం అని కూర్చుంటే.. దానికన్నా నా క్లాస్ ఎగ్జాంసే ఈజీ అనిపించింది.. మొత్తం మీద నా సిని, వారపత్రికల పరిజ్ఞానం ఉపయొగించి (ఛ..ఇంటర్నెట్ అప్పుడు లేదు). ఒక లవ్ లెటర్ రాసా.. చెప్పుకోకూడదు కానీ.. అది నాకే పిచ్చపిచ్చగా నచ్చేసింది :-)) ..  రాసిన లెటర్ తన డెస్క్ లో పెట్టా.. ఆరోజు సాయింత్రం క్రికెట్ గ్రౌండ్ లోకి  మా క్లాస్మేట్ వెంకటేష్ (అసలు పేరు వెంకటేశులు) గాడు , వాళ్ళ బాచ్ తో వచ్చాడు.. నా  సుడి బాగోక అప్పుడు బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నా..  వస్తూనే నన్ను పట్టుకి ఒక నాలుగు పీకులు పీకి .. వెళ్ళిపోతూ  "మళ్ళి నాగలక్ష్మి వైపు చూస్తే  మళ్ళీ మళ్ళీ తగులుతాయి" అని ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.. నా లెటర్ విషయం తెలీక , విషయం ఏమీ అర్ధం కాక వెంటనే వాడిని తన్నడానికి మా బాచ్ బయలుదేరింది.. మొత్తం మీద ఒకరినొకరు కొట్టేసుకున్నాక తేలిందేమిటంటే.. మా క్లాస్లో ఇద్దరు నాగలక్ష్మిలున్నారని. నేను లెటర్ ఇద్దామనుకున్నది N నాగలక్ష్మి కైతే .. అది డెస్క్ నుండి తీసుకున్నది ఆ వెంకేటేష్ గాడు లైనేసే  S. నాగలక్ష్మి అని, అంతే కాక  ఇంకేమి అర్ధం అయ్యిందంటే లవ్ లెటర్ లో ఇంటిపేరు తో సహా  పూర్తి TO అడ్రస్ రాయాలని , FROM  పేర్లు, అడ్రస్లు రాయకూడదని .. 
అలా లవ్ లెటర్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాక .. కొన్నాళ్ళు మళ్ళి ఆలోచించలేదు.. ఆ తరువాత మళ్ళీ  ఇంకో లెటర్ .. ఆ తరువాత ఇంకో లెటర్ ... అలా రాసి ఆ డెస్క్ లో పెట్టడం , రిప్లై కోసం ఎదురు చూడటం.. మొత్తానికి దేనికీ రిప్లై రాకపోవడంతో విసుగొచ్చి మానేసా.. అడగాలంటే  భయం.. అలా పదో క్లాసు పూర్తి అయ్యింది .. ఆఖరు పరీక్ష.అయిపోయాక సాయింత్రం  అందరూ సినిమాకి వెళ్ళాం.. అప్పుడు కాస్త మేనేజ్ చేసి తన పక్కన కూర్చున్నా.... అప్పుడు చెప్పింది.. వాళ్ళకి మళ్ళి ట్రాన్స్ఫర్ అయిందని, త్వరలో మావూరు వదలి వెళ్ళిపొతున్నారని .. (వాళ్ళ నాన్నగారు  'రణం' సినిమాలో ప్రకాష్ రాజ్ టైప్ అనుకుంటా.. ఎప్పుడూ ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి )  .. అలాగే నేను రాసిన లెటర్స్ అన్నీ తనదగ్గరే వున్నాయని.. అవి చాలా నచ్చాయని.. ... కానీ .... (ఆ " కానీ " కి అర్ధం మీకు తెలుసు కదా)


అంతే నా రంగుల ప్రపంచంలో సడన్‌గా కరెంటు పోయింది.. నా ఆశల పందిరి కూలిపోయింది... బాలయ్య నిప్పురవ్వ రిలీజ్ అయ్యింది.. ఇలా చాలా ఘోరాలు ఒక్కసారే జరిగిపోయాయి .. పరీక్షలయ్యాయన్న  ఆనందం, రేపట్నుండి 24 గంటలు  క్రికెట్ ఆడోచ్చన్న  ఉత్సాహం  అన్నీ  ఆవిరయిపోయాయి .. తను వెళ్లిపోయాక కొన్నాళ్ళు ఆ వీదిలోకే  వెళ్ళడం  మానేసా.. గెడ్డం పెంచేద్దమనుకున్నా కానీ అప్పటింకా గెడ్డం రాలేదని ఆ ఆలోచన విరమించుకున్నా.. పాపం నేను :-( ... ఆ  తరువాత  చదువులో  పడిపోవడం ..కాలేజీ  ఫ్రెండ్స్  రావడంతో  కొంతకాలానికి  మర్చిపోయా ...

అది  జరిగిన  కొన్ని  సంవత్సరాలకి  ,

సెమిస్టరు  హాలిడేస్ లో  మా ఊరు వచ్చినప్పుడు వుండే డైలీడ్యూటీకి ( డిగ్రీ  కాలేజీ అమ్మాయిలకి బీట్ కొట్టడం) వెళ్ళా  ..   గేటు  దగ్గర  మా  ఫ్రెండ్స్ అందరం సొల్లు  కొట్టుకొంటూ వచ్చే పోయే  అమ్మాయలను  చూస్తున్నాం .. ఇంతలో  సడన్ గా  తనే  నడుచుకుంటూ  కాలేజ్‌లొ నుండి బయటకు  వస్తోంది ... ఆశ్చర్యం .. ఆనందం.. అన్నీ  కలసి ..వెంటనే వెళ్లి.. 

" హ......య్ .. ఎలా వున్నావ్.. నువ్వు అసలేం మారలేదు.. ఇక్కడే చదువుతున్నవా.. మళ్ళీ మీరు ఈ వూరు ఎప్పుడొచ్చారు"  అని ప్రశ్నలు మీద ప్రశ్నలు గుప్పిస్తున్నా..

వెంటనే తను నవ్వుతూ...

" నేను నాగలక్ష్మి చెల్లెల్నండి.. మీరు నాకు తెలుసు ..మా అక్క ఫ్రెండ్ కదా.. మా అక్క కోసం మా వీదిలొ ఎప్పుడూ తిరుగుతూ వుండేవారు .. ఒకసారి కుక్క వెంటబడింది కూడా.. మా అక్కకి పెళ్ళయిపొయిందండీ. పాలకొల్లు లొ వుంటుంది... ఏదో చెప్తుంది.....

" @*-@$)*$@) " అనుకుంటూ నేను వెనక్కి..( సమాప్తం)
మంచు


Sunday, May 9, 2010

లెక్కలు మాస్టారు - మొదటి గర్ల్ ఫ్రెండ్ - 1

                                                                       
***  శ్రీ రామ *** 
“రాజాధి రాజ, రాజ మార్తాండ (ఛి ఛి  మార్తాండా  అని వెళ్లిపోవద్దు ప్లీజ్ ), శ్రీ శ్రీ శ్రీ చంద్ర చూడామణి వర్మ  మహారాజుగారు (పేరు మార్చడమైనది) వేంచేస్తున్నారహో ఆన్న పిలుపుతో ప్రజలందరూ లేచి నుంచుని జయజయద్వానాలు చేస్తుండగా, మహారాణి మరియూ యువరాణి సమేతం గా  వచ్చిన మహరాజు ఠీవిగా సింహాసనం మీద అసీనులైనారు. ఆరోజు యువరాణి మాలినీదేవి (పేరు బాలేదా ..అది అప్రస్తుతం) స్వయంవరం.. పోరుగుదేశపు యువరాజులు, ఎంతోమంది వీరులు, మహావీరులు తరలి వచ్చినా... యువరాణి తో సహా  అందరి చూపు ఒక వీరుని మీదే నిలచివుంది. అతను ఈ స్వయంవరం పోటీలో విజయం సాధిస్తాడా, యువరాణి అతన్నే వరిస్తుందా అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు .. పోటీ మొదలయ్యింది.. వీరులందరూ హోరాహోరీగా తలపడ్డారు. అందరూ అనుకున్నట్టే అతను విజయం సాధించాడు.. ప్రజలు అందరూ జయజయద్వానాలు చేస్తున్నారు.. యువరాణి సిగ్గులమోగ్గ అయ్యింది.. రాజు చిరుమందహాసం చేస్తూ ప్రజలందరి ముందు 'యువరాణిని అతనికిచ్చి వివాహం  చేయబోతున్నానంటూ' ప్రకటించడానికి సింహాసనం దిగి వచ్చి అతని బుజం తట్టి , యువరాణి చేతిని అతని చేతిలో పెడుతుండగా , అంతలో - - - -  (1)
*     *     *
స్వర్గ లోకం అనుకుంటా మాం...చి కలరింగ్ తో కళకళలాడుతుంది.. కాస్త లోపలి వెళ్లి చూడగానే సింహాసనం మీద అసీనమై వున్న ఇంద్రుడు .. తన ఎదురుగా నుంచున్న కుర్రోడితో ...
"నాయనా.. ఇంతకాలం నన్ను నిస్ఠగా  పూజించినందుకు (???) నీ భక్తికి మెచ్చితిని  .. నీకో వరం ఇద్దామని నిన్ను ఇక్కడకి పిలిపించాను.. లిమిటెడ్ రిసోర్సెస్ వల్ల మిగతా దేవుళ్ళలా నేను పేద్ద పేద్ద వరాలు ఇవ్వలేను కానీ.. చెప్పు ..నీకు రంభ కావాలా రమ్యకృష్ణ కావాలా.. కోరుకో నాయనా" 
" అంత సడన్ గా అడిగితే.... మరి అదేమో... రంభ అయితే.. రమ్యకృష్ణ ఆయినా పర్లేదు.. కానీ.. " 
" పర్లేదు నాయనా .. నీకెవరు బాగా సూట్ అవుతారు నాకు తెలుసు కదా.. సరే ఇదే నా వరం..విను  "
అంతలో  .... (2) 
 *      *       *
ఇండియా పాకిస్తాన్ మద్య షార్జాలో క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ జరుగుతుంది .. స్టేడియం లోనూ టివిల ముందర జనాలంతా మంచి టెన్షన్ తో ఆఖరు బాల్ చూస్తున్నారు. ఆ మ్యాచ్ లోనే డెబ్యు చేసిన ఒక కుర్రాడు 98 పరుగుల మీద ఆడుతున్నాడు. ఇండియా మ్యాచ్ నెగ్గాలంటే ఇంకో 2 పరుగులు చెయ్యాలి. ఆఖరుబాల్ వఖార్ యునిస్ వేసాడు. ఆ కుర్రాడు బలం గా కొట్టాడు.. రెండో పరుగు తీస్తుండగా ఫీల్డర్ విసిరిన బాల్ నేరుగా వికెట్లను తాకింది. మెయిన్ అంపైర్ కనీసం థర్డ్ అంపైర్ వైపు కూడా చూడకుండా అవుట్ ఇచ్చేసాడు.. అది నాటవుట్ అని అంత క్లియర్ గా తెలుస్తుంటే అవుట్ ఎలా ఇచ్చాడా అని  ఆ అంపైర్ వైపు చూస్తే  .... (3)

 *      *       *
(1) .....  " ఆగండి " ఆన్న కేక వినిపించగానే అందరి తలలు  అటువైపు తిరిగాయి . మహామంత్రి  శ్రీ శ్రీ శ్రీ దామోదర శర్మ గారు హడావుడిగా వస్తూ.. వస్తూనే ఆ కుర్రోడు వైపు కోరకోరా చూస్తూ, మహారాజువైపు తిరిగి " వీడికా యువరాణిని ఇచ్చి పెళ్లిచేసేది.. నేను ఒప్పుకోను " అన్నాడు.. 
" మరి అతను స్వయంవరం కి పెట్టిన పరీక్షలన్నిటిలోనూ విజయం సాధించాడు "  
" ఎడిచాడు ..నేను పెట్టిన అన్నీ వీక్లీ టెస్టులలోను ఫెయిల్ ..వాడికి తొమ్మిదవ తరగతి ఫైనల్ లెక్కల పరీక్షలో వందకి పదమూడు మార్కులు వచ్చాయి.. ఏదో రామారావుగారి హాజరు పాసు రూల్ లేకపోతే వాడు పడవ తరగతికే వచ్చేవాడుకాదు "
" అటులనా .. అయితే అటువంటి చదువురాని శుంఠకి యువరాణి ఇచ్చేది లేదు..."
" *@&;)(* " - ఆ యువకుడు .. శ్రీ శ్రీ శ్రీ దామోదర శర్మ ని చూస్తూ .....


* * *

(2) ... ఒక స్వర్గలోకపు భటుడు వచ్చి నారద మహర్షి విచ్చేస్తున్నారు ప్రభూ అని ఇంద్రుడితో చెప్పాడు.. ఆ నారద మహర్షి ని చూడగానే ఆ కుర్రాడికి ఈయన్ని ఎక్కడో చూసినట్టువుందే అనిపించింది..
 నారదుడు " ఏమిటి మీరు చేస్తున్నది .. ఈ అడ్డగాడిద కి ఏదో రంభా..ఇంకేదో వరం అంటున్నారు "
" అవును నారదా.. ఇతని తపస్సుకి, భక్తికి మెచ్చితిని.. అందుకే వరమిస్తున్నాడు.." అని ఇంద్రుడు ఏదో చెప్పబోతుండగా
" వాడి మొహం ..రెండు గంటల  ట్యూషన్ లో గంట ముప్పావు  నిద్రపోతూనే  ఉంటాడు వీడు తప్పస్సు చెయ్యడం ఏమిటి " అంటూ హుంకరించారు  నారదుల వారు 
" అటులనా ..అయితే నేనే ఏదో పోరపాటు పడినట్టు వున్నా ..వీడికి వరం కాన్సిల్ ..భటులారా వీడిని బయటకు పంపండి అని  ఇంద్రుడు ఆజ్ఞాపించాడు ....."పంపండి" అన్నది "గెంటండి" అన్నట్టు వినిపించిన భటులు మర్యాదగా ఆ కుర్రోడికి బయటకు దారి చూపిస్తుండగా ...  
 
" @*+)(*)+(@*@#(*@#(* " - నారదుల రూపంలో వున్న  శ్రీ శ్రీ శ్రీ దామోదర శర్మ గారిని తిట్టుకుంటూ బయటకు నడిచాడా యువకుడు ..
  *      *       *
(3)......" లెక్కల్లో ఎప్పుడూ హాఫ్ సెంచురీ కూడా చెయ్యని వీడా ఇక్కడ సెంచురీ చేసేది .. నేను చెయ్యనివ్వను కాక చెయ్యనివ్వను అని చిందులు తొక్కుతున్న అంపైర్ దామోదర శర్మ గారిని చూస్తూ, హెల్మెట్ తీసి అస్తమిస్తున్న సూర్యుడి వైపు (పడమర వైపున్న పెవిలియన్ వైపు) నడుచుకుంటూ వెళ్ళిపోయాడు...99 మీద రన్నవుట్ ఆయిన ఆ యువకుడు ....

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఇవి మూడు ఉదాహరణలు మాత్రమే కాదు .. ఇంకా ఇలాంటివెన్నో..ఎన్నెన్నో ... 

ఇలా నా జానపద , పౌరాణిక , సాంఘిక 'కల'లని, ఆ కలల్లో నాకు తేనెపట్టు పట్టినట్టు పట్టిన అదృష్టాన్ని నాక్కాకుండా  చేసిన ఆ  శ్రీ శ్రీ శ్రీ  దామోదర శర్మ గారు ఎవరో కాదు.. పదవతరగతిలో నాకు లెక్కలు కం ఇంగ్లిషు కం సైన్సు కి ట్యూషన్ మాస్టారు.. ఆయన సంగతి తెలిసి నేను మొదట్లో ఆయన వుండే వీదిలోకి పొరబాటున కూడా వెళ్ళలేదు...(ఆ  వీదిలో ఇద్దరు అమ్మాయులున్నా సరే).. నేనే కాదు మా బాచ్ ఎప్పుడూ ఆ చాయలక్కుడా వెళ్ళకుండా జాగ్రత్తపడే వాళ్ళం.. అప్పట్లో మా నాన్నగారుకి  వేరే  వూర్లో (మన ప్ర నా ఊరు)  ఉద్యోగం.. నేను పదవ తరగతికి  వచ్చిన రెండు నెలల తరువాత అనుకుంటా .. ఒకరోజు మా నాన్నగారికి మా ఖర్మగాలిన మేనమామ (వేలువిడిచిన మేనమామ టైప్) "వీడు చాలా ఎదిగిపోయాడు.. ఇలానే వదిలేస్తే వీడు పది పాసవడు..చేతులు కాలకుండానే ఆకులు పట్టుకోవాలి.." లాంటి అర్ధంపర్ధం లేని జ్ఞానోబోధ చేస్తే, నేనెంత హృదయవికారంగా ఏడుస్తున్నా లెక్కచేయకుండా ఒక రోజు మాంచి రాహుకాలం లో నన్ను తీసుకెళ్ళి ఆయన దగ్గర ట్యూషన్ చేర్పించేసారు.  అంతే కాకుండా .. ఉద్యోగానికి తిరిగి వెల్లిపొతున్నప్పుడు, మా ట్యూషన్ మాస్టారికి చెప్పారు " సార్ నేను ఈ వూళ్ళో ఉండను కాబట్టి వీడి బాద్యత  అంతా మీదే.. కాస్త జాగ్రత్తగా చూసుకుని ... వీడి తోలు తీసి ఆయినా సరే ..ఎలాగోలా వీడిని పది గట్టెక్కించగలిగితే చాలు అని"..అంతే ఆ  రోజూ  నుండి  నా బతుకు బందరు బస్టాండు అయిపొయింది.. కస్టాలు మొదలయ్యాయి.. 

మాములుగా అందరికి రోజు ఆరు నుండి ఎనిమిది  వరకూ ట్యూషన్..  కాకపొతే కొంతమందికి మాత్రం ఎక్సెప్షన్ వుండేది ..అదేంటంటే  నాలాంటి ఇంకొంత మంది మేధావులకి పొద్దున్న రెండు గంటలతో పాటు సాయింత్రం ఆరున్నర నుండి ఎనిమిది గంటలవరకు స్పెషల్ ట్యూషన్.. ఆదివారం కూడా వదిలేవాడుకాదాయన.. ఒక్కోసారి లేచేసరికే ఆరు అయ్యేది .. లేట్ గా వెళ్ళినప్పుడు ఆయన చేసే  వీరంగం తలుచుకొని ఒకటి రెండుసార్లు పళ్ళు కూడా తోముకోకుండా ట్యూషన్ కి వెళ్ళాను  :-)) . కొంతమంది అమ్మాయిలు అంత పొద్దున్నే పువ్వులు పెట్టుకుని మరీ నీట్ గా తయారయ్యి వచ్చేవారు.. అసలు వాళ్ళు అంత పొద్దున్నే ఎలా లేస్తారో అని కొంచెం ఆశ్చర్యం , బోల్డు జాలి కలేగేది .. 

మా నాన్నగారు చెప్పడం వల్లో, కాస్త కంటికి నదురుగా కనిపించానో తెలీదు కానీ.. ట్యూషన్ చెప్పినప్పుడు అన్ని ప్రశ్నలు నన్నే అడిగేవారు.. అయన అడిగిన ప్రశ్నలకి నాకు తెలుసుండి ఎప్పుడూ సమాధానం చెప్పలేదు.. ఆయినా ఆయన మానేవారు కాదు.. అన్నిటికన్నా అవమానం ఏమిటంటే నన్ను 'మేడి పండు' అని పిలిచేవారు.. నేను పైకి మంచి బ్రైట్ స్టూడెంట్ లా కనిపిస్తాను కానీ పోట్టకొస్తే అక్షరం ముక్క లేదు అనేవారు. నా ఫేస్ అలా వుందని.. దానికి తగ్గట్టు చదవమనడం ఎంత దారుణం.. ఆయన అలా నా పిల్లహక్కుల్ని కాలరాస్తూ వుంటే ఏ ఒక్క బాలహక్కుల సంఘాల వాళ్ళు పట్టించుకోలేదు.. గోడ కుర్చీ, ఎండలో నిలబెట్టడం, బెత్తం తో బడిత పూజ, క్లాస్ లో వెనక్కి వెళ్లి నిలబడటం (ఇది క్లాస్లో నిద్ర పోతున్నప్పుడు), పైకి చదమనడం ...ఇలా నన్ను శిక్షించడం లో ఆయన క్రియేటివిటి కి అంతే వుండేదు కాదు.. ఎన్నో సార్లు తిట్టుకున్నా.. ఆయన్ని .. జాయిన్ చేసిన మా నాన్నగారిని.. అన్నిటికన్నా ముఖ్యంగా మా మావయ్యని.. 

అప్పుడప్పుడు నన్ను పిలిచి స్పెషల్ క్లాసు పీకేవారు.. సబ్జెక్టు గురించి అయితే ఒక బాధ.. కానీ ఈ స్పెషల్ క్లాస్ ఒక విధ్యార్దిగా, కొడుకుగా నా బాధ్యతలు గుర్తు చేస్తూ.. ఆ సెషన్ ఇంకా చిరాగ్గా వుండేది... అలా చెబుతున్నప్పుడు ఇంకెవరయినా క్లాసు మేట్స్ అక్కడ వుంటే ఇంకా చిర్రెత్తుకువచ్చేది.. ఆదివారం ఆడుకుంటున్నప్పుడు చూసినా పిలిచి ఇంటికి పోయి చదువుకో అనేవారు..  

అలా కష్టాలు బాధలతో కాపురం చేస్తుండగా , ఒకరోజు ...........

( సశేషం)

మంచు ------------
Cartoon Courtesy : మల్లిక్ & unknown artist.
 

Wednesday, May 5, 2010

చెరువుగట్టు - ఉయ్యాల స్తంబాలు

***  శ్రీ రామ *** 


చాలా రోజుల తరువాత ఆంటే ఇంచుమించు పుష్కరకాలం తరువాత ఇటీవల మా సొంతూరు వెళ్ళడం జరిగింది. సొంతూరు ఆంటే తాత గారు ఊరు అన్నమాట. నేను అక్కడ పుట్టలేదు, పెరగలేదు కానీ మా ఊరంటే చాలా చాలా ఇష్టం (మీ అందరి లాగే). 

మా వూరు పశ్చిమ గోదావరి జిల్లా లోని ఒక "అందమయిన" చిన్న పల్లెటూరు. నిజంగా అందమయినదే.. పక్క ఫోటో చూడండి :-) . మా తాత ముత్తాతలు అందరూ ఆ ఊళ్లోనే గానీ , మా చదువుల మూలం గా మా  కుటుంబం ఆ ఊరు వదలి బయటకు వచ్చాం.  సాధారణంగా "మీ తాత గారి ఊరంటే ఎందుకు ఇష్టం" అని అడగగానే మనకి ముందు గుర్తొచ్చేది తాతయ్య నానమ్మల ప్రేమే  కదా.. అది మాకు డబుల్ అన్నమాట.. ఎందుకంటే.. మా నాన్నమ్మకి , మా చిన్న నాన్నమ్మ(నానమ్మ చెల్లెలు)కి కలిపి  మా నాన్నగారు ఒక్కరే... ఏక నిరంజన్ :-)  మా చిన్న నాన్నమ్మ వాళ్లకి పిల్లలు లేనందువల్ల మా నాన్న గారు రెండు కుటుంబాలకి ఒకడే కొడుకు... అందువల్ల మాకు ఇద్దరు నానమ్మలు ..ఇద్దరు తాతయ్యలు.. 

చిన్నప్పుడు వేసవి సెలవలకి , అప్పుడప్పుడు సంక్రాంతి సెలవలకి మా వూరు వెళ్ళే వాళ్ళం.. సంక్రాంతి సెలవలకు వెళ్ళినప్పుడు అమ్మ , నాన్నగారు  సెలవలు అన్నిరోజులు మాతో ఉండేవారు... వేసవి సెలవలకయితే మమ్మల్ని (పిల్లల్ని ) దింపేసి వెళ్లి పోయి .. మళ్లీ సెలవలు అయ్యే టైంలో తీసుకెళ్ళడానికి వచ్చేవారు.. అందువల్ల మాకు సంక్రాంతి సెలవల కన్నా వేసవి సెలవలు అంటేనే ఎక్కువ ఇష్టం :-) ఇక మమ్మల్ని ఆపేవారు ఎవరూ వుండరు కదా..
ఇద్దరు నాన్నమ్మల ఇల్లు వేరే వేరే వీదుల్లో ఉండేవి (ఆ ఊరుకున్నవి మూడే వీధులు అనుకోండి:-) ). చిన్న నానమ్మ దగ్గర వుంటే పెద్ద నాన్నమ్మ ఇంటిని " ఆ వీధి" అనే వారు..  పెద్ద నాన్నమ్మ దగ్గర ఉంటె చిన్న నానమ్మ ఇంటిని " ఆ వీధి " అనే వారు.. ఆంటే వాడుకలో "ఆ ఈది లో అన్నం తినని వచ్చావా " ఆంటే " ఆ నానమ్మ దగ్గర తిన్నావా " అని అర్ధం. ఇంతకూ "ఆ వీధి " ఆంటే పెద్ద నానమ్మ ఇల్లా.. చిన్న నానమ్మ ఇల్లా అని నాకు చిన్నపుడు అర్ధం అయ్యేది కాదు.. అది జంబలకిడిపంబ సినిమాలో 'ఇదారాయియే' లాంటిది అని పెద్దయ్యాక అర్ధం అయ్యింది. 

మా వూళ్ళో బస్సు దిగగానే ఉయ్యాల స్తంబాల మీద గోల గోల చేస్తూ రామ చిలుకలు స్వాగతం పలికేవి.. పైన స్తంబాలమీద చిన్న చిన్న ఇల్లుల వున్నాయి కదా.. అవి రామచిలకల కోసం కట్టిన గూళ్ళు .. మొదట్లో అవి తాటి చెట్లతో చేసిన స్తంబాలు (తాటి పట్టీలు).. ఆ తరువాత సిమెంట్  స్తంభాలు వచ్చాయ్.. ఆ రామచిలుకల అల్లరి వింటూ బస్సు దిగి మా ఊళ్ళో కాలు పెట్టగానే "ఆది " లో జూ ఎన్ టి ఆర్ కి పొంగినట్టు నరాలు ఉప్పొంగేవి.. పౌరుషం తో కాదు.. ఆనందం తో :-) . దిగగానే ముందు మా పెద్ద నానమ్మ ఇంటికి వెళ్ళాలి.. అది రూలు .. ఆ తరువాత మా ఇష్టం.. చిన్న నానమ్మ ఇల్లు చెరువు  గట్టు మీద వుండేది అందువల్ల మేము అక్కడే ఎక్కువ గడిపేవాళ్ళం..  

పొద్దున్నే లేచి వేడి వేడి ఇడ్లీ తిని .. ఆటలకు బయలు దేరేవాళ్ళం.. చెరువు లో నీళ్ళు ఉన్నంత కాలం చెరువు గట్టు మీద ఆటలు, వేసవి లో చెరువు ఎండిపోయాక ఆ చెరువులో ఆటలు..  అసలు టైం తెలేసేది కాదు.. ముఖ్యం గా కొబ్బరి ఈనే తో 'తొండలు' పట్టి వాటికి పోటీలు (కోడి పందాలు లాగ ) పెట్టడం అప్పట్లో మా ఫెవోరేట్ ఆట..పక్క పోటో లో చూపించినట్టు పచ్చి కొబ్బరు ఆకునుండి ఈనే తీసి .. ఆ ఈనే లో ఎక్కువ ఫ్లేక్సిబిల్ గా వుండే చివర అలా చుట్టి జారుముడి వేసి ..దాన్ని తొండ తల దాంట్లో వెళ్ళేలా చేసి అప్పుడు ఆ కొబ్బరి ఈనే లాగడమే.. అప్పుడు ఆ ముడి దాని పీకకి బిగుసుకొని అది మన చేతికి చిక్కుతుంది.. అయ్యో పాపం అనుకుంటున్నారా.. చిన్నప్పుడు అలానే ఆడేవాళ్ళం మరి :-(.   


మద్యాహ్నం ముంజికాయలు , మామిడి కాయలు కోసం పొలం మీద పడేవాళ్ళం..  ముంజి కాయలు తిన్నాక వాటితో ముంజికాయబండి చేసుకుని అది తోసుకుంటా ఆడుకునే వాళ్ళం.  ముంజికాయలు లేకపోతె కనీసం కొబ్బరి పుచ్చుల (రాలిపోయిన కొబ్బరి పిందెలు)  తో ఆయినా బండి చెయ్యాల్సిందే.. పొలం లో వున్న చెరువు దగ్గర మా మద్యాహ్నం ఆట. అది మా సొంత చెరువు కాబట్టి ఆ చెరువులో అప్పుడప్పుడు చేపలు పట్టేవాళ్ళం..  నీళ్ళు ఎండిపోతున్న టైం లో  మట్టగిడసల కోసం ఆ బురద లోనే తెగ కేలికేవాళ్ళం. సాయంత్రం ఇంటికి చేరుకొగానే స్నానం.  మేమెంత తాడిలా ఎదిగినా నానమ్మే స్నానం చేయించేది .. లైఫ్బాయ్ తో శుబ్రంగా  తోమేసేది  ..:-)  మాకు లైఫ్బాయ్ కానీ మా చిన్న నానమ్మ మాత్రం లక్స్ వాడేది (ఒకప్పుడు మా వూళ్ళో లక్స్ సబ్బు ఒక్క మా చిన్న నానమ్మ మాత్రమే వాడేదట.. అప్పట్లో ఒకసారి వాళ్ళింట్లో దొంగోడు వచ్చి అన్నీ వదిలేసి లక్స్ సబ్బులు పట్టుకుపోయాడట.. :-) ). అక్కడుంటే సాయింత్రం వెలుగు వుండగానే  డిన్నర్ అయిపోయేది ... 7 అయ్యేసరికి ఆరుబయట పక్కలు.. ఒక్కోసారి ఎప్పుడూ చీకటి పడుతుందా..ఎప్పుడూ మంచాలు వెద్దామా అని ఎదురు చూసే వాళ్ళం.. దానికి కారణం చిన్న నానమ్మ చెప్పే కాశి మజిలి కధలు.. మా నానమ్మకి రెండు మూడు సిగ్నేచర్ కథలు ఉండేవి ..అవే ఒక్కోటి సీరియల్ లా వారం చెప్పేది.. ఒక్కోసారి కధ వింటూనే నిద్రలోకి జారుకునే వాళ్ళం.. పొద్దునే పక్షులు కువకువలతో నిద్ర లేపేవి.. లేచి పందిపుల్ల (అదే వేపుల్ల) నములుతూనే ఆటలు మొదలు పెట్టేవాళ్ళం..  శుక్రవారం వచ్చిందంటే పక్కూరు సంత నుండి మా ఇద్దరు తాతలు తెచ్చే పొట్లాల కోసం ఎదురు చూపులు..  పొట్లం ఆంటే ఎక్కువగా పంచదార కొమ్ములు , వెన్నముద్దలు (స్వీట్) , కారబూంది,  మెత్తని పకోడీ,  లాంటివి తెచ్చేవారు. నాకు ప్రత్యేకంగా "బెల్లం జిలేబి"... ఇంకా స్పెషల్ ఆంటే మామిడి తాండ్ర. అక్కడుండగా ఎక్లాసాయిన మాంచి బూతులు కూడా నేర్చుకునే వాడినని మా అమ్మగారు అంటుంటారు కానీ నాకు పెద్దగా గుర్తులేదు  :-)

వేసవిలోనే ఆ వూరు అమ్మవారి జాతర, హనుమాన్ జయంతి  వచ్చేవి .. చుట్టాలందరూ వచ్చేవారు.. ఇక ఆ మూడురోజులు అసలు ఖాళీ వుండేది కాదు మాకు.. ఇక్కడ హనుమాన్ గుడి గురించి చిన్న స్టొరీ వుంది.. 1950 -60 లో మా వూళ్ళో ఒక వృద్ద వానరం ఉండేదట.. బాగా ముసలిదయిపోయి ఒక రోజు మా చినతాత గారి పొలం గట్టుమీద కాలం చేసిందట. మా చినతాత గారు దాన్ని ఊరంతా ఊరేగించి ఆ తరువాత అంత్యక్రియలు జరిపించారట. తరువాత కొన్నాళ్ళకి ఆంజనేయస్వామి మా చిన తాత కలలో కనిపించి దానికి మనిషి జరిపిన్నట్టే మిగతా శ్రాద్దకర్మలు చేయించమని చెప్పాడట.. అప్పుడు మా చినతాత ఊళ్ళో ఈ విషయం చెబితే ఊళ్ళో అందరూ పెద్ద ఎత్తున చందాలు వేసుకుని ఘనంగా మిగతా కార్యక్రమాలు చేసారట.. ఆ తరువాత కొన్నాళ్ళకి ఆ వానరాన్ని పూడ్చిపెట్టిన స్తలం లోనే ఈ హనుమంతుడి గుడి కట్టారట..  (వానరాన్ని పూడ్చిపెట్టిన స్తలం లోనే హనుమంతుడి విగ్రహం దొరికిందని అందుకే అక్కడ గుడి కట్టారు అని కొందరు అంటారు) . అది చాలా మహిమ గల గుడి అని చాలామంది నమ్మకం .. ఆఫ్కోర్స్ నాక్కూడా ...


ఎక్కువ చిన్న నానమ్మ ఇంటిదగ్గ గడిపినా.. నేను అలిగినప్పుడు మాత్రం పెద్ద నానమ్మ దగ్గరే ఉండేవాడిని.  మా ఇంట్లో మిగతా పిల్లలు ఎవరూ పెద్దగా అలిగే వారు కాదు కానీ నేను కాస్త ఎక్కువే. అయితే ఆ అలకలు కులుకులు అన్నీ ఆ ఊళ్లోనే ..మా అమ్మగారి దగ్గర వున్నప్పుడు అలకలు కుదిరేవి కావు ... మా వూళ్ళో మాత్రం ప్రతి చిన్న విషయానికి కూడా అలిగే వాడినట..అలిగినప్పుడు మా పెద్ద నానమ్మ మంచం కింద దూరి ఎంత బ్రతిమిలాడినా బయటకు వచ్చేవాడిని కాదంట.. అందరూ (తాతలు , నానమ్మలు, మిగతా చుట్టాలు ) బ్రతిమిలాడి విసుగొచ్చి వెళ్లి పోయాక అప్పుడు మా పెద్దనానమ్మ తన బ్రహ్మాస్తం తీసేదట.. అదే నాటు కోడి గుడ్డు (country hen egg ) :-) అది తినిపిస్తానంటే వెంటనే వచ్చే వాడినట..  (పూర్వ జన్మలో ఈ పామునో అయి ఉంటా :-))  * ఈ పేరాకి ఇన్స్పిరేషన్ ఈ పోస్ట్

నాకు కొద్ది కొద్ది గా గుర్తు ఉన్నప్పుడే మా పెద్దనానమ్మ గారు కాలం చేసారు.. ఆ తరువాతనుండి వెళ్ళినప్పుడల్లా పూర్తిగా మా చిన్న నానమ్మ ఇంటి దగ్గరే వుండేవాళ్ళం.. కొన్నాళ్ళకి మేము పెద్దవాళ్ళం అవ్వడం తో వేసవి సెలవలకు వెళ్ళడం తగ్గిపోయింది.. అప్పుడప్పుడు వెళ్లి చూసేవాళ్ళం.. జాతరకి అలా.. మా చిన్న నానమ్మ గారు కూడా కాలం చేసాక కొన్ని సంవత్సరాలు ఆ ఊరు వెళ్ళబుద్ది కాలేదు.. ఆ తరువాత కుదరలేదు.. మొత్తానికి మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అనుకోకుండా వెళ్ళవలసిన అవసరం వచ్చింది.. 


ఈ సారి ఊళ్ళో అడుగుపెట్టాక అప్పట్లోలా నరాలు ఉప్పొంగలేదు.. వెళ్ళే ముందు వరకూ వున్న ఉత్సాహం .. తరువాత లేదు.. ఉయ్యాల స్తంబాలు వున్నాయి కానీ రామ చిలుకలు లేవు.. చెరువుగట్టు వుంది కానీ మా చిన్న నానమ్మ  లేదు.. చిన్నప్పుడు నేను వెళ్ళగానే నా చుట్టూ మూగే నా స్నేహితులు లేరు .. అందరూ వివిధ కారణాల వల్ల పక్కనున్న పట్టణానికి తరలి పోయారు.. ఇల్లు వుంది కానీ ఇంటి ముందు పిచ్చుకలకు కట్టే పాలకంకులు లేవు... పిచ్చుకలు లేవు.. అప్యాయంగా పలకరించే చుట్టాలు లేరు.. ఎవరో కొద్ది మంది తప్ప అందరూ మాలాగే పట్టణానికే వెళ్ళిపోయారు. ఊరు మొత్తం మారిపోయింది.. చాలా మటుకు పాకలు "వై ఎస్ డాబాలు", పెంకుటిల్లులు "సొంత డాబాలు" అయిపోయాయి. రెండు పంటలు పండే పొలాలు నీళ్ళు లేక ఒక పంటే కనా కష్టం గా పండుతున్నాయ్... ఆ ఆంజనేయస్వామి గుడి డెవెలప్మెంట్ లేకుండా అలానే వుంది కానీ ఊళ్లోకి ఫస్ట్ క్లాసు చర్చి మాత్రం వచ్చింది..  వీదుల్లో కూర్చొని ఏదో పని చేసుకుంటూ,  కబుర్లు చెప్పుకుంటూ , వచ్చి వెళ్ళేవారిని పలకరించే ఆడాళ్ళు అందరూ ఇప్పుడు టి వి లో సీరియల్స్ చూస్తూ గడిపేస్తున్నారు..  ఇవే డెవెలప్మెంట్ కి చిహ్నాలు ఏమో .. 


ఇంతకు ముందు నా కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే చిన్నప్పటి కలర్ఫుల్ జ్ఞాపకాలు ఇప్పుడు కొద్దిగా మసకబారాయి. అప్పుడు కనిపించినంత అందంగా  అమాయకంగా మా వూరు ఇప్పుడు కనిపించడం లేదు.. :-(  ఒకవైపు మళ్లీ ఊరు చూసానన్న ఆనందం .. ఇంకోవైపు ఎందుకో కొద్ది డిసప్పాయింట్మెంట్ .. ఈ సంవత్సరం చూసిన మా ఊరు జ్ఞాపకాలు త్వరగా మరచిపోవాలని,  ఆ పొర తొలగి పోయి ఇంతకూ ముందు జ్ఞాపకాలే మిగలాలని కోరుకుంటున్నాను... 


మంచు