Pages

Thursday, January 13, 2011

కొన్నాళ్ళ తరువాత....

*** శ్రీ రామ *** 

పక్కనున్న ఫోటో చూసారు కదా... కొన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడున్న పెట్రోల్ బంకుల స్థానంలో ఉండే కార్ చార్జింగ్ స్టేషన్ అది. ఇంత హైఫై గా ఉంది ఈ చార్జింగ్ స్టేషన్ దాని కధా కమామిషు గురించి తెలుసుకోవాలంటే ఒక ఇరవై సంవత్సరాలు రింగులు తిప్పుకుంటూ ఫ్యూచర్ లోకి వెళ్ళాల్సిందే. కొన్నాళ్ళకి ఇప్పుడున్న పెట్రోల్ , డీజిల్ వాహనాల సంఖ్య క్రమంగా తగ్గిపోయి ఆ ప్లేస్ లో బ్యాటరీ తో నడిచే విద్యుత్ కార్లు వచ్చేస్తాయి. ఈ చార్జింగ్ స్టేషన్స్ ఆ కార్లలో ఉన్న బ్యాటరీలను చార్జ్ చెయ్యడానికి అన్నమాట.

ఈ ఎలక్ట్రిక్ కార్ల యొక్క ఆవశ్యకత ఏమిటి , వాటి మీద ప్రపంచవ్యాప్తం గా ఇంత సీరియస్ గా ఎందుకు పరిశోధన జరుగుతుంది అని అర్ధం చేసుకోవడానికి , ప్రపంచం లో ఎక్కువ కార్ మార్కెట్ కలిగిన దేశం అమెరికాని విశ్లేషిద్దాం.
  • ప్రపంచంలో ఎక్కువ కాలుష్యం విడుదల చేసే దేశాల్లో అమెరికా కూడా అగ్రస్తానం లో ఉంది. ఎక్కువ వైశాల్యం గల దేశం కావడం వల్ల అమెరికాలో ఉన్న వాళ్లకి పెద్ద కాలుష్యం అనిపించక పోవచ్చు కానీ వాతావరణం లోకి విడుదల చేసే కాలుష్యం మొత్తంలో అమెరికా వాటా చాలా ఎక్కువ. అమెరికన్ మార్కెట్ లో లభ్యమయ్యే వాహనాలకి అవి విడుదల చేసే కాలష్య పరిమాణం మీద కఠినమయిన నిబంధనలు ఉన్నా, ఎక్కువ వాహనాలు ఉండటం వల్ల ఆ కొంచెం కొంచెమే కలసి ఎక్కువ అవుతుంది. అందువల్ల ఈ అధిక కాలుష్యం తగ్గించమని యూరోపియన్ దేశాల నుండి అమెరికా ఎక్కువ వత్తిడి ఎదుర్కుంటుంది. వాహన సంఖ్య ఎలాగూ తగ్గించలేరు కాబట్టి అవి విడుదల చేసే కాలుష్యం మరింత తగ్గించడానికి ఒక మార్గం వాహనాలకి ఎక్కువ మైలేజ్ వచ్చేలా రూపొందించడం.
  • ఇప్పుడున్న సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలకి ఆయిల్ కావాలి కదా. అది కావాలంటే అరబ్ దేశాల మీద ఆధారపడాలి. మరి రేపు ఎప్పుడయినావాళ్ళు ఆయిల్ అమ్మను అని బెదిరిస్తే అంటే వీళ్ళ కార్లు ఎలా నడవాలి (అమెరికాకి కూడా బోల్డంత ఆయిల్ ఉందనుకోండి అది వాళ్ళ మిలటరీకే సరిపోదు.)
ఈ రెండు ముఖ్య కారణాల వల్ల అమెరికాలో ఈ ఎలక్ట్రిక్ కార్ల మీద రిసెర్చ్ బాగా జరుగుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో మూడు రకాల కార్లు ఉన్నాయి అని మనకి తెలుసు కదా. 
1 . సాంప్రదాయ ఇంధనాలు అంటే పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ లాంటి ఇంధనాలు (Fossil fuels) ఉపయోగించుకుని నడిచే కార్లు: వీటి ఇంజన్లలో ఈ ఇంధనం మండించడం ద్వారా శక్తి ఉత్పత్తి చేసి అది వాహనం కదలడానికి వాడతాం అన్నమాట. అయితే ఈ ఇంధనం మండిస్తే పొగ వస్తుంది ఆంటే తద్వారా కాలుష్యం....ఎంత ఎక్కువ ఇంధనం మండిస్తే అంత కాలుష్యం. మరి ఈ కాలుష్యం తగ్గించాలి ఆంటే ఏం చెయ్యాలి.. తక్కువ ఇంధనం తో ఎక్కువ  దూరం ప్రయాణించగలిగేలా వాహనం మైలేజ్ పెంచాలి.  
2 . పెట్రోల్ / డీజిల్ / గ్యాస్ ఇలా ఏ ఇంధనంతో నడిచే ఇంజిన్ అయినా తక్కువ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు (ఆంటే స్టారింగ్ లో (ఎక్సిలరేషన్ లో ), బ్రేక్ వేసినప్పుడు , తక్కువ గేర్ లో వెళ్తున్నప్పుడు ఆంటే ఎత్తులు ఎక్కుతున్నప్పుడు ) తక్కువ ఎఫిషియన్సి కలిగిఉండటం వల్ల ఎక్కువ ఇంధనం వృదా అవుతుంది. అదే వాహనం ఎక్కువ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు (హై గేర్ లో వెళ్తున్నప్పుడు) ఎఫిషియన్సి ఎక్కువ ఉండటం వల్ల ఇంధనం అంత ఎక్కువ వృదా కాదు.





అందువల్ల ఇప్పుడు ఆ వాహనంలో సంప్రదాయ ఇంధనంతో నడిచే ఇంజిన్ తో పాటు, ఒక విద్యుత్ జనరేటర్, బ్యాటరి, ఒక ఎలక్ట్రిక్ మోటార్ కూడా పెట్టి , వాహనం  ఏక్సిలరేషన్ లొ విద్యుత్ మోటారుతో నడిచేలా , వాహనం ఒక వేగం చేరుకున్నాక ఇంజిన్ తో నడిచేలా ఏర్పాటు చేస్తే.. ఎక్కువ ఇంధనం వృధా కాకుండా ఉంటుంది. వాహనం ఇంజిన్ మీద నడుస్తున్నప్పుడు, అదే ఇంజిన్ తో  జనరేటర్ తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి అది బ్యాటరీ లో నిలువ చేసి, ఆ విద్యుత్ మోటార్ నడపడానికి వాడబడుతుంది. ఆంటే ఈ సాంప్రదాయ ఇందానాలతో నడిచే ఇంజన్ ని ఎప్పుడూ మనం లోగేర్ లో ఉపయోగించం కాబట్టి తక్కువ ఇంధనం వృధా అవుతుంది. అందువల్ల తక్కువ ఇంధనం తో ఎక్కువ దూరం ప్రయాణించ వచ్చు ... ఆంటే తక్కువ కాలుష్యం... ఈ తరహ టెక్నాలజీ గల కార్లని హైబ్రీడ్ కార్లు అంటారు.

3. ఎలెక్ట్రిక్ వాహనాలు : వీటినే ఎలెక్ట్రిక్ ప్లగ్-ఇన్ మోడల్స్ అని కూడా అంటారు. వీటిలో ఇక ఇంధనంతో నడిచే ఇంజిన్ లాంటివి ఉండవు. బ్యాటరి, విద్యుత్ జనరేటర్ , విద్యుత్ మోటర్ ఉంటాయన్నమాట. బ్యాటరీలో నిలువ చేసిన విద్యుత్తో మోటార్ ని తిప్పితే ఆ మోటర్ వాహనాన్ని నడిపిస్తుంది. అయితే దీంట్లో హైబ్రిడ్ వాహనం లో ఉన్నట్టు డీజిల్ లేక  పెట్రోల్ ఇంజిన్ లాంటివి ఉండవ్ కాబట్టి ఆ బ్యాటరీలను మనం సెల్ ఫోన్ బ్యాటరీలను చార్జ్ చేసినట్టు బయట నుండి చార్జ్ చెయ్యాలి. ఇలా చార్జ్ చెయ్యడానికి ఒక ఎలెక్ట్రిక్ ప్లగ్ ఉంటుంది కాబట్టి ప్లగ్-ఇన్ మోడల్స్ అంటారు. ఇక పెట్రోల్ , డీజిల్ లాంటి ఇంధనాలు మండించడం  ఉండదు కాబట్టి కాలుష్యం సమస్య లేదు. మరి ఇంజన్ లేనప్పుడు ఇక జనరేటర్ ఎందుకు ఆన్న ప్రశ్న వస్తుంది కదా...వాటివల్ల ఈ హైబ్రిడ్ , ఎలెక్ట్రిక్ కార్ల లో ఒక పెద్ద ఉపయోగం ఉంది. అదేమిటో చూద్దాం...

వేగంగా వెళ్తున్న ఒక వాహనానికి ఇంధనసరఫరా నిలిపివేసినా కొంత దూరం ప్రయాణించి మరీ ఆగుతుంది కదా ...ఆంటే కదిలే వాహనంలో కొంత శక్తి నిల్వ ఉంటుంది మరియు ఆ శక్తి ఆ వాహనం ప్రయాణించే వేగం మీద ఆధారపడి ఉంటుంది. మరి అదే వాహనం బ్రేక్ వేసినప్పుడు వెంటనే ఆగిపోతుంది కదా....అప్పుడు  ఆ నిల్వ ఉన్న శక్తి ఏమవుతుంది ఆంటే.... ఆ బ్రేక్ కి కారు చక్రానికి మద్య జరిగిన రాపిడి వల్ల పుట్టిన ఉష్ణ శక్తిగా మారుతుంది అన్నమాట. ఆంటే ఆ శక్తి  వేస్ట్ అయిపోతుంది. ఎంత ఎక్కువ సార్లు బ్రేక్ వేస్తే అంత ఎక్కువ శక్తి (ఇంధనం) వృదా అవుతుంది.... అదే ఈ హైబ్రిడ్ మరియు ఎలెక్ట్రిక్ కార్లలో అయితే , బ్రేక్ వేసినప్పుడు  ఆ  నిల్వ ఉన్న శక్తిని బ్రేక్ ద్వారా ఉష్ణ శక్తిగా మార్చి వృధా చెయ్యకుండా , జనరేటర్ సహాయంతో విద్యుత్చక్తిగా మార్చి బ్యాటరీకి పంపిస్తాం. మనం స్పీడ్  పెంచవలసి వచ్చినప్పుడు  తిరిగి అదే శక్తి బ్యాటరీల నుండి  తీసుకుని మోటార్ ని నడిపిస్తాం కాబట్టి ఎన్నిసార్లు బ్రేక్ వేసిన ఎక్కువ శక్తి నష్ట పోము.

హైబ్రిడ్ వాహనాలు (ముఖ్యంగా కార్లు) అమెరికా, యూరోప్, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి కానీ ఎలక్ట్రిక్ ప్లగ్-ఇన్ కార్లు ఇప్పుడుప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. 2015 కల్లా 10 లక్షల కార్లు, 2020 కల్లా 50 లక్షల ఎలక్ట్రిక్ ప్లగ్-ఇన్ కార్లు కార్లు అమెరికన్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయ్ అని ఒక అంచనా.... మరి ఇన్ని కార్లు ఉన్నప్పుడు ఎలక్ట్రిక్  కార్లని ఎక్కడ చార్జ్ చెయ్యాలి, ఏలా చార్జ్ చెయ్యాలి? ప్రస్తుతం  అయితే ఈ ఎలక్ట్రిక్  కార్లన్నీ ఇంట్లోనో ఆఫీసులోనో ఎలెక్ట్రిక్ ప్లగ్ లో పెట్టి  చార్జ్  చేసుకుని వెళ్లిరావడమే. మరి బయటకు వెళ్ళినపుడు మద్యలో చార్జ్ అయిపోతే ఎలా.. సరే అయితే ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు ( యూరోప్ లో ఉన్నవాళ్ళు ఐదు సంవత్సరాలు, అమెరికా లో ఉన్నవాళ్ళు ఒక పది సంవత్సరాలు ) ముందుకెళ్ళి అప్పటి పరిస్తితి ఎలా ఉంటాయో చూద్దాం. 

  • క్రింద ఫోటో చూపించినట్టు ఒక్కొ పార్కింగ్ స్పేస్ లో ఒక్కో చార్జర్  ఉంటుంది. మనకెప్పుడు అవసరం అయితే అప్పుడు అక్కడ పార్క్ చేసి చార్జ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు చార్జింగ్ కి పెట్టి వెళ్తే అది చార్జ్ అవుతూ ఉంటుంది.

  • అలాగే ఈ  పక్క ఫోటో చూపించినట్టు రాత్రి ఇంటికి రాగానే చార్జింగ్ పెట్టుకుంటే , పొద్దున్న వర్క్ కి వెళ్ళే సమయానికి చార్జ్ అయివుంటుంది. 
  • అలాగే షాపింగ్ మాల్స్ లో, రెస్టారెంట్లలో, ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ లలో, పబ్లిక్ పార్కింగ్ ప్లేసులు, అఫీసులులలో ఇలా ఎక్కడపడితే అక్కడ చార్జర్స్ ఉంటాయి. 
  • ఇక బిజినెస్ విషయానికి వస్తే , ఇంట్లో చార్జ్ చేసుకుంటే అ విద్యుత్ వినియోగం మన కరెంట్ బిల్ లోకి వెళ్తుంది. మరి బయట పబ్లిక్ ప్లేస్ లో అయితే ఆ చార్జింగ్ కావాల్సిన  విద్యుత్ కొనుక్కోవాలి కదా.... ఈ కార్ బ్యాటరి  చార్జ్ చేసుకోవడం మన సెల్ ఫోన్ బాలన్సు చార్జింగ్ తో పోల్చుకోవచ్చు. సెల్ ఫోన్ లానే వీటిలో ప్రీపైడ్, పోస్ట్‌పైడ్  కార్డులు ఉంటాయి. ఫోటో లో చూపించినట్టు ఆ కార్డ్ స్వైప్ చేస్తే , మనం ఎంత విద్యుత్ వినియోగించామో చూసి దానికి చార్జి చేస్తుంది. సెల్ ఫొన్ లా ప్రీపైడ్ అయితే మన కార్డ్ లొ డబ్బులు అయిపొయినప్పుడు రీచార్జ్ చేయించినట్టు ఈ కార్డ్ కూడా రీచార్జ్ చేయించుకొవాలి. 
  •  
  • ఇక రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లాంటి వాళ్ళు కస్టమర్స్ ని ఆకర్షించడానికి వాళ్ళ పార్కింగ్ ప్లేస్ లలొ ఫ్రీ చార్జింగ్ ఆఫర్ చేస్తారు. కార్ పార్క్ చేసి, ప్లగ్ తగిలించి , రెస్టారెంట్ లొ తిని వచ్చేసరికి కార్ మళ్ళీ ఫుల్ చార్జ్ అయిపొయిఉంటుంది అన్నమాట.
  • మరి మనం చార్జింగ్ స్టేషన్ లో కార్ చార్జింగ్ పెట్టి ,  షాపింగ్ కి వెళ్లి వచ్చేలోపు వేరే ఎవరన్నా ప్లగ్ మన కార్ నుండి తీసి వాళ్ళ కార్ కి పెట్టుకుంటే (చార్జింగ్ దొంగతనం చేస్తే) ఆన్న అనుమానం రావచ్చు. ఇది నివారించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మన కార్ కి తగిలించిన చార్జెర్ ప్లగ్ తొలగించగానే మన సెల్ ఫోన్ కి ఒక SMS  మరియు మన మెయిల్ అడ్రస్ కి ఒక మెయిల్ వస్తాయి అందువల్ల ఆ చార్జర్ మనకి మనం తీసామా లేక ఎవరన్నా తీశారా అన్నది తెలుస్తుంది. ఒకవేళ దొంగతనం అనుకుంటే, మనం వెంటనే ఆ చార్జింగ్ కంపెనీకి  ఫోన్ చేసి ఆన్లైన్ లోనే చార్జింగ్ ఆపించవచ్చు. రెండోది ప్రతీ కార్ కి చార్జింగ్ ప్లగ్ దగ్గర ఒక కోడ్ వుంటుంది. అదే కోడ్ ఈ చార్జింగ్ స్మార్ట్ కార్డ్ మీద కూడా ఉంటుంది. ఆంటే ఒక చార్జింగ్ కార్డు తో దానిమీద కోడ్ ఉన్న కార్ మాత్రమే చార్జ్ చెయ్యొచ్చు. మరి పక్కోళ్ళకు కార్డు అప్పు ఇవ్వాలంటే మనం పాస్వర్డ్    ఇవ్వాలి.
  • అయితే ప్రస్తుతం ఈ చార్జింగ్ చెయ్యడానికి చాలా సమయం పడుతుంది. ఈ పక్కనున్న బొమ్మలో చూపించినట్టు ప్రస్తుతానికి లబ్యమయ్యే మూడు చార్జింగ్ లెవెల్స్ లో.... DC (level 3) చార్జింగ్ వేగవంతమయిన చార్జింగ్ అన్నమాట. అయితే ఎప్పుడూ బ్యాటరీ ఎంత స్లో గా చార్జ్ చేస్తే అంత ఎక్కువ కాలం  మన్నుతుంది. అందువల్ల మనకి ఫాస్ట్ చార్జింగ్ కావాలా, లేక బ్యాటరి మన్నిక కాలం కావాలా అన్నది చూసుకుని కొనుక్కోవాలి. నాకు తెలిసి ఇంట్లో వాడకానికి  level2 , బయట చార్జింగ్ బిజినెస్ కి level3 (DC ) బెస్టు. 5 నిముషాల్లో పెట్రోల్ నింపుకుని మైళ్ళ మైళ్ళ దూరం ప్రయాణించడం అలవాటు అయ్యాక, ఈ చార్జింగ్ కోసం ఇంత సేపు సమయం వెచ్చించడం   కొంచెం చికాకు అనిపించినా క్రమేణా మన జీవన విధానం కూడా అనుగుణంగా మారిపోతుంది. మరియు కొన్నాళ్ళకి అత్యంత వేగవంతమయిన  చార్జర్స్ అందుబాటులోకి వస్తాయి.
  • ఈ చార్జింగ్ టైం తో పనిలేకుండా, ఈ మద్య యూరోప్ లో డైరెక్ట్ గా చార్జ్ ఆయిన బ్యాటరీలు అద్దెకిచ్చే షాపులు వెలుస్తున్నాయి. మనం డిస్చార్జ్ అయిన బ్యాటరీలు ఇచ్చేసి , ఫుల్ చార్జ్ బ్యాటరీలు పెట్టుకుని వచ్చేయడమే. మరి ఈ బిజినెస్ మోడల్ ఎంతవరకు సక్సస్ అవుతుందో తెలీదు.
  • ఇక ఈ చార్జింగ్ స్తేషన్స్  స్టేషన్స్ సొలార్ తొ పనిచెయ్యడం వచ్చాక..ఒక్కసారి పెట్టుబడి పెడితే ఇక ఇక ఇంచుమించు కార్ ఫ్రీగా నడిపినట్టే...
  • ఇంకా ముందు కెళ్తే , కింద ఫోటో లో చూపినట్టు కారు రోడ్డు మీద నడుస్తున్నప్పుడే చార్జ్ అయ్యే టెక్నాలజీ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ మధ్యే జర్మన్ ఇంజనీర్ ఒకడు దీనికి పేటెంట్ తీసుకున్నాడట.




అది ఫ్యూచర్ లో ఎలెక్ట్రిక్ కార్లు, వాటి చార్జింగ్ కథ కమామిషు. ఈసారి మరొక టెక్నాలజీ గురించి చెప్పుకుందాం ..... 



- మంచు 

గమనిక: ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు రెండు సార్లు మొత్తం పోస్ట్ ఎగిరిపోయింది. మూడోసారి రాసినప్పుడు కాస్త శ్రద్ద మిస్ అయింది అనుకుంటున్నా...కొంచెం కంటిన్యుటి మిస్ అయినట్టు ఉంది. క్షమించాలి  

48 comments:

శివరంజని said...

1

శివరంజని said...

2

శివరంజని said...

3

శివరంజని said...

4

శివరంజని said...

5

శివరంజని said...

మొదటి 5 కామెంట్స్ నావే

Sravya V said...

వావ్ మీ ఒరిజినల్ ఫాం లోకి వచ్చి మంచి పోస్టు రాసారు చాల రోజులకి .
అదే వాహనం ఎక్కువ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు (హై గేర్ లో వెళ్తున్నప్పుడు) ఎఫిషియన్సి ఎక్కువ ఉండటం వల్ల ఇంధనం అంత ఎక్కువ వృదా కాదు. >> ఇది నాకు ఆశ్చర్యం గా ఉంది . అంటే కార్ రేస్ లో వాడే కార్లు ఎక్కువ ఎఫిషియన్సి కలిగి ఉంటాయా ? లేదు కదా :(

Sravya V said...

వేగంగా వెళ్తున్న ఒక వాహనానికి ఇంధనసరఫరా నిలిపివేసినా కొంత దూరం ప్రయాణించి మరీ ఆగుతుంది కదా ...ఆంటే కదిలే వాహనంలో కొంత శక్తి నిల్వ ఉంటుంది మరియు ఆ శక్తి ఆ వాహనం ప్రయాణించే వేగం మీద ఆధారపడి ఉంటుంది.

---------------------------------------

మాష్టారు ఇంధనసరఫరా నిలిపివేసినా కొంత దూరం ప్రయాణించటానికి కారణం నిల్వ ఉన్న శక్తి ? నాకు ఇక్కడ ఫిజిక్స్ పాఠాలు గురోస్తున్నాయి "Newton's laws of మొతిఒన్" ఇది కాదా కారణం ?

నేస్తం said...

చాలా బాగా రాసారు ..చదువుతున్నంత సేపు వచ్చిన అనేక అనుమానాలకు వెంటనే సమాధానాలు నెక్స్ట్ పేరాలోనే దొరికేసాయి :)

Anonymous said...

/అంటే కార్ రేస్ లో వాడే కార్లు ఎక్కువ ఎఫిషియన్సి కలిగి ఉంటాయా ?/

అవును. కారు ఏదైనా ఇంధన సామర్థం 1<2<3<4. అందుకే ఏమాత్రం లెవిలీ తగ్గకూడదన్నది నీతి! :D

3g said...

మంచి పోస్టు. చాలా వివరంగా రాశారు.

కాలుష్యం తగ్గిద్దామని కాదుగాని పెట్రోలు రేటునుండి తప్పించుకోవటానికి ఇండియాలో ఒకటిరెండేళ్ళ క్రితం ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా కొనటం మొదలుపెట్టారు. కాని కొన్న ఆరునెలల్లోపే బ్యాటరీ మార్చాల్సివస్తుండటంవల్ల పెట్రోల్ కంటే ఎక్కువ ఖర్చవుతుందని ఈ మధ్య వాటివైపు ఎవరూ చూడట్లేదు. మీరుచెప్పినట్టుగా మరింత మన్నికైన బ్యాటరీలు పరిశోధింపబడితే బాగుంటుంది.

శివరంజని said...

అభిమాన శాస్త్రజ్ఞులు టపా తరువాత మరలా అంత అంతే ఇంట్రెస్టింగ్ గా చదివిన టపా ....

చెప్పాల్సింది ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంతో వివరం గా చెప్పారు మీరు టీచర్ అయితే భలే ఉండును

Sravya V said...

అవును. కారు ఏదైనా ఇంధన సామర్థం 1<2<3<4. అందుకే ఏమాత్రం లెవిలీ తగ్గకూడదన్నది నీతి! :D
---------------------------------
ఇదేంటో నాకర్ధం కాలేందండి :( నేను అడుగుతుంది "traveling at higher speeds highers fuel economy " అనేది కరెక్టా అని ? నాకు తెలిసినంత వరకు "traveling at higher speeds lowers fuel economy " అని .

బులుసు సుబ్రహ్మణ్యం said...

టపా బాగుంది.informative గా ఉంది. బాటరీ మన్నిక, maximum స్పీడ్ ఆఫ్ ద vehicle , మొదలైన వాటి గురించి ఇంకా ప్రయత్నాలు సాగుతున్నాయి అనుకుంటాను. అమెరికా లో కూడా ఇంకో 20 years పడుతుందేమో అని చదివినట్టు గుర్తు.

నేస్తం said...

>>>>చెప్పాల్సింది ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంతో వివరం గా చెప్పారు మీరు టీచర్ అయితే భలే ఉండును
శివా నా మనసులో మాట అది..నేను తన పోస్ట్లు చదివినపుడల్లా అనుకుంటా ... చదుకున్నపుడు ఈయన సార్ గా వస్తే బాగుండేది బోలెడు మార్కులు వచ్చేసేవి అని :)

Kalpana Rentala said...

మంచు గారు,

నిజంగానే నేస్తం,శివరంజని చెప్పినట్లు అచ్చు క్లాస్ లో టీచర్ చెప్పినంత శ్రద్ధగా చెప్పారు. నాలాంటి మొద్దు బుర్రలకు కూడా ఏదో అర్థమయిన ఫీలింగ్.

మీరు ఆ చాంబలస్కా లాంటి కాపీ :-)పోస్టులు కాకుండా ఇలాంటివి రాయండి.నేనసలే సైన్స్ లో వీక్. కాస్త ఉపయోగపడతాయి.:-))

మనసు పలికే said...

మంచు గారూ, ఎంత బాగా చెప్పారో. ఇంతకు ముందు నాకు ఈ పెట్రోల్, డీజిల్ విషయాల్లో బోలెడన్ని అనుమానాలు ఉండేవి. నా అనుమానాలన్నీ తీరిపోయాయి ఈ టపాతో. కేక టపా:))

వేణూశ్రీకాంత్ said...

ఇలాంటి వివరణాత్మకమైన టపాలు వ్రాయడంలో మీ తర్వాతే మంచుగారు. చాలా మంచి విషయాలు నాకు తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు.

విరిబోణి said...

హలో మంచు గారు,
టపా చాలా బాగుందండి , చాల రోజుల నుండి నేను కూడా R & D చేద్దాం అనుకుంటున్నా ఈ plug -in car 's ఫై ఇంటర్నెట్ లో. ఇక ఆ అవసరం లేదు లెండి , మీరు చాల బాగా ఒక ఫిజిక్స్ మాస్టర్ లా ఎక్ష్ప్లైన్ చేసారు కదా .. ఇలాంటి పోస్ట్ లు తప్పక రాస్తూ ఉండండి .

రాధిక(నాని ) said...

చాలా బాగుందండి

రాధిక(నాని ) said...

సంక్రాంతి శుభాకాంక్షలండి

శ్రీనివాస్ పప్పు said...

మంచి పోస్ట్ మంచు గారూ చాల రోజుల తర్వాత.

చెప్పాల్సిందంతా పైన జనాలు చెప్పేసారు నేనింకో వీరతాడు సమర్పిస్తున్నా అంతే,అందుకోండి.

Sai Praveen said...

Good informative article.

ఈ హైబ్రిడ్ కార్ కాన్సెప్ట్ భలే బాగుంది :)

>> బ్రేక్ వేసినప్పుడు ఆ నిల్వ ఉన్న శక్తిని బ్రేక్ ద్వారా ఉష్ణ శక్తిగా మార్చి వృధా చెయ్యకుండా , జనరేటర్ సహాయంతో విద్యుత్చక్తిగా మార్చి బ్యాటరీకి పంపిస్తాం

ఈ విషయం నాకు అర్ధం కాలేదు. Can you throw some light on this? :)

మంచు said...

Sai:

Energy can neither be created nor destroyed "Conservation of energy "
------------------------------------
ఇది తెలుసు కదా...
ఇప్పుదు కదులుతున్న వాహనం లొ కొంత శక్తి దాగి ఉంది. అది ఎంత అంటే 0.5mv^2. దీనినే కెనెటిక్ ఎనర్జి అంటాము.

అక్కడ m అంటే మాస్ (కార్, దాంట్లొ ఉన్న జనం బరువు), v అంటే ఆ కార్ వేగం వేగం.

ఇప్పుడు మనం ఇంజిన్ కి ఇంధన సరఫరా నిలిపివేస్తే... కార్ కొంత దూరం వెళ్తుంది అని తెలుసు (ఈ కదిలే వస్తువయినా). మరి అప్పుడు కార్ నడపడానికి కావల్సిన శక్తి ఎక్కడనుండీ వస్తుంది. ఈ నిల్వ ఉన్న శక్తి నుండే...

కొంతసేపటికి కార్ నడవడం ఆగిపొతుంది...అంటే నిల్వ ఉన్న శక్తి అయిపొయింది... అయిపొయింది అంటే ఎక్కడికెళ్ళింది... శక్తిని పుట్టించలేం, నాశనం చెయ్యలేం అనుకున్నాం కదా... అదెక్కడికి పొతుంది అంటే... కదులుతున్న కార్ టైర్ కి, రొడ్డుకి మద్య ఏర్పడ్డ రాపిడి కి కొంత ఉష్ణం పుడుతుంది. ఈ నిల్వ ఉన్న శక్తి అంతా ఆ ఉష్ణ శక్తి గా మారి వాతావరణం లొ కలిసిపొతుంది అన్నమాట. అంటే నిల్వ ఉన్న కెనెటిక్ ఎనర్జి ఉష్ణ శక్తిగా మారుతుంది తప్ప....నాశనం కాదు. (SO conservation of energy still valid).


ఉదాహరణకి... వర్షం పడినప్పుడు మిగతా రొడ్డు కంటే ముందు మద్యలొ కార టైర్లు ఎక్కువ నడిచిన చొట ఉన్నచొట ముందు తడి ఆరిపొతుంది అది ఈ ఉష్ణ శక్తి వల్లే..

ఇప్పుడూ బ్రేక్ సంగతి కి వద్దాం.. ఇప్పుడు మనకి కార్ వెంటనే ఆగిపొవాలి. సొ ఈ నిల్వ ఉన్న శక్తి ని వెంటనే వేరే రూపం లొకి మార్చాలి. అందుకు బ్రేక్ వాడతాం. ఈ బ్రేక్ ఎంచేస్తుంది అంటే ఆ టైర్ ని పట్టి ఉంచడం వల్ల... టైర్ కి బ్రేక్ షూ కి మద్య రాపిడి పెంచుతుంది. ఆ రాపిడి వల్ల ఈ నిల్వ ఉన్న శక్తి ఉష్ణశక్తి గా మారుతుంది. అంటే రోడ్డు స్లొ గా చేసే పనిని ఈ బ్రేక్ వెంటనే చేస్తుంది.

అలాగే హైబ్రిడ్ , ఎలెక్ట్రిక్ కార్లలొ అదే నిల్వ ఉన్న శక్తిని విద్యుత్చక్తిగా మార్చి మనం దాచుకుని మళ్ళీ వాడుకుంటాం కావున ఆ శక్తి వేస్ట్ కాదు.

ఇందు said...

మంచుగారు....నేను ఆ బుల్లిపచ్చ కారు వేసుకుని రింగులు తిప్పుకుంటూ ఫ్యుచర్ లోకి వెళ్ళిపోయా! ఇప్పుడెలా వెనక్కి రావడం??

బాగా వ్రాసారండీ....ఇండియాలో..'రేవ ' కార్లు ఉన్నాయ్! మీరు ఒక కార్ ఫొటో పెట్టారు చూడండీ(సిల్వర్ కలర్) అచ్చు అలాగే ఉంటాయ్! టూ సీటర్స్. బుజ్జిగా అలా అలా దొర్లుకుంటూ బెంగుళురు రోడ్లమీద వెళ్ళిపోతూ ఉంటే నేను చూసాగా!

Sai Praveen said...

Miscommunication!! (అర్ధాలు వెతకద్దు :P )
నేను నా సందేహాన్ని స్పష్టంగా వ్యక్త పరచలేదు. మీరు రాసినది అంతా నాకు తెలుసు. నా సందేహం ఏమిటంటే... కదులుతున్న వాహనాన్ని ఆపాలి అంటే రాపిడి అవసరం కదా. And friction does produce heat. Did you mean that the heat produced can be used (converted to electricity) to charge the battery? Or is there a way to convert the kinetic energy directly into electric charge. This is the question that's puzzling me, if there is something other than friction that can convert kinetic energy to other form.
మీరు రాసిన వాక్యం అర్ధం అయింది. దాని గురించి మరిన్ని వివరాలు ఇవ్వగలరా అనేది నా విన్నపం :)

మంచు said...

సాయి ప్రవీణ్ :-)
ఒకే. అర్ధం అయ్యింది. కదులుతున్న వాహనాలని ఆపడానికి రెండు రకాల బ్రేక్లు ఉంటాయ్. ఒకటి ఎలక్ట్రిక్ బ్రేక్. ఒకటి మెకానికల్ బ్రేక్. మెకానికల్ అంటే ఎంలేదు తిరిగుతున్న చక్రాన్ని బ్రేక్ షూ తొ గట్టిగా పట్టి ఉంచడమే... అందువల్ల రాపిడి , ఉష్ణం . నీకు తెలుసున్నదే. ఇక ఎలక్ట్రిక్ బ్రేక్ అంటే ఒక ఎలక్ట్రిక్ జనరేటర్ ని తిరుగుతున్న ఆక్సిల్ కి తగిలించడమే. అప్పుడూ తిరిగే చక్రం జనరేటర్ ని తిప్పి విద్యుత్ పుడుతుంది. ఇక్కడ ఉష్ణం అన్న ప్రసక్తే రాదు. కేవలం నిల్వ ఉన్న కెనటిక్ ఎనర్జీ ని ఎలెక్ట్రిక్ ఎనర్జీ గా మార్చడమే. మారిన విద్యుత్చక్తి ని బ్యాటరీలలొ నిల్వ ఉంచడమా లేక అక్కడ ఒక విద్యుత్ నిరొధం (రెసిస్టన్స్) పెట్టి మళ్ళీ ఉష్ణం లొకి మార్చి వాతావరణం లొకి వదలడామా అన్నది మన ఇస్టం.
హైబ్రీడ్ కార్లలొ అయితే ఆ విద్యుత్చక్తిని బ్యాటరీలలొ స్టొర్ చేసి మళ్ళీ తిరిగి ఉపయోగించుకుంటాం. అదే మన ఇండియన్ డీజిల్ ఇంజన్ రైళ్ళలొ అయితే అలా మార్చిన విద్యుత్చక్తిని హీటర్ల ద్వారా ఖర్చుపెట్టేస్తాం. అదే మన ఎలెక్ట్రిక్ ట్రైన్ లొ అయితే ఆ విద్యుత్చక్తిని తిరిగి గ్రిడ్ కి సరఫరా చేస్తాం...

ఇక జనరేటర్ బ్రేక్ లా ఎలా పనిచేస్తుంది అంటే... జస్ట్ ఇలా అలొచించు. జనరేటర్ అన్నది మోటర్ కి ఆపొసిట్ కదా... అంటే ఎలెక్ట్రిక్ బ్రేక్ అంటే ... కదులుతున్న వాహనాన్ని సడన్ గా రివెర్స్ గేర్ లొ వేస్తే త్వరగా ఆగుతుంది కదా... అలాగే ఈ జనరేటర్ కూడా రివెర్స్ లొ తిరిగే మోటార్ గా ఊహించుకొవచ్చు.

మెకానికల్ బ్రేక్ లలొ పొలిస్తే ఎలెక్ట్రిక్ బ్రేక్ కొంచెం స్లొ. అందువల్ల ఎప్పుడూ వాహనాలలొ రెండు బ్రేకులు ఉంటాయి ..ముందు ఎలెక్ట్రిక్ బ్రేక్ తొ మేగ్జిమం ఎనర్జీ రికవరీ చేసి అఖరులొ మెకానికల్ బ్రేక్ వాడతాం. మనం బ్రేక్ తొక్కగానే ముందు ఎలక్ట్రిక్, తరువాత మెకానికల్ అన్నీ అటొమేటిక్ అవే జరుగుతాయి.

feel free to ask if you want any other details. :-)

కత పవన్ said...

(ఇక లాభం లేదు నేను english లో కోడతా)

-----------
మంచు గారు
i have a doubtu, what antay ,if we put wateru bandi how running

Unknown said...

మంచు సూపర్ పోస్ట్ .. ఎంత బాగా రాసావో తెల్సా .... అసలు ఇంత అనలైజ్ చెయ్యడం రియల్లి గ్రేట్ ..

సో నాకెప్పుడు ఈ కార్ కొనిపెడుతున్నావ్ :)

Pranav Ainavolu said...

మీ గురించి బజ్ ద్వారా తెలిసి బ్లాగు దాకా వచ్చాను. 'మంచు పల్లకీ' అనే పతాక శీర్షిక చూసి ఇందులో అర్ధరాత్రి వెన్నెలలు, నిశీధి నీరవాలు, ఆకాశ హర్మ్యాలతో కూడిన కవితలుంటాయనుకున్నాను కానీ ఇక్కడికొచ్చి చూస్తే మీ రూటే సపరేటు లాగుంది :)
చాలా బాగా రాశారు. కాసేపు ఆలోచనల్లో పడిపోయాను.
సంక్రాంతి శుభాకాంక్షలు!

మంచు said...

శ్రావ్య:
ఎక్కువ పెట్రొల్ ఖర్చు పెట్టడం వేరు , వృధావేరు..
ఉదాహరణకి ఈ వృధా అయిన ఇంధనాన్ని సేల్స్ టెక్స్ తో పోలుద్దాం.... 10 % టాక్స్ ఉందనుకోండి..... పది లక్షలు పెట్టి ఏదయినా కొంటే లక్ష టాక్స్ కట్టాలి.
అదే టాక్స్ 20 % కి పెంచారు అనుకోండి .అప్పుడు ఐదులక్షలు పెట్టి కొన్నదానికి కూడా లక్ష టాక్స్ కట్టాలి. ఇక్కడ మొదట ఖర్చుపెట్టిందే ఎక్కువ కానీ మనం నష్టపోయింది మాత్రం రెండో దాంట్లో. (టాక్స్ నష్టం అనుకోవడం ఇష్టం లేకపోతే బ్రోకరేజ్ ఉదాహరణ తీసుకోండి).

అలాగే స్పోర్ట్స్ కార్స్ ఎక్కువ పెట్రోల్ తాగినా ఎక్కువ పని చేస్తాయి.

అయినా స్పోర్ట్స్ కార్ ఎఫ్ఫిషియన్సి , మామూలు కార్ ఎఫ్ఫిషియన్సి పోల్చకూడదు. స్పోర్ట్స్ కార్ లో మెయిన్ (CTQ (critical to quality)) కావాల్సింది పవర్..పెట్రోల్ ఆదా కాదు.
అందుకు వాటిని ఎక్కువ పవర్ వచ్చేలా డిజైన్ చేస్తారు. అదే మనం రోజువారి వాడే కార్లలో పెట్రోల్ మైలేజ్ ముఖ్యం. రెండిటి కి ఎఫ్ఫిషియన్సి లో కంపేరిజన్ లేదు.

మామూలు కార్లలో ఎఫ్ఫిషియన్సి ఎలా ఉంటుంది చూడండి.

1 . 0 km (అంటే నిలిచి ఉన్న కార్ ని ) నుండి ఒక 30 kmph స్పీడ్ వచ్చేవరకు ఆక్సిలరేట్ చేస్తుంటే పెట్రోల్ ఎక్కువ తాగుతుంది.... ఎందుకంటే మీరు వేగం పెంచుతున్నారు అంటే కార్ నడపడానికి కావాల్సిన శక్తిని ఇవ్వడం తో పాటు కొంత శక్తి నిల్వ చేస్తున్నారు. అప్పుడు వృధా కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కార్ వేగం ఇంకా తక్కువ ఉంది కాబట్టి.

2 . కార్ ని 30 kmph దగ్గర నడుపుతున్నారనుకోండి ....అప్పుడు పెట్రోల్ తక్కువ తీసుకుంటుంది...కానీ వృధా ఉంటుంది.

౩. కార్ ని 60 kmph దగ్గర నడుపుతుంటే, అప్పుడు ఇంజిన్ తీసుకునే పెట్రోల్ 30 kmph కన్నా ఎక్కువ ఉంటుంది.... కానీ వృధా మాత్రం తక్కువ ఉంటుంది.

4. అదే కార్ ఒక 130kmph దగ్గర వెళ్తుంటే మళ్ళీ పెట్రోల్ ఎక్కువ తీసుకుంటుంది....మరియూ వృధా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతీ కార్ కి ఒక స్పీడ్ రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ లో ఎక్కువ ఎఫ్ఫిషియన్సి ఇస్తుంది. ఆపై ఎక్కువయినా తక్కువయిన ఇంధనం వృధా అవుతుంది. సో ఎప్పుడూ వాహనం ఎక్కువ మైలేజ్ పెచాలంటే దాని స్పీడ్ రంజ్ చూసుకుని ఆ రేంజ్ లో నడపాలి. బ్రేక్ వాడుతున్నపుడల్లా బోల్డు శక్తి నష్ట పోతున్నాం కాబట్టి ..ఎక్కువ స్పీడ్ పెంచి బ్రేక్ లు ఎక్కువ వేస్తూ కాకుండా ..ఒక కాన్స్తంట్ స్పీడ్ లో వెళ్ళేలా చూసుకోవాలి.

సో ఇవే కండిషన్స్ సింపుల్ గా చూద్దాం....
ఇంధన వాడకం :
ఆక్సిలరేషన్ > 130 kmph > 60 kmph > 30 kmph
ఇంధన వృధా :
ఆక్సిలరేషన్ > 30 kmph > 130 kmph > 60 kmph

మంచు said...

శివా..బొల్డు థాంక్స్ లు...నువ్వు ఇలాగే బొల్డు కామెంట్స్ పెట్టి నాకు సపొర్ట్ ఇవ్వాలి మరి.
నేస్తం గారు: :-) ఫ్యూచర్ లొ చెప్పలేం కదా... మీ పిల్లలకి చెప్తానేమో :-)
3జి, సుబ్రహమణ్యం గారు: ఇప్పుడు ఇదొక్కటే సమస్య. సరి అయీన మన్నిక గల బ్యాటరీలు అందుబాటులొ లేకపొవడం. పరిశొధన అంటూ కొనసాగుతూ ఉంటే కొన్నాళ్ళలొ మంచి బ్యాటరీలు చూద్దాం.
చాల కంపెనీలు ముఖ్యంగా (A123 Systems company) ఇప్పుడు చాల మంచి బ్యాటరీలను రూపొందిస్తుంది. రొజువారి ఉపయొగించే కార్లకి అమెరికాలొ మాగ్జిమం డిజైన్ స్పీడ్ గంటకి 140 మైళ్ళు. ఇది ప్రస్తుతం అందుబాటులొ ఉంది. (స్పొర్ట్స్ కార్ కస్టం కానీ).
అలాగే బ్యాటరీ మన్నిక కూదా చాల బావుంది. ప్రస్తుతం ధర కొంచెం ఎక్కువ... త్వరలొ ఇది బ్రెక్ అవుతుంది అని అనుకుంటున్నా... నా అంచనా ప్రకారం ఇంకొ పదేళ్ళలొ అందరికి అందుబాటు దరలలొ దొరుకుతుంది ..

మంచు said...

@కల్పన గారు... అందరూ వచ్చి ఇలాంటి పొస్ట్లు చదవాలి అంటే మధ్యలొ చుంబరస్కా లాంటి మసాల ఉండాలి :-) ఎనీవే... బ్లాగ్ కి ఒక స్టాంప్ అంటూ ఎం లేదు ..ఎది అనిపిస్తే అది రాసెయ్యడమే... ఇంకొమాట...చుంబరస్కా కాపీ కాదు... నా సొంతం...
@ అప్పు, వేణూ, విరిబొణీ గారు: థాంక్స్ అండీ... తప్పకుండా రాస్తూ ఉంటా... అప్పుడప్పుడూ :-)
@ రాధిక గారు: మీకు సంక్రాంతి శుభాకంక్షలు. మీ అరిసెలు నాకింకా అందలేదు :-)
@ పప్పు గారు: థాంక్స్ అండి..చాలా రొజుల తరువాత అంటే ఎంటండీ... నేను ఈ మద్య బాగా రాయడం లేదా :-)

మంచు said...

@ ఇందూ గారు... అయ్యో ఫ్యుచర్ లోకి వెళ్ళిపోయారా... తిరిగి రావడం తెలీట్లేదా.... అయ్యో.....సరే మీరు మళ్ళీ కస్టపడి రావడం ఎందుకూ .. అక్కడే ఉండండీ...మేమే వచ్చేస్తాం...
రేవా కారు తెలుసు. టూ సీటర్స్ కాదు.. వెనుకు రెండు బుల్లి బుల్లి సీట్లు ఉంటాయి..పిల్లలకి :-) అప్పట్లొ రేవా అఫీసు పక్కనే మా ఆఫీసు ఉండేది
@ కత పవన్ : అర్ధం కాలేదబ్బాయి... నువ్వు తెలుగులొనే అడుగు :-)

మంచు said...

కావ్య ...కారే కదా కొనేద్దాం... ప్రస్తుతం లెక్సాస్ లొ ఉంది హైబ్రీడ్ మోడల్ అది కానీ....లేక ప్లగ్-ఇన్ మోడలే కావాలంటే టెస్లా అని ఒక మంచి కారు కంపనీ ఉంది... మాంచి కాస్త్లీ ... అది కొనేద్దాం :-)

ఇక్కడ చూడు :
http://www.teslamotors.com/

మంచు said...

ప్రణవ్ గారు: థాంక్స్ అండీ...అర్ధరాత్రి వెన్నెలలు, నిశీధి నీరవాలు, ఆకాశ హర్మ్యాలతో కూడిన కవితలు రాసే అంత టాలెంట్ మనకి లేదు...అందుకే ఇలా ఎవొ చిన్న చిన్నవి :-) మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

Anonymous said...

/మెకానికల్ బ్రేక్ లలొ పొలిస్తే ఎలెక్ట్రిక్ బ్రేక్ కొంచెం స్లొ/
మేస్టారూ, అంటే రెండు బ్రేకులూ పక్క పక్కనే వుంటాయా? ఏది ఎప్పుడు వాడాల? అసలు పెట్రోల్ అన్నదే లేకుండా గాలి, ఎండ, నీరుతో నడిచేకారు ఎప్పుడొస్తుందో ఏమో. లేదా చక్కగా రీఫిల్లింగ్ లేని అణుధార్మిక పదార్థంతో నడిచే కారు/ట్రక్కులు వున్నాయా?

మంచు said...

కార్లొ రెండు బ్రేకులూన్నా డ్రైవర్కి అందుబాటులొ ఉండేది ఇక పెడల్ మాత్రమే. డ్రైవర్ అది తొక్కితే కార్ లొపలున్న మైక్రొపొసెసర్ అది సెన్స్ చేసి ఎంతవరకు ఎలక్ట్రిక్ బ్రేక్ వాడాలొ, ఎంతవరకు మెకానికల్ బ్రేకు వాడాలొ అదే కంట్రొల్ చేస్తుంది. డ్రైవర్ ఎమీ చూసుకొ అక్కర్లేదు.

ఎండతొ నడిచే కార్లు సొలార్ కార్లు...అవి ఎంతొ దూరం లొ లేవు...మహా అయితే ఇంకొ 20 సంవత్సరాలు. అంతే

ప్రస్తుతం అణుధార్మిక పదార్థంతొ నడిచే కార్లు లేవుకానీ... సబ్‌మరైన్స్ దొరుకుతాయి. ఉన్నాయి :-)

Sravya V said...

మంచు గారు ఓపిక గా జవాబు ఇచ్చినందుకు Thank you very much .

కృష్ణప్రియ said...

చాలా ఇంటరెస్టింగ్ గా టెక్నికల్ విషయాలు.. చెప్తున్నారు .. Very nice! గమ్మత్తు గా అనిపించింది.. తెలుగు లో ఇలాంటి సబ్జెక్ట్ చదివి మా అమ్మాయి కి ఆంగ్లం లో తర్జుమా చేయటం..

ఇందు said...

రేవాలో బుల్లి బుల్లి సీట్లు ఉంటాయా? బెంఘలూరు వోల్వో బస్సులోనుండి కింద ఉన్న కారులోకి తొంగి చూసి రెండే అనుకుని కంఫర్మ్ చేసుకున్నా! నేను అక్కదే ఫ్యుచర్లో ఉండిపోవాలా? మీరెప్పటికి వచ్చేనూ?? అప్పటిదాకా మీ బ్లాగ్లో ఉన్న బ్రెడ్ పిజ్జా తింటూ ఉండాలా ఏమిటి? :(

Sai Praveen said...

That is pretty clear. Thank you.
అయితే ఎలెక్ట్రిక్ బ్రేక్ వాడుకలో ఉందన్నమాట. interesting.. i too will google abt it :)

మిగిలిన వారికి ఇచ్చిన వివరణలు కూడా బాగున్నాయి, బ్యాటరీల వివరాలు, సబ్మెరైన్స్...
మీరు ఏ ఫీల్డ్ లో పని చేస్తున్నారు?
If you studied all these just out of interest... thats simply great :)

సూర్యుడు said...

కొన్నాళ్ళ క్రితం సైకిళ్ళకి డైనమో పెట్టి హెడ్ ల్యాంప్ వెలిగించేవారు. ఇప్పుడుకూడా కారు బ్యాటరీని ఇలానే చార్జ్ చేస్తారేమో కదా? ఇదే టెక్నాలజీని మీరు చెప్పిన అవసరానికి ఎందుకు వాడకూడదు?

హరే కృష్ణ said...

మీరు చెప్పిన విధానం చాలా బావుంది
thankyou
టెస్లా గురించి మీరు చెప్తారేమో అని అనుకున్నా :)

మంచు said...

శ్రావ్య, కృష్ణప్రియ గారు: ధన్యవాదములు:-)
ఇందుగారు: రేవా లొ ఉండే బుల్లి సీట్లు నిజంగా చాలా చిన్నవి:-) అంత ఈజిగా కనిపించవ్ :-)
సాయి: థాంక్యూ
సూర్యుడు గారు: మీరు చెప్పింది కరెక్టే... డైనమో అంటే జనరేటర్. అక్కడ జనెరేటర్ (డైనమో) నడిపేది మనిషి. ఇక్కడ జనరేటర్ (డైనమో) నడిపేది డీజిల్ ఇంజిన్ అంతే తేడా ....
హరే : థాంక్యూ... టెస్లా గురించి రాయడం ఎమిటొ అర్ధం కాలేదు... :-) పైన కావ్య కామెంట్ లొ ఒక లింక్ ఇచ్చా చూడు... టెస్లా మోటార్స్ ...కార్లు బాగుంటాయ్ ...హరే : థాంక్యూ... టెస్లా గురించి రాయడం ఎమిటొ అర్ధం కాలేదు... :-) పైన కావ్య కామెంట్ లొ ఒక లింక్ ఇచ్చా చూడు... టెస్లా మోటార్స్ ...కార్లు బాగుంటాయ్
ఎలెక్ట్రిక్ మోటార్ తొ ఆల్మొస్ట్ స్పొర్ట్స్ కార్ really great...

Ennela said...

entidee, inta serious topikkU?
yedo chumbaraskaa typulo untundemo ani eduru choostoo chadivaanu mari...baagundandee...chaala sayinsu chadivinchesaaru....

Anonymous said...

Nice post and informative for non EE's. Siemens and BMW together has proposed induction charging for electric vehicle. In june it will be tested in Berlin. Present efficiency while testing is 90%, if it works as expected, HEV and EV charging would be more convienient on highways.
Vishwasri.

మంచు said...

Vishwasri garu

thank you very much.