*** శ్రీ రామ ***
అదేనండి.. సూరిబాబు ఆంటే మన సూర్యభగవానుడు.. రోజూ చూస్తాం కదా అని కాస్త చనువు కొద్ది ఆ పేరు అన్నమాట.. 'ఆ ఒక్కటి అడక్కు'లో రాజేంద్రప్రసాద్ "సూర్యారావు గారు" అన్నట్టు..
సూర్యుడు లేకపోతే భూమిమీద జీవరాశికి అసలు మనుగడే లేదన్న విషయం మనకు అందరికి తెలిసిందే కదా.. అందుకే ఆయన్ని దేవుణ్ణి కూడా చేసేసాం .. సూర్యరశ్మి వల్ల కిరణజన్య సంయోగక్రియ జరిగి, మొక్కలలో పిండిపదార్దం తయారవుతుందని.. అదే మనకి ఆహారం తయారు చేస్తుందని అని.. గట్రా గట్రా చిన్నప్పుడు చదువుకున్నాం. అయితే ఆయన మనకి అందిస్తున్న వనరులన్నీ మనం పూర్తిగా ఉపయొగించుకుంటున్నామా ఆంటే లేదనే చెప్పాలి. సూర్యుడు అందించే అపారమయిన శక్తి లో ఈరోజు మనం చాలా కొద్దిశాతంమే మనం ఉపయోగించకోగలుగుతున్నాం. ఉచితంగా వచ్చే ఈ శక్తిని వాడుకోవడానికి ఏంటి సమస్య అన్నది చాలామంది కొచ్చే ప్రశ్న.. సో నాకు తెలుసున్నది వీలయినంత సరళం గా చెప్పడానికి ప్రయత్నిస్తా..
సూర్యుడి నుండి భూమికే చేరే శక్తి ముఖ్యంగా రెండు రూపాల్లో వుంటుంది..
1 . కాంతి
2 . ఉష్ణం
మన ఇండియా లాంటి భూమద్య రేఖకి దగ్గరగా వుండే ఉష్ణప్రదేశాల్లో సూర్యుడి శక్తి ఉష్ణం మరియూ కాంతి రూపం లో లభ్యం అవుతుంది .. అంటార్కిటికా లాంటి ద్రువాల దగ్గర వుండే ప్రదేశాల్లో మరియూ అంతరిక్షంలోనూ సూర్యుడి శక్తి ఎక్కువ శాతం కాంతి రూపం లో వుంటుంది..
ఉష్ణం: సూర్యుడు ద్వారా వచ్చే ఉష్ణశక్తిని గ్రహించి, మన వాడకానికి అనువుగా మార్చడానికి మనం సోలార్ వాటర్ హీటర్ ని ఉపయోగిస్తాం.. బెంగళూరులో ఎక్కువ ఇళ్ళలో ఈ వాటర్ హీటర్లు మనకి దర్శనమిస్తూ వుంటాయ్.. టూకీగా చెప్పాలంటే.. ఎండ వేడితో నీళ్ళు కాచి అది ఫ్లాస్కు లో దాచి , మనకి కావలసినప్పుడు వాడుకోవడం అంతే. ఇళ్లలోనే కాకుండా, హోటల్స్ లో, లాండ్రిలలో, ఎయిర్ పోర్ట్ లలో వేడి నీరు కావాల్సిన ప్రతిచోట ఇవి ఉపయోగించవచ్చు.. అయితే మబ్బు పట్టినప్పుడు, వర్షం పడుతున్నప్పుడు వాతావరణంలో ఎక్కువ వేడి వుండదు కనుక అప్పుడు ఇవి ఎక్కువ వేడి నీటిని ఇవ్వలేవు.. అందుకే కమర్షియల్ ప్రొడక్ట్స్ లో సోలార్ హీటర్ లో కరెంట్ హీటర్ కూడా అమరుస్తారు.. ఒకవేళ సూర్యుడి వేడి లభించనప్పుడు కరెంట్ తో నీటిని వేడి చేసుకోవచ్చు.. టాటా బి పి సోలార్ మరియూ వోల్టాస్ కంపెనీలు ఇండియాలో తయారు చేస్తున్నాయని నాకు తెలుసు.. ఇంకా చాలా కంపెనీలు ఉండివుంటాయ్ .. వీటి ధర తక్కువే , నిర్వహణ ఖర్చు కూడా తక్కువే.. ఇక్కడ గమనించల్సినది ఏమిటంటే ఇవి హీటర్లు మాత్రమే.. దీనితో కరెంట్ ఉత్పత్తి చెయ్యలేం.. మీకు వేడినీళ్ళు ఎక్కువ అవసరం అనిపిస్తే కళ్ళుమూసుకుని కోనేయచ్చు :-)
కాంతి: సూర్యుడి అందించే ఇంకో శక్తి కాంతి రూపం లో వుంటుంది. సూర్యరశ్మి లోని ఈ శక్తిని వెలికి తీసి మనకి వాడకానికి అనువయిన రూపం లోకి మార్చడానికి మనం సోలార్ పేనల్స్ వాడతాం. ఒక్కో సోలార్ పేనల్ లో కొన్ని పదుల లేక వందల ఫోటోవోల్టాయిక్ సెల్ల్స్ వుంటాయి. మనకి కావాల్సిన పవర్ ని బట్టి సోలార్ పెనల్స్ వుండే ఫోటోవోల్టాయిక్ సెల్ల్స్ సంఖ్య ఆధారపడి వుంటుంది. టూకీగా చెప్పాలంటే సూర్యరశ్మిలో వుండే ఫోటాన్లు ఈ ఫోటోవోల్టాయిక్ సెల్ లో వుండే electrons ని ఉత్తేజపరచడం ద్వారా కరెంట్ పుట్టిస్తుంది... DC రూపం లోవున్న ఈ కరెంట్ ని AC లోకి మార్చి మనం వాడుకుంటాం అన్నమాట.. అంతే కాకుండా దీంట్లో కొన్ని బాటరీలు అమర్చుకుంటే ..పగలు ఉత్పత్తి చేసిన విద్యుత్ దాంట్లో నిలువ ఉంచుకొని ..రాత్రి వాడుకోవచ్చు..
మనింటికి ఎవరయినా సేల్స్మెన్ వస్తే ..వాడు చెప్పిందంతా విని/వింటూనే ..మనం అడిగే మొదటి ప్రశ్న .. " అది సరే గాని ..దీని ఖరీదు ఎంత అని" .. అక్కడికే వస్తున్నా..
పైన బొమ్మలో చూపించినట్టు , సోలార్ పేనల్ 'సూర్యరశ్మి లోని శక్తి ని గ్రహించి DC విద్యుత్చక్తి గా మార్చి' ఇన్వెర్టర్ కి అందిస్తుంది. అలాగే దానికి పక్కన తగిలించివున్న బాటరీ ని కూడా ఛార్జ్ చేస్తుంది.. ఆ ఇన్వెర్టర్ ఆ DC రూపం లో వున్న విద్యుత్ ని మనం వాడుకునే AC విద్యుత్తు లోకి మారుస్తుంది. అలాగే సూర్యుడు నుండి శక్తి లభించనప్పుడు , ఈ ఇన్వెర్టర్ బ్యాటరి లో నిల్వ చేసి వున్న విద్యుత్చక్తిని మనకి అందిస్తుంది. ఆ బొమ్మలో చూపించిన వాటిలో సోలార్ పానెల్ తప్ప మిగతావన్నీ మనకి అందుబాటులో వున్న ధరలలోనే వుంటాయ్.. ఆ సోలార్ పేనల్ ఒక్కటే ధర తప్ప .. నిర్వహణ ఖర్చు ఇంచుమించు సున్నా ఆయినా ఆ సోలార్ పేనల్ కి మొదట్లో పెట్టాల్సిన పెట్టుబడి ఎక్కువ కాబట్టి ఇవి కొనడానికి ప్రజలు అంత ఉత్సాహం చూపించడం లేదు. అందులోనూ వడ్డీ రెట్లు ఎక్కువగా వుండే మన దేశం లో దానిమీద వచ్చే వడ్డీతో పోలిస్తే ఈ సోలార్ పేనల్స్ మీద పెట్టుబడి అంత ఆకర్షణీయం గా కనిపించదు. (మన దేశం లో బాంక్ వడ్డీ కన్నా తక్కువ ఆదాయం వస్తూన్నా ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నది వ్యవసాయం మాత్రమే )..
ప్రపంచంలో ఎక్కువ సోలార్ పెనల్స్ కలిగివున్న దేశం జర్మని.. ఆ పవర్ అంతా ఇక్కడ ప్రభుత్వమో లేక పవర్ కంపెనీలో ఉత్పత్తి చేసేది కాదు... అవన్నీ సామాన్యప్రజలు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోనో , పోలాల్లోనో పెట్టుకున్నవే.. అంత ఖరీదయివుండి అంత మంది ఎలా సోలార్ పెనల్స్ అమర్చుకున్నారు ఆంటే .. దానికి కారణం అక్కడి ప్రబుత్వ ప్రోత్సాహం.
ఇప్పుడో చిన్న లెక్క చూద్దాం..
ఇప్పుడో చిన్న లెక్క చూద్దాం..
జర్మనీ లో వినియోగదారుడు తను వాడుకున్న యూనిట్ కి చెల్లించే రేటు ఇంచుమించు 13 రూపాయలు.. అదే వినియోగదారుడు ఉత్పత్తి చేసి గ్రిడ్ కి సప్ప్లై చేసే యూనిట్ కి ప్రబుత్వం ఇంచుమించు 26 రూపాయలు చెల్లిస్తుంది .. జర్మనీలో ... మనకి నెలకి 300 యూనిట్ల విద్యుత్ వాడకం ఉందనుకోండి .. అప్పుడు మీరు నెలకి 600 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ పేనల్ కోంటే దాంట్లో 300 వాడుకుని మిగతా 300 యూనిట్లు ప్రబుత్వానికి అమ్మితే మనకి నెలకి 7,800 ప్రబుత్వం దగ్గర నుండి ఆదాయం వస్తుంది.. 3900 కరెంట్ ఖర్చు మిగులుతుంది.. ఇలాంటి సైజ్ వున్న సోలార్ యూనిట్ కొనటానికి ఇంచుమించు 15 లక్షలు అవుతుంది .. ఈ లెక్కన మన పెట్టుబడి, వడ్డీ కలుపుకున్నా ఇంచుమించు పదమూడు, పద్నాలుగు సంవత్సరాలలో అంతా తిరిగి వచ్చేస్తుంది.. ఆకర్షణీయమయిన ఇంకో విషయం ఎమిటంటే.. ఈ సొలార్ పవర్ పొడక్త్స్ కి 15 నుండి 20 సంవత్సరాల వారెంటీ వుంటుంది..
మన దేశం లో ఈ సోలార్ పానెల్ అదే ధర వుంటుంది.. మనం ఉత్పత్తి చేసి తిరిగి గ్రిడ్ కి సప్లై చేసినా ప్రబుత్వం పైసా తిరిగి ఇవ్వదు. పోనీ మనకి కావాల్సింది మనం ఉత్పత్తి చేసుకుందామనుకున్నా.. ఇండియాలో కరెంట్ యూనిట్ ధర తక్కువ కాబట్టి ఇంత పెట్టుబడి గిట్టుబడి కాదు..
దీనికోసం కరెంట్ రెట్లు పెంచమని అడగలేం కదా :-) సరే చెయ్యాల్సింది.. సోలార్ పేనల్ ఖర్చు తగ్గించాలి.. మిగతా electronics (ఆంటే ఇన్వేర్టర్, బాటరీ, బాటరీ చార్జర్ .. గట్రా ) మన ఇండియా చైనాల్లో చాలా చీప్.. (కానీ మీకు 15 - 20 సంవత్సరాలు వారెంటీ కావాలంటే మాత్రం ఈ అమెరికన్ కంపనీదో జపాన్ కంపనీదో ఎంచుకోవాలి.. :-)).. సోలార్ పానెల్ ధర తగ్గించాలంటే దానిలో వాడే మెటీరియల్ ధర తగ్గాలి, లేక అదే సోలార్ పేనల్ నుండి ఎక్కువ పవర్ రాబట్టగలగాలి.. ప్రస్తుతం ఈ రెండు విషయాల మీద ప్రపంచవ్యాప్తం గా పరిశోధన జరుగుతుంది.. ఈ రిసెర్చ్ లో .. యూరోప్ , చైనాలు మాత్రం దూసుకుపోతున్నాయ్. అమెరికా కాస్త లేట్ గా కళ్ళు తెరిచి వెనుక పరిగెడుతుంది.. మన దేశం ఎక్కడుందో తెలీదు మరి..
మన దేశం లో ప్రబుత్వమే విద్యుత్ ఉత్పత్తి చేయిచ్చు కదా అనుకుంటే.. సోలార్ తో పోల్చిచూస్తే మిగతా మార్గాల్లో అత్యంత తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేయగలిగినప్పుడు .. సోలార్ కి ప్రబుత్వం మాత్రం ఎలా ఖర్చుపెడుతుంది ..
నాకయితే ఏదో అద్బుతం జరిగితే తప్ప వచ్చే 5 సంవత్సరాలలో మన దేశం లో ప్రతి ఇంట్లో పెట్టుకోగల సోలార్ పేనల్స్ వచ్చే సూచనలు కనిపించడం లేదు.... ఏ చైనా వాడో మాంచి చీప్ గా డెవలప్ చెయ్యగలిగితే తప్ప.. సో అదీ లేటు..
మంచు
గమనిక : ఎక్కువమంది కి అర్ధం కావడం కోసం , టెక్నికల్ కంటెంట్ వీలయినంత తగ్గించాను.. ఎవరికయినా ఆసక్తి వుంటే (నూతక్కి గారు లాంటి వారు ) నన్ను మెయిల్ ద్వారా సంప్రదించగలరు.