హే... నిన్న రాత్రి నాకో కలొచ్చింది. భలే చిత్రమైన కల తెల్సా..
ఊ.. చెప్పు.. ఏంటా కల?
మరేమో.. నేను ఎక్కడో ఉన్నానంట.. చుట్టూ చూస్తుంటే అంతా కొత్తకొత్తగా అనిపించింది..
హిహిహి.. అంటే 'జూ' లో ఉన్నట్టా.. :-)
ఇలా అయితే నేను చెప్పనసలు... :-(
సర్లే నవ్వనులే చెప్పు...
మరేమో.. ఏం చెప్తున్నాను.. ఆ.. అదే నేను కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ అంతా కొత్తగా వింతగా అనిపించింది.
అదేంటి.. నిద్రలో నుండి కళ్ళు తెరిచి చూస్తే మీ ఇల్లే కదా కనపడాలి.. కొత్త కొత్తగా ఎందుకు అనిపించింది?
ఈ ఈ ఈ ఈ.. &;;@*!)#*(#@............... .........................
సర్లే సర్లే చెప్పు.. ఇక మధ్యలో అడ్డుపడను.. :-)
కళ్ళు తెరిచేసరికి చుట్టూరా కనుచూపుమేరా లేత ఎరుపు రంగులో మెత్తటి ఇసుక తిన్నెలు పరుచుకుని ఉన్నాయి. ఇసుకలో అక్కడక్కడా పాతుకుపోయిన బండరాళ్ళూ, దూరంగా కాస్త మసగ్గా కనిపిస్తున్న ఎత్తైన పర్వతాలూ అన్నీ కూడా ఎర్రగానే ఉన్నాయి. పైనుంచి పడుతోన్న ఎండ ఆ ఎర్రటి ఎడారిని మరింత వెలిగిస్తోంది. అసలా వెలుగు రేఖల స్పర్శకి బంగారు ఛాయలో మెరిసిపోతున్న దూరపు కొండల వైపు చూస్తుంటే, ఓ.. మాటకి ముందు 'బంగారుకొండ' అని అంటూ ఉంటాం కదా.. బహుశా వీటిని చూసే ఆ పదం పుట్టిందేమో.. అన్న ఊహకి నవ్వొచ్చింది. నిజంగానే అదేదో కొత్త బంగారు లోకం గానీ కాదు కదా! చిత్రంగా ఆ ఎర్రటి ఎడారిలో పట్టపగలే అంత ఎండలోనూ వణికిస్తున్న చలి.. కంటికి కనిపించకుండా అదృశ్యంగా దాగిన మంచు తెరల్లో చుట్టేసినట్టు ఒక చల్లచల్లని వింత అనుభూతి తెలుస్తోంది. ఆకాశం వైపు చూస్తే కాస్త మసక మసగ్గా ఉంది. తెలతెల్లని మబ్బుల జాడే లేకుండా ఆకాశమంతా లేత ఎరుపు రంగులో ఉంది. నా అయోమయాన్ని కాస్త తేలికపరుస్తూ సూర్యుడు కంటపడ్డాడు. రోజూకన్నా కాస్తంత సన్నబడ్డట్టు, రంగు తగ్గినట్టు, మెరుపు తగ్గినట్టు అనిపించింది. తర్వాత కాసేపటికి సూర్యాస్తమయం అయిపోయింది. సూరీడు ఆ ఎర్రటి కొండల ఒడిలోకి పూర్తిగా జారిపోయి ఆకాశాన్ని చీకట్లో నింపేశాడు. నేను కంగారుపడేంతలో ఆకాశంలో బోల్డన్ని చుక్కలు, చందమామ కనిపించాయి. చంద్రుడి చుట్టూ అలలు అలలుగా ఏర్పడిన గాలి గుళ్ళు భలే ఉన్నాయే అనుకుంటుండగానే ఇంకో చిన్న చందమామ లాంటిది కనిపించింది. ఇద్దరు చంద్రుళ్ళా.. ఇది కలా నిజమా అనుకుంటున్నాను. ఇంతలో...
ఆగాగు... నువ్వు చెప్పేది వింటుంటే నాకొకటి గుర్తొస్తోంది. కానీ, ముందు ఈ ఫోటో చూసి నువ్వు కలలో చూసింది ఇంచుమించు ఇలా ఉందేమో చెప్పు.
మార్స్ మీద ట్విన్ పీక్స్ పర్వతాలు |
హే... అవును... ఇలానే ఉంది అక్కడంతా.. భలే కనిపెట్టావే...
అయితే ఈ మధ్య నువ్వు న్యూస్ బాగా ఫాలో అవుతున్నట్టున్నావ్ గా..
ఊ.. ఈ మధ్య నాసా వాళ్ళు మార్స్ మీదకి ఒక రాకెట్‌ని పంపించారు కదా.. దాని గురించి కొంచెం శ్రద్ధగానే ఫాలో అవుతున్నాలే.. :-) అవునూ.. మన వాళ్ళు ఎప్పటినుంచో వేరే గ్రహాల మీదకి చాలా రాకెట్లు పంపిస్తూనే ఉన్నారు కదా.. మరి దీనికెందుకు ఇప్పుడు అంత స్పెషల్ కవరేజ్ వచ్చింది?
ఆర్బిటర్ |
గత యాభై సంవత్సరాలుగా ఒక్క మార్స్ మీదకనే కాదు కానీ రకరకాల అంతరిక్ష పరిశోధనల కోసం రోదసిలోకి చాలానే రాకెట్లూ, రోబోలూ పంపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మార్స్ మీదకు పంపినది గతంలో వాటన్నింటికన్నా కొంచెం ఎక్కువ క్లిష్టమైనది. ఒక్క మార్స్ మీద పరిశోధనల వరకూ తీసుకుంటే, మొదట్లో రాకెట్ల ద్వారా శాటిలైట్లని రోదసిలోకి పంపించి మార్స్ యొక్క కక్ష్య (ఆర్బిట్) లోకి ప్రవేశపెట్టేవారు. ఆ శాటిలైట్స్ మార్స్ చుట్టూ ఒక నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతూ మార్స్‌ని ఫోటోలు తీస్తూ ఆ ఫోటోలు భూమి మీద ఉన్న కంట్రోల్ రూంకి పంపించేవి. ఇవి ఒక ఆర్బిట్ లో గ్రహం చుట్టూ తిరుగుతాయి కాబట్టి వీటిని ఆర్బిటర్లు అంటారు.
అంటే ఇవి మన భూమి కక్ష్యలో తిరుగుతూ మనకి శాటిలైట్ టీవి ప్రసారాలకి, జిపిఎస్‌లకు ఉపయోగపడే శాటిలైట్ల లాంటివేనా?
ఊ.. అదే తరహాలో ఉంటాయి. మన ఇస్రో (ISRO) వాళ్ళు తరచుగా పంపే శాటిలైట్లు కూడా ఈ అర్బిటర్ లాంటివే, కాకపోతే అవి మన భూమి చుట్టూ ఆర్బిట్‌లో తిరిగేవి. మార్స్ మీద ఎక్కడెక్కడ ఖనిజ సంపద, నీరు లేక జీవము ఉండే అవకాశం ఉండొచ్చు లాంటి విషయాల మీద అధ్యయనం చెయ్యడానికి ఇలాంటి ఆర్బిటర్లు తీసిన ఫోటోలు బాగా ఉపయోగపడతాయి.
ఒక గ్రహకక్ష్యలో తిరుగుతూ పరిశోధనలు చేసే శాటిలైట్లను రూపొందించడంలో మనకి ఇప్పటికే మంచి అనుభవం ఉంది కాబట్టి ఇది చాలా సులభమైనది మరియు తక్కువ రిస్కు ఉన్న పద్ధతి అనుకుంటా.. అంతేనా?
మార్స్ మీద ఫీనిక్స్ ల్యాండర్ |
అవును. ఈ ఆర్బిటర్లు తీసిన మార్స్ ఫోటోలు బాగా అధ్యయనం చేసి అక్కడ దిగడానికి అనువైన మరియు మనకి ఎక్కువ సమాచారం దొరుకుతుంది అనుకొన్న కొన్ని ప్రదేశాలు ఎంపిక చేసి అక్కడికి కొన్ని రోబోలను పంపించారు. ల్యాండర్ అని పిలిచే ఈ తరహా రోబోలు స్థిరంగా ఒకచోట ల్యాండ్ అయ్యి వివిధ రకాల పరిశోధనలు చేసే చిన్న పరిశోధనశాలలు అనుకోవచ్చు. ఇవి ఎక్కడ దిగితే అక్కడ సెటిల్ అయ్యి దాని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఫోటోలు తీసి మనకి పంపిస్తాయి. అలాగే చుట్టుపక్కల ఉన్న రాళ్ళు, మట్టి లాంటివి సేకరించి ఆ స్టేషన్ లో పరిశోధనలు చేస్తాయి.
క్యూరియాసిటి రోవర్ |
తరువాత రోవర్ అని ఇంకోరకం రోబోలను రూపొందించారు. ఇదయితే ల్యాండర్‌లా దిగిన చోటే స్థిరంగా ఉండిపోకుండా వాటికున్న చక్రాలతో కొంత దూరం తిరగగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పంపినది ఈ రోవర్ తరహా రోబోనే. సుమారు మన మారుతి కారు అంత పరిమాణంలో ఉండేఈ రోవర్ పేరు క్యూరియాసిటి.
క్యూరియాసిటినా.. భలే ముద్దుగా ఉంది కదా దీని పేరు.. :-) సరే కానీ నాకో సందేహం ఇక్కడ... ఎప్పటినుండో మనముంటున్న భూమి యొక్క వాతారణ పరిస్థితులే సరిగ్గా అంచనా వెయ్యలేక డిజైన్ ఫెయిల్ అయ్యి ఘోరమయిన ప్రమాదాలు తప్పించుకోలేకపోయాం కదా! ఉదాహరణకి మన కల్పనా చావ్లాతో సహా ఏడుగురు వ్యోమగాములను కోల్పోయిన కొలంబియా స్పేస్‌షటిల్‌కి జరిగిన ప్రమాదం వంటిది. మరి అలాంటిది అసలు మార్స్ మీద ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, తేమశాతం, గురుత్వాకర్షణ శక్తి లాంటి వివరాలు ఏమీ మనకి ముందు తెలీవు కదా.. అక్కడికి మనం పంపే పరిశోధన స్టేషన్లు, రోబోలూ సరిగ్గా పనిచేసేలా వాటిని ఎలా రూపొందిస్తారు? అసలు అక్కడి పరిస్థితుల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా ఈ ల్యాండర్లు, రోవర్లను మార్స్ మీద ఎలా దింపుతారు?
ల్యాండ్ చెయ్యడానికి ఉపయోగించిన ఎయిర్ బెలూన్లు
|
మొదటిసారి పంపినప్పుడు అక్కడి పరిస్థితులు అన్నీ కేవలం ఊహించి డిజైన్ చేసినవే.. అయితే మనం పంపిన మొదటి ల్యాండర్ అక్కడి నుంచి పంపిన సమాచారం తరువాత పంపే రోబోలకి బాగా ఉపయోగపడింది. ఇక వాటిని అక్కడ ల్యాండ్ చెయ్యడం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్టు చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. మొదట్లో తక్కువ బరువున్న చిన్న చిన్న ల్యాండర్లు, రోవర్లు పంపినప్పుడు ఎయిర్ బెలూన్లలో ప్యాక్ చేసి మార్స్ మీద ఒక నిర్ణీత ఎత్తు వరకు ప్యారాచూట్లో దింపాక అక్కడనుండి వదిలేవారు. ఆ బెలూన్లు ఈ ల్యాండర్లకి కుషన్ గా పని చేసి ఎంత ఫోర్స్ తో కింద పడినా సరే సమస్య లేకుండా ఉండేది. కానీ నెక్స్ట్ జనరేషన్ రోబోలు బరువు ఎక్కువ ఉండటంతో ఈ బెలూన్ పద్ధతి సరిపోక వేరే ఒక కొత్త, మరింత సంక్లిష్టమయిన పద్ధతిని రూపొందించి ఉపయోగించాల్సి వచ్చింది. బెలూన్ పద్ధతిలో ల్యాండింగ్ చెయ్యడం ఇక్కడ, క్యురియాసిటి ల్యాండ్ చేసిన సరికొత్త పద్ధతి ఇక్కడ చూడు.
భలే ఉన్నాయిగా ఇవి. ఇలాంటి క్లిష్టమయినవి డిజైన్ చెయ్యాలంటే ఎంత కష్టమో.. అసలు ఎన్నాళ్ళు కష్టపడతారో కదా వీళ్ళు..
క్యూరియాసిటి ల్యాండింగ్ |
అంతరిక్ష పరిశోధన అధిక ఖర్చు మరియు రిస్క్‌తో కూడుకున్నది. కోట్ల కొద్దీ డబ్బు, సంవత్సరాల తరబడి పడ్డ కష్టం, ప్రపంచ మీడియా ఫోకస్, దేశప్రతిష్ఠ, స్పేస్ రీసెర్చ్ యొక్క భవిష్యత్తు, బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించే నిధులు, ఆ ప్రాజెక్ట్ లో పనిచేసిన ఇంజనీర్ల కెరీర్లు ఇవన్నీ ఒక పక్క ఒత్తిడి పెంచే అంశాలు. ఇంకో పక్క ఎన్నడూ అక్కడికి వెళ్ళిన అనుభవం లేకపోవడంతో కేవలం అక్కడి పరిస్థితులు ఊహించి డిజైన్ చెయ్యాల్సి రావడం... హ్మ్మ్.. మొత్తంగా it's a quite challenging job. ఈ పరిశోధనలో ఇంత రిస్క్ ఉన్నా సరే ఏదైనా చిన్న పొరబాటు జరిగితే ప్రజలు, మీడియా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుగా..
ఎందుకు తెలీదూ.. ఒకసారి చెప్పావ్ కదా... హబుల్ టెలిస్కోప్ లెన్స్‌లో జరిగిన పొరపాటు వల్ల అది మసకగా ఉన్న ఫోటోలు పంపుతుండటంతో దాన్ని పంపిన నాసా ఎంత నవ్వుల పాలయిందో..
అసలు అందులో జరిగిన తప్పు ఎంత చిన్నదో తెలుసా.. ఆ టెలిస్కోప్ లో ఒక లెన్స్ ఉండాల్సిన చోట కన్నా జస్ట్ 1.3 మిల్లీమీటర్లు పక్కకి జరిగింది. దాని ఫలితం ఈ టెలిస్కోప్‌ని తయారు చెయ్యడానికి ఖర్చయిన పన్నెండు వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్టే అనుకున్నారు. కొన్నాళ్ళ తరువాత దానికి మళ్ళీ కొన్ని రిపేర్లు చెయ్యడం, అది పంపించే మసక చిత్రాలను అప్పటికి బాగా డెవలప్ అయిన లేటెస్ట్ ఇమేజ్ ప్రాసెస్సింగ్ టెక్నిక్లతో మళ్ళీ క్లియర్‌గా మార్చగలగడంతో ఆ టెలిస్కోప్ ఉపయోగపడగలిగింది గానీ లేకపోతే ఆ పొరపాటు ఎప్పటికీ నాసా ప్రతిష్ఠకి మాయని మచ్చగా మిగిలిపోయుండేది. ఇక ఈ రోబోలని తయారు చెయ్యడం, పంపడం పక్కన పెడితే, అది అక్కడి నుంచి వివిధ రకాలయిన డేటా పంపించే సమయంలో ఇక్కడ భూమి మీద ఉన్న కంట్రోల్ రూంలో ఉండే శాస్త్రజ్ఞుల కష్టాలు చూడాలి అసలు..
ఎంచక్కా అక్కడ నుంచి రోబో డేటా అంతా సేకరించి ఇక్కడికి పంపిస్తుంటే వీళ్ళు హాయిగా ల్యాబ్లో అనలైజ్ చేస్కోడమే కదా.. అందులో పెద్ద కష్టాలు ఏముంటాయంటావ్?
ఉండు.. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మన భూమి మీద రోజుకి 24 గంటలు అయితే అదే మార్స్ మీద రోజుకి 24 గంటల 40 నిముషాలు. అంటే ఈ రోజు మార్స్ మీద ఉదయం 7 అయినప్పుడు భూమి మీద ఉదయం 7 అయిందనుకో, రేపు మార్స్ మీద ఉదయం 7 అయినప్పుడు భూమి మీద 7:40 అవుతుంది. అదే ఎల్లుండి మార్స్ మీద ఉదయం 7 అయినప్పుడు భూమి మీద 8:20 అవుతుంది. ఇలా భూమి మీద టైంకి మార్స్ మీద టైంకి మధ్య ఉన్న వ్యత్యాసం రోజుకి నలభై నిముషాల చొప్పున పెరుగుతూ ఉంటుందన్నమాట.
ఊ.. అర్థమయ్యింది.. కానీ దీంట్లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలియట్లేదు..
ఉండు చెప్తా.. ఈ రోబోలు పని చెయ్యడానికి శక్తి కావాలి కదా.. ఆ శక్తి ఉత్పత్తి చెయ్యడానికి సోలార్ విద్యుత్ ఒక్కటే అనువైనది. అందువల్ల ఈ రోబోలు కేవలం పగలు సూర్యుడు ఉన్నప్పుడే పని చేస్తాయి. కాబట్టి భూమి మీద నుండి ఈ రోబోలను లైవ్ లో కంట్రోల్ చేస్తూ పని చేసే సైంటిస్ట్‌లు ఇక్కడ ఉన్నా మార్స్ టైం ప్రకారమే పని చెయ్యాలి. ఇప్పుడు మార్స్ టైం ప్రకారం ప్రతీరోజూ ఉదయం 7 గంటలకు పని మొదలు పెట్టాలనుకో.. ఇక్కడ భూమి మీద వాళ్ళ పనిదినం మొదలయ్యే సమయం రోజురోజుకీ 40 నిముషాలు ఆలస్యం అవుతూ పోతుంది. అంటే వాళ్ళు మొదటి రోజు ఉదయం 7 కి పని మొదలు పెడితే, రెండో రోజు 7:40 కి, మూడో రోజు 8:20 కి అలా ఒక 10 రోజుల తరువాత మధ్యాహ్నం ఒంటిగంటకి, అదే నెల తరువాత తెల్లవారుజామున 3 గంటలకి మొదలు పెట్టాలి. ఇలా రోజు రోజుకీ పని గంటలు మారిపోవడం వల్ల వాళ్ళ దినచర్యలో చాలా తేడా వచ్చేసి త్వరగా అనారోగ్యం పాలవుతారట. ఈ కారణాలవల్లే క్యూరియాసిటి రొవర్‌లొ అధికబరువు ఉన్నా న్యూక్లియర్ బ్యాటరీల వైపు మొగ్గుచూపారు.
ప్చ్.. పాపం కదా.. అయినా ఇలాంటి పరిశోధనలు చేసే సైంటిస్టులకి ఎంత శ్రద్ధ, కార్యదీక్ష కదా అసలు.. భలే ఇన్స్పైరింగ్ గా అనిపిస్తోందిలే వింటుంటేనే..
అదొక్కటనే కాదు.. ఈ రోబోల జీవితకాలం మహా అయితే రెండు మూడు నెలలు. అందులో ప్రతీ గంటా మనకి చాలా ముఖ్యమైనది. అందుకని వీళ్ళు నిద్రపోయే కొన్ని గంటలు తప్ప మిగతా సమయం అంతా పనిచేస్తూనే ఉంటారు. వీళ్ళకి రాత్రి, పగలు తేడా తెలిస్తే చీకటి పడేసరికి నిద్రొచ్చేస్తుందని బయటి ప్రపంచం అంతా కనపడకుండా కర్టెన్స్ వేసేసి కేవలం లైట్ వెలుగులో పని చేస్తారు తెలుసా..
వావ్.. అసలు సిసలైన రీసెర్చ్ మోటివేషన్ అంటే ఇదీ.. :-) అయినా.. ఇదంతా బానే ఉంది గానీ, అసలు ఇంత కష్టపడి ఈ పరిశోధనలన్నీ ఎందుకంటావ్? నాసా వాళ్ళు ఏదో రోబో పంపారు, అది విజయవంతంగా ల్యాండ్ అయ్యింది, అవి ఇవి పరిశోధనలు చేస్తుంది. ఇదంతా సరే.. కానీ, అసలు అంతంత ఖర్చు పెట్టి ఈ అంతరిక్ష పరిశోధనలు ఎందుకోసం? నీకు తెలుసా.. ఇప్పటి వరకు కేవలం మార్స్ మీదకి పంపిన మూడు రోబోలకి ఇంచుమించు ఇరవై వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యిందట. ఇప్పుడు పంపిన క్యూరియాసిటి ఖరీదే దాదాపు పన్నెండువేల కోట్ల రూపాయలు.. దీన్నిబట్టి మిగతా రోదసియాత్రలకు, పరిశోధనలకు ఎన్నెన్ని కోట్లు ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చు. ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ మనం సాధించేది ఏమిటి? అక్కడ ఏమి ఉంటే మనకేంటి, లేకపోతే మనకేంటి.. అదే డబ్బుతో బోలెడన్ని మంచి అభివృద్ధి పనులు ఇక్కడే చెయ్యవచ్చు కదా.. ఆ పరిశోధనలు ఏవో భూమి మీద చేస్తే దాని ఫలితాలు ప్రజలకు వెంటనే అందుతాయి కదా.. ముఖ్యంగా మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల గురించి నేను అడిగేది.
హ్మ్.. మంచి ప్రశ్న..
(ఇంకా ఉంది)
- మంచు & మధుర
DISCLAIMER:
All content
provided on this blog is for informational purposes only. The owner of this
blog and authors of this post make no representations as to the accuracy or
completeness of any information on this site or found by following any link on
this site. Photo courtesy by various websites on internet.
26 comments:
బాగుంది. తరువాయి భాగం కోసం వెయిటింగ్.
wow.. interesting post...
Kev!!!!
Interesting.. Waiting for the next parts... !!!
Siva Kumar.K
అభినందనలు. మంచిపనిచేస్తున్నారు.
Wonderful post.
చాలా బావుంది! మార్స్ మీద 'మంచు' కురిపిస్తున్నారు!
Interesting... science + literature!!
Very interesting topic..waiting for next part.
Rowdy vekunna kevvv malli naa vaipunundi kooda vesukondi inkosaari ...
Interesting and informational.. good initiative Manchu garuu and Madhura :)) Waiting for next post...
వెయిటింగ్..టింగ్..టింగ్
information ni kuDA katha laaga cheppina manchu gAriki, madhura gariki oka OOOOOOOOOOOO esukondamma :). very nice info.Thank you.
బావుంది
Good start, waiting for the series :)
from the top of the atmosphere to the surface, that's 13,000 miles to 0... just in 7mins!
WOW! PRETTY INTERESTING!!!
సెవన్ మినిట్స్ ఆఫ్ టెర్రర్ -- ఎంతమంది కఠోర శ్రమ, దీక్ష ఉండి ఉంటుందో ఆ ఏడు నిమిషాల కోసం!!
ఈ స్పేస్ ఎక్స్పరిమెంట్స్ గురించి న్యూస్ లో చదవడం/వినడమే కానీ ఇంత వివరంగా తెలుసుకోవాలన్న ఆసక్తి చూపించను! దానికి ఒక కారణం వాళ్ళ టెర్మినాలజీ చాలావరకూ మైండ్ వరకూ చేరకపోవడం..
కానీ మీరు చాలా సరళంగా వివరించారండీ!
Great job, you both!!
waiting for the next part....
:-)
ఎంతో ఆసక్తికరమయిన విషయాలను చాలా సరళంగా అందిస్తున్నారు. మిగతా భాగాలను కూడా త్వరగా వ్రాయండి (మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా) ఎందుకంటే మధ్యలో ఇలా ఆపేస్తే నాకు నిద్ర పట్టదు.
చాలా బాగుందండీ. టెక్నికల్ టెర్మనాలజీ బుర్రకెక్కక న్యూస్ లో చూసి వదిలేసే నాలాంటివాళ్ళకి చాలా విషయాలు తెలిసేలా రాసారు. మిగిలిన భాగాల కోసం ఎదురుచూస్తున్నాను. :)
ఇంటరెస్టింగ్ పోస్ట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న పోస్ట్ ......బ్యూటిఫుల్ ప్లానెట్ గురించి బ్యూటిఫుల్ గా రాసిన మంచు గారికి మధుర కి అభినందనలు:)
సైన్సు గురించి ఆసక్తికరమైన బ్లాగులు చాలా తక్కువ.మార్స్ గురించి,curiocity గురించి చాలా వివరంగా వ్రాసారు.మీ ప్రయత్నానికి అభినందనలు.నేను కూడా ఈ క్రింది సైన్సు బ్లాగు వ్రాస్తున్నాను.గమనించగలరు.
http://cvramanscience.blogspot.in
సైన్సు గురించి ఆసక్తికరమైన బ్లాగులు చాలా తక్కువ.మార్స్ గురించి,curiocity గురించి చాలా వివరంగా వ్రాసారు.మీ ప్రయత్నానికి అభినందనలు.నేను కూడా ఈ క్రింది సైన్సు బ్లాగు వ్రాస్తున్నాను.గమనించగలరు.
http://cvramanscience.blogspot.in
Good attempt and interesting narration!
>> ఈ రోబోలు పని చెయ్యడానికి శక్తి కావాలి కదా.. ఆ శక్తి ఉత్పత్తి చెయ్యడానికి సోలార్ విద్యుత్ ఒక్కటే అనువైనది. అందువల్ల ఈ రోబోలు కేవలం పగలు సూర్యుడు ఉన్నప్పుడే పని చేస్తాయి.
But NASA's website (http://mars.jpl.nasa.gov/msl/mission/rover/energy/), wikipedia and other online sources say that Curiosity uses non-fissile nuclear energy. Can you please explain the need for Solar energy?
సరళమైన భాషలో చక్కగా వివరించారు. ఇంకా తెలుసుకోవాలని ఉంది. తొందరగా రాయండి ప్లీజ్.
Very interesting, informative and knowledgeable like all your other posts.
శ్రీనివాస్, రాజేంద్ర, భరద్వాజ్, శివకుమార్ గారు, మినర్వా గారు, శిశిర గారు, శ్రీనివాస చక్రవర్తి గారు, నాగార్జున, సిసిసిరి మువ్వ గారు, కొరివిదెయ్యం గారు, దుర్గేశ్వర గారు, క్రాంతికుమార్ గారు, మనసు పలికే గారు, పప్పు గారు, వేణూ గారు, నిషిగంధ గారు, రసజ్ఞ గారు, కొత్తావకాయ గారు, రంజని, రవిశేఖర్ గారు, అనానిమస్ గారు, ఛాయ గారు, వాసు గారు :
అందరికి ధన్యవాదాలు..
అనానిమస్ గారు: సొలార్ వాడింది అంతకు ముందు ల్యాండర్లలొ. ప్రస్తుత క్యూరియాసిటిలొ ఉన్నది న్యూక్లియర్ బ్యాటరీ...మరియూ దాని వయస్సు కూడా ఇంతకు ముందు వాటితొ పొలిస్తే చాలా ఎక్కువ.
Post a Comment