*** శ్రీ రామ ***
పక్కనున్న ఫోటో చూసారు కదా... కొన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడున్న పెట్రోల్ బంకుల స్థానంలో ఉండే కార్ చార్జింగ్ స్టేషన్ అది. ఇంత హైఫై గా ఉంది ఈ చార్జింగ్ స్టేషన్ దాని కధా కమామిషు గురించి తెలుసుకోవాలంటే ఒక ఇరవై సంవత్సరాలు రింగులు తిప్పుకుంటూ ఫ్యూచర్ లోకి వెళ్ళాల్సిందే. కొన్నాళ్ళకి ఇప్పుడున్న పెట్రోల్ , డీజిల్ వాహనాల సంఖ్య క్రమంగా తగ్గిపోయి ఆ ప్లేస్ లో బ్యాటరీ తో నడిచే విద్యుత్ కార్లు వచ్చేస్తాయి. ఈ చార్జింగ్ స్టేషన్స్ ఆ కార్లలో ఉన్న బ్యాటరీలను చార్జ్ చెయ్యడానికి అన్నమాట.
ఈ ఎలక్ట్రిక్ కార్ల యొక్క ఆవశ్యకత ఏమిటి , వాటి మీద ప్రపంచవ్యాప్తం గా ఇంత సీరియస్ గా ఎందుకు పరిశోధన జరుగుతుంది అని అర్ధం చేసుకోవడానికి , ప్రపంచం లో ఎక్కువ కార్ మార్కెట్ కలిగిన దేశం అమెరికాని విశ్లేషిద్దాం.
- ప్రపంచంలో ఎక్కువ కాలుష్యం విడుదల చేసే దేశాల్లో అమెరికా కూడా అగ్రస్తానం లో ఉంది. ఎక్కువ వైశాల్యం గల దేశం కావడం వల్ల అమెరికాలో ఉన్న వాళ్లకి పెద్ద కాలుష్యం అనిపించక పోవచ్చు కానీ వాతావరణం లోకి విడుదల చేసే కాలుష్యం మొత్తంలో అమెరికా వాటా చాలా ఎక్కువ. అమెరికన్ మార్కెట్ లో లభ్యమయ్యే వాహనాలకి అవి విడుదల చేసే కాలష్య పరిమాణం మీద కఠినమయిన నిబంధనలు ఉన్నా, ఎక్కువ వాహనాలు ఉండటం వల్ల ఆ కొంచెం కొంచెమే కలసి ఎక్కువ అవుతుంది. అందువల్ల ఈ అధిక కాలుష్యం తగ్గించమని యూరోపియన్ దేశాల నుండి అమెరికా ఎక్కువ వత్తిడి ఎదుర్కుంటుంది. వాహన సంఖ్య ఎలాగూ తగ్గించలేరు కాబట్టి అవి విడుదల చేసే కాలుష్యం మరింత తగ్గించడానికి ఒక మార్గం వాహనాలకి ఎక్కువ మైలేజ్ వచ్చేలా రూపొందించడం.
- ఇప్పుడున్న సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలకి ఆయిల్ కావాలి కదా. అది కావాలంటే అరబ్ దేశాల మీద ఆధారపడాలి. మరి రేపు ఎప్పుడయినావాళ్ళు ఆయిల్ అమ్మను అని బెదిరిస్తే అంటే వీళ్ళ కార్లు ఎలా నడవాలి (అమెరికాకి కూడా బోల్డంత ఆయిల్ ఉందనుకోండి అది వాళ్ళ మిలటరీకే సరిపోదు.)
ఈ రెండు ముఖ్య కారణాల వల్ల అమెరికాలో ఈ ఎలక్ట్రిక్ కార్ల మీద రిసెర్చ్ బాగా జరుగుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో మూడు రకాల కార్లు ఉన్నాయి అని మనకి తెలుసు కదా.
1 . సాంప్రదాయ ఇంధనాలు అంటే పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ లాంటి ఇంధనాలు (Fossil fuels) ఉపయోగించుకుని నడిచే కార్లు: వీటి ఇంజన్లలో ఈ ఇంధనం మండించడం ద్వారా శక్తి ఉత్పత్తి చేసి అది వాహనం కదలడానికి వాడతాం అన్నమాట. అయితే ఈ ఇంధనం మండిస్తే పొగ వస్తుంది ఆంటే తద్వారా కాలుష్యం....ఎంత ఎక్కువ ఇంధనం మండిస్తే అంత కాలుష్యం. మరి ఈ కాలుష్యం తగ్గించాలి ఆంటే ఏం చెయ్యాలి.. తక్కువ ఇంధనం తో ఎక్కువ దూరం ప్రయాణించగలిగేలా వాహనం మైలేజ్ పెంచాలి.
2 . పెట్రోల్ / డీజిల్ / గ్యాస్ ఇలా ఏ ఇంధనంతో నడిచే ఇంజిన్ అయినా తక్కువ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు (ఆంటే స్టారింగ్ లో (ఎక్సిలరేషన్ లో ), బ్రేక్ వేసినప్పుడు , తక్కువ గేర్ లో వెళ్తున్నప్పుడు ఆంటే ఎత్తులు ఎక్కుతున్నప్పుడు ) తక్కువ ఎఫిషియన్సి కలిగిఉండటం వల్ల ఎక్కువ ఇంధనం వృదా అవుతుంది. అదే వాహనం ఎక్కువ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు (హై గేర్ లో వెళ్తున్నప్పుడు) ఎఫిషియన్సి ఎక్కువ ఉండటం వల్ల ఇంధనం అంత ఎక్కువ వృదా కాదు.
అందువల్ల ఇప్పుడు ఆ వాహనంలో సంప్రదాయ ఇంధనంతో నడిచే ఇంజిన్ తో పాటు, ఒక విద్యుత్ జనరేటర్, బ్యాటరి, ఒక ఎలక్ట్రిక్ మోటార్ కూడా పెట్టి , వాహనం ఏక్సిలరేషన్ లొ విద్యుత్ మోటారుతో నడిచేలా , వాహనం ఒక వేగం చేరుకున్నాక ఇంజిన్ తో నడిచేలా ఏర్పాటు చేస్తే.. ఎక్కువ ఇంధనం వృధా కాకుండా ఉంటుంది. వాహనం ఇంజిన్ మీద నడుస్తున్నప్పుడు, అదే ఇంజిన్ తో జనరేటర్ తిప్పడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి అది బ్యాటరీ లో నిలువ చేసి, ఆ విద్యుత్ మోటార్ నడపడానికి వాడబడుతుంది. ఆంటే ఈ సాంప్రదాయ ఇందానాలతో నడిచే ఇంజన్ ని ఎప్పుడూ మనం లోగేర్ లో ఉపయోగించం కాబట్టి తక్కువ ఇంధనం వృధా అవుతుంది. అందువల్ల తక్కువ ఇంధనం తో ఎక్కువ దూరం ప్రయాణించ వచ్చు ... ఆంటే తక్కువ కాలుష్యం... ఈ తరహ టెక్నాలజీ గల కార్లని హైబ్రీడ్ కార్లు అంటారు.
3. ఎలెక్ట్రిక్ వాహనాలు : వీటినే ఎలెక్ట్రిక్ ప్లగ్-ఇన్ మోడల్స్ అని కూడా అంటారు. వీటిలో ఇక ఇంధనంతో నడిచే ఇంజిన్ లాంటివి ఉండవు. బ్యాటరి, విద్యుత్ జనరేటర్ , విద్యుత్ మోటర్ ఉంటాయన్నమాట. బ్యాటరీలో నిలువ చేసిన విద్యుత్తో మోటార్ ని తిప్పితే ఆ మోటర్ వాహనాన్ని నడిపిస్తుంది. అయితే దీంట్లో హైబ్రిడ్ వాహనం లో ఉన్నట్టు డీజిల్ లేక పెట్రోల్ ఇంజిన్ లాంటివి ఉండవ్ కాబట్టి ఆ బ్యాటరీలను మనం సెల్ ఫోన్ బ్యాటరీలను చార్జ్ చేసినట్టు బయట నుండి చార్జ్ చెయ్యాలి. ఇలా చార్జ్ చెయ్యడానికి ఒక ఎలెక్ట్రిక్ ప్లగ్ ఉంటుంది కాబట్టి ప్లగ్-ఇన్ మోడల్స్ అంటారు. ఇక పెట్రోల్ , డీజిల్ లాంటి ఇంధనాలు మండించడం ఉండదు కాబట్టి కాలుష్యం సమస్య లేదు. మరి ఇంజన్ లేనప్పుడు ఇక జనరేటర్ ఎందుకు ఆన్న ప్రశ్న వస్తుంది కదా...వాటివల్ల ఈ హైబ్రిడ్ , ఎలెక్ట్రిక్ కార్ల లో ఒక పెద్ద ఉపయోగం ఉంది. అదేమిటో చూద్దాం...
వేగంగా వెళ్తున్న ఒక వాహనానికి ఇంధనసరఫరా నిలిపివేసినా కొంత దూరం ప్రయాణించి మరీ ఆగుతుంది కదా ...ఆంటే కదిలే వాహనంలో కొంత శక్తి నిల్వ ఉంటుంది మరియు ఆ శక్తి ఆ వాహనం ప్రయాణించే వేగం మీద ఆధారపడి ఉంటుంది. మరి అదే వాహనం బ్రేక్ వేసినప్పుడు వెంటనే ఆగిపోతుంది కదా....అప్పుడు ఆ నిల్వ ఉన్న శక్తి ఏమవుతుంది ఆంటే.... ఆ బ్రేక్ కి కారు చక్రానికి మద్య జరిగిన రాపిడి వల్ల పుట్టిన ఉష్ణ శక్తిగా మారుతుంది అన్నమాట. ఆంటే ఆ శక్తి వేస్ట్ అయిపోతుంది. ఎంత ఎక్కువ సార్లు బ్రేక్ వేస్తే అంత ఎక్కువ శక్తి (ఇంధనం) వృదా అవుతుంది.... అదే ఈ హైబ్రిడ్ మరియు ఎలెక్ట్రిక్ కార్లలో అయితే , బ్రేక్ వేసినప్పుడు ఆ నిల్వ ఉన్న శక్తిని బ్రేక్ ద్వారా ఉష్ణ శక్తిగా మార్చి వృధా చెయ్యకుండా , జనరేటర్ సహాయంతో విద్యుత్చక్తిగా మార్చి బ్యాటరీకి పంపిస్తాం. మనం స్పీడ్ పెంచవలసి వచ్చినప్పుడు తిరిగి అదే శక్తి బ్యాటరీల నుండి తీసుకుని మోటార్ ని నడిపిస్తాం కాబట్టి ఎన్నిసార్లు బ్రేక్ వేసిన ఎక్కువ శక్తి నష్ట పోము.
హైబ్రిడ్ వాహనాలు (ముఖ్యంగా కార్లు) అమెరికా, యూరోప్, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి కానీ ఎలక్ట్రిక్ ప్లగ్-ఇన్ కార్లు ఇప్పుడుప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. 2015 కల్లా 10 లక్షల కార్లు, 2020 కల్లా 50 లక్షల ఎలక్ట్రిక్ ప్లగ్-ఇన్ కార్లు కార్లు అమెరికన్ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయ్ అని ఒక అంచనా.... మరి ఇన్ని కార్లు ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్లని ఎక్కడ చార్జ్ చెయ్యాలి, ఏలా చార్జ్ చెయ్యాలి? ప్రస్తుతం అయితే ఈ ఎలక్ట్రిక్ కార్లన్నీ ఇంట్లోనో ఆఫీసులోనో ఎలెక్ట్రిక్ ప్లగ్ లో పెట్టి చార్జ్ చేసుకుని వెళ్లిరావడమే. మరి బయటకు వెళ్ళినపుడు మద్యలో చార్జ్ అయిపోతే ఎలా.. సరే అయితే ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు ( యూరోప్ లో ఉన్నవాళ్ళు ఐదు సంవత్సరాలు, అమెరికా లో ఉన్నవాళ్ళు ఒక పది సంవత్సరాలు ) ముందుకెళ్ళి అప్పటి పరిస్తితి ఎలా ఉంటాయో చూద్దాం.
- క్రింద ఫోటో చూపించినట్టు ఒక్కొ పార్కింగ్ స్పేస్ లో ఒక్కో చార్జర్ ఉంటుంది. మనకెప్పుడు అవసరం అయితే అప్పుడు అక్కడ పార్క్ చేసి చార్జ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు చార్జింగ్ కి పెట్టి వెళ్తే అది చార్జ్ అవుతూ ఉంటుంది.
- అలాగే ఈ పక్క ఫోటో చూపించినట్టు రాత్రి ఇంటికి రాగానే చార్జింగ్ పెట్టుకుంటే , పొద్దున్న వర్క్ కి వెళ్ళే సమయానికి చార్జ్ అయివుంటుంది.
- అలాగే షాపింగ్ మాల్స్ లో, రెస్టారెంట్లలో, ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ లలో, పబ్లిక్ పార్కింగ్ ప్లేసులు, అఫీసులులలో ఇలా ఎక్కడపడితే అక్కడ చార్జర్స్ ఉంటాయి.
ఇక బిజినెస్ విషయానికి వస్తే , ఇంట్లో చార్జ్ చేసుకుంటే అ విద్యుత్ వినియోగం మన కరెంట్ బిల్ లోకి వెళ్తుంది. మరి బయట పబ్లిక్ ప్లేస్ లో అయితే ఆ చార్జింగ్ కావాల్సిన విద్యుత్ కొనుక్కోవాలి కదా.... ఈ కార్ బ్యాటరి చార్జ్ చేసుకోవడం మన సెల్ ఫోన్ బాలన్సు చార్జింగ్ తో పోల్చుకోవచ్చు. సెల్ ఫోన్ లానే వీటిలో ప్రీపైడ్, పోస్ట్‌పైడ్ కార్డులు ఉంటాయి. ఫోటో లో చూపించినట్టు ఆ కార్డ్ స్వైప్ చేస్తే , మనం ఎంత విద్యుత్ వినియోగించామో చూసి దానికి చార్జి చేస్తుంది. సెల్ ఫొన్ లా ప్రీపైడ్ అయితే మన కార్డ్ లొ డబ్బులు అయిపొయినప్పుడు రీచార్జ్ చేయించినట్టు ఈ కార్డ్ కూడా రీచార్జ్ చేయించుకొవాలి.
- ఇక రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లాంటి వాళ్ళు కస్టమర్స్ ని ఆకర్షించడానికి వాళ్ళ పార్కింగ్ ప్లేస్ లలొ ఫ్రీ చార్జింగ్ ఆఫర్ చేస్తారు. కార్ పార్క్ చేసి, ప్లగ్ తగిలించి , రెస్టారెంట్ లొ తిని వచ్చేసరికి కార్ మళ్ళీ ఫుల్ చార్జ్ అయిపొయిఉంటుంది అన్నమాట.
- మరి మనం చార్జింగ్ స్టేషన్ లో కార్ చార్జింగ్ పెట్టి , షాపింగ్ కి వెళ్లి వచ్చేలోపు వేరే ఎవరన్నా ప్లగ్ మన కార్ నుండి తీసి వాళ్ళ కార్ కి పెట్టుకుంటే (చార్జింగ్ దొంగతనం చేస్తే) ఆన్న అనుమానం రావచ్చు. ఇది నివారించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మన కార్ కి తగిలించిన చార్జెర్ ప్లగ్ తొలగించగానే మన సెల్ ఫోన్ కి ఒక SMS మరియు మన మెయిల్ అడ్రస్ కి ఒక మెయిల్ వస్తాయి అందువల్ల ఆ చార్జర్ మనకి మనం తీసామా లేక ఎవరన్నా తీశారా అన్నది తెలుస్తుంది. ఒకవేళ దొంగతనం అనుకుంటే, మనం వెంటనే ఆ చార్జింగ్ కంపెనీకి ఫోన్ చేసి ఆన్లైన్ లోనే చార్జింగ్ ఆపించవచ్చు. రెండోది ప్రతీ కార్ కి చార్జింగ్ ప్లగ్ దగ్గర ఒక కోడ్ వుంటుంది. అదే కోడ్ ఈ చార్జింగ్ స్మార్ట్ కార్డ్ మీద కూడా ఉంటుంది. ఆంటే ఒక చార్జింగ్ కార్డు తో దానిమీద కోడ్ ఉన్న కార్ మాత్రమే చార్జ్ చెయ్యొచ్చు. మరి పక్కోళ్ళకు కార్డు అప్పు ఇవ్వాలంటే మనం పాస్వర్డ్ ఇవ్వాలి.
అయితే ప్రస్తుతం ఈ చార్జింగ్ చెయ్యడానికి చాలా సమయం పడుతుంది. ఈ పక్కనున్న బొమ్మలో చూపించినట్టు ప్రస్తుతానికి లబ్యమయ్యే మూడు చార్జింగ్ లెవెల్స్ లో.... DC (level 3) చార్జింగ్ వేగవంతమయిన చార్జింగ్ అన్నమాట. అయితే ఎప్పుడూ బ్యాటరీ ఎంత స్లో గా చార్జ్ చేస్తే అంత ఎక్కువ కాలం మన్నుతుంది. అందువల్ల మనకి ఫాస్ట్ చార్జింగ్ కావాలా, లేక బ్యాటరి మన్నిక కాలం కావాలా అన్నది చూసుకుని కొనుక్కోవాలి. నాకు తెలిసి ఇంట్లో వాడకానికి level2 , బయట చార్జింగ్ బిజినెస్ కి level3 (DC ) బెస్టు. 5 నిముషాల్లో పెట్రోల్ నింపుకుని మైళ్ళ మైళ్ళ దూరం ప్రయాణించడం అలవాటు అయ్యాక, ఈ చార్జింగ్ కోసం ఇంత సేపు సమయం వెచ్చించడం కొంచెం చికాకు అనిపించినా క్రమేణా మన జీవన విధానం కూడా అనుగుణంగా మారిపోతుంది. మరియు కొన్నాళ్ళకి అత్యంత వేగవంతమయిన చార్జర్స్ అందుబాటులోకి వస్తాయి.
- ఈ చార్జింగ్ టైం తో పనిలేకుండా, ఈ మద్య యూరోప్ లో డైరెక్ట్ గా చార్జ్ ఆయిన బ్యాటరీలు అద్దెకిచ్చే షాపులు వెలుస్తున్నాయి. మనం డిస్చార్జ్ అయిన బ్యాటరీలు ఇచ్చేసి , ఫుల్ చార్జ్ బ్యాటరీలు పెట్టుకుని వచ్చేయడమే. మరి ఈ బిజినెస్ మోడల్ ఎంతవరకు సక్సస్ అవుతుందో తెలీదు.
- ఇక ఈ చార్జింగ్ స్తేషన్స్ స్టేషన్స్ సొలార్ తొ పనిచెయ్యడం వచ్చాక..ఒక్కసారి పెట్టుబడి పెడితే ఇక ఇక ఇంచుమించు కార్ ఫ్రీగా నడిపినట్టే...

- ఇంకా ముందు కెళ్తే , కింద ఫోటో లో చూపినట్టు కారు రోడ్డు మీద నడుస్తున్నప్పుడే చార్జ్ అయ్యే టెక్నాలజీ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ మధ్యే జర్మన్ ఇంజనీర్ ఒకడు దీనికి పేటెంట్ తీసుకున్నాడట.
అది ఫ్యూచర్ లో ఎలెక్ట్రిక్ కార్లు, వాటి చార్జింగ్ కథ కమామిషు. ఈసారి మరొక టెక్నాలజీ గురించి చెప్పుకుందాం .....
- మంచు
గమనిక: ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు రెండు సార్లు మొత్తం పోస్ట్ ఎగిరిపోయింది. మూడోసారి రాసినప్పుడు కాస్త శ్రద్ద మిస్ అయింది అనుకుంటున్నా...కొంచెం కంటిన్యుటి మిస్ అయినట్టు ఉంది. క్షమించాలి