*** శ్రీ రామ ***
PART -4
అయితే అప్పటికే టెస్లా చేస్తున్న పరిశొధనలకి ముగ్దుడైన జార్జి వెస్టింగ్‌హవుస్ (George Westinghouse) వెంటనే టెస్లా దగ్గర ఏ.సి. విద్యుత్ కి సంభందించిన కొన్ని పేటెంట్లు కొనుక్కుని, తన Westinghouse Corporation లో టెస్లాకి ఉద్యోగం ఇచ్చాడు. ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పుకోవాలి ....
ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం టెస్లా పేటెంట్లు వాడుకుంటున్నందుకు Westinghouse Corporation 60,000 డాలర్లు ఫిక్సెడ్ డబ్బు మరియు ఆ పేటెంట్లను ఉపయోగించుకుని ఉత్పత్తి చేసిన ప్రతి హార్స్ పవర్ విద్యుత్ కి రెండున్నర డాలర్లు టెస్లా కి చెల్లించాలి. అయితే కొన్నాళ్ళకి వెస్టింగ్‌హవుస్ కంపెనీ ఆర్ధికంగా కస్టాల్లొ పడటంతో , ఆ కంపెనీ ఆడిటర్లు " ఇలా టెస్లాకి హార్స్‌పవర్ కి రెండున్నర డాలర్ల చొప్పున డబ్బు చెల్లిస్తూ పొతే చాలా నష్టం వస్తుంది..కొన్నాళ్ళకి కంపెనీ మూసుకొవడమో లేక టెస్లాకి అమ్మేయడమో చెయ్యాలి అందుచేత వెంటనే ఎంతోకొంత సొమ్ము ముట్టచెప్పి ఆ హార్స్ పవర్ కి రెండున్నర డాలర్ల ఒప్పందం రద్దుచేసుకోమని " జార్జి వెస్టింగ్‌హవుస్ కి సలహా ఇచ్చారట.. అప్పుడు వెస్టింగ్‌హవుస్ అయిష్టంగానే టెస్లాని పిలిచి విషయం చెప్పి , ఆ రెండున్నర డాలర్ల ఒప్పందం రద్దుచెయ్యడానికి ఎంత కావాలో చెప్పు అని అడుగగా, దానికి టెస్లా "నువ్వు నన్ను కష్టకాలం లో ఆదుకున్నావు, నా ప్రతిభని గుర్తించి నాకు ప్రోత్సాహం అందించావు, ఈరోజు నీ కంపెనీ కష్టకాలంలో వుందంటే నేను చెయ్యగలిగినది చెయ్యకుండా ఉంటానా" అని ఒక్క డాలరు తీసుకోకుండానే ఆ రెండున్నర డాలర్ల రాయల్టీ పత్రం చించేసాడట .
టెస్లా, ఎడిసన్ మద్య ఉన్న వ్యత్యాసాలలో ఇది ఒకటి .. "ఎడిసన్ అన్ని వ్యాపారపరంగా ఆలోచిస్తే ... టెస్లాకి డబ్బు కన్నా పేరు, గుర్తింపు కోసం ఎక్కువ తాపత్రయం పడేవాడట"...
ఎడిసన్ ప్రతిపాదించిన డి.సి. విద్యుత్ అప్పుడప్పుడే ప్రాచుర్యం పొందుతుంది కానీ డి.సి. విద్యుత్ వ్యవస్థలో ట్రాన్స్ఫార్మర్(Transformer) ఉపయోగించి వోల్టజ్ లెవెల్ పెంచడం తగ్గించడం కుదరదు కాబట్టి ఆ డి.సి. విద్యుత్ రవాణా చేసే ప్రక్రియలో చాలా శక్తి కోల్పోవాల్సి వచ్చేది మరియు జనేరేటర్ నుండి దూరం పెరిగే కొద్ది వోల్టేజ్ తగ్గిపోతూ వుండేది. దానివల్ల జనరేటర్ నుండి రెండు మైళ్ళు కన్నా ఎక్కువ దూరం రవాణా చెయ్యడానికి వీలుపడకపోవడంతో ఎడిసన్ ప్రతీ రెండుమైళ్ళకి ఒక్కో డి.సి. విద్యుత్ జెనరేటింగ్ స్టేషన్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు విద్యుత్ సరఫరా చేసేవాడు. టెస్లా రూపొందించిన ఎ.సి. విద్యుత్ వ్యవస్థ లో ట్రాన్స్ఫార్మర్ వాడే వీలు వుండటం వల్ల, సరఫరాలో వోల్టేజ్ తగ్గినా మళ్లీ ఎక్కడికక్కడ వోల్టేజ్ లెవెల్ పెంచుకునే వీలు వుంటుంది. అంతే కాకుండా విద్యుత్ ఎంత ఎక్కువ వోల్టేజ్ తొ సరఫరా చేస్తే అంత తక్కువ విద్యుత్చక్తి రవాణాలో నష్టపోతాం కాబట్టి జెనరేటింగ్ స్టేషన్ దగ్గర విద్యుత్ వోల్టేజ్ లెవెల్ ట్రాన్స్ఫార్మర్ సహాయం తో పెంచి..ఆ ఎక్కువ వోల్టేజ్ లెవెల్ తో విద్యుత్ రవాణా చేసి , మళ్ళీ మనం వాడుకునే చోట మనకి కావాల్సిన లెవెల్ కి అదే ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి తగ్గించుకుని వాడుకోవచ్చు. ఈ ఉపయోగాలతో టెస్లా , వెస్టింగ్‌హవుస్ ఎ.సి. విద్యుత్‌కి ప్రచారం కల్పిస్తుంటే , ఎడిసన్ తన డి.సి. విద్యుత్ లో అలాంటి ఉపయొగాలు లేకపోవడంతో మార్కెట్ కోల్పోతానన్న భయం తో డి.సి. కరెంట్ తో పోలిస్తే ఎ.సి. కరెంట్ చాలా ప్రమాదకరమయినది అని దుష్ప్రచారం చెయ్యడం మొదలు పెట్టాడు.
ఈ దుష్ప్రచారం లొ భాగం గా ఎ.సి. విద్యుత్ ప్రమాదరకమయినది అని రుజువు చెయ్యడానికి ఎడిసన్ అనుచరులు వీది కుక్కలను, పిల్లులను, వయస్సు మళ్ళిన ఆవులు , గుర్రాలను ఎ.సి. కరెంట్ ఇచ్చి పబ్లిక్ గా చంపడం లాంటి పనులు చెసేవారు. ప్రాణాలు తియ్యడానికి ఉపయొగించాలంటే ఎ.సి. అయినా డి.సి. అయినా పెద్దగా తేడాలేకపొయినా... అప్పట్లొ ప్రజలకి ఈ విద్యుత్చ్చక్తి మీద పెద్దగా అవగాహన లేకపొవడంతొ ఇలాంటి పబ్లిక్ డిమాన్‌స్ట్రేషన్స్ ఎక్కువ ప్రభావం చూపేవి. ఇందులో 'టాప్సి' అనే మరణశిక్ష పడిన ఏనుగుకి పబ్లిక్ గా ఎ.సి. విద్యుత్ ఇవ్వడం ద్వారా శిక్ష అమలుచేయ్యడం , దానిని ఎడిసన్ చిత్రీకరించి దేశవ్యాప్తం గా ప్రచారానికి ఉపయోగించుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదే కాకుండా ఎడిసన్ ఇంకోపక్క ఎ.సి. వాడకాన్ని నిషేదించాల్సినదిగా తనకున్న పలుకుబడితో ప్రబుత్వం మీద ఒత్తిడి తెచ్చేవాడు.
ఎడిసన్ వ్యక్తిగతంగా మరణ శిక్షను వ్యతిరేఖించేవాడు. 1890 లో మొదటి ఎలెక్ట్రిక్ చైర్ (వ్యక్తి శరీరం లోకి కరెంట్ పాస్ చెయ్యడం ద్వారా మరణ శిక్ష అమలుపరచడం) కనిపెట్టినప్పుడు , ఆ ఎలెక్ట్రిక్ చైర్ కనిపెట్టిన హరొల్డ్ బ్రౌన్ కి రహస్యంగా డబ్బులిచ్చి ఆ చైర్ ఎ.సి. కరెంట్ ద్వారా పనిచేసేలా డిజైన్ చేయించాడు. ఈ చైర్ మొదట సారి ఉపయోగించినప్పుడు, ప్రాణం పూర్తిగా పోవడానికి సరిపడా వోల్టేజ్ ఇవ్వకపోవడం తో ఆ శిక్ష పడ్డ ఖైది అతి దారుణమయిన గాయాలతో బతికాడు. అది కూడా ఎ.సి. కరెంట్ ప్రమాదకరమయినదే అని చెప్పడానికి ఎడిసన్ క్యాంప్ వాడుకున్నారు. అంతే కాకుండా ఈ ఎలెక్ట్రిక్ చైర్ ని ఉదహరిస్తూ "being electrocuted" అనే పదాన్ని "being Westinghoused " అనే వాడుకపదం లా ప్రచారం చేయించాడు. ఎడిసన్ వైపు నుండి ఇలా ఎన్ని దుస్ప్రచారాలు కొనసాగుతున్నా టెస్లా , వెస్టింగ్‌హవుస్ తన పని తను చేసుకుపోసాగారు.
టెస్లా ప్రతిపాదించిన ఎ.సి. కరెంట్ కి తొలి పెద్ద విజయం నయాగరా పవర్ కంపెనీ రూపం లో దక్కింది. నయగారా జలపాతం నుండి విద్యుత్చక్తి ని ఉత్పత్తి చెయ్యడానికి "నయాగరా ఫాల్స్ పవర్ కంపనీ(NFPC)" వివిధ పవర్ కంపెనీల నుండి ప్రపోజల్స్ ని ఆహ్వానించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 19 కంపెనీలనుంది ప్రతిపాదనలు వచ్చినా డి.సి. విద్యుత్ ని ప్రతిపాదించే ఎడిసన్ యొక్క GE , ఎ.సి. కరెంట్ ప్రతిపాదిస్తున్న టెస్లా యొక్క వెస్టింగ్‌హవుస్ కార్పోరేషన్ ల మధ్యే ప్రధానమయిన పోటీ... మొత్తానికి 1893 లో NFPC టెస్లా ప్రతిపాదనలకే మొగ్గుచూపి వెస్టింగ్‌హవుస్ కి ఆ ప్రాజెక్ట్ అప్పగించింది (నయాగరా ఫాల్స్ కి వెళ్ళిన వారు ఫాల్స్ దగ్గర టెస్లా కాంస్య విగ్రహం చూసేవుంటారు ).
ఆ తరువాతి పెద్ద విజయం The Chicago World's Fair లో దక్కింది. 1893 లో కొలంబస్ అమెరికా కనిపెట్టిన 400 వ సంవత్సర వేడుకలు చికాగో లో 600 ఎకరాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. ఆ వేడుకకి విద్యుత్ సరఫరా చెయ్యడానికి టెండర్లు పేలిస్తే "ఎడిసన్ , జే. పి. మోర్గాన్ (JP Morgan)" ల అద్వర్యం లో GE కంపెనీ 1.8 మిలియన్ డాలర్లకు మొదటి బిడ్ వేసినా....టెస్లా , వెస్టింగ్‌హవుస్ లను ఎదుర్కోవాలనే ఉద్దేశ్యంతో ఆ తరువాత ఆ బిడ్ ను 0.55 మిలియన్ డాలర్లకు తగ్గించింది. అయినా వెస్టింగ్‌హవుస్ కంపెని 0.4 మిలియన్ డాలర్లకే బిడ్ చెయ్యడం తో ఆ ప్రాజెక్ట్ కూడా వెస్టింగ్‌హవుస్ కే దక్కింది. అయితే ఆ ఓటమికి ప్రతీకారంగా వెస్టింగ్‌హవుస్ కంపెనీని ఎలాగయినా దెబ్బ కొట్టాలని GE కంపెనీ ఈ వరల్డ్ ఫెయిర్ కి తమ బల్బులు అమ్మబోవడం లేదని ప్రకటించింది. ఆఖరు నిముషంలో GE ఇలా దెబ్బతీయడంతో , చాలెంజ్ గా తీసుకున్న టెస్లా నేతృత్వం లోని వెస్టింగ్‌హవుస్ ఇంజనీర్లు అప్పటికప్పుడు ఎడిసన్ పేటెంట్ లు అవసరం లేనటువంటి కొత్త బల్బును కనిపెట్టి ఆ ఫెయిర్ లో ఉపయోగించారు. అదే ఫెయిర్ లో టెస్లా మొదటి సారిగా phosphorescent lamps ( అవే ఇప్పటి ట్యూబ్ లైట్ గా రూపాంతరం చెందాయి ) , మొదటి నియాన్ లాంప్ (ఇప్పుడు షాప్స్ మీద రంగురంగుల తో వివిధ ఆకారాలలో కనిపించే లైట్లు) ప్రదర్శించాడు. (ఈ బల్బులకి టెస్లా పేటెంట్లు తీసుకోవడం మర్చిపోయాడట :-) )
అలా ఈ రెండు పెద్ద సంఘటనలతో ఎడిసన్ నేతృత్వం లోని GE కంపెనీ యొక్క డి.సి. విద్యుత్ వ్యవస్థ టెస్లా ఎ.సి. విద్యుత్ వ్యవస్థ చేతిలో పరాజయం పొందింది. ఆ తరువాత కొన్నాళ్ళకి GE కూడా టెస్లా యొక్క ఎ.సి. మోటార్లు తయారి మొదలు పెట్టింది. ఎడిసన్ మొదట రూపొందించినట్టు ప్రతీ రెండు మైళ్ళకి ఒక చిన్న జేనేరటింగ్ స్టేషన్ కాకుండా , ఒక చోటే పెద్ద మొత్తం లో విద్యుత్ ఉత్పత్తి చేసి దూర ప్రాంతాలకి రవాణా చెయ్యడం మొదలయ్యింది. ఈ రోజు ప్రపంచం మొత్తం ఎ.సి. పవర్ మీదే నడుస్తుంది. ఎడిసన్ కొన్నాళ్ళ తరువాత ఎ.సి. విద్యుత్ విషయం లో టెస్లా మాట విననందుకు పశ్చాత్తాప పడ్డాడని చెబుతారు.
ఎడిసన్, టెస్లా ఇద్దరూ స్నేహానికి ప్రాణమిచ్చినవారే. ఎడిసన్ కి హెన్రీ ఫోర్డ్ (ఫోర్డ్ కార్ల సంస్థ అధిపతి) , అమెరికన్ ప్రెసిడెంట్ హోవర్ లు మంచి స్నేహితులయితే , టెస్లా కి అమెరికన్ రచయత మార్క్ ట్వైన్ మంచి స్నేహితుడు. టెస్లా తన చివరి రోజులలో స్వామి వివేకానంద బోధనలకి బాగా ఆకర్షితుడై ఒక్కసారి అయినా వివేకానందను కలిసే ఆవకాశం రావాలని కోరుకున్నాడట ...
ఎడిసన్ మంచి శాస్త్రజ్ఞుడు మరియు వ్యాపార వేత్త. జే పి మోర్గాన్ యొక్క సహకారం తో GE అభివృద్ధి పరిచి ఈ రోజు ప్రపంచం లో అత్యంత శక్తివంతమయిన సంస్థగా ఎదగడానికి తోడ్పడ్డాడు. ధనవంతుడిగా జీవించాడు, ధనవంతుడిగా మరణించాడు. అతని కీర్తి ప్రతిష్టలు ఎనలేనివి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తం గా (ముఖ్యం గా అమెరికాలో ) ఎడిసన్ ని విద్యుత్ శాస్త్రం కి ఆద్యుడిగా కీర్తిస్తారు , పిల్లలకి బోధిస్తారు. చాలామందికి అసలు టెస్లా గురించి తెలీనే తెలీదు. ఎడిసన్ , ఫోర్డ్, బిల్ గేట్స్ లాంటి వారు మల్టీ టాలెంటెడ్ .. వారికి సైన్సు తో పాటు వాటితో వ్యాపారం ఎలా చెయ్యాలో బాగా తెలుసు.. అందుకే వారు అత్యంత ప్రజాదారణ పొందారు , వ్యాపారపరంగా మంచి విజయాలు సాధించారు. టెస్లా వీరికన్నా జీనియస్ ... కానీ తను రూపొందించిన సైన్సు ని వ్యాపారపరం గా మలచడం లో విఫలమయ్యాడు. అందుకే అన్ని పేటెంట్లు సాధించినా తన జీవితం చరమాంకం లో డబ్బు కి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇన్ని విజయాలు సాధించినా చివరకి ఒక హోటల్ గది లో అనాధగా మరణించాడు. .
టెస్లా కనిపెట్టిన వాటిలో ముఖ్యమైనవి ౩-ఫేసు AC విద్యుత్తు, ఇండక్షన్ మోటార్ , ఫ్లోరోసెంట్ బల్బ్ (ట్యూబ్ లైటు) , రేడియో (మొదట్లో ఈ పేటెంట్ మార్కొని పేరు మీద వున్నా ఆ తరువాత కోర్టు టెస్లా కి చెందుతుందని తీర్పు చెప్పింది) , వైర్లెస్ పవర్ రవాణా. 1900వ సంవత్సరం లోనే టెస్లా తన కొలరాడో స్ప్రింగ్స్ ల్యాబ్ దగ్గర వైర్లు లేకుండా విద్యుత్ రవాణా విజయవంతంగా ప్రదర్శించాడు. అయితే ఆ విదానం తో వినియోగదారులకి బిల్లింగ్ కష్టం అవుతుంది అని అప్పటి వరకూ అతనికి కూడా ఫండింగ్ అందిస్తున్న జే పి మోర్గాన్ అతనికి నిధులు ఆపేసాడు . ఆ విధంగా వైర్లేస్స్ విద్యుత్ రవాణా మీద టెస్లా తన పరిశోధనలు ఆపేయాల్సి వచ్చింది. అది జరిగి 110 సంవత్సరాల అయినా ఇప్పటికీ ఈ వైర్లేస్స్ విద్యుత్ రవాణా మిస్టరీనే. అప్పుడు అతనికి నిధులు ఆపేయకుండా వుంటే ఇప్పటికే మనం వైర్లెస్ ద్వారా విద్యుత్ అందుకునే వాళ్ళం అనడం అతిశయోక్తి కాదు.
టెస్లా కి జరిగిన మరో పెద్ద అవమానం నోబెల్ ప్రైజ్. టెస్లాకి ఇస్తే ఎడిసన్ నోచ్చుకుంటాడు ఆన్న ఒకే ఒక కారణం తో టెస్లా కి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదట. ఒక సంవత్సరం లో ఎడిసన్ , టెస్లా ఇద్దరికీ ఇచ్చే ప్రతిపాదన వచ్చినా, అలా కలిపి ఇస్తే తీసుకోవడానికి ఇద్దరికీ ఇష్టం లేకపోవడంతో ఇద్దరికీ ఇవ్వలేదు. మార్కోనీ కన్నా ముందు రేడియో కనిపెట్టినట్టు రుజువైయినా రేడియో పేటెంట్ టెస్లాకి బదలీ చేసారు కానీ రేడియో కనిపెట్టినందుకు ఇచ్చిన నోబెల్ ప్రైజు మాత్రం మార్కొని దగ్గరే ఉండిపోయింది. తన జీవిత కాలం లో టెస్లా 300 పేటెంట్లు తీసుకుంటే ఎడిసన్ 1083 పేటెంట్లు తీసుకున్నాడు. టెస్లా కి కూడా ఎడిసన్ కి వచ్చినన్ని నిధులు వచ్చివుంటే, ఎడిసన్ లాంటి బిజినస్ మైండ్ వుండి వుంటే , పేటెంట్ల సంఖ్య లో ఎడిసన్ ని దాటేసేవాడే..
తన జీవితం లో ఆఖరు పది సంవత్సరాలు హోటల్ న్యూ యార్కర్ లోని రూం. 3327 లో గడిపిన టెస్లా 1943 లో గుండెపోటుతో కన్నుమూసాడు. అతను చనిపోయే టైములో టెలిఫోర్స్ అనే అయుదాన్ని డెవెలప్ చేస్తున్నాడు. అది అమెరికన్ మిలటరీ కొనడానికి నిరాకరించినా, అతను చనిపోయాక టెస్లా రిసెర్చ్ పత్రాలు శత్రువుల చేతిలో పడతాయేమో ఆన్న అనుమానం తో అమెరికన్ ప్రబుత్వం అతని ప్రయోగాలకి సంబందించిన అన్ని పత్రాలు స్వాదీనపరచుకొని టాప్ సీక్రెట్ అని ముద్ర వేసింది. ఆ విధం గా టెస్లా తన జీవితం చివరికాలంలో చేసిన అనేక ప్రయోగాల తాలూకు వివరాలు FBI లాకర్లలో మగ్గిపోయి ప్రపంచానికి తెలీకుండా (పనికిరాకుండా) పోయాయి .
అలాగే అప్పట్లో ఎడిసన్ GE కంపెనీకి గట్టి పోటీ ఇచ్చిన వేస్టింగ్హవుస్ కంపెనీ ఆ తరువాత వాళ్ళ బిజినెస్లు అన్ని అమ్మేసుకుని ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు.
అది నాకిష్టమయిన ఈ ఇద్దరూ మహా శాస్త్రజ్ఞుల జీవిత చరిత్ర . మనలో చాలా మందికి ఎడిసన్ గురించి తెలుసు... అతని పట్టుదల గురించి ఎన్నో ఇన్స్పైరింగ్ కథలు విన్నాం. ప్రపంచానికి వెలుగు అందించిన వ్యక్తిగా , విద్యుత్ శాస్త్రానికి ఆద్యుడిగా కొలవబడుతున్న ఎడిసన్ గురించి ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు. అయితే ఏ కారణాల వల్ల అయితే ఏమి అతని కన్నా తెలివయిన టెస్లా కి మాత్రం తగినంత గుర్తింపు రాలేదు. అందువల్ల అతని గురించి నాకు తెలిసినది, నేను విన్నది మీతో పంచుకునే ప్రయత్నం ఇది.....
(సమాప్తం)
- మంచు
(సమాప్తం)
- మంచు
Disclaimer: All the information provided on this blog is for informational purposes only. Author makes no representations as to accuracy or validity of any information on this blog and will not be liable for any errors in this information. This post is written based on information available on worldwide web for public reading.