*** శ్రీ రామ ***
ఒకసారి
నా కొలీగ్ ఒకడు భారతీయ హిందువుల్లో అధిక శాతం శాకాహారులే ఎందుకు ఉంటారు,
మాంసాహారం తినే కొద్దిమంది హిందువులు కూడా బీఫ్ (ఆవు)ని ఎందుకు తినరు అని
అడిగాడు. అతను అన్నట్టు హిందువుల్లో మెజారిటీ శాకాహారులు అన్నది తప్పేమో
కానీ మాంసాహారం తినేవాళ్ళలో మాత్రం చాలామంది బీఫ్ తినడానికి ఇష్టపడరనేది నిజమే కదా.
అసలు ఒక మనిషి శాకాహారిగా లేక మాంసాహారిగా బ్రతకాలని
ఎప్పుడు ఎవరు నిర్ణయిస్తారు అన్నది ఒకసారి చూస్తే, 99 శాతం కేసుల్లో అది
వారు పుట్టిన కుటుంబ నేపథ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మనిషి శాకాహారుల
ఇంట్లో పుడితే శాకాహారి, లేకపోతే మాంసాహారి అవుతాడు. అంతే కానీ తనకు తాను ఇష్టపడి
కోరి తన ఆహారపు అలవాట్లు మార్చుకున్న సందర్భాలు తక్కువే ఉంటాయి. కొంతమంది
మాంసాహారులు ఆరోగ్యపరమయిన కారణాల వల్ల అయితేనేమి, వేగన్స్ లా మిగతా
జంతుజాలం పట్ల ఉన్న కన్సర్న్ వల్ల అయితేనేమి , లేక జీవిత భాగస్వామి వెజ్ అవడం వల్ల లేక సింపుల్ గా తినడం సహించక శాకాహారులుగా మారడం ఈ మధ్య
కొంచెం తరచుగానే చూస్తున్నాం కానీ చిన్నప్పటినుండి శాకాహారుల ఇంట్లో పుట్టి పెరిగి
కాలేజికి వెళ్ళాకో లేక పరాయి దేశం వెళ్ళాకో లేక నాన్ వెజ్ జీవిత భాగస్వామి వల్లొ మాంసాహారులగా మారడం మాత్రం చాలా
తక్కువనే చెప్పుకోవాలి.
మనిషి ఆహారపు అలవాట్ల మీద తను నమ్మే మతం యొక్క ప్రభావం
అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి హిందువుల్లో అధికశాతం శాకాహారులుగా జీవించడానికి మతం (కొన్ని కులాల వారికే అనుకోండి) ముఖ్య కారణం ఇంకా చెప్పాలంటే ఏకైక కారణం.
అలాగే మాంసాహారం తినే హిందువుల్లో కూడా చాలామంది బీఫ్ తినకపోవడానికి కూడా
"ఆవు మనకి చాలా పవిత్రమయిన జంతువు, గోహత్య మహాపాతకం " అన్న మతపరమయిన నమ్మకం కూడా ఒక కారణం.
హిందువుల్లో కూడా ఒకానొక సమయంలో మాంసాహారం (ఆవుమాంసంతో) సహా తినేవారు అని చాలా మంది వినేవుంటారు. అలాగే చాలా తెగలలో లానే జంతు బలులు కు హిందూమతం వ్యతిరేకం కాదు. పూర్వాకాలంలో యజ్ఞయాగాదులు నిర్వహించినప్పుడు చివర్లో జంతువులని బలి ఇచ్చి ఆ మాంసాన్ని పంక్తి లో అందరితో కలసి భుజించేవారని కూడా వినే ఉంటారు. మరి
అలాంటిది ఎప్పుడు కొంతమంది హిందువులు ఇలా పూర్తి స్థాయి శాకాహారానికి
మారిపోయారు అన్న ప్రశ్న రావచ్చు. అలాగే సడన్ గా "గోహత్య మహాపాతకం" అన్న కాన్సెప్ట్ ఎందుకు పుట్టింది అని.
ఆహారపుటలవాట్లకి సంబంధించిన విషయాల్లో ఉండే ప్రతీ మతపరమయిన ఆంక్షల వెనుక సమాజానికి మంచి చేసే (కనీసం అప్పటి పరిస్థితులకి సరి అయినది) అంశం ఉంటుంది అని నా నమ్మకం. అసలు ఆహారపు అలవాట్లనే కాదు మతపరమయిన ఏ నియమనిభందనల వెనుకయినా సాంఘీక సంక్షేమమో , ప్రకృతి రక్షణొ లేక బలమైన వర్గాలకి చెందినవారికి లాభం కలిగించే స్వార్ధపరమయిన కుట్రొ .... ఇలాంటి కారణం ఏదో ఒకటి ఖచ్చితం గా ఉంటుంది కానీ కేవలం దేవుడికి ఇది ఇష్టం ఉంటుంది అని ర్యాండం గా ఊహించి అయితే మాత్రం ఉండదు అని నా అభిప్రాయం.
ఇంకో రకంగా చెప్పాలంటే సమాజంలో ఎక్కువమంది దేవుడిని నమ్మేవారు ఉంటారు కాబట్టి ఏదయినా ఒక నియమం అందరూ పాటించేలా చెయ్యాలంటే దానికి మతపరమయిన లంకె ఒకటి అటాచ్ చేస్తే బాగా వర్కవుట్ అవుతుంది అన్నమాట. హిందూ మతమనే కాదు ప్రతీ మతంలో తాము తినే ఆహారానికి సంబంధించి కొన్ని నియమనిబంధనలు ఉంటాయి.
ఆహారపుటలవాట్లకి సంబంధించిన విషయాల్లో ఉండే ప్రతీ మతపరమయిన ఆంక్షల వెనుక సమాజానికి మంచి చేసే (కనీసం అప్పటి పరిస్థితులకి సరి అయినది) అంశం ఉంటుంది అని నా నమ్మకం. అసలు ఆహారపు అలవాట్లనే కాదు మతపరమయిన ఏ నియమనిభందనల వెనుకయినా సాంఘీక సంక్షేమమో , ప్రకృతి రక్షణొ లేక బలమైన వర్గాలకి చెందినవారికి లాభం కలిగించే స్వార్ధపరమయిన కుట్రొ .... ఇలాంటి కారణం ఏదో ఒకటి ఖచ్చితం గా ఉంటుంది కానీ కేవలం దేవుడికి ఇది ఇష్టం ఉంటుంది అని ర్యాండం గా ఊహించి అయితే మాత్రం ఉండదు అని నా అభిప్రాయం.
ఇంకో రకంగా చెప్పాలంటే సమాజంలో ఎక్కువమంది దేవుడిని నమ్మేవారు ఉంటారు కాబట్టి ఏదయినా ఒక నియమం అందరూ పాటించేలా చెయ్యాలంటే దానికి మతపరమయిన లంకె ఒకటి అటాచ్ చేస్తే బాగా వర్కవుట్ అవుతుంది అన్నమాట. హిందూ మతమనే కాదు ప్రతీ మతంలో తాము తినే ఆహారానికి సంబంధించి కొన్ని నియమనిబంధనలు ఉంటాయి.
ఉదాహరణకి కొంతమంది క్రైస్తవులు శుక్రవారం కేవలం చేపలు మాత్రమే
తింటారు. పూర్వాకాలంలో ఒకానొకప్పుడు ప్రజలందరూ రెడ్ మీట్ (బీఫ్ లాంటివి)
తినడానికి బాగా అలవాటు పడి చేపలు తినడం బాగా తగ్గించేసారట. అదే జీవనాధారంగా
బ్రతుకుతున్న మత్స్యకారుల సంపాదన తగ్గి జీవనం కష్టం అవడంతో వాళ్ళు వెళ్ళి
అప్పటి మతాధికారులకి మొరపెట్టుకున్నారట. వీళ్ళను ఆదుకోవాలంటే ప్రజల
చేత కనీసం అప్పుడప్పుడు అయినా చేపలు తినేలా చెయ్యాలి. మరి రుచికరమయిన రెడ్
మీట్ వదిలేసి చేపలు తినమని చెప్తే ఎవరు తింటారు. అప్పుడు పుట్టిందే ఈ
శుక్రవారం చేపల రూల్ అన్నమాట. వారంలో మనం చేసే పాపాలు తొలగిపోయి
పరిశుద్ధంగా ఉండాలి అంటే వారంలో ఒక రోజు ఉపవాసం చెయ్యాలని, జీసస్
చనిపోయింది
శుక్రవారం కాబట్టి ఆ రోజు ఉపవాసం చెయ్యడానికి సరైన రోజు అని మతాధికారులు
కొత్త సంగతి చెప్పారన్నమాట. వాళ్ళకి చేపలు మాంసాహారం క్రిందకి రాదు కాబట్టి
చేపలు
తినడం వారికి ఉపవాసం క్రిందే లెక్క.
పైన చెప్పుకున్నది సంఘంలో ఒక వర్గానికి చెందిన ప్రజలను
ఆదుకోవడం కోసం పుట్టిన మతపరమయిన నిబంధన. అలాగే ప్రజల ఆరోగ్యం దృష్టిలో
పెట్టుకుని ఆహారపుటలవాట్లలో ఆంక్షలు విధిస్తూ పుట్టిన మతపరమయిన నియమాలు కూడా
ఉన్నాయి. ఉదాహరణకి ముస్లింల హలాల్ పద్ధతి.
ముస్లింలలో వాళ్ళు తినబోయే జంతువులను ఎంచుకోవడానికి,
వాటిని చంపే విధానానికి సంభందించి కొన్ని ఖచ్చితమయిన నిబంధనలున్నాయి. ఈ నిబంధనల
ప్రకారం చంపినవే తినడానికి అర్హత పొందుతాయి (హలాల్) లేకపోతే అవి తినడానికి
అనర్హం (హరాం) అన్నమాట. ఈ నియమాలు కొన్ని విశ్లేషిస్తే మనకి వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి - చంపబోయే జంతువుని (చేప తప్ప) జాగ్రత్తగా పట్టుకుని పక్కకు పడుకోబెట్టి పదునయిన చాకు తీసుకుని దాని jugular veins మాత్రం జాగ్రత్తగా కోసి రక్తం అంతా పోయేవరకు ఉంచి అప్పుడు మిగతా భాగాలు కొయ్యాలి. పైన "జాగ్రత్తగా" పట్టుకుని అని రాసింది వెటకారం కాదు. నిజంగానే చాలా సున్నితంగా హేండిల్ చేస్తారు. రక్తంలో యూరిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి రక్తం ఉన్నమాంసం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆ నిబంధన పెట్టి ఉంటారు అని కొంతమంది నమ్మకం.
- అలాగే పంది మరియు మాంసాహారం తినే పక్షులు (గ్రద్ద) లాంటివి తినకూడదు అని ఇంకో నిబంధన ఉంది. దీనికి రెండు కారణాలు వాడుక లో ఉన్నాయి. ఒకటి... పైన చెప్పినట్టు ఆ jugular veins మాత్రమే కొయ్యడం పంది యొక్క శరీరాకృతితో కుదరదు (మెడ లావుగా ఉండటం వల్ల). అందువల్ల ముస్లింలలో కొందరు ఏమంటారంటే... "ఈ జంతువు తినొచ్చు అని దేవుడు అనుకుంటే దాని మెడ కూడా మేక, కోడిలా సన్నగా పెట్టకుండా ఇలా లావుగా పెట్టి jugular veins కొయ్యడం కుదరకుండా చెయ్యడు కదా... అందువల్ల మనం తినకూడదు" అని. రెండో కారణం అయితే పంది అపరిశుభ్రమయిన ప్రదేశాల్లో ఎక్కువ నివసిస్తుంది కాబట్టి, పంది మీద చాలా పేరాసైట్స్ నివాసం ఉంటాయి. అందువల్ల పందిని తింటే ఆ పేరాసైట్స్ మనుషులకి రోగకారణం అవుతాయి కాబట్టి పందిని తినకూడదు అని. నాకు కాస్త ప్రాక్టికల్ అనిపించేది రెండో కారణమే.
- అలాగే ఆల్రెడీ చనిపోయిన జంతువులు తినకూడదు అన్న ఇంకో నియమం ఉంది. దానికి "ఆ చనిపోయిన జంతువు ఏ జబ్బుతో చనిపోయిందో తెలీదు కాబట్టి తెలీకుండా తింటే ఆ జబ్బు మనుషులకి అంటుకుంటుంది" అన్న లాజిక్ కనిపిస్తుంది.
- వేరే జంతువులు వేటాడి కొంచెం తిని వదిలేసిన మాంసం మనం తినకూడదు అన్న ఇంకో నియమం "ఆ వేటాడి తిన్న జంతువుల నోటిలో రేబిస్ లాంటి వైరస్ ఉండి అది తరువాత ఆ మిగులు మాంసం తిన్నవారికి సోకవచ్చు" అన్న కారణంతోనూ, ఇలా హలాల్ లో ప్రతీ నిబంధనకి అనేక రకాల కారణాలు వెతకొచ్చు.
ఇవన్నీ చూసి
నాకేమనిపిస్తుంది అంటే... మన హిందూమతం లో కూడా పూర్వకాలంలో బీఫ్ తిన్నా
కూడా తరువాతి కాలంలో ఆవు యొక్క ఉపయోగాలు (పాలు మరియూ పాల ఉత్పత్తులు) దృష్టిలో పెట్టుకుని ఆవుల జాతి అంతరించిపోకుండా కాపాడటానికి, మాంసం కోసం ఆవుల్ని చంపడాన్ని అదుపులో ఉంచడం కోసం మతం పేరుతో ఒక నిభందన పెట్టి ఉంటారు. గోవుకి మన
పురాణాల్లో కామధేనువనే స్థానం ఎలాగూ ఉంది కాబట్టి అది ఉపయోగించుకుని రెండూ కలసి వచ్చేలా పెట్టి ఉంటారు. గోహత్య మహాపాతకం, జంతుబలులు , చంపి దేవుడి కి ఆఫర్ చేస్తే తప్పులేదు, అహింస ఇవన్ని అసలు ఎందుకో అతికినట్టు అనిపించవు.
పైన చెప్పుకున్న ఉదాహరణలు అన్నీ చూసాక ఏ మతం పెట్టిన నియమనిభందనలు అయినా అవి అప్పటి ప్రజల ఆరోగ్యాన్ని, సాంఘీకసంక్షేమాన్ని దృష్టిలో
ఉంచుకుని పెట్టినట్టు అనిపిస్తుంది కాబట్టి ఆహారపు అలవాట్ల విషయంలో మతం
చెప్పిందే వేదం అనుకోవచ్చు. కానీ వాటిలో చాలామటుకు అప్పటి అంటే ఆ రూల్స్ పెట్టే సమయానికి ఉన్న పరిస్తితులకి అనుగుణం గా ఏర్పడినవి. అయితే అవన్నీ ఇప్పుటి పరిస్తితులకి వర్తించాలని లేదు. కొన్ని ఆచార వ్యవహారాలు, నమ్మకాలు మారుతున్నకాలంతో పాటు అనేక సవరణలు దిద్దుబాట్ల తో మారుతూ వస్తున్నాయ్, కొన్ని కనుమరుగైపొయాయ్ కూడా . ఈ నమ్మకాలలో కొన్ని ఈనాటి పరిస్థితులకి వర్తించవు
అనిపించినప్పుడు ఆయా నిబంధనలను సవరించడం కూడా తప్పు కాదు. ఎందుకంటే, మానవ
మనుగడలో 'మార్పు' అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియే. అలా సవరణలు చెయ్యాల్సిన, చేసుకోవాల్సిన అవసరం బాధ్యత అందరిమీదా ఉంటుంది. మన మతంలో ప్రస్తావించారన్న ఏకైక కారణం తో ప్రతీవిషయంలో విచక్షణ లేకుండా గుడ్డిగా అనుసరించాలని లేదు. మతం లో ఉన్న ఏ నియమం అయినా ఒక్కసారి దాని వెనుకున్న లాజికల్ రీజన్ అర్ధం చేసుకుంటే , ఇప్పటి పరిస్తితులలో అది అనుసరించాలో అక్కరలేదో మన కామన్‌సెన్స్ చెప్తుంది.
- మంచు









